Sunday, March 5, 2017

ఆ యిద్దరే ఈజబ్బును పోగొట్టగలరు


ఆ యిద్దరే ఈజబ్బును పోగొట్టగలరు




సాహితీమిత్రులారా!



మనిషికి గర్వాన్ని గలిగించేవి మూడు
అవి ధనం, అధికారం, విద్య
వీటిలో ధనం వల్లవచ్చిన గర్వాన్ని గురించి
కొక్కొండ వేంకటరత్నంగారు
బిలేశ్వరీయంలో
ఈ విధంగా చెప్పారు చూడండి-

కన్నులఁ జూపు గల్గిననుఁ గాంచఁగ నీ దెదురైన, వీనులన్
బన్నుగ విన్కి గల్గిన ననన్ విన నీ, దిఁక నోరు పల్కఁగా
నున్ననుఁ బల్కనీదు, మఱి యున్నను జేతులు మ్రొక్క నీదు,  సం
పన్నుని గర్వ, మత్తెవులుఁ బాపెడి లేవడియేన్ విరక్తుఁడేన్
                                                                                                       (బిలేశ్వరీయము - 3- 15)

ఏ విధంగా ధనం సంపాదించినా వానికి
అది చెప్పగరాని గర్వం కలిగిస్తుంది.
అదే అతనికి పెద్దజబ్బు ఆ జబ్బు కొన్ని లక్షణాలను
కలిగి ఉంటుంది అని వాటిని పేర్కొంటూ ఈ పద్యం చెప్పాడు కవి.


సంపన్నుని గర్వం-
కంటికి చూపు బాగానే ఉన్నా,
ఎవరైనా పెద్దలు ఎదురిగా వచ్చినా
వారిని కన్నెత్తి చూడనివ్వదు.
అలాగే చెవులు ఏలోపం లేకపోయినా
వినికిడి శక్తి ఉన్నా మనం చెప్పింది విననివ్వదు.
ఇక నోరు స్పష్టంగా మాట్లాడటానికి శక్తి ఉన్నా
ఎదుటివారితో ప్రియంగా  మాట్లాడనివ్వదు.
అలాగే చేతులున్నా కూడ పెద్దలకు మ్రొక్కనివ్వదు
డబ్బు వలన వచ్చిన జబ్బును దారిద్ర్యంగాని
లేదా వైరాగ్య జ్ఞానసంపన్నుడైన యోగిపుంగవుడైనా గాని
ఆ యిద్దరే పోగొట్టగలరు ఆ జబ్బును - అని భావం.

ఇలాంటివి చేయకూడదు


ఇలాంటివి చేయకూడదు




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-
ఎలాంటివి చేయకూడదో చెబుతున్నది.

న ధార్మికే ననేద్గ్రామే
నవ్యాధి బహుళే భృశమ్
నైవః ప్రపత్యే తాధ్యానం
నచిరం పర్వతే వనేత్

ధర్మాత్ములైనవారు లేని ఊళ్లలో నివసించకూడదు.
అంటురోగాలకు ఆలవాలమై ఉన్న ఊళ్లకు చుట్టపు
చూపుగాకూడ పోకూడదు.
నిర్జనంగా ఉండే దారిలో ఒక్కరే
నడవరాదు సహాయంచేటానికైనా
మరో మనిషి ఉండడు. ప్రమాదమేర్పడితే
వేసిన కేకకూడ అందదు.
కొండల మీద ఎక్కువకాలం
నివసించకూడదు - అని శ్లోక భావం.

నిజమేకదా !

Saturday, March 4, 2017

వీరు సిరికి అనర్హులు


వీరు సిరికి అనర్హులు




సాహితీమిత్రులారా!



జైమినీ భారతంలో వేదవ్యాసుడు
ధర్మరాజుకు లక్ష్మీదేవిని గురించి చెబుతూ
చెప్పిన పద్యం -

వ్యతిపాతయోగమున వై
ధృతి సంక్రాంతులను బర్వదినములఁ దీర్థ
వ్రత చర్యలఁ బైతృకముల
నతివలఁ గామించువాఁడనర్హుఁడు సిరికిన్
                                                                          (జైమినీభారతము - 3- 44)


నవగ్రహాల సంచారంలో 27 యోగాలు ఏర్పడతాయి
వాటిలో కొన్ని శుభయోగాలు, కొన్ని అశుభయోగాలు
అని జ్యోతిశ్శాస్త్రం చెబుతుంది. అలాంటి
యోగాలలో వ్యతిపాత యోగం, వైధృతియోగం
చాల అశుభయోగాలు, ఈ సమయంలో భార్యతో
సంగమిస్తే పుట్టే సంతానం రాక్షసగుణాలతో పుడతారు.
అందుకని అవి నిషేధించారు.
అలాగే సూర్యుడు రాశినుండి మరోరాశికి
మారడాన్ని సంక్రాంతి అంటారు.
ఇవి ఏడాదిలో 12 సంక్రాంతులుంటాయి.
ఇవికూడ భార్యాసంగమానికి పనికిరావు.
పర్వ(పండుగ)దినాలు, తీర్థయాత్రలు
చేసే సమయంలో, వ్రతాలు చేసే సమయంలో
తల్లి, తండ్రి, గురువులు లేదా ఇతరులను
ఉద్దేశించి చేసే శ్రాద్ధకర్మలు నిర్వహించే రోజులలో
స్త్రీలము కోరి సంగమిస్తే సంపదకు తగనివారౌతారు
అని పద్యభావం.

దరిద్రులుగా ఎందుకు పుడతారో తెలుసా?


దరిద్రులుగా ఎందుకు పుడతారో తెలుసా?




సాహితీమిత్రులారా!



దరిద్రంతో బాధపడేవారంతా
ఎందుకు అలా పుట్టామా అని
ఆలోచిస్తుంటారు దానికి కారణం
చెబుతోందీ శ్లోకం చూడండి-

అదాన దోషేణ భవే ద్దరిద్రో
దారిద్య్ర దోషేన కరోతి పాపమ్
పాపా దవశ్యం నరకం ప్రయాతి
పునర్దరిద్రః పునరేవ పాపీ

గత జన్మలో ఏదీ ఎవరికీ దానం
చేయకపోవడం వల్ల దారిద్య్రం
సంభవిస్తుందీ జన్మలో. దీనివల్ల
ఈ జన్మలో కూడజా ఎన్నెన్నో
పాపపు పనులు చేయవలసి వస్తుంది.
ఈ పాపకృత్యాల వల్లనే నరక ప్రాప్తి.
నరక బాధల అనంతరం, తిరిగి
దరిద్రులుగా పుట్టవలసి వస్తుంది.
కనుక- ఎవరైనా తమకు ఎంత కలిగితే
అంతే దానం చేయాలి - అని భావం.

Friday, March 3, 2017

తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?


తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?




సాహితీమిత్రులారా!


ఎంతటివాడైనా
విధికి వశుడు కావలసిందే కదా
ఆ విషయాన్నే వేమన
ఈ పద్యంలో పరిహాసంగా చేబుతున్నాడు

కనక మృగము భువిని కలదు లేదనకుండ
తరుణి విడచి పోయె దాశరథియు
తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?
విశ్వదాభిరామ! వినురవేమ!

బంగారులేడి లోకంలో ఉంటుందా ఉండదా
అనే విమర్శన చేయకుండా సీతకోరిందికదా అని
రాముడు దాన్ని తేవడానికి వేళ్లాడు కొంచెంకూడ
ఆలోచించకుండా వెళ్ళే ఈయన దేవుడెలా అయినాడు
అంటే విధి వంచితుడై వెళ్ళాడనికదా!

ఇవి నేర్చుకుంటే వచ్చేవి కావు


ఇవి నేర్చుకుంటే వచ్చేవి కావు




సాహితీమిత్రులారా!


అన్నీ నేర్చుకుంటే వచ్చేవి ఉండవు
అన్నీ నేర్చుకోవలసిందే కదా
అలా ఉండనివేమిటో ఈ శ్లోకంలో చూడండి-

దాతృత్వం ప్రియవక్తృత్వం
ధీరత్వ ముచితజ్ఞతా,
అభ్యాసేన న లభ్యంతే
చత్వార స్సహజాగుణా

నేర్చుకుంటే రానివీ - స్వతస్సిద్ధంగా వచ్చేవి
కొన్ని ఉన్నాయి అవి-
1. చక్కగా మాట్లాడే నేర్పు,
2. దానగుణం,
3. ధైర్యం,
4. మంచి చెడుల విచక్షణా జ్ఞానం
ఈ నాలుగూ పుట్టుకతో రావాలేగాని
నేర్చుకుంటే వచ్చేవికావు- అని శ్లోక భావం



Thursday, March 2, 2017

నీ కంటే విధవే మేలు


నీ కంటే విధవే మేలు




సాహితీమిత్రులారా!

ఒక కవి వేమగుంట వేంకటరాయడనే
వ్యక్తినిగురించి చెప్పిన పద్యం ఇది-
ఆ వ్యక్తి తనకు సంపద ఉండికూడ
తనను ఆశ్రయించిన కవిపండితులకు
ఏమీ ఇవ్వక పోవడంతో నిందాపూర్వకంగా
కవి ఈ పద్యం చెప్పాడు-


విధవైన మేలు మగనికి
తిథి పెట్టును, కథలు వినును, తీర్థములేగున్
అధముడవు దానికన్నను
విధవాయా! వేమగుంట వేంకట్రాయా!


ఓ వెంకటరాయా! నీ కంటె విధవ మేలు.
ఎందుకంటే ఆమె తన భర్తకు
శ్రాద్ధం పెడుతుంది. పురాణాలు,
హరికథలు వింటుంది.
ఆ విధంగా తన సొమ్మును
సత్కార్యాలకు వినియోగిస్తుంది.
నీవు అంతకంటే అధముడవు
నీ ధనాన్ని మంచి పనులకు
వేటికీ వినియోగించవుకదా - అని భావం