Thursday, July 11, 2019

క్రెషెండో


క్రెషెండో




సాహితీమిత్రులారా!

“యూ పింప్!” అంది నిసి షామల్ కొంచెం ఆశ్చర్యం, కొంచెం కోప్పడ్డం కలిపిన స్వరంలో.

“నేనేం చేశాను నిసీ! అక్కడ నేపుల్స్‌లో ఆ పెంట్‌హౌస్ ఓనర్ అలా ప్రవర్తిస్తాడని నాకు తెలియదు.”

“ఆ పెంటహౌసుకు నీ స్టూడెంట్లను తీసుకుపోయింది నువ్వేగా ఆలెక్స్!”

ఈ మాటలు జరుగుతున్న అప్పటి సమయం: మధ్యాహ్నం రెండు గంటలు. ప్రదేశం: ఆలెక్స్ రూబెన్ పియానో స్టూడియో. అతడేమో డెస్క్ ముందు అతని కుర్చీలో. నిసి కొంచెం దూరంలో పియానో బెంచ్ మీద కూర్చుని, అతన్ని ఫేస్ చేస్తూ.

ఆలెక్స్ తనను నిసి ఏమన్నా ఎందుకో కోపగించడు. ఆమె తన మాటలను వ్యంగ్యంగా ఏదో భాషలోకి తర్జుమా చేసినా, అదీ పట్టించుకోడు. అతని స్టూడెంట్లంతా అమెరికన్లు కారు. రకరకాల భాషలు మాట్లాడుతారు. ఆలెక్స్‌కి ఇంగ్లిష్ తప్ప తెలుగు, కొరియన్, స్పానిష్ ఏమీ అర్థంకావు. కొంతమంది విద్యార్థులు ఇంగ్లీష్ రాక కొంచెం కలగాపులగం చేస్తూ, పట్టిపట్టి ఏదో మాట్టాడుతారు. ఆలెక్స్ అసలు వాళ్ల మాటలేవీ పట్టించుకోడు. వాళ్ల కామన్ భాష సంగీతమే. వాళ్లు ఆ భాషలో మాట్లాడుకోవాల్సిందే.

“నిసీ! నా టీచింగ్ కాంట్రాక్ట్‌లో, స్టూడెంట్స్ అందరినీ బైటి ప్రపంచంలోకి తీసుకు వెళ్లి, వేరే ఊళ్లలో రకరకాల హౌసెస్, కాన్సర్ట్ హాల్స్‌లలో వాళ్ళు హాయిగా పర్ఫార్మ్ చేసేలా నేను సహాయం చెయ్యాలి. ఎంతసేపూ పరిచయమున్న కాలేజ్ కేంపస్‌లో, తెలిసిన వాళ్ల మధ్య అలవాటైన స్టేజ్ మీద పియానో వాయించటం, బైట ప్రపంచంలో నెగ్గటం ఒకటి కాదు. కాని, ఊళ్లో ఉండే ఇతర మనుషుల చెడు ప్రవర్తనకు నేను బాధ్యుడినా, నిసీ?”

నిసికి తెలుగు లవకుశ సినిమా, అందులో వాల్మీకి, లవకుశులు గుర్తుకి వచ్చారు. వాల్మీకి ఆశ్రమంలో రామాయణం పాటలుగా నేర్పితే, ఆ చిన్ని పాపలు ఊరూరా తిరుగుతూ ఎంత మధురంగా పాడారు! శ్రోతలు వారి హృదయాలు పరవశించి ఆ కవలలను అక్కున చేర్చలేదా! వారి పాట ఎన్నో హృదయాలను కరుణతో కరిగించలేదా! ఆలెక్స్ ఇలా ప్రోగ్రామ్స్ ఇచ్చినప్పుడు, ఆ ఇంటి ఓనర్స్ గాని, ఇతరులు కాని, పెద్ద గ్రాంట్ ఒకటి ఏర్పాటు చేస్తే, ఆ డబ్బుతో, ఆ స్టూడెంట్స్ గుండె నిబ్బరంతో, చదువు మీద మనసు పెట్టి వేరే కలతలు లేకుండా సంగీతం నేర్చుకుంటారు కదా.

నేపుల్స్‌లో ఉండేవారిలో కొంతమంది దగ్గర డబ్బు మేట్లు పడి ఉంది. డబ్బులేని పిల్లల కోసం ఆలెక్స్ జోలె పుచ్చుకు వెడతాడు. తను ఇదివరలో పనిచేసిన యూనివర్సిటీ హాస్పిటల్స్‌కి ఎంతెంత డబ్బూ వచ్చి పడుతుండేది. కేన్సర్ కేర్‌కి, దేశంలోని దాతలు ఇచ్చే డబ్బు ఇంతా అంతా కాదు. ఆ మిలియన్ల గ్రాంట్ మనీతో పోలిస్తే, ఈ లిబరల్ ఆర్ట్స్ పబ్లిక్ యూనివర్సిటీకి, ఈ మ్యూజిక్ స్కూల్‌కి వచ్చే సొమ్మెంత! ఆలెక్స్ ఎంత మంచివాడు అనుకుంది నిసి. కాని ఆమె సంగీతం పాఠం చెప్పించుకోటానికి వస్తే, ఆలెక్స్ రూబెన్, ఆమె లోపలికి వచ్చిన వెంటనే, ఇంతన్నా పర్మిషన్ అడక్కుండానే, కొంతసేపుగా ఆమెతో తన సొంత గొడవ వినిపిస్తున్నాడు. అది న్యాయమా? ఇంతకూ జరిగింది ఇది.

యూనివర్సిటీకి కొన్నాళ్ల కిందట పరిచయమైన ఒక రిచ్ లేడీ, ఒక సీషోర్-హైరైజ్-పెంట్‌హౌస్ ఓనర్, నేపుల్స్ సీజనల్ క్లాసికల్ మ్యూజికల్ కాన్సర్ట్ ఒకటి, తన ఇంట్లో ఏర్పాటు చేసింది. పద్ధతి ప్రకారమే, అతిథులకందరికీ పంపిన ఈవైట్, ప్రోగ్రామ్ ఈవెంట్ లిస్ట్ ప్రకారమే ఒక బీథొవెన్ సొనాటా, బ్రామ్స్ సింఫొనీ కొంచెం, కొద్దిగా గెర్ష్‌విన్ రాప్సొడీ ఇన్ బ్లూ, షోపేన్ రెయిన్ డ్రాప్ ప్రెల్యూడ్, కొంచెం వెస్ట్ సైడ్ స్టోరీ థీమ్, స్టూడెంట్లు వినిపించారు. ఆలెక్స్ ఒక్కో స్టూడెంట్‌నీ పరిచయం చెయ్యటం, ఏ దేశం నుంచి వచ్చిందీ చెప్పి, వారి ప్రావీణ్యం, చదువులో ఉత్సాహం గురించి చెప్పి కంపోజర్ ఏ దేశం వాడైనా, ఈ విద్యార్థులు అందరినీ వీలైనంత అర్థంచేసుకోటానికి ప్రయత్నిస్తారనీ, సభలోని ఉదారులు స్కూల్‌కి గాని, లేకుంటే ఒక విద్యార్థి చదువుకు గాని డబ్బిస్తే, మేమంతా మీకు కృతజ్ఞులమై ఉంటాం! అని అడగటం, ఆపైన ఆ స్టూడెంట్ ఒక పీస్ వినిపించడం–అంతా అక్కడి వరకూ బాగానే జరిగిందిట.

నిసి ఆనాటి కాన్సర్ట్‌లో లేకపోయినా అక్కడ జరిగినది ఆమె కన్నుల ముందు కనిపిస్తూనే ఉంది. ఆమెకు పరిచయమైన సీన్, సీనరీనే అది. కాండోలో నుండి గ్రీన్ గల్ఫ్ వ్యూ, మరో వైపున నో-ఎడ్జ్ స్విమ్మింగ్ పూల్‌లో దూకేవాళ్లూ, నీళ్ళు కారుతున్న బికినీలు, ట్రంక్స్‌లో టెరేస్ మీద ఉన్న ఓపెన్ ఎయిర్ బార్ దగ్గర షాంపేన్, వైన్, కాక్‌టెయిల్స్ తాగుతూ స్త్రీ పురుషులు; టెరేస్ అంతా అందంగా అలంకరించిన పామ్స్, జాస్మిన్స్, బోగాన్‌ విలియా పొదలు ఆమెకు మనసులో కనిపిస్తూనే ఉన్నయ్.

అలాంటి కాన్సర్ట్‌లకు వచ్చేవారు ఎలా ఉంటారో కూడా ఆమె మనసులో చూడగలదు. బాగా దగ్గరగా వేసి ఉండే కుర్చీల వరసలూ అందులో పోతరించి ఉన్న మగవాళ్లూ, వారి పక్కన దాదాపు ఒకేలాంటి ముఖాలతో, సైజులలో, వారి భార్యలు. ఆ ధనిక స్త్రీల ముఖాల మీద మామూలు ఆడవాళ్ళకు మల్లే వయసు భోగట్టా ఇచ్చే ముడతలుండవు. వారందరి కాస్మెటీషియన్స్ ఒకే ఎక్స్‌క్లూజివ్ స్పాలో వారయుంటారు. లేదూ ఒకే యూనివర్సిటీ హాస్పిటల్లో ట్రెయినింగ్ తీసుకుని వచ్చిన సర్జన్స్, డెర్మటాలజిస్టులు అయివుంటారు. ఆ దగ్గర వరసల కుర్చీలకు కొంచెం దూరంగా లౌంజ్, రివాల్వింగ్ ప్లష్ కుర్చీలూ, సోఫాలూ, ఆవలగా బార్, అక్కడ ఆ కార్యక్రమానికై హైర్ చెయ్యబడిన కేటరర్లు, బార్ టెండర్లు ఉండే ఉంటారు.

నిసి ఆలెక్స్ రూబెన్ మాటలు వింటూ, ఆ పెంట్‌హౌస్‌లో జరిగిన దృశ్యాన్ని మనసులో చూసింది.

పియానో, వయొలిన్, క్లారినెట్ ప్రోగ్రామ్ చక్కగా ముగిశాక, సపోర్టింగ్ ఆర్టిస్టులు లోకల్ ఫిల్హార్మోనిక్‌లో వారికి మరో ఎంగేజ్‌మెంట్ ఉండటంతో వెంటనే వెళ్లిపోయారు. అక్కడినుంచీ కార్యక్రమం ఒక్కసారిగా పక్కదారి పట్టిందంట.

అకస్మాత్తుగా ఒకాయన తనకిష్టమైన ఓ బూజీ వూజీ ట్యూన్ చెప్పి అది పియానోపై వాయిస్తే వెయ్యి డాలర్లు కేష్ ఇస్తానన్నాడట. ఆలెక్స్ స్టూడెంట్లని వద్దనలేదు. అతను అసలు ఏమైనా అనే లోపలే, ఒక కుర్రాడు ఉత్సాహంతో వాయించాడు. అక్కడి నుండీ అక్కడి అతిథులందరికీ ఒక్కొక్కరికీ కిర్రెక్కి, వారి జాజ్, పాప్ మ్యూజిక్ కోర్కెలు అడగటం, వెంటనే కేష్ ప్రైజ్ ఆఫర్స్, ఆ ట్యూన్స్ వచ్చినవాళ్లు అవి వాయించటంలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కోలాహలం, కొందరు వెంటనే డేన్స్ మొదలుపెట్టడం, అటూ ఇటూ వాళ్ళూ వీళ్లూ కాళ్లు తొక్కుకుంటూ పరుగులూ, వెర్రిగా చప్పట్లూ, ఈలలూ మొదలయ్యిందంట. వైన్, షాంపేన్ సరఫరా ఎక్కువయ్యి క్లబ్‌లలో ఉండేలాంటి మాదక, ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందట.

అప్పుడు ఆలెక్స్ చూస్తుండగానే, ఒక స్పానిష్ విద్యార్ధినిని, ప్రశంసించి డబ్బు చెక్ అందించటమే కాక, ఆ యువతిని గట్టిగా వాటేసుకొని అదుముకున్నాడట ఇంటి ఓనర్ మొగుడు.

“ఎంత గట్టిగా!” అడిగింది నిసి. ఆలెక్స్ తన కుర్చీలోనే కూర్చుని చేతులతో అభినయిస్తూ ఆ గట్టిగా అదుముకోటాన్ని చూపించాడు. పియానో బెంచ్ మీద, కొంచెం దూరంలో అతనికి ఎదురుగా తిరిగి కూర్చుని ఉన్న నిసికి చచ్చేంత నవ్వు వచ్చింది.

“రియల్లీ! నేను అక్కడే ఉన్నాను. హి ఈజ్ స్క్వీజింగ్ హర్ బ్రెస్ట్స్ ఇన్ టు హిమ్ సో టైట్. చాలాసేపు. జీనాని వదల్లేదు. చాలాసేపు. రియల్లీ!”

ఆలెక్స్ మళ్లీ కుర్చీలో వంకర టింకర అభినయంలోకి వెళ్లిపోయాడు. నిసికి నవ్వు వచ్చిందంటే ఆగదు. ఐనా ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని, కష్టపడి ఆపుకుంది.

“అతగాడి భార్య అక్కడ లేదూ?” అంది.

“ఎందుకు లేదూ! ఆవిడే కదా మాకు అంత ఫ్యాట్ చెక్ రాసిచ్చింది. ఆమె డబ్బున్నావిడ. మొగుడు ఉత్త ప్లే బాయ్! హర్ కీప్. అతనికేం డబ్బు లేదు. తర్వాత నాకు తెలిసింది. ద లేడీ ఈజ్ ఎ కూగర్! ది షుగర్ మమ్మీ!”

నిసి “యూ పింప్!” అని అతన్ని అభినందించింది సరిగ్గా అప్పుడే.

“ఎంత డబ్బు వచ్చిందా రోజు? ఆలెక్స్!”

ఆలెక్స్ కొంచెం సిగ్గు పడుతూ “ఓ! ఇట్ ఈజ్ సబ్‌స్టాన్షియల్! అంతా కాలేజ్ ఎకౌంట్‌లో జమకట్టాం. నో పర్సనల్ పే. కాలేజ్ రూల్స్ ఒప్పవు.”

“ఆలెక్స్! అంతా మంగళకరంగా ముగిసినట్టుంది కదా! ఎందుకు నువ్వు నాకు చెప్పాలనుకుంటావయ్యా ఇవన్నీ. అయినట్టేనా, ఇక పాఠం మొదలెట్టనా?”

ఆలెక్స్ నేర్పే రాండో, రిపీట్, సంగీతం కాంపోజిషన్లతోనే ఆమె మామూలు వాక్యాలన్నీ మారిపోతున్నయ్యి. ఈ మధ్య ఆలోచనలన్నీ, మెలికలు తిరిగిపోతున్నట్టనిపిస్తున్నది ఆమెకు. సాఫీగా ఒక్క వాక్యం మాట్లాడలేకపోతున్నది. దానికి తోడు అతనికి తన మీద పెరుగుతున్న మోహం. అది అలా బేక్ బర్నర్ మీద పెట్టి, నిసితోనే ఇతరుల ఇలాటి వ్యవహారాలు చెప్పటం!

ఆలక్స్ సెబాస్టియన్ బాఖ్ ఫ్యూగ్‌ల్లాగా, తనచుట్టూ ఈ చిక్కుల దారాలన్నీ పేనుతూ ఉంటాడు. ఏమన్నా అంటే, నువ్వు చేసిన వైద్యాల కాంప్లెక్సిటీ కంటేనా, నీ పేషెంట్ల మెడికల్ హిస్టరీల కన్నా విచిత్రమా? అంటాడు. అబ్బా, ఇతని ఆఫీసులో ఇతనితో ఈ మంత్రాంగమేమిటి అని మనసులో వింతపడుతూంది నిసి.

ఆలెక్స్ అంతలో మళ్లీ మొదలెట్టి, “ఐ విష్ ఇట్ వజ్ నిసీ! ఏదోలే, ఐపోయిందిలే అని ఊరుకుంటే, క్రితం వారం, ఆ విద్యార్ధిని నా దగ్గరకు వచ్చి ఆ విషయమై ఏడ్చింది.”

“ఆ! ఐ సీ! దెన్ ఇట్ గాట్ అన్‌కంఫర్టబుల్ ఫర్ యు! జరిగినప్పుడు చూసిన నీకు బాగానే ఉంది. చూసిన పెళ్లానికీ బాగానే ఉంది. ఇప్పుడు ఆ పిల్ల నీకొచ్చి చెపితే, ఇప్పుడు చిక్కొచ్చింది.”

“అంత అన్యాయంగా మాట్లాడతావ్! గబుక్కున జరిగిపోయే ఇలాటివాటిని నేను ఆపగలనా? నువ్వైతే ఆపుతావా?”

“ఐ నో! కానీ ఆలెక్స్‌కు ఇప్పుడు ఇదంతా ఎడ్మినిస్ట్రేషన్‌కి సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కదా!”

“దిస్ షిట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దట్ ఆరంజ్ టాప్. ఐ హేట్ హిమ్. వీడిలాంటి వాళ్ళ వల్లే ఈ మీ-టూ మూవ్‌మెంట్స్ పుడతాయి. లాస్ట్ యియర్, చెప్పాను కదా, ఒక ప్రొఫెసర్‌ను ఫైర్ చేశారు, ఏదో సెక్సువల్ హరాస్‌మెంట్ కేస్‌లో. కేంపస్ అంతా మీడియా గోల గోల. స్టూడెంట్స్, ఫకల్టీ ఎవరుపడితే వారిని ఆపడం, ప్రశ్నలు అడగడం. ఆ తర్వాత వరుసగా స్కూల్ ప్రిన్సిపల్, యూనివర్సిటీ ప్రెసిడెంట్ రిజైన్ చేశారు. దిస్ సెక్సువల్ హరాస్‌మెంట్ గోలలో స్టూడెంట్స్ ప్రశాంతంగా మ్యూజిక్ చదువుకోలేకపోతున్నారు.” ఆక్రోశం వెళ్ళగక్కాడు ఆలెక్స్.

“ఐ నో! ఆ షిట్టంతా అప్పడూ నాకు చెప్పావు కదా! నేను ఇంతకు ముందు న్యూయార్క్ స్టేట్‌లో పనిచేసిన ఒక యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ని కూడా ఇలాటి గొడవల వల్లే మార్చేసిన సంగతి కూడా, నువ్వే రిసర్చ్ చేసి మరీ చెప్పావు కదా! అవునూ ఆలెక్స్, ఈ సోది నీ మేల్ కాలీగ్స్‌తో చెప్పుకోవచ్చు కదా, పాఠం నేర్చుకోవడానికి వస్తే నన్ను టార్చర్ పెట్టకుండా!”

నిసి ఏమైనా అనుగాక, ఆలెక్స్ స్వరం మారదు. స్వరంలో చాలా తక్కువ ఇన్ఫ్లెక్షన్స్. కాలు మీద కాలు వేసుకుని ఎప్పుడైనా కుర్చీలో వెనక్కి ఊగుతూ, అప్పుడప్పుడూ చేతిలో పెన్సిల్ తిప్పుతుంటాడు. చెపుతూనే ఉంటాడు. నిసి ఈ లోపల పన్నెండుసార్లు లేస్తుంది. అటూ ఇటూ తిరుగుతుంది. ఒక్కోసారి వేసుకున్న కోట్ తీసి పారేస్తుంది. మళ్లీ చలి పుట్టి వేసుకుంటుంది. వేలి ఉంగరాలు వదులు చేస్తూ, బిగువు చేస్తూ ఉంటుంది. చేతి బ్రేస్లెట్స్ సవరిస్తుంది. అన్నీ కంటి కొసలనుంచి చూస్తూ పెన్సిల్ తిప్పుతూ, ఆలెక్స్ రూబెన్ చెప్పుకుపోతుంటాడు.

“ఈ సెక్స్ ఏలిగేషన్స్ వేవ్ దేశమంతా పాకి, మెన్ ఆర్ బియింగ్ ఇమాస్క్యులేటెడ్! అంతా అయ్యాక ఇప్పుడు ముసలితనంలో కొందరు మగవాళ్లను జైళ్లలో కుళ్లబెడుతున్నారు! వాట్ ఎ వేస్ట్ ఆఫ్ పీపుల్స్ మనీ! అండ్ టైమ్! అసలు దేశమంతటికీ ఉన్నత పదవిలో ఉన్నవాడు ఎంతో నీతిమంతుడై ఉండాలి. నౌ బికాజ్ ఆఫ్ దిస్ మష్రూమ్ అమెరికా అంతా కుళ్లిపోతూంది. డిసిప్లిన్ మెయిన్టెయిన్ చెయ్యటం ఏ వర్క్ ప్లేస్‌లో ఐనా ఇంక ఎంత కష్టమో. ఇట్సాల్ బికాజ్ ఆఫ్ ట్రంప్! అండ్ యువర్ ఓట్ ఫర్ హిమ్.”

“ఆహా!ఇప్పుడు తెలిసింది. ఈ సోదంతా నిజంగా ఆ స్టూడెంట్ గురించి కాదు. యూ వాంట్ టు పిక్ ఎ ఫైట్ విత్ మి ఓవర్ ట్రంప్. దేశంలో అన్ని న్యూస్ ఛానెల్స్ న్యూసెన్స్ చేస్తున్నై. ఐనా చాలటల్లా నీకు.”

“డోంట్ గెట్ క్రేజీ నౌ. ఐ ఆమ్ నాట్ డూయింగ్ ఇట్, ఆనెస్ట్!”

“యాఁ, ష్యూర్! ఈ వ్యవహారాలు ఈ దేశానికేమన్నా కొత్తా! సెక్సువల్ హరాస్‌మెంట్ నేరాలెన్నో ట్రంప్ రాకముందు ఎన్నో ఏళ్ల క్రితం జరిగినవి కాదూ ఆలెక్స్! కాస్బీ క్రైమ్స్, వైన్‌స్టీన్ క్రైమ్స్, క్లింటన్ క్రైమ్స్, ట్రంప్ ప్రెసిడెంట్ కాకముందు జరిగినవేగా! ట్రంప్‌కి ఏం సంబంధం వీటితో! ట్రంప్‌కి బాగా డబ్బుంది. యౌవనంలో బాగా అందగాడు. హి డిడ్ నాట్ హేవ్ టు బెయిట్ ఎనీ బడీ! ప్రియురాళ్లకు కూడా వారు పెళ్లాలు కాకముందే, వారితో ఎగ్రిమెంట్లు చేసుకునే కదా వారితో గడిపాడు. ఆ ఆడవాళ్లు వాళ్లకు వచ్చే డబ్బు, హోదా చూసుకునే అతడిని వలచారు. వాళ్ల కన్నా అతనికే ఎక్కువ డబ్బు, గ్లామర్ ఉన్నయ్యి. ఐ డునాట్ సపోర్ట్ ఎనీ వన్ ఇన్సల్టింగ్ విమెన్. కాని, తప్పు ఆ ఒక్కడిదే అనకు. మొదటి పెళ్లాన్ని ప్రేమించినన్నాళ్లూ ఆమెకు బాగానే ఉంటుంది. ఆ తర్వాత విడిచిపెట్టమంటే బాధ. ఎందుకూ! అతనికి ఇంకెవరి మీదైనా మోజు కలిగితే, ఆమెకు తగినంత కాంపెన్సేషన్ ఉందిగా. విడిచిపెట్టే ఆప్షన్ ఆమెకూ ఉంది. ఆమె ఇంకొకరిని ప్రేమిస్తే, మహ చక్కగా వెళ్లిపోవచ్చు. ఆ ఆడవాళ్లు వెళ్లరంతే. సుఖమరిగి ఉన్నారు కాబట్టి. అతని డబ్బు కావాలి కాబట్టి. ట్రంప్ ఈజ్ ఫెయిర్ టు విమెన్.”

ఆలెక్స్ తన పక్క బల్ల మీద పెన్సిల్‌ వేళ్ళమధ్య తిప్పుతూ కళ్ళు పెద్దవి చేసి నిసి వైపు చూశాడు. “దట్ ఈజ్ రియల్ క్రేజీ టాక్! నువ్వు ఇండియన్ వుమన్‌వేనా అసలు? నిసీ! యూ నో హౌ హి ట్రీటెడ్ దెమ్? అసలు ఏ మ్యారేజ్ అయినా ఈ ఇన్‌ఫిడెలిటీ ఏంటీ? ‘అంటిల్ డెత్ డు అజ్ పార్ట్’ వాగ్దానాల సంగతేమిటి?”

“దే ఆర్ ఆబ్సొలీట్! ఏనాడో ప్రీస్టులు ఎవరో రాసిన పెళ్లి ప్రమాణాలు. కొత్తవి రాయాలి. పేరడైస్ లాస్ట్ రాసిన మిల్టన్ ఏం చేశాడో తెలుసా? మేరేజ్ అనే ఒక బంధనం ఉన్నప్పుడు మనిషికి, డివోర్స్ అనే విమోచన కూడా ఉండాలని వ్యాసాలు, పిటీషన్లు రాశాడు. ఏనాడు? పదిహేడో శతాబ్దంలో. బ్రిటిష్ లైబ్రరీకి, న్యూయార్క్ లైబ్రరీ ఆఫ్ ఆర్కయివ్స్‌కి నువు వెడితేగా! అసలు నీకు ఒక లైబ్రరీ కార్డయినా ఉందా? నువ్వు ఈ మధ్య చదివిన పుస్తకం పేరొకటి చెప్పు. ఊరికే ఆ పాత శతాబ్దాల ఆర్కయాక్ మ్యూజిక్ మోగించుకుంటూ, నారదుడిలా లోకసంచారం చేస్తుంటావు. నీకు 21వ శతాబ్దం ఆలోచనలు రమ్మన్నా రావు!”

“హూ ఈజ్ దిస్ నారదూడు!”

“నారదుడెవరు! ఓ గాడ్! నువ్వు మ్యుజీషియన్‌వి, పైగా బ్రహ్మచారివి! నీకు నారదుడే తెలియదా! పోనీ ఫ్లౌటిస్ట్ కృష్ణా తెలుసా? అతని ఫ్లూట్ నువ్వు విననే లేదా!” అడిగింది నిసి.

“యూ మీన్! దట్ లార్డ్ ఆఫ్ హరేరామ హరేకృష్ణ సొసైటీస్. నో. ఐ డోంట్ నో దెమ్. నేను మారువానా పీల్చను. ఐ డోంట్ ఈవెన్ స్మోక్. అండ్ ఐ హేవ్ నో పేషెన్స్ ఫర్ రెలిజియన్ ఎట్ ఆల్! యునో దట్!”

“గుడ్ ఫర్ యు! సో! ఎలా సాల్వ్ చేశావీ స్టూడెంట్ కేస్! యూ హష్‌డ్ దట్ యంగ్ గర్ల్ అప్! ఐ నో యూ డిడ్! యూ పింప్!”

“నో నిసీ! యూ ఆర్ రాంగ్ ఏజ్ ఆల్వేస్! ఆ అమ్మాయికి ముందు నా క్షమాపణలు చెప్పాను, అలా ఆమెకు అయిష్టమైన చర్య జరిగినందుకు. తర్వాత ఆమె కోరిక మీదే–తన పేరు బైటికి రాకుండా, నేను సరైన ఏక్షన్ తీసుకుంటానని చెప్పాను. సో, ఇప్పుడు ఆ హైక్లాస్ సొసైటీ మొగుడికి మా యూనివర్సిటీలో ఏ ఫెసిలిటీలు వాడుకోటానికి పర్మిషన్ లేదు. అతని ఫార్మల్ లెటర్ ఆఫ్ ఎపాలజీ మాకు వస్తే, యూనివర్సిటీ అప్పుడేమన్నా అతని విషయం ఆలోచిస్తుంది. జీనాకి కాలేజీ తీసుకున్న చర్య ప్రూఫ్ చూపించాను. షి ఈజ్ ప్లీజ్‌డ్.”

“సో! ఇట్స్ ఆల్ ఓవర్! నాకెందుకు చెప్పావు ఇప్పుడీ విషయం? నా సంగీతం పాఠం టైమ్ స్లాట్ ఐపోనే వస్తూంది. సో ఫార్, పియానో కీ అంటుకోనివ్వలేదు నువ్వు. ఎందుకు నేనింత దూరం డ్రైవ్ చేసుకు వచ్చింది!”

“ఫర్గెట్ ద లెసన్! బిగ్ డీల్! వి విల్ రీ స్కెడ్యూల్! యూ ఆర్ ఎ డాక్టర్! కాన్‌ట్ యు హెల్ప్ మీ! వై ఆర్ యూ సో టఫ్ ఆన్ మీ! ఐ స్టిల్ ఫీల్ బేడ్! వై డు ఐ ఫీల్ బేడ్ నిసీ!”

“ఐ ఆమ్ ఏన్ ఆంకాలజిస్ట్, నాట్ యువర్ సైకాలజిస్ట్! ఎనీవే, ఎందుకంటే ప్రతీ చిన్న విషయానికి ఓవర్ సెన్సిటివిటీ చూపడం, అఫెండ్ అయిపోవడం ఈ మధ్య అందరికీ అలవాటైపోయింది కనుక. అన్నీ ఓవర్ పొలిటిసైజ్ చేసి పొలిటీషియన్స్ మోరల్ గురూస్ లాగా ఫేక్ చేస్తూ, ఆడ మగ విషయాలన్నిటిలో వేలు పెట్టి, దేశంలో ఎవరికీ కంఫర్టబుల్‌గా ఉండని ఎట్మాస్ఫియర్ కల్పిస్తున్నారు కనక. సీ, ఆలెక్స్! నువ్వు ధనవంతుడివి కావు. నీకు ఉద్యోగం అవసరం! ఇలా మగవాళ్ల ఉద్యోగాలు పీకేస్తుతున్నప్పుడల్లా నీకు చచ్చే ఆందోళన ఉంటుంది. ఐతే నీకు దేనికి గిల్ట్! నువ్వు సెక్సువల్ ప్రిడేటర్‌వి కావు. అందరి మగవాళ్ల ప్రవర్తనకీ నువ్వు జవాబుదారీ కాదు. ఆడవాళ్లనే ప్రత్యేకంగా రక్షించనూ అక్కర్లేదు. జస్ట్ డూ యువర్ జాబ్! యు విల్ బి ఫైన్.

జరిగింది చాలా చిన్న సంఘటన. జీనా ఈజ్ ఏ బిగ్ గర్ల్! షి కెన్ పుష్ ఎ గై ఆఫ్. అతన్ని అప్పుడే తనే ఏమన్నా అనొచ్చు! పియానో మీద అంత ఎక్స్‌ప్రెసివిటీ చూపించే పిల్ల, ఈ విషయంలో మ్యూట్‌గా ఉండటమెందుకు! ఆమెకు జరిగిన అవమానం ఏమీ లేదు. ఎదిగిన యువతి అసలు ఇలాంటి చిన్న చిన్న విషయాలలో ఏడవాలిసిన పనే లేదు. విదిలించుకోగలగాలి. ఆపైన ఒక్క నిమిషంలో మర్చిపోయి, తన పనులు తను చేసుకోగలగాలి. అలా చేసినప్పుడల్లా షి బికమ్స్ స్ట్రాంగర్! ముందుముందు ఇలాంటివి ఎలా డీల్ చేయాలో తెలిసి వస్తుంది.

సర్లే కానీ, ఐ ఆమ్ క్యూరియస్! ఇంతకీ కాన్సర్ట్‌కి ఆ రిచ్ కపుల్ ద్వారా వచ్చిన డబ్బు విషయంలో ఏం చర్య తీసుకున్నారూ!”

“నథింగ్! స్టూడెంట్లు ప్రోగ్రామ్ ప్రకారం కాన్సర్ట్ ఇచ్చారుగా. దెయిర్ పర్ఫామెన్స్ వజ్ రియల్లీ గుడ్.”

“ఎవరో ష్రూడ్ జ్యూయిష్ ప్రొఫెసర్ స్టాఫ్ మీటింగ్‌లో అందరి నోళ్ళూ మూయించి ఈ కాన్సర్ట్ అంతా తనే ఆర్గనైజ్ చేసి గైడ్ చేసుంటాడు.”

“హ హ హ. వెరీ ఫన్నీ. గొప్ప జోక్! నాకైతే రోజూ ఈ వెధవ గోలలకి, బైట వచ్చే హరికేన్లకీ, తట్టుకోలేక ఈ ఫ్లారిడా రాష్ట్రం సముద్రంలో ఒక్కసారిగా మునిగిపోతే పీడా పోతుందనిపిస్తుంది. ఎక్కడైనా నా సొంత కన్సర్వటోరీ పెట్టుకోవాలి. అండ్ ఐ వాంట్ యూ టు బీ మై సి.ఇ.వో!”

నిసి గట్టిగా నవ్వింది.

“దానికి ఫ్లారిడా మునగటం దేనికి? నువ్వేదో ఇండియన్ రుషివనుకుంటున్నావా? శాపాలూ, వరాలూ, మోహాలూ. ఓ! బై ద వే, హౌ ఈజ్ యువర్ ఓన్ ఇన్ఫాట్యుయేషన్ ఓవర్ ఏన్ ఓల్డర్ ఉమన్ కమింగ్ ఎలాంగ్?!” కొంటెగా అడిగింది నిసి.

“యూ మీన్ యూ? నీమీద! నేను సింగిల్. ఇంతవరకూ పెళ్లే చేసుకోలేదు. నిన్ను ప్రేమించటానికి నేనెందుకు జడవాలో, ఎందుకు మానాలో, తెలియదు. కారణం చెప్పవుగా!”

“ఐ గాట్ టు గో, ఆలెక్స్”

“ఓ. కే. ఆల్‌రైట్! ఆన్సర్ నువ్వు ఇస్తావని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదులే.” ఆలెక్స్ లేచి నుంచున్నాడు, ఆమెకు తలుపు తెరవటానికి.

నిసి లేచి తన దుస్తులు సరిగా సర్దుకుని, జుట్టు లోనికి వేళ్లు పోనిచ్చి వదులుగా విదిలిస్తూ అడిగింది.

“ఇంతకీ ఆ వేరే ప్రొఫెసర్ కామకలాపాల గోల తర్వాత, మీ అందరి స్టూడియోల్లో విడియో కేమెరాలు పెట్టారా! ఇంకా లేదా?”

“ఫన్నీ యు షుడ్ ఆస్క్ దట్! యా! వాటి గురించి కొంత డిస్కషన్స్ జరిగాయి. ఇంకా ఏం ఏక్షన్ తీసుకోలా.”

నిసి పెదవి నొక్కిపెట్టి, నవ్వుతూ, లక్కీ యూ! అంటూ అతనిని గట్టిగా కౌగిలించుకుని, అతనికొక పొడుగాటి ముద్దు ఇచ్చింది. ఇస్తూ, అతని ముఖం మురిపెంగా నిమిరింది. ఇన్నేళ్ల పరిచయంలో ఆమె అతనికి ఇంతవరకూ పెదవులపై ఎప్పుడూ ముద్దివ్వలేదు. ఎంత సమయం గడిచిందో అతడికి తెలియదు. అతడు తేరుకునే లోపల నిసి గది తలుపు తీసుకుని వెళ్లిపోయింది.

ఆమె షనేల్ పరిమళాలు ఆ కౌగిలి ఒత్తిడికి వెలువడి, ఆలెక్స్ రూబెన్ చుట్టూ కమ్ముకున్నాయి.

(నిసి షామల్ 2018 డైరీ నుంచి.)
----------------------------------------------------
రచన: లైలా యెర్నేని, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment