Thursday, May 16, 2019

మా అమ్మ – నడిచే బడి


మా అమ్మ – నడిచే బడి




సాహితీమిత్రులారా!

అందరు అమ్మలూ ఒకటే! వాళ్ళకు జీవితమే వాళ్ళ పిల్లలనెలా పెంచిపెద్ద చేయాలో నేర్పుతుంది. వాళ్ళెక్కువ చదువుకోక పోయినా వాళ్ళ పిల్లలకేమని పాఠాలు చెప్పాలో, వాళ్ళకు తెలుసు! మా అమ్మా అంతే! ఆమెకు ఇంగితజ్ఞానం, తెలివీ ఎక్కువ. వాళ్ళ నాన్న స్కూలు హెడ్మాస్టరు. అందుకని ఆయన స్కూల్లోనే ఐదవ తరగతి వరకూ చదివింది. అయినా తన పిల్లలు ఐదు మంది కనీసం గ్రాడ్యుయేషన్, వీలయితే ఇంకా ఎక్కువ చదవాలని ఆమె ఆశయం.

ఈ వ్యాసం కోసం రచయిత్రి 
కుమార్తె గీసిన చిత్రం

ఆవిడకు పిల్లలను ఎక్కువగా దగ్గరికి తీసే అలవాటు లేదు. నేనయితే, ఆమెకు ముప్పయి ఏళ్ళవయసొచ్చిన తర్వాత వద్దనుకుంటూనే పుట్టినందుకేమో ఇంకా దూరం! ఇంట్లో నాయన నుంచీ, అన్నయ్య, అక్కలదాకా అందరికీ చిన్నదాన్నని ముద్దు. అయినా ఎవరూ నన్ను గారాబం చేసి చెడగొట్టే వీలు లేదు. అక్కయ్యల మీద ఆమె విధించే ఆంక్షలు, క్రమశిక్షణా పద్దతులు నాకూ వర్తిస్తాయి అని మాటల్లో చెప్పనక్కర లేదు. కూర్చున్నా, లేచినా ఆమె ఒక కన్ను ఇటే ఉంటుందనీ, అడుగు తప్పిపడిందంటే చంపేస్తుందని తెలుసు!

మా అమ్మ వంటలో దిట్ట. సామాన్యమయిన పదార్థాలు, మితంగా ఉపయోగించినా, కట్టెలతో మండే పొయ్యి మీద మా కందరికీ రుచిగా వండి వడ్డించేది. మా ఇంట్లో చాలా ఏళ్ళ వరకూ అమ్మ వంటకు కుండలు ఉపయోగించేది. పండగ రోజుల్లో ఏవైనా ప్రత్యేకమయిన వంటలు మాత్రం కంచు, ఇత్తడి గిన్నెల్లో చేసేది. దానికి ముందు రోజు పెట్టెలోంచి ఆ గిన్నెలు తీసి శుభ్రంగా కడిగేది. ప్రతి రోజూ జొన్న రొట్టె, ముద్ద పప్పు ఉదయం ఫలహారం. ఎప్పుడో ఒకసారి మా అక్కలతో పిండి రుబ్బించి దోశలు, వేరుశనగపప్పు చట్నీ చేసేది. ఏం చేసినా లొట్టలేస్తూ తినేవాళ్ళం.

నేను సెకెండ్ ఫారం (ఏడో తరగతి) లో ఉండగా మా నాన్న చనిపోయారు. పెద్దక్కయ్యకు పెళ్ళయిపోయింది. చిన్నక్కయ్యలు కర్నూల్లో కాలేజీల్లో చదువుతున్నారు. ఇంట్లో అన్నయ్య, వదినె, అమ్మలతో బాటు నేనొక్కదాన్నే. నాయన ఉన్నప్పుడు ఇంటిక్కావలసిన బయటి పనులన్నీ నాయన ఆఫీసునుంచీ ఇద్దరు ప్యూన్లు రసూలు, ఓబులేసు అనేవాళ్ళు వచ్చి చేసేవారు. అమ్మకు వాళ్ళంటే ప్రేమ. వాళ్ళకు అమ్మంటే గౌరవం. ఇద్దరివీ మతాలు వేరయినా రామలక్ష్మణుల్లా కలిసి ఉండేవారు. ఏపనయినా కలిసి చేసేవారు. కరెంటు బిల్లు కట్టడం దగ్గర్నుంచీ, ఇంటికి కావలసిన సరుకులు తేవటం వరకూ వాళ్ళే చేసేవారు. అందుకని మాకెవరికీ ఆ పనులు చేసే అలవాటు లేదు. నాయన పోయాక అలాంటి పనులన్నీ అన్నయ్య చేయటం అమ్మకిష్టం లేదు. అవిడ ప్రకారం ఆయన చదివిన చదువుకు గవర్నరులా కాలిమీద కాలువేసుకుని ఉండాలి ఆయన. అందుకని అన్నిటికీ తనే వెళ్ళేది. ఆమె వెంట సహాయం నేను. ఎంత దూరంలో ఉన్న రేషన్ షాపుకయినా నడిచే వెళ్ళేవాళ్ళం. గంటలకొద్దీ క్యూలో నిలబడి, నెలకు కావలసిన, గోధుమలు, చక్కెర సంపాదించే వాళ్ళం! వచ్చేటప్పుడు మాత్రం సామాన్ల బరువెక్కితే రిక్షా ఎక్కేవాళ్ళం, అర్ధ రూపాయో, ముప్పావలానో ఇచ్చి.

అప్పట్లో పత్రికలు ఎక్కువ వచ్చేవి కాదు. ఒకరింట్లో ఆంధ్రప్రభ తెప్పిస్తే, మరొకరు ఆంధ్రపత్రిక తెప్పించుకుని అందరూ రెండు చదివేవారు. మా ఇంట్లో పత్రికలకు కూడా ఖర్చు పెట్టిన గుర్తు లేదు. అమ్మ మధ్యాహ్నం తనకు తీరుబాటుగా ఉన్నప్పుడు చాలా పుస్తకాలు చదివేది. స్థానిక జిల్లా లైబ్రరీ నుంచీ అన్నయ్య తెలుగు నవలలు తెచ్చి పెట్టేవాడు. ఆవిడ ఆరోజుల్లో ఇంచుమించు తెలుగులో వచ్చిన బెంగాలీ నవలల అనువాదాలన్నీ ఒకసారి చదివేసుంటుంది. బంధువులందరితో ఉత్తర ప్రత్యుత్తరాలుండాలని ఆమె నమ్మకం! అన్నీ చదవగలిగినా, బంధువుల ఉత్తరాలు మాత్రం, పోస్ట్ కార్డు మీద, ఆమె డిక్టేషన్ చేస్తుంటే మేమెవరయినా వ్రాయాలి. చివర్లో సంతకంగా తనపేరు వ్రాయడానికి మాత్రం తనకు చోటుండాలి!

అమ్మ ఎక్కువ చదువుకోలేదు కాబట్టి మా కెవరికీ చదువులో ఏవిధంగానూ తోడ్పడలేదని అనుకున్న నన్ను కూడా ఆశ్చర్యపరిచిందీ సంఘటన. కర్నూలు మెడికల్ కాలేజిలో చదువుతున్న మా అక్క ఒకసారి ఫోన్ చేసింది. అప్పట్లో ఇళ్ళలో ఫోన్లుండేవి కావు. పోస్ట్-ఆఫీసుకు ట్రంక్-కాల్ చేసి మా చిరునామా చెప్తే, పోస్ట్‌మాన్ ఇంటికి వచ్చి పిలుస్తాడు. ఒక ఆదివారం ఉదయం, పోస్ట్‌మాన్ మా ఇంటికొచ్చి “బాలనాగమ్మ ఎవరమ్మా?” అని అడిగాడు. మా అమ్మ బయటికొచ్చి విషయం తెలుసుకుంది. కర్నూలు నుంచీ మా అక్క ఫోన్ చేసి అమ్మను అడుగుతోంది. అమ్మ రిక్షా ఎక్కి వెళ్తుంటే నేనూ వెంటబడ్డాను. పాతూర్లో ఉన్న ఒకే పోస్ట్ ఆఫీసుకు వెళ్ళాము. మా అక్క మళ్ళీ రెండుగంటల తరువాత ఫోన్ చేస్తే మేమక్కడున్నాము. నన్ను లోపలికి ఫోను దగ్గరికి రానివ్వలేదు. అప్పట్లో ఇలా ఫోను వస్తే మామూలుగా కీడేగానీ మేలు శంకించరు. అందుకని కాలు కాలిన పిల్లిలా అమ్మ బయటికొచ్చేవరకూ, పోస్ట్ ఆఫీసు చుట్టూ ఉన్న స్థలంలో ప్రదక్షిణలు చేస్తున్నాను. అరగంట తర్వాత బయటికొచ్చిన అమ్మ, “దానికి రేపు పెద్ద పరీక్షలు గదా? భయమవుతుందంట! నేను పోవాలి ఊరికి” అని తనలో తను అనుకున్నట్లుగా చెప్పింది.

ఇంటికెళ్ళాక, లోపలికెళ్ళి చిన్న బ్యాగులో కొన్ని బట్టలు సర్దుకుని అదే రిక్షాలో బయల్దేరింది. అక్క పరీక్షలకు భయపడటానికి, ఈవిడ హుటాహుటీ బయల్దేరడానికీ సంబంధం అప్పట్లో నాకర్థం కాకున్నా, నిదానంగా తెలిసింది – అమ్మ అక్కకు ధైర్యం చెప్పి తోడుండి పరీక్షలు వ్రాయించడానికి వెళ్ళింది. అది అక్క మొదటి సంత్సరం. తరువాత ప్రతీ సంవత్సరం ఈ టైములో ఫోను వచ్చేదాకా ఆగకుండా తనే ప్లానేసుకుని ప్రయాణం కట్టేది కర్నూలుకు. ఇది మరో నాలుగేళ్ళు కొనసాగింది. అక్క బెదురు గొడ్డు, నేనయితేనా అనుకున్నాను! కానీ బిఎస్సీ మూడు సంవత్సరాల కోర్సు ఒకేసారి పరీక్ష వ్రాయవలసి వచ్చేసరికి, నాకూ భయమేసింది. అమ్మ దగ్గరికి పరిగెత్తాను. ఆవిడ పక్క గదిలోనే ఉంది కాబట్టి సరిపోయింది! (అప్పట్లో సెమిస్టర్ పద్ధతి లేదు! మేము మూడేళ్ళు కలిపి ఒకేసారి వ్రాశాము!)

అక్కయ్యలు, అన్నయ్య ఆవిడ వల్ల చదువు మీద మాత్రం శ్రద్ధ పెంపొందించుకుంటే, నాకు మాత్రం నేనే వ్రాయాలనే ఆసక్తి, అమ్మ చదివే పుస్తకాలను తిరగేస్తున్నప్పుడే కలిగింది. పత్రికల్లో అప్పుడప్పుడు చదివే సత్యమూర్తిగారి కార్టూన్ స్ట్రిప్స్, హాస్య కథానికలు నాకు ఎక్కువ నచ్చేవి. నేను స్కూల్లో ఫోర్త్ ఫారం (తొమ్మిదో క్లాసు) చదివేటప్పుడు నా మొదటి కథ వ్రాశాను. ఆ అనుభవమే ఒక కథగా అయింది.

మా ఇంటి వెనకాల ఒక ఔట్‌హవుస్ ఉండేది. అందులో ఒక చిన్న కుటుంబం బాడుగకు ఉండేవారు. భార్య శివమ్మ సర్కారు ఆస్పత్రిలో నర్సుగా పనిచేసేది. భర్త రామయ్య ఏం పనిచెయ్యడు. ఇంట్లో ఊరికే కూర్చుని బీడీలు తాగుతూనో, వాళ్ళ రెండేళ్ళ పాపను చూసుకునే శివమ్మ తల్లితో పోట్లాడుతూనో, లేదా బయటికెళ్ళి తనలాంటి పనిలేని స్నేహితులతో బలాదూరు తిరుగుతూనో గడుపుతాడు. ఇంట్లో ఉన్నంతసేపూ తన పనికిరాని పాత సైకిల్‌ను నిలబెట్టుకుని, రిపేరు చేస్తూ కూర్చోవడం అతనికి చాలా ఇష్టమయిన వ్యాసంగం! వీళ్ళందర్నీ కలిపి ఒక హాస్యకథానిక వ్రాస్తే అది ఆంధ్రపత్రికలో వచ్చేసరికి, ఇంట్లో ఉన్న కుటుంబం ఇల్లు మారారు. పత్రికవారు కాంప్లిమెంటరీ కాపీతో బాటు యాభయి రూపాయలు మనీఆర్డర్ పంపారు. కథ నేననుకున్నట్లే చక్కగా కార్టూన్‌లాంటి రామయ్య బొమ్మ అతని సైకిల్‌తో బాటు వచ్చింది. చూసి చాలా గర్వ పడ్డాను. మొదటి కథ ప్రచురణ కదా మరి! గొప్పగా వదినెకు చూపాను. సాయంత్రమయ్యేసరికి ఈ గాలి నిండిన బెలూను పగిలిపోతుందని తెలియలేదు.

సాయంత్రం స్కూల్లో ఎన్.సి.సి ఉండి ఇంటికి రావడం ఆలస్యమయింది. మా ఇంటి ముందర పెద్ద వరండా ఉంటుంది. అక్కడ మా అమ్మ, వదినె కూర్చుని ఎవరితోనో మాట్లాడుతున్నారు. మొదట అక్కడ కూర్చుని ఉన్న జంట వాళ్ళు వేసుకున్న కాస్త మంచి బట్టలవల్ల, వాళ్ళను రామయ్య, శివమ్మ అని గుర్తు పట్టలేకపోయాను. మునుపెప్పుడూ రామయ్యను నేను మాసిన అడ్డపంచె, బనియనులో తప్ప చూడలేదు మరి. వాళ్ళిద్దరి ముఖాలు, మా వాళ్ళ ముఖాల్లో భావం చూసిన ఆ ఒక్క క్షణంలో, అక్కడ పరిస్థితి గంభీరంగా ఉందని కనుక్కున్నాను. వదినె ‘మాట్లాడకుండా లోపలికెళ్ళు’ అన్నట్లు సైగలు చేసింది. వెళ్ళి కాళ్ళు, ముఖం కడుక్కుని, నా గదిలోకెళ్ళి చదువుకుంటున్నట్లు నటించసాగాను. మధ్యలో ఒకసారి వదినె లోపలికొచ్చి బీరువాలోంచి డబ్బు తీయటం గమనించాను. కొంచం సేపటికి రామయ్య, శివమ్మ వెళ్ళిపోయారు.

తర్వాత చెప్పింది వదినె అసలేం జరిగిందో. సాయంత్రం నాలుగ్గంటలకు పత్రిక తీసుకుని రామయ్య, శివమ్మ మా ఇంటికొచ్చారు. అంతకుముందే బాడుగకు ఉండి వెళ్ళిన వాళ్ళు కాబట్టి అమ్మ సంభ్రమంగా వాళ్ళను అహ్వానించి కూర్చోబెట్టింది. “మీ అమ్మ ఆరోగ్యం బాగుందేమప్పా?” అని అడిగింది. “పిల్లను ఎత్తుకుని రాలేదేం?” అని అడిగింది. “మా అత్త దగ్గర ఆడుకుంటుందమ్మ!” అని క్లుప్తంగా జవాబిచ్చింది శివమ్మ, భర్త కోపమూ అతని ముఖభావమూ గమనించి. అతని చేతిలో చుట్ట చుట్టి ఉన్నది ఏదో పత్రిక అని తెలుస్తోంది. కానీ విషయమేమిటో వీళ్ళకు అర్థం కాలేదు. రామయ్య పత్రిక చుట్ట విప్పదీసి, నా కథ ఉన్న పేజీ తెరిచి “చూడమ్మా, మీ బిడ్డ చేసిన పని?” మా వాళ్ళిద్దరికీ అది నాకథా అని తెలుసు. కానీ తప్పేం జరిగిందో మాత్రం అర్థం కాలేదు. వదినె పుస్తకం చేతికి తీసుకుని రామయ్య, శివమ్మ అన్న పేర్లవయిపు చూపించింది అమ్మకు. కథలో వాళ్ళ పేర్లు, రచయితగా నాపేరు ఉన్నందుకు నేనే వాళ్ళమీద ఈ కథ వ్రాశానని వాళ్ళకు అవమానం అనిపించి కోపమొచ్చింది.

వదినె, అమ్మ ఏం మాట్లాడలేదు మొదట. రామయ్యను అతని కోపాన్ని వెళ్ళగక్కనిచ్చారు. “ఏమమ్మా! మీ బిడ్డకు బుద్ధుందా లేదా? మేమే దొరికినామా కథ రాయడానికి? మా వాళ్ళంతా మమ్మల్ను గేలి చేస్తున్నారు …” అని నిప్పులు కక్కుతున్న రామయ్యను ఎలా చల్లబరచాలో అమ్మకు తెలుసు. వాళ్ళకు ఈమె మీద చాలా గౌరవం! “పోన్లేప్పా! దానికి బుద్ధి లేదు! దాని బదులు నేను చెప్తున్నా. తప్పయిందిలే, ఏమనుకోవద్దండి!” అని వదినెకు సైగ చేసి లోపలికి పంపింది. వదినె లోపలికొచ్చి యాభయి రూపాయల (అప్పట్లో యాభయి రూపాయల విలువ కనీసం ఐదు వందలనుకోవచ్చు!) నోటొకటి తీసుకుని వెళ్ళి అమ్మకిచ్చింది. అమ్మ, “పాపకు మంచి గౌను కొనుక్కోండి!” అని ఇంకా వదినె తెచ్చిచ్చిన తాంబూలం, టెంకాయతో బాటు నోటును పెట్టి ఇచ్చింది. రామయ్య ఆశగా నోటు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. మరొక అరగంటలో ఆనోటు ఏమయిపోతుందో అందరికీ తెలుసు. అసలు వాళ్ళు వచ్చిందే అందుకు అన్న విషయంలో కూడా రహస్యమేం లేదు.

చిత్రమేమిటంటే, వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మ నన్ను పిలిచి, “ఏమే బుద్ధిలేని గాడిదా! నీకు కథ రాస్తే పేర్లు మార్చాలని కూడా తెలీదా?” అని అడిగింది. ఆవిడ మాటల తీరే అది! అందులో ఎక్కువ కోపమేం నాకు కనిపించలేదు. ఔత్సాహిక సాహిత్య పాఠకురాలయిన ఆవిడ తన కూతురు సౄజనాత్మక శక్తికి పడుతున్న సంతోషం మీద రామయ్యలాంటి వాళ్ళు చన్నీళ్ళు పోయగలరా? ఒకటిమాత్రం అర్థమయింది. నిజ జీవితంలోని పాత్రలు ఉపయోగించి కథలు వ్రాస్తే, పేర్లు మార్చి వ్రాయాలి! అంతే కాదు నాపేరు కూడా మార్చేసి కలంపేరు పెట్టుకుంటే మంచిదని అనుకున్నాను. అందువల్ల నా మొదటి కథ మాత్రమే నా స్వంత పేరుతో ప్రచురించబడింది. తర్వాత అంతా అజ్ఞాతవాసమే!

తర్వాత అమ్మ, వదినె ఇచ్చిన ప్రోత్సాహంతో కొన్ని కథలు వ్రాశాను. కొన్ని తిరుగు ప్రయాణం కట్టినా పది దాకా ప్రచురించబడ్డాయి. అప్పుడొచ్చిందొక కొత్త సమస్య! మా రెండవ అక్క అప్పుడు కర్నూలు మెడికల్ కాలేజిలో చదువు ముగించి హవుస్ సర్జన్సీ చేస్తోంది. తనతో ఒకసారి సరదాగా కర్నూలుకెళ్ళాను. తను కాజువల్‌గా వాళ్ళ ప్రొఫెసర్ కంటి డాక్టరు దగ్గర పరీక్ష చేయిస్తే నాకు కొద్దిగా దీర్ఘ దౄష్టి లోపం ఉన్నట్లు తెలిసింది. అంతే దాంతో తను అప్సెట్ అయిపోయి ఇంటికొచ్చి అందరికీ చెప్పింది. అయిపోయింది. అన్నయ్య, “కథలూ కాకరకాయలూ” వ్రాయడం మానేసి చదువుమీద మాత్రం ధ్యాస పెట్టాలని కట్టుదిట్టం చేశాడు. ఆయన భయానికి, రహస్యంగా కథలు వ్రాసినా, పత్రికల ఉత్తరాలు వచ్చినప్పుడు ఆయనకు తెలుస్తుందని భయం!

ఈ సమస్యకూ ఒక సమాధానం దొరికింది. మా ఇంటినుంచీ అరమైలు దూరంలో మా మామయ్య ఇల్లుంది. వాళ్ళను ఒప్పించి ఆయన ఇంటి చిరునామా ఇచ్చి కథలు పంపటం మొదలుపెట్టాను. నా రచనా వ్యాసంగానికి అడ్డంకుల్లేకపోయాయి. మా బావ నా పోస్ట్‌మాన్. నా కొచ్చే ఉత్తరాలన్నీ తెచ్చిచ్చేవాడు.

నా పెళ్ళయి, నేను ప్రసవానికి అన్నయ్య ఇంటికి వచ్చినప్పుడు, ఆయన ఇల్లు హైదరాబాదులో అనుకూలంగా లేదని నన్ను నాకూతురును అమ్మ అనంతపూరుకు తీసుకొచ్చేసింది. ఆవిడ అప్పటికే మోకాళ్ళ నొపులతో బాధపడుతున్నా ఓర్చుకుని వంట చేసి పెట్టి మా ఇద్దర్నీ ఏ లోటూ లేకుండా చూసుకుంది. తమాషా ఏమిటంటే నా మొదటి కథావస్తువు అయిన అవుట్‌హవుస్‌లో నే ఇప్పుడు అమ్మ వంట చేస్తుంది. పాపను కాళ్ళమీద పడుకోబెట్టి స్నానం చేయిస్తుంది. ఇల్లంతా అద్దెకిచ్చి, ఈ అవుట్‌హవుస్ మాత్రమే ఉంచుకుంది అన్నయ్య హైదరాబాదుకు మారిపోయిన తర్వాత. అప్పుడు మళ్ళీ అమ్మ చేత చిన్నప్పుడు తిని రుచులు గుర్తున్న వంటలు జొన్న రొట్టె, గోంగూర పప్పు, నూనె వంకాయ కూర అడిగి మరీ చేయించుకుని తిన్నాను.

రాత్రుళ్ళు పాప నిద్రపోకుండా ఏడిస్తే, ఒళ్ళో ఊరుకోబెట్టి, అలాగే కూర్చుని ఒక కథ, ఒక నవల వ్రాశాను. “బాలింత రాలివి. ఎక్కువ సేపు కూచ్చోవద్దమ్మా!” అని అమ్మ మందలించినా నా పాటికి నన్ను వదిలేసేది. ఎందుకంటే, పగలంతా ఒక్కతే మా సేవ చేసి అలసిపోయిన ఆమె తప్పనిసరిగా గుర్రుపెట్టి నిద్రపోయేది.

తరువాత, నెలకొకసారయినా మమ్మల్ని చూడటానికి వచ్చేది.

మా పాప శివానికి అవ్వ వస్తే సంబరం! ఆవిడేం ఎక్కువగా ముద్దు చెయ్యటం గానీ, అతిగా దగ్గరకు తియ్యటం గానీ చెయదు. అయితే దీనికున్న ఆకర్షణేమిటి? ఆవిడ వచ్చినప్పుడల్లా తప్పనిసరిగా వెంట వచ్చేవి బోలెడన్ని స్వీట్లు! అంత కన్న ముఖ్యమయింది ఆట సామాన్లు. వచ్చిన ప్రతీ సారీ, ఎలా వెతుక్కొస్తుందో నాకయితే తెలీదు, ఒక సారి రాగి అయితే, ఇంకొకసారి అల్యూమినియం చొప్పున చిన్న పిల్లల వంట పాత్రలు మాత్రం, తప్పక తెచ్చేది. పాపకు ఐదేళ్ళ వయసు వచ్చేసరికి, తన దగ్గర లేని వంట పాత్రల రకం లేదు.

ఆమెకు ఆర్త్రిటిస్ వల్ల మోకాళ్ళు నొప్పి. రాను రాను నొప్పులెక్కువయి అనంతపురానికి రావటం తగ్గించి అన్నయ్యవాళ్ళతో హైదరాబాదులో సెటిల్ అయిపోయింది. నొప్పితో చాలా మటుకు పడుకునే గడిపేది. అప్పటికి అన్నయ్య కొడుకు గోవిందు ఇంజనీరింగ్ డిగ్రీ ముగించి అమెరికాలో ఎం.ఎస్ చేసి అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. వాడు అక్కడినుంచీ ఫోన్ చేసి మాట్లాడించినప్పుడల్లా ఒకేమాట ఉండేది ఆవిడ నోట్లో. “అమెరికాలో మోకాలి చిప్పలు మారుస్తారంట గదరా! నాకు నువ్వు తీసుకొచ్చి మార్పించు. ఈ నొప్పిని తట్టుకోలేకుండా ఉన్నాను.” “అట్ల తేవడానికి కాదవ్వా! నిన్నే ఇక్కడికి తీసుకొచ్చి ఆపరేషన్ చేయిస్తాలే!” అని ధైర్యం చెప్పేవాడు. అలాంటిదొక చికిత్స ఉందనీ ఆవిడకెవరు చెప్పారో అని ఆశ్చర్యపోయేదాన్ని. పడుకునే ఉండాల్సినప్పుడు అస్తమానం టివీ చూస్తూ ఉండేది అందులో సగందాకా అస్పష్టంగా కనిపించినా సరే, ఆమె గదిలో ఒక టీవీ పెట్టించుకుంది. బహుశా అందులో ఎక్కడయినా చూసి కనుక్కుందేమో ‘టోటల్ నీ రీప్లేస్‌మెంట్’ గురించి.

నాకు విప్రో కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా మొదటిసారి అమెరికాకు వెళ్ళే అవకాశం వచ్చింది. ఎందుకో వెళ్ళే లోపల అమ్మనొకసారి చూద్దామనిపించింది. ముందు హైదరాబాదుకు వెళ్ళి వచ్చాను.

అప్పట్లో ప్రయాణం ఇంకా దీర్ఘంగా ఉండేది. 42 గంటల ప్రయాణం తర్వాత ఆస్టిన్, టెక్సాస్ చేరుకుని, ఒక సహోద్యొగి సహాయంతో మరొక ఉద్యోగి కుటుంబం సెలవుల్లో ఇండియాకు వెళ్ళుంటే వాళ్ళింట్లో దిగాను. ఆవేళ శనివారం. ఆదివారం విశ్రాంతి తీసుకుని సోమవారం ఆఫీసుకు వెళ్ళొచ్చని ప్లాను. ఇంట్లో కాస్త సర్దుకున్న తర్వాత, సియాటిల్ లో ఉన్న మా మేనల్లుడు గోవిందుకు ఫోన్ చేశాను.

ఉభయ కుశలోపరి అయింతర్వాత అసలు విషయం చెప్పాడు! “అవ్వ నిన్న ఇండియాలో శుక్రవారం ఉదయం పోయిందటత్తా!” అన్నాడు. ఒక్క నిముషం మాట్లాడలేకపోయాను. మనసులో ద్వైదీభావం! బయలుదేరే ముందు వెళ్ళి ఆమెను చూసి రావటం ఏదో అర్థానికి అందని ఒక సిక్స్త్ సెన్స్. కానీ నన్ను ఈ భూమి మీదికి తెచ్చిన అమ్మ ఇక లేదు అనుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. కాస్సేపుండి, “అత్తా! ఏడుస్తున్నావా?” అని అడిగాడు. చిత్రం! నా కళ్ళు చెమ్మగిల్లను కూడా లేదు. “లేదు గోవిందూ!” అన్నాను క్షీణ స్వరంతో. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో “రేపు మళ్ళీ ఫోన్ చేస్తాలే,” అని పెట్టేశాడు.

ఆ పరదేశంలో పరాయి వాళ్ళ ఇంట్లో ఏం చెయ్యాలో తోచక శూన్యంలోకి చూస్తూ కూర్చుండి పొయ్యాను.
--------------------------------------------------
రచన: వింధ్యవాసిని, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, May 15, 2019

టెలిఫోనుతో నా అనుభవాలు


టెలిఫోనుతో నా అనుభవాలు




సాహితీమిత్రులారా!

ఎన్నో సాంకేతిక ఆవిష్కరణల్లాగే టెలిఫోన్ అనేది ఒక అద్భుతమయిన పరికరం. ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నవారి కన్నా, ఫోన్ కాల్‌కు ప్రాధాన్యత ఎక్కువని మనలో చాలామంది అనుభవం. మొబైల్ ఫోన్ ఈ అనుభవాన్ని మరింత బలపరచింది. ఫోన్ చెవికి అంటించుకున్న స్నేహితులకి మనం పక్కనే ఉన్నా, వరస క్రమంలో మనది రెండో స్థానమే! అన్నట్లు టెలిఫోన్‌ని ఆడిపోసుకోవడం ఈ వ్యాసం ఉద్దేశం కాకపోయినా, దాని ద్వారా నేనెదుర్కొన్న మంచి చెడులన్నీ ఇక్కడ పంచుతాను.

ఇరవయి అయిదేళ్ళ క్రితం, మా అన్నయ్య కొడుకు, గోవింద్ – వాడు మా కుటుంబంలోనే మొదటగా అమెరికాకు వెళ్ళి చదువుకున్న వాడు – హవాయి యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్సు ఎం.ఎస్ చేయటానికి వెళ్ళాడు. అపుడు మా అన్నయ్య ఇంట్లో టెలిఫోను కూడా లేదు. కొడుకు విమానమెక్కి వారమయింది. ఏం చేస్తున్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకోలేక వాళ్ళమ్మా నాన్నలకు కంగారు. అన్నయ్య వాళ్ళింటి వీధి చివరి ఇల్లు నాగేశ్వర్రావు గారిది. పదోరోజు, ఒక ఆదివారం మధ్యాహ్నం వాళ్ళబ్బాయి పదేళ్ళ సాయిరాం మాఇంటికి ఒగరుస్తూ పరిగెత్తుకొచ్చాడు. “ఆంటీ, అంకుల్, మీకు ఫోన్. గోవిందన్నయ్య పిలుస్తున్నాడు. అరగంట అయినాక మళ్ళా చేస్తాడట!” అని చెప్పాడు. భోంచేసి మధ్యాహ్నం కునుకు తీస్తున్న మా అన్నయ్య, వదినె, అమ్మ ముగ్గురూ కట్ట కట్టుకుని నాగేశ్వర్రావు గారింటికి బయలుదేరారు. వాళ్ళింట్లో ప్రతీ గురువారం సాయిబాబా భజన జరుగుతుంది. అందుకని వాళ్ళను అందరూ భజన ఆంటీ, భజన అంకుల్ అనేవాళ్ళు. అందుకని భజన ఆంటీ కాఫీ పెడ్తానంటే, ఇంకా నిద్ర పూర్తిగా చెరగని మా అన్నయ్య మొహమాటంతో వద్దంటుండగానే, ఫోనొచ్చింది.

“ఎలా ఉన్నావ్? అంతా సెటిల్ అయిందా?” అన్న మొదటి ప్రశ్నలు అయాక మా గోవిందు ఏం చెప్పాడో కానీ అన్నయ్య “నువ్వు మాట్లాడు” అని వదినెకిచ్చేశాడు ఫోను. అప్పుడు ఇంకా స్పీకర్ ఫోన్ అంటే తెలీదు. అందుకని సంభాషణ ఒక వైపు మాత్రమే అర్థమయింది వెంట ఉన్న వాళ్ళకు. ఇంటికొచ్చాక వదినె చెప్పిన సారాంశం ఇది. గోవిందు ఇల్లు వదిలి, కుటుంబం వదిలి వెళ్ళటం ఇదే మొదలు. హఠాత్తుగా ఇలా వేళ్ళేసరికి సర్దుకోలేకుండా ఉన్నాడు. ఇక్కడున్నప్పుడు వాళ్ళమ్మ చేసి పెట్టే రుచికరమయిన భోజనాన్ని పాతకాలం వంటలు అని ఏడ్పించే వాడు. అస్తమానం తన దగ్గరున్న బాగున్నది ఏదయినా తనకు కావాలని మొండిచేసే తమ్ముడిమీద విసుక్కునేవాడు. కాలేజినుంచీ రాగానే కాచుక్కూర్చుని ముందు పక్కన కూర్చుని కాస్సేపు కబుర్లు చెప్తేనే కానీ, లోపలికి వెళ్ళనివ్వని అవ్వ (మా అమ్మ) అంటే చిరాకు. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మాచ్ ఫైనల్స్ టీవీ లో చూస్తుంటే, కళ్ళెర్ర చేసి వెళ్ళి చదువుకొమ్మని కేకలేసే మా అన్నయ్య మీద పట్టరాని కోపం! వీటన్నిటికీ దూరం కావడం బాగానే ఉండాల్సింది. అయినా ఎందుకో ఏం బాగులేదని ఏడుస్తున్నాడు వాడు. ఇంజనీరింగ్ డిగ్రీ చేతికొచ్చిన చెట్టంత కొడుకు అలా గొడవ పెట్టడం అన్నయ్యకు అవమానంగా ఉంది. వీడెక్కడ పరిగెత్తి వచ్చేస్తాడో, దాంతో వాళ్ళ నాన్నకెంత కోపం వస్తుందో అని మా వదినెకు భయం!

తర్వాత పది రోజులవరకూ ప్రతిరోజూ ఫోన్ చేసేవాడు మా గోవిందు. చేసినప్పుడల్లా ఒకే పాట. ఇండియాకు వచ్చేస్తానని. రాను రాను కాల్స్ తగ్గిపోయి మెల్లిగా కుర్రాడు అక్కడే అలవాటు పడిపొయ్యాడు. అన్నయ్యకీ అనుభవంతో అర్థం చేసుకున్న అవసరం ఇంట్లో ఒక ఫోనుండాలి అని. కానీ అప్పట్లో ఫోను కావాలని దరఖాస్తు పెడ్తే ఒక ఏడాదిగ్గానీ ఫోను వచ్చేదికాదన్నది వేరే విషయం!

1987లో ఐటీ లో నా మొదటి ఉద్యోగం. మా ఆఫీసులో అప్పుడు ఒక వరుస పది టేబుళ్ళకు ఒకటి చొప్పున టెలిఫోను ఎక్స్టెన్షన్ ఫోన్లుండేవి. వాటికి నంబర్ డయల్ ఉండదు. మనం కాల్ చెయ్యలేము. కాల్ వస్తే తీసుకోవచ్చు. అందుకని ఫోన్లు ఆఫీసు పనులకు మాత్రమే ఉపయోగించేవారు. స్వంత కాల్స్ చేయాలంటే ఉద్యోగులు బయటికి అర్ధరూపాయ బిళ్ళలు చేతిలో పట్టుకుని బయలుదేరాల్సిందే! ఈ రకం టెలిఫోన్ పద్ధతిలో రిసెప్షనిస్ట్/టెలిఫోను ఆపరేటర్ చాలా ముఖ్యమయిన వ్యక్తి. అతనో, ఆమో తన సీట్లో డ్యూటీకి వచ్చాక కదలటానికి లేదు. ఎందుకంటే కాల్ వస్తే ఆఫీసులో వాళ్ళకు కనెక్ట్ చెయ్యగలిగేది ఈ వ్యక్తి మాత్రమే! ఇప్పుడు గంటలకొద్దీ ఆఫీసు బ్రేక్ టైముల్లో మొబైల్ ఫోన్స్ మీద ఉండే యువతీ యువకులను చూస్తే అప్పుడు ఫోన్లో మాట్లాడే వీలుకూడా లేని మా ఆఫీసు ప్రేమికులను గుర్తు చేసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నా టీం సహోద్యోగి రీటా, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ రాకేష్ ప్రేమికులు. వాళ్ళూ సాయంత్రం ఆఫీసు బయట ఎంజీ రోడ్లో కలుసుకుని రోడ్డువెంట తిరుగుదామని అనుకోవాలన్నా, రాకేష్ ఫోను చేస్తే, రీటాకు ఒకరు చెప్పి, ఆమె ఫోను దగ్గరికెళ్ళే లోపల అయిదు నిముషాలు అవుతుంది. అంతలోపల వాళ్ళ బాసో మరెవరో పిలిస్తే రాకేష్ ఫోన్ దగ్గర ఉండకపోవచ్చు!

మేం కొత్తగా స్వంత ఇల్లు కట్టుకున్నాక ఇంట్లో ఫోనుకు అప్లై చేశాము. అప్పటికి కాచుకునే సమయం సంవత్సరం నుంచీ ఆరు నెలలకు తగ్గింది. అప్పటికి అక్కయ్యలు, అన్నయ్య ఇంట్లో ఫోన్లున్నాయి. వాళ్ళు మాకు ఫోన్ చేయ్యలంటే, పక్క ఇంటి డెనిస్ రిగో వాళ్ళకు చేసి మమ్మల్ని అడిగేవారు. ఇలా ఫోను వచ్చినప్పుడల్లా వాళ్ళింటికి వెళ్ళి కూర్చుని వాళ్ళను డిస్టర్బ్ చెయ్యటం ఎబ్బెట్టుగా ఉండేది. రిగో భార్య సావిత్రి ముఖంలో చిరాకు మా అమ్మాయి కూడా గమనించిందేమో! “ఆంటీ, ఫోను కిటికీలోంచీ బయట పెట్టండి. మాట్లాడేసినాక చెప్తాం!” అని అడిగింది సావిత్రిని. అమ్మా, కూతురూ ఇద్దరం రిగో వాళ్ళ డైనింగ్ రూం కిటికీలోంచీ ఫోన్లో మా సంభాషణలు చేసుకునేవాళ్ళం.

1997లో నేను మొదటిసారి కంపెనీ ద్వారా విదేశ ప్రయాణం చేయవలసి వచ్చింది. నేను, బెంగుళూరు నుంచీ ముంబయి, ఫ్రాంక్‌ఫర్ట్, అట్లాంటా, డల్లాస్ ల మీదుగా ఆస్టిన్ (టెక్సాస్) కు వెళ్ళాల్సి వచ్చింది. బెంగుళూరు, ముంబయి విమానాశ్రయాలు చూసిన కళ్ళతో ఒక్కొక్క అమెరికన్ ఏర్‌పోర్ట్లు చూస్తుంటే, వాటి వైశాల్యం, ప్రయాణీకుల కోసం అక్కడ అద్భుతంగా అమెర్చిన అనుకూలాలు మొదటిసారి చూసిన దిగ్భ్రాంతి నుంచీ బయట పడిన తర్వాత నేను గమనించిందొకటి. ప్రతీ విమానాశ్రయంలో ఎన్నో వందలకొద్దీ `పే’ ఫోన్లు. మా ఫ్లైట్లు ప్రతీ విమానాశ్రయంలో ఆగి మేమంతా దిగి నెక్స్ట్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళేలోపలగానే, అమెరికన్లందరూ స్టీల్ కవర్డ్ కేబుళ్ళతో వ్రేలాడుతున్న ఫోన్లదగ్గరికి పరిగెత్తుతారు. ప్రతి ఆగిన చోట ఇంతగా ఎక్కడున్నది ఏం చేస్తున్నదీ వాళ్ళ వాళ్ళకు చెప్పే అవసరం ఉంటుందా అని ఆశ్చర్యమేసేది. మా సహోద్యోగులు తర్వాత చెప్పారు. ఆ ప్రయాణంలో నాది అదౄష్టం! నా ప్లైట్లు ఏవీ ఆలస్యం అయి, కనెక్షన్లు మిస్ అవలేదు. ఒకటో రెండో కనెక్షన్లు మిస్ అవటం సాధారణమట. అప్పుడర్థమయింది అంతగా ఫోన్లు చెయ్యవలసిన అవసరమేంటో!

జనాన్ని కలిపి ఇంత సహాయం చేయగల ఈ ఫోనుని కూడా దురుపయోగ పరచుకోవడంలో మనం లోటేం చెయ్యలేదు! ఒకప్పుడు ఆఫీసుల్లో ‘ఎమర్జెన్సీ’ అయితే తప్ప స్వంత కాల్స్ లో కాలం గడపరాదనేది వ్రాయబడని రూలు. కానీ చాలా ఆఫీసుల్లో గంటలకొద్దీ మొబైలు ఫోన్లమీద కాలం గడిపేవాళ్ళను చూస్తే ఆఫీసు టైమనేదానికొక ప్రత్యేకత ఉన్నట్లు కనిపించదు. మొబైలు ఫోన్లు నయం ఫోను పట్టుకుని లేచి దూరం వెళ్ళిపోయి సహోద్యోగుల ఏకాగ్రత అయినా చెడగొట్టరు. టేబుల్ మీదున్న ఫోన్లో ఎంత మీ కంఠం తగ్గించి మాట్లాడినా మీ ప్రక్కవారి కుతూహలం రేకెత్తాల్సిందే! ఈ కారణం వల్ల మా ఆఫీసులో కొన్నాళ్ళు, ఉదయం భోజనానికి ముందరి సమయం `క్వైట్’ టైం అని బయటినుంచీ వచ్చేకాల్సును కనెక్ట్ చేసేవాళ్ళు కాదు. ఇలాంటి రూల్సు ఉద్యోగులందరూ గౌరవిస్తే తప్ప, వాటివల్ల ప్రయోజనం సున్న. వాళ్ళు స్వంతంగా ఫోన్లు చేసుకోవడాన్ని, బయటివాళ్ళు నేరుగా ఎక్స్‌టెన్షన్లకు ఫోన్ చెయ్యడాన్ని ఎలా ఆపగలం?

కార్డ్‌లెస్ ఫోను కొత్తగా వచ్చినప్పుడు దాన్ని కొని ఉపయోగించాలని నాకు మోజుగా ఉండేది. ఎవరో స్నేహితులు సింగపూరుకు వెళ్తుంటే, కార్డ్‌లెస్ తెచ్చిపెట్టమని అడిగాను. నేను సరిగ్గ చెప్పలేదేమో, `బేస్ డయలింగ్’ లేని, కార్డ్లెస్ మాత్రమే ఉన్న పరికరం తెచ్చిచ్చారు. అది కనెక్ట్ చేసుకోగానే ఇంట్లో కొత్త సమస్యలు మొదలయాయి. చాలా సార్లు ఇంట్లో కాల్స్ వచ్చినప్పుడు ఆ కార్డ్‌లెస్ ఎక్కడ దాక్కుని ఉంటుందో కనుక్కోలేం. మా అమ్మాయి శివాని గదిలో ఉంటుంది చాలా మటుకు. తను నిద్రలో తలుపు బిగించుకునో, ఫోను మాయం చేసి అది ఎక్కడికో వెళ్ళుంటే, ఇంక అంతే సంగతులు! ఈ కార్డ్‌లెస్ కు ఎందుకు మారామా అని నన్ను నేను నిందించుకోని రోజు లేదు ఈ పద్ధతీ అలవాటయేదాకా.

2000 ప్రాంతంలో అప్పుడే మొబైల్ ఫోన్లు కనిపిస్తున్నాయి. బెంగుళూర్లో ఎయిర్‌టెల్ మాత్రం దొరికేది. మా పక్కింటి సుభాష్ మా కంపెనీలోనే పని చేసే వాడు. వాడు కొత్తగా మొబైల్ కొనుక్కున్నాడు. అప్పట్నుంచీ, నన్నూ కొనుక్కొమ్మనేవాడు. ఇంట్లో ఆఫీసులో ఫోన్లుంటాయి కదా? మళ్ళీ ఇదెందుకు? వౄథా ఖర్చు. ఎక్కడయినా మరిచిపోయి వదిలేస్తే అదొక తంటా అనుకున్నాను. ఒక రోజు ఆఫీసు నుంచీ కారు డ్రైవ్ చేసుకుని వస్తున్నాను. పెద్ద వర్షం. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వస్తున్న నాకు కార్ ఒక చోట ఆగి పోతే గుండెలో రాయి పడింది. అటు ఇటూ ఎక్కడున్నానా అని చూశాను. హైగ్రౌండ్ పోలీస్ స్టేషన్‌కు యాభయి అడుగుల దూరంలో ఉన్నాను. ఎలాగయినా ఇంటికి మా వారికి ఫోన్ చేస్తే ఎలాగో సహాయం తీసుకుని వస్తారు. కార్లో ఎప్పుడూ ఉంచుకునే గొడుగు తెరిచి వేసుకుని, భుజానికి బ్యాగు తగిలించుకుని కిందికి దిగాను. కాల్ ఫోన్లు ఏవీ ఉన్నట్లు కనిపించలేదు. మెల్లగా ఆలోచిస్తూ హైగ్రౌండ్ పోలిస్ స్టేషన్ వైపు నడిచాను. స్టేషన్లో ఎలాగూ ఫోనుంటుంది కదా అనుకుంటూ లోపల అడుగు పెట్టాను. కానీ పోలీసు స్టేషన్ మనం మామూలుగా రోజూ వెళ్ళే చోటు కాదు, అయినా తప్పదు మరో మార్గం లేదు అనుకుని స్టేషన్ మెట్లెక్కాను. ఉన్న నాలుగైదు టేబుళ్ళ దగ్గర ఇద్దరు ముగ్గురు పోలీసు కాన్స్‌టబుల్స్ గుమి కూడి మాట్లాడుకుంటున్నారు. కొందరు ఏవో ముందున్న ఫైళ్ళలో వ్రాస్తున్నారు. ఒక క్షణం వాళ్ళను గమనించాను. ఒక టేబిల్ దగ్గర ఒకరు వ్రాసుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి, “సార్! కారు చెడిపోయింది. ఇంటికి ఫోన్ చెయ్యాలి,” అని `మే ఐ?’ అన్నట్లు ముఖంపెట్టి అడిగాను. అతను తలెత్తి నావైపు, పోలీసు స్టేషన్ లో ఇదేం పని అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ, కాదనటానికి కారణం దొరక్క, ఖాళీ టేబుల్ మీదున్న ఫోన్ వైపు వేలు చూపించాడు. అంతే చాలనుకున్న నేను రిసీవర్ చేతికి తీసుకుని ఇంటి నంబరు డయల్ చేశాను.

మా వారు ఫోన్ ఎత్తారు. నేనేం చెప్పక ముందే నాకోసమే కాచుకున్నట్లు, “ఏమయింది. ఎందుకాలస్యం? వర్షం జోరుగా పడ్తోందా అక్కడ?” “అవును. కారు చెడిపోయింది.” “ఓహ్! అవునా, మన సందు కొసలో ఉన్న మెకానిక్‌ను పిలుచుకుని వస్తాను. ఎక్కడున్నావ్?” “హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ దగ్గర! అక్కడ్నుంచే ఫోన్ చేస్తున్నాను.”

అప్పట్లో కాల్ ఫోన్లు కూడా తక్కువ. అందుకని అంగళ్ళలో అనుమతి తీసుకుని ఫోన్ చేస్తే తర్వాత అంగడివారు అడిగినంత, రూపాయో, రెండో ఇచ్చి బయట పడేవాళ్ళం. కానీ పోలీస్‌స్టేషన్‌లో డబ్బిస్తానని ఎలా అడగటం? ఉచితంగా ఫోన్ చేసుకుని తప్పు చేసిందానిలా ముఖం పెట్టుకుని, `ఫర్వా లేదులే, పోలీసంటే పబ్లిక్ సర్వీసే కదా?” అనుకుంటూ నాకు నిశ్శబ్దంగా కాల్ చేసుకునే అనుమతి ఇచ్చిన ఇన్స్పెక్టరు వైపు ఒక సారి చూసి, “థాంక్‌యూ సార్!” అని గొణుక్కుంటూ బయటికి నడిచాను. వెనక్కు తిరిగి చూసే తప్పు మాత్రం నేను చెయ్యలేదు. అక్కడున్న ఎందరు నా వైపు విచిత్రంగా చూస్తున్నారేమో అని నా అనుమానం!

ఆరోజు తర్వాత సుభాష్ సలహా పాటించడంలో ఆలస్యం చెయ్యలేదు. కారున్న తర్వాత చెడిపోతుంది. ఈ సారి పోలీసు స్టేషన్ దగ్గరో, ఫోన్ బూత్ దగ్గరో చెడిపోతుందని గారంటీ లేదు. అందుకని నా మొదటి మొబైలు ఎరిక్‌సన్, కొత్తగా వచ్చిన ఏర్టెల్ వాళ్ళ సిం కార్డ్ కోసం డబ్బు పోయాల్సివచ్చింది. అయినా దాన్నొక ఇన్షూరెన్స్ ఖర్చులా అనుకోక తప్పలేదు.

ఇప్పుడు మొబైలు ఫోన్లు మనకెంత అలవాటు అయాయంటే, మనలో కొందరు మేలుకుని ఉన్న సమయంలో ఎక్కువ భాగం వాటిని చెవికి అంటించుకునే గడుపుతారు. అన్ని రకాల ఉపకరణాల్లాగే, మొబైల్సు వచ్చాక, ఇంట్లో ఉన్న పాతకాలం బేసిక్ ఫోను ఉపయోగం తగ్గిపోయింది. ఇళ్ళలో ఈ ఫోన్ల కనెక్షన్లు తీసేయ్యటం అభివౄద్ధి మార్గంలో సహజమయిన ముందడుగు! నాకు మాత్రం పాతకాలం ఫోనును మించింది లేదనిపిస్తుంది. నేల అడుగునుంచీ వ్యాపించి ఉన్న తీగల మీద ఆధారపడే ఆ ఉపకరణంలో, ‘సిగ్నల్ బాగా అందటం లేదు!’ అని కాల్ మధ్యలో సంభాషణ తెగిపోవటం ఉండదు కదా?
----------------------------------------------------
రచన: వింధ్యవాసిని, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, May 14, 2019

మాకు తెలిసిన ప్రహేలిక


మాకు తెలిసిన ప్రహేలిక





సాహితీమిత్రులారా!

జీవితంలో ఒక్కొక్క దశలో మనం ఎందర్నో కలుస్తుంటాము. మన ప్రభావం వాళ్ళమీద ఏమాత్రమో మనకు తెలిసే అవకాశం లేకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రభావం మనమీద ఎంత ఎక్కువయితే ఆ జ్ఞాపకాలు మాసిపోవటం అంత కష్టమవుతుంది. సాధారణంగా మనం రైలు ప్రయాణాల్లో కలిసే తోటి ప్రయణీకులను గూర్చి నేను మాట్లాడటం లేదు. ఆ అనుభవం కొన్ని గంటలే, రైలు దిగగానే మర్చిపోతాం. మా కుటుంబం అందరం ఉమ్మడిగా ప్రహేలికను మొదట చూసింది ఐదునెలల పాపగా మా పక్కింట్లో.

వాళ్ళ నాన్న రాజగోపాల్ అప్పట్లో మా ప్రక్క ఇంటి మేడ మీద పోర్షన్లో వచ్చి కొత్తగా చేరినారు. ఆయన చేరిన నెలరోజుల తర్వాత, భార్య మీరాను, పాప ప్రహేలికను పిలుచుకుని వచ్చినారు. పదిహేనేళ్ళ మా అమ్మాయి శివానికి కొత్తగా వచ్చిన పొరుగు కుటుంబమొక పెద్ద ఆకర్షణ. మొదట తనే వెళ్ళి పరిచయం చేసుకుని, పలుకరించి వచ్చింది. దీనికి చిన్న పిల్లలంటే భలే ఇష్టం! త్వరగా తను తిరిగి రావటం నన్ను ఆశ్చర్యపరిచింది. “ఏం, వాళ్ళ పాప నిద్రపోతోందా?” అని అడిగినాను. “లేదు ఆడుకుంటోంది.” సమాధానం. ఇంకా చెప్పింది. “చాలా సీరియస్. నుదురంతా చిట్లిస్తూ ఏదో పెద్ద ఆలోచనలో ఉన్నట్లుంది.”

“నీ ముఖం. అంత చిన్నపిల్లకేమాలోచనలుంటాయి? ఎక్కువగా ఊహించేస్తున్నావేమో?”

“లేదమ్మా! ఆ పిల్ల పుట్టినప్పటినుంచీ అంతేనట. వాళ్ళమ్మ చెప్పింది. మొదట ఆస్పత్రిలో సిస్టర్ గుర్తించిందట పాప ఎప్పుడూ నుదురు చిట్లిస్తుంటుందని!”

ఈ దెబ్బతో ఈమె ఇక అటువైపు చూడదని నేననుకుని ఉంటే నా ఊహ తప్పయేది. ఎందుకంటే అతి త్వరలో మా శివానికి మీరాతో ఆప్తస్నేహం కుదిరిపోయింది. దానిక్కారణం పెరుగుతున్న పాప ప్రహేలిక కూడా అని అంటే ఆశ్చర్యం కాదు. అన్నట్లు, మొదట తన పేరు చెప్తే, పలకడానికి మాకు నోరు తిరగటం కష్టం అయింది. అసలు ప్రహేలిక అంటే అర్థమేమిటి? అని అడిగాము వాళ్ళమ్మను. ప్రహేలిక అంటే సంస్కృతంలో నటన లేక నాటకానికి సంబంధించిన అర్థమట. సంస్కృతంలో ఏమో కానీ, నాకు పాత తెలుగు పత్రికల్లో ఎక్కడో, గళ్ళనుడికట్టుకు పదబంధప్రహేలిక అని పేరు చదివినట్లు గుర్తు. అర్థం సంగతి తెలీదు కానీ, పిల్ల మాత్రం ‘పజిల్’ లాంటిదే అనుకున్నాము. కష్టపడి ప్రహేల్ అన్న పొట్టి పేరు కూడా నేర్చేసుకున్నాము నేనూ, మా వారూ.

ప్రహేల్ కాస్త పెద్దదయి కూర్చోవడం మొదలయాక సాయంత్రాలు, శనీఆదివారాలు మా ఇల్లు విడిచేది కాదు. శివానికి పాపను పక్కనే కూర్చోబెట్టుకుని హోం వర్క్ చేసుకోవడం కూడా అలవాటయిపోయింది. ఆమె ముద్దుగా మాటలు నేర్చుకోవటం కాదు కానీ, శివానిని స్కూల్నుంచీ సాయంత్రం ఇంటికి రానివ్వదు, వాళ్ళింటి కిటికీలో నిలబడి, తను వేసే “సికానీక్కా … సికానీక్కా …” అన్న కేకలు ఆగేవికాదు. శివాని వెళ్ళి ఆమెను వెంటబెట్టుకు రావలిసినదే. ఈమె వేరే రకంగా పని తొందరలో ఆమెను పట్టించుకోకపోతే, కోపం వచ్చి పిలుపునుంచీ, ‘అక్క’ పదాన్ని వదిలేస్తుంది.

శివానితో సమయం గడపటం కాకుండా, మా ఇంట్లో ఆ పాపకు బాగా నచ్చే విషయాలు రెండు. ఒకటి మా ఇంట్లో ప్రతీ ఆదివారం ఉదయం టిఫిను దోశ. తనకోసం వేడిగా ఒక దోశ వేసిస్తాను. దాన్ని రెండుసార్లయినా తినకముందే, పక్కకు తోసేసి, “నున్ను దోసె కుడు” అంటుంది. అన్నట్లు రాజగోపాల్ కుటుంబం తమిళులు. అప్పుడే కాల్చి తీసిన దోశెలు వేడిగా ఉంటాయని, వెంట వెంటనే “ఇంకొకటివ్వు” అని అడుగుతుంది. శివాని మమ్మల్ని పిలవటం చూసి, మా పేర్లు మమ్మీ, డాడీ అనుకుందేమో ప్రహేల్, తనూ మమ్మల్ని అలాగే పిలిచేది. వాళ్ళింట్లో ఆ పిలుపులు లేనందుకు ఇబ్బంది కాలేదు. ప్రహేలికకు మా ఇంట్లో నచ్చే రెండో విషయం తనకు ఇష్టం వచ్చినట్లు టాల్కం పౌడరు, ఫేస్ క్రీములు రాసుకోవచ్చు. పౌడరు, క్రీముల డబ్బాలు తనకు మా ఇంట్లో బాగా అందుబాటులో ఉండేవి. మీరా మాత్రం ఇది చూసి కోప్పడేది, “మీరు దీన్ని క్రమశిక్షణ లేకుండా పాడుచేస్తున్నారాంటీ!” అని.

ప్రహేలిక పుణ్యమా అని నేను తమిళం అర్థం చేసుకోవడం, కొద్దిగా మాట్లాడగలగటం నేర్చుకున్నాను. తప్పదు, రెండేళ్ళ పాపను ఇంట్లో తనకు అలవాటయిన భాష కాక వేరే ఎందులో పలుకరించినా అర్థం కాదు. మా అమ్మాయి శివాని తమిళం పూర్తిగా నేర్చేసుకుంది. ఎన్నో ఏళ్ళనుంచీ తమిళం మాట్లాడుతున్నదానిలా శుద్ధ తమిళం లో మాట్లాడగలదు. ప్రహేలిక మరికాస్త పెద్దదవడం, స్కూలుకెళ్ళటం మా కళ్ళ ముందే జరిగాయి. అయినా తను మాకు దూరం కాలేదు. అలాంటిది, వాళ్ళ నాన్నగారి ఉద్యోగరీత్యా వాళ్ళు సింగపూరుకు వెళ్ళాలిసి వచ్చినప్పుడు, శివాని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ప్రహేల్ అందరిమీదా కోపంతో, మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మానాన్నల వెంట. వాళ్ళు సింగపూర్లో ఉన్న ఐదేళ్ళు ప్రతీ ఏడు, వేసవి సెలవుల్లో వాళ్ళమ్మమ్మను, తాతయ్యను చూడటానికి ప్రహేల్ అమ్మానాన్నలవెంట మద్రాసుకు వచ్చినప్పుడల్లా, బెంగుళూర్లో మా దగ్గరికి తప్పకుండా వచ్చేది. వచ్చినపుడల్లా, నేను ఏదయినా తనకిష్టమయిన ఒక బొమ్మో, ఆటవస్తువో కొని పెట్టాలి. అందుకని తను నావెంట, కైనెటిక్ హోండా స్కూటర్లో నా వెనుక కూర్చుని, కమర్షియల్ స్ట్రీట్‌లో ఉన్న సఫైర్ బొమ్మల అంగడికి వెళ్ళవలిసిందే! వాళ్ళమ్మ పర్మిషన్ లాంటిదేం లేకపోయినా తనకేం కావాలో అడిగి కొనిపించేది. ఇద్దరికీ తెలుసు ఇంటికెళ్ళాక, వాళ్ళమ్మతో ఇద్దరికీ తిట్లు పడతాయని. నాకుమాత్రం, పోయి వచ్చేటప్పుడు, పిల్ల వెనుక కూర్చుని నిద్రపోకుండా చూసుకోవడం పెద్దపని అయేది.

వాళ్ళ నాన్నగారిది ఐటి ఉద్యోగం కాబట్టి ప్రహేలిక ఇంటికి త్వరగా కంప్యూటర్ వచ్చింది. దాని ఉపయోగం తనకింకా తెలియకపోయినా ప్రహేలికకు, కంప్యూటర్‌లో ఆడగల గేమ్స్, ఎస్ఎంఎన్ చాట్ అంటే ఏమిటో తెలుసు. ప్రతిరోజు, మధ్యాహ్నం మూడుగంటల తర్వాత, నన్ను ఆఫీసులో డిస్టర్బ్ చేసి, నాలుగు మాటలయినా చాట్ చెయ్యంది వదిలేది కాదు. ఆఫీస్ టైములో డిస్టర్బెన్స్ ఒక ఎత్తయితే, భయంకరమయిన ఆమె ఇంగ్లిష్ స్పెల్లింగ్, భాషా అజ్ఞానం మరొక ఎత్తు. సింగపూరు జీవితం, స్కూలు వల్ల పిల్ల ఇంగ్లిష్ పాడయిపోతోందని, వాళ్ళ నాన్న ఉద్యోగం మార్చేసి, మద్రాసుకు వచ్చేసారు. వాళ్ళు సింగపూరు వదిలే లోపల సింగపూరు చూపిస్తామని శివానిని ఆహ్వానించారు. శివాని వెళ్ళి అక్కడున్న వారం రోజులు, ప్రహేలికే అన్ని చోట్లకు, తన వెంట బస్‌లో వచ్చి చూపించడం, ఒక మరపురాని అనుభవం. పదహైదేళ్ళ క్రితం తను ఒళ్ళో పెట్టుకుని ఆడిస్తూ, హోంవర్క్ చేసుకున్నదీ పిల్లతోనేనా అనిపిస్తుంది.

సింగపూర్లో ఉండగానే, చాలా మంది తమిళ అమ్మాయిల్లా ప్రహేలిక కూడా భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. ఆ శిక్షణ మరింత చురుగ్గా కొనసాగించింది మద్రాసుకు చేరాక. తన అరంగేట్రం అని తేది నిర్ణయించి అవసరమయిన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. ఆరోజు మద్రాసులో సునామి వచ్చింది. మధ్యాహ్నం తను కార్యక్రమానికి, ప్రాక్టీసుకు వెళ్ళకముందే, మేం అభినందనలు చెప్పాలని ఫోన్ చేశాను. “నా డాన్సు చూడటానికి ఎవరయినా వస్తారో లేదో మమ్మీ!” అని దిగులుగా చెప్పింది. రాత్రి వాళ్ళమ్మకు ఫోన్ చేస్తే చెప్పింది, కార్యక్రమం బాగా జరిగిందని, అహ్వానితుల్లో సగం మంది పైనే వచ్చారని.

ప్రహేలికను మేం చివరిసారి కలిసింది, ఆరేళ్ళ క్రితం మా ఇద్దరి వీసాలు తీసుకోవడానికి అమెరికన్ కాన్సులేట్ ఇంటర్వ్యూ కోసం మద్రాసుకు వెళ్ళినప్పుడు. మీరా ఆ ఒక్కరోజు వాళ్ళింట్లో మమ్మల్ని అతిథులుగా దిగకుండా వదల్లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత చిన్న పిల్లగా మా జ్ఞాపకాల్లో ఉన్న ప్రహేలికను మొదటిసారి టీనేజర్ గా కలిసినాము. స్కూలు, ఆటలు, నాట్యం, కీబోర్డు నేర్చుకోవడం, అన్నిటితో ప్రహేల్ చాలా బిజీ. ఉదయం స్టేషన్‌లో దిగి, రాజగోపాల్ వెంట ఇంటికొచ్చిన మేము, ప్రహేల్ స్కూలుకు వెళ్ళేలోపు కొంచం సేపు మాత్రమే ఆమెతో గడపగలిగినాము. మాతో తను అలవాటు తప్పినందుకు మమ్మీ, డాడీ అని ఒకసారి, ఆంటీ, అంకుల్ అని ఒకసారి కలుపుతూ మాట్లాడింది. తను స్కూలుకెళ్ళిపోయాక మేం కాన్సులేట్‌కు వెళ్ళేవరకూ, మీరా కబుర్లలో ఒకే విషయం. కూతుళ్ళు `టీనేజ్’ లో అడుగుపెట్టినప్పుడు అందరు తల్లులూ ఎదుర్కొనే సమస్యలే. తనతో సరిగ్గా మాట్లాడదు, తను ఇల్లు వదిలి బయటికెళ్ళగానే తను ఎదుర్కొనే సమస్యలు, తన స్నేహాలు, ఇవేవీ వాళ్ళమ్మకు పూర్తిగా చెప్పదు. కూతురు చెడు అలవాట్లు చేసుకుని చెడిపోతుంటే తను ఏం చెయ్యాలి? నాకు నవ్వొచ్చింది. పిల్లకు ఊపిరి తిప్పుకోనివ్వకుండా చదువు, వేరే ఏక్టివిటీలు. పాడవడానికి సమయమేది? అలా చెప్తే మీరాకు నచ్చదు. “నీకు నీ కూతురి పెంపకం మీద నమ్మక ముంది కదా? అదే నమ్మకంతో కొంచం ఓపిక పట్టు. ప్రహేల్‌కు కాస్త టైమివ్వు. ఆమే నిన్ను తన బెస్ట్ ప్రెండ్ అని తెలుసుకుంటుంది. అప్పుడు నీతో అన్నీ చెప్పకుండా ఎక్కడికి పోతుంది?” అని నచ్చజెప్పాను.

ప్రహేలిక బాగా పొడవుగా ఉంటుంది. చదువు, భరతనాట్యం కాకుండా, తను బాస్కెట్ బాల్ బాగా ఆడుతుంది. పెద్దదయిపోయిన ప్రహేలికకు మేం ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే అనుకుంటాను. ఎప్పుడయినా మీరానో, నేనో ఫోన్ చేస్తే, ఉభయకుశలోపరి అయినతర్వాత, సంభాషణ పొడిగించడానికి ఇంకే విషయాలుండవు. కానీ ప్రతి ఏడు ఫిబ్రవరిలో ఆమె పుట్టినరోజున మాత్రం ప్రహేలికను గుర్తు చేసుకుంటాము. ఎందుకంటే, అదేరోజు, మా వారి పుట్టిన్రోజు కూడా!
-----------------------------------------------------
రచన: వింధ్యవాసిని, 
ఈమాట సౌజన్యంతో

Monday, May 13, 2019

వసంతభామిని


వసంతభామిని




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి...................

వచ్చెనదె వాసంతిక
సుధాపూర్ణ విపంచిక
చారు సుందర సీమలందున
చైత్ర భామిని ప్రభవించగ
వనములందున మనములందున
పుష్ప సంచయ ప్రహేళిక
త్వరితగతినీ తలలనూచీ
మోసులెత్తును పసరిక
రెమ్మరెమ్మకు ఆకులతికే
కొమ్మ కోరిక మీరగా
వేప గంధముతనువుసోకీ
మొగ్గదాల్చిన మల్లిక
మావి చివురులు తీరమెసవీ
కుహుకళించెను కోయిలా
తోటలందున బాటలందున
విరులు దాల్చిన తరువులై
పూవుపూవును స్పృశించు వేడుక
పరిభ్రమించే భ్రమర రవమై
మించు వేడుక నుద్యమించే
హొయల పులుగుల వేకువై
భువన మోహన
యమున విహరణ
మధుర కామన
గురుతు లెరిగిన సమయమై
జగతి కంతకు జననితానై
ఇలను జీవము నింపగా
--------------------------------------------------
రచన: ఝాన్సీలక్ష్మి కొత్త, 
ఈమాట సౌజన్యంతో

Saturday, May 11, 2019

పద్యం అంటే సుముఖత ఎందుకు?


పద్యం అంటే సుముఖత ఎందుకు?




సాహితీమిత్రులారా!

పద్య ప్రియులకీ, విముఖులకీ మధ్య చిరకాలంగా (అంటే సుమారు ఎనభై ఏళ్ళుగా) స్ఫర్ధ కొనసాగుతునే ఉంది. ఇది ఇప్పటికీ ఉంది, కాని ప్రస్తుతం పద్య ప్రియులు defensive modeలో ఉన్నారనిపిస్తుంది. ఈ విషయానికి సంబంధించి చాలా రోజులుగా నన్నొక చిన్న ప్రశ్న వెంటాడుతోంది, “పద్య ప్రియులకు పద్యం అంటే అంత అభిమానం ఎందుకు?”. నాకు పద్యమంటే ఇష్టం. అంచేత, ఇది నన్ను నేను వేసుకుంటున్న ప్రశ్న. నాలాంటి పద్యప్రియులందరికీ వేస్తున్న ప్రశ్న. చిన్న ప్రశ్నే ఐనా ఇదొక పెద్ద చిక్కు ప్రశ్న!

సాధారణంగా పద్యాభిమానులందరూ పద్య ప్రత్యేకత గురించి ప్రస్తావించే అంశాలు కొన్ని ఉన్నాయి.

ఒకటి, “ధార, ఊపు, లయ, పదాల పొందిక”. వీటిలో పదాల పొందిక వచన కవితకైనా ఉండాల్సిన లక్షణమే. పద్యానికున్న ప్రత్యేకత కాదు. ఇక మిగిలినవి ధార, ఊపు, లయ. ఇవి మూడూ పద్యం తాలూకు నడకకు సంబంధించిన లక్షణాలు. కాబట్టి పద్యానికుండే విలక్షణమైన నడక దానికుండే ఒకానొక విశిష్టత అని భావించ వచ్చు. అయితే, ఈ ప్రత్యేక లక్షణానికున్న ప్రయోజనం ఏమిటి, అది ఈ కాలానికికూడా వర్తిస్తుందా అని ప్రశ్నించుకోవడం అవసరం. ఎందుకంటే, “పద్యానికున్న ధార, ఊపు, లయ మూలంగా నాకు అదంటే ఇష్టం. మీరు దాన్ని ఆస్వాదించలేకపోతే అది మీ ఖర్మం” అని ఊరుకుంటే, పద్య విముఖులకూ ద్వేషులకూ సరైన సమాధానం చెప్పినట్టు అవ్వదు. ఆ వాదం తర్కానికి లొంగదు. పద్యానికున్న ప్రత్యేకమైన నడక ఒక అవ్యక్తమైన శబ్దసౌందర్యాన్ని కలిగి ఉంటుందన్నది వాస్తవం. కానీ, కవిత్వానికి శబ్దంకన్నా అర్థం, అర్థం కన్నా భావం ప్రధానమైనదనే ఆధునికులు ఈ శబ్దసౌందర్యాన్ని పట్టించుకోనక్కరలేదంటారు. పైగా శబ్దాలంకారాలకన్నా, అర్థాలంకారాలే ఉత్తమమైనవని చాటిచెప్పిన ఆలంకారికుల మాటలను వెదికి తెచ్చి, ఆ శబ్దసౌందర్యాన్ని గర్హిస్తారు కూడా! దీనికి సమాధానం?

పద్యప్రియులు ధీమాగా చెప్పుకునే మరో మాట, “సామాన్య ప్రజల్లో ఇంకా పద్యానికి ఆదరణ ఉంది”. ఏ ధైర్యంతో, ఆధారంతో ఈ మాట అంటారో నాకైతే తెలీదు. ఇప్పుడు వస్తున్న పత్రికలన్నీ సామాన్య ప్రజలకి అందుబాటులో ఉన్నవని వీరు ఒప్పుకుంటారనే అనుకుంటాను. అలాంటి పత్రికలు పద్యాన్ని చిన్నచూపు చూస్తున్నాయని వీళ్ళే వాపోతారు. ప్రజాదరణ ఉన్న ప్రక్రియను పత్రికలు (అందునా సర్క్యులేషనే ప్రధానమైన ఈ రోజుల్లో) నిరాదరించడమా! ఆశ్చర్యంగా లేదూ! కాబట్టి సామాన్య ప్రజల్లో పద్యానికి ఆదరణ ఉందన్న విషయం అంత నమ్మశక్యంగా లేదు. ఏ కొద్దిమంది సామాన్య ప్రజల్లోనో ఆదరణ ఉంది అనుకున్నా, దాని వెనుకనున్న కారణాలు తెలుసుకోవడం చాలా అవసరం. మా ఆఫీసులో ఒక తమిళ మిత్రుడున్నాడు. అతనికి తెలుగు తెలీదు. తెలుగు ఛందస్సుగూర్చి అసలే తెలీదు. ఐతే తమిళంలో కూడా వాళ్ళకి ఛందస్సు ఉంది. దానిగూర్చి చూచాయగా తెలుసు, దానికి బోలెడన్ని నియమాలుంటాయనీ, అందులో పద్యాలు రాయడం చాలా కష్టం అనిన్నీ. నేను తెలుగులో పద్యాలు రాస్తానని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు. ఏవో ఒకటి రెండు వినిపించమన్నాడు. నీకు తెలుగు తెలీదు కదా అంటే, ఇంగ్లీషులో దాని అర్థం చెప్పు చాలన్నాడు. తెలుగు పద్యాలని వినలేదు. అర్థం తెలుసుకుని, ఒహో ఇంత చక్కని భావాన్ని అంత కష్టమైన పద్యాలలో రాయగలిగావా అని మెచ్చుకున్నాడు, ఆనందించాడు. పద్యమంటే కాస్తో కూస్తో అభిమానమున్న సామాన్య తెలుగు ప్రజలు కూడా, చాలమంది ఈ కోవకి చెందిన వాళ్ళే. మా పల్లెటూళ్ళో మరొక వ్యక్తి ఉన్నాడు. కృష్ణరాయబారం పద్యాలు గొంతెత్తి పరవశించి పాడతాడు. “ఎల్లి రణంబె గూర్చెదవొ” అంటే అర్థమేమిటో తెలుసా అని అడిగాను. “ఏవుంది. ఎళ్ళి, అంటే వెళ్ళి, యుద్ధం చేస్తావా అని” అని టక్కున జవాబిచ్చాడు. పద్యమంటే అభిమానమున్న సామాన్య తెలుగు ప్రజలలో వీరు మరో రకం. సరే పద్యాన్ని ఒక పురావస్తు విశేషంగా, సాలార్జంగు మ్యూజియంలోని గడియారాన్ని చూసినంత ఆసక్తితో చూసేవారూ, లేదా మోడువోయిన మన ప్రాచీనసంప్రదాయ వృక్షానికి ఇంకా అతుక్కు వేళ్ళాడుతున్న ఒక పండుటాకులా ఆదరించే వారూ చాలా మందే ఉన్నారు. పద్యం రాయడం వచ్చిన వాళ్ళ గురించి కానీ, సాహిత్యంతో పరిచయమున్న వాళ్ళగురించి కానీ ఇక్కడ నేను ప్రస్తావించటం లేదు. నేను వాళ్ళను “సామాన్య ప్రజ”ల కోవలోకి చేర్చను. ఇంతకీ చెప్పొచ్చే విషయమేమిటంటే, నాకున్న ఎరికలో, పద్యమంటే ఆసక్తి ఆదరణ ఉన్న సామాన్య ప్రజలలో కవిత్వ వాహికగా దానికి గుర్తింపులేదు.

పద్య కవిత్వానికి ఆదరణ తగ్గిందనేది కాదనలేని నిజం. అసలు కవిత్వానికే ఆదరణ తగ్గిన ఈ రోజుల్లో పద్య కవిత్వానికి ఆదరణ తగ్గడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఐతే, పద్యకవిత్వానికి ఆదరణ తగ్గడానికి గల కారణాలు సహేతుకంగా పరిశీలిస్తే, పద్యానికీ, పద్యకవిత్వానికీ ఉన్న ప్రత్యేకత కొంత తెలుసుకోవచ్చు. పద్యకవిత్వానికి ఆదరణ తగ్గడానికి ప్రధానంగా నాలుగు కారణాలు నాకు కనిపిస్తున్నాయి.

ఒకటి, శ్రవ్యప్రధానంగా ఉండిన కవిత్వం, కాలప్రభావాన, పాఠ్యప్రధానంగా మారడం. ఆంధ్రసారస్వతపు తొలినాళ్ళనుండీ మొన్న మొన్నటి బ్రిటిష్ పాలనా కాలం వరకూ, కవిత్వ ప్రచారం ఎక్కువగా “ముఖే ముఖే” అన్న రీతిలోనే సాగిందన్నది చారిత్రక సత్యం. బ్రిటిషువారి వద్దనుండి అచ్చుయంత్రం దిగుమతి అయిన తరువాతే ప్రచురణమార్గంలో కవిత్వ ప్రచారం మొదలయ్యింది. పద్య విముఖత సరిగ్గా అప్పుడే మొదలయ్యింది. పద్యం గొంతెత్తి హాయిగా పాడుకోవలసింది. నేటి ఆధునిక వచన కవిత మౌనంగా మనసులో చదువుకోవలసింది. పద్యానికి ఉండే ప్రత్యేకమైన నడకవల్ల, వినసొంపుగా ఉండడమే కాకుండా సుళువుగా జ్ఞాపకం పెట్టుకోడానికి వీలు కలుగుతుంది. ఈ రెండు ప్రత్యేకతలూ పద్య ప్రాచుర్యానికి ఎంతో దోహదపడ్డాయి. ఎప్పుడైతే కవిత్వం పాఠ్యప్రధానమైందో, ఈ గుణాలు తమ ఆవశ్యకతని కోల్పోయాయి. అందువల్ల పద్యం తాలూకు అవసరం తగ్గిపోయింది.
ఇక రెండవ కారణం-సమకాలీన సామాజిక స్పృహ ఉన్నప్పుడే అది కవిత్వం అనీ, అది ఉంటే చాలు కవిత్వమే అనీ ఒక విచిత్ర సిద్ధాంతం బయలుదేరి సాహిత్యప్రపంచమంతటా వ్యాపించడం. “కష్టజీవికి అటూ, ఇటూ ఉన్నవాడు కవి” అన్న ఒక గొప్ప కవి చేసిన ఉక్తివైచిత్రిని పట్టుకొని వేదోక్తిగా భావించిన మామూలు కవులూ, ఇతరులూ సృష్టించిన పరిస్థితి ఇది. ఎప్పుడైతే ఈ వాదం ప్రబలిపోయిందో ప్రాచీన కవిత్వమంతా (ఒక వేమన, మరొక బద్దెన రాసింది తప్పించి) కవిత్వం కాకుండా పోయింది. ఆ కవిత్వమంతా ప్రధానంగా పద్య కవిత్వమాయె, అంచేత ఆ దెబ్బ పద్యానికి కూడా తగిలింది. ఈ వాదం వల్లనే వచ్చిన మరో ప్రమాదం, కవిత్వానికి వస్తువే సర్వస్వం అన్న అర్థంలేని సిద్ధాంతం. పద్యానికి ఒక నిర్దిష్టమైన రూపముంది. వచన కవితకి ఇది అవసరం లేదు (అని ఈ సైద్ధాంతికుల నమ్మకం). ఇది కూడా పద్య విముఖతకి రాచబాట వేసింది.

పద్యకవిత్వానికి ఆదరణ తగ్గడానికి మూడవ కారణం వ్యావహారిక భాషావాదం. కవిత్వమంతా సామాన్య ప్రజలు మాట్లాడుకొనే భాషలోనే ఉండాలి, నిరక్షరకుక్షికి సైతం అర్థం కావాలి అన్న వాదం. నిజానికి ఈ వ్యావహారికభాషా వాదం మొదలయ్యింది కవిత్వేతర సాహిత్య ప్రక్రియల (కథ, వ్యాసం మొదలైనవి) గురించి. ఎప్పుడు వచ్చిందోకానీ, చాపకింద నీరులా వచ్చి అది కవిత్వాన్ని కూడా ఆక్రమించింది. కవిత్వేతర ప్రక్రియలకు సంబంధించి ఇది కొంతవరకు సమంజసమైన వాదమే. వచ్చిన చిక్కల్లా దాన్ని కవిత్వానికి కూడా వర్తింపచెయ్యడమే! పోనీ ఆ రాసే పద్యాలేవో వ్యావహారిక భాషలోనే రాస్తే పోలే అని కొందరంటారు. పద్యానికి అవసరమైన ధార, నడక కావాలంటే, సంధులు సమాసాలూ అవసరం. వ్యావహారిక భాష కొంత ముక్కలు ముక్కలుగా ఉంటుంది. అసలు సంధులూ సమాసాల ముఖ్యోద్దేశం, వాక్యాలకు ఒక పారే గుణాన్ని కల్పించడమే. అందువల్ల అవి పద్యానికి ఎంతైనా అవసరం. వ్యావహారిక భాషలో అవి అంతగా ఉండవాయె! మరి వ్యావహారిక భాషలో పద్యం రాయడం ఎలా కుదురుతుంది? కుదిరితే దానికున్న సహజసౌందర్యం ఎక్కడనుండి వస్తుంది? కరుణశ్రీ, జాషువా మొదలైన ఆధునిక పద్య కవులు కూడా, పూర్తి వ్యావహారిక భాషలో పద్యాలు రాయలేదు. వారి పద్యాలలో విరివిగా సంధులూ సమాసాలూ కనబడతాయి. అలాగే పర్యాయపదాలు కూడా. అంచేత పూర్తి వ్యావహారిక భాషలో (అవసరమైతే వ్యాకరణాన్ని కూడా కాలదన్ని) పద్యాలు రాయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు.

ఇక నాల్గవ కారణం కావ్య ప్రక్రియకి ఆదరణ తగ్గి కవితలకీ, మినీ కవితలకీ ఆదరణ పెరగడం. బహుశా జీవనగమనంలో పెరిగిన వేగం కారణంగా కావ్యాన్ని రాయడానికి కానీ చదవడానికి కానీ తీరిక దొరక్క ఆ ప్రక్రియకి ఆదరణ తగ్గింది. కావ్యానికి కథాగమనం, పాత్ర పోషణ, వివిధ వర్ణనలు, రస పోషణ వంటివి చాలా అవసరం. దీనికి పద్యాలు అనువైనవి. కవితలకి, మినీ కవితలకి ఇంత అవసరంలేదు. కావలసిందల్లా ఒక భావాన్ని సూటిగా పాఠకుడి గుండెల్లో నాటుకునేలా చెయ్యడం. వచనం చెఅసినంతగా ఈ పని పద్యం చెయ్యలేదు. కాబట్టి సహజంగా పద్య కవిత్వానికి ఆదరణ తగ్గింది.

పైన చెప్పిన కారణాలలో ఒకటీ నాలుగూ కాలానుగుణంగా వచ్చిన సహజ పరిణామాలు. వీటిని కాదనలేం, అనకూడదు కూడా. వచ్చిన చిక్కల్లా రెండు, మూడు కారణాల వల్లనే. ఇవి సృష్టించిన గందరగోళ పరిస్థితి నుండి సాహిత్యం, అందునా కవిత్వం, ఎప్పుడు బయట పడుతుందో అప్పుడు మళ్ళీ పద్యమంటే సుముఖత ఏర్పడడానికి అవకాశం వస్తుంది. మరి పద్య కవులు ఇప్పుడు చెయ్యగలిగింది ఏమీ లేదా అంటే, ఉంది. వస్తువుతో సంబంధం లేకుండా, వ్యావహారిక భాషా కాదా అన్న తేడా లేకుండా, చక్కని చిక్కని కవిత్వాన్ని, పద్య రూపంలో, దాని సహజసౌందర్యం చెడకుండా అందించగలిగితే, రావలసిన మార్పుకి దోహదం చేసిన వాళ్ళవుతారు. పద్య కవులమనుకొనేవారు తీసుకోవలసిన ఒకే ఒక జాగ్రత్త – పద్యానికీ, పద్య కవిత్వానికి ఉన్న తేడా తెలిసికొని, తాము రాస్తున్నది ఏ కోవకి చెందుతుందో నిగ్గుతేల్చుకోవడం.
------------------------------------------------------
రచన: భైరవభట్ల కామేశ్వరరావు, 
ఈమాట సౌజన్యంతో

Friday, May 10, 2019

దోసిట్లో నక్షత్రాలు


దోసిట్లో నక్షత్రాలు




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి...............

1.
చుట్టూ చీకటి
అలల కల్లోలం
దూరంగా చూడు
నిరంతరం నీ కోసం
కొండ మీద ఒక దీపం
తిరుగుతునే ఉంటుంది

2.
ఏదీ దాచుకోదు
ఆత్మకథ రాసుకోదు
ఎంత అందమైన పూలనైనా
సాయంత్రానికి రాల్చేసుకుంటుంది
ఈ చెట్టుని చూస్తే
నాకసూయ

3.
నీకేమైనా ఇవ్వాలనుంటుంది
విలువైనవి ఏమీ లేవని బాధ పడతాను
పువ్వులు సెలయేళ్ళు నవ్వుకుంటాయి
ప్రేమకన్నా విలువైంది ఏముంది?

4.
నిన్న ఎంతగా నలిగిపోనీ
పొద్దున్నే సూర్యకాంతి
పొగలు కక్కే కాఫీ
ఒంటి మీద వేణ్ణీళ్ళు
అల తడిపి వెళ్ళిన
ఇసకతిన్నెలా మళ్ళీ
తళతళలాడతాను

5.
ఒక రోజు దోసిలినిండా నక్షత్రాలతో
నిన్నాశ్చర్య పరుస్తాను
నీ విస్మయపు కళ్ళ మెరుపు వెనక చీకటిలో
నన్ను నేను దాచేసుకుంటాను

6.
చిరిగిపోయిన కలల్ని కుట్టేందుకు
చిరునవ్వుల దారాలతో
ఏరులా నువు నన్ను
చేరుకుంటావు
రెండు ప్రవాహాలు కలిసినప్పుడు
సుళ్ళు తిరిగే ఆనందం నాలో

7.
నిన్న రాత్రి అమ్మమ్మ మరణ వార్త
తెల్లారుఝామున ఎయిర్పోర్టుకి ప్రయాణం
సుదూరంగా రోడ్డు
ఎక్కడినుండి ఎక్కడికో..

8.
ఎక్కడో వర్షం
కళ్ళు తడుస్తాయి
ప్రపంచం మీద ఇప్పుణ్ణీకు
ఎక్కళ్ళేని ప్రేమ

9.
మహాప్రవక్తల ఉపన్యాసాలు విని
విసుగెత్తిపోయింది
పసిపిల్లల ముద్దు మాటలు
వినాలని ఉంది
సంధ్య వేళ నది అలలపై తేలే
జాలరిపాటగా మారాలని ఉంది

10.
సేదదీర్చిన ప్రతి చెట్టునీడనీ
కాసేపు ప్రతిఫలిస్తూ
ప్రవాహం సాగిపోతుంది

11.
నిర్జన వారధి
మనుషులొస్తారు పోతారు
ఎర్రగా సూర్యుడు
రేపు కూడా ఉదయిస్తాడు
నీ ధైర్యం ముందు
ఆకాశం కూడా చిన్నబోతుంది
చివరికి నీ ఉద్యమం
నీ మీదే కదూ!

12.
“చిన్నవాడా ఈ పిడచ గోడమీద పెట్టీ”
ఆబ్దికం రోజు నాన్నకి అన్నం
కాకులు కాకా మంటూ వచ్చి వాలతాయి
మేఘాన్ని ధిక్కరించిన నాన్న గొంతు
గుండెల్లో గింగిర్లు పెడుతుంది

13.
ఎవరివెరిలానో ఏడవడానికి
ప్రయత్నించాను
నీ ఏడుపేదో నువ్వు ఏడూ
ఏడుపులో కూడా మిమిక్రీ
ఎందుకన్నారు త్రిపుర

14.
నేను కేవలం
ఒక తాళం చెవి
తయారుచేసి ఇస్తాను.
నిధి మాత్రం
నీలోనే ఉంది.

15.
మూడు దోసిళ్ళ నీళ్ళు
బొటన వేలి మీద
నువ్వుల మీంచి జారి
గిన్నెలో పడతాయి.
గోదావరి తరంగాలు
ఎడతెగని జ్ఞాపకాలు

16.
కోనేట్లో తాబేలు
తాపీగా నెమరేస్తూ ఆవు
ప్రపంచానికిప్పుడు కావల్సింది
కాస్త బద్దకమేనెమో!

17.
ఎంత అందంగా ఉన్నా
నదినీ సముద్రాన్నీ చూస్తే
ఏదో భయం
స్త్రీని చూసినట్టు
సెలయేరు మాత్రం
చంటిపిల్లలా ముద్దొస్తుంది

18.

గొంతెండి పోతుంది
కుండలో చల్లని నీరు
గాజుల చప్పుడు
ఆమెని చూద్దామనుకునే లోపే
కల చెదిరిపోతుంది
కొన్నిటిని చూడలేకపోవడంలో
ఎంత అందం ఉంది!

19.
ఎవరూ అక్కరలేదు
ఏదీ అక్కరలేదు
ఏ లోతుల్లోనో
ఏ కొద్దిపాటి తడైనా చాలు
ఎడారిలో ఖర్జూరపు చెట్టులా
ఒంటరిగా నిలబడతాను

20.
పూలు మౌనంగా నవ్వుతాయి
రంగులు కళ్ళని కమ్ముకుంటాయి
రాలుతున్న పూలని చూస్తుంటే
నీలోనూ ఏవో రాలిపోతాయి!
------------------------------------------------------
రచన: మూలా సుబ్రహ్మణ్యం, 
ఈమాట సౌజన్యంతో

Thursday, May 9, 2019

అభినవ కవిబ్రహ్మ తెలుగు నుడికారం


అభినవ కవిబ్రహ్మ తెలుగు నుడికారం






సాహితీమిత్రులారా!


చేజిడ్డునొరయని స్నేహపూరమ్ముతో
తీర్థమాడె నఖండ దీపకళిక
అగరు, గుగ్గుళు, మహిషాక్ష ధూమమ్ముతో
గాజువారినది నీరాజనమ్ము
చందనచర్చా మచర్చికా కలనతో
జేయి కల్పిన దభిషేక ధార
షడ్రసీగ్రాస సంసద్భుగభుగలతో
జిగురువట్టిన దాజ్య జీవనమ్ము
తే.
పుష్పసీధు రసాభోగ భూములైన
వివిధ తోరణకాంతు లావిష్కరించు
పసని నిగ్గులు తమ పటాభరణములకు
నభినవావేశనేపథ్య మలవరించె.
కాకతీయ చక్రవర్తిని రుద్రమదేవి ఏకశిలా నగరంలోని విఘ్నేశ్వరాలయానికి పూజ నిర్వర్తించడానికి ప్రవేశించింది. ఆ సందర్భంలో ఆలయం అంతర్భాగంలో పూజాసమయ దీపనీరాజనాదికాలను వర్ణించే పద్యం ఇది. దీపాన్నీ, ధూపాన్నీ, హారతినీ, అభిషేకాన్నీ, కాంతి తోరణాలనూ- ఆఖరుకు ప్రమిదలోని నూనెనూ రూపించిన తీరూ, ఆ దేవాలయ నేపథ్యం రాజకుటుంబ సభ్యుల పటాభరణాదులకు పసని నిగ్గులు కూర్చే నవ్యాలేపనంగా అమరిపోయిన చందమూ, ఎంతో సహజ సుందరంగా కన్నులముందు ఆవిష్కరిస్తోన్న పద్యం. ఇది రుద్రమదేవి అనే ఒక చిన్న కావ్యంలోనిది. ఏతత్కావ్య కర్తకు కవిబ్రహ్మ అనే సార్థకమైన ఉపనామం కూడా ఉన్నది.

అవును. కావ్యం పేరు చెప్పినా, కవి బిరుదు చెప్పినా తటాలున ఆ కవి పేరు ఎంతమంది పద్యప్రియులకు స్ఫురిస్తుందో అనుమానమే. చాలా సకృత్తుగా మాత్రమే తలచబడే ఆ సత్కవి ఏటుకూరి వేంకట నరసయ్యగారు.

ఏటుకూరి వేంకట నరసయ్యగారు పద్యవిద్యలో సిద్ధహస్తులు. ఆంధ్ర సాహిత్య మాగాణంలో అనర్ఘమైన కావ్య సస్యాలను పండించి, ఆంధ్రికి ఆమెతలు వెట్టిన మధుర కృషీవలులు. క్షేత్రలక్ష్మి సిద్ధాశ్రమము, ప్రేమాలోకము, నాయకురాలు, వీరభారతము, బాలచంద్రుడు, మగువ మాంచాల, రుద్రమదేవి, మొదలైన పెక్కు కావ్యాలను రచించి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన కవితల్లజులు. వారు బ్రతికినది కేవలం 38 సంవత్సరాలే. ఆ పసివయసులోనే అంత విశాలమైన సాహిత్య సృష్టి కావించడం వారి అకుంఠిత సారస్వత దీక్షకూ ప్రజ్ఞకూ నిదర్శనం.

కవి జీవనకాలం భారతదేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టానికి సాక్షిప్రాయమైనట్టుంది. పరప్రభుత్వ ఆధిపత్యం క్రింద అణగిపోతున్న జాతి స్వేచ్ఛకోసం ఉద్యమిస్తున్న రోజులవి. కవులూ గాయకులూ ఇతర కళాకారులూ తమ కళా రూపాలతో ఉధృతంగా జన హృదయాలను ఉద్బుద్ధంగావిస్తున్న కాలం. కేవలం రాజకీయాధిపత్యమే కాక పద సంస్కృతి కూడా–ఇక్కడి సంస్కృతిని అణచివేస్తున్న పరిస్థితిని చూస్తూ–తమ మూలాలను, తమ పూర్వౌన్నత్యాన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ తమ జాతీయతను కేతనంగా ఎగురవేస్తున్న రోజులు. మన వీరులను, మన జాతి గరిమనూ ఉగ్గడించే రచనలు జాతీయ మహోద్యమంలో భాగంగా అమరిపోయిన వేళ అది. శివభారతము, రాణా ప్రతాప చరిత్ర లాంటి మహాకావ్యాలు వెలువడ్డాయి. ఆంధ్ర జాతీయత కూడా విశాల భారతీయతలో భాగంగా కీర్తించబడుతూ ఆంధ్రావళి, ఆంధ్ర ప్రశస్తి, ఆంధ్ర పురాణము లాంటి కావ్యాలు కూడా ‘నాదు భాష, నాదు దేశమన్న ఒక మహావేశ దర్శనమ్ము’ను అందించిన గ్రంథాలే. అటువంటి సమయంలో కలం పట్టిన వేంకట నరసయ్యగారి కవి హృదయం ఆ మహావేశాన్ని అందిపుచ్చుకోకుండా ఎలా ఉండగలదు? ఆంధ్ర రాజకీయ చరిత్రకు మకుటాయమానమైన రుద్రమదేవి గాథ, స్థానిక వీరగాథాంతర్భాగాలైన నాయకురాలు, మగువ మాంచాల, బాలచంద్రుడు లాంటి వారి కథలూ, వేంకట నరసయ్యగారి చేతిలో పునః ప్రాణప్రతిష్ఠ కావించబడ్డాయి. అలా వారు సృష్టించిన విస్తృత సాహిత్యం, జాతీయోద్యమంతో పెనవేసుకుని సందర్భ శుద్ధినీ, సంకల్ప సిద్ధినీ కూడా సాధించింది.

రుద్రమదేవి కావ్యము 335 పద్యాలతో, 13 ద్విపదలతో నివ్వటిల్లే చిరు కావ్యము. పరిమాణములో చిన్నదైనా కవితా సౌందర్యములోనూ, సన్నివేశ కల్పనలోనూ, కథా నిర్మితిలోనూ మిన్నయైన కావ్యం.

కవి వృత్తిరీత్యా కృషీవలులు. జానపద సౌందర్యాన్నీ, సంప్రదాయాల కమనీయతనూ గుండెల్లో నింపుకున్నవారు. ఆ నేపథ్యం వలన కమ్మటి తెలుగు జాతీయాలూ, పలుకుబడులూ వారి పద్యాల్లో బహుళంగా మెరుస్తుంటాయి. పై పద్యమే చూడండి: తీర్థమాడుట, గాజువారుట, చేయికల్పుట, చిగురుపట్టుట, పసని నిగ్గులు లాంటి పలుకుబడులు ఎంత సొగసుగా ఉన్నాయో! ‘చేజిడ్డు నొరయని’ అనేది ఎంత నిసర్గంగా ఉంది! జనం నోళ్ళల్లో నానివున్న ఇలాంటి పదబంధాలనలా వుంచితే, రుద్రమదేవి కావ్యంలో ఎడనెడా కవిగారు చెప్పే నిత్యసత్యాలైన సూక్తులు కూడా అభివ్యక్తి వైచిత్రితో కలిసి ఎంతో మధురంగా కుదిరిపోయాయి.

మచ్చుకు రెండుమూడు మనవి చేస్తాను. చిత్తగించాలి.

‘నీళులన్ నమలుట పాడిగాదు నరనాయక’

‘వేళకు గ్రుక్కెడు ద్రావ నోచిరే’

‘ఏ నిప్పుల పాదులందివి జనించెనో’

‘మడమ ద్రిప్పక నిప్పైన పిడికిలింతురు’

‘అతనిపై గాలినైన జిట్టాడనీక’

‘ప్రక్కలోని త్రాచుబాముల జోకొట్టి ఎంతకాలమాతడేలగలడు’

‘కాల కిరాతుడే కుదుటికే బాణమ్ము సంధించునో’

‘మాన హాని కంటె మరణముత్తమమండ్రు చీము నెత్తురున్న జీవికెల్ల’

వేంకట నరసయ్యగారి పద్యాల ధార అబ్బురం కలిగిస్తుంది. వారిది అపారమైన శబ్ద సంపద. ఛందస్సును ఆయన విధేయం కావించుకున్న తీరు కూడా ‘ఆహా’ అనిపిస్తుంది. సంస్కృత సమాస కల్పనకూ, ధారకూ ఈ పద్యం తిలకించండి:

వారల దేవిడీ వెలువరించిన దేవగిరి ప్రభుండు, కి
మ్మీర మణి ప్రభాపటల మిశ్రిత విస్తృత చంద్రశాలికా
గార సుగంధ పుష్ప పరికల్పిత తల్పముసేరి, నిద్రకే
గూరడు – కాకతీయ నృప గోత్ర విమర్దనకేళి లోలుడై

మరొక్కటి…

అరుగో భూపతి పుత్రులిర్వురు ప్రభాతాయాత మందానిలాం
కుర సంస్పర్శకు నుల్లసిల్లు చుదయద్గోధూమవర్ణ ప్రభా
కిరణ స్నానములాడుచున్, విహగ సంగీతమ్ము లాలించుచున్
తురగోత్తంసములెక్కి దేవగిరి తెన్నుల్ పట్ట రాపన్నులై

ఆ సోదరులెక్కిన గుర్రాలధాటి పద్యంలో కూడ కనిపిస్తున్నది కదా!

వేంకట నరసయ్యగారు గొప్ప భావుకుడు. ప్రకృతి సౌందర్య వర్ణన పట్టుల పరవశించి అందమైన దృక్చిత్రాలను రూపుకట్టిస్తారు. ఈ క్రింది చరణాలు చిత్తగించండి.

ఒడయడరసి మరలె, నుదయ సంధ్యాదేవి
మొలక మంచులోన జలకమాడె,
తూర్పు కొండచరుల దోబూచులాడెడి
ప్రొద్దు పొగడబంతి పొలుపుగులికె.

కాకతీయ సౌధ కలధౌత శిఖరారు
ణాతప ప్రవాహమవని కురిసె
పసిడి గచ్చు చమిరి – పటికార్చిన విధాన
పొంగిపొరలిబారె ప్రాంగణమున

సామాన్య ప్రజా జీవనంతో ఎంతో మమేకమైనవారికే, మొలక మంచు, పసిడి గచ్చు, పటికార్చుట లాంటి జీవద్భాష అలవడుతుంది.

మరో సందర్భం మనవి చేస్తాను. హరిహర మురారిదేవులు రుద్రమదేవికి వ్యతిరేకంగా తాము సాగించే పోరాటంలో తమకు సాయపడే వీరుల గురించి దేవగిరి రాజుకు చెప్పే సన్నివేశంలోని పద్యం ఇది.

కొప్పెర జంగదేవు డుడుకుంఘట, మల్లడ పెమ్మయాధిపుం
డుప్పెన పెట్టు, పాండ్యపతులొట్టిన మంటలు, వల్లభాగ్రణిన్
చెప్పెడిదేమి – యిందరు విశేష మహాభుజులస్మదర్థమై
నిప్పులు గ్రక్కుచుండ గమనింపరె దేవగిరి ప్రభూత్తముల్

ఉడుకుఘటము, ఉప్పెనపెట్టు, ఒట్టినమంటలు, నిప్పులు గ్రక్కుటలాంటి మెరుపు పదాలనలా ఉండనీయండి; ఇలాంటి సొబగు నుడులు వీరి చాలా పద్యాల్లో కనబడతాయి. పై పద్యం చదువుతుంటే భారతోద్యోగ పర్వంలో తన రాయబార సమయంలో సంజయుడు ధర్మజునితో పాండవ, కౌరవ వీరుల గురించి వివరించే రెండు పద్యాలు తటాలున జ్ఞాపకం వస్తాయి. ఆ పద్యాలు ఇవి. చిత్తగించండి.

పెట్టని కోట నీకు హరి, భీముడు నర్జునుడున్ రణమ్మునన్
దొట్టిన మంట లా కొలది యోధులె సాత్యకియున్ విరాటుడున్
చుట్టపు మేరు వుగ్రరణ శోభితుడా ద్రుపదుండు, నిన్నుని
ట్టట్టనవచ్చునే సురలకైనను నొల్లవుగాక చివ్వకున్

ద్రోణుడు భీష్ముడున్ కృపుడు ద్రోణసుతుండును కర్ణశల్యులున్
ప్రాణములా సుయోధనుని పాలివయండ్రు, నిజానుజన్ముల
క్షీణపరాక్రముల్, సుతు లజేయులు, బాహ్లిక సోమదత్తు లా
స్థాణునికైన నోడరు, వశంబె జయింపగ వారి నేరికిన్

తిక్కన ప్రభావం చాల స్పష్టంగా కనిపిస్తుంది వేంకట నరసయ్యగారి పద్యాల్లో. బహుశా ఇలాంటి పట్టులను పట్టుకొనే వీరికి కవిబ్రహ్మ అనే బిరుదు వచ్చి వుంటుంది. (కవిబ్రహ్మ అనేది తిక్కనగారి బిరుదుకూడా కదా!)

వేంకట నరసయ్యగారు మధ్యాహ్న వేళ కూడా కాకుండానే అస్తమించిన మార్తాండుడు. తన క్లుప్త జీవనకాలంలో దీప్త కావ్యాలను వెలయించిన గొప్ప కవి. కానీ వారికీ వారి కృషికీ రావలసినంత గుర్తింపు రాలేదని తలచుకొంటే విషాదంగా ఉంటుంది. తమ వ్రాతలలో జాతిని ఉద్బుద్ధం కావించిన మహాత్ములను మరచిపోవడం ఏ జాతికీ శ్రేయస్కరం కాదు. వేంకట నరసయ్యగారు తెలుగువారు మరచిపోరాని కవి. కవి బ్రహ్మగా అన్వర్థ యశస్వి!
------------------------------------------------------
రచన: చీమలమర్రి బృందావనరావు, 
ఈమాట సౌజన్యంతో