Friday, May 6, 2016

గుట్టుగ జెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే


గుట్టుగ జెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే


సాహితీమిత్రులారా!

ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు
"శివుడు పార్వతితో ఏకాంతంగా మాట్లాడే వీలులేదని" చెప్పే
ఈ పద్యం చూడండి.
ఎంత
చమత్కారంగా ఉందో!


జుట్టున గంగయున్ మరియు సోముడు మేల్కొని యుందు రక్కునన్
కట్టడి పాపరేడు, అలికంబున నగ్ని శివుండు పార్వతీ
పట్టపుదేవితో సరస భాషణ కేనియు నోచుకోడటే!
గుట్టుగ జెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే

(శివుడు, పార్వతి ఏకాంతంగా రహస్యంగా
మాట్లాడుకోవటానికి నోచుకోలేదట
ఎందుకంటే .........
తలమీద గంగ, చంద్రుడు, మెడలోపాము, నొసట అగ్ని
- ఇన్ని విడవనివి ఉంటే
ఇక గుట్టెక్కడ)

స్త్రీలకు జడ వెనకే ఎందుకుంటుంది?


స్త్రీలకు జడ వెనకే ఎందుకుంటుంది?

సాహితీమిత్రులారా!

ఒకసారి తిరుపతివేంకటకవు చేత అవధానం చేయించిన గద్వాల రాజావారు
స్త్రీలకు రతిక్రీడకు ఉపకరించే భాగాలన్నీ ముందుభాగంలో ఉండి
ఒక్క జడమాత్రం వెనుకవైపు ఉండటంలోని విశేషము ఏమిటని అడిగారు.
దానికి జంటకవులు ఇచ్చిన
పద్యోత్తరం చూడండి.

పురుషాయితమొనర్చు పూబోడి కటిమీద నాట్యమ్ము సలుపు పుణ్యమ్ము కొరకొ
ఘననితంబస్థలంబను పెన్నిధానంబు బహు భద్రముగను కాపాడుకొరకొ
తానాశ్రయించు కాంతకు వెన్కభాగమ్ము ననుగూడ సౌందర్యమునుపు కొరకొ
పదిమంది దృష్టులు పడి కంటకమంచు నూహించి కనపడకుండు కొరకొ
వేణి కాంతల వెన్నంటి వ్రేలుచుండె
లేక యుండిన విధువనలీల కుపచ
రించునంగమ్ము లెదుటనే నంచునించ 
దానికట్లుండ నే యుపద్రవము వచ్చె?

(స్త్రీలు పురుషాయితం చేసేప్పుడు నడుముమీద నాట్యం చేయటానికొ,
పిరుదువనే  నిధులను కాపాడటానికి నాగుబాము వలె ఉండటానికో,
తానాశ్రయించిన స్త్రీ వెనుకవైపుకూడా సౌందర్యాన్ని ఉంచటానికో,
ఎదురుగా ఉంటే దృష్టిదోషం తగులుతుందనో, వేణి వెనుకవైపున ఉన్నది.)

ఎదుటన్ వర్తిలునట్టి అంగముల కెంతేనిన్ నఖాదిక్షతా
పద పల్మారును గల్గు సంగతిని తా ప్రత్యక్షమున్ జూచి నె
మ్మదిలో భీతిలి చాటు చోటనుచు సంభావించి వెన్నంటుచున్
పొదలన్ బోలును వేణి లేకునికి దాముందుండ కట్లుండున్?

(ఎదురుగా ఉన్న అవయవాలన్నిటికి దెబ్బలే,
నఖక్షతాలు, దంతక్షతాలు మొదలైనవి.
వాటిని చూస్తూ భయపడి ముందుంటే ఇటువంటి
పోటుల కోర్చుకోవాల్నే అని వెనుక చేరి ఉంటుంది వేణి.)
- అని సెలవిచ్చారు
వేంకటకవులు.

Thursday, May 5, 2016

చీకుముల్లు


చీకుముల్లు


సాహితీమిత్రులారా!

తిరుపతి వేంకటకవులలో ఒకరైన వేంకటశాస్త్రిగారు
 చీకుముల్లుమీద చెప్పిన పద్యం.
వేమవరం అవధానంలో ఒక పృచ్ఛకుడు
చీకుముల్లు పై పద్యం చెప్పమనగా
ఈ పద్యం చెప్పారు.

నిన్ను గాల్చిన గాని నీ బుద్ధి మానవే ఛీ! యేమందునే చీకుముల్ల!
దొంగ రీతిని దూరి దొరక కుందవు గదే ఛీ! యేమ నందునే చీకుముల్ల!
పొర లోపలం జేరి పోటు గూర్చెదు గదే ఛీ! యేమ నందునే చీకుముల్ల!
పద మాశ్రయించియు బాధ పెట్టెదు గదే ఛీ! యేమనందునే చీకుముల్ల!
నిన్ను మర్యాదగా జూచు నేని యెట్టి
దట్టు డేనియు నీదు కోతలకులోగు
చెప్పు దెబ్బకు తప్ప నీ చెడ్డ గుణము
చీకదు సుమీ! యిసీ! యిసీ! చీకుముల్ల!

(అప్పుడే వేదికమీది శాస్త్రిగారు లఘుశంకకు పోయి కుంటుకుంటూ......
 వచ్చిన సందర్భములోనే పృచ్ఛకుడు
చీకుముల్లు పై పద్యం అడగడంతో
అడిగినవారికి -  చీకుముల్లుకు
అన్యాపదేశంగా వాయించేశారు.)

కవితా లక్షణం


కవితా లక్షణం


సాహితీమిత్రులారా!
విద్యా వివాదానికై విజయనగరానికి వెళ్ళినపుడు
అక్కడి ముమ్మకవితో శ్రీనాథుడు చెప్పిన పద్యంలో
ఒక గొప్ప విశేషముంది. ఆ పద్యం.......

పంపా విరూపాక్ష బహుజటాజూటికా రగ్వ ధప్రసవ సౌరభ్యములకు
తుంగభద్రా సముత్తుంగ వీచీఘటా గంభీర ఘుమఘుమారంభములకు
కర్ణటకామినీ కర్ణహాటక రత్న తాటంక యుగధాళధళ్యములకు
కళసాపుర ప్రాంత కదళీ వనాంతర ద్రాక్షాలతా ఫల స్తబకములకు
నిర్ణిబంధ నిబంధమై నెనయు కవిత తెలుగునను సంస్కృతంబున బలుక నేర్తు
ప్రౌఢ దేవేంద్రరాయ భూపాల వరుని సమ్ముఖంబున దయజూడు ముమ్మసుకవి

పై పద్యంలో పంపా విరూపాక్షుని జటలలో అలంకరించే రేలపూల వాసనలూ,
తుంగభద్రానదిలోని ఎత్తైన అలల ఘుంఘుమ నాదాలూ,
కన్నడ కామినుల చెవుల కమ్మల్లోని రత్నాల ధళధళలు,
కళసాపుర ప్రాంతంలోని అరటి తోటల్లోని ద్రాక్షపళ్ళ రుచులు
తన కవిత్వంలో ఉంటాయని
శ్రీనాథుడు ముమ్మకవికి చెప్పి
దయచేసి తనను ప్రౌఢదేవరాయల సమ్ముఖానికి
తీసుకు వెళ్ళమని చెప్పాడు.

అంటే మనం గమనించాల్సినది
కవిత్వానికి - తావి(వాసన), నాదం(శబ్దం), కాంతి, రుచి ఉంటాయని.
కవిత్వానికి ఇంత గొప్ప లక్షణాలుంటాయని -
చెప్పినకవి బహుశా శ్రీనాథుడేనేమో!

Wednesday, May 4, 2016

భిక్షాటనం నన్ను పట్టుకొన్నది


భిక్షాటనం నన్ను పట్టుకొన్నది


సాహితీమిత్రులారా!

ఒక కవి రాజుతో చెప్పుకొన్నమాటలు ఈ శ్లోకం చూడండి.

అర్థం దానవవైరిణా గిరిజయాప్యర్థం శివస్యాహృతమ్
దేవేత్థం జగతీతలే పురహరాభావే సమున్మీలతి
గంగాసాగర మంబరం శశికళా నాగాధిపక్ష్మాతలమ్
సర్వజ్ఞత్వ మధీశ్వరత్వ మగమత్త్వాం మాంతుభిక్షాటనమ్

శివునిలో సగము నారాయణుడు ఆక్రమించాడు.
మిగిలిన సగము పార్వతి ఆక్రమించింది.
శివుడే లోకంలో లేకుండా పోయినాడు.
ఆయన్ను ఆశ్రయించి ఉన్న గంగ సముద్రంలో కలిసింది.
చంద్రకళ ఆకాశాన్ని ఆశ్రయించింది.
సర్పరాజు పాతాళానికి పోయినాడు.
సర్వజ్ఞత్వము- అధీశ్వరత్వము నిన్ను ఆశ్రయించాయి.
భిక్షాటనం నన్ను పట్టుకున్నది
(అంటే నాదారిద్ర్యం తొలగిచమని మొర).

రత్నదీప కళికా స్తంభంబు క్రీనీడకున్


రత్నదీప కళికా స్తంభంబు క్రీనీడకున్


సాహితీమిత్రులారా!

పోతన భాగవతంలో గజేంద్ర మోక్షణం రాసే సందర్భంలో
"అలవైకుంఠపురంబులో" - అనే పద్యం రాస్తూరాస్తూ
మధ్యలో విడిచి ఆలోచనకోసం బయటికి వెళ్ళగా అది
శ్రీరామచంద్రుడే పూర్తిచేశాడని ఒక కథ ప్రచారంలో ఉంది.

అలాగే పెద్దనకు సంబంధించి ఒక కథ వుంది.
అది చూద్దాం.
ఒకనాడు పెద్దన
ఈ క్రింది పద్యం రాయడం మొదలు పెట్టాడు.

మృదు తల్పంబు వికారలీలదిగి ధమ్మిల్లంబుఁ జేబూని రా
గద దృగ్జాలముతోడఁ గౌనునులి యూఁగన్మోము మార్వెట్టుచున్
వదలం జాఱిన నీవిఁబట్టుకొని యావామాక్షి యట్లేఁగెఁ......

అని అంతవరకు రాసి ఆపై ఎలాముగించాలో స్ఫురించక తాటాకు,
గంటాన్ని అక్కడ పెట్టి బైటకు వెళ్ళాడట.
పెద్దనగారి కూతురు ఆ   అసంపూర్ణ పద్యాన్ని చదివి
ఇలా పూరించిందట.
                                                                           " స
త్సదన భ్రాజిత రత్నదీప కళికా స్తంభంబు క్రీనీడకున్"

తిరిగి వచ్చిన పెద్దన తాను పూరించ దలచిన దానికంటె
ఈ పూరింపు రసవంతంగ ఉన్నదని దానినలాగే ఉంచాడట.
"ఆంధ్రకవితా పితామహు"ని పుత్రిక పండిత పుత్రిక కాకపోవడమా!

Tuesday, May 3, 2016

పోతన పద్యానికి మూలం?


పోతన పద్యానికి మూలం?


సాహితీమిత్రులారా!

నీలంరాజు వెంకటశేషయ్యగారు రాసిన "నడిచే దేవుడు" పుస్తకంలోని విషయం ఇది.
జగద్గురు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్య స్వాములవారి
దగ్గరకు మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యులు గారు,
పోతన భాగవతాన్ని హిందీలోకి అనువదిస్తున్న
శ్రీ వారణాశి రామమూర్తి(రేణు)గారు వెళ్ళి మాట్లాడు
సందర్భంలో రేణుగారు
గజేంద్రమోక్షణం ఘట్టంలోని-

"తన వెంటన్ సిరి లచ్చివెంట నవరోధ వ్రాతము న్దాని వె
న్కను పక్షీంద్రుడు వాని పొంతను ధనుకౌమోదకీ శంఖచ
క్రనికాయంబును నారదుండు ధ్వజినీకాంతుండు దావొచ్చిరొ
య్యన వైకుంఠ పురంబునం గలుగు వారాబాల గోపాలమున్"

అనే పద్యాన్ని చదవగానే,
దానిని విని స్వామి,
ఇదే మోస్తరుగా సంస్కృతంలో ఒక ఆభాణకం ఉన్నదనీ
అది పోతన కాలానికి పూర్వపుదే అయితే
బహుశా పోతన దానిని ఉండవచ్చునని అన్నారు.

ఆ ఆభాణకం గురించి తాము విననే లేదని,
దానిని శ్రుతిపరచండనీ పుట్టపర్తివారు అభ్యర్ధించారు స్వామిని.
ఒకటి రెండునిమిషాలు ఆగి, స్వామి ఇలా చదివారు-

"లీలాలోలతమాం రమా మగణయన్ నీల మనాలోకయన్
ముంచన్ కించ మహీం, అహీశ్వర మయం ముంచన్ హఠాద్వంచయన్
ఆకర్షన్ ద్విజరాజమప్యతిజవాత్ గ్రాహాచ్చ సంరక్షితుం
శ్రీదోవింద ఉది త్వరత్వర ఉదైత్ గ్రాహగ్రహార్తం గజమ్"

ఈ శ్లోకం ఒకటి ఉన్నట్లు పుట్టపర్తి వారికీ,
రేణుగారికి తెలియదు.
తెలియని వారింకెందరో!