Saturday, June 27, 2020

ఎంత స్వాభావికమైనదీ శ్లోకం



ఎంత స్వాభావికమైనదీ శ్లోకం






సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం ఎంత స్వాభావికంగా భర్తృహరి కూర్చారో గమనించండి-

మధు తిష్ఠత వాచి యోషితాం
హృది హాలాహలమేవ కేవలమ్
అత ఏవ నిపీయ తే2ధరో
హృదయం ముష్టిభి రేవ తాడ్యతే
                               (భర్తృహరి సుభాషితములు -2-60)
తేనె ధారలు కారేలా మాట్లాడటం స్త్రీల స్వభావం.
కావున ఆ తీపి పెదాలను పీల్చడానికీ పురుషులు
ఉబలాటపడతారు. అవి పైపై మధురపు పలుకులని తెలిశాక,
హృదయంలో హాలాహలం ఉందని బైటపడ్డాక కసి కొద్దీ
వారి స్తనాలను మర్దిస్తారు.
అధర చుంబనం - స్తనపీడనం రతిలో స్వాభావిక అంశాలు.

ఈ శ్లోకంలో ఒకదాన్నొకటి సమర్ధిస్తున్నట్లుగా చెప్పడం కవి చాతుర్యం.
తీయగా మాట్లాడే స్త్రీలను మొదట తెలీక నమ్మినప్పటికి వారిలో విషముందని
గ్రహించాక నిక్కిన చన్నులను చేత్తో అణచటం - పిడికిళ్ళతో గ్రుద్దడం కాముకులు
వెనువెంటనే ఆచరించే కృత్యాలు.
ఇది ఆ స్త్రీల పట్ల ఆచరించతగినదే
ఇక్కడ వేశ్యలని ప్రత్యేకంగా
వర్ణించినప్పటికి
ఈ స్వభావం అధికం అనేది సర్వసమ్మతం.

Thursday, June 25, 2020

తార చంద్రునితో ఏమనిందంటే?


తార చంద్రునితో ఏమనిందంటే?





సాహితీమిత్రులారా!

తెలుగు కావ్యజగత్తులో సుప్రసిద్ధములై శతాబ్దాలుగా
సాహితీ రసికుల ఆస్వాదములై వస్తూన్న వాటిలో
"శశాంకవిజయం, 
రాధికా సాంత్వనం, 
బిల్హణీయం
వైజయంతీవిలాసం,
అహల్యా సంక్రదనం" మొదలైనవి.
వీటిని ఎవరంటే వారు చదవకూడదని
వీటిపై బ్రిటిషువారి కాలంలో నిషేధం విధించబడునది. దాన్ని
తొలగించడానికి అనేకులు అనేకరకాలుగా శ్రమించారు.
అది గతం ఇప్పుడో వీటిని సదివే ఆసక్తిఉన్నా అర్థం చేసుకోగల సామర్థ్యం తగ్గి
వీటిని చూడటం తగ్గిందనవచ్చు.
ఏమైతేనేమి సాహితీనందనంలో అడపాదడపా వీటినేకాక అనేకానేక
విషయాలను ముచ్చటించుకుందాం.
అసలు విషయానికొస్తే శశాంకవిజయంలో తార చంద్రునికి తనపై మోహం
కలిగేలా తన గురువు గారైన బృహస్పతి తదితరుల రహస్యకార్యకలాపాపాల చిట్టా
ఈ విధంగా విప్పింది. చూడండి.

కన్నకూఁతు రటంచు నెన్నక భారతీ
        తరణిఁ గూడఁడె నీ పితామహుండు?
మేనత్త యను మేర మీఱి రాధికతోడ
         నెనయఁడే నిన్న నీయనుఁగు బావ?
వదినె యంచు నొకింత వావి లేకయె జ్యేష్ఠు
         నెలతతోఁ బొందఁడె నీ గురుండు?
ముని పత్ని యన కహల్యను బట్టఁడే నీదు
         సహపాఠి యౌ పాకశాసనుండు?
ఇట్టి మీవారి నడతలు కట్టిపెట్టి
యమ్మ నేఁజెల్ల! న్యాయంబు లాడె దౌర!
కడకు నీ రంకు నీ వెఱుంగని వితాన
దూరెదవు నన్నుఁ, జలహారి దోసకారి! (3-81)

Tuesday, June 23, 2020

ఏడువారాల నగలు అంటే? - 2


ఏడువారాల నగలు అంటే? - 2





సాహితీమిత్రులారా!

బుధవారం ధరించే నగలు-
బుధవారాని బుధుడు అధిపతి. ఆరోజు ఉదయం బుధహోర ఉంటుంది. పచ్చలు బుధునికి ప్రియమైన రత్నం. పచ్చలలో, ఆకుపచ్చ, చిలుకపచ్చ అని భేదాలున్నాయి. వీటిలో ఏరంగైనా బుధవారం ధరించవచ్చు. పూర్వం పచ్చల దండలు ప్రసిద్ధి. పచ్చలు చెవులపోగులలోను, ముంజేతి కడియాలలోను పొదుగుతారు. కావున అవి ఉంటే వాటిని బుధవారం ధరించవచ్చు. వీటితోపాటు కంచు కడియాలు, ఉంగరాలు కంచుపూసల దండలు ధరించవచ్చు.

గురువారం ధరించే నగలు -
గురువారానికి బృహస్పతి అధిపతి. గురువారం ఉదయం గురుహోర ఉంటుంది.పుష్యరాగం గురునికి ప్రియమైన రత్నం. వీనిని కంకణాలలో, చెవికమ్మలలో కూడ పొదుగుతారు. కాబట్టి గురువారంనాడు యిత్తడి నగలు, ఉంగరాలు, వన్నె తక్కువలోని బంగారు నగలు ధరించవచ్చు.

శుక్రవారం ధరించే నగలు -
శుక్రవారానికి శుక్రుడు అధిపతి. ఆరోజు ఉదయం శుక్రహోర ఉంటుంది.శుక్రునికి వజ్రం ప్రియమైన రత్నం. వజ్రాలు తాటంకాలలోను, ముక్కుపుడకలలోను పొదుగుతారు. వజ్రం ఇతర ఆభరణాలలో దేనియందు పొదిగినా పొదకకున్నా చేతి ఉంగరాలలో మాత్రం తప్పక పొదుగుతారు. శుక్రవారంనాడు వాటిని ధరించవచ్చు. వాటితోపాటు తగరపు పూసలు, గజ్జెలు, తగరముపూసిన నగలు ధరించవచ్చు.

శనివారం ధరించే నగలు -
శనివారం శనైశ్చరుు అధిపతి. ఆరోజు ఉదయాన్నే శనిహోర ఉంటుంది. శనైశ్చరునికి నీలం ప్రియమైన రత్నం. నీలాలలో రంగును బట్టి నీలం, ఇంద్రనీలం అని రెండురకాలు. ఇంద్రనీలం అంటే బ్లూ, నీలమంటే బ్లాక్. శనివారం రోజున వీటిలో ఏదైనా ధరించవచ్చు.
నీలాలను పోగులు, ముంగరములు మొదలైత వానిలో పొదుగుతారు
ఇవికాక ఆరోజు స్టీలు ఉంగరాలు, గొలుసులు ధరించవచ్చు.
                                                                                                     (మరిన్ని విశేషాలు తరువాత)

Sunday, June 21, 2020

ఏడువారాల నగలు అంటే?


ఏడువారాల నగలు అంటే?





సాహితీమిత్రులారా!

స్త్రీలు ధరించే భూషణాలలో ఒక్కొక్కటి 7 రకాలుగా ఉన్నాయి.
వాటిని ఏడువారాల నగలంటారు. వాటిని వారాన్ని బట్టి ధరిస్తారు.
వీటిని గురించి మాంగల్యశాస్త్రం(స్వర్ణ శిల్పం)లో
కపిలవాయి లింగమూర్తిగారు చాల వివరంగా ఇచ్చారు.

ఆదివారం ధరించే నగలు -
ఆదివారానికి సూర్యుడు అధిపతి. ఆరోజు ఉదయం సూర్యహోర ఉంటుంది. సూర్యునికి ప్రియమైన వర్ణం సింధూరం. మాణిక్యం సూర్యునికి ప్రియమైన రత్నం కాని అది దొరకటం కష్టం. కావున ఎర్రని కత్నాలను పొదిగిన నగలను ధరించవచ్చు. సాధారణంగా తాటంకాలలో, పతకాలలో, ఉంగరాలలో ఎర్రని రాళ్లు పొదిగిన వాటిని ధరించవచ్చు  అలాగే రవ్వలుతాపని శుద్ధమైన బంగారం ఆభరణాలను కూడ ధరించవచ్చు.

సోమవారం ధరించే నగలు -
సోమవారానికి చంద్రుడు అధిపతి. ఆరోజు ఉదయాన్నే చంద్రహోర ఉంటుంది. ముత్యాలు చంద్రునికి ప్రియమైనవి. కావున ముత్యాల దండలు, వెండితీగలతో అల్లిన తావళాలు, శంఖం మరియు ముత్యపు చిప్పలతో చేసిన ఆభరణాలు, వెండి దండికడియాలు, ముంజేతి కడియాలు, ఉంగరాలు ధరించవచ్చు.

మంగళవారం ధరించే నగలు -
మంగళవారానికి కుజుడు(అంగారకుడు) అధిపతి. ఆరోజు ఉదయం కుజహోర ఉంటుంది. అంగారకునికి ముదురు ఎరుపురంగు ప్రియమైనది. పగడాలు అంగారకునికి ప్రియమైనవి. కావున మంగళవారంరోజున పగడాల దండలు ధరించాలి. పగడాలను చేకట్లలో పొదుగుతారు. కావున వాటిని ధరించవచ్చు. రాగితీగలతో అల్లిన తాళాలు, రాగికడియాలు, ఉంగరాలు ధరించవచ్చు.
                                                                                                (మిగిలినవి రేపు తెలుసుకుందాం)

Friday, June 19, 2020

అవివేకి తోడబుట్టువు


అవివేకి తోడబుట్టువు





సాహితీమిత్రులారా!

కన్యనే కాదు కవితాకన్యను కూడా తగిన వానికే దానం చేయాలి
అని నాచనసోమనాథుని చమత్కార పద్యం.
ఇది పొత్తపి వేంకటకమణ కవి తన లక్షణశిరోమణి(2-163)లో
ఉదహరించబడినది.

కవితా కన్యక కెందును
గవి జనకుఁడు, బట్టుదాది గణుతింపంగా
నవరస రసికుడె పెనిమిటి 
యవివేకియె, తోడఁబుట్టువనవేమ నృపా!

ఓ అనవేమనృపాలా!  కవితా బాలకు కవి తండ్రి,
ఎత్తుకొని పదిచోట్ల తిప్పి ప్రకాశితం చేసే భట్టు దాది వంటివాడు.
అనుభవించే సహృదయడు, శృంగారాది నవరసానుభవ యోగ్యుడు భర్త.
అవివేకి తోడబుట్టువు వంటివాడు.
కావున కవితాకన్యను నవరసరసికునికే
ఇవ్వాలని కవి భావన.

Wednesday, June 17, 2020

చమత్కారదీవెన




చమత్కారదీవెన




సాహితీమిత్రులారా!

పద్యాల్లో దీవెనలు చాలా చమత్కారంగా ఉంటాయి.
వాటిలో ఒకటి క్రింది శ్లోకంలో చూడగలం. 
గమనించండి.

విష్ణో రాగమనం నిశమ్య, సహసా కృత్వా ఫణీంద్రం గుణం
కౌపీనం పరిధాయ చర్మకరిణ: శంభు: పురోధావతి:
దృష్ట్వా విష్ణురథం సకంప హృదయ: సర్పో పతత్ భూతలే
కృత్తి ర్వి స్ఖవితా హ్రియా నతముఖో నగ్నో హర: పాతువ:

శివుడు దిగంబరంగా ఉన్నాడు. విష్ణువు వస్తున్నాడని తెలిసింది. పామును మొలతాడుగా, గజచర్మాన్ని కౌపీనంగా పెట్టుకొని వెళ్ళాడు. గరుత్మంతుని చూడగానే పాముకు గుండెలవిసి కిందపడింది. గోచీ వూడిపోయింది. నగ్నుడై తలవంచుకొని వున్న పరమేశ్వరుడు మిమ్ము రక్షించుగాక - అని భావం

ఇందులో శంకరుని దిగంబరత్వం, పామునకు గరుత్మంతునకు గల
సహజవైరం మొదలైనవానితో కవి చమత్కారపూర్వకంగా ఆశీర్వదించాడు

Tuesday, June 16, 2020

లేదు అనగానే అభిమానం శూన్యం అవుతుంది


లేదు అనగానే అభిమానం శూన్యం అవుతుంది






సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి.
యాచించటంలోని దైన్యము
ఎంత చక్కగా వర్ణించబడినదో తెలుస్తుంది.

మానిసి కేడు జానల ప్రమాణము దేహము, యాచనార్థమై
పూనిన ఆఱు జానలగు, పోయి ధనాఢ్యుని యిల్లు చేరగా 
జానలు నాలుగౌ, నతని చల్లగ "దేహి" యటన్న రెండగున్,
పైన నతండు "నాస్తి" యనినన్ వినినంతన శూన్యమయ్యె
డిన్!


మనుష్యుని దేహము 7 జానల పొడవుంటుంది.
యాచించుటకు(అడుక్కోవడానికి) సిద్ధపడగానే 6 జానలవుతుంది.
ధనవంతుని యిల్లు చేరగానే 4 జానలవుతుంది.
అతనిని "దేహి" అని అర్థించగానే 2 జానలవుతుంది.
ధనాఢ్యుడు "నాస్తి"  అనంటే అర్థించిన వ్యక్తి(అభిమానవంతుడు) శూన్యమై పోవును.

చూడండి కవి ఎంత సత్యాన్ని పద్యంలో కళ్ళ ఎదుట చిత్రించాడో!