Saturday, March 16, 2019

అచ్చులు హల్లులు


అచ్చులు హల్లులు



సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి.................

కొట్టుకుపోయేంత వీచే తుఫాన్లు
మునిగి పోయేంత చుట్టేసే సుడిగుండాలు
నామరూపం లేకుండా చేసే ఉప్పెనలు
ప్రవాహంలోంచి ఒడ్డుకు గిలగిలా పడడం
ఒడ్డునుండి ప్రవాహంలోకి దొమ్మరిగడ్డ వేయడం
పొడారితనంతో మనసంతా ఇర్రిర్రుమన్నప్పుడు
ఒక నెగలనియ్యనిదేదో ఒక మిగలనియ్యనిదేదో
అక్షరమై ఆయుధమై నన్ను ఎక్కుపెడుతుంది.

అలల ఉయ్యాలపై కలలు
ఎండిన పంటచేను గడ్డిపరకలు
ఆగాగి వున్న దగ్గరినుంచి
ఉన్నపళంగా లేస్తున్న ఎర్రమట్టి వేడి గాలులు
సుడి పడిపోవడం నిలబడిపోవడం
ఎడారినుంచి ఓయాసిస్సు జాడ
ఒయాసిస్సు నుంచి ఎడారి పీడ
తడితనంతో బతుకంతా గిజగిజలాడినప్పుడు
ఒక నెట్టివేసిందేదో ఒక కట్టిపడేసినదేదో
నుడుగై పిడుగై నన్ను చిక్కు తీస్తుంది.

మడిమలొత్తుకపోతున్న అరిగిన చెప్పుల నడుక
గుండెలు అవిసిపోతున్న అలసిన తప్పుల నడక
ఎడ తెగని విడివడని చెకుముకి నిప్పురవ్వ
వేరుండలేక కలెగల్సిపోవడం
పడుండలేక ఎగిరెగిరిపడడం
ఊరునుంచి పట్టనానినికి గోస కావటం
పట్టణం నుంచి నగరానికి సమోస ఒదగడం
ఒక కూడివేతేదో ఒక తీసివేతేదో
సరుకై ఫరకై నన్ను చురుకు పుట్టిస్తుంది.

బాయిలనుంచి చేదుతున్న నీళ్ళు
మిరప తోటకు కడుతున్న కన్నీళ్ళు
సందెనపడడం సరి చూసుకోవడం
కందెన లేకపోవటం కరి ఎక్కకపోవటం
రోజుకోసారి పోయిండని కింద వేయటం
గడియకోసారి ప్రాణముందని పైకి పట్టడం
తావునుంచి రోడ్డు వైపు జరగడం
రోడ్డు నుంచి మానవ సంపద తరలడం
ఒక తల్లై ఒక చెల్లై ఒక బిడ్డై
ఎటమటం తెలంగాణ నన్ను పారతో తిర్లమర్ల బోరిస్తుంది.

కొట్టిన ఉదయం బడిగంట
విధ్యార్థుల వెలుగు పాదముద్రలు
సలుపరం కలువర పడడం
తడువడం ఒడిసి పోవడం
గావర గావర ఏటేటో ఎత్తుకపోవడం
చేదు చేదు కడుపులో చేయిపెట్టి దేవడం
లోపల వుంచుకోలేక బయటకు చెప్పుకోరాక
తాయిమాయి ఆగమాగం ఎల్తి ఎల్తి
ఒక మసులుతున్నదేదో ఒక మరుగుతున్నదేదో
పద్యం అద్దమై ముత్యమై పగడమై
నన్ను రెండు చేతుల ఎత్తుకు గుండెలకు హత్తుకు
వానదేవుడిలా కరిగి
కనికరిస్తుంది, కరుణిస్తుంది.
--------------------------------------------------------
రచన: జూకంటి జగన్నాథం, 
ఈమాట సౌజన్యంతో

Friday, March 15, 2019

దేశమాత


దేశమాత




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి........................

ఉజ్వల సంస్కృతి విరిసిన
ఓ భారత దేశమా!
విశ్వంభర మోము మీద
వెలిగే దరహాసమా!

తరతరాల చరిత్రను
కిరీటముగ పెట్టుకొని
నవయుగ చేతనమునే
కేతనముగ పట్టుకొని
కాలానికి బెదిరిపోని
కలల కోట కట్టుకొని
శతకోటి ప్రజాజీవన
ప్రగతిని నడిపించేవు
ప్రజాస్వామ్య భారతీ!

గాలికేమొ నీవు, వీర
గంధం దట్టించావు
మట్టికేమొ దేశరక్ష
మంత్రం బోధించావు
గులాబీల తోటలకు
ఘోరాటవి బాటలకు
కంటకాల నెదిరించే కళ నేర్పావు
కారుచిచ్చులను ఆర్పే కౌశలమిడినావు!

చెట్టు చేమ గట్టు పుట్ట
చరాచరాలన్నీ
గనులు, వనులు, ఫాక్టరీలు
పంట పొలాలన్నీ
డేగలనే కాదు, కందిరీగలనైనా సరే
వాలనీవు నీ పచ్చని
ఇంటి మీద ఒంటి మీద
దూరనీవు నీ పవిత్ర
వాటికపై, వాకిటిపై!
----------------------------------------------------------
రచన: జె. బాపురెడ్డి, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, March 13, 2019

ఒంటరితనం


ఒంటరితనం



సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి.................

ఏ చిరు దీపమూ పెదవులు సాచి
మృదువుగానైనా  చుంబించకనే గదా
ఈ ప్రమిదలో వత్తికి
వేడి,వెలుగుల అనుభవం లుప్తమై పోయింది.

ఏ కొమ్మా తన పలుకులకి
తన్మయత్వంతో తలాడించకనే గదా
ఈ చిలుక పాత మాటల పంజరంలో
బందీయై పోయింది.

ఒకసారి ప్రేమగా వెలిగిస్తే చాలు
ఆపై కోరికతో జ్వలించి
ఆనంద నాట్యం చెయ్యటం,
దీపానికెవరూ నేర్పనక్కర్లేదు.

దయ తలచి,నాలుగు వేళ్ళు
దాని పంజరపు తలుపు తెరిస్తే చాలు
రెక్కలు టపటపలాడిస్తూ రాగాలాలపించటం
పిట్టకెవరూ నేర్పనక్కర్లేదు.

నునువెచ్చని అరచేయి యేదీ
తనను స్పృశించకనే గదా
ఈ భుజం మీద ఒంటరితనం
యింతగా గడ్డ కట్టింది.
--------------------------------------------
రచన: విన్నకోట రవిశంకర్, 
ఈమాట సౌజన్యంతో

Tuesday, March 12, 2019

తేనీటి సమయం


తేనీటి సమయం




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి...........................

వారమంతా వారాంతం కోసం వోపిగ్గా ఎదురు చూశాక
ఎప్పటిలానే ఏలకుల సుగంధాన్ని మోసుకుని
శనివారపు ఉదయం మెత్తగా నిద్ర లేపుతుంది

మూల కుండీలో ఎర్రటి మొక్క
నిద్ర కళ్ళతో బద్ధకంగా పలకరిస్తుంది
అద్దాల గదిలో గుండ్రటి గాజు బల్ల
వేడి కప్పుల చురుకు స్పర్శకు నిమ్మళంగా నవ్వుతుంది

చెట్టు కొమ్మపై చెవులు రిక్కించిన ఫించ్ పిట్ట,
విచ్చిన మొగ్గలతో మాగన్ను రెమ్మల మాగ్నోలియా,
రవ్వంతైనా సవ్వడి చేయని నిటారు పైన్ చెట్లు,
సమావేశానికి హాజరైన బోర్డు మెంబర్స్‌లా నిలబడ్డాయి

పొగలు కక్కుతున్న తేనీటినీ,
సంభాషణలతో పనిలేని సాన్నిహిత్యాన్నీ,
తీరికగా ఆస్వాదిస్తూ రాజ్యాధినేతల్లా
ఎదురెదురుగా కూర్చుంటాం నువ్వూ, నేను!
గలగల పారే ఏరులా కాలం జారిపోతుంది.
-----------------------------------------------------------
రచన: వైదేహి శశిధర్, 
ఈమాట సౌజన్యంతో

Monday, March 11, 2019

స్టాంప్ ఆల్బమ్‌


స్టాంప్ ఆల్బమ్‌




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి..................

రాజప్ప కీర్తి పాతబడిపోయింది. మూడు రోజులుగా పిల్లలందరూ నాగరాజు చుట్టూ మూగేస్తున్నారు. నాగరాజుకి గర్వం తలకెక్కేసింది అని రాజప్ప తోటి పిల్లలతో కూడా చెప్పాడు. ఎవరూ ఒప్పుకోలేదు. నాగరాజు సింగపూర్ నుండి వాళ్ళ మామయ్య పంపిన ఆల్బమ్‌ను అందరికీ చూపించాడు. బడిలో పొద్దున గంట కొట్టేంతవరకు పిల్లలు నాగరాజు చుట్టూనే నిల్చుని ఆల్బమ్‌ను చూశారు. మధ్యాహ్నం లంచి టైములోనూ వాడి చుట్టూనే మూగారు. గుంపులు గుంపులుగా ఇంటికి వచ్చికూడా చూసెళ్ళారు. ఓపిగ్గా అందరికీ చూపించాడు. ఎవరూ ఆల్బమ్‌ను తాకకూడదన్న ఒక్క షరతు మాత్రం పెట్టాడు. వాడే ఒడిలో పెట్టుకుని ఒక్కొక్క పేజీగా తిప్పుతూ ఉంటే పిల్లలు చూసుకోవాలి.

బడిలో అమ్మాయిలకు కూడా నాగరాజు ఆల్బమ్‌ను చూడాలని ఆశ కలిగింది. అమ్మాయిలందరి తరఫున పార్వతి వచ్చి అడిగింది. ఆ అమ్మాయికి ధైర్యం ఎక్కువ. ఆల్బమ్‌కు అట్టవేసి ఆమె చేతికిచ్చాడు నాగరాజు. అమ్మాయిలందరూ చూశాక సాయంత్రానికి తిరిగి వాడి చేతికొచ్చింది ఆల్బమ్‌.

ఇప్పుడు రాజప్ప ఆల్బమ్‌ గురించి మాట్లాడే నాథుడే లేడాయె. వాడి పేరు పడిపోయింది.

ఒకప్పుడు రాజప్ప ఆల్బమ్‌ విద్యార్థుల మధ్య బాగా ప్రసిధ్ధం. తేనెటీగ తేనె పోగుచేసినట్టు ఒక్కో స్టాంపుగా సేకరించి పెట్టుకున్నాడు. ఇది తప్ప మరో విషయం మీద ధ్యాస ఉండేది కాదు వాడికి. పొద్దున ఎనిమిదికే ఇంటినించి బయల్దేరి, స్టాంపులు సేకరించే పిల్లలందరి ఇళ్ళకూ వెళ్ళేవాడు. రెండు ఆస్ట్రేలియా స్టాంపులిచ్చి ఒక ఫిన్లాండ్ తీసుకునేవాడు. రెండు పాకిస్తాను తీసుకుని ఒక రష్యా ఇచ్చేవాడు. సాయంత్రం బడినుండి ఇంటికి రాగానే సంచక్కడ పడేసి, అమ్మ ఇచ్చిన జంతికలు నిక్కర్ జేబులో పోసుకుని, నిల్చునే కాఫీ తాగేసి, ఇంటినుండి బయల్దేరేవాడు. నాలుగు మైళ్ళు దూరంలో ఉన్న ఓ పిల్లాడిదగ్గర కెనడా ఉన్నట్టు సమాచారం అందేది. జంతికలు నములుతూ అడ్డదారిలో పొలాల గట్లమీద పరుగు తీసేవాడు.

ఆ బళ్ళో అందరికంటే వీడి స్టాంప్ ఆల్బమే పెద్దది. బడిలో చదివే ఒక పిల్లాడు ఆ ఆల్బమ్‌కు పాతికి రూపాయలిస్తానన్నాడు. సిరస్తాదారు కొడుకు వాడు. డబ్బు మదం! డబ్బులిచ్చి ఆల్బమ్‌ కొనేయాలని చూశాడు. రాజప్ప బాగా గడ్డి పెట్టాడు. ‘మీ యింట్లో ముద్దుగా ఉండే ఒక పసిబిడ్డ ఉంటుంది కదా? ముప్పై రూపాయలిస్తాను. డబ్బులకిచ్చేస్తావా?’ అనడిగాడు. అక్కడ కూడివున్న పిల్లలందరూ చప్పట్లుకొట్టి, ఈలలేసి రాజప్పకి ఆమోదం తెలిపారు.

అయితే ఇప్పుడు వాడి ఆల్బమ్‌ గురించిన మాటేలేదు. అంతేకాదు, నాగరాజు ఆల్బమ్‌ను చూసిన అందరూ దాన్ని రాజప్ప ఆల్బమ్‌తో పోల్చారు. రాజప్ప ఆల్బమ్‌ ఏ కొసకూ సరితూగదట.

రాజప్ప నాగరాజు ఆల్బమ్‌ను చూపించమని అడగలేదు. అయితే వేరేవాళ్ళు చూసేప్పుడు ఆ పక్కకే తిరగనట్టు ముఖం పెట్టుకుని ఓరకంట చూశాడు. నిజంగానే నాగరాజు ఆల్బమ్‌ చాలా అందంగా ఉందని తెలిసింది. రాజప్ప ఆల్బమ్‌లో ఉన్న స్టాంపులు నాగరాజు ఆల్బమ్‌లో లేవు. సంఖ్య కూడా తక్కువే. అయినప్పటికీ ఆల్బమ్‌ చూడటానికి నాణ్యంగా, చాలా అందంగా ఉంది. దాన్ని చేతిలో పెట్టుకుని ఉండటమే గొప్పగా అనిపిస్తుంది. అలాంటి ఆల్బమ్‌ ఈ ఊరి అంగళ్ళలో దొరకదు.

నాగరాజు ఆల్బమ్‌ మొదటి పేజీలో ముత్యాల్లాంటి అక్షరాలతో వాడి మామ ఇలా రాసి పంపారు.

ఏ.ఎస్.నాగరాజు
సిగ్గులేకుండా ఈ ఆల్బమ్‌ను ఎవరూ దొంగిలించరాదు.
పైన రాసున్న పేరు చూడు. ఇది నా ఆల్బమ్‌.
గడ్డి ఆకుపచ్చగా ఉన్నంతవరకు, తామర పువ్వు ఎర్రరంగులో ఉన్నంతవరకు,
సూరీడు తూర్పున ఉదయించి పడమరన అస్తమించేంతవరకు ఇది నా ఆల్బమే.

తక్కిన పిల్లలందరు దీన్ని వారి వారి ఆల్బమ్‌లలో రాసుకున్నారు. అమ్మాయిలూ తమ నోటు పుస్తకాలలోను, పాఠ్యపుస్తకాలలోనూ రాసుకున్నారు. “ఎందుకర్రా వాడిని చూసి మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నారు?!” అని పిల్లల మీద అరిచాడు రాజప్ప.

ఎవ్వరూ బదులు మాట్లాడకుండా రాజప్పకేసి చూశారు. కృష్ణుడు అలా మౌనంగా ఉండలేదు.

“పోరా కుళ్ళుబోతోడా!” అని అరిచాడు కృష్ణుడు.

“నాకెందుకురా కుళ్ళు? వాడి ఆల్బమ్‌ కంటే నాది పెద్దదిరా!” అన్నాడు రాజప్ప.

“వాడి దగ్గరుండే ఒక స్టాంప్ నీ దగ్గరుందా? ఇండోనేషియా స్టాంపొక్కటి చాలు. కళ్ళకద్దుకోరా వాడి స్టాంపుని,” అన్నాడు కృష్ణుడు.

“నా దగ్గర ఉండే స్టాంపులన్నీ వాడిదగ్గర ఉన్నాయా?” అనడిగాడు రాజప్ప.

“వాడి దగ్గరుండే ఒక స్టాంపు చూపించు చూద్దాం,” అన్నాడు కృష్ణుడు ఉక్రోషంగా.

“నా దగ్గరుండే ఒక్క స్టాంప్ వాణ్ణి చూపించమను చూద్దాం. పది రూపాయలు పందెం!”

“నీది చెత్త ఆల్బమ్‌… చెత్త ఆల్బమ్‌…” అని కేకపెట్టాడు కృష్ణుడు. అక్కడున్న పిల్లలందరూ “చెత్త ఆల్బమ్‌… చెత్త ఆల్బమ్‌…” అని వంత పాడారు.

తన ఆల్బమ్‌ గురించి ఇక మాట్లాడటం దండగని అర్థంచేసుకున్నాడు రాజప్ప.

‘అష్టకష్టాలుపడి ఒక్కొక్క స్టాంపుగా సేకరించి తయారుచేసుకున్న ఆల్బమ్‌ తనది. సింగపూర్ నుండి తపాలాలో వచ్చిన ఆల్బమ్‌ నాగరాజుని ఒక్కే రోజులో గొప్పవాణ్ణి చేసేసింది. రెంటికీగల తేడా ఈ పిల్లలకి తెలియదు. చెప్పినా ఈ తెలివితక్కువ శుంఠలకు తలకెక్కదు’ అనుకున్నాడు.

కానీ రాజప్ప లోలోపల కుమిలిపోతున్నాడు. బడికి వెళ్ళడానికే ఇష్టం కలగటంలేదు.

తోటి పిల్లల ముఖాలు చూడటానికే సిగ్గేసింది. మామూలుగా శని, ఆదివారాల్లో స్టాంపుల కోసం తెగ తిరిగేవాడు ఇప్పుడు ఇంటినుండి అడుగు బయటకు పెట్టడమే లేదు. ఒక్క రోజులో రాజప్ప తన ఆల్బమ్‌ను ఎన్నిసార్లు తిరగేసేవాడో లెక్కే ఉండేది కాదు. రాత్రి నిద్రనుండి ఉన్నట్టుండి మేలుకుని ట్రంకుపెట్టె తెరచి ఆల్బమ్‌ను ఒకసారి తిరగేసి మళ్ళీ పడుకునేవాడు. అలాంటిది, గత నాల్రోజులుగా పెట్టెనుండి బయటకైనా తియ్యలేదు. ఆల్బమ్‌ను చూడాలంటేనే చిర్రెత్తుకొస్తోంది. నాగరాజు ఆల్బమ్‌తో పోలిస్తే తన ఆల్బమ్‌ ఒట్టి అప్పళం పొట్లం అనిపించింది వాడికి.

రాజప్ప ఒక నిర్ణయానికొచ్చాడు. ఈ అవమానాన్ని వాడు ఎక్కువ రోజులు ఓర్చుకోలేకపోయాడు. ఆ రోజు సాయంత్రం నాగరాజు ఇంటికి వెళ్ళాడు.

‘ఉన్నట్టుండి నాగరాజు చేతిలోకొక ఆల్బమ్‌ ఊడిపడిందంతే! స్టాంపు సేకరణలో ఉన్న పట్టువిడుపులూ, కష్టనష్టాలు వాడికేం తెలుసు? ఒక్కో స్టాంపుకూ స్టాంపు సేకరించేవాళ్ళ దగ్గర ఎంత విలువుంటుందో వాడికి తెలుసా ఏంటి? పెద్ద స్టాంపే గొప్ప స్టాంప్ అనుకుంటూ ఉంటాడేమో. స్టాంపుల విషయంలో నాకున్నంత అవగాహన, అనుభవం వాడికిలేదు. వాడు కేవలం ఔత్సాహికుడంతే. నా దగ్గరున్న పనికిరాని స్టాంపులు కొన్నిచ్చి విలువైన స్టాంపులు కొట్టేయలేనా ఏంటి? ఎందరి దగ్గరో నా తెలివితేటలు ప్రదర్శించి స్టాంపులు సంపాయించలేదా? ఈ విషయంలో నేనెరిగిన మాయలూ, యుక్తులూ ఎన్నెన్నీ? ఈ నాగరాజు నా ముందు ఏ మూలకి?’

రాజప్ప నాగరాజు ఇంటికి చేరుకుని మేడమీదకెళ్ళాడు. వాడు తరచూ ఆ ఇంటికి వచ్చేవాడే కాబట్టి వాడ్ని ఎవరూ ఏమీ అడగలేదు. మేడమీద నాగరాజు బల్లముందు కూర్చున్నాడు రాజప్ప. కాసేపటికి నాగరాజు చెల్లెలు కామాక్షి వచ్చింది. “అన్నయ్య టవునుకెళ్ళాడు,” అని చెప్పి “అన్నయ్య ఆల్బమ్‌ను చూశావా?” అనడిగింది.

“ఊఁ” అన్నాడు రాజప్ప.

“చాలా బాగుంది కదా? స్కూల్లో వేరే ఎవరి దగ్గరా ఇంత పెద్ద ఆల్బమ్‌ లేదంట కదా?”

“ఎవరన్నారు?”

“అన్నయ్యే చెప్పాడు.”

పెద్ద ఆల్బమ్‌ అంటే ఏంటి? చూడటానికి పెద్దదిగా ఉంటే చాలా?

కాసేపక్కడ ఉండి, కామాక్షి కిందకెళ్ళిపోయింది.

రాజప్ప బల్లమీద్దున్న పుస్తకాలు చూస్తూ కూర్చున్నాడు. అనుకోకుండా చేయి డ్రాయర్ తాళానికి తగిలింది. లాగి చూశాడు. తాళమేసి ఉంది. తెరిచి చూస్తే ఏమౌతుంది? బల్ల మీద వెతికి తాళం చెవి పట్టుకున్నాడు. మెట్లదగ్గరకెళ్ళి ఓ సారి కిందకు తొంగి చూసొచ్చి, గభాలున డ్రాయర్ తీశాడు. పైనే ఉంది ఆల్బమ్‌. మొదటి పేజీ తెరవగానే దానిలో రాసున్నది చదివాడు. గుండె లబక్ లబక్ మని కొట్టుకుంటోంది. ఒక్క నిముషంలో డ్రాయర్‌కి తాళం వేశాడు. ఆల్బమ్‌ తీసి షర్ట్‌కి నిక్కర్‌కీ లోపల దాచుకుని కిందకు దిగి ఇంటికేసి చూసి పరుగు పరుగున అక్కడనుండి వెళ్ళిపోయాడు.

నేరుగా ఇంటికి వెళ్ళి పుస్తకాల అలమరా వెనుక ఆల్బమ్‌ను దాచి పెట్టాడు. వాకిట్లోకొచ్చాడు. ఒళ్ళంతా కాలిపొతున్నట్టుంది. ముఖంలో సూదులు పొడిచినట్టు జివ్ జివ్వుమని నొప్పిగా ఉంది.

రాత్రి ఎనిమిది గంటలకు ఎదిరింటి అప్పు వచ్చాడు. చేతులూ తలా ఆడిస్తూ విషయం చెప్పాడు. నాగరాజు స్టాంప్ ఆల్బమ్‌ కనిపించట్లేదంట. వాడూ నాగరాజూ టవునుకెళ్ళారట. తిరిగొచ్చి చూసేసరికి ఆల్బమ్‌ కనిపించట్లేదట.

రాజప్పకి మాటలే రాలేదు. అప్పు ఎలాగో ఒకలాగా అక్కడ్నుండి వెళ్ళిపోతే బాగుండనిపించింది రాజప్పకి. అప్పు అటు వెళ్ళగానే గదిలోకొచ్చి గడియ పెట్టాడు. అలమరా వెనక్కెళ్ళి ఆల్బమ్‌ తీసుకున్నాడు. వేళ్ళు బిగుసుకుపోయాయి. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కిటికీ వైపు ఎవరైనా చూస్తారేమోనని భయమేసి మళ్ళీ అలమరా వెనక ఆల్బమ్‌ను దాచాడు.

రాత్రి అన్నం సరిగ్గా తినలేకపోయాడు. పొట్టంతా బరువుగా అనిపించింది. ఇంట్లోవాళ్ళు వాడి ముఖం చూసి, “ఏంట్రా అదోలా ఉన్నావు?” అనడిగారు. తన ముఖంలో భయంకరమైన తేడా వచ్చేసిందేమో అనుకున్నాడు రాజప్ప.

ఎలాగైనా నిద్రపోవాలి అని పడకేశాడు. నిద్ర పట్టలేదు. తను నిద్రపోయేప్పుడు ఎవరైనా అలమరా వెనకనున్న ఆల్బమ్‌ను కనిపెట్టేస్తే ఏం చెయ్యాలి అని భయమేసి, ఆల్బమ్‌ను తీసుకొచ్చి దిండుకింద పెట్టుకున్నాడు.

రాత్రెప్పుడు నిద్రపోయాడో వాడికే తెలియదు. పొద్దున నిద్ర లేచాక తలదిండు కిందనున్న ఆల్బమ్‌ తీయలేకపోయాడు. అమ్మో, నాన్నో ఎవరో ఒకరు అక్కడికి వస్తూనే ఉన్నారు. ఆల్బమ్‌తోబాటు పరుపుని మడిచేసి దాని మీద కూర్చున్నాడు.

పొద్దున మళ్ళీ అప్పు వచ్చాడు. అప్పటికీ రాజప్ప మడిచిన పరుపు మీదే కూర్చుని ఉన్నాడు. అప్పు పొద్దున్నే నాగరాజు వాళ్ళింటికి వెళ్ళి అక్కడ్నుండి ఇక్కడికి వచ్చాడు.

“నిన్న నువ్వు వాళ్ళింటికి వెళ్ళావా?” అనడిగాడు అప్పు.

రాజప్పకి పొట్టలో తిప్పింది. మధ్యమంగా తలూపాడు. అంటే ఎలాగైనా అర్థం చేసుకో అన్నది వాడి భావం.

“మేము టవునుకెళ్ళినపుడు నువ్వు మాత్రమే అక్కడికి వచ్చావని కామాక్షి చెప్పింది,” అన్నాడు అప్పు.

తనని అనుమానిస్తున్నారన్నది తెలిసిపోయింది రాజప్పకి.

“నిన్న రాత్రినుండి ఏడుస్తూనే ఉన్నాడు నాగరాజు. వాళ్ళ నాన్న పోలీసులకు చెప్పినా చెప్పొచ్చు…” అన్నాడు అప్పు.

రాజప్ప మౌనంగా ఉన్నాడు.

“వాళ్ళ నాన్న డి.ఎస్.పీ. ఆఫీసులోనే కదా ఉద్యోగం చేసేది? ఆయన చిటికేస్తే పోలీసు టీమంతా వచ్చేస్తారు,” అన్నాడు అప్పు. అప్పుడనగానే, అప్పుని వెతుక్కుంటూ వాళ్ళ తమ్ముడు వచ్చాడు. అప్పు వెళ్ళిపోయాడు.

రాజప్ప వాళ్ళ నాన్నకూడా టిఫిన్ ముగించి సైకిలేసుకుని బయటకెళ్ళిపోయాడు. గుమ్మం తలుపు మూసే ఉంది.

రాజప్ప ఇంకా ఆ మడత పెట్టిన పరుపు మీదే కూర్చునున్నాడు. అర్ధగంటయింది. కదలకుండా అట్టే కూర్చునున్నాడు.

అప్పుడు గుమ్మం దగ్గర తలుపు కొట్టిన శబ్దం వచ్చింది.

‘పోలీస్, పోలీస్’ అని లోలోపలే చెప్పుకున్నాడు రాజప్ప. తలుపుకి గడియ వేసే ఉంది.

తలుపు కొడుతున్న చప్పుడు కొనసాగుతూనే ఉంది.

రాజప్ప మడిచిన పరుపు విప్పి ఆల్బమ్‌ తీసుకుని అలమరా వెనకాల అల్బమ్‌ను కుక్కాడు. తనిఖీ చేస్తే దొరికిపోతుందే! మేడ మీదకి పరిగెట్టాడు. అక్కడా నిలవలేకపోయాడు. ఆల్బమ్‌ తీసి చొక్కాలో దాచుకుని కిందకు దిగాడు.

అప్పుడూ తలుపు బాదుతున్న శబ్దం వస్తూనే ఉంది.

“ఎవరో చూడరా. వెళ్ళి తలుపు తియ్యి,” అని అమ్మ లోపల్నుండి అరిచింది. ఇంకా కొన్ని క్షణాల్లో అమ్మే వెళ్ళి తీసేస్తుందేమో!

రాజప్ప పెరట్లోకి పరుగు తీశాడు. స్నానాల గదిలోకి దూరి తలుపు గడియ పెట్టుకున్నాడు. వేణ్ణీళ్ళ పొయ్యి మండుతోంది. ఫట్ మని ఆల్బమ్‌ను పొయ్యిలో పడేశాడు. ఆల్బమ్‌కు నిప్పంటుకుని మంట ఇంకాస్త పెరిగింది. అన్నీ విలువైన స్టాంపులు. సులువుగా దొరకని అరుదైన స్టాంపులు. అప్రయత్నంగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి రాజప్పకి.

అప్పుడు స్నానాల గది బయట అమ్మ మాటలు వినిపించాయి.

“స్నానం చేసి తొందరగా బయటకు రా. నీ కోసం నాగరాజు వచ్చాడు,” అంది వాళ్ళ అమ్మ.

రాజప్ప షర్టు నిక్కరు విప్పేసి తడి తువ్వాలు కట్టుకుని బయటొచ్చాడు. ఇంట్లోపలికొచ్చి షర్టు నిక్కరు తొడుక్కుని మేడ మీదకెళ్ళాడు. నాగరాజు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. రాజప్పని చూడగానే, “నా స్టాంపు ఆల్బమ్‌ పోయిందిరా…” అని హీనస్వరంలో అన్నాడు. వాడి ముఖంనిండా దుఃఖం కనిపించింది. బాగా ఏడ్చాడని వాడి కన్నులు కూడా చెప్తున్నాయి.

“ఎక్కడ పెట్టావురా?” అని అడిగాడు రాజప్ప.

“డ్రాయర్‌లో పెట్టి తాళమేసినట్టే గుర్తురా. టవునుకెళ్ళి తిరిగొచ్చి చూస్తే కనిపించట్లేదు.”

నాగరాజు కళ్ళనించి నీళ్ళు కారాయి. వాడు రాజప్ప ముఖం చూడటానికి ఇబ్బంది పడి అటు తిప్పుకున్నాడు.

“ఏడవకురా… ఏడవకు…” ఓదార్చాడు రాజప్ప.

రాజప్ప ఓదార్చినకొద్దీ ఇంకా వెక్కివెక్కి ఏడ్చాడు నాగరాజు.

రాజప్ప ఒక్క ఉదుటున కిందకెళ్ళాడు. నిముషంలోపే తిరిగొచ్చి నాగరాజు ముందు వచ్చి నిలబడ్డాడు. రాజప్ప చేతిలో తన ఆల్బమ్‌ ఉంది.

“నాగరాజూ, ఇదిగోరా నా ఆల్బమ్‌. ఇది నువ్వే ఉంచుకో. నీకే ఇచ్చేస్తున్నాను… ఎందుకలా చూస్తున్నావు? సరదాకి చెప్పట్లేదు. నీకే ఇచ్చేస్తున్నాను. ఎప్పటికీ నీకే!”

“ఊరికే చెప్తున్నావు…” అన్నాడు ఏడుపాపుకుంటున్న నాగరాజు.

“లేదురా. నీకు… నీకే ఇచ్చేస్తున్నాను. నిజంగా నీకే! ఉంచుకో.”

రాజప్ప, తన స్టాంప్ అల్బమ్‌ను ఇచ్చేయడమా! జరిగే పనేనా? నాగరాజుకి నమ్మశక్యంగా లేదు. అయితే రాజప్ప అదే మాటని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు. వాడి గొంతు కంపించింది.

“నాకిచ్చేస్తే, మరి నీకు?”

“నాకొద్దురా.”

“ఒక్క స్టాంపు కూడా వద్దా?”

“ఊహూఁ!”

“ఒక్క స్టాంపైనా లేకుండా నువ్వెలా ఉండగలవు?” అని అడిగాడు నాగరాజు.

రాజప్ప కళ్ళల్లో నీళ్ళు ఆగడం లేదు.

“ఎందుకురా ఏడుస్తున్నావు? నాకు నువ్వు ఆల్బమ్‌ ఇవ్వనక్కర్లేదు. నువ్వే ఉంచుకో. నువ్వెంతో కష్టపడి సేకరించిన స్టాంపులున్న ఆల్బమ్‌ ఇది,” అన్నాడు నాగరాజు.

“లేదు, నువ్వే ఉంచుకో. నీ దగ్గరే. తీసుకుని ఇంటికెళ్ళి పో. వెళ్ళు, వెళ్ళు…” అని రాజప్ప ఏడుస్తూ గట్టిగా చెప్పాడు.

నాగరాజుకు ఏమీ అర్థం కాలేదు. ఆల్బమ్‌ తీసుకుని కిందకి దిగొచ్చాడు. చొక్కాతో కళ్ళు తుడుచుకుంటూ వెనకాల దిగొచ్చాడు రాజప్ప.

ఇద్దరూ గుమ్మం దగ్గరకొచ్చారు.

“నువ్వు నీ ఆల్బమ్‌ ఇచ్చినందుకు చాలా థేంక్స్‌రా. నేను ఇంటికి వెళ్ళనా?” అంటూ గడప దాటబోయాడు నాగరాజు.

“నాగరాజూ!” అని పిలిచాడు రాజప్ప.

నాగరాజు తిరిగి చూశాడు.

“ఆ ఆల్బమ్‌ ఇలా ఇవ్వు. ఈ రోజు రాత్రికి ఒకే ఒక్కసారి ఆల్బమ్‌ మొత్తాన్నీ చూసేసి, పొద్దున్నే నేనే మీ ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాను,” అన్నాడు రాజప్ప.

“సరే.” అని ఆల్బమ్‌ ఇచ్చేసి వెళ్ళాడు నాగరాజు.

రాజప్ప మేడమీదకు వెళ్ళి తలుపేసుకుని ఆల్బమ్‌ను గుండెకేసి అదుముకుని వెక్కివెక్కి ఏడ్చాడు.
----------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్, 
మూలం: సుందర రామస్వామి,
(మూలం: స్టాంప్ ఆల్బమ్‌ (1958). సుందర రామస్వామి వాసనై(2016) అన్న కథల సంపుటినుండి.)
ఈమాట సౌజన్యంతో

Sunday, March 10, 2019

దిల్లీ నుంచి హరిద్వార్ వరకు…


దిల్లీ నుంచి హరిద్వార్ వరకు…



సాహితీమిత్రులారా!

ఈకథను ఆస్వాదించండి...................

డిసెంబరు నెల ఆఖరి రోజులు. దిల్లీ చలి గట్టిగానే ఉంది. స్వెట్టర్లు వగైరాలన్నీ మంచి వాడకంలో ఉన్నాయి. తెల్లవారితే హరిద్వార్, రిషికేశ్ ప్రయాణం పెట్టుకున్నాను. స్కూలు సెలవులు. ఇంట్లో చేసేదేమీ లేదు, నాలుగు నెలలుగా ఎందుకో హరిద్వార్ వైపు మళ్లింది మనసు. మధ్య మధ్య సెలవులు రాకపోలేదు. మురళికి తీరిక లేని ఉద్యోగం. ఆదివారం ఒక్కరోజు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వద్దాం అంటే వినడు. బాస్‌కి ఇష్టం ఉండదు, సిటీ దాటి వెళితే… అంటాడు. పనిని పూజించటం నాకూ ఇష్టమే. కానీ జీవితమంటే జీవికకోసం చేసే పనొక్కటేనా?

విసుగొచ్చి రమ్మని అడగటం మానేసేను. హాయిగా టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో నా ఒక్కదానికి టికెట్ బుక్ చేసుకున్నాను. ఎవరైనా తోడొస్తే వెళ్ళాలని అనుకోలేదు. వస్తే మురళీ, నేను. లేదా ఇలాటి ప్రయాణం నాకు కొత్త కాదు.

ముందురాత్రి ఆఫీసు నుండి వస్తూనే అయిష్టాన్ని మళ్లీ ప్రకటించాడు.

“నిమ్మీ, నువ్వు అంత అర్జెంటుగా ఒక్కదానివీ ఇప్పుడు హరిద్వార్ వెళ్లాలా?” రొట్టెలు చేస్తున్న నా వెనకాల వచ్చి సీరియస్‌గా అడిగాడు. ‘వెళ్ళాలనే కదూ… అతని అభ్యంతరం ఏమిటో!’

“నాకు కొంచెం పనితీరుబడి అయినపుడు వెళ్దాం అన్నాను కదా. ఒక్కదానివీ, ఆ ట్రావెల్స్‌లో వెళ్లాలా? రోజంతా అపరిచితుల మధ్య నీ యాత్రని ఏం ఎంజాయ్ చెయ్యగలవు?” అసహనంగా అడిగాడు.

“అదేమిటి, అపరిచితులేమిటి? ఒక్క పలకరింపుతో స్నేహితులు కారా?”

“అహా, నీకు స్నేహితులు కాని వాళ్లు ఎవరు? పోనీ ఆ స్నేహితులు ఎవరైనా నీతో వస్తున్నారా… లేదు.”

“ఎవరి పనులు వారికున్నాయి. ఇన్నేళ్లుగా నీతో ఉన్నా, నువ్వో అపరిచితుడిగానే కనిపిస్తున్నావు ఆమాటకొస్తే.”

“ఔను మరి, నువ్వు మరో ప్రపంచంలో బ్రతుకుతుంటావు. జీవితాన్ని అనుభవించక ఎందుకివన్నీ నీకు. ఈ యాత్రలేమిటి ఈ వయసులో. హాయిగా ఏదైనా పార్టీకి రమ్మంటే విసుక్కుంటావు. ఉట్టినే చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలేశావు. ఎంతసేపూ మీ శక్తి ఫౌండేషన్ వాళ్లు నడిపే ఆడపిల్లల బడి, వాళ్ల చదువు, కాశీ, హరిద్వార్ యాత్రలు, ఈ నేత చీరలూ, ఆధ్యాత్మికానందాలూ…”

నా ఆలోచనల పట్ల, పనుల పట్ల లేశమంతైనా అతనికి అవగాహన లేదన్న విషయం మరొకసారి స్పష్టం అయింది. ప్రకృతిలోకి వెళ్లొద్దామంటే అర్థం కాదు, పిల్లల మధ్య మసులుతూ వాళ్లని చదివించటంలో ఉన్న ఆనందం అర్థం కాదు. నిట్టుర్చాను. వంట ముగించి పళ్లేలు డైనింగ్ టేబిల్ మీద సర్దమని అప్పగించాను. టి.వి.లో న్యూస్ చూస్తూ తినటం ప్రారంభించాడు.

భోజనం ముగిస్తూ మురళి మళ్లీ చెప్పాడు, “నిమ్మీ, మరో దశాబ్దమో, పుష్కరకాలమో మనం ఈ ప్రపంచంలో, ప్రపంచంతో పాటే హాయిగా రంగురంగుల జీవితాన్ని గడిపెయ్యచ్చు. ఆ తర్వాత మనం చేసేందుకేమీ ఉండదు, ఎలాటి ఛాలెంజిలకీ ఎదురెళ్లక్కర్లేదు. నువ్వు కోరుతున్న జీవితం అప్పుడు తీరిగ్గా మొదలెట్టచ్చు. దానికెలాటి డెడ్ లైన్లూ, ఒత్తిళ్లూ ఉండవు. ఇప్పుడు నా ఉద్యోగ బాధ్యతలు నన్ను మరో ఆలోచన చెయ్యనివ్వవు. జీవితాన్ని మరి కొన్నేళ్లు సవాళ్లమధ్య నడిపించాలని ఉంది. దానిలో నాకు బోలెడు ఆనందం, తృప్తి కనిపిస్తున్నాయి. మెట్టు తర్వాత మెట్టు ఎక్కుతూంటే వచ్చే ఆ నషా నాకు మరింత ఆత్మవిశ్వాసం అందిస్తోంది. అర్థం చేసుకో. నువ్వు నాకిష్టమైన జీవితమేంటో ఒక్కసారి కళ్లు తెరిచి చూడు. తర్వాత నేను నీ దారిలోకొస్తాను, కనీసం ప్రయత్నిస్తాను.”

“మరళీ, నువ్వన్నట్టు మరో పది, పన్నెండేళ్లు పోయాక మన ఓపికలు, ఉత్సాహం తగ్గాక కొత్తగా మొదలెట్టే మరొక జీవితముండదు. మనిద్దరం కోరుకునే జీవితాలు, మనకి తోచే ఆనందాలు సమన్వయం చేసుకోవటంలోనే అసలైన సవాలుందని నేననుకుంటాను.”

నా మాటలు నచ్చనట్టు చూశాడు. చెప్పటమైతే చెప్పాను కానీ, నేను ఆవైపుగా ఎంతవరకు ప్రయత్నిస్తున్నాను? రాత్రి పడుకోబోతే నిద్ర తేలిపోయింది. మురళి మాటలు ఎప్పటివో జ్ఞాపకాలని తీసుకొచ్చాయి.

ఆధ్యాత్మికత గురించి మొదటిసారిగా నాతో మాట్లాడిన హోండా అంకుల్! దిల్లీ మొదటిసారి బదిలీ మీద వచ్చినప్పుడు ఇల్లు దొరక్క, జనక్ పురిలో ఉన్న స్నేహితురాలి ఇంట్లో ఉన్న రెండు నెలలు, అక్కడి పరిచయాలు… ‘నీలో ఒక ఫిలసాఫికల్ కోణం ఉందని నీ ముఖం చెబుతోం’దంటూ ఓ సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తుంటే డాబ్రీ మలుపులో పలకరించిన ఓ ఎనభై ఏళ్ల వృద్ధుడు! హోండా కంపెనీలో పనిచెయ్యటంతో అసలు పేరు కేవల్ సింగ్ మాయమైపోయి ఆ పేరే స్థిరపడింది కాలనీలో.

ఆఫీస్ వదిలి ఇల్లు చేరే సమయానికి కాలనీ మొదట్లో దారి కాచి మరీ చెప్పే కబుర్లు: ఆయన పసివాడుగా పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన రోజుల దగ్గర మొదలైతే, తను ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తగా చేసిన పనులు, ఉద్యోగ జీవితమిచ్చిన ఆత్మవిశ్వాసం, పెంపకానికి తెచ్చుకున్న కొడుకు, అతని కుటుంబం చూపే నిరాదరణ, భార్యకీ తనకీ పెళ్లైన తొలినాళ్ల నుండీ ఉన్న దూరాలు…. అన్నీ చెప్పుకొచ్చే ఆ పెద్దాయన తనతో పాటు ఇంటివరకూ వచ్చి, గ్రీన్ టీ తాగి మరీ వెనక్కి మళ్లిన ఆ రోజులు! తెలియకుండానే చాలా ఆత్మీయుడైపోయాడు. నిత్యం కాలనీలో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించేవాడు. సాయంకాలపు కబుర్లలో ఒకరోజు చెప్పాడు, భార్య ఆరోగ్యం సరిగా ఉండట్లేదని, ఆసుపత్రి ఖర్చులు ఎక్కువ అయ్యాయని. తను కూడబెట్టుకున్నదానితో నడుపుకొస్తున్నా, కొడుక్కి అదంతా అనవసర ఖర్చు క్రింద అనిపిస్తోందని చెప్పాడు. భార్య తన మనసులో ఎలాటి అసంతృప్తులున్నాయో ఎన్నడూ చెప్పనేలేదంటూ నిట్టూర్చాడు. అనుక్షణం చుట్టూ ఉన్న ప్రపంచంలో దేనినో అన్వేషించే తన పట్ల ఒక నిరసన ఆమె కళ్లలో ఇన్నేళ్లుగా కనిపిస్తూనే ఉందని, దానిని తను పోగొట్టలేకపోయానని చెప్పాడు. అది ఆమెను ప్రేమించేందుకు అడ్డుకాలేదని చెప్పటం గొప్పగా అనిపించింది. ముందునుంచీ ప్రపంచాన్ని ఆబ్జెక్టివ్‌గానే చూస్తున్నా, ఆమె ఉనికి తనలో ద్వైదీభావనల్ని రేపి, తన వెతుకులాట ఒక కొలిక్కి రాకుండా అడ్డుపడుతోందేమో అని విచారంగా చెబుతుండేవాడు.

వారణాసి వెళ్ళివస్తూ ఆయన కోసం తెచ్చిన తెల్లని కాటన్ లాల్చీ, పజామా చూసి మురిసిపోయి, ఇంటికెళ్లి తొడుక్కొచ్చి చూపించిన ఆ పసిమనసు… దిల్లీ వదిలిన తర్వాత రెండేళ్లు ఫోన్ పలకరింపులు నడిచి, ఉన్నట్టుండి ‘భార్య పోయిందనీ, లోకంలో తన బాకీలన్నీ తీరిపోయాయనీ, తను స్వతంత్రుడు, స్వేచ్చాజీవి అయ్యాననీ’ చెప్పాడు. స్వంత అపార్ట్‌మెంట్‌లో కొడుకుతో సరిపడక ఇంటి టెరేస్ మీద తన వంట తను వండుకుంటున్నానంటూ చెప్పిన కబురు ఆయన చెప్పిన ఆఖరి కబురు. ఆ తర్వాత చాలా రోజులకి ఆ ఫోన్ ఆయన మరిక లేరన్న కబురుని మాత్రమే అందించింది. ఆయన తరచుగా చెబుతూ వచ్చిన ఆధ్యాత్మికత ఏమిటో నాకు అంతగా పట్టుబడలేదు. ఆయన కబుర్లు చెప్పే రోజుల్లో ప్రశ్నలే లేవు.

మళ్లీ మురళి ఉద్యోగ రీత్యా దిల్లీ వచ్చినప్పుడు ఏదో పోగొట్టుకున్న భావన వెంటాడింది. జనక్ పురి వెళ్లి ఆ రోడ్ల మీద తిరిగినప్పుడు ఒక ఓదార్పు తోచింది. తెల్లవారవస్తోంది, నిద్ర ఇక రాదని తెలిసి, ఆలోచనలు త్రుంచి మంచం దిగాను. తెల్లవారి ఆఫీస్ బయల్దేరుతూ నిర్లిప్తంగా అడిగాడు, “సాయంత్రం మెట్రోలో వచ్చేస్తావా? నేను ట్రావెల్స్ దగ్గరకి వస్తాను.”

‘రాను, నువ్వు వచ్చి కరోల్ బాగ్‌లో ఉన్న ట్రావెల్స్ దగ్గర బస్ ఎక్కించాలి.’ కచ్చితంగా చెప్పాను.

రాత్రి పదిగంటలకి కరోల్ బాగ్‌లో ట్రావెల్స్ ముందు మురళి, నేను ఇద్దరం మాటలు రానట్లు నిలబడ్డాం. నాలా ఒక్కరూ ప్రయాణిస్తున్న వారూ లేకపోలేదు. చుట్టూ ఉన్నవారిని చూస్తున్నా. అతను, ఆమె ఒక ప్రక్కగా నిలబడి ఉన్నారు. బహుశా చైనీస్ లేదా కొరియన్ అయి ఉండచ్చు. చిన్న గొంతులతో మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రా నుండి వచ్చిన యాత్రికులు చాలా ఎక్సైటెడ్‌గా, పెద్దగా తెలుగులో మాట్లాడుకుంటూ ఉంటే ఆంధ్రాలో ఉన్నట్టే అనిపిస్తోంది.

బస్సు బయలుదేరటంతో చెయ్యి ఊపుతూ వెనుక నిలబడిపోయిన మురళిని చూస్తుంటే నిజంగా ఒక క్రొత్త వ్యక్తిని చూస్తున్నట్టే అనిపించింది. ఇదేనా నాలో అతను భయపడే ఆధ్యాత్మికత. అది అంత సులువుగా పట్టుబడేదేనా? అతని కోసం కాదూ పిల్లలే వద్దన్న నిర్ణయాన్ని గౌరవించింది. పెళ్లినాటికి మురళి నానమ్మ మంచం మీద ఉంది. అతని తల్లిదండ్రులు లేరు. పెళ్లైన కొత్తలోనే చెప్పేడు, ‘నిమ్మీ, నానమ్మని చూసుకోవలసిన బాథ్యత ఉంది. ఇద్దరం ఉద్యోగాలకి వెళ్తాం. మనకి పిల్లలు వద్దు. వాళ్లకి సరైన న్యాయం చెయ్యలేమని నాకు భయం.’ పిల్లల గురించి అప్పటిదాకా ఎలాటి అభిప్రాయం లేకపోయినా సహజంగా ఒకరో ఇద్దరో పిల్లలు నా జీవితంలోనూ ఉంటారనుకునేదాన్ని. మురళి మాటలు యదార్థాలయ్యాయి. నానమ్మ సుదీర్ఘమైన అనారోగ్యం, నేను చేస్తున్న ఉద్యోగంలో ఎలాటి ఆకర్షణా కనిపించక వదిలెయ్యటం… పిల్లలు కావాలని అనిపించనే లేదు. అమ్మ ఒకటి రెండు సార్లు అడిగి చూసింది. ఋణానుబంధాలు అని నిట్టూర్చింది. నానమ్మ మా జీవితాల్లోంచి వెళ్ళిపోయేసరికి నలభైయ్యో పడిలోకి రానే వచ్చాను. ఎప్పుడో సరదాగా చేసిన బి.యెడ్. డిగ్రీ చూస్తే పిల్లల ప్రపంచం పిలుస్తున్నట్లనిపించింది.

బస్సు ఒకటి రెండు చోట్ల ఆగి వేగం అందుకుంది. ఒక చల్లని గాలి తెమ్మెర పదునుగా తగులుతోంది. ప్రక్కన కిటికీ అద్దం పగిలి ఉంది, కర్టెన్ వెనుక ఇప్పటిదాకా గమనించనేలేదు. అప్పుడు చూశాను, నా ప్రక్కన ఉన్న ఆ కొరియన్ లేదా చైనీస్ ఆమెని. అరె, ఇద్దరికీ చెరొకచోటా సీట్లు దొరికినట్టున్నాయి. నా సీట్ ఇస్తే వాళ్లిద్దరూ కలిసి ప్రయాణించచ్చు అనిపించింది. సభ్యత కాదేమో అని ఒక్కక్షణం అనిపించినా, ఆమె వైపు తిరిగి సంభాషణకి ఉపక్రమించాను.

నా పలకరింపుకి ముందు పెద్దగా స్పందించలేదు. నిద్రలో ఉందా? ఒకటికి రెండు సార్లు ‘ఏదైనా సహాయం కావాలా?’ అంటూ నేను వెంటపడటంతో నా వైపు తిరిగి, “సారీ, మీకు నిద్రాభంగం కలిగించినట్టున్నాను, ఆ కిటికీ గ్లాస్ పగిలిందని గమనించాను కానీ పట్టించుకోలేదు,” అంది మర్యాదపూర్వకంగా.

“లేదు లేదు. నా నిద్రకేమీ భంగం కాలేదు. మీరిద్దరూ కలిసి కూర్చుంటారేమో, నా సీట్ మార్చుకుంటాను.” మరీ స్వంత విషయాలు అడుగుతున్నానా? ఎంతైనా భారతీయత నాలో చిక్కగానే ఉంది.

అలాటిదేమీ లేదని, తాము సౌకర్యంగానే ఉన్నామని చెప్పింది. ఆమె పేరు సిడ్నీ అని చెపింది. అప్రయత్నంగానే ఆ రాత్రి ప్రయాణం చాలా ఆసక్తికరంగా నడిచింది, సిడ్నీతో సంభాషణ మధ్య. తెలవారి హరిద్వార్‌లో దిగాం. చలికి మరింత ముడుచుకుపోతూ మాకోసం కేటాయించిన గెస్ట్ హౌస్‌లోకి దారితీశాం. సిడ్నీవాళ్ల రూమ్ నా ప్రక్క రూమ్ కావటంతో మా కబుర్లు మరి కొంచెంసేపు కొనసాగాయి. సిడ్నీ, ఆమె భర్త స్టీవ్ కూడా నాలాగే యోగా, మెడిటేషన్ క్లాసులకోసం వచ్చారట. నేనైతే రెండు రోజుల్లో వెనక్కి వెళ్లిపోతాను, వాళ్లు ఆరువారాలు ఉంటారట. రెండేళ్లకోసారి వస్తూనే ఉంటారట. స్నానం చేసి తయారవుతున్నంతసేపూ సిడ్నీ చెప్పిన కబుర్లు మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఆమె స్నేహంగా పంచుకున్న తన జీవితచిత్రం కళ్లముందు కదిలింది. బహుశా ఒక అపరిచితురాలినన్న ధైర్యం ఆమె మనసువిప్పి చెప్పుకునేలా చేసిందేమో!

చదువుకోసం అమెరికా వచ్చిన సిడ్నీ, స్టీవ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. యూనివర్సిటీ చదువు ముగించుకుని మనసుకు నచ్చిన పెయింటింగ్స్ వేస్తూ, జీవిక కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో అతనితో పరిచయం అయింది. అతను యూనివర్సిటీ రోడ్‌లో ఒక చిన్న ఫోటో స్టూడియో నడుపుతుండేవాడు. అది ఏమంత ప్రోత్సాహకరంగా లేకపోవటంతో, తన అమ్మమ్మ నేర్పిన బేకింగ్ పనులు మొదలెట్టి ప్రక్కనే చిన్న బేకరీ ఒకటి తెరిచాడు. బేకరీ ముందు పెట్టేందుకు అందమైన పెయింటింగ్ ఒకటి సిడ్నీకి పురమాయించాడు. ఆమె వేసిన పెయింటింగ్ అతనికి బాగా నచ్చటం వరకు బానే ఉంది. కానీ ఎంత ఖరీదు కట్టాలో ఆమెకి, అతనికి కూడా అర్థం కాలేదు. తనలో ఉన్న కళ విలువ ఏమిటో తెలిసున్నా ప్రాథమిక రోజుల్లో గుర్తింపు అవసరం కనుక తన పెయింటింగ్ విలువను తక్కువగా నిర్ణయించాలా లేక ఆర్థికావసరాలు నిలదీస్తుంటే ఎక్కువ చెప్పాలా అన్న సందిగ్ధం సిడ్నీది; ఆమె అవసరాన్ని అర్థం చేసుకున్నా తన ఆర్థికస్థితిని కూడా చూసుకోవాలన్న ఆలోచన స్టీవ్‌ది. అయినా, ఆమె ఊహించిన దానికన్నా ఆ పెయింటింగ్ ఖరీదు రెండింతలు కట్టాడు.

సిడ్నీ ఆశ్చర్యంతో నిలబడిపోయింది. ఆమెకి చెప్పాలని ఉంది, తను సర్వశక్తుల్నీ కూడగట్టి ఆ పెయింటింగ్ వేశాననీ, దాన్ని ఉచితంగా ఇవ్వాలనే ఉన్నా ఈ నెల కూడా ఉద్యోగప్రయత్నం సఫలం కాకపోతే స్వంత ఊరు వచ్చెయ్యమన్న తల్లి హెచ్చరిక గుర్తొచ్చి దానికి వెల కట్టాల్సివస్తోందని. మౌనంగా నిలబడిపోయిన ఆమె వంక అతను నవ్వుతూ చూశాడు. ‘నీలో నిజమైన కళ ఉంది. ఆర్థికంగా నిలదొక్కుకుందుకు ముందు మరో ఉద్యోగం నువ్వు చూసుకోవలసిందే. నన్ను చూస్తున్నావుగా.’ అన్నాడు. అతనికి తన మనసులో మాట తెలిసిందన్నది ఆమెకు అర్థమైంది. వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే అతను అన్న మాటలు, ‘సిడ్నీ, ఉద్యోగం వచ్చేవరకు ఈ డబ్బు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకో. అవసరమైతే నా బేకరీలో పార్ట్ టైమ్ ఉద్యోగం ఇస్తాను.’ ఆమె మనసంతా భారమైంది. అతని మాటలు, ఆతని కళ్లల్లో ఉన్న అపారమైన దయ తలుచుకుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఎదుటి మనిషి అవసరాన్ని కనిపెట్టి, సహాయం చెయ్యగల పెద్ద మనసున్నవాడు.

ఆ తర్వాత ఆమె ఉద్యోగంలో కుదురుకుంది, వీలున్నప్పుడల్లా అతని బేకరీకి వెళ్లి వాలంటరీగా అతనికి సహాయం చేస్తుండేది. అక్కడ పనిచేస్తున్న మిగిలిన వారిపట్ల అతని ప్రవర్తన చూసి సిడ్నీ ఎప్పటికప్పుడు నివ్వెరపోతూనే ఉంది. ఒక వ్యాపారస్థుడిలా, యజమానిలా కాక తోటి పనివాడిలా వాళ్ల కష్టసుఖాల్ని కనిపెట్టే అతని తాపత్రయం చూసి తనక్కావలసిన వాడు ఇలాటి వాడే అన్న నిర్ణయం చేసుకుంది. తన అభిప్రాయాన్ని అతనికి చెప్పినప్పుడు నవ్వి, ‘నాకు ఎవరూ లేరు, ఆస్థులు లేవు. ప్రపంచంలో నన్ను కట్టిపడేసే శక్తి ఏదీ ఇంతవరకూ కనిపించలేదు. నా జీవిత పథం వేరు. నాతో నీకు సుఖం లేదు.’ అంటూ సున్నితంగా ఆమెను నిరుత్సాహపరచబోయినా ఆమె అతన్ని ఖండించివేసింది.

అతనిలోని వేదాంతి ఆమెను ముందుగా ఆకర్షించిన మాట నిజమే అయినా, కుటుంబం ఏర్పాటై, పెరుగుతున్న సందర్భంలోనూ అతను అంతే నిర్వికారంగా ప్రపంచాన్ని చూడటం ఆమెకు కష్టం కలిగించటం మొదలుపెట్టింది. ముద్దు మాటలతో, చేష్టలతో ఇల్లంతా సందడి చేసే పిల్లల్ని దగ్గరకు తియ్యడు. పనులు ముగించుకుని ఇల్లు చేరినా తనదైన లోకంలో బ్రతికే స్టీవ్‌ని చూస్తే రానురాను ఆమెలో ఒక అభద్రత మొదలైంది.

అతను తరచు భారతదేశం గురించి, హిమాలయాల గురించి, గంగానది గురించి మాట్లాడుతుండేవాడు. ఆమె అలవాటుగా వినటం నేర్చుకుంది. తన అమ్మమ్మ ఈ విషయాల్ని గురించి చెప్పిందని, హరిద్వార్, రిషీకేశ్ చూసి రావాలని చెబుతుండేవాడు. ఒకటి రెండుసార్లు వెళ్లి వచ్చాక తనలో తనే ఆలోచనలో మునిగి ఉండే భర్తని చూసి సిడ్నీదిగులు పడింది. అతను బేకరీ వ్యవహారాలు చాలా వరకు తన దగ్గర పనిచేస్తున్న వాళ్లకి అప్పగించి నిరంతరం ఏదో తనదైన లోకంలో మునిగిపోతుండేవాడు. ‘నువ్వు మామూలుగా ఉండు’ అంటే, ‘ఉన్నాను’ అనేవాడు చిరునవ్వుతో.

పిల్లలకి తండ్రి అంటే ఒక మౌని. దూరంగా మాత్రమే కనిపించే నిజం. ఊహ తెలుస్తున్నకొద్దీ తమ స్నేహితుల నాన్నలని చూసి నాన్న తమతో ఎందుకు అలా ఉండడని తల్లిని ప్రశ్నించటం మొదలైంది. సిడ్నీ భర్తని అర్థం చేసుకుందుకు ప్రయత్నిస్తోంది. పిల్లల జీవితాల్లో కనబడుతున్న లోటు కళ్లారా చూస్తూ ఏం చెయ్యాలో తోచక అతన్నే ప్రశ్నించింది. తను యావత్తు ప్రపంచం పట్ల సమానమైన ఆదరంతోనే ఉన్నానని చెప్పాడు.

‘నీ పరిచయమైనపుడు ప్రపంచం పట్ల నీ సహానుభూతి చూసి నువ్వు కావాలనుకున్నాను. నేనూ పిల్లలూ నిన్ను మిస్ అవుతున్నాం స్టీవ్, అర్థం చేసుకో. పిల్లలతో అందరి నాన్నల్లాగా ఉండు.’ నిబ్బరంగానే చెప్పింది. క్రొత్తగా అతనిలో ఒక అసహనం కనిపించింది.

బస్సు గమ్యం చేరటంతో సిడ్నీ కబుర్లు అక్కడికి ఆగాయి.

ప్రయాణం పొడవునా పదేపదే చెబుతోంది, ప్రపంచమంతా భారతదేశాన్ని ఆధ్యాత్మిక గురువుగా నిర్ణయించేసిందని. సిడ్నీ స్నానం చేసి తయారై వచ్చింది. ప్రయాణం, నిద్రలేమి తాలూకు అలసట ఎక్కడా లేకపోగా, ఒక క్రొత్త ఉత్సాహమేదో స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె భావిస్తున్నట్టు ఈ వాతావరణమే దానికి కారణమా?

సాయంత్రం గంగా హారతికి ఇంకా సమయముంది. ముగ్గురం ఒక చోట కూర్చున్నాం. అతను విదేశీయుడిలా కనిపించలేదు. ఆమె చెప్పినట్టుగానే భారతీయతను కలవరించి, భారతీయతను తొడుక్కున్న వ్యక్తిగానే ఉన్నాడు. ఇద్దరి ముఖాల్లో అనిర్వచనీయమైన ఆనందం. మురళి కూడా వచ్చివుంటే ఎంత బావుణ్ణు అనిపించిందోక్షణం. పక్కనే కలకలం వినిపించి చూస్తే ఒక ఏడాది పాపాయి పాకుతూ గంగా ప్రవాహపు అంచు వరకూ వెళ్లింది. అంతవరకూ కబుర్లమధ్య పాపాయిని మరిచిన పెద్దలు చటుక్కున చూసి, కేకలు వేసి, ఒక్క అంగలో పాపాయిని చేతుల్లోకి తీసుకుని, గుండెలకి హత్తుకున్నారు. పాపాయి పకపకా నవ్వుతోంది. తల్లి కాబోలు, పాపాయిని గట్టిగా కోపంగా అడుగుతోంది- నీళ్లల్లోకి వెళ్ళిపోతావా అలా? అంటూ. తల్లి ఇంకా తనతో ఆటాడుతోందన్న ఊహతోనే పాపాయి మళ్ళీ పకపకమంది. ఇదంతా అరక్షణంలో జరిగింది, స్టీవ్ ముఖం మునుపటికన్నా విప్పారింది.

‘పాపాయిని చూశావా? ఎంత హాయిగా నవ్వుతోందో!? లౌకికమైనదేదీ తాకలేని నవ్వు. భయం అనేది తెలియని నవ్వు. తనని కాపాడుకునేవాళ్లు ఉన్నారు అన్న భరోసా, తను చెయ్యదలచుకున్నది చెయ్యబోయింది. సిడ్నీ, నేనూ పాపాయిలానే ఆలోచించాను అప్పట్లో, మన పిల్లల కోసం నువ్వున్నావు. ఇక కుటుంబపరమైన, లౌకికపరమైన బాధ్యతలు నన్ను అంటవని, మనసుకు తోచింది చేస్తూ వచ్చాను. కానీ అది నాకు ఆనందాన్నీ, తృప్తినీ కాక అశాంతినిచ్చింది.’ అతను నిజాయితీగా చెబుతున్నాడు.

ఆధ్యాత్మికత అంటే ఏమిటి? అది ప్రతివారి జీవితంలోనూ అవసరమేనా? మురళి ఆపాదించినట్టు వయసుతో దానికెలాటి నిమిత్తం లేదా? ఎలాటప్పుడు దానివైపు ఆకర్షింపబడతారు? అది భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యమా? తనలోకి తాను చూసుకోవటమా? యావత్ ప్రపంచాన్ని నిర్లిప్తంగా చూడగలిగే నిబ్బరమా? అది శాశ్వతమా, తాత్కాలికమా?

“క్షమించండి, ఒక్క ప్రశ్న అడగొచ్చా?” అంటూ నా మనసులో సందేహాన్ని బయటపెట్టాను. అతను నావైపు తిరిగి, “మిస్ నిర్మలా, నాకేం కావాలో, ఎటువైపు వెళ్తున్నానో స్పష్టమైన దృష్టి లేకుండా చాలా కాలం ఒక అయోమయంలో గడిపేశాను. చిత్రంగా సిడ్నీ నాకు గురువై నన్ను సరైన దారిలోకి మళ్లించింది. తనే చెబుతుంది,” అన్నాడు. సిడ్నీ నావైపు చూసి మొహమాటంగా నవ్వింది.

“ఏమో, స్టీవ్ కుటుంబానికి దూరమైపోతున్నాడన్న భయం నన్ను వెంటాడేది. అప్పుడే నా ఆఫీసులో ఒక ఇండియన్ పరిచయమైంది. ఆ పరిచయం మంచి స్నేహంగా మారింది. ఆమె తల్లి కొన్నాళ్లు కూతురి దగ్గర ఉండేందుకు వచ్చింది. అనుకోకుండా ఒకసారి ఆమె దగ్గర నా భయాల్ని, బెంగల్ని చెప్పుకున్నాను. ఆమె బాగా చదువుకున్న వ్యక్తి. ఎన్నో విషయాలు చెబుతుండేది. నా సందేహాలు పెరుగుతూ పోయాయి. నా ఆసక్తి చూసి మరింత చెప్పేది.

భగవద్గీత గురించి చెబుతూండేది. ఏ సమస్యకైనా గీత జవాబు చెబుతుందనేది. నా భర్తకి తను అన్వేషిస్తున్నవిషయం పట్ల అవగాహన లేకపోవటమే అతని ప్రవర్తనకి కారణం అని చెప్పిందావిడ. ఆధ్యాత్మికత అనేది ప్రపంచాన్నుంచి పారిపొమ్మని చెప్పలేదు. లౌకికపరమైన బాధ్యతల్ని సంపూర్ణంగా నిర్వహిస్త్తూనే, ఒక తెలివిడితనంతో ప్రపంచాన్ని దూరంగా ఉంచాలనీ, మంచి, చెడుల మధ్య ఊగిసలాడే మనసుని మచ్చిక చేసుకోవాలనీ, దాన్ని విశాలం చేసేకొద్దీ ఎలాటి విషయాన్నైనా సంయమనంతో తీసుకునే బలం వస్తుందనీ చెప్పింది. మనలో సహజంగా ఉండే ఆనందం, శాంతి, ప్రేమల్ని చుట్టూ ప్రపంచానికి పంచిపెట్టాలనీ ఆమె నాకు చెప్పింది. ఇదంతా ఇంత సరళంగా ఉందన్నది నాకు సంతోషాన్నిచ్చింది. నాకు యోగా, మెడిటేషన్ పరిచయం చేసిందావిడే.

స్టీవ్‌తో ఈ విషయాల్ని చెప్పినప్పుడు మొదట్లో నమ్మేవాడు కాదు. తనకి మాత్రమే సంబంధించినదనీ, నాకు అవగాహన లేని విషయమనీ కొట్టిపారేసేవాడు. నాతోపాటు ఆమె దగ్గరకి రమ్మన్నా వచ్చేవాడు కాదు. ఆ సమయంలో ఆమె తిరిగి ఇండియా వెళ్లిపోయింది. నేను నా పోరాటాన్ని ఒంటరిగా చేసేందుకు సిధ్ధమయ్యాను. నేర్చుకున్న పాఠాల్ని అతనికి చెప్పటం ఆపలేదు నేను. నా మానసిక శక్తి కోసం మొదలెట్టిన యోగా, మెడిటేషన్ లాటి వాటిలో పిల్లలకీ శిక్షణ మొదలుపెట్టాను. క్రమంగా నేను నేర్చుకున్నది నాకు సాధనలో అందుబాటులోకి వచ్చి, ఒక శాంతివైపు నన్ను నడిపిస్తోందన్నది తెలిసొచ్చింది. ఇదంతా జరిగేందుకు దాదాపు ఏడాది పైనే పట్టింది. అప్పటికి స్టీవ్‌లో కొంచెం మార్పొచ్చింది. నేను చెప్పేదాన్ని ఖండించటం మాని, వినటం మొదలుపెట్టాడు. తన బేకరీని ఎవరికైతే అప్పగించాడో వాళ్లు నెమ్మదిగా తనని ప్రక్కన పెట్టినట్టు గమనించాడు. ఒక నిస్సహాయత అతన్ని ఆవరించింది. నెమ్మదిగా కుటుంబానికి దగ్గరవుతూ వచ్చాడు. ప్రపంచాన్ని మళ్లీ తనదిగా చేసుకుంటున్నకొద్దీ అశాంతి మాయమవుతూ వచ్చిందని, బాధ్యతలను పంచుకోవటం మొదలెట్టాక సంతృప్తి, ఆత్మవిశ్వాసం అనుభవంలోకి వస్తోందనీ తెలుసుకున్నాడు. ఇప్పుడు అతనికి ఎలాటి ఆరోపణలూ లేవు.”

సిడ్నీ సుదీర్ఘంగా వివరించింది. ఆమె చేతులు అనునయంగా నన్ను చుట్టాయి. అప్రయత్నంగా నాకళ్లు తడిబారాయి.

మురళి బాహ్యప్రపంచపు మోహంలో కూరుకుపోయాడని, నాకు తెలుసనుకుంటున్న జీవితపు విలువల్ని గ్రహించలేకపోతున్నాడని అనుకున్నాను. తను నమ్మినదానిపట్ల నిబధ్ధుడుగా ఉన్న విషయాన్ని మాత్రం తేలిగ్గా తీసుకున్నాను. నేనూ, మురళి మావైన విశ్వాసాల్ని మాత్రమే గౌరవించుకుంటూ, ఒకరినొకరం అర్థం చేసుకుందుకు ప్రయత్నించనేలేదు. మురళికి ఇదంతా చెప్పాలి.

హోండా అంకుల్ తనకు దగ్గరకాలేని భార్యపట్ల అసహనంతోనే చివరికంటా జీవించాడు. ప్రేమించానని చెప్పుకున్నా భార్య మనసులో వెలితిని ఏనాడూ నింపే ప్రయత్నమూ చెయ్యలేదు. ఐదారు దశాబ్దాల వివాహ బంధం ఇద్దరినీ అపరిచితుల్లానే నిలబెట్టింది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని దగ్గరగా చూస్తూకూడా తనదిగా చేసుకోలేకపోయాడు. ఏమో, అలా ఆలోచిస్తే దిగులేసింది.

తెలవారి తిరుగుప్రయాణమవుతూ, సిడ్నీని, స్టీవ్‌ని దిల్లీలో మా ఆతిథ్యం తీసుకుందుకు రమ్మని ఆహ్వానించి బస్సెక్కాను. నేను చెప్పబోయే కబుర్లు వినేందుకు సిధ్ధంగా ఉండమని, ముఖ్యంగా సిడ్నీ కథ చెబుతాననీ మురళికి ఫోన్‌లో చెప్పేను.

దిల్లీ జనసమ్మర్దం లోంచి హరిద్వార్ రావటం ఈసారి ఒక కొత్త తెలివిడిని, ఆనందాన్ని ఇచ్చింది.
------------------------------------------------------
రచన: అనూరాధ నాదెళ్ళ, 
ఈమాట సౌజన్యంతో

Saturday, March 9, 2019

నిశ్శబ్దాన్ని దాటుకుని…


నిశ్శబ్దాన్ని దాటుకుని…




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి.....................

నాకు శబ్దం కావాలి
ఇలా చెబుతున్నానని నాకు రణగొణధ్వనులంటే ఇష్టం అనుకునేవు!
లేదు, లేదు…

ఇన్నాళ్లూ నిశ్శబ్దాన్ని ప్రేమించానన్నది నిజమేను!
దాన్ని నా చుట్టూరా పరచుకుని పహరా కాసాను కూడా.

ఆరుబయలు ఆటస్థలాలు,
ఆకుపచ్చని పరిసరాలు,
సుతిమెత్తని నీటి ప్రవాహాలు
పంచే సందడిని ప్రేమించాను.

ఇంట్లో, ప్రయాణాల్లో, సినిమాహాళ్ళలో,
అక్కరలేకుండా ఉక్కిరిబిక్కిరి చేసే
ఓటి మాటల చప్పుడు జొరబడకుండా
కొన్ని పరిధులనూ పెట్టుకున్నాను!

కానీ చూస్తున్నంతలో
తెల్లవారి వాకిళ్లలో సందడిచేసే కళ్లాపులు
ఆధునికత అద్దుకుని చరిత్రలోకి జారుతున్నాయి.
‘పాహిమాం ప్రభో’ అంటూ ప్రొద్దుప్రొద్దున్నే
గొంతు సవరించుకునే ఆకాశవాణి ఎక్కడికో బదిలీ అయ్యింది.
పిల్లలు తూనీగలై జుమ్మనే పార్కులు మౌనాన్ని మోస్తున్నాయి.
వీధి గుమ్మాల్లోనో, ప్రహరీగోడల అంచునో మొదలయ్యే
అంతులేని కబుర్లు అదృశ్యమయ్యాయి.
టీచరు అడుగుపెట్టేంతలోనో కన్నుతిప్పేంతలోనో
క్లాసురూములో అలుముకునే అల్లరిమాటలు ఇప్పుడెక్కడ?
కాలేజీ క్యాంపస్‌లోనూ నూటనలభైనాలుగు సెక్షన్ అమలవుతున్నట్టుంది.

మాటలై మొలకెత్తి అడవులై విస్తరించే స్నేహాలు మూగభాషని నేర్చుకుంటున్నాయి.
ప్రపంచం దూరదూరాల వరకూ ఖాళీగా పరుచుకున్నట్టుందెందుకు?
సమూహాలుగా సంచరిస్తూనే జనమేదో ధ్యానంలో ఉన్నట్టున్నారు
తదేక దీక్షతో నిశ్శబ్ద తరంగాల మీద శబ్దాల్ని రచిస్తున్నట్టున్నారు
తమచుట్టూ మౌనపు కందకాలు తవ్వుకుంటున్నారు

శ్వాస సంగతి సరే శబ్దాన్నే మరచేలోపు
ఈ నిశ్శబ్దాన్ని దాటుకుని వచ్చి, ఓసారి మాట్లాడవూ?
రా, పాపాయిలకి మళ్ళీ మాటలు నేర్పుదాం!
-------------------------------------------------------
రచన: అనూరాధ నాదెళ్ళ, 
ఈమాట సౌజన్యంతో