Monday, November 20, 2017

కర్కట వ్రణములు ( Cancers )


కర్కట వ్రణములు ( Cancers )
సాహితీమిత్రులారా!
క్యాన్సర్స్ గురించి డా.గన్నవరపు నరసింహమూర్తిగారు కూర్చిన వ్యాసం
ఇక్కడ ఇవ్వబడింది చదవండి-శరీరానికి కలిగే రుగ్మతలలో కొత్త పెరుగుదలలకు ( Growths ) ప్రాముఖ్యత ఉన్నది. ఈ పెరుగుదలలు నెమ్మదిగా పెరిగే నిరపాయకరమైనవి( Benign tumors ) కావచ్చును. త్వరితముగా పెరిగి పరిసర కణజాలములోనికి మూలములతో ఎండ్రకాయల వలె చొచ్చుకుపోయే ప్రమాదకరమైన కర్కటవ్రణములు ( Malignant tumors ) కావచ్చును. ఇవి కాన్సరులుగా అందుకే ప్రాచుర్యములో ఉన్నాయి. ఈ పెరుగుదలలు పుట్టల వలె పెరుగుట వలన వీటిని పుట్టకురుపులని కూడా అంటారు.
కణముల జన్యువులలో మార్పు జరుగుటవలన (Genetic Mutations ) ఆ కణములు అతిత్వరగా పెరుగుతూ, అతిత్వరగా విభజన చెందుట వలన ఈ పెరుగుదలలు పొడచూపుతాయి. కర్కటవ్రణములలో కణములు పూర్తిగా ఆయా అవయవ కణజాలములలోని కణముల వలె పరిపక్వత నొందవు. అందుచే అవి ఆ అవయవాల కణములను పోలి ఉండవు. ఈ కణాలలో న్యూక్లియస్ పరిమాణము హెచ్చుగా ఉండి, సైటోప్లాజము పరిమాణము తక్కువగా ఉంటుంది. ఈ కణాల మధ్య సంధానము కూడా తక్కువగా ఉంటుంది. పరిపక్వత పొందకపోవుటచే ఈ కణాలు ఆ యా అవయవ ధర్మాలను నిర్వర్తించవు.
ఈ కణ బీజములు లింఫు నాళముల ద్వారా లింఫు గ్రంధులకు , రక్తనాళముల ద్వారా యితర అవయవములకు వ్యాప్తి చెందగలవు. ఈ కర్కటవ్రణాలు త్వరగా పెరుగుతూ పోషక పదార్థాలను విరివిగా సంగ్రహించుట వలన , ఈ వ్రణములనుంచి విడుదల అయ్యే రసాయినక పదార్థముల వలన ఆకలి క్షీణించుట చేత బరువు తగ్గి దేహక్షీణత కలుగుతుంది. ఇతర అవయవాలకు వ్యాప్తి చెంది ఆ అవయవ ధర్మాలకు ప్రతిబంధకము కూడా కలుగ జేస్తాయి. ఈ పుట్టకురుపులు చివరి దశలలో ఉన్నప్పుడు శరీరపు వ్యాధి నిరోధక శక్తి తగ్గి సూక్ష్మాంగజీవుల వలన వివిధ రోగములు కూడా కలుగ వచ్చును
కర్కట వ్రణములు కలుగడానికి కారణము కణముల జన్యువులలో మార్పు రావటమే కదా! ఈ జన్యువ్యత్యాసము తొంబయి శాతము , కణముల పరిసరముల ప్రభావము వలన జరిగితే ఒక పదిశాతము వరకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యువుల వలన కలుగుతాయి. వృద్ధాప్యములో శరీరపు వ్యాధినిరోధక శక్తి తగ్గి అసాధారణ కణములు తొలగింపబడకపోవుట వలన ఆ కణాలు పెరుగుట వలన ఆ పెరుగుదలలు పొడచూపుతాయి. పొగత్రాగుట, యితర విధాల పొగాకు వినియోగము, ఊబకాయము, వ్యాయామ లోపము, సూక్ష్మజీవులు కలిగించే వ్యాధులు, ఆహారపుటలవాట్లు, వాతవరణకాలుష్యము ,రేడియోధార్మిక కిరణాల వంటి భౌతిక కారణాలు అవయవాల కణములను ప్రభావితము చేస్తాయి.
పొగత్రాగడము, పొగాకు వినియోగములు 25 శాతపు పుట్టకురుపులకు కారణము. తొంబై శాతపు శ్వాసకోశ కర్కటవ్రణములు పొగత్రాగే వారిలోనే సంభవిస్తాయి. మూత్రాశయపు కాన్సరులు ( Urinary bladder cancers ), మూత్రపిండముల కర్కటవ్రణములు ( Kidney cancers), స్వరపేటికలో వచ్చే కర్కటవ్రణములు ( Laryngeal cancers ) అధికశాతములో పొగత్రాగే వారిలోనే కలుగుతాయి. జీర్ణాశయము ( Stomach ), క్లోమము ( Pancreas ), కంఠము, అన్ననాళములలో పుట్టే పుట్టకురుపులు పొగత్రాగే వారిలోనే ఎక్కువ. పొగాకులలో నైట్రోసమైన్లు ( Nitrosamines ), పోలీసైక్లిక్ హైడ్రోకార్బనులు ( Polycyclic Hydrocarbons) అనే కర్కటవ్రణజనకములు ( Carcinogens) ఉంటాయి. పొగాకు నమిలే వారిలోను, పోకచెక్కలు విరివిగా నమిలే వారిలోను నోటిలో కాన్సరులు ఎక్కువగా వస్తాయి. కాలుతున్న అంచు నోటిలో పెట్టి చుట్టలు కాల్చే వారిలో ( విశాఖ, శ్రీకాకోళపు ప్రాంతాలలో యీ అడ్డపొగ అలవాటు ఉన్నది. ) అంగుట్లో కర్కటవ్రణములు రావచ్చును. జపాను దేశములో జీర్ణాశయపు పుట్టకురుపులు ఎక్కువయితే అమెరికాలో పెద్దప్రేవుల పుట్టకురుపులు ఎక్కువ. నా ఆత్మీయులలోను, నెయ్యులలోను పెద్దప్రేవుల కర్కటవ్రణములు చూసాక భారతీయులలో అంతా అనుకునే కంటె ఎక్కువ మందికే బృహదంత్ర కర్కటవ్రణములు Colon Cancers ) కలుగ వచ్చునేమో ననే సందిగ్ధము నాకు కలుగుతున్నది.
అతినీలలోహిత కిరణాల ( Ultraviolet rays ) వలన చర్మపు పుట్టకురుపులు, మెలనోమాలు ( Melanomas)కలుగుతాయి. రేడియో ధార్మిక కిరణాలకు ( Radio active rays ) లోనైతే పుట్టకురుపులు రావచ్చు.
ఱాతినార ( Asbestos )వాడే పరిశ్రమల్లో పనిచేసే వారికి శ్వాసకోశపుపొరలో ( Pleura ) మీసోథీలియోమా ( Mesothelioma) అనే కాన్సరు కలిగే అవకాశ మెక్కువ.
హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ( Human Papilloma Virus ) వలన గర్భాశయ ముఖములలో పుట్టకురుపులు ( Uterine Cervical Cancers ) కలుగుతాయి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వలన కాలేయపు పుట్టకురుపులు కలుగవచ్చును. హెలికోబాక్టర్ పైలొరై ( Heliocobacter pylori )అనే సూక్ష్మజీవుల వలన జీర్ణాశయపు ( Gastric) కాన్సరులు కలుగుతాయి.
వంశపారంపర్యము వలన మూడు నుంచి పది శాతపు కర్కటవ్రణములు సంభవిస్తాయి. జన్యువైపరీత్యములతో బి ఆర్ సి ఎ 1 , 2 ( BRCA 1 BRCA 2 ) జన్యువులు వంశానుగతముగా వస్తే రొమ్ము కాన్సరులు వచ్చే అవకాశములు ఎక్కువ.
కర్కటవ్రణములు ప్రమాదకరమైన వ్యాధులు. వాటిని కనుగొన్న సమయానికి అవి సుదూరవ్యాప్తి పొందకపోతే అవి చికిత్సకు లొంగే అవకాశాలు ఉంటాయి. వివిధావయవాలకు వ్యాప్తి చెందిన పుట్టకురుపులను పూర్తిగా నయము చేయుట కుదరక పోవచ్చును. ఆ స్థితులలో వైద్యులు ఉపశమన చికిత్సలే చేయగలుగుతారు. శస్త్రచికిత్స, రేడియోధార్మిక కిరణ ప్రసరణ చికిత్సలు ( Radiation therapy ) రసాయినకౌషధ చికిత్సలు ( Chemotherapy ) , ప్రతిరక్షణ చికిత్స ( Immunotherapy)లను వ్యాధి నివారణకు, ఉపశమన చికిత్సలకు వాడుతారు.
కాన్సరు వ్యాధిని సంపూర్ణముగా నయము చెయ్యాలంటే తొలిదశలలోనే వ్యాధిని పసిగట్టాలి. అంతే కాక కర్కటవ్రణములు రాకుండా జాగ్రత్తపడాలి.
కాన్సరు వ్యాధి నివారణ :
పొగ త్రాగడము, పొగాకు నములుట, హెచ్చుగా పోక చెక్కలు నమలుట జర్దాకిళ్ళీ వంటి వాడుకలు లేకుండా చూసుకోవాలి. సారాయి వినియోగమును చాలా అదుపులో ఉంచుకోవాలి. హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరస్ వ్యాధులు రాకుండా పిన్నవయస్సులోనే H.P.V టీకాలు (Vaccine) వేయించాలి. మితాహారము, శరీరపు బరువును అదుపులో ఉంచడము, శారీరకవ్యాయామము, కాయగూరలు, పళ్ళు , పూర్ణధాన్యముల వినియోగము పుట్టకురుపులను నివారించుటకు తోడ్పడుతాయి. హెపటైటిస్ బి సోకకుండా టీకాలు వేయించుకొనుట, హెపటైటిస్ సి రాకుండా తగిన జాగ్రత్తలలో ఉండుట రేడియోధార్మిక కిరణాలకు గురి కాకుండా వీలయినంత చూసుకొనుట కర్కటవ్రణములను నివారించుటకు తోడ్పడుతాయి.
పుట్టకురుపులు త్వరితముగా కనుగొని వాటికి సత్వర చికిత్స చేయడము వలన వాటిని నయము చేసే అవకాశ మున్నది. ఎవరికి వారు వారి శరీరమును శోధన చేసుకునుట వలన కొన్ని కాన్సరులను త్వరగా గుర్తించ వచ్చును. దేహమును , చర్మమును పరీక్షించుకొంటే చర్మముపై కలిగే వ్రణములు కనిపిస్తాయి. అసాధారణపు పుట్టుమచ్చలు కలిగినా , ఉన్న పుట్టుమచ్చలు పెరిగినా, లేక వాటి వర్ణములో మార్పులు జరిగినా , లేక వాటి వలన దురద, నొప్పి వంటి లక్షణములు పొడచూపినా, లేక వాటి చుట్టూ వలయములు ఏర్పడినా, మరే మార్పులు కలిగినా వైద్యులను సంప్రదించి, వాటిని శస్త్రచికిత్సచే తొలగించుకొని వాటికి కణపరీక్ష ( Biopsy ) చేయించుకోవాలి. స్త్రీలు కనీసము నెలకొకసారైనా వారి రొమ్ములను పరీక్షించుకోవాలి. అనుమానాస్పదమైన పెరుగుదలలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవాలి. స్తనచిత్రీకరణలు ( Mammograms) రొమ్ము కాన్సరులను సత్వరముగ కనుగొనుటకు తోడ్పడుతాయి. నలభై నుంచి డెబ్భై సంవత్సరములలో ఉన్న స్త్రీలకీ పరీక్షలు ప్రతి రెండు లేక మూడు సంవత్సరములకొక పర్యాయము వైద్యులు సూచిస్తారు.
గర్భాశయముఖ కర్కటవ్రణములు కొన్ని హ్యూమన్ పాపిల్లోమేటస్ వైరసుల ( Human papilloma viruses) వలన కలుగుతాయి. హెచ్.పి.వి ( HPV Vaccine ) టీకాలను పిల్లలకు వేసి ఈ పుట్టకురుపులను నివారించ గలము. ఇరవై సంవత్సరాల నుంచి అరవైఐదు సంవత్సరముల లోని స్త్రీలలో గర్భాశయ ముఖము నుంచి పాప్ స్మియర్ వలన గ్రహించిన కణపరీక్షలను ( Pap Smears ) వైద్యులు సిఫారసు చేస్తారు. ఈ పరీక్షలు కర్కటవ్రణములను తొలిదశలలో కనుగొందుకు ఉపయోగపడుతాయి.
ఉత్తర అమెరికా ఖండములో వైద్యులు ఏభై సంవత్సరములు నిండిన వారికి బృహదంత్ర అంతర్దర్శన పరీక్షలను ( Colonoscopies) ప్రతి ఐదు పది సంవత్సరములకు ఒకసారి సూచిస్తారు. ఈ పరీక్షలు చేసినప్పుడు పాలిప్స్ ( Polyps) అనే అంగుష్టాకారపు కంతులు కనిపిస్తే వాటిని సమూలముగా విద్యుద్దహనప్రక్రియచే ( Electro cauterization ) తొలగించి కణపరీక్షకు పంపిస్తారు. ఈ కంతులు తొలిదశలలో నిరపాయకరమైనా తరువాత అపాయకరమైన కాన్సరులుగా పరిణామము చెందవచ్చు. ఈ నిరపాయకరమైన ఆంత్రపు పెరుగుదలలను తొలగించుటచే వైద్యులు అపాయకరమైన కర్కటవ్రణములను నివారించ గలుగుతారు. తొలిదశలలో కనుక్కో బడిన బృహదాంత్ర కర్కటవ్రణములు ( Colon cancers ) చికిత్సలకు సాధారణముగా లొంగుతాయి. భారతదేశములో యీ కొలొనోస్కోపులు శోధన పరీక్షలుగా ప్రాచుర్యము పొందినట్లు లేదు. దీర్ఘకాలిక పరిశోధనలు చేస్తే వీటి ఉపయుక్తత తెలిసే అవకాశము ఉంది.
పొగత్రాగే వారిలో తరచు శ్వాసకోశపు చిత్రాలు తీస్తే శ్వాసకోశపు కర్కటవ్రణములను తొలిదశలలో కనుక్కొనే అవకాశము కొంత ఉండవచ్చును. సంవత్సరానికో సారి కాట్ స్కాన్ ( Low dose Computerized Axial Tomography Scan ) చేస్తే యీ కాన్సరులను త్వరగా కనుక్కొనే అవకాశము పెరుగుతుంది. కాని చాలా మందిలో శ్వాసకోశపు కర్కటవ్రణాలు ( Lung Cancers) బయటపడేటప్పటికే అవి వ్యాప్తి చెంది ఉంటాయి. ఒక పదిహైను శాతము మందిలో శస్త్రచికిత్సకు అవకాశము ఉండవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో తొలిదశలలో కనుక్కోబడక పోవుటచే నయమయే శ్వాసకోశపు కాన్సరులు చాలా తక్కువ ఉంటాయి.
రక్తములో ఉన్న ప్రాష్టేట్ స్పెసిఫిక్ ఏంటిజెన్ ( Prostate Specific Antigen ) పరీక్ష ప్రతి రెండు సంవత్సరములకు 55 - 69 సంవత్సరముల వయస్సులో ఉన్న పురుషులలో చేస్తే ప్రాష్టేట్ కర్కటవ్రణములను ( Prostatic Cancers) సకాలములో గుర్తించ వచ్చును.చాలా మందిలో ప్రాష్ట్రేట్ కాన్సరులు నెమ్మదిగా పెరుగుటచే పెక్కుశాతము మంది చికిత్స లేకపోయినా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశమున్నది. P.S.A పరీక్షలతో సత్వరముగా కనుక్కొని చికిత్స చేస్తే మరింత ప్రయోజనము చేకూర వచ్చును.
కర్కట వ్రణములు ఆరంభదశలో ఉన్నపుడు యే బాధా కలిగించక పోవచ్చును. అవి పెరుగుతున్న గొలది వివిధ లక్షణాలు పొడచూపుతాయి. సాధారణముగా అవి ఏ అవయవాలలో ఉంటాయో ఆ అవయవాలకు సంబంధించిన లక్షణాలు కలుగుతాయి. ఆకలి తగ్గుట , బరువు తగ్గుట , కర్కటవ్రణ లక్షణాలు. ఏ అవయవ సంబంధమైన వ్యాధి లక్షణాలు కనిపించినా తగిన శోధన పరీక్షలు చేయుట వలన అవి ప్రస్ఫుట మవ వచ్చును. రక్త పరీక్షలు, ఎక్స్ రేలు, కాట్ స్కానులు, అల్ట్రాసోనోగ్రాములు, ఎం.ఆర్.ఐ స్కానులు, పెట్స్కానులు, కొలొనోస్కోపి , గాస్ట్రోస్కోపి, బ్రాంఖోస్కొపీలు , కర్కటవ్రణములను కనుగొనుటకు ఉపయోగ పడుతాయి.
వ్రణములు, కనుక్కొన్నాక వాటినుంచి కణపరీక్షలు ( Biopsies) చేసి వ్యాధిని నిర్ణయిస్తారు. వివిధ పరీక్షలతో ఈ కర్కట వ్రణములు యితర అవయవములకు వ్యాపించాయో లేదో నిర్ణయించి తగిన చికిత్సలు చేస్తారు.
మిగిలిన వైజ్ఞానిక శాస్త్రాల ఆలంబనముగా వైద్యశాస్త్రము అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ మంతటా వైజ్ఞానిక పరిశోధకులు విజ్ఞానశాస్త్రపు టభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. ఆరంభదశలో కనుగొనబడిన కాన్సరులు చికిత్సకు లొంగే అవకాశమున్నది. అంత్యదశలలో కనుగొన్న కర్కటవ్రణములకు సంపూర్ణచికిత్సలు సాధ్యము కావు. అటువంటి పరిస్థితులలో ఉపశమన చికిత్సలకే అవకాశ ముంటుంది.

( తెలుగుతల్లి కెనడా లో ప్రచురించబడిన వ్యాసము )

No comments:

Post a Comment