Monday, September 25, 2017

నిద్రే ప్రాణప్రదం


నిద్రే ప్రాణప్రదం
సాహితీమిత్రులారా!

ఈ ప్రపంచంలో సర్వప్రాణులకు
ఆహారము తరువాత నిద్రే ప్రాణప్రదం
నిద్రలేనిదే బ్రతుకేలేదు కాదంటారా
ఆ నిద్ర గురించిన కొంత
విషయాన్ని ఇక్కడ గమనిద్దాం-

చరక సంహితలోని ఈ శ్లోకం చూడండి-
యదాతు మనసి క్లాంతే కర్మాత్మానః క్లమాన్వితాః
విషయేల్యో నివర్తంతే తదా స్వపిమానవః

అంటే మనోబడలిక(అలసట) చెందినప్పుడు, ఇంద్రియాలు
తమ తమ కర్తవ్యాలను మాని మనసునకే కైవసం కావడం
తటస్థించడం వలన శారీరక మానసిక చేష్టలు చేయజాలక
ఏకాంతం కోరతారు.

దాన్నే స్వప్నావస్థ - నిద్ర అంటారు. జాగ్రదావస్థలో ఆత్మ ఏదో ఒక
పని చేసే సంకల్పంలో ఉండే మనసు ఆత్మనుంచి విడివడి బుద్ధితో
కలిసి చింతనా రూపమైన వ్యాపార నిమగ్నమై ఉంటుంది.
పనులు చేసి చేసి చాలా అలసి పోవటం వలననే ఇంద్రియాలు
ప్రేరేపణ శక్తిని ఉడుగుతాయి. ఆ స్థితిలో బుద్ధి మనసులో
లీనమౌతుంది అంటే అది ఆత్మను చేరుతుంది. అప్పుడు
ఆ ఆత్మ వెంటనే ఏకాకారమై కృత్యాల ప్రేరేపణమాని
ఆనందకరమైన సుఖమైన స్వప్నం అనుభవిస్తుంది.
ఆ స్థితినే నిద్ర అంటాము.

ప్రాణాయామాది నియమపరులు నిద్ర ఏకాగ్రత, సుషుమ్నత చక్కగా గుర్తిస్తారు.

నిద్రవలన కలిగే ప్రయోజనం-
నైన యుక్తాపునర్యుఙ్త్కే నిద్రా దేహం సుఖాయుషాః
(పురుషం, యోగినం, సిధ్యా, సత్యౌ బుద్ధిః వాగతాః)
యుక్తమైన కాలంలో విద్యుక్తంగా నిద్రించడం వలన దేహానికి(మనస్సుకు)
సుఖమును కలిగించి ఆయువును వృద్ధిపరుస్తుంది.

ప్రతి జీవికి తమ జీవితంలో మూడోవంతు నిద్రనే ఆక్రమిస్తుంది.
సహజంగా వయసును బట్టి పసివారు 12 నుండి 14 గంటల నిద్రపోవాలి
అలాగే వృద్ధులు సాధారణంగా 10 గంటలు నిద్రపోవాలి. అలాగే
గర్భిణులు, పాలిచ్చే తల్లులకు నిద్ర కొంత ఎక్కువే అవసరము.
మొత్తానికి-

నిద్రాతు సేవితా కాలే, ధాతు సామ్య మతంద్రితామ్
పుష్టి, వర్ల, బలోత్సాహాగ్ని దీప్తిం కరేతిచ

నిద్ర అగ్నిదీపనం కలిగించి అలసటను పోగొట్టి ధాతువులు (తత్ఫలితంగా) సమత వహించి, తంద్రను పోగొట్టి పుష్టి, ఉత్సాహం పూరిస్తుంది. కాబట్టి, నియమానుసారం నిద్రించడం ఆరోగ్యప్రదం.
రాత్రికాలంలో ఎంత వేగంగా నిద్రిస్తే, ప్రాతఃకాలంలో అంతవేగంగా మేల్కొనడం వీలౌతుంది.
నిజానికి మనిషి 6 గంటలు నిద్రిస్తే సరిపోతుంది దీనికి ప్రమాణం
ఈ శ్లోకపాదం చూడండి.
యామ ద్వయం శయానస్తు బ్రహ్మ భూతాయకల్పతే
                                                                                            - వాగ్భట సూక్తి
రెండుయామములంటే 6 గంటలు క్రమం తప్పకుండా నిద్రించేవారికి
బ్రహ్మత్వం సిద్ధిస్తుంది- అని వాగ్భటసూక్తి.

నిద్ర సరిగా నిద్రించనివారికి ఒళ్ళు దిమ్మెక్కి మజ్జుగా, మబ్బుగా,
తలదిమ్ముగా, కండ్లులోనికి గుంజటం, తల భాధ, మలబద్ధకం,
అజీర్ణం కలగడం సహజం. అన్ని వ్యాధులకు అజీర్ణం,
మలబద్ధకం మూలమంటారు వైద్యులు.
నిద్ర అయుష్షును పెంచుతుందని అదేపనిగా నిద్రపోరాదు.
పగటిపూట నిద్ర పనికిరాదు. వేసవికాలమైతే కొంత సమయం
నిద్రించవచ్చని మరేకాలం నిద్రంచరాదని పెద్దలు చెబుతారు.
మొత్తానికి పగటి నిద్ర కంటే రాత్రి నిద్ర సహజమైన
ఆరోగ్యకరమైన నిద్ర.
శ్రామికులు, రాత చదువు ఎడతెరపిలేకుండా ఉండేవారికి
అలసిపోగానే నిద్ర పగలు ఒక్కొకప్పుడు అవసరమే
అది ఎవరికివారు అలసటను బట్టి నిర్ణయించుకోవాలి.
శ్రామికులు, చదువరులు చక్కగా స్నానం చేసి మనస్సును
నిర్మలంగా ఉంచుకొని తక్కువగా నిద్రించినా కలతలుండవు.
కలలురావు. సోమరిపోతులు, తిండిపోతులు, బలహీనులు,
దురాలోచనాపరులు దుండగులకు నిద్ర ఎక్కువే అనిపించినా
భయానకమైన కలలతో కలత నిద్రకలుగుతుంది.
కొందరికి నిద్ర రావడం లేదని అనుకుంటూనే
నిద్రలో గడుపుట పూర్తికాకున్నా అంతో ఇంతో
నిద్రలోనే ఉంటారనేది గమనించరు.
అది వారివారి మనోవేదనే కాని
నిద్రలేకపోతే బ్రతుకే లేదుకదా
నిద్రే ప్రాణప్రదం.


No comments:

Post a Comment