పెద్దనగారి ప్రవరుడు - 3
సాహితీమిత్రులారా!
ఆ సిద్ధునికి ఎదురు వెళ్ళి నమస్కరించి
కాళ్ళుచేతులు కడుక్కోడానికి నీళ్ళిచ్చి
మొదలైన విచ్చుపూజను చేసి
ఇష్టమైన అన్నాన్ని వడ్డించి
సంతృప్తిపరచి
విద్వత్వందితా ఎక్కడనుండి ఎక్కడికి పోవుచున్నావు
ఇక్కడికి వచ్చి నాయిల్లు పావనము చేశావు
ఇప్పుడుకదా నేను ధన్యుడనైనది
మీ మాటలే వేదవాక్యములు, మీరు తొక్కిన చోటే
పవిత్ర పుణ్యక్షేత్రము మీకాళ్ళు కడిగిన నీళ్ళు
గంగోదకము వంటిది.
యోగీశ్వరా మీవంటివారు ఎవరి ఇంటివద్ద
ఎటువంటి భేదభావము లేక ఇష్టము వచ్చినట్లు
స్నానపానముల తృప్తి పొందుదురో
వారిదే అదృష్టము వారి జీవితమే సఫలము
వాడే పుణ్యాత్ముడు. ఓ మునీంద్రా సంసారమను
బురదలో కూరుక పోయిన మావంటివారిని ఉద్ధరించుటకు
మీ వంటివారి పాదధూళి తప్ప వేరే ఔషధములేదు
అనగా ఆ సిద్ధుడు మీవంటివారలు మిక్కిలిగా మర్యాదలు
చేయడం వల్లనే మావంటి వారు సుఖంగా తీర్థయాత్రము చేస్తున్నారు
అని గృహస్థులను గురించి పెద్దగా పొగిడాడు. తరువాత ప్రవరుడు
సిద్ధునితో ఈ విధంగా అన్నాడు-
ఏయే దేశములన్ జరించితిరి మీ రేయే గిరుల్ చూచినా
రేయే తీర్థములందుఁ గ్రుంకిడితి రేయే ద్వీపముల్ మెట్టినా
రేయే పుణ్యవనాళిఁ ద్రిమ్మరితి రేయే తోయధుల్ డాసినా
రాయా చోటులఁ గల్గువింతలు మహాత్మా నా కెఱింగింపరే
ఓ మహాత్మా మీరు ఏయే కొండలు తిరిగారో, ఏయేనదుల్లో స్నానంచేశారో, ఏయే సముద్రాల్లో స్నానంచేశారో, అక్కడక్కడ ఉన్న వింతలను చెప్పండి.
పోయి సేవింపలేకున్నఁ బుణ్యతీర్థ
మహిమ వినుటయు నఖిలకల్మషహరంబ
కాన వేఁడెద ననిన నమ్మౌని వర్యుఁ
డాదరాయత్తచిత్తుఁడై యతని కనియె
నేరుగా పోయి సేవించకపోయినా పుణ్యతీర్థాల
మహిమ విన్నా పాపాలు పోతాయి కాబట్టి
మిమ్ములను ఇంతగా వేడుకొంటున్నాను- అని సిద్ధుని అడగ్గా
ఈ విధంగా చెప్పాడు-
ఓ చతురాస్యవంశ కలశోదధిపూర్ణశశాంక తీర్థయా
త్రాచణశీలినై జనపదంబులు పుణ్యనదీనదంబులున్
జూచితి నందు నందుఁగల చోద్యములున్ గనుగొంటి నా పటీ
రాచలపశ్చిమాచల హిమాచలపూర్వదిశాచలంబుగన్
కేదారేశు భజించితిన్, శిరమునన్ గీలించితిన్ హింగుళా
పాదాంభోరుహముల్, ప్రయాగనిలయుం బద్మాక్షు సేవించి తిన్
యాదోనాథసుతాకళత్రు బదరీనారాయణున్ గంటి, నీ
యాదేశంబననేల చూచితి సమస్తాశావకాశంబులన్
ఓ బ్రాహ్మణోత్తమా! నేను నాలుదిక్కులున్న వింతలన్నిటిని
చూచాను. ఎన్నో పుణ్యనదీ నదాల చూచాను.
కేదారనాథుని పూజించాను. హింగుళాదేవి పాదపద్మాలను
సేవించాను. ప్రయాగలో విష్ణుమూర్తిని, లక్ష్మీదేవి భర్త అయిన
బదరీనారాయణుని చూచాను ఇది అది చెప్పడమెందుకు
అన్ని దిక్కుల మధ్యగల అన్నిటిని చూచాను.
అని చెప్పాడు.
No comments:
Post a Comment