వక్ర భాష్యాలు
సాహితీమిత్రులారా!
దాశరథి కృష్ణమాచార్య
ధ్వజమెత్తిన ప్రజ నుండి
ఈ వక్ర భాష్యాలు
తిరిగే భూగోళాన్ని ఆపేయండి;
దిగి పోతా న్నేను;
మానవత వసించవలసిన చోట
దానవత సహించలేను
నరకం లేదు లేదన్న వాళ్ళే
నరలోకాన్ని నరకం చేశారు;
స్వర్గం వట్టిది వట్టిదన్న వాళ్ళే
స్వప్రయోజనాల స్వర్గం సృష్టించారు
దేవుడు లేడన్న వారే తమ సిద్ధాంతాల
దేవాలయాలు నిర్మించారు;
వాటిలోకి మానవ కోటిని పడద్రోసి
బందీలుగా చేసి పారేశారు
విగ్రహాలు పనికిరావని తోసేశారు
విగ్రహంలేని మనుషుల బొమ్మల్ని పూజించారు;
ఏది వద్దంటున్నారో అదే చేస్తున్నారు
ఏదీ తెలియని సామాన్యుల్ని మోసగిస్తున్నారు
మేధావి లనబడేవారి వక్ర భాష్యాలు
బాధలన్నిటినీ సృష్టించే విషబీజాలు;
సవ్యంగా ఆలోచించేవాడు లేని నాడు
సవ్యసాచు ల వల్ల ఈ లోకానికి కీడు
నగ్నంగా ప్రవహించే నది కావాలి
అగ్ని శకలాలు విసిరే రవి రావాలి
రుగ్నమైన మేధాశక్తులు పోవాలి
భగ్న హృదయాలలో ఆశ లేవాలి
తిరిగే భూగోళాన్ని ఆపేయండి
దిగి పోతా న్నేను
మానవత వసించవలసిన చోట
దానవత సహించలేను
No comments:
Post a Comment