ఇలాంటి ఆడవాళ్ళు ఇప్పుడున్నారా?
సాహితీమిత్రులారా!
నెల్లూరిని పాలించిన మనుమసిద్ధికి సేనాధిపతులలో
ఒకసేనాపతి ఖడ్గతిక్కన. ఒకమారు మనుమసిద్ధికి
కాటమరాజుకు మధ్య పుల్లకి విషయంలో యుద్ధం
సంభవించింది. దానికి ఖడ్గతిక్కన సైన్యసమేతం
వెళ్ళి ఎదుర్కొన్నాడు. కాటమరాజు సేనాపతులలో
ఒకడైన పిన్నమనాయునితో జరిగిన పోరులో ఖడ్గతిక్కన
తన సైన్యాన్ని కోల్పోయాడు చివరికి చేసేదిలేక
మరికొంత సైన్యాన్ని తీసుకొని పొవటానికి ఇంటికి
తిరిగివచ్చాడు దానితో తండ్రి అయిన సిద్ధనామాత్యులు
కొడుపై కోపించి నానామాటలని యుద్ధంలో చావనైనా
చావక నాకడుపున చెడబుట్టావని నిందించాడు.
దానికి ఆ యోధాగ్రేసరుడు చాల చింతించాడు.
భార్య చానమ్మ స్నానానికి నీళ్లుపెట్టి అక్కడ ఒక పసుపు
ముద్దను ఉంచి నులకమంచాన్ని అడ్డు పెట్టి ఈ విధంగా
అన్నది-
పగరకు వెన్నిచ్చినచో
నగరే నిను మగతనంపు నాయకు లెల్లన్
ముగురాడు వారమైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన వేళన్
(శత్రువులకు వీపుచూపి వస్తే మగతనం వున్న నాయకులు
నవ్వరా ఇంట్లో ఇప్పుడు ముగ్గురు ఆడవాళ్ళమైనాము
బాధఎందుకు స్నానం చేసేవేళ)
అదేసమయంలో అన్నం పెట్టే సందర్భంలో
తల్లి విరిగిన పాలు పోసి ఈ విధంగా అన్నది-
అసదృశముగ నరివీరుల
పసమీరగ గెలువలేక పందక్రియన్ నీ
వసి వైచి విరిగి వచ్చిన
పసులున్ విరిగినవి తిక్క పాలున్ విరిగెన్
(అసమానమైన శత్రువులు బలం పెరగ్గా గెలువలేక
పిరికిపందవలె నీవు కత్తిని పక్కన పెట్టి తిరిగివచ్చావు
పశువులు విరిగి పాలువిరిపోయాయి తిక్కనా)
ఈ మాటలతో సైన్యాన్ని తీసుకొని మనుమసిద్ధి వద్దన్నా
వినకుండా ఒప్పరించుకొని యుద్ధానికి వెళ్ళి భయంకరంగా
పోరాడి వీరమరణం పొందాడు.
ఒకసారి ఆలోచిస్తే ఇలా ఒక తండ్రి అవమానించడం
సహజమే కాని తల్లి, భార్య అవమానించి యుద్ధసన్నద్ధుని
చేసి పంపడంలో ఇలాంటి స్త్రీలున్నారా అంటే దాదాపు
లేరనే చెప్పాలి కాదంటారా?
No comments:
Post a Comment