Saturday, July 13, 2019

పిల్లలు, మన అభిరుచులు


పిల్లలు, మన అభిరుచులు




సాహితీమిత్రులారా!

మొదటి సంతానం అయినందుకు, తర్వాత తనొక్కతే సంతానం అయినందుకేమో మా శివాని అంటే మురిపెం. దాంతో దానికెంత ఆప్యాయత, ముద్దుముచ్చట దొరికినాయో! తనమీద చిన్నప్పటినుంచీ చదువుతో పాటు ఇంకా ఎన్నో నేర్చుకోవాలనే ఒత్తిడి కూడా ఎక్కువే. మాకు రానివీ మేం నేర్చుకోలేకపోయినవీ అయిన చక్కటి అభిరుచులెన్నో తను పెంపొందించుకోవాలనే మా ఉత్సాహంలో ఆమెకు ఎన్నో నేర్పించాలని ప్రయత్నించి చూసినాము. ఎందులో తను రాణిస్తుందో, తనకేది ఇష్టమవుతుందో మాకు తెలీదు కదా? అన్నీ తనకు తెలియజేస్తే సరి అనుకున్నాము.

శివానికి నాలుగేళ్ళప్పుడు, మొదటిసారి కొనిపెట్టిన క్యామెల్ రంగుల సెట్ మిద చూపిన శ్రద్ధ, ఉత్సాహం చూసి, బొమ్మలు గియ్యటం మాకు రాదు కాబట్టి, ఎక్కడయినా నేర్పుతారా అని చూశాము. చిత్ర కళా పరిషత్ వారాంతం శని-ఆది వారాల హాబీ క్లాసు తనకు సరిపోతుందనిపించింది. శనివారం మధ్యాహ్నం ఒక గంట సేపు, ఆదివారం ఉదయం పూట గంట సేపు ఉండేది చిత్రలేఖనం క్లాసు. మూడు నుంచీ, పదహైదు సంవత్సరాల వయసు ఆడా మగా పిల్లలు ఇరవయి మంది దాకా ఉండే వారు క్లాసులో. అందర్నీ వయసులవారిగా గుంపులు చేసి చిత్రకళ నేర్పేవారు సూఫీ టీచర్. ఆరుబయట, పెద్ద చింత చెట్టుకింద, పిల్లలు పొరపాటున పడేసిన రంగులతో అదే ఒక పెయింటింగులా తయారయిన ఒక జంఖానా మీద అందరూ గుంపులుగా చేరి కూర్చునేవారు. మాలో ఎవరం శివానిని క్లాసుకు తీసుకెళ్తామో వారు గంటసేపు అక్కడే కాస్త దూరంలో మరో చెట్టు కింద కూర్చుని అన్ని వయసుల పిల్లలకు సూఫీ టీచర్ ఇచ్చే శిక్షణను గమనిస్తా వుంటే గంట ఎప్పుడు గడిచిందో తెలిసేదికాదు. శనివారం డ్యూటీ నాది. ఆదివారం వాళ్ళ డాడీ తీసుకెళ్ళేవారు. శివాని ఆ క్లాసుల్లో నేర్చుకున్న అన్ని పద్ధతులయితే నాకు అర్థం కావు, జ్ఞాపకం లేవు కానీ, మధ్యలో కోసిన రక రకాల కూరగాయలతో వేసిన బొమ్మలు, వర్షం చినుకులతో పెయింటు పేపరు మీద తెప్పించే ఆకారాలు మాత్రం ముచ్చటగా ఉండేవి.

మా కిద్దరికీ ఈత రాదు. మా అమ్మాయి ఈదటం నేర్చుకోవాలని మాకు ఇష్టం. అదొక మంచి వ్యాయామమే కాకుండా, జీవితంలో ఎప్పటికయినా పనికొచ్చే అవ్సరం అని మా ఉద్దేశ్యం. వేసవిలో సెలవుల సమయంలో, సిటీలో చాలా హోటళ్ళలో ఈత నేర్పుతారు. పొరుగింటి పిల్లలిద్దరి వెంట అశోకా హోటల్ స్విమింగ్ క్లాసులో చేర్చినాము. ఆ ఏడు తనకు ఏడేళ్ళు. పూర్తి మూడు వారాలు వెళ్ళి ఈదటం నేర్చుకుంది తను. నెలరోజుల తర్వాత ఒక ఆదివారం “హోటల్కు తీసికెళ్తాము, స్విమింగ్ ప్రాక్టీస్ చేస్తావా?” అని అడిగినాను. “ఊ” అన్నది. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ముగ్గురం ఉత్సాహంగా తయారయి బయలుదేరాము. హోటల్ చేరుకుని ఒక గంట సేపు స్విమింగ్ చెయ్యటానికి డబ్బు కట్టి పూల్ దగ్గరికి వెళ్ళాము. బాత్రూంలోకి తీసుకెళ్ళి స్వింసూట్ వేయించాను. అంతవరకూ సరే. పూల్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ కేరింతలు కొడ్తూ ఈదులాడుతున్న పిల్లలను, పెద్దవాళ్ళను చూస్తూ అలాగే నిలబడింది. “ఊ. దిగు”, అన్నాము. “అమ్మో, భయం” అంది. కాస్సేపయాక మెల్లగా నీళ్ళలోకయితే దిగింది కానీ మెట్లకు దగ్గర్లోనే నీళ్ళ మీద తేలుతూ ఉండిపోయింది. కానీ ఈత మాత్రం కొట్టలేదు. మేమూ బలవంతం చెయ్యలేకపోతిమి. ఎందుకంటే మా ఇద్దర్లో ఎవరం తనకు సహాయం చెయ్యలేము.

మరుసటి ఏడాది మరో ప్లాను వేశాం. వేసవి ఈతక్లాసులకు శివానిని అశోకా హోటల్‌కు మళ్ళీ తీసికెళ్ళినాం. గత సంవత్సరం ఉన్న కోచ్, మనోహరే ఉన్నాడు. “ఎందుకండీ. మీ అమ్మాయి పూర్తిగా నేర్చుకుంది కదా. ప్రాక్టీసు చేస్తే చాలు, మళ్ళీ ఫీజెందుకు ఖర్చు చేస్తారు, దండగ” అన్నట్లు అన్నాడు. “అలా కాదు. తను భయపడుతావుంది. మళ్ళీ ఫుల్ క్లాసుచేస్తే కొంచం ధైర్యం వస్తుంది. మాకు ఈత రాదు. మేం సహాయం చెయ్యలేము,” అని అతన్ని బ్రతిమాలి ఒప్పించాము. ఆ ఏడు కూడా పూర్తి మూడు వారాలు మనోహర్ కోచింగ్‌లో మళ్ళీ స్విమింగ్ ప్రాక్టీసు చేసింది శివాని. అయినా దాని వల్ల ధైర్యమయితే వచ్చింది కానీ, స్విమింగ్ మీద ఆసక్తి మాత్రం పెరగలేదు. తరువాత ఎన్నో వారాలు వెళ్ళి ప్రాక్టీసు చేస్తావా అని అడిగితే, నాలుగయిదుసార్లు అయిష్టంగానే మా కోసం వెళ్ళి పూల్‌లోకి దిగేది. ఇక మేమూ అడగటం మానేశాము.

తను పెరిగే వయసులో రెండు విషయాలు గమనించాము. శరీరాన్ని కష్టపెట్టే ఆటలు వేటిలోను తనకు అభిరుచి లేదు. మనిషి వ్యాయామం లేక కాస్త బొద్దుగా తయారవుతోంది. తనకు అభిరుచి లేనివి నేర్పాలని మేం డబ్బు ఖర్చు చేసినా ప్రయోజనం లేదని ‘స్విమింగ్’ అనుభవంతో తెలిసిపోయింది. అందుకని ఏ టెన్నిస్, బాస్కెట్ బాల్ క్లబ్‌లోనో చేర్చే తప్పు మేం చెయ్యలేదు. శివాని ఏడవ క్లాసులో ఉన్నప్పుడు, పొరుగిళ్ళ అమ్మాయిలిద్దరు శ్వేత, శ్రీదేవి భరతనాట్యం నేర్చుకుంటున్నారని తెలిసింది. వారంలో మూడురోజులు నాట్యం నేర్పే మాస్టారు శ్వేత ఇంటికొచ్చి ఇద్దరికీ నేర్పుతారు. పిల్లకు కాస్త నడుం అయినా వంగుతుంది కదా అని, “డాన్స్ నేర్చుకుంటావా’” అని అడిగాను. “ఊ” అన్నది ఉత్సాహంగా. వెళ్ళి పరశురాం మాస్టారుతో మాట్లాడినాను. మరుసటిరోజే మొదలయినాయి క్లాసులు. నెలరోజులు బాగా గడిచింది. ఎవరి దగ్గరా ఫిర్యాదుల్లేవు. స్కూలుకు సంక్రాంతి సెలవులు వచ్చాయి. శ్వేత, శ్రీదేవిలను వాళ్ళ అమ్మానాన్నలు ఊళ్ళకు తీసికెళ్ళారు.

మరుసటి రోజు ఆదివారం. తొమ్మిది గంటలకు వచ్చారు మాస్టరు. ఆ వారం ఆయన వచ్చిన మూడురోజుల్లో నాకు తెలిసిపోయింది. తను నాట్యం నేర్చుకోవడానికి అంగీకరించింది, తన స్నేహితులతో కలిసి ఉండటానికే గానీ, శివానికి నౄత్యంలో అంతగా ఇష్టం ఏం పుట్టలేదని. రెండో వారం మొదలయ్యాయి తనకూ, మాస్టారుకూ పోట్లాటలు. ఆయన చెయ్యమన్నట్లు ఈమె చెయ్యదు. ఆయనకు మిగతా ఇద్దరు పిల్లలు లేనందుకు దీని వైఖరి చూస్తూ క్లాసు నడపటం కష్టంగా ఉంది. మూడో వారానికి అర్థమయింది, మాస్టారు “వద్దు, రాను” అని చెప్పడానికి మొహమాటమయి వస్తున్నారని, ఇది రోజురోజుకు ఆయనతో ఎక్కువగా గొడవలు పెట్టుకుంటోందని. మరుసటిరోజు ఆయనొచ్చినప్పుడు, నేనే చెప్పేశాను మానేద్దామని. ఆయనకు, ఫీజుతో పాటు, దక్షిణ తాంబూలాలిచ్చి దండం పెట్టి పంపించాను.

శివాని చదివిన గులాబి స్కూల్ మా ఇంటికి పదినిముషాల నడక. రోజూ ఉదయం ఆఫీసు దార్లో నేనే నా లూనా మోపెడ్ మీద లిఫ్ట్ ఇచ్చేదాన్ని స్కూలుకు. దార్లో సైకిళ్ళమీద వస్తూ కనిపించే కొందరు పిల్లలను చూసి నాకొకటి తోచింది. అమ్మాయికి సైకిల్ కొనిపెడ్తే, తనే స్కూలుకు వెళ్ళి రావచ్చు. సైకిల్ మీద మోజుతో సాయంత్రాలు, సెలవురోజుల్లో సైకిల్ వ్యాయామంగా తొక్కమని ప్రోత్సహించవచ్చు అనుకున్నాము. నాలుగోరోజు డాడీతో వెళ్ళి తనక్కావలసిన కొత్త సైకిల్ తెచ్చుకుంది శివాని. లేదనకుండా నెల రోజులు నిలిచింది ఉత్సాహం! తర్వాత వారానికి రెండు మూడు సార్లు స్కూలు టయిముకు సరిగ్గా సైకిల్ టైరు పంక్చర్ అయేది. ఇంకొక రోజు, “టైమయింది, నన్ను డ్రాప్ చెయ్” అని నావెంట పడింది. రెండుమూడు రోజులు ఇదే వరస. అయిపోయిందా సైకిల్ మోజు అనుకున్నాను. “సైకిల్ కొనిపెట్టిందెందుకు? మూలలో పెట్టడానికా?” అని కసిరాను. అంతే! వారం రోజుల తర్వాత, సాయంత్రం నేను ఆఫీసు నుంచీ వచ్చిన తర్వాత, తన కంపాస్ బాక్స్ లోపల్నుంచీ, కొంత డబ్బు తీసి నా చేతిలో పెట్టింది. “ఏంటిది?” అన్నాను. “సైకిల్ స్కూల్లో ఒకమ్మాయి కావాలంటే అమ్మేశాను,” అంది అదేదో మాములుగా రోజూ జరిగే విషయం అన్నంత సులువుగా.

ఆ రోజుల్లో కుంగ్‌ఫు, కరాటేలు కొత్తగా వచ్చాయి. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ‘మార్షల్ ఆర్ట్’ కొద్దో గొప్పో ఆత్మరక్షణ కోసమయినా నేర్చుకుని తీరాలని అనుకునేవాళ్ళం అందరూ. మా ఇంటి నుంచీ రెండు ఫర్లాంగుల దూరంలో ఉన్న క్యాథలిక్ యూత్ సెంటర్‌లో కుంగ్‌ఫు నేర్పుతున్నారని శివానే కనిపెట్టింది. వాళ్ళ డాడీ చాలా ఉత్సాహంగా తీసుకెళ్ళి కుంగ్‌ఫు క్లాసులో చేర్చారు. వారంలో రెండు రోజులు గంట చొప్పున, ఆదివారం మూడో రోజు రెండుగంటలు నేర్పుతారు. నెలరోజులు బానే వుండినాయి కుంగ్‌ఫు క్లాసులు. అందుకోసం కొనుక్కున్న డ్రస్, రెండు వారాలకే దొరికిన ఆరంజ్ బెల్టు చూసుకుని మురిసిపోయేది. రెండో నెలలో ఉత్సాహం తగ్గిపోయింది. ఇంకా ఆరునెలలు నేర్చుకుంటేగానీ పసుపు బెల్టు రాదని తెలుసుకుంది. “మాస్టరు మగపిల్లలకు బాగా నేర్పుతారు,” అని ఒకరోజు ఫిర్యాదు తెచ్చింది. “బహుశా అమ్మాయిలకు కన్సెషన్ ఇస్తున్నారేమో!” అన్నాను, అనుమానంగా. ఒక రోజు క్లాసునుంచి ఏడుస్తూ వచ్చింది. “ఏమయిందే,” అని గుచ్చి అడిగితే చెప్పింది, “ఇద్దరు అబ్బాయిలు వస్తుంటే ఏడ్పిస్తూ నా వెంట బడ్డారు” అని. “మీ క్లాసు పిల్లలేనా?” అని అడిగాను. అవునన్నట్లు తల ఊపింది. మరుసటి రోజు నుంచీ కుంగ్‌ఫుకు వెళ్ళటం మానేసింది. “నేనొచ్చి మీ మాస్టరుకు చెప్తాను,” అని చెప్పినా వాళ్ళ డాడీ కూడా తన మనసు మార్చలేకపోయారు. అలా ముగిసింది కుంగ్‌ఫు ప్రకరణం.

ఇంతవరకూ శివానికి పెరిగే వయసులో మేం నేర్పించాలని ప్రయత్నించిన అభిరుచుల్లో తను నిజంగా పెంపొందించుకున్నది చిత్రలేఖనం. తనకు నాలుగేళ్ళ వయసులో ప్రారంభించిన సూఫీ టీచర్ క్లాసులు మాత్రం తను స్కూల్ ఫైనల్ దాకా కొనసాగించింది. అదే అభిరుచి తనను ఇంజనీరింగ్ చేరేటప్పుడు ఆర్కిటెక్చర్ విభాగాన్ని ఎన్నుకోవడానికి పురికొల్పింది. నా ఇష్టమయితే తను కంప్యూటర్ కోర్సో, ఎలెక్ట్రానిక్సో తీసుకోవాలని. కానీ అప్పటికి మాకు తెలిసిపోయింది, తనకు ఎందులో అభిరుచి ఉందో అందులో తన భవిష్యత్తు చూసుకోనివ్వడమే మంచిదని. తనిప్పుడు మిస్సోరీ స్టేట్ యూనివర్సిటీ లో ఎం.ఎస్ చేసి, మ్యాడిసన్, విస్కాన్సిన్ లో ఒక కంపెనిలో ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుందంటే అప్పటి ఆ ఎన్నిక తప్పు కాలేదనిపిస్తుంది.

అప్పుడు సైకిల్ కొనిపెడ్తే దాన్ని ఎక్కి తొక్కేంత కూడా తన శరీరాన్ని కష్టపెట్టడము ఇష్టం లేక ఎవరికో సైకిల్ అమ్మేసిన సోమరిపిల్ల, ఇప్పుడు మళ్ళీ ఆఫీసుకు ఐదుమైళ్ళు వెళ్ళి రావడానికి, ఇంకా ఎక్కువగా వ్యాయామం చెయ్యడానికి సైకిల్ కొనుక్కుందంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. అంతే కాదు ఈ మధ్యే తను వాళ్ళాయనతో కలిసి, మాడిసన్‌లో ఎనిమిది మైళ్ళ క్రేజీ లెగ్స్ అనే క్వార్టర్ మారథాన్‌లో పరిగెత్తిందని తెలిసి నా చెవులను నేనే నమ్మలేకపోయాను!
---------------------------------------------------------
రచన: వింధ్యవాసిని, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment