Wednesday, January 31, 2018

పెండ్లిపిలుపు


పెండ్లిపిలుపు




సాహితీమిత్రులారా!



ఒక పాలకొల్లు అమ్మాయికి
ఒక మండపేట అబ్బాయికి
కార్తీక పౌర్ణమి రాత్రి జరిగిన
వివాహాన్ని పురస్కరించి
పద్యరూపంలో ఆహ్వానించిన
ఆహ్వానం-

వెన్నె తిథులందు పున్నమి రోజు వా
రింట జరుగు పెండ్లికిదియె పిలుపు
పాలకొల్లు కన్య బంగారు మెడలోన
మండపేట పూలదండ వేయు
ఆ ఉమామహేశు లడుగిడు నట్లుగా
దంపతులుగ మీరు తరలి రండు.
పసుపు కుంకుమలకు పరిణయమ్మగువేళ
విందు మాది బహు పసందు మీది

(పద్యారామం, బేతవోలు రామబ్రహ్మం పుట. 189)

Tuesday, January 30, 2018

కవీంద్ర పరమేశ్వరదాసు


కవీంద్ర పరమేశ్వరదాసు



సాహితీమిత్రులారా!



కవీంద్ర పరమేశ్వరదాసు బెంగాలీ కవి.
15వ శతాబ్ది చివరిలో జన్మించి 16వ శతాబ్ది
తొలిభాగంలో కాలం చేసిన వారు వీరు.
హుసేనుషా(1497-1518) సేనాపతి అయిన
పారగల్ ఖాను ఆస్థానకవిగా ఉండినవాడు.
ఈ పారగలుఖాను అనంతరం కూచి బీహారు
రాజయిన నరనారాయణుడి దగ్గర మంత్రిగా
పనిచేశాడు. అలా చివరి దినాలు శారీపురంలో
గడిచాయి.

      మన తెలుగులో రాజరాజనరేంద్రుడు మహాభారతాన్ని
ఆంధ్రీకరించినట్లు బాంగ్లాలో మహాభారతాలు మహమ్మదీయ
ప్రభువులు వ్రాయించారు. తమ ఆస్థానాలలో భారతం
చదివించాలని అభిలాషపడ్డారు వారు. అయితే సంస్కృత
గ్రంథాలు వారికి అడవిలా అంధకారబంధుమైనాయి.
అందువల్ల తేటతెల్లమైన బాంగ్లా అనువాదాలు చేయించారు.

    పానగల్ ఖాను ఆదేశం ప్రకారం మహాభారతాన్ని సంస్కృతం
నుంచి బాంగ్లా చేశాడు పరమేశ్వరదాసు. అందుకని ఇతని భారతానికి
పానగల్ మహరాభారతమని పేరు. తన గ్రంథంలో మొదట్లోనే
ఆ గ్రంథరచనకు కారణం వివరించాడు.

ఆ ప్రస్తావనం-

"లస్కర పారగల్ సునంత కాహినీ,
యేనమతె పాండవె హారాయిల రాజధాని
వనవాసె బంచిలేక ద్వాదశవత్సర,
కేనమతె ధర్మ రయిల వనేర్ భితర.
వత్సరేక అభిలంత అజ్ఞాత వసతి,
కేనమ తె తారా సబె పాయిల వసుమతీ?
వహి సబ కథా కహ సంక్షిప్త కరియా,
దినేక సునితె పారి పాంచాలీ కరియా,
తాఁహార ఆదేశమాల్య మస్తకె కరియా,
కవీంద్ర కహిల కథా పాంచాలీ రచియా"

(పాండవులు రాజధాని ఎలా పోగొట్టుకున్నారు
ధర్మానికి కట్టుబడి పన్నెండేళ్లు వనవాసమూ,
సంవత్సరమూ అజ్ఞాతవాసమూ ఎలాచేశారు
ఎలాతిరిగి రాజ్యం సంపాదించారు
ఇదంతా సంక్షిప్తంగా ఒక్కదినంలో వినగలిగినంత
పద్యకావ్యంగా రచించమని పానగల్ సేనాని ఆదేశించాడు.
అతని ఆదేశం శిరస్సున దాల్చి కవీంద్రుడు
పద్యంగా(భారత)కథ వ్రాశాడు.)

భారత కథంతా వొక్కరోజులో చదవగలినంత
మొదట సంక్షిప్తంగానే వ్రాశాడు కవీంద్రుడు.
తరువాత దానినే విస్తృపరచి వ్రాశాడు.
ఇప్పుడది మొత్తం 17000 పద్యాలతో వుంది.
మన భారతమేకాదు భారతదేశంలో అనేకానేక
భారతాలు వివిధభాషల్లో కూర్చారని దీన్ని బట్టి
తెలుస్తున్నదికదా మిత్రులారా!

Monday, January 29, 2018

గరికపాటివారి గృహప్రవేశ ఆహ్వానం


గరికపాటివారి గృహప్రవేశ ఆహ్వానం




సాహితీమిత్రులారా!


గరికపాటివారు గృహప్రవేశ ఆహ్వానం పై
వ్రాసిన పద్యాలు గమనించగలరు.

ఇంటిలోని పోరు ఇర్వదేండ్లు భరించి
క్రొత్త ఇంటినొకటి కొంటినయ్య
గడపలోన మేము కుడికాలు నిడువేళ
మీరు చూడవలయు మెచ్చవలయు

అర్థరాత్రి వచ్చి ఆశీర్వదింపుడు
వీలుకాని యెడల విందుకైన
వచ్చిపోవలె తమవంటి సత్పురుషులు
కాలు పెట్టుచోటు కాని గాదె

తీయనైన మీదు దీవెనలే చాలు
వేరు కాన్కలేల వెర్రిగాని
అయిన తెచ్చునెడల అభ్యంతరములేదు
తేక యున్న మానె రాకె చాలు

(పద్యారామం, బేతవోలు రామబ్రహ్మం పుట.189)

కానుకలు లేకుండా వెళ్లాలనుకున్నా
కానుకలతోనే వెళ్లేవిధంగా ఉన్నాయికదా!
పిలుపులు పద్యాల్లో.

Sunday, January 28, 2018

భీష్మ - అష్టమి - ఏకాదశి - పంచకం


భీష్మ - అష్టమి - ఏకాదశి - పంచకం




సాహితీమిత్రులారా!


భీష్ముడు అంపశయ్యపైనుండి మాఘశుద్ధ అష్టమి తిథినాడు
పరమపదించాడు అందువల్ల ఆ రోజును భీష్మాష్టమి అంటారు.
మరి భీష్మ ఏకాదశి ఏమిటనికదా 
భీష్ముడు స్వచ్ఛంద అష్టమినాడు మరణం పొందిననాడు
పరమపదించే సమయంలో శ్రీకృష్ణుడు ఆయన దగ్గరే ఉన్నాడు
కావున తన మరణం తర్వాత వచ్చే ఏకాదశిని భీష్మఏకాదశిగా
అనుగ్రహించవలసినదిగా భీష్ముడు కోరగా అందుకు శ్రీకృష్ణుడు
అంగీకరించాడని నారద పురాణంలో ఉన్నట్లు డా. ఆదిపూడి
వెంకటశివ సాయిరామ్ గారు తన నిత్యజీవితంలో పండుగలు - 
పర్వదినాలు అనే గ్రంథంలో వివరించారు.
భీష్ముడు తన పంచప్రాణాలను సప్తమి మొదలు ఏకాదశి వరకు
ఒకటొకటిగా వదిలాడని ఈ ఐదురోజులను భీష్మపంచకంగా పిలుస్తారు
కాని మరో కథనం ప్రకారం కార్తీక శుద్ధ ఏకాదశి మొదలు ఐదురోజులు 
భీష్మపంచకంగా పిలుస్తారు.

మాఘశుద్ధ ఏకాదశిని భీష్మఏకాదశి అని
జయాఏకాదశి అని కూడ పిస్తారు.

Saturday, January 27, 2018

తనుయాత్ర అంటే?


తనుయాత్ర అంటే?




సాహితీమిత్రులారా!




తనుయాత్ర అంటే ఈ పద్యం గమనించండి-

లలన మృదుబాహు యుగబిసలతలు గడఁగి
బిసలతా శ్రీలనెల్లను వెసహరించె
మఱి హరింపంగ నవి నెఱివిఱిగికాదె
సారెఁ దనుయాత్రఁ దంతుల జరుగుచుండు
                                                                                                  (5-19)

తనుయాత్రన్ - దేహయాత్రను, (శరీరపోషణము ననుట)
తంతువుల - నులుపోగుల చేతను, జరుపుచుండున్ -
కడపుచుండును, ఆమెయొక్క కోమలమైన బాహువులనెడి 
తామరతూడులు చెలరేగి యెల్ల తూడుల కాంతిసంపదల
అపహరింపగా అవి గుంపుచెదరి మరియొకవిధముగా 
బ్రతుకజాలక నూలిపోగులు వడికికొని శరీరయాత్ర
గడుపు ననియును, తామరతూడులు విరిగెనేని 
వానిలో నూలిపోగులుండుననియు భావము
(వావిళ్ళవారి వ్యాఖ్య)

తనుయాత్రన్ - దేహధారణము, 
తంతులన్ - నూలు వడుకుటచేత
(సన్నిపోగులను ధరించి)
జరుపుచుండున్ - ఆమెబాహువులు తామరతూండ్ల సిరిని హరించినవి,
ఆ కారణమున తామరతూండ్లు నూలువడుకుకొని జీవించుచున్నవి
అదే వానిని విరిచినచో సన్నిదారములు వచ్చుట
                          (వేదమువారి వ్యాఖ్య)
తంతువులతో తనుయాత్ర జరుపుట - నూలుపోగులు వడికికొని 
శరీరయాత్ర గడపుట - అనే వావిళ్ళ అర్థమునే మాటలు మార్చి 
వేదమువారు అనువదించారు.

తంతువులతో తనుయాత్ర జరుపుట - అనగా తంతువులే ఆహారముగా
కాలము గడపుటగాని, నూలు వడికి - అమ్ముకొని దానిమూలమున
జీవించుట కాదు.
గాంధీ వేరుసెనగ పప్పులతో శరీరయాత్ర జరిపెడివాడు - అంటే 
వేరుసెనగ పప్పులను అమ్ముకొని తన్నమూలమున జీవించెడివాడని
అర్థముకాదు. ఆ పప్పులను తిని శరీరము నిల్పుకొనెడివాడని అర్థము.
అట్లే ప్రకృతమునను.
మరియు తామరతూండ్లు నూలువడికొని జీవించినవి అయినందు వల్లనే
వానిని విఱిచినచో  సన్నపాటి దారములు వచ్చుట అని ఆంధ్రమల్లినాథులు 
వ్రాయుట మిక్కిలి వింత. నూలును తినెడివారి కడుపులో నూలు ఉండవచ్చుకాని 
నూలు వడికి అమ్మెడివారి కడుపులో నూలెట్లుండును.

సరే ఇందంతా ఎందుకు

దేహయాత్ర, శరీరయాత్ర - అనే పదాలకు భుజించిట అని అర్థం.
దీనికి క్రింది గ్రంథాలు ప్రమాణాలు-
1. దేహయాత్ర - మెసవుట, భుజించుట(శబ్దార్థ కల్పతరువు)
2. దేహయాత్ర - nourishment, food (ఆప్టే)
3. దేహయాత్ర - తిండి (శబ్దరత్నాకరము)
4. యాత్రాస్యాద్యాపనేగతౌ (అమరము) యాత్రాశబ్దము భోజనము మొదలైన వర్తమానములకును, గమనమునకును - పేరు 
ఉదా- శరీరయాత్రా, ప్రాణయాత్రా(గురుబాలబోధిక) 
5. శృంగారనైషధము(హంసవాక్యము)
   ఫలకుసుమ మూలమాత్రంబున శరీరయాత్ర నడపుచు
   మునులుం బోలె -- ఉన్నవారము(1-108)
6. గీ. పుష్ప ఫల పత్ర జల మాత్రముల శరీర
      యాత్ర గడపుచు సన్మార్గమధిగమించి
      యెసఁగు నివియెల్ల నీకేల యెగ్గొనర్చు
                 (వసుచరిత్ర - 3-128)
7. నీతిచంద్రిక -(మిత్రభేదమున కొంగ వాక్యము)
   జలశైవాదులతో దేహధారణంబు చేయుచు ముముక్షత్వంబు 
   బూని మునివృత్తి నున్నవాడను.

(దీపాల పిచ్చయ్యశాస్త్రిగారి సాహిత్య సమీక్ష నుండి)


Friday, January 26, 2018

శ్రీమహావిష్ణువుకు వింజామరలు వీచేవారు


శ్రీమహావిష్ణువుకు వింజామరలు వీచేవారు




సాహితీమిత్రులారా!



వద్దిపర్తి కోనంరాజుకవి కృత
మహాలక్ష్మీ పరిణయములో
అష్టశక్తులను వివరించారు
ఆ అష్టశక్తులు శ్రీమహావిష్ణువునకు
వింజామరులు వీచేవారట-
ఆ పద్యం చూడండి-

సరసిజాలయ సావిత్రి సర్వభద్ర
విమల పద్మ మహాదేవి విలసదీశ
జాహ్నవి యనంగ నెనమండ్రు శక్తులెపుడుఁ
జామరంబుల వీతురు చక్రిమ్రోల
                                    (మహాలక్ష్మీ పరిణయము - 1-25)

శ్రీమహావిష్ణువు సన్నిధిలో వింజామరలు వీచే
ఎనిమిదిమంది ఎనిమిది శక్తులు వారి పేర్లు-
1. సరసిజాలయ, 2. సావిత్రి, 3. సర్వభద్ర,
4. విమల, 5. పద్మ, 6. మహాదేవి,
7. ఈశి, 8. జాహ్నవి.

Thursday, January 25, 2018

గద్యమంటే ఏమిటి?


గద్యమంటే ఏమిటి?




సాహితీమిత్రులారా!



గద్యం అంటే పాదవిభాగాలుగాని, గణనియమముగాని
లేని పదముల సముదాయము.
ఓజోగుణము, సమాసభూయస్త్యము గద్యమునకు ప్రధానమని
దండి పేర్కొన్నాడు.
సంస్కృత అలంకారికులు గద్యాన్ని మూడువిధాలని చెప్పారు.
1. వృత్తగంధి -
వివిధ పద్యపాదభాగములతో కూడినది వృత్తగంధి.
2. చూర్ణము-
అల్పసమాసాలతో, లలితపదాలతో కూడినది చూర్ణము .
3. ఉత్కలికాప్రాయము-
దీర్ఘసమాసాలతో, ఉద్ధతపదములతో  కూర్చబడినది
ఉత్కలికాప్రాయము.
కొందరు లాక్షిణికులు ఈ మూడింటిని అనుసరించి 
ముక్తకము, చిత్రము, ఖండము మొదలైన విభాగాలను
చేశారు. 
భోజుడు వృత్తగంధితో బాటు జాతిగంధి అనే భేదాన్ని కూడ
పేర్కొన్నాడు. అయితే తెలుగు లాక్షిణుకులు ఇన్ని విభాగాలు
చేయకుండా  పాదరహితమైనది గద్యమన్నారు. కాని తెలుగులో
దండకం కూడ పాదరహితమైనదిగా చెప్పబడటం వల్ల 
గణరహితమైనది అని కూడ చెప్పాల్సివుంది.
చిత్రమేమంటే మన తెలుగు కావ్యాల్లో ఆశ్వాసాంతాల్లో వాడేవే
గద్యంగా మిగిలిన చోట వాటిని వచనంగా చూస్తున్నాము. 
అలాగే అనంతుడు గద్యమునే తెలుగులో వచనమంటారన్నాడు.
ఇక్కడ వచనానికి జయకీర్తి తన ఛందో2నుశాసనంలో
వాక్యబంధురమైంది వచనం అన్నాడు.