పెద్దనగారి ప్రవరుడు - 2
వరుణానదికి వెళ్ళి స్నానము చేసి సంధ్యావందనము
చేసికొని ఆ ఇసుక తిన్నెలపై సూర్యునికి నమస్కరించి
బ్రాహ్మణవటువులు వెంటరాగ ప్రవరుని ప్రజలందరు
మెచ్చికొనగా ఇంటికి వచ్చెడివాడు.
శీలంబున్ గులమున్ శమంబు దమమున్ జెల్వంబు లేఁబ్రా యమున్
బోలన్ జూచి యతండె పాత్రుఁడని యేభూపాలుఁడీ వచ్చి నన్
సాలగ్రావము మున్నుగాఁ గొనఁడు మాన్యక్షేత్రముల్ పెక్కు చం
దాలన్ బండు నొకప్పుడుం దఱుఁగ దింటన్ బాఁడియున్ బంటయున్
మంచి శీలాన్ని, వంశాన్ని, బహిరింద్రియ నిగ్రహాన్ని,
అందము పడుచుదనము చూచి ఏ రాజైనా దానమివ్వటానికి తగిన పాత్రుడని
ఇవ్వబోయినా ఏదోషములేని సాలగ్రామము ఇవ్వబోయినా
పరిగ్రహింపడు. అనేక విధాలుగా మాన్యాలు పండుచున్నవి
ఇంటిలో పాడి సమృద్ధిగా ఉన్నది.
ఇక అతని భార్యను చూద్దామంటే
వండ నలయదు వేవురు వచ్చిరేని
నన్నపూర్ణకు నుద్ది యౌనతనిగృహిణి
యతిథు లేతేర నడిరేయైనఁ బెట్టు
వలయుభోజ్యంబు లింట నవ్వారి గాఁగ
వండి వడ్డించడంలో అతిథులను తృప్తిపరచడంలో
అన్నపూర్ణకేమాత్రం తీసిపోదు. ఎంతమంది వచ్చినా
అపరాత్రి వచ్చినా విసుగుకొనక వంటి వడ్డించి వారిని
తృప్తి పరుస్తుంది ఆ యిల్లాలు.
మరి ఈ ప్రవరుడు ఇంకా ఎలాంటివాడంటే
తీర్థసంవాసు లేతెంచినా రని విన్న
నెదురుగా నేఁగు దవ్వెంత యైన
నేఁగి తత్పదముల కెఱఁగి యింటికిఁ దెచ్చుఁ
దెచ్చి సద్భక్తి నాతిథ్య మిచ్చు
నిచ్చి యిష్టాన్న సంతృప్తులఁగాఁ జేయుఁ
జేసి కూర్చున్నచోఁ జేర వచ్చు
వచ్చి యిద్దరఁ గల్గువనధిపర్వతసరి
త్తార్థమాహాత్మ్యముల్ దెలియ నడుగు
నడిగి యోజనపరిమాణ మరయు నరసి
పోవలయుఁ జూడ ననుచు నూర్పులు నిగుడ్చు
ననుదినము తీర్థసందర్శనాభిలాష
మాత్మ నుప్పొంగ నత్తరుణాగ్నిహోత్రి
ఈ పడుచుసోమయాజి ప్రతిరోజూ తీర్థయాత్రకు వెళ్ళాలని
మనసులో అనుకొంటుంటాడు అందుకే ఆ వూరికి ఎవరైనా
తీర్థయాత్రచేసి వచ్చినవారు అని తెలియగానే వారు ఎంత
దూరంలో ఉన్నా వారివద్దకు వెళ్ళి వారిని తన ఇంటికి
తీసుకువస్తాడు. తీసుకొచ్చి వారికి చక్కటి ఆతిథ్యమిస్తాడు
ఇచ్చి వారినుండి తీర్థయాత్రా విశేషాలనడిగి మరీమరీ
చెప్పించుకొంటాడు. చెప్పించుకొని తను వెళ్ళలేక పోతున్నానని
నిట్టూరుస్తాడు.
ఇలా జరుగుతూ ఉండగా
ఒకనాడు
తలకు పులితోలు టోపీగా పెట్టుకొన్నవాడు పంచలోహ
కడియమున్నచేతితో కకపాలము, యోగదండము
నిక్కి పట్టినవాడు, నడుముకు జింకతోలు పట్కాయు కట్టి,
మెడలో యోగపట్టెయు ఉన్నవాడు, పచ్చని శరీరీనికి విభూది
పూసుకొన్నవాడు, చెవులకు రుద్రాక్ష పోగులు ఊగుతుండగా
కావిచొక్కా తొడుక్కొని, కమండలం చేతబట్టుకొని వున్న
సిద్ధుడొకడు ప్రవరుని ఇంటికి వచ్చాడు.
No comments:
Post a Comment