Tuesday, July 23, 2019

కామవేదము: పరిచయం


కామవేదము: పరిచయం



సాహితీమిత్రులారా!


పుస్తక పరిచయం
తమిళములో తిరుక్కుఱళ్ [1] ఒక మహా గ్రంథము. దీనిని తిరువళ్ళువర్ కవి రచించాడు. ఇతడు సంగ కాలపు కవి. కవి సమూహమునకు సంగ(ఘ)ము అని పేరు. ఈ సంగ కాలము ఎప్పటిదన్నది ఇంకా వివాదాంశమే. కొందరు క్రీస్తు పూర్వము నాలుగవ శతాబ్దము నాటిదంటారు, మరి కొందరు క్రీస్తు పూర్వము ఒకటవ శతాబ్దము నాటిదంటారు. ఇంకా కొందరు క్రీస్తు శకము నాలుగవ శతాబ్దము అంటారు.


తిరువళ్ళువర్ విగ్రహం (1976)
వళ్ళువర్ కొట్టం, నుంగంబాక్కం, చెన్నై
సంగ కాలాన్ని మూడు భాగాలుగా విడదీస్తారు, అవి తలైచ్చంగం (ప్రథమ సంఘము), ఇడైచ్చంగం (మధ్య సంఘము), కడైచ్చంగం (చివరి సంఘము). తిరువళ్ళువర్ జన్మస్థానము నేటి చెన్నై నగరములోని మైలాపూరు ప్రాంతము. ఇతడు నివసించిన కాలము (కడైచ్చంగం నాటిది) కూడ సంగకాలములా వివాదాంశమే. ఇతని కాలాన్ని క్రీస్తుపూర్వమునుండి ఎనిమిదవ శతాబ్దము[2] వరకు అంచనా కట్టుతారు. కొందరు తిరువళ్ళువర్ ఒక జైనుడు అని కూడ చెబుతారు.

భారతదేశములో చాల మంది కవులవలె తిరువళ్ళువర్ గురించి కూడ మనకు ఎక్కువ విషయాలు తెలియవు. జనులు విశ్వసించిన కథలే కాలక్రమేణ చరిత్రగా[3] మారాయి. వళ్ళువర్ తండ్రి బ్రాహ్మణుడు, తీర్థయాత్ర చేస్తుండగా మరో బ్రాహ్మణుని ఇంటిలో ఒక కన్యను చూచి పెళ్లి చేసికొన్నాడు. ఆమె తక్కువ కుల స్త్రీ అంటారు. వాళ్లిదరికి ఏడుగురు పిల్లలు పుట్టారు. తీర్థ యాత్రా సమయములో ఎక్కడ పుట్టిన బిడ్డను అక్కడే ఎవరికో పెంచుకోడానికి వదిలి వెళ్లేవారట. అందులో ఏడవ బిడ్డ మైలాపురములో జన్మించిన వళ్ళువర్. నేడు కూడ ఆదిద్రావిడులలో వళ్ళువర్ అనే ఒక తెగ ఉన్నది. వళ్ళువర్ విద్యాభ్యాసము చేసి పెద్దవాడై వాసుకి అనే ఒక ఉత్తమురాలిని పెళ్లి చేసికొన్నాడు. వృత్తి రీత్యా ఇతడు ఒక నేతగాడు. ఏలేలసింగడు అనే వాడివద్ద దారము కొని, బట్టలను నేసి వాడికే అమ్మే వాడట. ఎక్కువ ప్రలోభాలు లేని వృత్తి నేత వృత్తి అని భావించి ఈ వృత్తిని ఎన్నుకొన్నాడట సుప్రసిద్ధ కవి కబీర్ కూడ ఒక నేతగాడే. తరువాత సింగడు ఇతనికి శిష్యుడయ్యాడు. చని పోయిన పిదప తన దేహాన్ని జంతువులు తినడానికి ఉపయోగించమని అడిగాడట.

ఇతడు వ్రాసిన తిరుక్కుఱళ్‌లో నేడు 1330 పద్యాలు దొరుకుతాయి. వీటిని మూడు వర్గాలుగా విభజిస్తారు, అవి – అఱత్తుప్పాల్ (ధర్మ వేదము), పొరుట్పాల్ (అర్థ వేదము), కామత్తుప్పాల్ (కామవేదము). తమిళములో ఈ కావ్యాన్ని ముప్పాల్ (త్రివర్గము), ఉత్తరవేదం, తమిళ్ మఱై అని కూడా అంటారు. ఈ కవిని నాయనార్, నాన్ముగనార్ (చతుర్ముఖుడు), దేవర్ అని అంటారు. తిరుక్కుఱళ్‌ను ద్రావిడ వేదము అనుట పరిపాటి.

తిరుక్కుఱళ్ గొప్పదనమును గురించి ఇక్కడ ఒక రెండు మాటలు చెప్పాలి. ఇందులోని 1330 పద్యాలు ఒకే ఛందస్సులో ఉన్నాయి. దానిని వెణ్బా అంటారు. సామాన్యముగా వెణ్బాకు నాలుగు పాదాలు ఉంటాయి, మొదటి మూడు పాదాలలో నాలుగు గణాలు (గణమును తమిళములో శీర్ అంటారు), చివరి పాదములో మూడు గణాలు ఉంటాయి. కుఱళ్ వెణ్బా అనే వెణ్బా ఒక ద్విపద. ఇందులో మొదటి పాదములో నాలుగు గణాలు, రెండవ పాదములో మూడు గణాలు ఉంటాయి. కురళ్ వెణ్బాలో వ్రాయబడి ఉండడమువలన ఈ పుస్తకానికి తిరుక్కుఱళ్ అని పేరు వచ్చింది. తమిళ పద్యాలలో సామాన్యముగా ఒక గణములోని పదము మరో గణములోనికి చొచ్చుకొని పోదు. ఏడు గణాలతో లేక ఏడు పదాలతో భావ గాంభీర్యాన్ని నింపడం సులభమైన విషయము కాదు. కాని వళ్ళువర్ ఒక చిన్న పద్యములో ఎన్నో భావాలను ఉంచగలిగాడు. అందుకే ఆవగింజలో సప్త సముద్రాలను పెట్టడము వళ్ళువరుకు మాత్రమే సాధ్యమని ప్రస్తుతించారు.

సామాన్యముగా భారతీయ భాషలలోని కావ్యాల కథలు, పద్యాలు దేవుళ్లను గురించో లేకపోతే రాజులను గురించో ఉంటాయి. మతముతో ప్రసక్తి లేనివి చాల తక్కువ. అంటే secular poetry అరుదు. సంస్కృతములో భర్తృహరి సుభాషితాలు, అమరు శతకము, ప్రాకృతములో గాథాసప్తశతి ఈ కోవకు చెందినవి. కాని తమిళములో దైనందిన జీవనములో తోచే సంఘటనల పైన కవితలు, పద్యాలు, పుస్తకాలు చాల ఉన్నాయి. తిరుక్కుఱళ్ ఇట్టిదే. అందువల్ల నాటినుండి నేటివరకు తిరువళ్ళువర్‌ను ఒక అత్యుత్తమమైన కవిగా పరిగణిస్తారు.

చల్లా లక్ష్మీనారాయణశాస్త్రి తిరుక్కుఱళుపైన ఒక ప్రాచీనకవి వ్రాసిన దానిని ఆధారము చేసికొని కింది పద్యాలను వ్రాసినారని చల్లా రాధాకృష్ణశర్మ[2] తెలిపారు –

కొంచెపు నీటి బిందువున గోచరమైన మహా తరు క్రియన్
సంచిత పుణ్యరాశి యనజాలిన తావక భావజాల మ-
భ్యంచితరీతిమై ద్విపదలందె కుదించి రచించినట్టి నీ
యంచిత పుణ్యమూర్తికి జొహారు లివే తిరువళ్ మహాకవీ

త్రవ్వినకొలంది చెలమ నేర్పడిన నీర
మట్లు, చదివినకొలది భావైకరాశి
నలరు భవదీయ సత్కవితామృతతాప్తిఁ
బారమే లేదు రసికప్రపంచమునకు

తిరుక్కుఱళ్ మొట్టమొదటి భాషాంతరీకరణము తెలుగులో 19వ శతాబ్దపు ఉత్తరార్ధములో జరిగింది. మలయాళ భాషలో దీనికన్నా పాతదైన ఒక వ్రాతప్రతి ఉందని చెబుతారు, కాని తెలుగు అనువాదమే అన్ని భాషలలో మొదటిది అంటారు. కనుపర్తి వేంకటరామ విద్యానందనాథులు తెలుగులో ప్రథమ అనువాదకులు. తరువాత చొక్కం నరసింహులు నాయుడు, పూతలపట్టు శ్రీరాములు రెడ్డి, ముదిగంటి జగ్గన్న శాస్త్రి, శొంఠి శ్రీపతి శాస్త్రి మున్నగువారు తర్జుమా చేసారు. నా గురువుగారైన సాధన వీరాస్వామి నాయుడు చేసిన అనువాదాలు ప్రజామత వారపత్రికలో 1950లలో ప్రచురించబడేవి. గురుచరణ్ తెలుగులో 14 అనువాదాలు ఉన్నాయని[4] అన్నారు. తెలుగులో తిరుక్కుఱళ్‌కు త్రివర్గదీపిక, త్రివర్గము అని పేరుంచారు. రెడ్డి[3], గురుచరణ్[4] అనువాదాలు మనకు సులభముగా లభిస్తాయి.

నా దగ్గర చాలా కాలముగా ఒక చిన్న తిరుక్కుఱళ్ పుస్తకము [5] ఉన్నది, అందులో ఒక వైపు పద్యము, ఒక వైపు తాత్పర్యము ఉన్నది. తిరుక్కుఱళ్ పద్యాలతో యోగి శుద్ధానంద భారతి ఆంగ్లానువాదము[6], పోప్ చేసిన ఆంగ్లానువాదము[7] ఇంటర్నెట్ ద్వారా మనకు చదువ వీలగును. నేను నా అనువాదాలను పై మూడు పుస్తకాలపైన ఆధారము చేసికొని వ్రాసినాను. నేను ఎంచుకొన్న ఛందస్సు దేశి ఛందస్సులైన ఆటవెలది, తేటగీతి, సీసము, కందము, ద్విపద. ఇవన్నీ రెండు పాదాలకే పరిమితము (సగము కందము, ఆటవెలది, తేటగీతి; ఒక సీస పాదము). ఉపజాతులకు తెలుగులో ప్రాస అనవసరమైనా, ఎక్కువగా ప్రాస ఉంచడానికి ప్రయత్నించాను. కామత్తుపాల్ అనబడే కామవేదములో 250 పద్యాలు ఉన్నాయి. పద్యాలకన్నిటికీ అనువాదాలను చేసినా, అన్నిటినీ ఇక్కడ ప్రచురించ దలచుకోలేదు. అర్థరీత్యా, భావరీత్య నా దృష్టిలో ఉత్తమమని తోచిన పద్యాలను మాత్రమే ఎంపిక చేసి గ్రంథాలయములో ఉంచాను. మీ ఆసక్తిని రేకెత్తించడానికి కొన్ని పద్యాలను ఇక్కడ ఇస్తున్నాను.

అణంగుకొల్ ఆయ్ మయిల్ కొల్లో కనంగుళై
మాదర్‌కొల్ మాలుమ్ ఎన్ నెంజు (1081)

            అమరవనితయొ, యందాల నెమలియేమొ
            రమణభూషిత నన్నిట్లు భ్రమల ముంచె

ఉరుదోఱు ఉయిర్‌తళిర్ప త్తీండలాల్ పేదైక్కు
అమిళ్‌దిన్ ఇయన్ఱన తోళ్ (1106)

            అతివ రెండు చేతులు నిజ మమృతమయము
            ప్రతి కవుంగిలి క్రొంగ్రొత్త బ్రదుకు నిచ్చు

వాళ్‌దల్ ఉయిర్కన్నళ్ ఆయిళై శాదల్
అదర్కన్నళ్ నీంగుం ఇడత్తు (1124)

            సకియతో జీవిత మ్మది స్వర్గసమము
            సకియ లేక జీవిత మది చావె నాకు

తెరిందుణరా నోక్కియ ఉణ్‌గణ్ పరిందుణరా
ప్పైదల్ ఉళప్పదు ఎవన్ (1172)

            నాఁడు తప్పుఁ జేసెగద నీ నయనయుగము
            నేఁడు బాధతో నేడ్చె నీ పాడు కనులు

మఱైపెఱల్ ఊరార్కు అరిదన్ఱాల్ ఎంబోల్
అఱైపఱై కణ్ణార్ అగత్తు (1180)

            దండురా వేసెనో రెండు కళ్లిచ్చట
            నుండ దిక రహస్య మొక్క నాఁడు

విడా అదు శెన్ఱారై క్కణ్ణినాల్ కాణ
ప్పడా అది వాళి మది (1210)

            చనకోయి నెలరాజ, నను వీడెఁ బ్రియుఁ డిందు,
            నను వీడి మదినుండి చనఁడు వాఁడు

కయలుణ్ కణ్ యానిరప్ప త్తుంజిఱ్ కలందార్కు
ఉయలుణ్మై శాట్రువేన్ మన్ (1212)

            మూయవే చేప కన్నులా, మూసి నిదుర
            పోయి, కలలందుఁ గానవే మోహమయుని

కాలై అరుంబి ప్పగలెల్లాం పోదాగి
మాలై మలరుం ఇన్నోయ్ (1227)

            విరియు ప్రభాతాన, పెరుగు దిన మెల్ల,
            విరహ రోగము సంధ్య వెతల నిచ్చు

మఱైప్పేన్‌మన్ కామత్తై యానో కుఱిప్పిన్ఱి
త్తుమ్మల్‌పోల్ తోన్ఱివిడుం (1253)

            వమ్ము కామమ్ము దాచు యత్నమ్ము నాకు
            తుమ్మువలె వచ్చు నొక్క క్షణమ్ములోన

వరుగమన్ కొణ్‌గన్ ఒరునాళ్ పరుగువన్
పైదల్ నోయ్ ఎల్లాం కెడ (1266)

            వచ్చుఁ దానొక దిన మిచ్చుఁ బీయూషమ్ముఁ
            దెచ్చు నానందమ్ము చచ్చు వెతలు

పుల్లా తిరా అప్పులత్తై అవర్ ఉఱుం
అల్లల్ నోయ్ కాణ్గం శిరిదు (1301)

            అలుక నటియించు, చేరకు మతని నీవు
            కలగని మ్మతని యెడద, కనగ మనము

ఉణలినుం ఉండదు అఱల్ ఇనిదు కామం
పుణర్దలిన్ ఊడల్ ఇనిదు (1326)

            తినుటకన్నను జీర్ణించుకొనుట మిన్న
            కినుక మిన్న కవుగిలించుకొనుటకన్న

గ్రంథసూచి
1.తిరుక్కుఱళ్
2.తమిళ సాహిత్య చరిత్ర – చల్లా రాధాకృష్ణశర్మ, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు, 1976.
3.త్రివర్గము (తిరుక్కుఱళ్) – పూతలపట్టు శ్రీరాములు రెడ్డి, 1955.
త్రివర్గము
4.తిరుక్కుఱళ్ (తెలుగు) – గురుచరణ్ అనువాదములు.
5.తిరుక్కుఱళ్ – పాల్వణ్ణనార్, శ్రీమగళ్ కంపెనీ, చెన్నై, 1966.
6.తిరుక్కుఱళ్ (తమిళ్) – శుద్ధానంద భారతియార్ అనువాదములు.
Tirukkural – G. U. Pope translations.
-----------------------------------------------
రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు, 
ఈమాట సౌజన్యంతో

1 comment:

  1. కామవేదము ఏమిటి. వికారంగా ఉంది.

    ReplyDelete