ఊయలూగే అమ్మాయిలు
సాహితీమిత్రులారా!
మ. తమి బూదీగల తూగుటుయ్యలల బంతాలాడుచుం దూగనా
కొమరుంబ్రాయపు గబ్బి గుబ్బెతల యంఘ్రుల్ చక్కగా జాగి మిం
టి మొగంబై చనుదెంచు ఠీవి గనుగొంటే దివ్య మౌనీంద్ర నా
కమృగీ నేత్రల మీద గయ్యమునకున్ గాల్సాచులా గొప్పెడున్
పై పద్యమూ, దానిలోని ఉత్ప్రేక్ష, నారదుడికి బాగా నచ్చింది. ఆ పద్యం చెప్పినతన్ని “బళిరా, సత్కవివౌదు” అని ప్రశంసించాడు కూడా.
పూర్వకాలంలో పల్లెటూళ్ళల్లో అట్లతద్ది పండగకి వయసులో ఉన్న ఆడపిల్లలు ఊరి బయట తోటల్లోని చెట్లకు మోకులతో ఉయ్యాలలు వ్రేలాడేసుకొని పోటాపోటీగా ఊగేవారు, ‘అట్లతద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్’ అని పాడుకుంటూ. పల్లెల్లోని ఆడపిల్లలకి అంతకంటే విశేషమైన వినోదాలు గానీ, వ్యాయామం కలిపించే ఆటలగ్గానీ అవకాశాలేముండేవి? బారా కష్టా, అష్టా చెమ్మా, అచ్చనగాయలూ లాంటి ఇళ్ళల్లో ఆడుకునే ఆటలు, వెన్నెల కుప్పలు, దాగుడు మూతలు, ఉయ్యాల తూగులు లాంటి ఆటలే గదా వారికి. పండగ సందర్భంగా ఆడేవీ, ప్రత్యేకించి పోటీలు పడి ఆడేవి కాబట్టిన్నీ, పరువంలో ఉన్న ఆడపిల్లలు పాల్గొనేవి అయినందున మనోహరంగా వుంటాయి కాబట్టిన్నీ, ఇవి మరచిపోలేని విధంగా మన సంస్కృతిలో భాగాలైపోయి, తలచుకుంటుంటేనే ఆహ్లాదకరంగా వుంటాయి. పోటీలు పడి ఊగడమంటే ఎవరు ఎంత వేగంగా ఊగుతారు, ఎవరు ఎంత ఎత్తుకు ఊగుతారు అనేవి స్పర్థానిర్ణాయకాలు. అలా ఊగడంలో కాళ్ళు ఆకాశం వైపు చూపిస్తూ పైకి లేవడం — అదో సొగసు. ఆ ఆటలు నిన్నా మొన్నటి దాకా వుండేవి. ఇప్పుడెక్కడో సకృత్తుగా గానీ చూడము. పై పద్యం వ్రాసిన కవిది పదహారో శతాబ్దం. అంటే ఐదొందల యేళ్ళ క్రిందట్నుంచీ, ఆ ఆటలు ఉన్నాయనేది నిశ్చయం.
ఇంతకూ విషయమేమిటంటే నారద మహర్షి, అతని శిష్యుడైన మణికంధరుడనే గంధర్వునితో కలిసి శ్రీకృష్ణుని దర్శించుకుందామని ద్వారకకు వస్తున్నాడు. ఆయన త్రిలోకసంచారి గదా. మామూలుగా కాలినడకన గానీ, ఏదో రథాల మీద రావడం గానీ ఆయనకు కుదరదు. ఆకాశ మార్గాన సంచరిస్తుంటాడు. ఆయన చేతులో మహతి అనే వీణ ఉంటుంది. అప్పుడప్పుడూ దాన్ని మోయడానికైనా ఒక మనిషి పక్కనుండాలి. ఈ మణికంధరుడితో కలిసి, ఆకాశ విహారం చేస్తూ ద్వారక సమీపానికి వచ్చి దిగబోతుండగా క్రింద పూదోటలో చెట్లకు ఉయ్యాలలు కట్టి కొంతమంది అమ్మాయిలు ఊగుతున్నారు. “తమితో (తమకంగా) పూదీగలు తూగుటుయ్యలలు పంతాలాడుతూ,” ఊగుతున్నారు. వారేమీ పసిపిల్లలు కారు. “కొమరుం బ్రాయపు గబ్బి గుబ్బెతలు.” వారు ఉయ్యాల లూగుతుంటే వారి అంఘ్రులు (పాదాలు) చక్కగా సాగి, మింటి మొగమై (ఆకాశం వైపు) చనుదెంచే ఠీవిని చూచి మణికంధరుడికి, క్రింద ఉన్న అందాల భామలు స్వర్గంలో ఉండే దేవతా స్త్రీల మీదకి కయ్యానికి కాల్సాచుతున్నట్లున్నదట. ఆ ముక్కే పై పద్యంగా చెప్పాడు దివ్యమౌనీంద్రుడైన నారదునితో. ఊహ ఎంత అందంగా ఉందో దాని వ్యక్తీకరణ కూడా అంత సొగసు గానూ ఉంది కదా.
కొమరుంబ్రాయపు గబ్బి గుబ్బెతలు పరువం లోనూ, సౌందర్యం లోనూ నాకమృగీ నేత్రలకు (దేవతా స్త్రీలకు) ఏమాత్రం తీసిపోరు అని చెప్పడం అక్కడి సందర్భం. అక్కడ వారి కాళ్ళు మింటి మొగమై సాగుతుండడం అనేదాన్ని కయ్యానికి కాలు దువ్వడం అనే చక్కటి జాతీయంతో అన్వయించి — అప్సరసలనైనా గెలవగలము అందంలో అని చెప్పే తీరుగా ఉంది అని — వర్ణించడం మనోజ్ఞంగా వుంది. నారదుడంటే మునీంద్రుడు. మణికంధరుడేమో గంధర్వుడు. విరాగి కాడు. అందుకని అమ్మాయిలను చూడగానే కొంచెం ముచ్చట పడింది అతని మనస్సు. నారదుడు అతని ముచ్చటకు ముచ్చట పడి, “సెబాశ్, మంచి కవివోయి నువ్వు,” అని మెచ్చుకోవడమే కాకుండా ఆ ఊహకు తన ఉత్సాహాన్ని కొంత జోడించి, “కయ్యానికి కాల్సాచడం” మాత్రమేనా? “త్రైవిష్టప స్త్రీల యౌదల్ దన్నన్ జనునట్లు మించెననినన్ దప్పేమి, యొప్పేయగున్” అని ముక్తాయించాడు. అది ఇంకో పద్యమూ, ఇంకో ముచ్చటాను. అయితే నారదుని లాంటి మహానుభావుడు ఏ మాటా వ్యర్థంగా మాట్లాడడు గదా. ఆయన అన్న మాటల్లో భావి కథార్థ సూచన కూడా వుంటుంది. ఆ అమ్మాయిలను నారదుడు, మణికంధరుడే కాక అదే సమయంలో ఆకాశవిహారం చేస్తున్న రంభా నలకూబరులు కూడా చూస్తారు. నారదుడు, మణికంధరుడు మాట్లాడుకునే మాటలనీ వింటారు. క్రింద ఉయ్యాలూగే అమ్మాయిల్లో కలభాషిణి అనే అమ్మాయి కూడా ఉంటుంది. దేవతా స్త్రీలను చులకనగా మాట్లాడినందుకు రంభకు కోపం కూడా వస్తుంది. ఆ తర్వాత జరిగే కథ, అదొక అక్షరాలా అపూర్వము, అనితర సాధ్యము అయిన అద్భుత కల్పన. అది అలా ఉంచుదాం.
పై పద్యము, ఆ ఆద్భుతమైన కథ, కళాపూర్ణోదయం అనే గొప్ప కావ్యం లోనివి. కవి పేరు పింగళి సూరన.
సూరన మహా విలక్షుణుడైన కవి. కళాపూర్ణోదయం దానికదే సాటి యైన అద్భుత కావ్యం. నిజానికి సూరనను గురించి గాని, కళాపూర్ణోదయం గురించి గాని ఏదో అలా అలా మాత్రమే తెలిసిన తెలుగు సాహిత్యాభిమానులకు, కట్టమంచి రామలింగారెడ్డి గారు విపులంగా చేసిన విమర్శనము ఆ కవి ఎడా, ఆ కావ్యం ఎడాపెడా కొత్త ద్వారాలు తెరిచిందనే చెప్పాలి. వారి సమీక్ష వెలుగులో ఆ కావ్యం యొక్క అందాలను హార్దికంగా అందుకున్నారు. అప్పటినుంచీ సూరన అంటే — అనేకానేక కవుల్లో ఆయనా ఒక కవి అనీ, కళాపూర్ణోదయం అంటే అనేకానేక కావ్యాల్లో అదీ ఒకటి అని మాత్రమే అనుకోవటం ఆగిపోయి — ఆ కవి యొక్క, ఆ కావ్యం యొక్క విలక్షణతను గుర్తించడమూ, ఆనందించడమూ, మెచ్చుకోవడమూ ప్రారంభమైంది.
షేక్‌స్పియర్ వ్రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ కథకూ కళాపూర్ణోదయం కథకూ పోలికలు కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నాయని విమర్శకులు గమనించి చెప్పారు. పదహారో శతాబ్దంలో షేక్‌స్పియర్ సాహిత్యం సూరన తెలుసుకోవడానికి గాని, సూరన కవిత్వాన్ని షేక్‌స్పియర్ చూడ్డానికి గానీ అవకాశాలు ఊహించను గూడా లేము గదా. ఏకకాలంలో, వేర్వేరు ఖండాలలో ఉన్న ఇద్దరు ప్రతిభావంతులు ఒకే రకమైన కల్పనలు కావించడం – కాకతాళీయమైనా – గొప్ప సంగతే. (కళాపూర్ణోదయం సరళమైన వచనంలో ఈమాట గ్రంథాలయంలో ఉన్నది. ముఖ్యంగా వెల్చేరు నారాయణ రావు గారు సౌండ్ ఆఫ్ ది కిస్ పేరుతో ఆంగ్లంలో ఈ కథని అనువదించడమే కాకుండా, ఈ కావ్యానికున్న విలక్షణతను విడమర్చి చెప్పి తద్వారా దక్షిణ భారతదేశంలో 16వ శతాబ్దిలోనే వెలువడిన ఆధునిక నవలగా ఈ కావ్యాన్ని ఉదహరించారు.)
కళాపూర్ణోదయం దానికదే సాటి. కథ ఒక మహాద్భుతమైన కల్పన. పద్యాల్లో నిబంధించబడిన నవల అది. అలాంటిలాంటి నవల కాదు. నాలుగైదు సార్లు చదివినా ఆ కథలోని బంధాలు పట్టుకోవడం అంత తేలిక కాదు. కేవలం కథ అలా ఉంచితే కవిత్వం కూడా చాలా గొప్ప స్థాయి లోదే. సంభాషణల నిర్వహణలో సూరన, తిక్కన తోనే పోటీ పడగలుగుతాడని తెలిసిన పెద్దలు అంటారు. కవిత్రయమూ, పోతనా, శ్రీనాథుడూ సంస్కృత కావ్యాలను అనువాదం చేస్తే, పెద్దనాదులు పురాణాల్లోని ఒక చిన్న కథనో, ఘట్టాన్నో తీసుకొని అందమైన ప్రబంధాలుగా నిబంధిస్తూ వుంటే, సూరన సంపూర్ణంగా ఒక విలక్షణమైన దారి తొక్కి ఒక కొత్త ప్రయోగానికి సాహసం చేశాడు. పురాణాల్లో లేని దాన్ని స్వకపోల కల్పనం చేసి, తన శేముషితో దాన్ని ధగద్ధగాయమానంగా, ఆంధ్ర రసజ్ఞ లోకం ముందు నిలిపాడు. భట్టుమూర్తి – ఒక సాధారణీకరణంగా వ్రాసిన పద్యంలో కేవలం కల్పనా కథలు కృత్రిమ రత్నాలు అన్నాడు అది పింగళి సూరనను గురించి, కళాపూర్ణోదయం గురించే అని వుంటాడని నా అనుమానం. కళాపూర్ణోదయపు ప్రకాశానికి కళ్ళు మిరుమిట్లు గొలుపగా ఈర్ష్యతో అన్న మాటే ఇది. పురాణాల్లో లేనంత మాత్రాన అది కృత్రిమమని నిరసించడం — కొత్తదనాన్ని అంగీకరించలేక పోవడమే.
సూరన కవిత్వం చదవడం ఒక గొప్ప అనుభవం. పై పద్యము, ఆపైన నారదుడు చెప్పిన పద్యము, ఆ కావ్యం లోని వందలాది మంచి పద్యాల్లో మచ్చుకు రెండు. నారదుని పద్యం పుర్తిగా ఇదుగోండి.
బళిరా సత్కవి వౌదు నిక్కము తగన్ భావించ నీవన్నయా
యెలబ్రాయెంపు మిటారి కత్తెల బెడంగే నెందునుం గాన వా
రల డోలాచలనోచ్చలచ్చరనముల్ త్రైవిష్టప స్త్రీల యౌ
దల దన్నం జనునట్లు మించె ననినన్ దప్పేమి యొప్పేయగున్
రసజ్ఞశేఖరులైన పాఠకులకు ఈ పద్యాలు నచ్చి తీరుతాయి.
-------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment