మనుస్మృతిలో రాజు
సాహితీమిత్రులారా!
రాజును గురించిన కొన్ని ఆసక్తికరమైన
విషయాలు రాజనీతిని గురించిన విషయాలు
మనుస్మృతిలో కనిపిస్తాయి వాటిని ఇక్కడ-
ఇంద్రానిల యమార్కాణా
మగ్నేశ్చ వరుణస్య చ
చంద్ర విత్తేశ యోశ్చైవ
మాత్రా నిర్హృత్య శాశ్వతీః
(మనుస్మృతి - 7-4)
రాజులేక ప్రపంచము మర్యాదమీరి చెడిపోతుంటే
బ్రహ్మ ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఇంద్రుడు,
వాయువు, యముడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు,
చంద్రుడు, కుబేరుడు - వీరి అంశలను గ్రహించి
రాజును సృజించాడు.
తపత్యాదిత్య నచ్చైష
చక్షూంషిచ మానాంసిచ
న చైవం భువిశక్నోతి
కశ్చదవ్యభివీక్షితుమ్
రాజు సూర్యునివలె తనను చూచేవారి చూపులను
మనస్సును చుఱచుఱ దహించివేస్తున్నాడు.
ఎవడూ రాజును తల యెత్తైనా చూడజాలడు.
ఇంద్రస్యార్కస్య వాయోశ్చ
యమస్య చ వరుణస్యచ
చంద్రాస్యాగ్నే పృథివ్యాశ్చ
తేజోవృత్తం నృపశ్చరేత్ (9-313)
రాజు ఇంద్రుడు, సూర్యుడు, వాయువు, యముడు,
వరుణుడు, చంద్రుడు, అగ్ని, భూమి - వీరి తేజస్సును
నడవడిలో గలవాడై మెలగాలి.
వార్షికాం శ్చతురో మాసాన్
యథేంద్రోపి ప్రవర్షతి
తథాభివర్షేత్స్వం రాష్ట్రం
కామై రింద్రవ్రతం చరస్
ఇంద్రుడు వర్షాలను నాలుగు నెలలు కురిపించి
సస్యాదులను పండేవిధంగా చేసినట్లు
రాజు ఇంద్రునివలె తనరాజ్యంలోని ప్రజలకు
కోరికలు పండునట్లు చేయాలి.
అష్టాన్ మాసాన్ యథాదిత్య
స్తోయం హరతి రశ్మిభిః
తథాహరే త్కరం రాష్ట్రా
న్ని త్య మర్క వ్రతం హితత్
సూర్యుడు తక్కిన 8 నెలలు తన కిరణములచే
కొంచెము కొంచెముగానే భూమినుండి నీటిని గ్రహించినట్లు
రాజును నీతిమార్గమును తప్పక ప్రజలకు బాధలేకుండునట్లు
తనకు రావలసిన పన్నులను రాబట్టుకొనవలెను. దీని పేరు
సూర్యవ్రతము.
ప్రవిశ్య సర్వభూతాని
యథాచరతి మారుతః
తథాచారైః ప్రవేష్టవ్వం
వ్రతమేతద్ధి మారుతమ్
ప్రాణవాయువు అన్ని ప్రాణులలో ప్రవేశించి
బ్రతికింప చేసేవిధంగా రాజు వేగుల మూలమున
అందరిలో ప్రవేశించి వారి కష్టసుఖములను
తెలుసుకొని భరించవలెను - దీనికే
మారుతవ్రతమని పేరు.
యథా యమః ప్రియద్వేష్యౌ
ప్రాప్తే కాలే నియచ్ఛతి
తథా రాజ్ఞా నియంతవ్యాః
ప్రజా స్తద్ధి యమవ్రతమ్
యముడు శత్రువులు మిత్రులు అని తేడా లేకుండా
వారివారి పుణ్యపాపములకొలది పక్షపాతంలేకుండా
సమానంగా ఏవిధంగా నియమిస్తాడో అదేవిధంగా రాజు
నేరములు చేసిన వారిని స్నేహద్వేషములు లేకుండా
వారివారిదోషములకు తగినట్లు దండించాలి. దీన్నే
యమవ్రతం అంటారు.
వరుణేన యథా పాశై
ర్బద్ధ ఏవాభిదృశ్యతే
తథా పాపా నిగృహ్ణీయా
ద్వ్రతమే తద్ధి వారుణామ్
ఎవడు వరుణపాశానికి కట్టుబడడో
అతడు నిస్సంశయముగా వరుణపాశాని
కట్టబడినవాడే. కావున రాజు పాపకారులను
ఎట్లు తమ అధికారమును నిర్వర్తిపంపరో
అట్లు వారిని ఆవిథంగా దండింపవలెను.
దీనికే వరుణ వ్రతమనిపేరు.
పరిపూర్ణం యథా చంద్రం
దృష్ట్వా హృష్యంతి మానవాః
తథాప్రకృతియో యస్మిన్
సచాంద్ర వ్రతికో నృపః
పూర్ణ చంద్రుని చూచి జనులు ఎట్లా సంతోషిస్తారో
అట్లు తనను చూచి వారట్లు సంతోషపడునట్లు
రాజు ఉండాలి. దీన్నే చంద్రవ్రతం అంటారు.
ప్రతాపయుక్త స్తేజస్వీ
నిత్యం స్యా త్పాకర్మ సు
దుష్టసామంత హింస్రశ్చ
తదాగ్నేయ వ్రతం స్మృతమ్
రాజు ప్రతాపము తేజస్సుకలవాడై
ఎల్లపుడు పాపాత్ములను, దుష్టులగు
సామంతులను హింసించువాడై ఉండవలెను.
దీనినే ఆగ్నేయవ్రతమంటారు.
యథాసర్వాణి భూతాని
ధారాధారయతేసమమ్
తథాసర్వాణి భూతాని
బిభ్రతః పార్థివం వ్రతమ్
స్థావరములను జంగమములను ఉత్తమనీచులను
భూమి ఏవిధంగా సమంగా భరిస్తుందో అదేవిధంగా
పండిత మూర్ఖలను, ధనికదరిద్రులను దీనుల సనాథులను
అందరిని భరించాలి. దీన్నే పృథ్వీ వ్రతమంటారు.
No comments:
Post a Comment