అధిక్షేపము - కవితా నిక్షేపము
సాహితీమిత్రులారా!
ఇది మన దాశరథి కృష్ణమాచార్య
ఆలోచనా లోచనాలు - నుండి
ఫారసీక కవులలో మరపురానివాడు ఫిరదౌసీ.
ఇతడు క్రీ.శ. పదవ శతాబ్దివాడు. ఇతని పూర్తి పేరు
అబుల్ ఖాసిం హసన్ ఫిరదౌసీ. అరవైవేల పద్యాలుగల
షానామా అనేది ఇతని మహాకావ్యం. పర్షియన్ రాజు ఇతిహాసం.
అమరమైన ఈ కావ్యం విలువ తెలుసుకోలేని ఆనాటి రాజు
సుల్తాన్ మహమూద్ - ఫిరదౌసీని అవమానించాడు.
ఆ అవమానం కవిని కవ్వించింది. అధిక్షేప కావ్య రచనకు
ఉపక్రమింపచేసింది. అందులోని ఒక భాగమే
ఈ కవిత -
కాలగర్భాన చనిన భూపాలకులను
కలముతో బ్రతికించిన కవినినేను,
ఏసువలె నేను వారి పేరెత్తి పిలువ
తమ సమాధుల వెడలిరి ధరణిపతులు
వాత హతికిని కాలప్రవాహమునకు,
అగ్ని, వర్షపాతమునకు భగ్నములగు
సౌధములను నిర్మించు రాజన్యుతోడ
కావ్య నిర్మాత ని పోల్చగా తరంబె
నా మహాకావ్య సౌధ శృంగములపైన
గాలికి వానకును అధికారమేది
కాలమును కట్టి పడవేయ గలుగు శక్తి
నా కలాన కొసంగి యున్నాడు ప్రభువు.
రాజులో నుదాత్తత లేనిరోజు వచ్చె
స్వామిలోన నౌదార్యమ్ము చచ్చిపోయె
మౌక్తికమ్ము నొసగలేని శుక్కిలోన
శూన్యమేగాని, కనిపించు నన్యమెట్లు
ముండ్ల తీవెకు ద్రాక్షలు మొలుచునొక్కొ
జముడు పొదలోన పండునే జామపండ్లు
నాక వన వాటికలలోన నాటగానె
పాప భూరుహములు పుణ్యఫలము లిడునె
పరిమళ ద్రవ్యముల నమ్మువాని చేర
పరిమళమ్మంటి తీరు వస్త్రములకు,
బొగ్గలమ్మెడి వానితో పొందుసేయ
వలనముల నిండ నిండును మసియొకంటె
చిరుతపులి మచ్చ లెవ్వరు చెఱుప గలరు
ఏన్గు నెవ్వరు తెలుపు గావింపగలరు
క్షుద్రుడగు వాని గుండెల ముద్రవడిన
హీనతను మాపజాలు టెవ్వాని తరము
పులిని నను నీవు మేకగా తలచినావు
ఏనుగులతోడ తొక్కింపనెంచినావు
జ్ఞానకాంతుల వెదజల్లజాలు నేను
మానవున కెవ్వనికి లొంగబోను లెమ్ము
అరువదివేల పద్దేముల నల్లిన కావ్యము, మౌక్తికస్రజ,
మ్మరయ ధరిత్రి శాశ్వతత నందవలెన్ కవితా మహత్తుతో
పరపతి కంకితంబగుట న్యాయముకాదు, ప్రవక్త పాద పం
కరుహములందు నిల్చితి కానుకగా, భవభంజకమ్ముగా
No comments:
Post a Comment