Friday, July 5, 2019

ఏటి గట్టున ఇల్లు


ఏటి గట్టున ఇల్లు
సాహితీమిత్రులారా!

“హమ్మయ్యా! పార్కొచ్చేసింది.” ఇంటి నించి పరుగులు పెట్టుకుంటూ ఇక్కడివరకొచ్చి, రొప్పుతూ ఆగాను. అటు రన్నింగూ కాదు, ఇటు జాగింగూ కాని ఎక్సర్‌సైజ్ చేస్తుంటానిలా, రోజూ సాయంకాలాలు. లేక పోతే తోచదు. ఒక్క రోజు మానేసినా, శరీరం కొండలా అయిపోయిందన్నట్టు ఒకటే ఫీలింగ్, నన్ను నిద్ర పోనీదు. ఆఫీస్ నించి ఇంటికొచ్చి, అమ్మ టీ ఇస్తానన్నా వద్దని వచ్చేశా. సరిగ్గా ఇంటి నించి, ఇక్కడికి ఓ అరగంట పడుతుంది అంతే.

మా వీధికి నాలుగు వీధులవతల, అతి పెద్ద మైదానం, ఇక్కడ్నించి అంతం దాకానూ, పచ్చిక పరచుకునుంటుంది. ఇహ ఇక్కడితో వూరే ఆగిపోయినట్టుంటుంది. అవతల ఏముందో తెలీదు. వరసగా చెట్ల గుంపులు మాత్రం కనిపిస్తాయి, దట్టంగా దడి కట్టేస్తూ. నేను కూర్చున్న చోటే పిల్లలాడుకునే పార్క్! మరి కొంచెం దూరంలో వాలీబాల్, స్కేటింగ్ కోర్ట్స్ వున్నాయి. ఎదురుగా విశాలమైన చోట, నెట్లు కట్టుకుని టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తుంటారు. పిల్లలతో బాటు పెద్ద వాళ్ళూ వస్తారు. ఇంకా, పసిపిల్లలనేసుకుని కొందరు, కుక్క పిల్లలనెత్తుకుని మరి కొందరూ కనిపిస్తుంటారు. మరో పక్క స్టేడియం వుంటుంది. కూర్చుని చూసేందుకు వీలుగా బ్లీచర్స్. ప్లాట్ఫాం మీద వరస చెక్క బెంచీలు, గుంపులుగా కూర్చునే వారికేమో, రంగు రంగు గొడుగులు, వాటి కింద గుండ్రని టేబుల్స్. ఇంతింత పెద్ద పెద్ద గ్లాసులలో స్ట్రాలేసుకుని తాగేస్తూ ఆట చూడ్డంలో నిమగ్నులై పోతుంటారు. స్ట్రాలర్స్‌లో పసి కూనలు సైతం కిక్కురుమనకుండా ఎలా వుంటారో ఆశ్చర్యమేస్తుంది. తొంభై యేళ్ళ ముసలి వాళ్ళని కూడ వీల్‌ఛైర్‌లో కూర్చోబెట్టుకుని మరీ తీసుకొస్తారు, ఇక్కడేదో మహాద్భుతం జరిగిపోతున్నట్టు.

నాకు మా బామ్మ గుర్తొచ్చింది. ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ, ఆరోగ్యంగా తిరుగుతున్నా కూడా, పాపం! ఎక్కడికీ ఆవిణ్ని మేమెవ్వరం తీసుకెళ్ళిన పాపాన పోలేదు ఇంట్లో వాళ్ళం. ఆవిడ పడిపోతే, మంచాన పడుతుందేమోనని ముందు జాగ్రత్త! ఆవిడకేమో అన్నిచోట్లకీ రావాలనీ, అందర్నీ చూడాలనీ వుండేది. అమెరికన్లు ఈ విషయం లో భలే నచ్చేస్తారు నాకు.

ఈ స్టేడియం వెనకంతా దట్టమైన చెట్లతో చిక్కటి అడవిలా వుంటుంది. దూరం నించి చూస్తే, నల్లటి నిశ్శబ్దాన్ని కప్పుకుని, నావైపే చూస్తున్నట్టు, భయమనిపిస్తుంది. నా చెవులకేదో ఒక అపస్వరం లీలగా వినిపిస్తూ వుంటుంది. అందుకే నేనటుకేసి చూడను. అటుకల్లా వెళ్ళను.

చల్ల గాలి తెరతెరలు తెరలుగా వచ్చి, వింజామర్లు వీస్తుంటే, అలుపు తీర్చుకుంటున్నా. ఇంతలో ఒక చైనా అమ్మాయి, నా ముందు నించి ఆ అడవి లోకి ట్రెకింగ్‌కి పోతోంది. ఈ బక్క ప్రాణి అందులో చిక్కుకు పోతే ఎలా అనిపించింది. వొద్దని చెప్పబోయి ఆగిపోయాను. మనకెందుకొచ్చిన గొడవలే పోనీ అని. ఎందుకంటే ఆమె వెళ్ళే దారితో నా కొక చేదు అనుభవం వుంది. నేను కూర్చున్న చోట్నించి, ఎడమ వైపుగా, లోతు కల్లా ఒక తారు రోడ్డుంటుంది. ఎంచక్కా మెలిక తిరిగి, పడుచు దాని నడుము నునుపులా! బాగుంది కదాని వెళ్ళామో చుట్టేస్తుంది పాములా. అదే ట్రెకింగ్ లేన్‌కి దారి. అలా వెళ్ళి, కాస్త కుడి వైపుకు తిరుగుతామో లేదో, అబ్బ! వొణుకు పుట్టి పోతూ… చిక్కటి అడవి తేల్తుంది. రోడ్డుంది కదాని అలానే పడి పోయామో హమ్మో, అరణ్యమే అరణ్యం! హబ్బ, చెప్పొద్దూ, ఠారెత్తి పోతుంది.

ఆ రోజేమైందనీ! రఘుతో కలసి వెళ్ళినప్పుడు?

లోపలకెళ్తూనే వొద్దనుకున్నాను, కానీ తీరా రఘు ముందుకెళ్తుంటే రానని చెబితే బాగోదేమోని, అనుసరించాను. ఒక్క మనిషీ లేడు. చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు, వాటిని అల్లుకున్న తీగలు, ఇంకో నాలుగడుగులేస్తే, అదేమిటో నీళ్ళ చప్పుళ్ళు. చెక్క వంతెన కిందనించీ గులకరాళ్ళ మీద దొర్లుకుంటూ పోతున్నాయి. కాస్త ముందుకు వంగుని చూద్దును కదా, చీకటి చిమ్మ చీకటి అక్కడంతా గుండె గుభేల్మనేలా! చిక్కటి నల్ల పొదల్లోంచి, రెక్కలార్చుకుంటూ పిట్టల శబ్దాలు. వుండుండి గొంతులోంచి గోలీకాయని గల గల లాడిస్తూ పేరు తెలీని పక్షుల గరగరలు. హమ్మో! ఒక్క అడుగు ముందుకు పడితే ఒట్టు. సడి లేకుండా పాకుతున్నా, పాము కదలికలకి ఎండుటాకుల చప్పుడు ఎంత భీకరంగా వుంటుందో… మాటల్లో కాదు, ఇలా నా చేతులు చల్లబడటంతో తెలిసొస్తోంది.

“నా వల్ల కాదు. ఇక నే ఒక్కడుగు కూడా వేయలేను. నే పోతున్నా,” అంటూ పాదాలు వెనక్కి తిప్పినప్పుడు రఘు ఎలా ఎలా నవ్వాడు ఘొల్లున! ఆ నవ్వు ప్రతిధ్వనిస్తూంటే ఎంత కఠోరంగా వినిపించిందనీ!

“రఘూ! ప్లీజ్ నవ్వకు. అసలే నాకు భయంగా వుంది. నేనిక రాలేను. పద పోదాం,” అన్నాను బిక్కుబిక్కుమంటూ చుట్టూ కమ్ముకుపోతున్న చీకట్లను చూస్తూ.

అతనొక్కసారిగా చూశాడు. “ఇప్పుడేగా, ఇంతకు ముందేగా నా కిష్టమైన పాట పాడి వినిపించిన నువ్వేనా ఇప్పుడిలా ముసలి గొంతుతో వొణుకుతూ మాట్లాడుతోందీ?” అంటూ నన్ను నిలదీస్తున్నట్టున్నాయి ఆ చూపులు.

నా చేతుల్ని తన చేతుల్లో బిగిస్తూ, నాకెదురుగా నిలబడి, మొహం లోకి గుచ్చి గుచ్చి చూస్తున్నాడు. చల్లబడ్డ చేతుల్ని చూసి అతనెంత మాత్రం చలించక పోగా, పైపెచ్చు కోపంగా చూస్తున్నాడు. అతని కళ్ళ మీదే నా చూపంతా. అవి క్షణ క్షణానికి పెద్దవౌతున్నాయి. అప్పటి దాకా తను గమనించలేదు కాని, ఆ కళ్ళు రక్తం పూసుకున్నట్టు ఎర్రగా ఎర్రెర్రగా చిక్కటి రంగుల్ని మార్చుకుంటున్నాయి. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు నా చెంపల మీద పడి నిప్పులూదుతున్నాయి. మొత్తానికి అతను ఎప్పట్లా లేడు. పైగా అతి భయానకంగా, నేనింతకుముందెన్నడూ చూడని వాడిలా, ఓ విలన్‌లా కనిపిస్తున్నాడు.

” ర… ఘూ…” పిలిచానో లేదో తెలీడం లేదు. గొంతులోంచి మాట రాక ముందే, గుటక పడినట్టుంది.

“ఏమిటిది? ఎందుకు, ఎందుకనీ ఇలా భయపడుతున్నావ్? ఆఁ? నాతో రావడం ఇష్టం లేదా? చెప్పు! నేనేమైనా దయ్యాన్నా? భూతాన్నా? నిన్ను తినేస్తానా? చెప్పు! చెప్పమంటుంటే” గద్దిస్తున్నాడు.

అసలే పెనుగాలికి పుల్లలా వూగుతున్న నేను ఒక్క సారిగా బెంబేలెత్తి పోయాను. ఇదేమిటీ రఘు హఠాత్తుగా ఇలా మారిపోయాడు. అడవి మధ్యలో అతన్ని కానీ ఏదైనా దుష్ట శక్తి ఆవహించిందా? అయి వుండొచ్చు. లేకుంటే, ఎప్పుడూ లేని ఈ వింత ప్రవర్తనేమిటీ? ఇప్పుడెలా? తను పిలిచినా పలికే దిక్కే లేదే! ఇనుము పట్టు లాటి అతని చేతుల్లో నా అర చేతులు క్రమక్రమంగా బిగుసుకుపోతున్నాయి. అలా, ఈ మొత్తం శరీరాన్నంతా కూడా బిగించేసి, చంపేసి కాని పోతాడా? హమ్మో.

ఏదైతే అదైంది అనుకున్నా. ప్రాణం మీద తీపి నాకెక్కడ లేని శక్తినిచ్చింది. అంతే ఒక్క సారిగా శివమెత్తిన దాన్లా ఒకే ఒక్క విసురుతో చేయి విడిపించుకుని, వెనక్కి పరుగందుకున్నాను. ఎలా అంటే, ఎంత వేగమంటే, ..గాలితో సమానంగా. భూమికి పాదాలు తాకడం లేదు. నేలకీ, నింగికీ మధ్యన తేలుతున్నా. అనుకోని సంఘటన కావడంతో, రఘు ఖంగు తిన్నట్టున్నాడు ఓ సెకను కాలం పాటు. ఆ తర్వాత, నా పేరెట్టి పిలుస్తూ… హేయ్, ఆగు, ఆగు.” అంటూ తనూ పరుగు తీస్తూ వస్తున్నాడు నా వెనకే. లాభం లేదు. ఈ వేగం చాలదు. ఎందుకంటే నాకు మించి వేగంగా పరుగు తీస్తున్నాడు. అందుకే అంటారు దెయ్యం బలమని. అలా అనుకోగానే నాకింకా ఖంగారు పుట్టుకొచ్చింది.

రెట్టింపు వేగంతో పరుగులు తీసి తీసి, హమ్మయ్య, ఎలాగో అలా అదిగో సరిగ్గా ఆ నున్నటి మెలిక మీదకొచ్చి, రొప్పుతూ నిలబడి పోయాను. దూరంగా జనాలు కనిపిస్తున్న ధైర్యంతో, ఆగి రొప్పుతున్నాను. వచ్చి పడ్డానే కానీ, ఊపిరి అందడం లేదు. నా శ్వాస నాకే ఒక తుఫాను గాలిలా వినిపిస్తోంది. గుండెలు కొట్టుకుంటున్నాయో, ఆగిపోయాయో తెలుసుకోలేక పోయాను. అతి భయంకరమైన టెన్షన్ నించి నన్ను నేను డైవర్ట్ చేసుకోవడం కోసం అంకెలు లెక్క పెడుతున్నాను. వన్, టూ, త్రీ…

హబ్బ! ఎంత భయానకమైన అనుభవం! ఇదంతా రఘు మూలానే!

అదిగో వస్తున్నాడు. పరుగులెత్తుకుంటూ వస్తున్నాడు. అసలతను మామూలుగా నడుస్తుంటేనే అతని వేగాన్ని అందుకోలేదు తను. అలాంటిది అతని పరుగు వేగానికి అందకుండా వచ్చిందంటే, ఎంత వేగంగా పరిగెత్తి ఉంటాను?

“ఏంటి నందా, హబ్బ! చచ్చా నీ వెనక పరుగెత్తలేక,” అతనిప్పుడు మామూలుగానే కనిపిస్తున్నాడు. మరి ఇందాకేమిటి అలా… కనిపించాడు? అతి భయాతి భయంకరంగా? పరీక్ష గా చూశాను అతని ముఖం లోకి.

“ఏమిటీ అలా చూస్తున్నావ్? ఇందాక బాగా భయపడి పోయావు కదూ?నేనే, కావాలనే నిన్ను ఏడిపించాలని…” అంటూనే, నన్ను చూసి పడీ పడీ నవ్వడం మొదలు పెట్టాడు. అలా ఎడ తెరిపి లేకుండా నవ్వుతూనే మాట్లాడుతున్నాడు.

“అస్… అస్సలు అప్పుడు నువ్వెలా బెదిరిపోయావో తెలుసా? నీ మొహం చూస్… చూస్తే… కె… కెమెరా వుంటే… ఎంత…” అతను పూర్తి చేయలేక పోతున్నాడు. అంతగా పడీ, పడీ నవ్వుతున్నాడు. అంటే? తను పడ్డ నరక యాతన అతనికంత నవ్వునిచ్చిందా? పైగా, కావాలనే భయ పెట్టాడా? తను కట్టెలా బిగుసుకుపోతుంటే గుండాగిపోయే పరిస్థితికి అతనికి నవ్వెలా వస్తోంది? ఇతన్ని ఏమనాలి?

“అదేమిటీ నందా, నీ చేతులు అలా మంచు కట్టెల్లా..” అతను ఇంకా నవ్వుతున్నాడు.

పట్టలేనంత ఆవేశమొచ్చేసింది. నాకు తెలీకుండానే, పెదాలు వొణుకుతున్నాయి. నాకు తెలీకుండానే చేయి చాచి చెంప మీద బలంగా కొట్టాను. అతను షాకయ్యాడు. “ఏమనుకుంటున్నావ్? నవ్వులాటనుకుంటున్నావా? ఒక్క క్షణం ఆలస్యమైనా, భయంతో నా ప్రాణాలు పోయేవి. నీకది తెలుసా?” దుఖంతో గొంతు కీచుమంది.అతను అలాగే నిలబడి పోయాడు. రాయిలా. నేనిక అతని వైపు చూడ దలచుకోలేదు. నాలుగడుగుల్లో పార్కింగ్ ప్లేస్ కొచ్చి పడ్డాను. ఆ తర్వాత కార్లోకీ! మరు క్షణంలో నేనక్కడ లేనే లేను.

ఆ మర్నాడు ఆఫీస్ కొచ్చాడు. ముభావంగా వున్నాడు. నేనే అతన్ని పలకరించాను. వాఫెల్ హౌస్ కి తీసుకెళ్ళాను. ఏం మాట్లాడుకోవాలో ఇద్దరికీ తెలీలేదు. చేయి చేసుకున్నందుకు నేను సారీ చెబుతానని బహుశా అతను ఆశిస్తున్నాడేమో అనిపించింది. నాకైతే, అతను నాకు సారీ చెప్పడమే సబబుగా తోస్తోంది. ఇద్దరం ఓ అరగంట తర్వాత, బయట కొచ్చేశాం. ఆ తర్వాత ఓ నెల తర్వాత కలసి చెప్పాడు. అతనికీ టౌన్ నచ్చలేదట. ఎందుకన్న నా ప్రశ్నకి అతని జవాబు మరీ విపరీతం అనిపించింది. ఇక్కడ దేశీలు ఎక్కువగా కనిపిస్తున్నారట. అందుకని, కంపెనీ మారి, వేరే స్టేట్‌కి వెళ్ళిపోతున్నట్టు చెప్పాడు.

అదేమిటీ, మరి నేను? అడగబోయి ఆగాను. వెళ్లగానే మెయిల్ చేస్తానన్నాడు. మౌనంగా తలూపాను. తను వెళ్ళిపోయాడు. రెండు సార్లు ఫోన్ చేశాను. అతను బిజీగా వున్నానన్నాడు. మెయిల్ చేశాను. రిప్లై ఇవ్వలేదు. ఇక నన్ను వొద్దనుకుంటున్నాడని అర్ధమైంది. కానీ, నాలుగేళ్ళు నన్ను ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డ మనిషి, ఇలా ఎలా మారిపోయాడు? అతను నాకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అతనితో నేనెప్పుడు ప్రేమ గురించిన సంగతులేమీ మాట్లాళ్ళేదు కాబట్టి. అసలతన్ని నేను ప్రేమించానా? ఏమో, కాకుంటే, పెళ్ళి చేసుకోడానికే వెనకాడుతూ వచ్చాను.

ఎందుకో, అతనిలో ఒక సైతాను వున్నాడని మనసుకి గట్టిగా తోచేది. నిజానికి అతనో పెద్ద ఈగో ఉన్న మనిషి! అతనూ ఒప్పుకున్నాడు ‘ఐతే, తప్పేమిటీ’ అంటూ. అందుకని అతను నాకు ఓ నెగెటివ్ షేడ్‌లో కనిపిస్తూ వుండొచ్చు అని సరిపెట్టుకున్నాను కానీ, కాదు. కాదని తెలిసిపోయింది. ఈ సంఘటనతో అతనిలో వున్న అసలైన షేడ్ కళ్ళారా చూశాను. పోనీ, ఒక్కసారి ఫోన్ చేసి, సారీ చెప్పేస్తే అతను సంతోషిస్తాడేమో కదూ? మనసు ససేమిరా ఒప్పుకోవడం లేదు.

ఉలిక్కిపడ్డాను వేల చెట్ల కొమ్మలన్నీ కలిసి, ఒక్కసారిగా వూగిన గాలి హోరుకి. ఆలోచన లోంచి చటుక్కున బయటకొచ్చి పడ్డాను. అప్పటికే ఆలస్యమై పోయింది. ఆకాశం నల్లగా కప్పేసుకుని పోయింది. మెరుపులు వెంటవెంటనే మెరుస్తున్నాయి. మరో పక్క పిడుగుల శబ్దాలు. విపరీతపు గాలి, అడుగు అడుగుకీ ఫర్లాంగు దూరం చొప్పున తోస్తున్నంత వేగంగా వీస్తోంది. ఈ వూళ్ళో ఇంతే. పగలు ఎండ. మధ్యాహ్నం మబ్బులు, సాయంత్రం వర్షం, రాత్రి వెన్నెలలు. భలే వుంటుంది ఇంట్లో వున్నప్పుడు. కానీ, ఇప్పుడిలా బయటకొచ్చినప్పుడు, అందులో ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రకృతి బీభత్సానికి పరిస్థితి ఎలా వుంటుందో అనుభవం లోకొస్తోంది. అసలింత ముప్పు వస్తుందని నేను ఊహించనైనా ఊహించలేదు.

అక్కణ్నించి చటుక్కున లేచి, గబ గబా అడుగులేస్తున్నాను, ఇంటికెళ్లడం కోసం. అప్పటికే, మైదానం నించీ కార్లు పరుగులు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. రబ్బరు బొమ్మల్ని విసిరేస్తున్నట్టు, పిల్లల్ని గబ గబా కార్లల్లో వేసుకుని వెళ్ళిపోతున్నారు. అబ్బో! ఎంత గాలి బాబోయి! పిచ్చి గాలి బలమంతా నా మోకాళ్ళ మీద పడటంతో నన్ను నేను బాలెన్స్ చేసుకోలేకపోతున్నా. వెనక్కి పడిపోకుండా, అతి కష్టం మీద నిలబడే ప్రయత్నం చేస్తున్నా.

అరే, ఇదేం విపరీతం? పది నిమిషాల్లో ఇంత ఘోరమా? చినుకులతో మొదలవ్వాల్సిన వర్షం వడగళ్ళతో మొదలైంది. నా ముఖం మీదకొచ్చి పడుతున్న వాన చినుకులు ఇనప గుళ్ళలా తగిలుతున్నాయి. నిమిషాల్లో కార్లన్నీ మాయమై పోయాయి. ఇప్పుడక్కడంతా, వర్షంతో నిండిపోతున్న మైదానం, నేనూ తప్ప ఒక్క పిట్ట కూడా లేదు.

అంటే, మైదానమంతా ఖాళీ. వెనక్కి తిరిగి చూస్తే మాత్రం ఏం కనిపిస్తుంది? అంతా చీకటి! భయంకరమైన అడవి. ఇప్పుడెలా? ఎక్కడా ఆగడం? పది నిముషాలు నడిస్తేనే కానీ ఇళ్ళున్న ప్రదేశం రాదు. పది కాదు కదా, ఒక్క నిమిషమైనా నడిచేలా లేదు పరిస్థితి. అంతకంతకీ అధ్వాన్నమైపోతోంది వాతావరణం. ఆ స్టేడియం దగ్గరే ఆగి, ఆ గొడుగుల కింద నిలబడాల్సింది. అవెప్పుడో గాలికి కొట్టుకొని పోయుంటాయి. ఉన్నా కూడా అమ్మో! ఒంటరిగా ఈ తుఫాను వర్షంలో ఆ అరణ్యం పక్కనే? ఊహు. తన వల్ల కాదు. దానికంటే, ఈ నడకే ఉత్తమం.

నడుస్తున్నాను ఒక్కో అడుగూ వేసుకుంటూ. హఠాత్తుగా అనిపించింది నేను దారి తప్పిపోయినట్టు. అవునూ, నేనెటు వస్తూంటా? రోడ్ కనిపించదే? ఇదేమిటీ? కాళ్ళ కింద ఈ చెక్క వంతెన? గుండె గుభేల్మంది. సరిగ్గా అప్పుడే మెరిసిన ఓ పెద్ద మెరుపులో వంతెన కింద నీళ్ళ ప్రవాహం కనిపించింది. ఇది నేను అప్పుడు చూసిందే కదా! ముందుకెళ్ళబోయి, వెనక్కెలా వచ్చానూ? పరుగు తీశాను. వెనక్కి బదులు, మళ్ళీ ముందుకే. వంతెన దాటేశాను. కాళ్ళకి తారు రోడ్ గట్టిగా తగులుతోంది.

ఇంకా ముందుకి అలా పరుగులు తీస్తూనే వున్నా వర్షపు ధారల్లో. అడవి మాయమైనట్టుంది. ఉరుమొచ్చినప్పుడల్లా మెరుస్తోన్న వెలుగులో ఒక ఇల్లు కనిపిస్తోంది దూరంగా. అది ఇల్లౌనో కాదో తెలీదు. లైట్ వెలుగుని బట్టి అది ఇల్లనే అనుకుంటున్నా. ఇక అరక్షణమైనా ఆలోచించకుండా అటుగా పరుగందుకున్నా.

హమ్మయ్య, అది ఇల్లే.

అరుగుల వసారా ఇల్లు. వరండాలో లైట్ లేదు. లోపల కాంతి అద్దల్లోంచి పలచగా పరచుకునుంది. తనెవరికీ కనపడే చాన్స్ లేదు. చెక్క కుర్చీ లో కూలబడి, రొప్పుతున్న శబ్దాలు వినపడకుండా వుంటం కోసమని, రెండు అర చేతులు దోనె చేసి, నోటికి అడ్డంగా చేర్చాను. ఇంతలో సన్నగా తలుపు తెరుచుకున్న శబ్దమైతే, గభాల్న తలెత్తి చూశాను. ఆ ఆకారం, లోపల్నించి కాదు, బయట నిలబడి కనిపిస్తోంది. ఎంతో మృదువుగా “హలో” అంటూ, సంజాయిషీగా చెబుతోంది.

“మీరు రావడానికి ముందే నేనిక్కడున్నా. సడన్‌గా పలకరిస్తే భయ పడతారని…” అంటూ అతనా వెలుగులో నిలబడి చెబుతున్నాడు ఇంగ్లీష్‌లో. ఎంత సున్నితమైన మనస్తత్వం గల వాడు! అతను అన్నది అక్షరాలా నిజం. చీకట్లోంచి ‘హూ ఈజ్ ఇట్’ అని మెల్లగా అన్నా, తనకి గుండాగి పోయేదే కదూ? సరిగ్గా రూపం కనిపించడం లేదు, మనిషిని చూద్దామంటే. అభినందిద్దామంటేనూ.

“లోపలకి రండి” ఆహ్వానిస్తున్నాడు ఎంతో మర్యాదగా. నన్ను నేను చూసుకున్నాను. తడిసి ముద్ద అయిన బట్టలు వొంటికి అతుక్కుపోయి వుండటంతో ఉలిక్కిపడ్డాను. తడబడుతూ రెండు చేతుల్ని క్రాస్ గా చేసుకుంటుంటే, తన ఇబ్బందిని గ్రహించిన వాడిలా, “లోపల మా మదర్ వుంది. పిలుస్తానుండండి,” అంటూ అతను లోపలకి వెళ్ళాడు.

కాసేపట్లోనే వాళ్ళ మదర్ బైటికి వచ్చింది. “హలో! మై డియర్ చైల్డ్” అంటూ ఆప్యాయంగా పలకరించింది. నా భుజాల మీంచి ఒక వెచ్చని ఉలెన్ త్రో కప్పి, “క్రిస్ అంతా చెప్పాడు, పర్వాలేదు, రా. లోపలకొస్తే, బట్టలు మార్చుకోవచ్చు,” అంది నవ్వుతూ.

వెళ్ళనా వొద్దా? భయాన్ని ఖాతరు చేసే స్థితి లో లేను. చలికి బిగుసుకుపోతున్న శరీరం వెళ్ళమంటూ ముందుకు తోసింది. లోపల రూం లోకెళ్ళి, ఆవిడిచ్చిన డ్రస్ వేసుకున్నాను. తడి బట్టలు డ్రైయర్ లో వేశాను. క్రిస్ వైపు కృతజ్ఞతగా చూశాను. నేనేమీ అడగక ముందే నాకు కావల్సినవి అమర్చి పెడుతున్నందుకు! ఇతను నా మనసుకి దగ్గరగా వున్నాడు అనిపించింది ఆ క్షణంలో బాగా.

“కాసేపట్లో రెడీ అవుతాయి. ఇంతలో డిన్నర్ చేద్దాం,” అతనే మళ్ళీ, నవ్వుతూ. అతను చక చకా డైనింగ్ టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేస్తున్నాడు. అలా సర్దుతూనే మాట్లాడుతున్నాడు.

అతని పేరు క్రిస్. తల్లి ఇటాలియన్. తండ్రి అమెరికన్. తల్లి వంట నచ్చి, ఆమెని వివాహమాడాట. తనని కాకుండా, తన వంటని ప్రేమించాడని తల్లెప్పుడూ దెప్పుతుందట. ‘నన్ను దోచుకుంది నీ అందం అని నేనెప్పుడైనా చెప్పానా డియర్’ అంటూ మరింతగా ఆవిణ్ణి ఉడికిస్తాడట. క్రిస్ చెబుతుంటే ఆవిడ ముసిముసి నవ్వులు నవ్వుతోంది. ఆయన గ్లాసుల్లోకి వైన్ నింపుతున్నాడు, చాలా సొగసుగా.

క్రిస్ ఫాదర్ తను చదివిన ఒక నవల గురించి చెబుతూ మధ్యలో హఠాత్తుగా తిలక్ ప్రస్తావన తీసుకొచ్చాడు. నేను ఖంగు తిన్నట్టు చూశాను.

“ఆయన మా తెలుగు కవి,” అన్నాను ఆశ్చర్యంగా, “నాకెంతో ఇష్టం ఆయన. మీకెలా తెలుసు?”

నమ్మలేనిదానిలా క్రిస్ వైపు చూశాను. అతను గబుక్కున తలొంచుకున్నాడు. ఆయన ముఖంలో కూడా రంగులు మారాయి. ఎందుకా ప్రసక్తి తెచ్చానా అని ఇబ్బంది పడుతున్నట్టు గ్రహించాను.

రెండు క్షణాలు నిశ్శబ్దం తర్వాత ఆవిడ చెప్పింది. ” క్రిస్ మీ తెలుగమ్మాయిని ప్రేమించి పెళ్ళాడాడు. ఆమె పేరు జాజి. మా తోటలో ఆమె నాటి, వెళ్ళిన జాజి మొక్క ఇంకా అలానే వుంది, పూలు పూస్తూ…” క్రిస్ తలెత్తి తల్లి మొహం లోకి చూశాడు. ఆ చూపులకర్ధమేమిటో నాకు తెలీలేదు. ఆమె చెప్పడం ఆపేసింది. చూపులు దించుకుని, ఖాళీ అయిపోయిన సూప్ బౌల్ వంక చూస్తూ ఆలోచన్లో పడ్డాను. మొక్క నాటి వెళ్ళిపోయింది అని అంటోంది అంటే..ఎక్కడికెళ్ళినట్టు? ఇప్పుడిక్కడ లేదా? డైవోర్స్ ఇచ్చి వెళ్ళిపోయిందా? నాకంతా అయోమయంగా అనిపించింది.

ఆవిడ లేచి నిలబడి, నా భుజం మీద చేయి వేసి ఎంతో ఆప్యాయంగా అడుగుతోంది. “ఏమీ అనుకోకు బిడ్డా! డిన్నర్ కి రైస్, మ్యాంగో పికిల్ కావాలా? లేక…”

ఆమెని వాక్యం పూర్తి చేయనివ్వలేదు క్రిస్. “వొద్దు, మామా! నీ చేతి స్పెషల్ రావియోలి ప్లీజ్”

అబ్బ! ఎంత మంచి మాట చెప్పాడు, రావియోలి అంటే నాకెంత ఇష్టమో అతనికి తెలిసినట్టే. అతని వైపు నవ్వుతూ మెచ్చుకోలుగా చూశాను. అతను చిత్రంగా తల ఊపాడు, ఐ నో అన్నట్టు. నాకు ఆ ఎక్స్‌ప్రెషన్ నచ్చింది, ఆ నవ్వు కూడా, ఎంతో స్నేహపూరితంగా తోచింది.

ఆవిడ మళ్ళీ సర్వింగ్ స్టార్ట్ చేసింది. వేడి వేడి వెజిటబుల్ సూప్ నన్ను మరీ ఊరిస్తోంది. మరో పక్క, బ్రెడ్ రోల్స్ తెల్లటి కాగితంలో చుట్టుకుని, వెచ్చగా. ఆవిడ కూడా నా పక్కకొచ్చి కూర్చుని చెప్పింది, ఏం మొహమాట పడొద్దని, డిన్నర్‌కి వచ్చిన గెస్ట్ ఏంజెల్ నేనని.

వాళ్ళాయన ఆగకుండా తనకిష్టమైన ఆఫ్రికన్ కవుల పేర్లు చెబుతున్నాడు. చాలా ఆసక్తి కరమైన పొయెటిక్ లైన్స్ పైకి చదువుతూ, వాటిని మరో కవి రాసిన పదాలతో పోల్చి, వాటి వెనక దాగిన కవుల భావ చిత్రీకరణలోని ఉద్దేశ్యాలను విశ్లేషించి చెబుతుంటే శ్రధ్ధగా వింటుండిపోయాను. క్రిస్ వుండుండి అప్పుడో ప్రశ్న అప్పుడో ప్రశ్న వేస్తున్నాడు. ఆయన తగిన జవాబులిస్తున్నాడు. ఆవిడ సర్వ్ చేస్తూ కూడా ఆయన వైపే ఆరాధనగా చూస్తూ వింటోంది. నా వైపెవరూ చూట్టం లేదు. నన్నెవ్వరూ పట్టించుకోక పోవడం నాకెంతో హాయిగా వుంది. అంతా వింటూనే, ఆ ఇంట్లో ఒకరి లాగానే ఎంచక్కా నా డిన్నర్ ఎంజాయ్ చేస్తూ ముగించాను. బయట వర్షం ఉధృతం తగ్గి, జల్లు లోకి దిగింది. నేను కిటికీ లోంచి తొంగి చూశాను.

“మరో పది పదిహేను నిమిషాల్లో అంతా మామూలైపోతుంది లేండి. మీరేం వర్రీ కావొద్దు.” క్రిస్ ధైర్యం చెప్పాడు. డిన్నర్ టేబుల్ సర్దడంలో సాయం చేయబోతే వద్దని ఆ తల్లీ కొడుకులు వారించారు. డ్రైయర్ లోంచి నా బట్టలు తీసుకుని లోపలకెళ్ళాను, మార్చుకోడానికి.

ఇదంతా కలలా వుంది నాకు. పూర్తిగా అపనమ్మకంగా వుంది. ఇలా ఎక్కడైనా జరుగుతుందా నిజానికి నిజంగా!? అసలా వర్షమేమిటీ, కళ్ళకేమి కనిపించనంత కుండపోతగా ఆ వర్షమేమిటీ, తను దారి తప్పి ఇలా రావడమేమిటీ, వీళ్ళ ఇంట్లో ఇంత గొప్ప విందేమిటీ? ఇంత మంచి మనుషులు ఉన్నారా ఈ అడివిలో! తను కల కనడం లేదు కదా… ఆలోచించుకుంటూ… ఇంటి ముందు వసారాలోకొచ్చాను. క్రిస్ నన్ను శిరస్సు నించి పాదాల దాకా, ఒక అపురూమైన భావంతో చూశాడు.

“ఈ గులాబీ రంగు అంటే నాకు బోలెడంత ఇష్టం. జాజి ఎప్పుడూ ఈ రంగు బట్టలే కట్టుకునేది,” అతని ఇంగ్లీష్ ఆక్సెంట్ వినేందుకు ఎంత ముచ్చటగా వుందో తెలుగూ అంతే ముచ్చటగా ఉంది అదో చిత్రమైన యాసతో! వరండా మెట్టు మీద కొచ్చి చూశాను.

“వర్షం పూర్తిగా తగ్గింది. రోడ్ వైపుకి ఎలా వెళ్ళాలి?” అడిగాను. ఇల్లు గుర్తుకు రాగానే, గుభేల్మంది మనసు. లేట్ అయిపోయింది, ఇంట్లో వాళ్ళెంత కంగారు పడుతున్నారో అని.

“నేను మీ ఇంటి వరకు వచ్చి దింపుతాను, పర్లేదా?” క్రిస్. ప్రాధేయపడుతున్నట్టుగా ఆ కంఠంలో ధ్వని, నేను ఊహించుకున్నానేమో.

వాళ్ళిద్దరికీ, నేనెలా ధన్యవాదాలు తెలపాలో తెలీడం లేదని, డిన్నర్ కంటే వారు చూపిన ప్రేమని మరచిపోలేనని చెప్పాను. ఆవిడ ప్రేమగా నన్ను కౌగిలించుకుంది. ఆయన చిన్నగా నవ్వాడు. వాళ్ళని వదిలి వెళ్ళాలనిపించనంత బంధం కలిగింది ఆ క్షణంలో.

“పదండి” అన్నాడు క్రిస్. లోపలకెళ్ళి, గొడుగు తీసుకొచ్చాడు. “ఈ సారి వర్షం వస్తే, మీరు తడిసి పోకూడదనీ” అంటూ నవ్వాడు.

వీడ్కోలు చెప్పి, వాళ్ళిద్దరికీ, మేమిద్దరం నడుస్తూ బయటకొచ్చేశాం. ఇందాక ఎట్నించి వచ్చానా అని పరిశీలనగా చూస్తున్నా చుట్టుపక్కల్న. అక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లూ కనిపిస్తోంది. ఆకాశం తెరిపివ్వడమే కాకుండా, సన్నగా చందమామ వెలుగుతోంది. వృక్షాలన్నిటి మీద ఆ లేత వెన్నెల ఛాయ భలే బావుంది. నిశ్శబ్దం మీద రిఫ్లెక్షన్స్ అవి. మనసు మీద ఆనందాల చిత్రాలౌతాయి. దారికిరు వైపులా అన్నీ చెట్లూ, పుట్టలే. అంత కుంభవృష్టి కురిసినా ఎక్కడా ఆ జల ప్రవాహపు జాడలే కనిపించవిక్కడ.

“మిమ్మల్ని చూస్తుంటే… నాకు నా భార్య గుర్తుకొస్తోంది. చాలా గుర్తుకొస్తోంది.” క్రిస్ హఠాత్తుగా మాట్లాడుతున్న మాటలకి చటుక్కున అతని వైపు చూశాను. అతని గొంతు సన్నగా వణికింది.

“అయ్యో. బాధ పడకండి.” అన్నాను, ఓదార్పుగా.

“మీరు అటు వైపు చూడకుండా నడవండి. అదంతా అడవి. చూస్తే భయమేస్తుంది. తల వంచుకుని ఈ టార్చ్ లైట్ వెలుగులో నడుస్తున్న దారిని మాత్రమే చూడండి.” అతను తనకి ధైర్యం చెబుతున్నాడు. తను ఇందాక భయపడిన సంగతి పసిగట్టినట్టున్నాడే!?

“జాజి కూడా ఆ అడవి అంటే చాలా భయపడేది.” లేదు. అతను జ్ఞాపకాలలోనుంచి మాట్లాడుతున్నట్టున్నాడు.

ఇలా మరో సారి జరగకూడదు. ఫోన్ ఇంట్లో పెట్టేసి, కారు లేకుండా, కొత్త చోట్లకి రావడం ఎంత ప్రమాదం? వీళ్ళు మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. అదే వేరే ఉద్దేశ్యాలున్న వాళ్ళైతే, ఈ పాటికి తన గతి ఎలా వుండేది, తల్చుకుంటేనే వెన్ను జలదరిస్తోంది. చెక్క వంతెన మీద ఆగి చూశాను. ఆ వంతెన ఈ వంతెన ఒకటి కాదు. హమ్మయ్య! తలెత్తి ఆకాశం లోకి చూస్తూ,

“ఈ వంతెన బాగుంది. నాకు నచ్చింది. ఈ నీళ్ళ చప్పుడూ, ఆ వెన్నెలా,” అన్నాను.

“జాజి కూడా ఇలానే అనేది. తనూ నేనూ ఈ యేరు దగ్గరకొచ్చి, ఇలానే తెల్లారే దాకా ఇక్కడ గడిపే వాళ్ళం.” పెదాలు బిగించి నా వైపు అలానే చూస్తు వుండిపోయాడు. క్రిస్ ని చూస్తే నాకు భయమేయడం లేదు. అప్పుడు రఘుని చూసినప్పుడు కలిగిన భయం లాటిదసలే కలగడం లేదు. నా ఆశ్చర్యం అతనికి వినిపించి, అర్ధమైనట్లుంది. సన్నగా నవ్వాడు ఎన్నో అర్ధాలు కలిగేలా.

“అదిగో. మీ ఇంటి లేన్.” అతను అన్నాక, చూశాను. క్రాస్ రోడ్ కి ఎడమవైపు వీధి పేరుని! అంతా నిర్మానుష్యంగా వుంది. అసలే ఇది చిన్న టౌన్. తొమ్మిదింటికల్లా షాపులన్నీ బంద్ చేసేస్తారు. ఏడు తర్వాత ఎవరూ రోడ్లపై కనపడరు.

ఇంటికి రండి అందామనుకున్నాను. అలా అని, రమ్మని ఎలా చెబుతాను, ఇంటికి? ముక్కూ మొహం ఎరగని మగాణ్ణి? ఛ! తనెలా మారిపోయింది? ఈ కాసేపట్లోనే. కానీ రమ్మని అడగడానికి ఏదో బెరుకుగా అనిపించింది.

“మళ్ళీ ఎప్పుడూ కలవడం?” అన్నాను నవ్వుతూ. అంతా ఉత్తిదే. ఊరికే అన్నాను.

ఆ మాత్రం దానికే అతను కదలిపోతూ అన్నాడు. “మీ ఇష్టం. మీరెప్పుడు రావాలనుకుంటే అప్పుడు రండి. మా ఇంటి తలుపులెప్పుడూ మీ కోసం తెరిచే వుంటాయి.” అన్నాడు మెరుస్తున్న కళ్ళతో.

నేను నవ్వి, ఇక చాలన్నట్టు, “గుడ్ నైట్” అన్నాను.

అతను కదలలేదు. అలాగే నిశ్చలంగా నా వైపు చూస్తూ, “మా ఇంటికి ఒకటే బండ గుర్తు. ఈ వంతెన దాటాక, యేటి పక్కన ఇల్లు. సరేనా, వస్తారుగా?” అన్నాడు.

అలాగే అంటూ, ఇంటి వైపు నడిచాను. అతను నా వెనకే మిగిలి పోయాడన్న సంగతి నాకు తెలుసు. నా కంటే ముందు అతని టార్చ్ లైట్ వెలుగు పడుతోంది.

ఇంటి తలుపు తెరుచుకుని మెల్లగా లోపలకొచ్చాను. అమ్మ సోఫాలో పడుకునుంది ముఖం నిండా చీర కొంగు కప్పుకుని. ఎనిమిదింటికల్లా ఇంత తిని, పడుకుండి పోతుంది. తొమ్మిది దాటితే అస్సలు మెలకువగా వుండలేదు. నాన్న పడక కుర్చీలో కళ్ళు మూసుకుని పడుకున్నాడు. అది నిద్ర కాదు. టేబుల్ లైట్ వెలుతురులో ఆయన ముఖం లోని విచారం కొట్టొస్తూ కనిపిస్తోంది. ఏమైందనీ? అంత విషాదానికి? సాయంత్రం బానే వున్నారు కదా! నేను వచ్చిన అలికిడి విన్నా ఆయన కళ్ళు తెరవలేదు.

నా చూపు, టీ పాయ్ మీద పడున్న ఇన్విటేషన్ కార్డ్ మీద పడింది.

వెంటనే చేతిలోకి తీసుకుని చూశాను. రఘు పెళ్ళి చేసుకుంటున్నాడు. హమ్మయ్య. హాయిగా వుంది ప్రాణం. నిన్న కూడా అమ్మ ఒకటే పోరు. రఘుకి ఫోన్ చేయి అంటూ. అతను వీళ్ళకింత బాగా నచ్చడానికి కారణం, వాళ్ళు మన వాళ్ళే. అందుకూ! కానీ, నా మనసుకి బాగా తెలుసు. అతన్ని నా అని అనుకోలేనని. కేవలం చదువు, ఉద్యోగం, చెడ్డలవాట్లు లేకపోవడంతో మగాడు మంచి మొగుడౌతాడా? కేవలం డబ్బు సంపాదించే వాడితో మాత్రమే భార్య సుఖపడుతుందా? ఏమో, తనకి మాత్రం ఒక సున్నిత మనస్కుడు కావాలి. మనసుకి బాధ కలిగినప్పుడు, ‘ఎలా కంట్రోల్ చేసుకోవాలి కన్నీళ్ళని’ అని పాఠాలు చెప్పే వాడు కాకుండా, కన్నీటి వెనక కారణాన్ని చెప్పకుండానే తెలుసుకునే వాడు కావాలి.
తడి రెప్పలని తాకే చిరు పెదవుల స్పర్శ కావాలి. రఘుకి అంత సున్నితత్వం ఎక్కడిది? వీళ్ళకేమో నా మీద కోపం అతనితో నేను రాజీ పడలేదని.

నా ఆలోచన్లని భంగపరుస్తూ పెద్ద గొంతేసుకుని మోగింది ఫోన్. అమ్మ లేస్తుందని కంగారు పడుతూ రెండు అంగల్లో ఫోన్ దగ్గరకెళ్ళాను. అప్పటికే, చేయి చాచి నాన్న అందుకున్నారు.

“హలో..” అన్నారు, బొంగురుపోయిన గొంతుతో.

“నేను నాన్నా. ఇండియా కెప్పుడొస్తున్నారు?” అది అన్నయ్య గొంతు. వొళ్ళు మండిపోయింది తనకి. ఎందుకట ఇండియాకి? మళ్ళీ వేపుకు తిండానికా వీళ్ళని? తన దగ్గర వాళ్ళు చాలా హాయిగా వున్నారు కదా!

“వచ్చేస్తున్నాంరా. మా కిక్కడ పనేముందనీ?”

అదేమిటీ నాన్న అలా బాధ పడుతున్నారు? నాకు తెలీదే ఆయనకిక్కడ నా దగ్గర వుండటం అంత బాధాకరంగా వుందన్న విషయం!

“ఇల్లు ఇవాళే ఫైనలైజ్ అయింది. కార్తీకే అన్నీ చూసుకుంటున్నాదు. మరో రెండు రోజుల్లో సామానంతా అమ్మేస్తున్నాడు. అంతా నాలుగు రోజుల్లో అయిపోతుంది. టికెట్స్ బుక్ చేయంగానే చెబుతాను. ఇక హాయిగా మన వూళ్ళోనే…” ఆ పైన నేను వినదలచుకోలేదు.

ఏమిటీ? వీళ్ళు కూడా నన్ను విడిచి వెళ్ళి పోతున్నారా? ఎంత కష్టపడి, ఎంత ఇష్టపడి కొన్న ఇల్లు ఇది? ఎంత అపురూపంగా చూసుకున్న వస్తువులు ఇవి? అన్నీ అమ్మేస్తున్నారా? అంతా వాళ్ళిష్టమేనా? నాకొక్క మాట కూడా చెప్పలేదే. నేనసలు ఎవరికీ అవసరమున్నట్టు లేదు. లేకపోతే, తను రానందుకు, ఇంత ఆలస్యమైందీ, ఎక్కడ ఇరుక్కుపోయిందో నన్న బెంగనేదే లేకుండా ఇలా ఎలా ముడుచుకు పడుకుంటారా ఎవరైనా?

కోపంగా బయట కొచ్చాను. చల్లటి గాలి వీస్తోంది తెరలు తెరలుగా వొంటిని చుట్టుకుంటూ. వెన్నెల కరిగిపోతూ, మబ్బుల వెనక్కెళ్ళిపోతూ చంద్రుడు. అదో రకపు నిశ్శబ్దం నా చుట్టూ కమ్ముకుంది. అది సంతోషాన్నీ ఇవ్వడం లేదు. దుఖాన్ని ఇవ్వడం లేదు. గబగబా నడుచుకుంటూ రోడ్డెక్కేశాను. ఇందాక క్రిస్ నిలబడిన చోట చూశాను. అతనున్నాడేమోనని. లేడు. వెళ్ళిపోయాడు. వెళ్తూ అతను చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.

“మీరెప్పుడు రావాలన్నా మా ఇంటికి రావాలన్న ఒకటే బండ గుర్తు. వంతెన దాటాక, ఏటి పక్కనిల్లు గుర్తుంది కదూ?”

అతని మాటల్నే కాదు అతని కూడా తను మర్చిపోలేదు. ఎలా అంటే, ఇప్పుడు గుర్తొస్తోంది, అలా అంటూ తన కళ్ళల్లోకి చూసిన క్రిస్ కళ్ళు. రెప్పేయని ఆ కళ్ళు తనకి బాగా గుర్తున్నాయి. మైదానం దాకా నడుచుకుంటూ అలానే వచ్చేశాను. చెక్కబల్ల మీద కూర్చున్నాను ఎగిరిపోకుండా మిగిలిపోయిన ఒక గొడుగు కింద. వెన్నెలలో అడవి అటువైపు నల్లగా కనిపిస్తోంది. చిత్రం! నాకు మొదటిసారిగా భయం వేయలేదు. అమ్మనీ, నాన్ననీ, అన్నయ్యనీ, రఘునీ అందరినీ గుర్తు చేసుకున్నాను. అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయిన వారే. వెళ్ళిపోయే వారే, నా ఇష్టాయిష్టాలతో ఎవరికీ అవసరం లేదు. మరి నేనో?

నేను మాత్రం ఎక్కడికీ వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఒంటరిగా. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యేటి గట్టున ఆ ఇంటి కెళ్లడం కోసం.
----------------------------------------------------------
రచన: ఆర్. దమయంతి, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment