Wednesday, June 3, 2020

బంగారమంటి కోమటి



బంగారమంటి కోమటి






సాహితీమిత్రులారా!

ఏదైనా ఎక్కువైతే అది పిచ్చికిందికే లెక్క.
మరి సంగీతం ధ్యాసతో ఒక వ్యాపారి ఏమిచేశాడో?
ఈ పద్యం పుట్టింది. చూడండి........


లింగాల గురివిసెట్టికి
గంగాధరుడేమి? గతులు కల్పించెనయా
బంగారమంటి కోమటి
సంగీతముచేత బేరసారములుడిగెన్!


గురివిసెట్టి వ్యాపారం చక్కగా చేసుకుంటూ ధనం సంపాదించేవాడు.
గంగాధరుడనే సంగీత విద్వాంసుడు అతనికి సంగీతం నేర్పడం మొదలు పెట్టాడు.
గురివిసెట్టి సంగీతం పాడుకుంటూ తరననాం..... తరననాం.... అంటూ
ఒక మానిక వేయవలసినవానికి రెండు, రెండు వేయవలసినవానికి మూడు
ఇలా వేయడం వల్ల వ్యాపారం పూర్తిగా ఎత్తిపెట్టే దాకా పోయిందట.
అవసరం కాని విషయాలలో తలదూర్చితే ఇంతేకదా!

Monday, June 1, 2020

ముక్తి ఎన్ని రకాలు?


ముక్తి ఎన్ని రకాలు?





సాహితీమిత్రులారా!

మనం భగవంతుని జన్మరాహిత్యంకోసమే పూజించాలని
పెద్దలు చెబుతారు. కాని దాన్ని మనం ముక్తి అనే పదంతో వాడుతుంటాం.

ముక్తి అనేది నాలుగు రకాలని చెబుతారు.
1. సాలోక్య, 2. సామీప్య, 3. సారూప్య, 4. సాయుజ్య ముక్తి.

ఇంతకు ఇవేమిటివి అంటే తెలుసుకుందాం.-

సాలోక్యముక్తి - అంటే భగవంతుడుండే లోకంలో భక్తుడుండడం

సామీప్య ముక్తి-
                            భగవంతుని ఆంతరంగికులలో చేరి భగవంతుని సమీపంలో ఉండడం

సారూప్య ముక్తి - ఇది ఒకవిధంగా భగవంతుని ఆకారంలో ఉండడం

సాయుజ్య ముక్తి - భగవంతుని రూపంతో బాటు భగవందానందం పొందుతూ 
                                                భగవంతునిలో లీనమవడం.
ముక్తిలో కూడా ఇన్ని విధాలున్నాయి.
మనకే విధమైన ముక్తి కావాలో మనం ఆవిధమైన పద్ధతిని
అవలంబించి  ఆయనలో చేరాలిమరి.

Friday, May 29, 2020

కవిగారి బహుమానం


కవిగారి బహుమానం





సాహితీమిత్రులారా!

కొమాండూరు కృష్ణమాచార్యులవారు 20వ శతాబ్ది ప్రథమార్థంలో
ఉన్న పండిత కవులు. గుంటూరు వాసులు.
వారొకనాడు మండు వేసవిలో వడగాడ్పుల మధ్య తమ పొలమున్న
గ్రామానికి పోతున్నారు. త్రోవలో విపరీతంగా దప్పికైంది.
అప్పుడొక గొల్లవాడు చల్లని మజ్జిగ ఇచ్చి దాహం తీర్చాడు.
వెంటనే అతనికి పద్యాన్నిలా
బహూకరించారు
ఆచార్యులవారు.

పురజిత్పాల మహోగ్రనేత్ర జనిత స్పూర్జన్మహాగ్నిచ్ఛటా
పరుష స్పూర్తి వహించి వీచెడు మహావాతంబు ప్రాణాంకురో
త్కరమున్ మ్లానము నొందజేయ - మము తక్రంబిచ్చి రక్షించితో
పురుష గ్రామణి! గోప మాత్రుండవె! నీ పుణ్యంబు సామాన్య మే?

అన్నాడట.
ఆ గోపాలునికి ఈ పద్యం అర్థంకాలేదు.
సంస్కృత పద సమాస బంధురమైన శైలి కొమాండూరి వారిది.
వారి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
అది గ్రహించి అర్థం చెప్పారు కవిగారు.

"త్రిపురాలను తగలబెట్టిన రుద్రుడి మూడో కంటి మంటలాగా 
ఎండకాస్తున్నది. వడగాడ్పు కొడుతున్నది. 
ప్రాణం అలసిపోతున్నది. ఈ స్థితిలో మజ్జిగ ఇచ్చి కాపాడావు. 
నీవు మామూలు గొల్లవు కాదు. 
నీ పుణ్యం సామాన్యమైందికాదు."

అర్థం తెలిసిన తర్వాత
అంత గొప్ప పద్యం
తన మీద చెప్పినందుకు
ఎంతో కృతజ్ఞత ప్రకటించాడతను.

Tuesday, May 26, 2020

బోదురుకప్ప


బోదురుకప్ప





సాహితీమిత్రులారా!

శ్రీశ్రీ అనువాదకవిత ఈ బోదురుకప్ప
దీని మూలరచయిత - ట్రిస్టోన్ కోర్బియేర్
ఇది కవనకుతూహలం నుండి -

గాలిలేని రాత్రిపూట ఏదోపాట............
- దట్టపుటాకుల కత్తిరింపు బొమ్మలకి
జిలుగు మలామాలు సింగారిస్తున్నాడు చంద్రుడు.
ఓపాట; ప్రతిధ్వనిలో అకస్మాత్తుగా, వడిగా,
పూడ్చబడి, అల్లక్కడ, ఆ బోలెడు బురద కింద
- ఆగింది దా! అక్కడే ఉంది, అదృశ్యంగా .........
-- బోదురుకప్ప! - అదిగో నీడలో! నాదగ్గరా జడుపు?
నీ నమ్మకమైత కసాయిని కానూ నేను!
           చూడండతణ్ణి, క్షౌరమైన కవిని, రెక్కైనా లేదు
బురదకుపుట్టిన కోకిల దారుణం! 
            --పాడుతున్నాడే అరే! దారుణం!! ఏం?
                                            ఎందుకని దారుణం?
బాగాచూశారా అతని ప్రకాశించే నేత్రాల్ని? ........ 
ఉహుఁ! నిష్క్రమించాడు చల్లబడి. తన రాతి కిందికి 
గుడ్ నైట్ - మీరు విన్న బోదురు కప్పని నేనే

Saturday, May 23, 2020

అదొక్కటే పెద్దలోపం


అదొక్కటే పెద్దలోపం




సాహితీమిత్రులారా!

ఒక అభిసారికను ఆమె చెలికత్తె
"నీకు అందమైన భర్త - సమర్థుడు ఉండగా వ్యభిచారమేల?" -
అని ప్రశ్నించిందట.
దానికి ఆమె సమాధానం చూడండి.

ఆకారే శశీ, గిరా పరభృత:, పారావతశ్చుంబనే
హంసశ్చంక్రమణే సమం దయితయా, రత్యాం ప్రమత్తో గజ:
ఇత్థం భర్తరిమే సమస్త యువతి శ్లాఘ్యై: గుణై: శోభతే
శూన్యం నాస్తి వివాహిత: పతిరివ స్యాన్నైక దోషోయది!

నా భర్త ఆకారంలో చంద్రుడు, మాటలలో కోకిల,
ముద్దుమాటలలో పావురము, నన్ను కొంగుపట్టుకొని
తిరగడంలో రాజహంస, రతిలో మత్తగజమే నా భర్తలో
యువతులు మెచ్చుకొనే గుణాలన్నీ ఉన్నాయి.
తాళికట్టినమగడగుటే పెద్దలోపము ఆ ఒక్క లోపం
వల్లనే పరపురుషులను
అభిసరిస్తున్నాను.
- అని చెప్పిందట.

Wednesday, May 20, 2020

అవి వాటి సహజగుణం


అవి వాటి సహజగుణం




సాహితీమిత్రులారా!

ఈ శ్లోకంలో కవి ఎంత సహజంగా
చమత్కరించాడో!
చూడండి.

అభూచ్ఛామా జంబూ: దళితహృదయం దాడిమఫలం
సశూలం సంధత్తే హృదయ మవమానేన పనస
భయాదంతస్తోయం తరుశిఖరజం లాంగలిఫలం
సముద్భూతే చూతే జగతి ఫలరాజే ప్రసరతి!

మామిడిపండు ఫలరాజంగా ప్రపంచంలో
ప్రఖ్యాతి పొందుతూంటే
నేరేడుపండు మొగం మాడ్చుకున్నది.
దానిమ్మపండుకు గుండె బ్రద్దలైంది.
పనసపండు గుండెలో గసిక(మొనదేలి
త్రవ్వటానికి అనువైన కొయ్య) గ్రుచ్చుకొంది.
కొబ్బరి ఫలము గుండె నీరైంది - అని భావం.
అన్ని పండ్లకు వాటి సహజ గుణాలతోనే
కవి ఎంతగా చమత్కరించాడో కదా!

Monday, May 18, 2020

ఆ రాజుగారి కీర్తి ఎంతదో!


ఆ రాజుగారి కీర్తి ఎంతదో!




సాహితీమిత్రులారా!

ఒక రాజు  కీర్తిని కవి
ఎంత చమత్కారంగా వర్ణించాడో
ఈ శ్లోకం చూడండి.

విద్వద్రాజ శిఖామణే తులయితుం ధాతా త్వదీయం యశ:
కైలాసంచ నిరీక్ష్య తత్రలఘుతాం, నిక్షిప్తవాన్ పూర్తయే
ఉక్షాణం, తదుపర్యుమా సహచరం తన్మూర్ధ్నిగంగాజలమ్
తస్యాగ్రే ఫణిపుంగవం తదుపరిస్ఫారం సుధా దీధితిమ్

ఓరాజా! నీ కీర్తిని తూచాలని బ్రహ్మ అనుకొన్నాడు.
తక్కెడ ఒక సిబ్బెలో కీర్తిని ఉంచి వేరొక సిబ్బెలో వెండి కొండను పెట్టాడు.
చాల్లేదు.
ఆపై నందీశ్వరుని -
(అదీ చాలక) ఆ పై శివుని -
ఆపై గంగాజలమును -
ఆపై వాసుకిని -
ఆపై చంద్రకళను పెట్టి
తూచలేక విఫలుడైనాడు -
అని భావం