Friday, July 19, 2019

నన్నయ్య తీర్చిన గడసరి సొగసరి


నన్నయ్య తీర్చిన గడసరి సొగసరి

సాహితీమిత్రులారా!


తే. నన్ను మున్న యెఱుంగు; దిన్నాతి నాకు
      దాసి, వృషపర్వుఁ డను మహాదానవేంద్రు
      కన్య, నాయొద్ద నెప్పుడుఁ గదలకుండు,
      ననఘ! మఱి దీని శర్మిష్ఠ యండ్రు జనులు

కథతో సంబంధం లేకుండా చదివి ఆనందించగలిగే పద్యాన్ని కిందటి నెల చూశాం కదా. దానికి పూర్తి వ్యతిరిక్తమైన పద్యమిది. దీని వెనక బోలెడంత కథ ఉంది. అది తెలిస్తే కాని యిందులోని సొగసు తెలిసిరాదు. ఇవి దేవయాని యయాతితో అంటున్న మాటలు. దేవయాని ఎవరు? యయాతి ఎవరు? శర్మిష్ఠ ఎవరు?

సంస్కృత మూలానికి కాస్తంత భిన్నంగా, ప్రత్యేకంగా, నన్నయ్యగారు తీర్చిదిద్దిన పాత్ర దేవయాని. శుక్రాచార్యుని గారాబుకూతురామె. శర్మిష్ఠ రాక్షసరాజు వృషపర్వుని కూతురు. శర్మిష్ఠాదేవయాను లిద్దరూ చిన్నప్పటినుండీ కలిసి పెరిగిన నెచ్చెలులు. అయితే ఒకరోజు చిన్న జట్టీ వచ్చి ఇద్దరికిద్దరూ ఎవరు గొప్పంటే ఎవరు గొప్పని వాదులాడుకొంటారు. శర్మిష్ఠ పొరపాటున దేవయాని దుస్తులు ధరిస్తుంది. అదీ ఆ జట్టీకి కారణం! ఆ తగువు పెరిగి పెరిగి, శర్మిష్ఠ కోపంతో దేవయానిని ఒక పాడుబడిన చిన్నబావిలో తోసేసి వెళ్ళిపోతుంది. నహుషకుమారుడైన యయాతి అనే రాజు వేటకై ఆ ప్రాంతానికి వస్తాడు. నీళ్ళకోసం వెతుకుతూ ఆ బావి దగ్గరకు వచ్చి, అందులో పడి ఉన్న దేవయానికి “జలధివిలోలవీచివిలసత్కలకాంచిసమంచితావనీతల వహన క్షమంబయిన” తన దక్షిణహస్తాన్ని అందించి ఆమెని బయటకి తీస్తాడు. అలా ఆమెని రక్షించి, తన దారిన తాను వెళ్ళిపోతాడు.

దేవయాని జరిగిన అవమానాన్ని తన తండ్రి శుక్రాచార్యునికి చెప్పి, వృషపర్వుని రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోదామంటుంది. శుక్రాచార్యుడు కూతురి మాట కాదనలేడు. ఇంతలో యీ సంగతి తెలిసిన వృషపర్వుడు శుక్రాచార్యుని దగ్గరకు వచ్చి, వెళ్ళవద్దనీ, దేవయాని కోరింది జరిపిస్తాననీ వేడుకొంటాడు. శర్మిష్ఠ, తన వేయిమంది చెలికత్తెలతో సహా, తనకు దాసి కావాలని దేవయాని కోరుతుంది. అలా విధిలేక శర్మిష్ఠ దేవయాని దాసిగా మారి ఆమెకు సేవలు చేస్తూ ఉంటుంది. ఒకనాడు విధివశాత్తూ యయాతి మళ్ళీ దేవయాని ఉన్న వనానికి వస్తాడు. “అతిశయ రూపలావణ్య విభ్రమ గుణసుందరియైన” శర్మిష్ఠని చూసి, ఆమె ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో, “మీరెవ్వరివారలు మీ కులగోత్రనామంబు లెఱుంగవలతుం జెప్పుం”డని అడుగుతాడు. అప్పుడు దేవయాని చెప్పిన సమాధానం, ఈ పద్యం.

ఈ సందర్భంలో సంస్కృత భారతంలో దేవయాని సమాధానాన్ని గమనిస్తే, నన్నయ్యగారి కూర్పులోని విశేషం చక్కగా బోధపడుతుంది. సంస్కృతభారతంలో, యయాతి శర్మిష్ఠ రూపలావణ్యాలను చూసి ఆమె గూర్చి ప్రత్యేకంగా తెలుసుకోవాలని అడిగినట్టుగా లేదు. ఇద్దరినీ చూసి వారి గురించి తెలుసుకోవాలని అడిగినట్టు ఉంది. అయితే, పూర్వం దేవయానిని నూతి నుండి బయటకు తీసినప్పుడే ఆమె గురించి యయాతికి తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ ఆమె గూర్చి అడగవలసిన పని లేదు. అయినా అడిగాడంటే, అది శర్మిష్ఠ గురించి తెలుసుకోవడానికే అయ్యుండాలి. ఈ విషయం సంస్కృతభారతంలో దేవయానికి తట్టినట్టుగా అనిపించదు. ఆమె యయాతికి యిలా బదులిస్తుంది:

ఆఖ్యాస్యామ్యహమాదత్స్వ వచనమ్ మే నరాధిప
శుక్రో నామా సురగురుః సుతామ్ జానీహి తస్య మామ్
ఇయమ్ చ మే సఖీ దాసీ యత్రాహమ్ తత్ర గామినీ
దుహితా దానవేంద్రస్య శర్మిష్ఠా వృషపర్వణః

తాను శుక్రాచార్యుని కూతురునని చెప్పి, తర్వాత శర్మిష్ఠ గురించి చెపుతుంది. సంస్కృతభారతంలో దేవయాని అహంకారిగా, పెంకిఘటంగా మాత్రమే కనిపిస్తుంది. తెలుగు భారతంలో ఆమె అసాధ్యురాలు, గొప్ప గడసరి కూడా! యయాతి ప్రశ్నలోని ఆంతర్యం యిట్టే కనిపెడుతుంది. అందుకే మొదలుపెడుతూనే, “నన్ను మున్న యెఱుంగుదు” – నేను నీకు ముందే తెలుసు, అని అంటుంది. అంటే, నేనెవరో నీకు తెలుసు కాబట్టి, నువ్వు తెలుసుకొనేందుకు కుతూహలపడుతున్నది శర్మిష్ఠ గురించని నాకు తెలిసిపోయింది సుమా అని! ఆ తర్వాత శర్మిష్ఠ గురించి చెప్పినదంతా ఇంచుమించు సంస్కృతభారతంలో ఉన్న మాటలే. కాని చెప్పిన విధానమూ, వాడిన పదాలూ, దేవయాని మాటల్లోని కాకువును స్పష్ఠంగా ధ్వనింపజేస్తాయి. గొంతులో వినబడే కాకువు చదివే పద్యంలో ధ్వనించాలంటే, కవికి శబ్దశక్తి పూర్తిగా తెలిసి ఉండాలి. వాగనుశాసనుడైన నన్నయ్యగారికి శబ్దం పైనున్న అధికారం అపారం!

శర్మిష్ఠ గురించి చెప్పడం మొదలుపెడుతూనే, “ఇన్నాతి నాకు దాసి” అని తెగేసి చెప్పింది. పైగా, సంస్కృతంలో ఉన్న ‘సఖి’ శబ్దం తెలుగులోకి రాలేదు. దేవయానికి శర్మిష్ఠపై ఉన్న తిరస్కారభావమంతా పద్యంలో ధ్వనించాలి కదా మరి. ఆ మాటతో వెంటనే యయాతి నీరుగారిపోవాలి, తాను యిష్టపడినది ఒక దాసినా అని. ఆ తర్వాత “వృషపర్వుడను మహాదానవేంద్రు కన్య” అని చెప్పింది. సంస్కృతంలో లేని ‘మహా’ తెలుగులో వచ్చి చేరింది. ఆ పదాన్ని పలికేటప్పుడు దేవయాని గొంతులో వినిపించే వ్యంగ్యమంతా అందులోని ఆ దీర్ఘం వ్యంజింపజేస్తోంది. అంతటి మహా రాక్షసచక్రవర్తి బిడ్డను దాసిగా చేసుకొన్నాను అనే గర్వం ఒక వైపు, అలాంటి నన్ను గూర్చి ఆలోచించవేమన్న పోటు మరొక వైపు ఆ మాటలో ఘాటుగా స్ఫురిస్తున్నాయి. ఆ తర్వాత, సంస్కృతంలో యత్రాహం తత్ర గామినీ అన్న వాక్యం “నా యొద్ద నెప్పుడు కదలకుండు”గా మారింది. అంటే, ఈమెని సులువుగా ఎగరేసుకు పోదామని అనుకుంటున్నావేమో, ఆ పప్పులేం ఉడకవు! అని హెచ్చరిస్తోందన్న మాట! ఆమె నీకు దక్కాలంటే, ముందు నువ్వు నా వశం కాక తప్పదన్న ధ్వని కూడా అందులో ఉంది. “అనఘ!” అనడంలో అబ్బో! ఎంత పుణ్యం చేసుకొన్నావో, ఇలాంటి దాసిపై మోజు పడ్డావు! అన్న హేళన.

ఆఖరిగా పేరు చెప్పింది. ఆ చెప్పడంలో ఎంత వాడిగా చెప్పింది! “మఱి, దీని శర్మిష్ఠ యండ్రు జనులు” అంది. మఱి అన్న పదం పాదపూరణ కోసం వేసిన వ్యర్థపదం కాదు. సరే యింక, చెప్పక తప్పదు కదా — అనే అయిష్టమంతా అందులో ఉంది. “అండ్రు జనులు” అనడంలో, బిందుపూర్వక డకారరేఫలు, శర్మిష్ఠపై దేవయానికున్న అసూయాద్వేషాలను చాలా చక్కగా మనకి వినిపిస్తాయి. ఇలా యీ చిన్న పద్యంలో, శబ్దార్థాల ద్వారా, దేవయాని ఆభిజాత్యాన్నీ గడుసుదనాన్నీ అద్భుతంగా చిత్రించారు నన్నయ్యగారు. ఈ పద్యాన్ని గురించి ఆచార్య శలాక రఘునాథశర్మగారన్న మాటలు ప్రత్యక్షరసత్యాలు: “ఈ చిన్న పద్యంలో కథ మొత్తంలో పరచుకొని ఉన్న దేవయానీ ప్రవృత్తికి సంబంధించిన ఆంతర్యాన్ని ఎంతగా కుదించి నిక్షేపించాడో భావించినపుడు నన్నయ లోతులు మనకు స్ఫురిస్తాయి.”

నన్నయ్యగారు తీర్చిన దేవయాని కథలో నాకు మరొక విశేషం కూడా గోచరించింది. దేవయాని ముందు కచుని మనసారా ప్రేమిస్తుంది. మృతసంజీవని విద్య నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుని వద్ద శిష్యునిగా చేరిన బృహస్పతి కొడుకు కచుడు. గురుపుత్రి సహోదరితో సమానమని దేవయాని కోర్కెను తిరస్కరిస్తాడు కచుడు. దానితో కృద్ధురాలై, కచుడు నేర్చిన విద్య అతనికి పనిచేయదని శాపమిస్తుంది. అధర్మంగా తనను కోరుకోవడమే కాకుండా, కాదన్నందుకు తనకి అన్యాయంగా శాపమిచ్చినందుకు, దేవయానికి బ్రాహ్మణేతరునితో వివాహం జరుగుతుందని ప్రతిశాపమిస్తాడు కచుడు. ఆ తర్వాత యయాతిని చూసి అతనిపై దేవయాని మనసు పడినట్టుగా సంస్కృతభారతం చదివితే మనకు అనిపిస్తుంది.

ద్వాభ్యామ్ కన్యా సహస్రాభ్యామ్ దాస్యా శర్మిష్ఠయా సహ
త్వదధీనాస్మి భద్రమ్ తే సఖా భర్తా చ మే భవ

అంటూ యయాతిని అర్థిస్తుంది. అలా కోరుకోవడానికి కారణం యయాతిపై ప్రీతి తప్ప మరొకటి కనిపించదు. కచుని ప్రేమించిన దేవయాని, మళ్ళీ యయాతిపై మోజుపడటం నన్నయ్యగారికి నచ్చినట్టు లేదు. యయాతికి దేవయానిపై ఆసక్తి లేదన్న అంశం స్పష్టం. మరి అలాంటివాడిని దేవయాని కోరి పెళ్ళిచేసుకోమని అడగడానికి కారణం ఏమిటి? తాను ఎలాగూ బ్రాహ్మణేతరుణ్ణి పెళ్ళాడాల్సి ఉంది కాబట్టి, యయాతివంటి మహారాజైతే బాగుంటుందని ఆమె భావించిందా? అలా అనుకొన్నా, కోరి యయాతిని పెళ్ళాడమని అడగడం దేవయాని వ్యక్తిత్వానికి అంతగా పొసగని విషయం. మూలభారత కథలో మరొక అసంగతం కూడా ఉంది. దేవయానిని నూతి నుండి వెలుపలకు తీసినప్పుడే యయాతికి ఆమె ఎవరో పరిచయం అవుతుంది. అప్పటికే యయాతి గురించి దేవయానికి తెలిసినట్టుగా ఆమె మాటల్లో వ్యక్తమవుతుంది. కాని మళ్ళీ వనంలో కలుసుకొన్నప్పుడు యయాతి శర్మిష్ఠదేవయానుల గురించి తెలుసుకోవాలని వారి కులగోత్రాలను అడుగుతాడు. దేవయాని తన వివరాలు చెప్పి, యయాతి వివరాలను కూడా అడుగుతుంది. ఇది కూడా పొసగని విషయం. ఈ అసంగతాలను పరిష్కరిస్తూ, కథని ప్రసన్నంగా నడిపించారు నన్నయ్యగారు.

“అతిశయరూపలావణ్యగుణసుందరి యయిన శర్మిష్ఠ నెఱుంగ వేఁడి” యయాతి వారి వివరాలను అడిగాడని చెప్పడం ద్వారా, యయాతి దేవయానిపై కాక శర్మిష్ఠ పైననే మనసు పడ్డాడన్న విషయం సుస్పష్టం చేశారు. అలాగే దేవయాని సమాధానంలో, ఆమె ఆ విషయం గ్రహించిందన్న అంశాన్ని చక్కగా ధ్వనింపజేశారు. ఆమె ఆభిజాత్యమూ, శర్మిష్ఠ పట్ల ఆమెకున్న ఈర్ష్యా తిరస్కారమూ కూడా స్పష్టంగా తెలుస్తున్నాయామె మాటల్లో. తనని కాదని తనకు దాసి అయిన శర్మిష్ఠను యయాతి వంటి మహారాజు చేపట్టడం దేవయాని సహించలేని విషయం. దానికి విరుగుడు ఒక్కటే, యయాతిని తానే పెళ్ళాడటం. యయాతి ప్రశ్న అడిగిన క్షణంలోనే యిదంతా దేవయాని మనసులో ఆలోచించుకొన్నది. సమయం వృధా చేయదలుచుకోలేదామె. అందుకే, తన వివరాలు చెప్పడం కాని, యయాతి గురించి అడగడం కాని ఏమీ చెయ్యదు. శర్మిష్ఠ గురించి చెప్పిన వెంటనే, యయాతి తనను వివాహమాడాలని కోరిందామె. అది కూడా అభ్యర్థన కాదు, ఆదేశం! ఆ జాణ పలుకులు ఎలా ఉన్నాయో చూడండి:

నిగ్రహ మేది నన్నుఁ దరణిప్రభ! కూపము వెల్వరించు నాఁ
డుగ్రమయూఖసాక్ష్యముగ నున్నతదక్షిణపాణిఁ జేసి భూ
పాగ్రణి! నాదు దక్షిణకరాగ్రము వట్టితి, కాన మున్న పా
ణిగ్రహణంబు సేసి, తది నీయెడ విస్మృతిఁ బొందఁ బాడియే!

ఇదీ నన్నయ్యగారి దేవయాని! మొదలుపెడుతూనే నిష్ఠూరాలు! తప్పంతా యయాతిపై తోసేసింది. తనను రక్షించడంలో అతను నిగ్రహాన్ని కోల్పోయాడట! అంటే ఏమిటి? నేనేదో అడిగితే మాత్రం, నువ్వు కన్యవు, నేను నిన్ను తాకడం న్యాయం కాదు – అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోవాలా? ఇక్కడ, నిగ్రహము అంటే నింద, అవమానం అన్న అర్థంలో, నిగ్రహము ఏది – అంటే, నా అవమానాన్ని తొలగించి – అనే అర్థాన్ని తి.తి.దే. వారి ప్రతిలో యిచ్చారు. “నిగ్రహమేద” అనే పాఠాంతరం కూడా ఉందని, అది మరింత ఉచితమని కూడా అన్నారు (నా అవమానం తొలగిపోయేటట్టుగా నన్ను నూతినుండి బయటకు తీసావని.) కాని “నిగ్రహ మేది” అంటే – నీ నిగ్రహాన్ని కోల్పోయి, రక్షించే నెపంతో పరాయి స్త్రీ చేయిపట్టుకున్నావు, అనే అర్థమే నాకు సరైనదని అనిపిస్తోంది. శలాకవారు తమ భారత ధ్వని దర్శనము అనే గ్రంథంలో కూడా యిదే అర్థాన్ని యిచ్చారు. ఆ రోజు నన్ను బావినుండి బయటకు తీసే సందర్భంలో సూర్యుని సాక్షిగా నీ ఉన్నతమైన దక్షిణహస్తంతో నా దక్షిణహస్తాన్ని పట్టుకున్నావు. కాబట్టి ముందే నన్ను పాణిగ్రహణం చేశావు. అది నువ్వు మరచిపోవడం న్యాయమా? అని యయాతిని నిలదీసింది! కచుణ్ణి వివాహమాడమని కోరినప్పుడు “వివాహము నీకు నాకు మున్ భావజశక్తి నైనయది” అని చెప్పింది. యయాతితోనేమో “ఉగ్రమయూఖసాక్ష్యముగ మున్న పాణిగ్రహణమయిందని” అంటున్నది. అదీ దేవయాని గడసరితనం. సూర్యుడు సర్వసాక్షి. అగ్నిస్వరూపం. కాబట్టి అగ్నిసాక్షిగా తమ పాణిగ్రహణం జరిగిపోయిందని తిరుగులేని తర్కాన్ని ప్రయోగించింది. ఈ పాణిగ్రహణానికి యింతటి వైశిష్ట్యం ఉండబట్టే, ఆ సన్నివేశం పాఠకుల మనసులలో ముద్రపడిపోయేలా, జలధివిలోలవీచి… అనే అద్భుతపద్యంలో దాన్ని వర్ణించారు నన్నయగారు. పాణిగ్రహణంబు అనే పదంలో ‘గ్ర’కారం ప్రాసస్థానంలో ఉండడం, దేవయాని ఆ విషయాన్ని నొక్కి చెప్పడాన్ని స్పష్టంగా వ్యంజింపజేస్తుంది. ఇది నన్నయగారి శబ్దాధికారానికి మరొక మచ్చుతునక. చివరిగా, “అది నీయెడ విస్మృతి పొంద పాడియే” అనడంలో, అది మరిచి నువ్వు శర్మిష్ఠపై మోజుపడడం నీకు తగదన్న నిష్కర్ష చక్కగా ధ్వనిస్తోంది.

ఈ సన్నివేశమంతా నన్నయగారి ప్రసన్నకథాకలిత అర్థయుక్తికి ఒక మంచి ఉదాహరణ. మహాభారతం ఆదిపర్వంలోనూ అరణ్యపర్వంలోనూ అనేక ఉపకథలు వస్తాయి. ఆ ఉపాఖ్యానాలన్నిటినీ నన్నయగారు ఎంతో ప్రసన్న గంభీరంగా తీర్చిదిద్దారు. లోనారసి చూసేవారికి ఆయన కథ నడిపే తీరులో, పాత్రల స్వభావస్వరూపాలను అర్థవంతమైన మాటలద్వారా రూపుకట్టే రీతిలో, ఎన్నెన్నో విశేషాలు దర్శనమిస్తాయి. తవ్విన కొద్దీ ఊరే అమృతజల నన్నయగారి కవిత్వం. అందులోని మరిన్ని లోతులను మరోసారి పరిచయం చేసుకొందాం.
------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

2 comments:

  1. అద్భుతమైన మనోహరమైన వ్యాఖ్య!
    భైరవభట్ల వారికి అభినందన పూర్వక నమోవాకాలు!

    ReplyDelete
  2. భైరవభట్ల కామేశ్వరరావు గారి వ్యాసం చదువుతుంటే మంచి కధ వింటున్నట్లు ఉంటుంది. Thanks for the post.

    ReplyDelete