Friday, April 7, 2017

బలరామ కృష్ణులు - వారి సతీసుతులు


బలరామ కృష్ణులు - వారి సతీసుతులు




సాహితీమిత్రులారా!


బలరాముని భార్య - రేవతి
ఈమెకు నిశాతుడు, ఉల్మకుడు అని ఇద్దరుకుమారులు

కృష్ణునికి 8 మంది భార్యలు

1. రుక్మిణి - ఈమెకు 10 మంది కుమారులు ఒక కుమార్తె
                    కుమారులు 1. ప్రద్యుమ్నుడు, 2. చారుదేష్ణుడు
                    3. చారుభద్రుడు, 4. సుదేష్ణుడు, 5. సుచారుడు,
                    6. చారుదేహుడు, 7. చారుగుప్తుడు, 8. చారుచంద్రుడు,
                    9. విచారువు, 10. చారువు
                    కుమార్తె - చారుమతి
2. జాంబవతి - కుమారుడు - సాంబుడు
3. సత్యభామ - కుమారులు - దామ్రుడు, చక్రుడు
4. కాళింది   -  ----------------
5. మిత్రవింద  - కుమారుడు - మిత్రపవంతుడు
6. భద్ర -          ----------------
7. నాగ్నజితి -   కుమారులు- 
                                     సునీధుడుి, మిత్రబాగుడు
8. లక్షణ    -  --------------------------

ఉపమాలంకార విశేషాలు - 8


ఉపమాలంకార విశేషాలు - 8




సాహితీమిత్రులారా!
నిన్నటి తరువాయి...




4. ధర్మవాచకలుప్త -
శత్రురాజుల మనోరాజ్యశతము చేతగూడ
దురాక్రముడైన యూ రాజ కుంజరు
యుద్ధప్రవృత్తుడయ్యెను

ఇందులో రాజ కుంజర శబ్దం ఉపమితసమానము.
ఇందు వాచక, ధర్మము(లుప్త) లోపించినది.

5. ధర్మోపమానలుప్త-
మధువనమునంతయు గాలించితిని.
చెట్వన్నిటిని చూచితిని.
కాని ఓ సహకారమా నీవంటి చెట్టుమాత్రము
కనిపించలేదు

ఇందు ఉపమానము కనిపించలేదు.
సమానధర్మము చెప్పబడలేదు.

6. వాచకోపమేయలుప్త -
కాయజవల్లభాయిత-
ఇందులో కాయజవల్లభ - ఉపమానము
ఉపమానవాచకము, ఉపమేయము లుప్తములు.
కాయజవల్లభాయిత అంటే
తనను కాంతిచే రతీదేవిగా ప్రకటించుకొన్నరమణి -
అని అర్థము.

7. ధర్మోపమానవాచకలుప్త-
ఆమె భీతహరినేక్షణ

ఆమె భయముచెందిన లేడికన్నులవంటి
కన్నులు గలది - అని అర్థం.
ఇందులో కన్నుల చంచలత్వము -
 సమానధర్మము లోపించినది.
విభీతహరిణేక్షణ ఉపమేయపరము.
ఉపమానము లేదు. ఉపమావాచకము లోపించినది.

Thursday, April 6, 2017

గాక యుండిన నపకీర్తి కలుగుటరుదె?


గాక యుండిన నపకీర్తి కలుగుటరుదె?




సాహితీమిత్రులారా!


ఈ సుభాషితమును చూడండి-

ఊడి లేచినమొల్క లొగినాటు, బుష్పించు
          లతల మెల్లఁగఁ బూవులనుగ్రగించు,
వ్రాలినకొమ్మలఁ బైకెత్తి బంధించుఁ
          బలుముండ్లు గలుగు రుప్పలఁ దొలంచు,
సొలసిన చెట్లకు జలసేక మొనరించుఁ
          గలుపుగాదంబులఁ గత్తిరించుఁ
దోఁటమాలి సతంబు, నాతోయమునన
ధారుణీపతి స్వప్రజా తతిని మివుల
నిపుణతను బాలనమొనర్చి నెగడవలయుఁ
గాక యుండిన నపకీర్తి కలుగుటరుదె?
                                                       (సుభాషితరత్నమాల - 104)


ఊడిలేచిన మొక్కలను క్రమంగా నాటడం,
పుష్పించే లతలనుండి పూవులను మెల్లగా
తీసుకోవడం, వాలిన కొమ్మలను పైకెత్తి కట్టడం,
చక్కగానిలిచిన చెట్లగుంపులను  పెంచడం,
పక్కకు విడిపోయిన చెట్లను చేర్చడం,
బాగా ముండ్లున్న పొదలను తీసివేయడం,
వాడిన చెట్లకు నీరు ఎక్కువగా అందించడం,
కలుపు మొక్కలను తీసివేయడం ఈ విధంగా
తోటమాలి చేసేవిధంగానే రాజు నిపుణతతో
పాలనను చేస్తూ రాజ్యాన్ని పెంపొందించాలి
అలా కాకపోతే అపకీర్తి కలగడమన్నది
అరుదైన విషయమేమికాదు - అని భావం.

సుమతి వేమన శతకాలు సంస్కృతంలో - 2


సుమతి వేమన శతకాలు సంస్కృతంలో - 2




సాహితీమిత్రులారా!



వేమన శతకం తెలుగునుండి సంస్కృతంలో

అనువుగానిచోట అధికులమనరాదు
కొంచముండుటెల్ల కొదువగాదు
కొండ అద్దమందు కొంచెమై ఉండదా
విశ్వదాభిరామ! వినురవేమ!

నాస్థానే2ధికతా వాచ్యా
నైచ్యోక్తేః స్వస్య న క్షతిః
కింనా దర్శనేభో2ల్పంస్యాత్
శ్రూయతాం వేమ విశ్వద!

అల్పబుద్ధవానికధిరారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగఁ గొట్టు
చెప్పుతినెడు కుక్క చెఱకు తీపెఱుఁగునా
విశ్వదాభిరామ! వినురవేమ!

అల్పధీరధకారస్థః
సతోనిష్కాసయేత్ ధ్రువమ్
చర్మ భఙ్త్కే న చేక్షుం క్వా
శ్రూయతాం వేమ విశ్వద!

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండు పల్కు చల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ! వినురవేమ!

అల్పో వదతి సాటోపం
ప్రశాంతం సజ్జనః పునః
కాస్యవత్కిం స్వనేత్స్వర్ణం
శ్రూయతాం వేమ విశ్వద!

Wednesday, April 5, 2017

వీరికి చెప్పడం ఎలా?


వీరికి చెప్పడం ఎలా?




సాహితీమిత్రులారా!






ఈ సుభాషిత పద్యం చూడండి-

తామరతూఁటి దారమున దర్పిత సర్పముఁ గట్టవచ్చుఁ దాఁ
గోమలమౌ శిరీషమునఁ గోయఁగ వచ్చును వజ్రమున్, గడుం
దీమసమొప్ప క్షారజలధిన్ మధుధారను దీపుసేయనౌ,
నీమహిఁజ్ఞానహీనులకు నెట్లును దెల్పఁగఁ జాల రెవ్వరున్
                                                                        (సుభాషితరత్నమాల - 71)



తామరతూటి దారంతో మదించిన పామునైనా కట్టవచ్చు
అతికోమలమైన పుష్పమైన శిరీష(దిరిసెన)పువ్వుతో
అతికఠినమైన వజ్రాన్ని కోయవచ్చు, కడు ధైర్యంతో
ఉప్పు సముద్రాన్ని తీయటిధారతో తియ్యగా చేయవచ్చు.
కానీ ఈ ప్రపంచంలో జ్ఞానహీనునికి చెప్పలేరు ఎవ్వరునూ-
అని భావం.

ఉపమాలంకార విశేషాలు - 7


ఉపమాలంకార విశేషాలు - 7




సాహితీమిత్రులారా!


ఉపమాలంకారమున అవయవములయిన
ఉపమేయము, ఉపమానము, సమానధర్మము,
ఉపమావాచకములలో ఏదైనా లోపించిన దాన్ని
లుప్తోపమ అంటారు.
ఇందులోని నాలుగు అంగములు ఒకేసారి
లోపించడం జరుగదుకదా
అందువలన అవి లోపించిన వాటినిబట్టి
ఇవి 7 విధములుగా చెప్పబడుచున్నది.
అవి
1. ఉపమానలుప్త
2. ధర్మలుప్త
3. వాచకలుప్త
4. ధర్మవాచకలుప్త
5. ధర్మోపమానలుప్త
6. వాచకోపమేయలుప్త
7. ధర్మోపమానవాచకలుప్త

1. ఉపమానలుప్త -
లోకోత్తరమైన వర్ణమును, పరిమళమును గల చంపక పుష్పమా
నీకు ఏది సమానమో మే మెరుగము
ఇందులో దేనితో పోల్చబడినదో లేదు కదా
అందువలన ఇది ఉపమానలుప్తమగుచున్నది.

2. ధర్మలుప్త -
నీ ముఖము చంద్రునివలె ఉన్నది
ఇందులో దేనివలన చంద్రునివలె ఉన్నదో తెలిపే
సమాన ధర్మములోపించినది కావున ఇది ధర్మలుప్తమగుచున్నది.

3. వాచకలుప్త -
అతడు నలాభిరాముడు
అంటే నలునివలె అందమైనవాడు.
ఇందులో వలె - ఉపమావాచకము లుప్తమైనది 
కావున ఇది వాచక లుప్తమగుచున్నది.


శ్రీరామనవమి శుభాకాంక్షలు


శ్రీరామనవమి శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు, శ్రేయోభిలాషులకు
శ్రీరామనవమి శుభాకాంక్షలు