Sunday, July 7, 2019

ధర్మోదకాలు


ధర్మోదకాలు
సాహితీమిత్రులారా!


“ఒరేయ్! తాతగారు పిలుస్తున్నారు చూడు!” అమ్మ కేక. పెరట్లో ఆడుకుంటున్న నేను ఆయన గదికి పరిగెత్తాను.

“ఏమిటి తాతగారూ!”

మడత పెట్టి భద్రంగా దాచిన లాటరీ టికెట్టుని తలగడ కిందనుంచి నెమ్మదిగా బయటికి తీశారు తాతగారు. ఆయనకీమధ్య బొత్తిగా చూపు ఆనట్లేదు. తలగడ ఎత్తినపుడు అక్కడ ఆయన కళ్ళజోడు కనపడింది. ఆ కళ్ళజోడు ఆయనకి అలవాటైపోయి అక్కడ పడుంది గాని, ఆయనకి ఉపయోగపడగా ఈ మధ్యన నేనెప్పుడూ చూడలేదు. బహుశా డెబ్భై ఏళ్ళ అలవాటు. టికెట్ మడతలు విప్పి, రెండు చేతులతో తెరిచి పట్టుకుని నాకు నెంబర్ కనిపించేలా పట్టుకున్నారు. ఆయన చేతులు ముసలితనాన్ని సూచిస్తూ అతి నెమ్మదిగా కదులుతున్నాయి.

“నెంబర్ కాయితమ్మీద రాసుకుని పోయి దాని అదృష్టం ఏమయిందో చూసుకు రారా!” అన్నారు. కోపంగా గొణుక్కుంటూ చిన్న కాయితం ముక్క మీద నెంబర్ రాసుకున్నాను. ఆ టికెట్ కొని తెచ్చినది నేనే. నా చేతుల్లోంచి తీసుకుని భద్రంగా తలగడ కింద పెట్టుకుంటారు. దానికి బహుమతి రాలేదని తెలియగానే అది చెత్త బుట్టకి, మరో కొత్త టికెట్టు తలగడ కిందకీ చేరుకుంటాయి. ప్రతీ వారం ఇదే కథ.

కొనేది నేనే అయినా, దాని జాతకం సంతకెళ్ళిందని తెలిసేవరకూ మళ్ళీ నేను ముట్టుకోడానికి వీల్లేదు. ఆయనకు నామీదున్న అపనమ్మకం తలచుకుంటే నాకు చిర్రెత్తుకొచ్చేది.

“నెంబర్ జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు సరి చూసుకొని వెళ్ళు.”

“సరే తాతగారూ.” భయభక్తులతో (మనసులో తిట్టుకుంటూ) నేను.

అతి చిన్న వయసులోనే నాకు రాగద్వేషాలను అదుపులో ఉంచుకోవడం నేర్పిన మహనీయుడాయన.

ఓ తండ్రి, ఓ తల్లి, ఓ అక్క, నేను–ఇదీ మా కుటుంబం. అయితే నేను చెప్పిన విధానంలో చిన్న మడతుంది. తండ్రంటే మా తండ్రి కాదు. మా అమ్మ నాన్న. అనగా మా తాతగారు. ప్రభుత్వంవారి అడ్వర్టయిజ్‌మెంటులో చెప్పినట్టు మాది మాత్రం చిన్న కుటుంబం-చింత లేని కుటుంబం. మా అక్కకు పైన మరో ఇద్దరు అప్పటికే రెక్కలొచ్చి వేరే ఊళ్ళకు ఎగిరిపోయారు.

దేవుడు మా తాతగారిని మిలిటరీ ఆఫీసర్ కావడానికే పుట్టించుంటాడని నా ప్రగాఢ విశ్వాసం. అధికారం ఉట్టిపడే గొంతుతో ఆయన గంభీరంగా కాఫీ అడిగినా కూడా డ్రిల్లు చేయించేవాడి అరుపులా ఉంటుంది. ఆయన పలికే విధానం కూడా గమ్మత్తుగా ఉండేది. ‘కాఆఆఆ-ఫి’ అని అరిచేవారు, డ్రిల్లు వాడు ‘రాఆఆఆ-యిట్ టర్న్’ అని అరిచినట్టు. తెలుగువాళ్ళు ఎవర్నేనా పేరు పెట్టి పిలిచేటప్పుడు ఆఖరి అక్షరాన్ని కాస్త సాగదీస్తారు సీతా, రామా, అని. అన్నట్టు మా అమ్మ పేరు సీత. కానీ ఆయన మాత్రం ‘సీఈఈఈ-త’ అని రెండో అక్షరం త-ను టక్కున ఆపేసేవారు; సాగదీతలు ఉండవు. ‘ఆయనకి వాడుకలో ఉండే యాస బొత్తిగా గిట్టదేమో, పేర్లని పుస్తకాలల్లో రాసినట్టు పలకాలనుకునేవారేమో’ అనిపించేది నాకు. ఆయనలా పిలవడం మాకు చాలాసార్లు నవ్వూ కొన్నిసార్లు చిరాకూ తెప్పించేది. మా అమ్మని పిలుస్తున్నట్టు ఉండేది కాదు. కాని ఆయన కుటుంబ పెద్ద. నవ్వూ ఏడుపూ మనసులోనే గానీ ఆయనతో చెప్పే ధైర్యం ఉండేది కాదు.

మా నాన్నగారు కేన్సర్‌తో పోయేనాటికి నాకు పద్నాలుగేళ్ళు. మా అక్క నామీద అయిదేళ్ళు పెద్ద. మా నాన్నగారు తను పోతానని తెలిసి, జీవిత కాలంలో చేసిన పొదుపంతా తీసుకొచ్చి ఒక చిన్న ఇల్లు తొందరతొందరగా కట్టేశారు. ఇల్లు కట్టిన ఏణ్ణర్ధానికి మా నాన్నగారు భూమ్మీద కట్టుకున్న కుటీరాన్ని వదిలి, పైన స్వర్గంలో కట్టుకున్న మహల్లోకి శాశ్వతనివాసానికి వెళ్ళిపోయేరు. దీంతో మాతోనే ఉంటున్న మా మాతామహులు మా ఇంటికి పెద్దదిక్కయ్యేరు.

సమయపాలన, శుచి, శుభ్రం, ఉతికి గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్లటి పంచె-లాల్చీ, నున్నటి గెడ్డం, కొమ్ము-ఫ్రేమ్-గుండ్రని అద్దాల కళ్ళజోడు, చేతి కర్ర, పొట్టి జుట్టు క్రాపు, గంభీరమైన గొంతు, తర్కం, లెక్కలూ నిండిన బుర్రా–ఈ లక్షణాలన్నిటితోనూ దేవుడు ‘మిలిటరీ వాడివి అవుతావురా’ అని పంపితే ఆయన దేవుడి మాట కాస్తా పెడచెవిన పెట్టేసేరు. అయితే ఆయన చేపట్టిన ఉద్యోగం మాత్రం మిలిటరీ ఆఫీసరు ఉద్యోగానికి ఇంచుమించు సరిసాటైనది. మొదట స్కూల్ మాస్టారుగా ప్రారంభించి హెడ్ మాస్టారుగా పదవీ విరమణ చేశారు. ప్రభుత్వం విరమణ ఇచ్చింది కానీ ఈయన మాత్రం విరమించలేదు. చివరి వరకూ ఆయన పాఠాలు చెబుతూ, క్రమశిక్షణ నేర్పుతూనే ఉన్నారు. విరమణ నిరాకరించిన హెడ్ మాస్టారి ఆఖరి తరం విద్యార్థులం మేము.

రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీషు గ్రామర్ పుస్తకం. చదవడం మాట దేవుడెరుగు, మా తాతగారు కనీసం చూడను కూడా చూడలేరు. కానీ గ్రామరు పుస్తకంతో ఆయన సంబంధం డెబ్భై ఏళ్ళ పైచిలుకు. ఆయనకా పుస్తకాన్ని కళ్ళతో చూడాల్సిన పని లేదు. నేను చెపితే మీరు దాన్ని అతిశయోక్తి అనుకుంటారేమో కానీ ఇది అక్షరాలా నిజం. ఆయనకి ఆ పుస్తకంలోని ప్రతీ పేజీ, ప్రతీ పేరా, ప్రతీ వాక్యమూ కంఠతా. నాకూ, రాజుకీ వయసు తేడా సుమారు ఎనిమిదేళ్ళు. కానీ మా ఇద్దరినీ కలిపి కూచోబెట్టి పాఠం చెప్పేవారు. ఫలానా పేజీలో ఫలానా ఎక్సరసైజ్‌లో వాక్యాలు వరసగా చదవమనేవారు. మాలో ఎవరేనా పొరపాటున ఒక వాక్యం వదిలేస్తే ఆయన కళ్ళు మూసుకునే ఆ వాక్యాన్ని గట్టిగా చెప్పేవారు. ఎవరేనా కళ్ళగ్గంతలతో చదరంగం ఆడడం చూసుంటారు. అలాగే ఇదోరకం గమ్మత్తు. భలే సరదాగా ఉండేది. కొన్నిసార్లు కావాలని ఒక్కో వాక్యాన్ని ఎగరగొట్టేసేవాణ్ని ఆయన చెపితే వినాలని. కాస్సేపు ఇంగ్లీషు అయ్యాకా ఇక లెక్కలు. ఆల్జీబ్రా.

“ఛీ ఛీ! శుభ్రంగా ఓ గంట చదువుకుని వస్తే ఈ అసహ్యం ఉండేది కాదు. నోటికొచ్చిన సమాధానం చెప్తే అది కరెక్ట్ అయినంత మాత్రాన సరేననడానికి నేను నీలా వెధవని కాదు. నీ రెండు సమాధానాలూ తప్పే. నీ మార్కులు వందకి సున్నా. ఫో!” ఆయన ఏకపాత్రాభినయం ఇలా కొంతసేపు కొనసాగేది. ఈ ప్రహసనం అయాక పడక్కుర్చీలోంచీ నెమ్మదిగా లేచి, మెల్లగా చేతికర్ర సాయంతో ఆయన గదికి వెళ్లి మంచం మీద కూచునేవారు. ఒక్కోసారి నన్ను వెనకే రమ్మనేవారు. మరెందుకో కాదు. ఆయనకి నాతో ఒకటే పని. లాటరీ టికెట్. ఇంతా గొప్ప మా తాతగారికి ఉన్న ఒకే బలహీనత. చాలా రోజుల క్రితం మా తాతగారు భీమిలీ స్కూల్లో పనిచేసే రోజుల్లో ఎవరో చెయ్యి చూసి లాటరీ తగులుతుందని చెప్పారట. క్రమశిక్షణకి మారుపేరయిన మా తాతగారు నేటివరకూ ఒక్క వారం కూడా తప్పకుండా టికెట్ కొంటూనే ఉన్నారు.

జోస్యుడు చెప్పింది అబద్ధం కాకపోవచ్చు గానీ ఇప్పటివరకూ నిజం మాత్రం కాలేదు.

నడవగలిగినన్నాళ్ళు ఆయనే వెళ్ళి కొనుక్కునేవారు. ఒక ఏడాది క్రితం బొత్తిగా నడవలేని స్థితికొచ్చాకా ఆ పని నాకప్పజెప్పారు. ముందే చెప్పాను కదా! కొని తేవడమే కానీ ఆ తరవాత దాన్ని ముట్టుకునే హక్కు నాకు లేదు. ఆయన అపనమ్మకం చూస్తే నాకు ఎలాగైనా ఆయన్ని మోసం చెయ్యాలనిపించేది. నేను తలుచుకుంటే, కళ్ళు కనపడని తాతగారికి పాత టికెట్ ఇచ్చి కొత్తది నా దగ్గిరే ఉంచుకోవడం పెద్ద విషయమేమీ కాదు. ఇంకా ఎన్నో రకాలుగా మోసం చెయ్యచ్చు. ఇంత తెలివీ, అనుభవం ఉన్న ఈయనకి ఈ చిన్న విషయం తట్టకపోవడమేమిటో నాకర్థమయేది కాదు. అయితే నేనెప్పుడూ ఆ ప్రయత్నం చెయ్యనూ లేదు. చేస్తే ఆయన పట్టుకోగలిగి ఉండేవారేమో కూడా నాకు తెలీదు.

ఒక్కోసారి తాతగారి హుంకరింపు వినిపించినా పలికేవాణ్ణి కాదు. మా అమ్మ కూడా గట్టిగా అరిస్తే విసుక్కుంటూ నెంబర్ రాసుకోడానికి వెళ్ళేవాణ్ణి. ఒకటి రెండుసార్లు చూసి మా తాతగారు, “సీఈఈత! పి. బి. కామేశ్వర్రావని కొత్తగా ఈ. ఎన్. టీ వచ్చాడట. బాగా చూస్తాట్ట. వీణ్ణి తీసుకుని వెళ్ళకూడదూ” అన్నారు. ఆయన అంత గంభీరంగా జోకేస్తున్నారో నిజంగా చెప్తున్నారో తెలిసి చావలేదు నాకు. ఆ తరవాత ఎప్పుడూ వినపడగానే ‘ఓయ్’ అని పలికి దగ్గరకెళ్ళేవాణ్ణి, ఈ వెటకారాలెవడు పడతాడనుకుంటూ.

ఆయన శరీరం పాతది. ఆయన ఆలోచనలు కొత్తవి.

మా అక్కకి అప్పటికి సుమారు పంథొమ్మిదేళ్ళు. మా అమ్మ వయసులో మా తాతగారికన్నా ముప్ఫయ్యేళ్లు చిన్నది. కానీ సంప్రదాయం, ఆచారం పట్టింపులెక్కువ. నేనిప్పుడు చెపుతున్నది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగిన విషయం. మా ఊరు అప్పటికి చాలా చిన్నది. రోడ్ల మీద ఎక్కువగా మగవాళ్లే కనపడేవారు. పని లేకుండా రికామీగా తిరిగే ఆడవాళ్ళూ, స్నేహితులతో రోడ్లమీదా, రెస్టారెంట్లలోనూ కూచుని కబుర్లు చెప్పే ఆడవాళ్ళూ ససేమిరా కనపడేవాళ్ళు కాదు. అతి కొద్దిమంది అమ్మాయిలు స్కూలుకో, కాలేజీకో వెళ్తూనో, వస్తూనో మాత్రమే కనపడేవారు. వీళ్ళు కూడా అయితే నడకా, లేదంటే రిక్షా.

‘కుటుంబ వ్యవహారాలు చూసుకోవలసినది ఇక అరుణే. అది మేజర్ కూడా అయింది. దానికో సైకిల్ కొందాం. ఇబ్బంది పడుతోంది,’ అన్నారు తాతగారు. మా ఇల్లు ఊరి చివర. ఎప్పుడూ అయన మాటకి ఎదురు చెప్పని మా అమ్మ ఈ సారి మాత్రం ధైర్యం చేసింది. ‘ఎందుకు నాన్నా! ఆడపిల్ల. అందరూ నవ్వుకుంటారు. కావాలంటే…’ మా తాతగారు వాక్యం పూర్తి చెయ్యనివ్వలేదు. ‘కాలం మారుతోంది. నీ ఆలోచనలూ మారాలి. నీ చిన్నతనంలో సైకిళ్ళు ఎక్కువగా లేవు. నువ్వు వాడలేదు. ఇప్పుడు దొరుకుతున్నాయి. అది వాడుతుంది. అంతే.’ అన్నారు. అప్పటికి నేను బాగా చిన్నవాడినే కానీ మా ఊర్లో అలాటి నిర్ణయం తీసుకున్న మొదటి వ్యక్తి–ఎనభై ఏళ్ళ వయసున్న మా పడుచు తాతగారే అని ఢంకా బజాయించి చెప్పగలను. అతనికన్నా వయసులో సహస్రాంశం చిన్నవాళ్ళయినా, చాలామంది ఆడపిల్లల తండ్రులు ఆయనని చూసి వాళ్ళ పిల్లలకి సైకిళ్ళు కొన్నారు.

ఊరు పెరుగుతోంది. దూరాలు పెరుగుతున్నాయి. అవసరాలు మారుతున్నాయి అని అర్థం చేసుకున్న మొదటి వ్యక్తి నాకు తెలిసి మా తాతగారే. అలా మా ఊరిలో ఒక అమ్మాయి మొట్టమొదటిసారి సైకిల్ మీద బయలుదేరింది. సంవత్సరం తిరక్కుండా చాలా మంది అమ్మాయిలు జామ్ జామ్మని సైకిళ్ళు తొక్కుకుంటూ సీతాకోకచిలకల్లా ఊరంతా తిరగసాగారు. కన్నుల పండుగ.

ఈ భూప్రపంచంలో అన్ని విషయాలలోనూ ఆయన ఆలోచనలు అత్యంత ఆధునికంగా ఉండేవి ఒక్క లాటరీ టికెట్ విషయంలో తప్ప. పైగా నన్ను లాటరీ టికెట్ విషయంలో దొంగలా చూడడం నన్ను దహించివేసేది.

ఆయన సంరక్షణలో పెరిగేను. నాకు ఇంగ్లీషూ లెక్కలూ నేర్పింది ఆయనే. ఆయన్ని చూసే పద్ధతిగా ఉండడం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాను. తరవాత పెద్దయ్యాకా నాకది కాస్త ఉపయోగపడింది కూడానూ. చాలా విషయాల్లో ఆయన్ని చూసి గర్వపడేవాణ్ణి. ఆయన మా ఇంటి పెద్దగా ఉన్నందుకు సంతోషించేవాణ్ణి. పదుల సంఖ్యలో ఉన్న ఆయన మనవల్లో ఆయనతో ఉండగలిగే అదృష్టం నాకే దక్కినందుకు సంబరపడేవాణ్ణి.

ఇకిప్పుడు నాకు ఇరవై ఏళ్ళ వయసు. పై చదువులకి ఇల్లు వదిలి వెళ్ళాలి. తాతగారికీ, అమ్మకీ సాష్టాంగపడి దండం పెట్టేను. నాకు తెలిసిన ప్రపంచాన్ని వదిలి వెళ్తున్నందుకు బరువెక్కిన గుండెతో, నాకు తెలియని కొత్త ప్రపంచంలోని వింతల్ని చూద్దామనే ఉత్సాహం నిండిన కొత్త రెక్కలతో గూడు వదిలి ఎగిరేను.

ఆ తరవాత లాటరీ టికెట్ విషయం క్రమంగా నాకో జ్ఞాపకంగా మాత్రమే మిగిలింది. ఎప్పుడో గుర్తొచ్చేది. మా తాతగారు నన్నెందుకు నమ్మలేదా అనిపించేది.

కొన్ని నెలల తరవాత సెలవులకి ఇంటికి వెళ్ళాను. అప్పుడే ఆఖరుసారి, మా తాతగారిని చూడడం. మళ్ళీసారి వెళ్ళేప్పటికీ ఇల్లంతా అలాగే ఉంది. మా తాతగారి మంచం ఉండే మూల తప్ప. మమ్మల్ని అనాథల్లా బతకమని వదిలేసి వెళ్ళిపోయేరు. అన్నిటికన్నా బాధాకరమైన విషయం నాకు ఆయన పోయిన విషయం వెంటనే తెలియలేదు. ఎందుకు చెప్పలేదని అడిగితే ‘నీకు పరీక్షలు. సంవత్సరం పొడూగునా చదివిన చదువూ, మరో ఏడూ వృధా అయితే తాతగారు మాత్రం సంతోషించేవారా? అదీగాక రోజు-ప్రయాణం. వచ్చినా చివరి చూపుకి అందేవాడివి కాదు,’ అంది మా అమ్మ.

మా తాతగారు తార్కికంగా ఆలోచించడం నేర్పారు. కానీ కొన్నిసార్లు తర్కంవల్ల నొప్పి కలుగుతుంది. మా అమ్మ తర్కం సరాసరి నా గుండెల్లో గుచ్చుకుంది.

మా తాతగారు ఏ ఒక్క బాధ్యతా నెరవేర్చకుండా వదల్లేదు. ఆయన లేని మంచమ్మీద కూచుని ఆలోచిస్తున్నాను. ‘నేను క్రితంసారి వచ్చినపుడు అదే నన్ను ఆఖరిసారి చూడడం అని ఆయనకి తెలుసా? ఆ తరవాత నాతో మాట్లాడే అవకాశం రాదనీ ఆయనకి అప్పుడే తెలుసా? ఎలా? లాటరీ టికెట్ వ్యవహారం నన్ను బాగా బాధ పెట్టిందని ఆయనెలా గ్రహించారు? కొంతమందికి భవిష్యత్తో, లేదా కనీసం వాళ్ళ చావుగురించో ముందే తెలిసిపోతుందా? అందుకనే ఆ విషయం నేను ముందుసారి వచ్చినపుడు చెప్పారా?’ నాకు తెలీదూ, చెప్పడానికి ఆయన లేరు. కానీ నాకు ఖచ్చితంగా తెలిసిన విషయం ఒకటుంది. లాటరీ టికెట్ వ్యవహారంలో ఆయన ప్రవర్తన వెనక కారణం నాకు చెప్పడం ఆయన బాధ్యత అని మాత్రం అనుకున్నారు. ఆయన బాధ్యత విస్మరించే వ్యక్తి కాదు. పూర్తి చేశారు.

క్రితంసారి ఇంటికొచ్చి తిరిగి వెళ్ళడానికి ముందు రోజు రాత్రి నన్ను పిలిచి చెప్పారు, “ఒరే! కొన్ని వందలో, వేలో లాటరీలో వస్తే మీకిచ్చేసి వెళదామని చిన్న ఆశపడ్డాను. లాటరీ అనేది తార్కికం కాదు, మూర్ఖత్వం అంటావేమో! నిజమే. కానీ ఆ ఒక్క విషయంలోనూ మీ మీద ప్రేమ నా తర్కాన్ని జయించింది. తప్పు లేదనిపించింది. ఇంకో విషయం. నువ్వనుకున్నట్టు నాకు నీ మీద ఎన్నడూ అపనమ్మకం లేదు. అర్భకుడివి. చిన్న పిల్లాడివి. టికెట్ చేతిలో పట్టుకుని మార్కెట్లో నుంచుని ఉన్నప్పుడు దానికే బహుమతొచ్చిందని తెలిస్తే? ఏ ముష్కరుడో నిన్నేమేనా చేస్తే? నా భయం టికెట్ గురించి కాదు. నీ భద్రత గురించి. పోతే పోనీ వెధవ టిక్కెట్టు. కానీ నీకేమైనా అయితే? అందుకే కాయితమ్మీద నెంబర్ రాసుకెళ్ళమనేవాణ్ణి. నా చేతుల్లో పెరిగేవు. నా మాటల్లో అర్థం చూడగలవనే నమ్ముతున్నాను. సరే! రేపు బయల్దేరుతున్నవు కదా! లే. సామాన్లు సద్దుకో. సమయం వృధా చెయ్యకు. తొందరగా అతి తక్కువ సమయంలో సి. ఏ. పూర్తి చేసెయ్” అన్నారు.

నాకు ఆయన మూర్ఖత్వం లోని తర్కం అర్థమైంది. ఆయన తత్వం లోని ప్రేమతర్కం అర్థమైంది.

ఆయన పోయినప్పుడు ఒదలలేకపోయినవి ఇప్పుడు వదిలాను. ధర్మోదకాలు.
-------------------------------------------------------
రచన: తుమరాడ నరసింహమూర్తి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment