Monday, April 8, 2019

నా స్మృతి పథంలో


నా స్మృతి పథంలో





సాహితీమిత్రులారా!


(విజయనగరం కాలేజీ శతవార్షికోత్సవ (1971) సందర్భంలో ఇవ్వబడిన ప్రసంగ పాఠం)

సభాధ్యక్షులైన శ్రీ రాజాగారు అనుఙ్ఞనిస్తే, ప్రిన్సిపాలుగారూ, అధ్యాపకులూ, పెద్దలూ, మన కాలేజీ విద్యార్థులూ సెలవిప్పిస్తే నేను ఏదో బరికి తెచ్చిన నాలుగు మాటలూ వినిపిస్తాను చిరంజీవిని కృష్ణకుమారి ద్వారా.

వెనుక నోరున్నప్పుడు నేనూ ప్రసంగవేదికపై రవ్వంత సందడి చేసేవాణ్ణి. ఏదయినా వ్రాయవలసి వచ్చినప్పుడు అటూ ఇటూ పచారు చేస్తూ చెప్పేవాణ్ణి, ఆప్తులు వ్రాసిపెట్టేవారు.

ఇప్పుడు ఎలాగ చెప్పడం? ఇక కంఠంలో ఉన్న గొట్టాం వల్ల వంగి చాలాసేపు వ్రాయలేను, కనుక ఏమి గిలికానో ఏమో! అసలే ఆట్టే తెలిసినవాడను కాను. మూగతనము, ముదిమి…

నేను చెప్పే మాటలలో అనుచితమైనవీ, అర్థం లేనివీ, సొంత గొడవలూ ఉంటే మన్నించండి. నా యెడ దయ ఉంచి వినండి.

సరస్వతీ నిలయమైన తల్లి ఈ కళాశాల ఎదుట నిలబడి మునుముందు నా చేతులు జోడిస్తున్నాను. నాటి నా గురువుల నందరినీ స్మరించుకుంటూ పరమభక్తితో కృతఙ్ఞతతో వారి చరణ సన్నిధానాన నా  శిరస్సు వంచుతున్నాను.

వారిలో పరమ గురువులు శ్రీ మామిడిపూడి వేంకటరంగయ్య గారి దర్శనం తరచూ చేసుకుని పాదవందనం చేస్తూంటాను. హైదరాబాదులో ఆ నడుమ వారికి మహావైభవంగా “గురు పూజ” చేసుకున్నాను. నా ఋణం తీర్చుకోడానికి ప్రయత్నించాను. నా తలిదండ్రులదీ, గురువులదీ, ఋణం ఏమి తీర్చుకోవడంలెండి, నా మొహం!

నా భాగ్యం వల్ల నాటి నా గురువులలో ఇప్పుడూ ఉన్నవారు వారున్నూ, ప్రొఫెసరు సిరుగూరి హనుమంతరావు గారున్నూ, అనుకుంటాను.

ఆహా! ఎంత గొప్ప కాలేజీ అండీ మనది? ఆనాడు ఆంధ్రదేశంలో మూడే First Grade  కాలేజీలు. వాటిలో ఇది ఒకటి. దక్షిణదేశంలోనే చాలా మొదటి కాలేజీలలోనిది.

మరి, ఇక్కడ ఉండే ఆచార్యులూ అధ్యాపకులు, ఉద్దండులూ ఉన్నతులూనూ. మేము బి. ఏ. లో ఉన్నప్పుడు, అంటే 191618 లో, ప్రిన్సిపాలు రామానుజాచారిగారు! ఆ శుభ్ర సుందరమూర్తినీ ఉదాత్తుణ్ణీ స్మరించుకుని మళ్ళీ శిరస్సు వంచుతున్నాను.

ఇంగ్లీషు అధ్యాపకులు వారూ, సుబ్బరాయ భట్టు గారు, బుఱ్ఱా శేషగిరిరావు గారు, ఎం. వి. ఎన్‌ సుబ్బారావు గారు, తణికెళ్ళ వీరభద్రుడు గారు, తరువాత ఆత్మారాంగారున్నూ. హిస్టరీ ఎకనామిక్సులకు వేంకట రంగయ్య గారు, సిరుగూరి హనుమంతరావు గారు, తరువాత పాత మద్రాసు హైకోర్టు జడ్జీ, మహా మేధావి గోవిందరాజాచారి గారున్నూ. కనుక ఆతురులైన యువకులు విద్యార్థులై మనస్సులూ, హృదయాలూ తెరుచుకుని ఆంధ్రదేశం దూరప్రాంతాలనుండి ఇక్కడికే వచ్చేవారు.

కాక, ఇక్కడ మరొక్క సదుపాయం ఉండేది, మహారాజులు నడిపించే సత్రం. మరి ఈ విజయనగరమో! చిన్న ఉజ్జయిని లాగున ఉండేది, పెద్ద భారతీ తీర్థం లాగున.

అటు మహామహోపాధ్యాయ రాయుడు శాస్త్రులు గారు, చిన సీతారామ శాస్త్రిగారు, వెంకట రమణాచార్యులు గారు, వీణ వెంకట రమణదాసు గారు, నారాయణదాసు గారు, తరువాత తరువాత ఆ దివ్య ప్రతిభాశాలి ద్వారం నాయుడు గారు ఇలాగ ఎందరో “ఉండేది, ఉండేవారు” అంటున్నాను ఏమీ అనుకోకండి. ఇవి మధురస్మృతుల నెమరువేతలో వచ్చిన ఆప్యాయతా, ఆవేశం వల్ల వచ్చే మాటలు.

ఇప్పుడుకూడా ఈ పట్టణమూ మన కాలేజీ అలాగే ఉంటాయి ఉన్నాయి. అప్పుడే! ఆ రోజుల్లోనేం! అంటూ అస్తమానమూ చచ్చు:జావ మాటలు చెప్పే ముసలితనపు నెమరువేత కాదు నాది. ఇవి ఉత్సవ సమయంలో ఉబికి పొర్లే ఉత్సాహంవల్ల దొర్లే మాటలు.

“అయ్యో! నాకు నోరుంటేనా ” అనిపిస్తుంది. ఇవాళ ఈ కళాశాలతో మాత్రమే కాదు నాకు ఈ సంబంధమూ, గాఢ స్నేహమూనూ. ఈ విజయనగరంతో కూడా.

నా బాల్యం అంతా దాదాపు ఇక్కడే కడచింది. నా పెద్ద బావగారు ఈ సంస్థానంలో ఉండేవారు. కొంత మంచి ఉద్యోగమే, ఆయనది, అప్పుడు ఖిల్లేరుదారు, ఇంగ్లీషు మున్షీ, ఇలాగ! పేరు గాడేపల్లి సీతారామస్వామి గారు. ఆయనకూడా 19వ శతాబ్ది చివర ఈ కళాశాలలో విద్యార్థే.

మరి మా పిఠాపురం కన్నా విజయనగరం పెద్ద పట్టణం. ఇక్కడ వింతలూ, ఆకర్షణలూ ఎక్కువ. తరచుగా ఏమిటి ఎప్పుడూ ఇక్కడే ఉండేవాడిని.

సంస్థానపు పట్టణాలు చాలా చాలా వింతగా ఉంటాయి. అరమోడ్పు కన్నులు లాగున అలసాలస నేత్రాలు అవి. అవి స్వప్నభరాలు. అవి రాచరికపు కళ్ళు. గతించిన మహారాజులవీ వారి ఆస్థానాలవీ స్మృతులు వెలుగులు లాగ, నీడలు లాగ, అక్కడ మెరుస్తూ, పాకుతూ పెనవేసుకునుంటాయి. ఆ రోజులలో ఆ సంస్థాన నగరాలు సంధ్యా గగన ఖండాలట్లు రేబవళ్ళ కౌగిలింతల ఒరపిడిలో రేగే వన్నె వెన్నెలతో నిండి కనబడేవి.

మా పిఠాపురం అలాగే మన విజయనగరమూ అంతే. బాల్య దృక్కులకు మరీని. నాకు మరీ మరీని. రాజాస్థానాలలో కలిసిపోయి పెరిగిన వాళ్ళు నాలుగు వందల ఏళ్ళ నుంచి నా తాత తండ్రులు రాజనగరాలలో. రాచనగరుల్లో వాతావరణం అపూర్వమైన కాల్పనికావేశంతో నిండి ఉంటుంది. విశాలమైన ఆ రాజ మందిరాంతరం  నుంచి ఏనాటివో రాణివాసపు నిట్టూర్పులు గుసగుసలాడుతున్నట్లుండేవి. రాచవీరుల మేఘ గంభీర కంఠాలు, దూరగర్జనవలే యుగాలు దాటివచ్చి బెదరిస్తున్న్త్లటుండేవి.

“సరదారుల్‌ పరదారుణ ద్యుతి సమంచన్మూర్తులై దక్కిణీ తరహా పాగాలు, బుగ్గ మీసములు, నిద్దంపు షరాయీలు, అంగరఖాలు” మొదలైనవాటితో కోటలోని ఏ చీకటి కొన నుండో ఇవతలికి ఎప్పుడయినా రావచ్చు ననిపించేది. ఉన్నత స్థంభోపరివిటంకాలలో పావురాల కువకువలూ, అటూ ఇటూ నడయాడే దాసీ జనం, చీర అం़చుల గుసగుసలూ, చతుశ్శాలలో మంటపంలో ఆశీనులైన ఎఱ్ఱ, ఆకుప़చ్చ శాలువాల పండితుల కుండలాల తళతళలూ, అప్పుడప్పుడూ తేలివచ్చే గాన లహరులూ, అడపాతడపా అత్తరు తావులూ హుక్కా ధూమవాసనలూ ఇవి మా లేత మనసులను ఆవహించి అడ్డులేని రెక్కలను తొడిగి ఏ లోకానికో లాగుకొనిపోయేవి.

ఇక్కడ మోతీమహల్‌లో, పూర్వ గజపతుల గాధలకు కొన్ని కొత్త కథలు కలుపుకొనేవాడిని ముఖ్యంగా అతిలోక సుందరమూర్తి అయిన ఆనంద గజపతి చిత్రపటం ముందు అల్లాగే నిలబడిపోయి కోట వెనుకనున్న “అస్తబల్‌” వైపు సాయం వేళలు వచ్చేవాడిని కాను అక్కడ విగ్రహాలు, Statues , కదిలి అలకనారాయణులై, విజయరాములై, ఆనంద గజపతులై, విలాసంగా విహరిస్తూ ఉంటారేమోనని.

అటు మచ్చకొండ. అంటే దాసన్నపేట కొండ, దాని ప్రక్క కుమిలి ఘాటీ, ़చూస్తే నా ప్రాణాలు బిక్కుబిక్కుమనేవి. ఆ ఘాటీలలో సింహ శార్దూలాలు పొంచిఉంటేనో! ఆ  ఘాటీలలో పిండారీల దండులూ, బందిపోటు దొంగల ముఠాలూ దాడి చేయడానికి ఒడుపుగా కాచుకునియుంటేనో! ఏమి భావనా, ఊహలూ అండీ అప్పుడు! అటు పెద్ద ఏనుగు మీద అంబారీ లాగున వెలగవాడ కొండ మీద ఏదో కట్టడం కనబడేది. కాని లోకం వదిలేసి కళింగ గజపతులు వివిక్తమైన ఆ గిరి దుర్గంలో ఏకాంతవాసం చేస్తూంటారు అనిపించేది King Arthur and the knights of the round table  లాగున. అటు ఫూల్‌బాగ్‌ ఇవతల చిన్నపూల్‌బాగ్‌ ఆ వెనుక కార్తీక సంతర్పణల వ్యాసనారాయణ మెట్ట, రత్నాల వర్తకుడు రాజారావు ప్రాసాదం. ఇటు యూరోపియనులతో కంటోన్మేంటు అన్నీ వింతలూ విడ్డూరాలే! అన్నిటికన్నా ఆప్తమైన దేవీ మిఠాయి అన్నీ బాగుండేవి అనిపిస్తుంది నాకు చివరకు పెద్ద చెరువు దోమలు కూడా! ఊరికే మా కవులు లాగున హమేషా ప్రబోధం చేయడమే కాని అవి గట్టిగా కరిచేవికావు కాబోలునేమో.

మరి, నాకు అన్నిటికన్నా విలువైనది ఆనాటి స్మృతి గురజాడ అప్పారావు గారి దర్శనం. వారి ఇంటనో, మరి మా బావగారి వీటనో వారిని చూస్తుండేవాడిని సన్నగా, అర్భకంగా కానీ, పదును పెట్టిన కత్తిలాగుండేవారు. ఎప్పుడయినా పిఠాపురం నుంచి వచ్చే నా తండ్రిగారూ వారూ సాహిత్య గోష్ఠి జరిపేవారని ఙ్ఞాపకం.

అప్పారావుగారు 1915లో వెళ్ళిపోయారు. 1916లో ఇక్కడ బి. ఏ.़చదువుకు వచ్చాను. అప్పుడు వెలగవాడ కొండ మీద వీరులు అంతర్ధానమైపోయారు. కుమిలి ఘాటీలోని పిండారీ దండులు కరిగిపోయారు. నేను ముదిరాను పెరిగాను. నా భాగ్యం వల్ల ఇంగ్లీషు ़చదువులో చొరబడ్డాను.

ఆంగ్ల విద్యాభ్యాసం ముదరడం, పెరగడం, కాలంతో హాయిగా జరుగుతూ రావడం, నా అదృష్టం. ఇంగ్లీషు ़చదువు మన దేశానికి గొప్పవరం అని నా నమ్మకం.

ఇక్కడ ఒక మాట, “నా ़చదువు, నా ़చదువు” అంటుంటే ఏదో మాంచి విద్యార్ధి ననుకోకండి. ఏమి ़చదవడం లేండి! నా అంత పనికిమాలిన విద్యార్ధి ఆరోజుల్లో అఖండ భారతదేశంలోనే లేడు.

ఒకటి జరిగింది చెప్పనా? 1919లో నేను బి. ఏ. అయాక, ఒక సాయంకాలం సామర్లకోట Platform  మీద నిలబడ్డాను కలకత్తా నుంచి మద్రాసు వెళ్ళే మెయిల్‌ (Mail)  కోసం ట్రయిన్‌ వచ్చింది. దానిలో ఒక First class Compartment లో మా గురువర్యులు ప్రిన్సిపాలు రామావతారంగారు ఉన్నారు. మద్రాసు యూనివర్సిటీ సెనేట్‌ సభకు వెడుతున్నారు. దగ్గరకు వెళ్ళి నమస్కరించాను “ఎవరు నువ్వు?ఓయ్‌నువ్వా?కాకినాడ Boy ! అన్నారు. నన్ను వారు కాకినాడ Boy  అనేవారు.

“ఏమి చేస్తున్నావు?” అన్నారు.

కాకినాడలో “మిషన్‌ High School లో మేస్టర్ని” అన్నాను. వారు విరగబడి నవ్వారు.

నవ్వి “నీ ़చదువులాగే ఉందా నీ ఉద్యోగమూనూ” అని మళ్ళీ నవ్వి, వాత్సల్యం నిండిన చూపులతో ‘God bless you’  అన్నారు.

ఆ సంవత్సరం ఆ స్కూలువారు నేను బాగా పనిచేయడంలేదని నా  ఉద్యోగం తీసేశారు. మరుసటి సంవత్సరం పెద్దాపురం లోనూ అంతే. ఒక ఏడే ఉద్యోగం. ఆ తరువాత పిఠాపురంలోను అంతే.

నేను నిరుద్యోగిగా పుట్టాను.

అందుకే నా మొదటి సన్మానం రేపల్లెలో ఆంధ్రదేశ నిరుద్యోగ సంఘం వారు చేసేరు.

ఇద్దరు పెద్దలతో కలిపి, శివశంకర శాస్త్రి గారు, విశ్వనాధ నిజం తెలుసుకున్నవారు చేసిన సన్మానం, నాకు చాలా ఇష్టం అది. అట్టి నన్ను ఏరి, ఈ దివ్యసంస్థ శతవార్షికోత్సవ సమయాన, మా కళాశాలలో గౌరవిస్తున్నారా? నాటి నా అధ్యాపకులూ, గోపాలంగారి వంటి సతీర్థులూ వింటే చేయి అడ్డుపెట్టుకుని ఎంత నవ్వుకుంటారో!

“నమ్మలేదు తొలుత, అంత నయనమ్ములునులిమి విచ్చి” మళ్ళీ ़చదివాను మీ ఉత్తరం. ఉబ్బిపోయాను, ఇంతకన్న ఎవరికయినా గర్వకారణమూ గౌరవమూ ఉన్నాయా?

నాకు అత్యంత ప్రియములయిన విద్యాసంస్థలు మూడు. ఒకటి కూచి నరసింహం గారు Head Master గా ఉన్న పిఠాపురం హైస్కూలు. రెండు నా గురుదేవులు వేంకటరత్నంనాయుడు గారి కాకినాడ కళాశాల, మూడు వాటికి శిఖరం లాగున, రామావతారంగారితో ఇతర ఆచార్యులతో మన మహారాజా కాలేజీ.

అయినా రాలేకపోయేవాడినేమో! అసహాయుణ్ణి,అసలే బద్ధకస్తుణ్ణి కూడా జమీందారీ పద్ధతులు అలవాటు పడ్డవాడిని జమీందారీ ఆస్తి లేకుండా.

అంతేకాక, సన్మానాలు అంటే నాకు అంతగా కిట్టవు. బిరుదులూ సన్మానాలూ మోయలేని బలహీనుణ్ణి. మరిన్నీ పదిమందిలో కూర్చోబెట్టి, పొగిడేస్తుంటే, మొగం ఎలాగ పెట్టాలో, దానిమీద ఎట్టి మందహాసం పొదిగి వుంచాలో, ఎట్టి తీయని వినయం చూపింఛాలో, ఆ pose  ఎంతసేపు అలాగ నిలిపి ఉంచాలో, ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా తెలియదు. అయితే, దొంగను కాను. పొగుడుతుంటే లోపలలోపల నాకూ చక్కిలిగింతలు పెట్టినట్లే ఉంటుంది. అయినా, కీర్తికయినా, డబ్బుకయినా, పదవి కయినా ఒక హద్దూ పద్దూ ఉండడం మంచిదేమో!”అగ్గలమగు తృష్ణ ఎవ్వనికి, గాఢ దరిద్రుడు వాడు”, “సతుభవతు దరిద్రో యస్య తృష్ణా విశాలా” అన్నాడు కదా భర్తృహరి. సన్మానాల కోసం దండలకోసం, అదే పనిగా ఒంటె లాగున మెడ చాపి ఉంచడం ఇబ్బందండీ! అవే వెతుక్కుని వస్తే, అంత ఫరవాలేదు. ఎందుకు రావు? కవికుల గురువు చెప్పినట్లు రత్నం వెతుక్కుంటూ పోనక్కరలేదు, దానినే వెతుక్కుంటూ వస్తారు అందరూ.

నా కాలేజీ శతవార్షికోత్సవంలో గౌరవిస్తామని ఆహ్వానించడం అలాగ ఉండగా, ఆ సన్మాన సభకు శ్రీ రాజా వారధ్యక్షులుగా ఉంటారన్నారు. మరీ ఆనందమూ, గర్వమూ పడ్డాను. నా తండ్రి తాతలనాటి గజపతుల వంశము వారనే గాక,  గొప్ప సంస్కారులనీ, విద్యావంతులనీ, ఊరికే విధిలేక గాక, ఉత్సాహంతో కాలంతో నడిచివస్తూ ముందంజ వేస్తూ, ప్రజాస్వామ్య ప్రభావాన్ని ఏనాడో చిరునవ్వుతో స్వీకరించిన విజ్ఞులనీ, రాగల, వచ్చిపడ్డ, యుగంలో ప్రతీ మానవుడూ మకుట ధారే ‘We are all kings in the kingdom of the king’  అన్న పరమార్ధం ముందే ముందే తెలుసుకున్న ఉదాత్తులనీ నాకు తెలుసు. ‘ బలే నాభాగ్యం ‘  అని వచ్చేశాను. మళ్ళా విజయనగరం చూస్తాను. వీలైతే వీథి వీథీ తిరిగి చూస్తాను. మళ్ళా నా కాలేజీ చూస్తాను.

అన్నట్లు విజయనగరం సంస్థానంతో మా తాతలకుగల ఆవంత సంబంధం ఏదో చెప్పనా? మా పూర్వులలో ఒకరు రామశాస్త్రి గారు ఘన మహీపతి జగపతి గజపతీంద్రవర, సభాస్థాన పాండిత్య పద నిరూఢి భాసురుడు, ఆయన ఉడ్డోలుడైన పండితుడూ, కవిన్నీ. ఆయన కాశీ నుంచి మా ఊరు తిరిగివస్తూ ఇక్కడ ఆగి, విజయరామ గజపతుల దర్శనం చేసి, కొన్ని పద్యాలు చెప్పారు, శ్రీ కాకుళం నవాబు కాబోలు నూరుద్దీన్‌ హుసేన్‌ ఖాన్‌ తో యుద్ధం చేసి అతనిని ఆ విజయరామ గజపతి హతమార్చారు, వీరు ఏనాటి విజయరామగజపతులో గాని?

చ.     భువినిది అద్భుతం బొకటి, భూరికృపాపరిపూర్ణపూసపా
టి విజయరామ భూరమణ!ఠీవిని నీ కరవాల ధారచే
అవయవ హానియున్‌ కువల యాహిత భేదము లేక మత్స్య భూ
మి విభుడు సాంగుడై చనియె మీదికి దేవ పురాధిగామియై

“మహి, నానంద నృపాలు శ్రీ విజయరామస్వామి వాల్‌సోకి నూర్ద్రిహుసేన్‌ఖానుని మస్తికం బసిమొనన్‌ రెండయ్యె, రెండయ్యె భవ్య హరిద్ఘోటక మండలం బపుడు, రంభాకంచుక గ్రంథియున్‌ రహి రెండయ్యె” అంటారు రామశాస్త్రి గారు.

అప్పుడు

చ.     అతనికి, పూసపాటి కులజాగ్రణియున్‌ కవితారసఙ్ఞుడ్‌ు
ప్రతత యశుండునౌ, విజయరామ నృపాలవరుండు, గౌరవాం
చిత మతి రాజధానిదరి సీమ నొసంగెను సర్వ సస్య శా
శ్వత ఫలసారమౌ వెలగవాడ సమాఖ్య మహాగ్రహారమున్‌

విద్య, కవిత్వం తో పాటు మా దేవులపల్లి వారికి ఇంకొక శక్తి ఉంది ఆస్తి పోగొట్టుకోవడం, ఆ అగ్రహారం ఎప్పుడో పోగొట్టుకున్నాం.

ఇంకొక ఘట్టం

మావారు పిఠాపురాస్థాన పండిత కవులు. నాతండ్రి పెత్తండ్రులు గంగాధర రామారావు మహీపతుల ఆస్థానంలో ఉండే వారు ఆ రాజుగారు అన్నదమ్ముల వరసన పిలుస్తుండేవారు వీరిని. వారికి మొదట సంతానం లేక, వెంకటగిరి వంశంలో ఒకరిని దత్తత చేసుకున్నారు. తరవాత ఔరసపుత్రుడు కలిగాడు. అప్పుడు దత్తులకీ ఔరసులకీ దావాలు జరిగేయి. దత్తుని వైపు వారు చాలా బలవంతులు;వెంకటగిరి, బొబ్బిలి, జటప్రోలు వారు. గంగాధర రామారావు గారు పోతూ మైనరు రాజాను నా తండ్రులకు అప్పగించేరు. అప్పుడు అసహాయులైన నా తండ్రి పెత్తండ్రులు ఈ ఊరు వచ్చారు ఆనంద గజపతి మహారాజులుంగారి ఆలంబనం కోసం. ఆ రోజుల్లో వారి ఆంతరంగిక కార్యదర్శి గురజాడ శ్రీరామమూర్తి గారు ఆంధ్ర కవుల చరిత్ర వ్రాసినవారు. గురజాడ వారికీ మాకూ అన్నదమ్ముల వరస. శ్రీరామమూర్తి గారు మావారికి మహారాజ దర్శనం ఇప్పించారు. రాజసన్నిధిలో అడుగుపెట్టటడమేమిటి, వీరు ఏ కార్యం అర్ధించివచ్చారో కథ అంతా పద్యాలలో ప్రారంభించారు చాలా Dramatic  గా.

“నృపసుతుడర్భకుండు, జననీ జనకుల్‌ స్మరణీయులై ,రసా
ధ్యపు పనికూడె , దాయలమిత ద్రవిణుల్‌, భవనంబు బాసిపోన్‌
కపటము చేతురేమొ యని, కారణికాగ్రణి నిన్నె వేడగా
వ్యపగత ధైర్యవృత్తి నిటువచ్చితి మేమభయంబు కోరుచున్‌

ఇలాగ మొదలు పెట్టేసరికి “ఏ నృపసుతుడు? దాయలెవరు?” కుతూహలం కలుగుతుంది.

“ఆనంద ద్విపరాజ రాజకులచంద్రా సత్కృపాసాంద్ర! మా
క్ష్మానాధాత్మజు డస్వతంత్రు డుదయఙ్ఞానుండు యుష్మత్‌ సుహృ
త్సూనుం డర్భకు డార్యసమ్మత గుణస్తోమాంకుడున్‌ కావునన్‌
పౌనః పున్యవిమర్శనీయుడు సుమీ వాత్సల్య చిత్తంబుతోన్‌ ”

“గజశాబమెత్తుబడినన్‌
గజపతిగా కుద్ధరింపగలరే యితరుల్‌
నిజముగ, ఆనందశ్రీ
గజపతిరాజేంద్ర చంద్ర! కరుణాసాంద్రా!”

తరువాత ఆనంద గజపతి ప్రాభవసాహాయ్యం లభిస్తుంది.

నా పెద్దతండ్రి గారు పొడుం పీల్చేవారు. ఆ రోజున సభలోనే పొడుంకాయ తీస్తుంటే, నా తండ్రిగారు వారిస్తుంటే, మహారాజు కంట పడింది. పొడుం పీల్చడం పొగుడుతూ ఒకరినీ, గర్హిస్తూ ఒకరినీ పద్యం చెప్పమన్నారు. నా పెద్దతండ్రి గారికి బంగారుగొలుసు తొడిమతో పొడుంకాయ నిచ్చారు. నా తండ్రి గారికి కంకణాలు ఇచ్చారు. ఇక నా మొదటి పద్యం ఇక్కడే రామ తీర్థాల కొండ మీద చెప్పినట్లు ఙ్ఞాపకం. ఎందుకు ఉత్సాహంతో ఇక్కడకు వచ్చానో మీకు తెలియపరచడానికి ఎంతచెప్పానో చాలాసేపు. రాజులూ, మహారాజులూ అంటూ వ్రాసేను. నాకు పాత Feudal  విధానం పోవాలని గట్టి నమ్మకం. 50 ఏళ్ళ క్రితమే ఉంది. నా పిఠాపురం మహారాజును ప్రతిఘటించి వచ్చేసిన కథ ఇప్పుడు అప్రస్తుతం.

నేను చదువుకున్నవాడిని గాను, మేధావినీ కాను, పెద్ద విషయాలను గూర్చి ఎక్కువగా చెప్పలేను. కాని, ఈనాడు, ప్రతీ నిముషం నాలో నిండి నన్ను కలతపెట్టే ఆలోచనలు మాత్రం కొన్ని బైట పడేస్తాను. ఆప్తులూ, నా వాళ్ళూ అయిన మీ సన్నిధిని ఈమధ్య ప్రతీచోట ఇదే చెప్పుకుంటున్నాను.

నేను హృదయవాదిని, వఠ్ఠి హృదయవాదిని. నాకు కవిత్వం ప్రాణం, సంగీతం మరీనీ. అన్నిటి కన్నా నాకు కావల్సింది మనిషి.

మతాలూ, వాటి రహస్యాలూ, బ్రహ్మ జిఙ్ఞాసా, యోగం, పరోక్షం, అపరోక్షమూ, పరతత్వం వంటివేవీ నాకు తెలియవు. వట్టి సున్నాను. మనిషితో ఎడతెగని సావాసం, ప్రేమిస్తే ఆనందం, దవ్వు అయితే బాధతో కొట్టుకుపోవడం, ఇది నాకు తెలుసు. ఇదీ నా మతం నాకిక వేరే మతం లేదు, కులం లేదు, రాజకీయ పక్షం  లేదు, నేను మనిషిని. ” I am not a politician, and my other habits are good ” అలాగే సాహిత్యరూపాలూ, సిద్ధాంతాలూ, ధ్వనీ, వక్రోక్తీ, రసం, వగైరా అంటూ పెద్దలంటారే ఏమీ నాకు తెలియవు. కవిత్వం తెలుసుకుని అనుభవించడం తెలుసు.

ఈమధ్య నేను అదోలాగ తయారయాను. మూగతనం, ఇల్లు కదలకపోవడం! నా ఇంటి వాకిట్లో కూర్చుంటాను. చెట్ల ఆకుల గుసగుసలలో నిండిన చీకట్లో, కదలకుండా! మందిర ద్వారం ముందే తెరిచి ఉంచేస్తాను.

“నాకన్నాముందే చీకట్లో
నా మనసు
నీకోసం నిలుచుంది చీకటిలో”

అన్నట్లు ఎవరైనా అతిథి కోసం అనుకోని అతిథి కోసం! మరి ఇంకొక్కప్పుడు, ఎవరూ రాకపోతే! చిగురాకు చివర మం़చుబిందువు లాగ చలించి చలించి రాలిపోతానేమో అని భయపడతాను. అప్పుడు ఎత్తయిన కొండల నడిమిలోయలో ఒత్తుగా పెరిగిపోయిన పచ్చిక లాగున, ఎవ్వరికీ కనపడవు గదా నా అనురాగాలూ, నా భావాలూ అని గిలగిలలాడతాను. అప్పుడేం చెయ్యను? ఆంగ్లకవి అన్నట్లు, కిటికీలోనుంచి ఒక పిచ్చిక వచ్చి వాలినా దానితో మనసులో సావాసం కట్టబోతాను, ” Even if a sparrow come before my window, I take part in its existence and pick about the gravel ”

అట్టి గొప్ప ముహూర్తాలలో అచేతనాలు అనుకునే వస్తువులని కూడా పలకరించి జట్టు కట్టవచ్చు.

రవీంద్రుని తుదిరోజులలో పక్క మీద నుండి లేవలేనప్పుడు వ్రాస్తాడూ, “తాను నిత్యమూ కూర్చునే కుర్చీ పెంపుడు కుక్క లాగున తనవైపు :జాలిగా చూస్తుంది” అని.

ఒకసారి హైదరాబాదు నుంచి మదరాసు వెళ్తున్నాను కారులో. దారిలో నాగార్జున సాగర్‌ ప్రాంతాననో, దేవరకొండ ప్రాంతాననో ఒక ఎ్తౖతెన కొండ ఉంది ధుమధుమ లాడుతూ, కనుబొమలు ముడుచుకుని తిక్కగా కొందరు మనుష్యుల లాగున !  దానిపైకి ఒక మేఘం వచ్చి వాలింది ఆప్యాయంగా. అశ్రు భరమైనది. కొద్ది జల్లులు పడ్డాయి. కొండ కరగలేదు. ధుమధుమలాడుతునే ఉంది. మేఘం పాపం తెల్లబోయి వెళ్ళిపోయింది. నాకు :జాలి వేసింది. ఊరికే నాలుగు పంక్తులు గిలికాను కూడా, ఏమో!

గిరిపయి వాలిన మేఘం
జరిగిందా జరిగిందా!
జరగలేక బరువుగ అటె
ఒరిగిందా ఒరిగిందా
కురిసి కురిసి వాన़జల్లు
తరిగిందా తరిగిందా
కరగని శిల చూచి మనసు
విరిగిందా విరిగిందా
వెలవెలనై మబ్బు దవుల
కరిగిందా అరిగిందా
మలచెక్కిట నీటిచార
చెరిగిందా మిగిలుందా

రాత్రివేళ మరీనీ! రాత్రి తల్లి! రాత్రి అమ్మ ఒడి! పగలు సృష్టిలో వస్తువులన్నీ దేనిదారిని అది తొందరగా, పనిమీద పోతున్నట్లు ఒక దాని నొకటి పలకరించడానికి తీరిక లేనట్లూ ఉంటాయి. రాత్రి ఒకే ఒక విశ్రాంతశయ్య మీద ఒకే ఒక నిశ్చలాంకం మీద, ఒకదాని ఒళ్ళు ఒకదానికి తగులుతుంటే, పిల్లల్లాగ నమ్మకంగా పవ్వళిస్తున్నట్లుంటాయి.

కొండ, చెట్టు, ఇల్లూ, కుర్చీ, మనిషీ, అన్నీ అన్నీని !  రాత్రి ద్రష్ట అయినవానికి సృష్టి లోని ఏకత్వం, బాంధవ్యం ఎక్కువ బాగా స్ఫురిస్తుందేమో!

రాత్రి వంటిది మౌనం. కనుక మౌనం లోనూ అంతే. అయితే నాది మౌనం కాదు, మూగతనం. కనుక ఈ అనుభవం ఎక్కువసేపు ఉండదు.

అబ్బ! ఇంతలో ఒంటరితనం లోపల లోపల గుబులు గుబులు మంటుంది. ఈదారంట ఇందరు నడుస్తున్నారు ఒక్కరయినా లోనికి రారే! పోనీ స్ఫుటంగా అడుగు చిన్నెలయినా నాకోసం వదలరే అని ఏడుపు వస్తుంది. ఇలాగ తపించుకుపోతాను. సావాసం కోసం ఈ తపన; ప్రేమ కోసం ఈ ఏడుపు! ఇదే నా మతం.

నాలో ఒక బాటసారి తనం ఉందేమో! Gypsy తనం! ఒక నిమిషం ఒక చోట ఉండాలని ఉండదు. ఒక ఇంగ్లీషు కవి అన్నట్లు Tramp లాగున,
” I hang about the streets all day!
at night I hang about ”

ఇది ఊరికే తిరగడానికి కాదు. మనిషి కోసం సావాసం కోసం. అలాగ తిరుగుతూ ఎదురయ్యే ప్రతిమనిషినీ కనుసైగతో ఆపి, చిరునవ్వుతో చేయి గట్టిగా ఒకసారి పట్టుకుని, మళ్ళీ నడిచిపోవాలని ఉంటుంది. ఒక పద్యం వినిపిస్తాను. First Republic day  నాటి అఖిల భారత కవి సమ్మేళన లో తెలుగు కవిగా నేనన్నది.
” చిననాటి భావవల్లిని పూచినది, వాడనిది
వాసనలు వీడనిది ఒకండు కోరిక
నాల్గుదిక్కుల భూభువనమంత
లవలేశమును వదలకయె తిరిగి
ప్రతిగేహదేహళిపదమాగి ప్రతి హృదయద్వార
తోరణమట్టె త్రోసి
లోనికిజొచ్చి నాలోని స్నేహక్షీర
మొక్కింత ఒక్కింత ఒలకబోసి
అనుగు సోదర మరలి రానాయటంచు
సెలవడిగి సాగిపోయెడు చిరపథికుడ
కావలయునంచు ఆశ ఆకాశమంత
పటిమక్షుద్రవిహంగ మిప్పటికినంతె”

సావాసం కోసం ఈ తపన! ప్రేమకోసం ఈ ఏడుపు! మనిషి కోసం ఈ తపన Suffering  వల్ల వస్తుందేమో! బాధాజీవికి కంఠంలో గరళం ఉంటుంది. తలపై చంద్రమకుటం ఉంటుంది. బాధ ఎక్కువైనకొద్దీ స్వార్ధం అహంకారం తగ్గుతూ వస్తాయి, ఇది శాస్త్ర సత్యం.

“తన కంఠమున దాచి హాలాహలం
తలనుంచి కురిపించి గంగాజలం
మనిషి శివుడు అవడమే” అప్పుడు సాధ్యమవుతుంది. నాకు చాలా బాధాభాగ్యమూ వేదనావరమూ లభించాయి. అది నాకు కొంత ఔన్నత్యమూ గాఢతా ఇచ్చిందేమో!

కొంత ముదిరినట్లున్నాను కాబోలు లేక ఊరికే ముదిసేనో! కాని నేను నిజానికి ముదిమిని దగ్గరకు రానీయను సుమండీ! వార్ధక్యం నిస్పృహతో వస్తుంది. నాకీ లోకమూ, సంసారమూ, మానవుడూ, జీవితమూ మహా ఇష్టం. ఆస్తికునికీ, మానవునిలో అచంచల విశ్వాసం ఉన్నవానికీ, ప్రేమికునికీ, నిస్పృహ చెందడానికి అధికారం లేదు. మనమే తెలీక, బుద్ధిలేక, చేజేతులా ఈలోకాన్ని ధ్వంసం చేస్తున్నాం. ఇది వినండి!

తేలు కుడుతుంది తోడేలు హింసిస్తుంది
తీతు వెవ్వరినయిన తిడుతుంది
లోన అంటుడు పురుగు ప్రాణం హరిస్తుంది
పైన ఆటంబాంబు పడుతుంది
ఎందుకీగతి జగతికీలాగు పడుతుంది
ఎందుకు శ్మశానమై చెడుతుంది?
క్షుద్రతిత్తిరి, కుటిలవృశ్చిక, కౄరవృక
రుద్రమారణయంత్ర రుగ్మతలు తానైన
మనిషికీ పెడబుద్ధి పడుతుంది
మనిషిలోనే పెద్ద మడతుంది
బోదెలో ప్రేమనే పాలు పొయ్యడు గాని
మోడు మందారాలు పెడుతుంది
అటుచాపి ఇటుచాపి అభయ హస్తాలల్లి
జగమంత పందిరిని కడుతుంది

ఈ ప్రేమ మనిషి మీదనే ఏమిటి? ఒక్కొక సుముహూర్తాన ఏ ప్రాణి మీదనయినా కలుగుతుంది కాదూ?

ఒక ఉదయం నేను నా ఇంట బయలుదేరాను. సమస్త సృష్టీ ఒకే ఒక ఆనందగీతం లాగున ఉంది. రోడ్డు పాడుతోంది. నా కారు పాడుతోంది. గాలీ, చెట్టూ, పిట్టా సర్వమూనూ! అప్పుడే ఉదయించిన ఉదయం వేళ కదా!! అప్పుడే ఒక కుక్క ఎటునుంచి వచ్చిందో, కులాసాగా తలా తోకా ఆడిస్తూ రోడ్డుకు అడ్డుగా నడిచి కారు కింద పడి ఒక్క అరుపు అరిచి ़చచ్చిపోయింది. నాకారు చక్రానికి రక్తం అంటుకుపోయింది. కారు ఆపలేదు డ్రైవరు. నా కుమార్తె మీద అలాగే నిష్ఠుర వేగంతో వెనక్కి తిరిగిచూడని రథ చక్రం వెళ్ళిపోయింది.

“ఓ ప్రభూ!నీ రథమ్ము దీక్షాప్రణీత విధురవేగమ్ము; పరువులు పెట్టుచుండె” దానికింద పడిపోయిన వారెందరో దినాంతమందు నీ రథ చక్రాలు కడిగేటప్పుడు ఏ రక్తం ఎవరిదో గుర్తు పట్టగలవా అంటాడు విశ్వనాధ.

అబ్బ! అయినా బాధ ఎంత గొప్పది! అందరికీ వేదన రావాలి. అందరికీ ప్రేమ కావాలి.

పారశీక కవి సాథీ అన్నట్లు మనం అందరం ఒక్క ఆదంలో నుంచే వచ్చాం. మానవ లోకం అంతా కలిపి ఒక శరీరం. ఈ లోకంలో ఏ మానవుడు చనిపోయినా నువ్వూ నేనూ చనిపోతున్నాం. ఏ మానవుడు పుట్టినా నువ్వూ నేనూ మళ్ళీ పుడుతున్నాం. వేదనా ప్రేమా కలిస్తేనే కరుణ. కరుణ సృష్టిస్తుంది. కరుణ శైథిల్యంలోనుంచి చైతన్యాన్ని పుట్టిస్తుంది. కరుణ బోధివృక్షం, కరుణ సిలువ, కరుణ సబర్మతి. ఊరికే బాధ చాలదు. కన్నీరు రావాలి. మేఘాలు పట్టవచ్చు. వర్షం కురియకపోవచ్చు. కన్నీటి భాగ్యం మానవునికే ఉంది.

మానవుడు ఎంత ధీరుడు ఎట్టి వీరుడు! కష్టాలూ సుఖాలూ, రాగాలూ ద్వేషాలూ, పతనాభ్యుదయాలూ, జీవనమృత్యువులూ, రోగాలూ రొష్టులూ, హత్యలూ ఆలింగనాలూ, విప్లవాలూ వేడుకలూ, ఎలాగ తన మహాప్రస్థానం సాగిస్తున్నాడో! మానవునికి జీవితమే గమ్యస్థానం! అదే మహాప్రస్థానం. మానవుడు దేవత. మానవుని స్వేద బిందువు రాలినచోట, అశృకణం  ఒలికినచోట అక్కడే దేవళాలు మొలుస్తాయి.

అటువంటి మనుషుల మధ్య బతకడమే నేను కోరుకునే వరం. నన్ను గురించి చెప్పుకుందామని, నాలో పేరుకుపోయిన మనిషి మీది ప్రీతిని గురించి చెప్పుకుంటూ  వెళ్ళిపోయాను. ఇంతమంది మనుషుల మధ్య, ఇంకెంతోమంది ఉత్తముల్ని తీర్చిదిద్దిన, సరస్వతీ నిలయమైన నా తల్లి, ఈ కళాశాల నూరేళ్ళ పుట్టిన నాటి పండగ వేళ, ఇంతకంటే, చెప్పడానికి అర్హమైన విషయం ఏముంటుంది గనక!

ఇక చెప్పలేను మాటలురాక, మాటాడే వీలులేక, ఇదీ అని చెప్పడానికి సాధ్యం కాని మమతతో బరువెక్కి పోయాను. ఎంతపాటి చల్లటి చిఱుగాలి సోకినా జలజలా వర్షించే అశృ భరాభ్రంలా ఉంది నా మనస్సు.

నన్నిక్కడికి రావించి ఈ విధంగా అనురాగం చూపిన మీ అందరికీ నేను కృతఙ్ఞుణ్ణి. ఈ రాకవల్ల నా ఆయుస్సు మరీ 10 ఏళ్ళు అయినా పెరిగింది. నన్నూ నాకవితనూ గూర్చి మాట్లాడేరు. ఏలాగ వానికి జవాబుగా, వెంటనే ఇప్పుడు చెప్పగలను? సెలవిప్పించండి.
--------------------------------------------------------
రచన: దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి, 
ఈమాట సౌజన్యంతో

Sunday, April 7, 2019

గిరిపుత్రిక


గిరిపుత్రిక




సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి.....................

మబ్బుల కిరీటం
తలతురిమిన జాబిల్లి
వెన్నెల చారలు ముంగురులు
చుక్కలు జడకుప్పెలు
కలువకొలనులు కన్నులు
శరదృతువన్నెలు మోమెఱపులు

తను
కవి కలల నాయిక
కారువు కరముల సాలభంజిక

చీకటి చీర
కొండచరియ అంచు
రాలుటాకులు కలంకారీ అద్దకాలు
కదిలే నీడలు ఎగిరేపైట
ఊగే ఊడలు చెరిగే కుచ్చిళ్ళు
లోయల ఒడి నిండుగ వనాలు జీవచరాలు

తను
కనిపెంచే మాతృక
కరుణించే దేవిక

లాలిస్తూ పరిపాలిస్తూ
కిలి కిలకిలలు రాగాన పెడుతూ
మంజాళి మంజరీ మంజీరాలు చుడుతూ
రోచన సహజ విశ్వప్రేమను పెంచుతూ పంచుతూ

నేల వేదిక
ఒద్దికగా కూర్చుంది
హరితరూపసి గిరిపుత్రిక
------------------------------------------------
రచన: సాంఘిక, 
ఈమాట సౌజన్యంతో

Friday, April 5, 2019

జ్ఞాపకాల వాసన


జ్ఞాపకాల వాసన




సాహితీమిత్రులారా!

నా దగ్గర చాలా జ్ఞాపకాలు వున్నాయి. గుట్టలు గుట్టలుగా ఒకదాని మీద ఒకటి పడి! కొన్ని జేబులో కొన్ని పర్సులో… కాస్త పాతబడ్డవైతే అరమరలో, ఇంకా పురాతనమైనవి ఎక్కడో నూతిలోనో, పాత ఉత్తరాల కట్టలోనే, చాలాకాలంగా చూడని ఫోటో ఆల్బంలోనో… ఎక్కడో వుంటాయి. హాలులో, బెడ్రూములో, వంటింట్లో ఎక్కడ పడితే అక్కడ!

కొన్ని జ్ఞాపకాలు రకరకాల వస్తువులకు అతుక్కోని వుంటాయి. గరిటెకు కొన్ని, రేజర్‌కి కొన్ని, వాడకుండా వదిలేసిన కాండోమ్‌కి కొన్ని. కొన్నేమో గాల్లోనే వేలాడుతుంటాయి. ఇంక బాత్రూములో అయితే ఎన్నుంటాయో చెప్పలేను. అవన్నీ కడిగేసుకున్నవని నేననుకుంటాను. అవేమో తూముల్లోంచి బయటికి పోకుండా అక్కడే పడుంటాయి. తడిసిపోయి నానుతూ… చిరాకేస్తుంది వీటన్నింటిని చూస్తే!

ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా ఒక జ్ఞాపకాన్ని తీసుకోని చూద్దామనుకుంటానా, దానికి అతుక్కోని ఇంకోటి వస్తుంది. దాన్ని అందుకుంటే ఇంకోటి అతుక్కుంటుంది. అలా అలా అక్కడ వున్నవన్నీ ఒకదానికి ఒకటి అతుక్కోని కొండచిలవలా నన్ను చుట్టుకుంటాయి. వీటిని కలిపి వుంచిన దారాన్ని తెంచి పడేద్దామని అనిపిస్తుంటుంది ఒకోసారి. కానీ ఆ దారం ఎక్కడుందో తెలిసి చావదు!

ఇలా కాదని ఒకసారి వాటన్నింటిని సర్ది పద్దతిగా అమర్చుకుందామనుకున్నాను. మంచి జ్ఞాపకాలకు చక్కగా అట్టలేసి అందంగా తయారు చేయాలి. పనికిరాని పిచ్చి జ్ఞాపకాలని వీలైతే తగలబెట్టేయాలి. కనీసం కనపడకుండా ఎక్కడన్నా దాచేయాలి. ఇదీ ప్రణాళిక. అనుకున్నట్టే ఓ టేబుల్ సొరుగులో వున్న జ్ఞాపకాలన్నీ సర్దాను. మంచివి చక్కగా షోకేసులో అమర్చిపెట్టాను. బాలేనివి ఎక్కడన్నా పడేద్దామని చూస్తున్నా. చెత్తబుట్టలో వేద్దామంటే అప్పటికే అక్కడ చాలా జ్ఞాపకాలు పేరుకుపోయి వున్నాయి. పరుపు ఎత్తి దానికింద పెడదామంటే అక్కడ కుళ్ళిపోయిన జ్ఞాపకాలు పేరుకుపోయున్నాయి. వీటిని ఏం చేద్దాంరా భగవంతుడా అని ఆలోచిస్తూ నిలబడ్డాను.

అదిగో, అప్పుడే వచ్చాడు వాడు!

వాడు వచ్చాడంటే నాకు వణుకు పుడుతుంది. ఎప్పుడూ అంతే!

ఒకసారి ఇలాగే వచ్చాడు. ఆ రోజు నేను లాయరయ్యాను. నల్లకోటు అదీ వేసుకోని సెక్షన్ ఫోర్ట్వంటీ, త్రీనాట్టూ, టూనాట్ఫోరూ గట్రా నెంబర్లన్నీ దొర్లించుకుంటూ వాటి చుట్టూ తిరుగుతున్నాను. వాడు అప్పుడు వస్తాడని నాకు తెలుసు. వచ్చి రాగానే వాణ్ణి ముద్దాయి బోనులోకి ఎక్కించేసి యువరానర్! అని గట్టిగా వాదించేయాలని నా ప్లాన్. వాడు వచ్చాడు. నల్లకోటు, తెల్ల చొక్కా వేసుకోని వున్నాడు.

“ఇదేంట్రా? నువ్వూ లాయరేనా?” అన్నా.

“ఒకసారి చూసుకో,” అని కోటు చాటు నుంచి పెద్ద అద్దం తీశాడు. వాడి దగ్గర ఎప్పుడూ ఒక అద్దం వుంటుందని నాకు తెలుసు కాబట్టి నేను ఆశ్చర్యపోలేదు. కానీ అద్దంలో కనపడ్డ నన్ను చూసి ఆశ్చర్యపోయా. నేను ముద్దాయి గెటప్‌లో వున్నాను. చేతులకి బేడీలూ అవీ. ఎంత ప్రయత్నించినా నాకు ఒక్క సెక్షన్ కూడా గుర్తు రాలేదు. ముఖానికి మసి పూసినట్లు నల్లగా వుంది.

వాడు గట్టిగా, “యువరానర్!” అన్నాడు.

“రేయ్ వద్దురా… నన్ను వదిలేయ్,” అన్నాను. వాడు ఒప్పుకోలేదు. వాదించాలన్నాడు.

“యువరానర్, నన్ను కాపాడండీ,” అన్నాను జడ్జి వైపు తిరిగి. చూస్తే వాడే జడ్జి.

ఇంకేం చేసేది? శిక్షవేసి పోయాడు. ఆ కోర్టు కాగితం కూడా ఎక్కడో జ్ఞాపకాల మధ్యలో కుక్కేశాను.

వెధవ, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు.

“ఏం చేస్తున్నావ్,” అన్నాడు.

“ఏం లేదే!” అన్నా చేతులు వెనక్కి పెట్టుకోని. వాడు నా వెనకే వున్నాడన్న సంగతి గమనించుకోలేదు. ఓ కట్ట జ్ఞాపకాలను తీసుకున్నాడు. అవన్నీ పారేద్దామనుకున్నవే. ఓ మూడు నా ముఖం మీద కొట్టాడు. అవి నా నుదుటిలో నుంచి దూరి, మెదడులో చేరి పురుగులుగా మారిపోయాయి. లోపలెక్కడో తొలుస్తున్న బాధ. అక్కడితో ఆగలేదు వాడు! మిగిలినవన్నీ ఇల్లంతా చల్లేసి పోయాడు.

వాడు వెళ్ళిపోయిన తరువాత కూడా ఇల్లంతా ఒకటే జ్ఞాపకాల వాసన. ఆ వాసనతో పడలేక ఎక్కడో మూల పడిపోయిన నాలుగు మంచి మంచి జ్ఞాపకాలను ఏరుకోని అక్కడ్నుంచి బయటపడ్డాను. దగ్గర్లో ఏదో పార్క్ కనపడితే అక్కడ చేరి, తెచ్చుకున్న మంచి జ్ఞాపకాలను లాన్ మీద మెత్తగా వుండేట్టు పరుచుకోని దాని మీద పడుకున్నాను. నేను గమనించనే లేదు. నాలుగు మంచి జ్ఞాపకాలతో పాటు, నలభై చెత్త జ్ఞాపకాలు కూడా అతుక్కోని వచ్చినై. అవన్నీ కలిసి ఒక దుప్పటిలా మారి నా మీద పరుచుకున్నాయి. మళ్ళీ ఆ దరిద్రపుగొట్టు వాసన. వాడు వచ్చినట్లున్నాడు.

“మనం ప్రేమికులం,” అన్నాడు.

“నేను ప్రియుణ్ణా?” అడిగా.

“అవును. నేను ప్రేయసి,” చెప్పాడు.

“ఐ లవ్యూ,” అన్నాను.

“అంటే?”

“అదే ప్రేమికులం అన్నావు కదా? అందుకే ప్రేమిస్తున్నానని చెప్పాను.”

“ఏదీ ప్రేమించు.”

“ఎనీథింగ్ ఫర్యూ డార్లింగ్.”

“మాల్‌లో షాపింగ్.”

“ఓస్ అంతేనా?”

“బంగారం, ఒక ఫ్లాట్, ఒక బిజినెస్.”

“తీసుకో బుజ్జీ నీకన్నానా? మరి నాక్కావల్సింది ఇస్తావా?” అన్నా లస్టీగా.

“మరి నాకో?” వెనుక నుంచి వినపడింది. తిరిగి చూస్తే వాడే. “ఇప్పుడు పెళ్ళాన్ని,” అన్నాడు.

“ఛీ ఎదవన్నర ఎదవా. ఏబ్రాసి నా కొడకా. సుఖంగా వుండనీవారా నన్ను!” బట్టలన్నీ విప్పేశా. ఒక్కో బట్ట విప్పుతుంటే ఒక్కో కొత్త బూతుమాట తన్నుకొచ్చింది. నా పెళ్ళాంగాడిని చావగొట్టా.

వాడు నవ్వేసి “పోయొస్తా,” అన్నాడు.

“మళ్ళీరాకురరేయ్, చెత్తనాయలా!” అన్నా గట్టిగా. పార్కులో వున్నవాళ్ళంతా నన్నే చూస్తున్నారు. మళ్ళీ బట్టలేసుకోని బయల్దేరా.

వాణ్ణి తప్పించుకోవాలంటే ఊరు దాటిపోడమే మార్గమని ఓ బస్సెక్కా. వేరే వూర్లో బస్సు దిగగానే ఆటోవాడు తగులుకున్నాడు. వాడే. ఈ సారి ఆటోవాడయ్యాడు. కనపడగానే నమస్తే చెప్పి, ప్రయాణం ఎలా జరిగింది సార్, అని అడగాలా? అదేం లేదు.

“పక్క వీధికేగా? మూడొందలు ఇవ్వండి,” అన్నాడు.

“నీకు బుద్ధుందా? పక్క వీధికి మూడొందలు అడుగుతున్నావ్? మీటరెంతవుతుందో తెలుసా?” గట్టిగా అరిచా. వాడు ఆటో దిగాడు. ఖాకీ చొక్కా శరీరాలు మారింది.

“పోనీ లాడ్జిలో దిగుతారా? పది రూపాయిలివ్వండి చాలు. ఏ ప్రాబ్లం రాని లాడ్జి వుంది,” అన్నాను నేను.

“ఏమే వస్తావా?” అన్నాడు.

మళ్ళీ మారింది. ఇప్పుడు నేను లం… తప్పు తప్పు… వేశ్య… ఊహూ కాదు కాదు, కాల్ గర్ల్.

లాడ్జికి వెళ్ళాం. వాడు బట్టలు విప్పి నా మీదకి దూకాలా? ఏం లేదు. నేనే విప్పుకున్నా. నేను విటుడు, వాడు సెక్స్ వర్కర్. కాదు కాదు, లం…!

“ఏమే రోజుకి ఎంత మంది వస్తారు?” దాని దీన చరిత్ర తెలుసుకోని జాలి పడిపోవాలని నాకు ఆరాటం. మూడు వేళ్ళు చూపించాడు వాడు. నాకు నచ్చలా. నాకు నచ్చలేదన్న సంగతి వాడికి తెలిసింది. మిగిలిన వేళ్ళు కూడా తెరిచాడు. ఇంకో చేతిని కూడా తెరిచి చూపించాడు.

“అయ్యో పాపం,” అన్నాను.

“అసలెందుకు దిగావు ఈ రొంపిలోకి?” అడిగాను. అది ఏదో దీనగాధ చెప్తుందని ఎదురు చూశా.

“నా మొగుడే నన్ను తార్చాడు. ఇప్పటికీ వస్తాడు. వాడికి ఫ్రీ. మిగిలిన వాళ్ళ ఇచ్చినదాంట్లో వాడికి కమిషన్. ఇద్దరు పిల్లలు. స్కూల్‌కి వెళుతున్నారు. వాళ్ళకోసమే నేను పక్కలెక్కుతున్నాను,” ఏడుస్తూ చెప్పాడు వాడు.

“అయ్యయ్యయ్యో… లోకం ఎంత దుర్మార్గంగా మారిపోయింది. సరే. నువ్వు నా పక్కలో పడుకోకపోయినా సరే ఇదిగో వెయ్యి రూపాయలు. ఉంచుకో,” అనేసి నేను బయటికి నడిచాను. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నట్లు వినిపిస్తోంది.

నేను కూడా ఏడుస్తున్నాను. కాదు నేనే ఏడుస్తున్నాను. ఒక్కసారి నా దొంగ ఏడుపు ఆపి గట్టిగా నవ్వుకున్నాను.

“పిచ్చి నా బకరా! పడక మీద ముండమాటలు విని వెయ్యి రూపాయిలిచ్చాడు,” అన్నాను గట్టిగానే. డబ్బులు జాకెట్లో తోసుకున్నాను. వాడు విటుడు. బయటికెళ్ళిపోయాడు. నేను మంచం మీద వేశ్యను.

థూ! ఈడి బతుకు చెడ!

లేచి అక్కడ్నుంచి పారిపోయాను. ఒకటే పరుగు. వాడు దొరకలేదు. చేతిలో చూసుకుంటే మా వూరికి టికెట్. తప్పక రైలెక్కా.

నా ఎదురుగా ఒక ఆంటీ కూర్చోని వుంది. జాగ్రత్తగా గమనించి చూశా. అనుమానం మొదలైంది. వాడే అయ్యుంటాడని అనుకున్నా. ఆమె చదువుతున్న పుస్తకం దించి నన్ను చూసి చిలిపిగా నవ్వింది.

రేయ్, నాకు తెలియదనుకున్నావా. ఈ సారి చచ్చినా నీ మాయలో పడను అనుకున్నా. నేను నవ్వలేదు. ఆంటీ ఏమనుకుందో మళ్ళీ పుస్తకంలో తల దూర్చేసింది. నేనే గెలిచా. వాడు ఓడిపోయాడు. రైలు పొందుగుల స్టేషన్ దాటి ముందుకు పోతోంది.

ఇంతలో ఏదో జ్ఞాపకాల వాసన. ఉడకబెట్టిన శెనక్కాయల వాసన. శెనక్కాయలమ్మే నడివయసామె వచ్చింది. బుట్ట దించి నా ముందు పెట్టింది. చూద్దును కదా బుట్టనిండా నా జ్ఞాపకాలే! వాడు శనక్కాయల రూపంలో వచ్చాడా? కాదు, కాదు! శెనక్కాయలమ్మేదానిలాగా… అవును వాడే. ఆమె చీర గుండెల మీద నుంచి జారిపోయి ఇంకేవో కొత్త జ్ఞాపకాలను నా ముందు పరిచింది. వాడు నా చొక్కా పట్టుకున్నాడు.

“ఏరా ఎలా కనిపిస్తున్నారా నీకు?” అంటూ నా దవడలు వాచిపోయేలా కొట్టాడు.

“నేనేం చేశాను?” అన్నాను అమాయకంగా.

“ఏమైందమ్మా?” అంది ఎదురుగా కూర్చోనున్న ఆంటీ.

“వీడు నా నడుం మీద చెయ్యేసి గిల్లాడు. ఎదవ నా కొడుకు,” అంది మరో రెండు దెబ్బలు కొట్టి.

నేను ఆమె నడుం మీద చెయ్యేశానా? అబద్ధం అంతా అబద్ధం అందామనుకున్నా. చుట్టూ వున్న జనం నన్ను పురుగుని చూసినట్లు చూస్తున్నారు. చూస్తున్నారా? లేకపోతే నేనే అలా అనుకున్నానా? అంతా పిచ్చి. ఎవడికి పట్టింది? అందరూ చిలిపిగా నవ్వుతున్నారు. ఎవరో పైన బెర్తులో గట్టిగానే నవ్వారు. తల ఎత్తి చూశా. వాడే. నా ఎదురుగా వున్న ఆంటీ పైన బెర్తులో పడుకోని నవ్వుతున్నాడు. నవ్వేటప్పుడు వాడి చూపంతా ఆంటీ గుండెల మీదే వుందన్న సంగతి నేను మాత్రమే గమనించాను.

ఇంక అక్కడే వుంటే ప్రమాదమని అర్థం అవడంతో ట్రైన్లో నుంచి దూకేసి, ఎగురుకుంటూ సికింద్రాబాద్ చేరుకున్నాను. అక్కడ దిగగానే నేరుగా ఇంటికి పోయాను. ఇప్పుడు నాకు అర్జంటుగా ఆడది కావాలనిపించింది. పెళ్ళాం ఒకతి వుందిగా. ఇంట్లో నేను నా పెళ్ళాంతో వుంటే వాడు వస్తాడన్న భయం కూడా వుండదు. అదీ నమ్మకం. అదీ ఒప్పందం.

“రావే,” అన్నాను ఇంట్లోకి అడుగుపెడుతూనే.

“వద్దండీ,” అంది పెళ్ళాం.

“నీయమ్మ! రమ్మంటుంటే!” నేను చొక్కా విప్పాను.

“ఒంట్లో నలతగా వుందండీ.”

“దొంగ వేషాలెయ్యకే. దొంగముండా!” నేను బనీను విప్పాను.

“అయ్యో.. ఏమిటండీ ఈ పని!”

“నీ యమ్మని…” ప్యాంటు కూడా విప్పాను.

ఆ తరువాత… పదకొండు నిముషాల తరువాత వాడు నాపై నుంచి లేచాడు. నా ఒళ్ళంతా నొప్పులు. ఎక్కడెక్కడో చురుక్కుమంటోంది. గోళ్ళు దిగాయో, పళ్ళు దిగాయో. తొడల మీద జిగటగా రక్తం.

వాడు నవ్వాడు.

“నేను కదరా అక్కడుండాల్సింది!” అన్నాను నిస్సహాయంగా, కోపంగా, కసిగా.

వాడు మళ్ళీ నవ్వాడు.

“వస్తా,” అన్నాడు వెళ్ళిపోతూ.

“మళ్ళీ రావద్దురరేయ్, ముండనాయాలా!” అరిచా గట్టిగా. నొప్పితో స్పృహ గిలగిలా తన్నుకుంటూ వుండిపోయా.

వాడు వదిలిపెట్టిన పురుగులు ఇంకా మెదడు లోనే తిరుగుతున్నాయి. క్రమక్రమంగా అవి నా బుర్రను తొలవటం మొదలుపెట్టాయి. జ్ఞాపకాల పురుగులు. ఎలా వదిలించుకోవాలి? ఏం చేస్తే ఇవన్నీ చచ్చిపోతాయి? వాడు మళ్ళీ రాకుండా, ఇవన్నీ లేకుండా చెయ్యాలి.

నేను లేచాను. శరీరంలో నొప్పుల స్థానంలో ఎక్కడలేని బలం పుట్టుకొచ్చింది. ఇంట్లో వున్న జ్ఞాపకాలన్నీ సేకరించడం మొదలుపెట్టాను. చీపురుతో ఊడ్చాను, బూజు కర్రతో దులిపాను. గుట్టగుట్టలుగా జ్ఞాపకాలు పేరుకున్నాయి. కొన్నింటిని బలంగా కొడితేకానీ కదలేదు. కొన్ని తెగిపడ్డాయి. అలా తెగిపడ్డవాటి చివర్లలో రక్తం కనపడేకొద్దీ నాలో కసి ఇంకా పెరిగిపోతోంది. అన్నింటినీ ఒక చోట చేరి అగ్గిపుల్ల వెలిగించాను.

“వద్దురా… ప్లీజ్!” అన్నాడు వాడు.

“నాకు తెలుసురా నువ్వు వస్తావని. ఈ రోజు నీకు మూడింది,” అన్నాను, వెలిగించిన అగ్గిపుల్లని జ్ఞాపకాల మీద పెడుతూ.

భగ్గున అంటుకుంది. హాహాకారాలు. భగభగ మంట పైకి లేచింది. వళ్ళంతా చురచురలాడుతోంది. అబ్బా… ఇదేమిటి మంటలన్నీ నా మీద? తగలబడుతోంది నేనే. జ్ఞాపకాలు కావు.

వాడు ఎదురుగా నిలబడి నవ్వుతున్నాడు. ఇప్పుడు నా జ్ఞాపకాలు ఎక్కడున్నాయో కనపడలేదు. నేను కాలుతున్నాను. వాడు నవ్వుతున్నాడు.

“జ్ఞాపకాలని కదరా తగలబెట్టాను,” అన్నాను నేను.

“నువ్వే నీ జ్ఞాపకానివి,” అన్నాడు వాడు వెళ్ళిపోతూ.

వాడు ఇంక తిరిగి రాకుండా తలుపులేసేశాను. నేను కూడా తిరిగి రాకుండా తలుపులు తెరుచుకున్నాయి.
----------------------------------------------------------
రచన: అరిపిరాల సత్యప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

Thursday, April 4, 2019

పద్యంలో ఉప్పెన


పద్యంలో ఉప్పెన



సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి...................

            1

నీ మీద నేనొక పద్యం
నీ
వీపు పలక మీదో
చన్నుల గుండ్రాల మీదో
మొదలుబెట్టి నప్పుడు
నువ్వు తెచ్చిపెట్టుకున్న
బడాయి బింకం
        ఈక కలం
        దారులు చేసుకుంటూ
        పైకెగ బాకుతూ
        జారుతూ
        అటూ ఇటూ మళ్ళుతూ
        నా పద్యాన్ని
        నీవంటి వంపుల్లో
        రాస్తూ
        కదిలిపోతుంటే
సడలిపోతుంది

            2

కలం
కితకితలు
నువ్వు
ఇకఇకలు
పద్యం
తీగ లాగా పాకుతూ
నిన్నల్లుకుంటూ
నువ్వు వంకర్లు
తిరుగుతూ
పద్యంలో ఇముడుతూ

            3

ఇదిగో ఇక్కడ
ఇక్ క్ క్కడ
ఇంకా ఖాళీ ఉంది
నిత్యం అదేపనిగా
నీ చెలువాల్ని నాకళ్ళల్లోకి
సుతారంగా తోసే నీ చూపుడు వేలుతో
కలం ఇంకా చేరుకోని చోట్లు చూపిస్తూ
కాస్తాగు
కలం ఇక్కడనుంచి కదల లేకపోతోంది

            4

నామీద
నేను చదువుకోలేని పద్యం
గిలికేస్తున్న కవి గాడా
కాస్త వినిపిస్తావా
ఏం రాస్తున్నావో ఎడా పెడా
అట్లకాడ వెనక
ఇట్టే దాక్కోగలిగిన దానా
ఎట్లా కమ్మేశావ్
నువ్వే నేనెక్కడ చూసినా
హి హి హి
రాయటం అయిపోగానే
చివర సంతకం చెయ్
హి హి

            5

నన్ను నీ చూపుల దారానికి కట్టి
గాల్లోకి ఎగరేసిన
మంత్రగత్తెవు
కృతజ్ఞతగా
నిన్ను నా పద్యంలో బిగించి
నావెంట తిప్పుకుంటాను
ఇవిగో పద్యం కొసలు రెండూ గుంజి ముడి
అంటూండగానే నువ్వు ఉబ్బిపోతావు
కొసలు దగ్గరకు రావు
నేను మళ్ళీ గుంజుతాను

            6

ఒక ఉప్పెన
నామీద విరుచుకుపడుతుంది
అందులో ఉన్న నిప్పుతో
నిన్నూ నన్నూ
అంటించేస్తుంది

            7

వీథి గుమ్మంలో
చుక్కల్నన్నిటినీ
ఒకే గీతతో చుట్టే
నువ్వు
ఇంట్లో
నువ్విచ్చిన కాఫీ తాగే
నేను
-------------------------------------------------------
రచన: తఃతః, 
ఈమాట సౌజన్యంతో

Wednesday, April 3, 2019

బతుకు ఎంత పొరపాటై పోయేది!


బతుకు ఎంత పొరపాటై పోయేది!



సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి..............

చేపపిల్లని
గబుక్కున కరుచుకోవటానికి
ముక్కుని చాచి నుంచున్న కొంగల్లా మైకులు
ఎత్తైన గోడల గది నిండా
రకరకాల విదేశీ పెర్ఫ్యూముల రేగు పొదలు
ఎక్కడ కూచుంటావ్
చిట్టచివర వెనకాతల మూసీసిన
తలుపు నానుకుని నిలబడు.

ఎంత దూరంగా ఉంటే ఏం?
తెల్లని లాల్చీలోని ఆ చేతివేళ్ళు
సితార్‌ను మీటగానే నీకు అర్థమైపోతుంది
ఏ గుండె ఆరోగ్యం గురించి
ఆ కార్డియాలజీ ప్రొఫెసర్‌కి
ఎంత తెలుసునో ఏమో గానీ
ఈ కిక్కిరిసిన ఏకాంతంలో
నీ గుండె మాత్రం
ఆ సితార్ మీటే చేతులలో
ధా ఘే తిటకిట తకతిరికిటమని
కొట్టుకుంటూ క్షేమంగా ఉంటుందని

ఎవరికి వారు తన కోసమే ఈ ఆలాపన అనుకుంటూ
సాగుతూ రంగు రంగులుగా వస్తున్న స్వరాల్ని
ఆస్వాదించేస్తున్నారు చూడు
పీచుమిఠాయిని చప్పరించినట్లు
తీన్ తాల్‌లో భాగీశ్వరి
ఆనందం
అర్ణవమైతే-మునిగి
అంబరమైతే-తేలి
ఉన్నట్టుండి
మరుక్షణంలో పీక తెగి కింద పడి పోయే
కోళ్లలాగా…

ఏమిటి?
వాదనం ఎవరూ అందుకోలేని
వేగం పుంజుకుంది
వ్రేళ్ళు తీగల్ని మీటుతున్నాయా
తీగలే వచ్సి వ్రేళ్ళకు తగులుతున్నాయా
తబలా పూర్తిగా ఆగిపోయింది
బిర్ర బిగిసిపోయిన శ్రోతలు
వాదకుడి కపోలాల అశ్రుధారలు!
ఆయన ఎక్కడో చూస్తున్నాడు…

తను పుట్టిన కొద్ది రోజుల్లోనే
తన తల్లిని వదిలేసి
ఎవరినో చేసుకుని వెళ్లిపోయిన తండ్రి
స్వర్గంలో దేవుడి తోట ఈడెన్*లో
తన తల్లిని మళ్ళీ కన్నెగా కలుసుకున్న దృశ్యాన్ని-
తాను ఈ జీవితమంతా ఎదురుచూసిన కలయికని
చూస్తున్నాడా!

తల ఒంచుకుని
“సంగీతమే లేకపోతే బతుకు ఎంత పొరపాటయిపోయేది!”**
ఒప్పేసుకుని
తల తాటిస్తూ నిశ్శబ్దంగా
శౌచాలయం వైపు నడు!
-------------------------------------------------------
రచన: తఃతః, ఈమాట సౌజన్యంతో
(*ఈ కవిత కోసం ఈడెన్ స్వర్గంలో ఉన్నాదనే తీసుకున్నాను. 
**Without music life would be a mistake. – Friedrich Nietzsche.)

Tuesday, April 2, 2019

ఏకాంతం కోసం


ఏకాంతం కోసం




సాహితీమిత్రులారా!

ఈ అనువాదకథను ఆస్వాదించండి..............

ఆ పెద్దావిడ ప్రతీ మంగళవారం ఆ పుస్తకాలాయన ఇల్లు శుభ్రం చేయడానికని వొస్తుంది. కాలింగ్ బెల్ విని తలుపు తీస్తూ మీ మనవడెలా ఉన్నాడని అడిగాడు ఆయన. లోపలికొచ్చి కాళ్ళు తుడుచుకునే పట్టా మీదే ఒక్క క్షణం ఏదో ఆలోచిస్తున్నట్టు నిలబడిపోయింది మా పార్కర్.

“నిన్ననే వాణ్ణి పూడ్చిపెట్టాం సర్!” నిర్లిప్తంగా చెప్పింది.

“అయ్యయ్యో! ఔనా?!” పుస్తకాలాయన ఇంకేమనాలో తోచక మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయానికాయన ఉదయపు ఫలహారం చేస్తున్నాడు. ఎప్పట్లానే బాగా నలిగిపోయిన నైట్ గౌనులో ఆరోజు పేపరు చేత్తో పట్టుకునున్నాడు. ఇప్పుడు ఏమీ జరగనట్టు తిరిగిపోయి ఫలహారం ముగించడమా, ఇంకేవైనా ఓదార్పు మాటలు అనాలా అర్థంకాలేదాయనకి. ఏమీ మాట్లాడకుండా పేపరు పట్టుకొని పక్క గదిలోకెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ, అది మొరటుతనంగా అనిపించిందతనికే.

“చర్చిలో అంతా సవ్యంగా జరిగిపోయిందా, మిసెస్ పార్కర్?” మొహమాటపడుతూ అడిగాడు.

“ఏమన్నారు సర్?” అర్థంగానట్టు అడిగిందావిడ.

“అదే, పిల్లవాడి ఆ… కార్యక్రమం ఏ ఇబ్బందీ లేకుండా…”

ఆవిడేమీ బదులివ్వలేదు. తలవంచుకుని మెల్లిగా ఆడుగులేస్తూ వంటింట్లోకెళ్ళిపోయింది. ఆయన నిట్టూర్చి తన ఫలహారం పనిలో పడ్డాడు.

ముసలావిడ వంటింట్లోకెళ్ళి చేతిసంచీ లోంచి తన పనిముట్లు తీసుకొని సంచీ చిలక్కొయ్యకి తగిలించింది. మెల్లిగా కుర్చీలో కూర్చొని వొంగి బూట్లు విప్పుకుంది. బూట్లు వేసుకోవడం, తిరిగి విప్పడం ఎంత నొప్పో ఆమెకు. అయితే ఆమెకా నొప్పి ఎంతగా అలవాటైపోయిందంటే, లేసులు విప్పదీయడం మొదలుపెట్టబోతుండగానే ఆమె పళ్ళు బిగుసుకుంటాయి, రాబోయే నొప్పిని ఊహిస్తున్నట్టుగా.

అతి ప్రయాస మీద బూట్లు విప్పి పక్కనపెట్టి కొంచెంసేపు కుర్చీలో అలాగే జారగిలబడి కూర్చుందామె, మోకాళ్ళు రుద్దుకుంటూ.

“గ్రానీ! గ్రానీ!” బయట వీధి లోంచి ఆమె మనవడు బూట్లతో సహా ఆమె ఒళ్ళోకెగబడ్డాడు.

“అబ్బబ్బా! అలా మీదపడొద్దని ఎన్నిసార్లు చెప్పాల్రా? చూడు, నా బట్టలెంత మురికి చేశావో!” విసుక్కుందామె. ఆమె మాటలేం పట్టించుకోకుండా వాడలాగే ఆమె ఒళ్ళో లేచి నుంచున్నాడు.

“గ్రానీ! ఒక్క పెన్నీ ఇవ్వవా!”

“ఫో అవతలకి! గ్రానీ దగ్గర పెన్నీల్లేవ్.”

“ఉన్నై, ఉన్నై, నాకు తెలుసుగా! గ్రానీ, ఒక్క పెన్నీ అంటే ఒక్కటి. ఇవ్వు గ్రానీ.” ఆమె మెడ చుట్టూ చేతులేసి తన చెంప ఆమె చెంపకి తగిలించి ముద్దుగా ఆడిగాడు.

“చాల్లే, నీ వేషాలూ నువ్వూ! నా దగ్గర పెన్నీలేమీ లేవంటున్నా కదా?” ఆమె చేతులు అప్పటికే తన హ్యాండ్‌బ్యాగులో చిల్లర డబ్బులకోసం తడుముతున్నాయి.

“సరే. నీకో పెన్నీ ఇస్తా. మరి నాకేమిస్తావూ, చెప్పు ముందు!”

వాడు ముద్దుగా నవ్వి అమ్మమ్మ మెడ చుట్టూ చేతులు ఇంకా గట్టిగా బిగించాడు.

“నా దగ్గిరేం లేదుగా గ్రానీ?” వాడి కంటి రెప్పలు ఆమె చెంప మీద చక్కిలిగిలి పెడుతూ…

పెద్దావిడ ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి నిలబడింది. సింకు నుంచి టీ గిన్నెలో నీళ్ళు నింపి స్టవ్ మీద పెట్టింది. ఆపైన, ఇంకో గిన్నెలోనూ బకెట్‌లోనూ నీళ్ళు పట్టింది. పంపు నుంచి ధారగా నీళ్ళు గుడగుడ శబ్దం చేస్తూ గిన్నెలో నిండుతుంటే ఆమెకు నొప్పి ఏదో తగ్గినట్టనిపించింది కాసేపు.

ఆ వంటింటి స్థితి గురించి ఏకంగా పుస్తకమే రాయొచ్చు. పుస్తకాలాయన వారమంతా తన ‘పని’ తానే చేసుకుంటాడు. ఆవిడ వారానికొక్కరోజు మాత్రమే వొచ్చి శుభ్రంచేస్తుంది. ఆ వారంలోగా ఆయన నానా కంగాళీ చేసిపెడతాడు ఇల్లంతా. టీ కాచుకుని ఆ చెత్తంతా ఒక పెద్ద జాడీలో పడేస్తాడు. చెంచాలు, కత్తులు, ఫోర్కులూ వాడి సింకులో పడేస్తాడు. ఎప్పుడైనా కడగక తప్పదనిపిస్తే, ఒక తువ్వాలుతో తుడిచి మళ్ళీ వాడేస్తాడు. ఆయన దృష్టిలో ఇల్లు శుభ్రం చేసుకోవడమంత దండగ పని ఇంకొకటి లేదు.

“ఇంట్లో హాయిగా ఇష్టమొచ్చినట్టు వుండండి. వారానికొకసారి పనిమనిషిని మాట్లాడుకుంటే వచ్చి శుభ్రం చేసిపోతుంది. ఆమాత్రం దానికి ఇల్లు ప్రతీరోజూ ఎందుకూ క్లీన్ చేసుకోవడం. వేస్ట్ ఆఫ్ టైమ్!” అంటాడాయన దగ్గరి స్నేహితులతో. అదీ ఆయన ‘పద్ధతి.’

ఆ పద్ధతి అందమంతా ఆ వంటిల్లు చూస్తేనే తెలిసిపోతుంది.

వంటిల్లంతా పెద్ద చెత్త కుండీలా తయారయింది. నేల మీద రొట్టె ముక్కలు, ఉత్తరాలు, ఖాళీ పేకెట్లు, సిగరెట్టు పీకలు, చెప్పనలవికాకుండా వుంది. అయినా ఎప్పుడూ ఆవిడ విసుక్కోలేదు. పైగా ఒంటరివాడనీ అతన్ని అంటిపెట్టుకుని వుండేవారెవరూ లేరనీ సానుభూతి కూడా. కిటికీ తలుపు తెరిచి ఆకాశం వంక చూసింది. అక్కణ్ణించి ఆకాశం ఎందుకో ఎప్పుడూ దిగులుగా అనిపిస్తుంది. ఉన్న ఒకటీరెండు మబ్బులు కూడా ఆకాశంలో టీ మరకల్లాగా అంచులు చిరిగిపోయి, అక్కడక్కడా చిల్లులు పడ్డ దుప్పట్లలా వుంటాయి.

ఆవిడ నేల చిమ్మడం మొదలుపెట్టింది. ‘ఏమిటో, నా పాడు జన్మకీ కష్టాలు తీరేలా లేవు. ఎంతకని భరించను, ఎన్నని సహించను!’ అనుకుని నిట్టూర్చింది.

ఆ మాట ఆమె గురించి ఆమే కాదు అందరూ అనుకునేదే. సాయంత్రం పనంతా ముగించి ఇంటికి నిదానంగా నడుచుకుంటూ పోయే ఆమెను చూసి అందరూ పాపం అనుకుంటారు. మా పార్కర్ బతుకంతా కష్టాలే కష్టాలు, అని చెప్పుకుంటారు. ఆవిడకదేమీ గొప్పగా అనిపించదు. ఆమాటకొస్తే అసలేమీ అనిపించదు. ఆవిడ ఫలానా నంబరు ఇంట్లో ఉంటుంది అన్నప్పుడు ఎలా వుంటుందో, ఆమెది ఎంత కష్టమైన బతుకో అనుకున్నప్పుడూ అలానే వుంటుంది. నిజంగా కష్టమైన బతుకే…

పదహారేళ్ళప్పుడు స్ట్రాట్‌ఫర్డ్ వదిలి లండన్‌కొచ్చిపడింది పనిమనిషిగా. ఓహ్! స్ట్రాట్‌ఫర్డ్! అంటే షేక్స్‌పియర్ పుట్టిన వూరే కదా? అందరూ ఆమెని అడిగేవాళ్ళే! ఏమో సర్, తెలీదు. ఆమెకు షేక్స్‌పియర్ ఎవరో లండన్ వచ్చాక కానీ తెలియలేదు.

ఇప్పుడా వూరి జ్ఞాపకాలు ఏమీ లేవు. ఏ చీకటి రాత్రో చిమ్నీగొట్టాం నుంచి నక్షత్రాలను చూడడం, లీలగా అమ్మ, ఇంటిముందు మొక్క ఏదో గుర్తులేదు కానీ మంచి వాసన వస్తుండేది. ఎప్పుడో జబ్బుచేసి మంచం పైన పడుకున్నప్పుడు ఒకటి రెండు సార్లు గుర్తొచ్చాయి, అంతే.

ఆమె మొదట పనిచేసిన ఇంట్లో భయంకరంగా వుండేది. రోజంతా వంటింట్లోనే మగ్గాల్సొచ్చేది. పైగా ఆ వంటమనిషి ఏ మాత్రం దయాదాక్షిణ్యాలు లేని రాక్షసి. ఇంటి నుంచి వొచ్చే వుత్తరాలు కూడా చదవనిచ్చేదికాదు. చేతిలోంచి లాక్కొని చిమ్నీలో పారేసేది అవి చదువుకుంటూ ఊహల్లో తేలిపోతుందని. …పేడపురుగులు! అవును కదా! ఆ వంటమనిషి వాటినెప్పుడూ చూడలేదట. పేడపురుగులు చూడని వాళ్ళూ ఉంటారా? తన కాళ్ళు తాను చూసుకోని వాళ్ళెవరుంటారు. మా పార్కర్ ముఖంలో చిన్న నవ్వు కనిపిస్తుంది ఆ పేడపురుగులు గుర్తొచ్చినప్పుడల్లా.

ఆ ఇంటి నుంచి ఒక డాక్టరుగారి ఇంట్లో పని కుదిరింది. అక్కడా పగలూ రాత్రీ పని. రెండేళ్ళు అలుపెరగకుండా అలా పనిచేసి, ఒక బేకర్‌ని పెళ్ళాడింది.

“బేకర్‌ని పెళ్ళాడారా?” అన్నాడు పుస్తకాలాయన, ఆవిడ ఆ సంగతి చెప్పినప్పుడు. ఎప్పుడో ఇంట్లో ఇంకో ప్రాణి ఉంది అని గుర్తొచ్చినప్పుడు ఆ పుస్తకాల మధ్యలోంచి తలెత్తి ఆమె చెప్పేది వింటుంటాడాయన.

“అయినా బేకర్లే నయం లెండి. తిండికి లోటుండదు. పైగా శుభ్రమైన పని!” ఆవిడ నిజంగానా అన్నట్టు ఆయనవంక చూసింది.

“బేకరీలో బ్రెడ్ అమ్మడం, వచ్చీపోయే కస్టమర్లతో సరదాగా ఉండుండాలి కదా?”

“దుకాణంలో ఉండేంత తీరికెక్కడిది సర్? మొత్తం పదముగ్గురిని కన్నాను. ఏడుగురిని కప్పెట్టాను. తెలిసింది రెండే అనుకోండి నాకు, పురిటి మంచం లేకుంటే ఆస్పత్రి మంచం.”

“అనుకోవచ్చు, అనుకోవచ్చు,” వెన్నులోంచి చలి వచ్చినట్లు ఒక్కసారి వొణికి పెన్ను చేతిలోకి తీసుకుని తన పనిలో పడిపోయేడు.

ఏడుగురు పోయినా మిగిలిన ఆరుగురినీ పెంచి పోషించడమంటే మాటలా? ఇంతలో ఇంటాయనకి ఊపిరి తిత్తుల వ్యాధి సంక్రమించింది. లోపలంతా పిండి నిండిపోయిందన్నాడు వైద్యుడు.

“అమ్మా! ఇక్కడ కనక ఈయనని కోస్తే ఊపిరితిత్తులనిండా గోధుమ పిండే కనిపిస్తుంది మనకి. అయ్యా, మీరు కొంచెం గట్టిగా ఊపిరి పీల్చండి.” షర్టు పైకెత్తి పడుకున్న అతని వెన్ను పైన పెన్నుతో రాస్తూ అన్నాడు వైద్యుడు, ఆయన ఎంతో ప్రయాసతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆమెకెందుకో అతని నోటి నుండి గోధుమ పిండి పొగలా వచ్చినట్లు అనిపించింది.

ఆయన పోయిన తరవాత ఆరుగురు పిల్లలనీ పెంచేసరికి ప్రాణాలు కడబట్టిపోయాయి. సరిగ్గా ఆఖరి పిల్ల బళ్ళోకెళ్ళేసరికి తన చెల్లెలు భర్తతో సహా దిగింది, నీకు సహాయం చేస్తా అంటూ! సహాయం మాట దేవుడెరుగు, వచ్చిన రెండునెలలకి చెల్లెలు మెట్ల మీద జారి మంచాన పడడంతో చంటి బిడ్డలా అయిదేళ్ళపాటు పెంచాల్సిన పరిస్థితి వచ్చిపడింది. నిజంగా తన చెల్లెలు వయసొచ్చిన చంటి బిడ్డే!

ఆ తరవాత ఇద్దరాడపిల్లలూ జబ్బుచేసి పోయారు. జిమ్ సైన్యంలో చేరి ఇండియా పోయాడు. ఇద్దరు మగపిల్లలు జీవనోపాధి వెతుక్కుంటూ దేశాలు పట్టి వెళ్ళిపోయారు. ఆఖరిది ఎమిలీ తనతో మిగిలిపోయిందనుకుంటే అది ఎందుకూ పనికిరాని ఒక వెయిటర్ వెధవని పెళ్ళాడింది. వాడూ కడుపులో అల్సర్లు పుట్టి చచ్చిపోయాడు లెన్నీ పుట్టిన ఏడాది. ఇక మిగిలిందల్లా తన మనవడు లెన్నీ…

ఆలోచనల్లోనే గిన్నెలన్నీ కడిగి తుడిచి సర్దేసిందామె. నల్లగా మురికిపట్టిన కత్తులన్నీ కోసిన బంగాళాదుంపతో రుద్ది కడిగింది. భోజనం చేసే బల్ల, ప్లేట్లు కప్పులున్న అల్మారా, మిగతా వంటిల్లంతా కూడా శుభ్రంచేసి చేతులు తుడుచుకుంది.

…బుజ్జివెధవ పాపం ఎందుకో ఎప్పుడూ అనారోగ్యంగానే వుండేవాడు. వాడి వుంగరాల జుట్టు, నాజూకు రంగు చూసి అందరూ ఆడపిల్లనుకునేవారు. తనూ ఎమిలీ ఎన్నెన్నో చిట్కా వైద్యాలు చేశారు. ఆ వైద్యాలకోసం ఎమిలీ ఆదివారం పత్రిక పొద్దున్నే చదివేది. ఆ పత్రికకి సలహాల కోసం తల్లీ కూతురూ ఎన్నో ఉత్తరాలు కూడా రాసేవారు. అయినా లెన్నీ అసలు తిండి సరిగ్గా తిననేలేదు. ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా వాడు ఒళ్ళుచేయనేలేదు.

అమ్మకంటే వాడికి అమ్మమ్మంటే ప్రాణం. వాడు అమ్మమ్మ బిడ్డ.

“నువ్వు ఎవరి బేబీవీ?” అడిగింది మా పార్కర్, స్టవ్ తుడిచి జిడ్డు పట్టిన కిటికీ మీద సబ్బు రుద్దుతూ.

“నేను గ్రానీ బేబీని!”

ఒక పిల్లవాడి గొంతు తన గుండె కిందుగా నవ్వుతూ చెప్పింది. ఆ గొంతు ఎంతో ఆప్యాయంగా, ఎంతో దగ్గరగా తన గుండెలోంచి వస్తున్నట్టుగా వినిపించి మా పార్కర్ నిలువెల్లా కదిలిపోయింది ఒక్క క్షణం.

గది గుమ్మం దగ్గర అలికిడయింది. ఆమె తలెత్తి చూసింది. పుస్తకాలాయన తయారయి ఎక్కడికో బయల్దేరినట్టున్నాడు.

“మిసెస్ పార్కర్! నేను బయటికెళ్తున్నాను!”

“అలాగేనండి!”

“మీకివ్వాల్సిన డబ్బు బల్లమీద వుంది.”

“అలాగేనండి.”

ఆయన వెళ్ళబోతూ ఆగిపోయాడు.

“అన్నట్టు, కిందటి వారం మీరొచ్చినప్పుడు డబ్బాలోంచి కోకో పొడి బయటకానీ పడేశారా?”

“అబ్బే, లేదండి.”

“వింతగా వుందే. నాకు బాగా గుర్తు, డబ్బాలో ఒక చెంచాడు పొడి మిగిలేవుండాలి. ఇప్పుడు చూస్తే ఖాళీగా వుంది. కనపడకపోతే బయట పడేశారేమోననుకున్నా. నాకు చెప్పకుండా ఏదీ పడేయరు కదా!?” ఆయన గంభీరంగా ముగించి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు, తన లౌక్యానికీ తెలివి తేటలకీ ఎంతగానో మురిసిపోతూ. తనేమీ అంత అమాయకుడూ తెలివితక్కువవాడూ కాదనీ, ఇంటి విషయాల్లో అప్రమత్తంగానే వుంటాడనీ తెలియజెయ్యడమే ఆయన ఉద్దేశ్యం.

ఆయన వెళ్ళిపోయిన గుర్తుగా తలుపు ధడాలున మూసుకుంది. మా పార్కర్ తన బ్రష్షులు, గుడ్డలూ తీసుకొని బెడ్రూములోకి నడిచింది చిన్నగా. పక్కలు దులిపింది, దుప్పట్లు తీసి కొత్త దుప్పట్లు పరిచి ముడతలు సరిచేసి వాటిని పరుపు కిందికి నెట్టింది. దిళ్ళు సర్దింది. ఆ ఒంటరితనంలో, నిశ్శబ్దంలో తన మనవడి ఆలోచన ఆమెను కుదిపివేస్తూనే ఉంది.

ఎలాగూ పోక తప్పనప్పుడు వాడంత నరకయాతన ఎందుకు అనుభవించాలన్న ప్రశ్న ఆమెని నిలవనీయడంలేదు. అంత పసి కూన ఒక్కొక్క ఊపిరి కోసం బ్రతుకునంతగా వేడుకోవాలా? ఆ చిన్నారిని అంత చిత్రహింసలు పెట్టి ఆనందించేదెవరు? ఎవరి తృప్తికోసం వాడి పోరాటం? ఆమెకు అర్థంకానిదదే.

వాడి పలుచటి గుండెలో ఏదో మరుగుతున్నట్టు వచ్చే గుర గుర శబ్దం. అది బైటికి రాదు వాడిని ఊపిరి తీసుకోనీయదు. దగ్గినప్పుడల్లా చేతులు కాళ్ళు కదిలిపోయేవి. కళ్ళు ఉబ్బుకొచ్చేవి. ఆ తరవాత అలసిపోయి దిండుకి చేరబడి వాడు గ్రానీ వంక కోపంగా చూసేవాడు.

తను కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

“నేనేం చేయనురా నా తండ్రీ!” చెమటకి తడిసిపోయిన వాడి జుట్టుని మొహం మీంచి పక్కకి జరిపింది. వాడు కోపంగా ఆమె చేయి పక్కకి తోసేసి కళ్ళు మూసుకున్నాడు. గుండెని మెలిపెడుతున్నట్టున్న బాధని ఆ పెద్దావిడ తట్టుకోలేకపోయింది.

ఇక తనవల్ల కాలేదు. చేతిలో వున్న తుడుపు గుడ్డ అలానే వదిలేసింది. ఆమె తన బతుకేదో తాను బతికింది. ఏదొచ్చినా నిబ్బరంగా నిలబడింది. ఆమె ఇంతవరకూ కన్నీళ్ళు పెట్టుకోలేదు బైటివారి ముందైనా తన పిల్లల ముందైనా. కానీ ఇప్పుడు లెన్నీ లేడు. తనకెవరూ లేరు. ఇప్పుడెవరికోసం బ్రతకాలి? తనకు మిగిలిందల్లా ఆ పసికూన ఒక్కడే. ఇప్పుడు వాడూ లేడు. ఈ కష్టాలన్నీతనకే ఎందుకు రావాలి? తనకే ఎందుకవుతుంది ఇలా?

“నాకే ఎందుకవుతుంది ఇలా?”

తెలియకుండానే ఆ ప్రశ్న మా పార్కర్ నోటినుంచి బయటకు వచ్చింది. గుండెను నులిపెడుతున్న బాధతో మా పార్కర్ తనేం చేస్తున్నదో తెలియని స్థితిలో వంటగదిలోకి నడిచింది, కోటు వేసుకుంది, తలకు టోపీ పెట్టుకుంది. ఇంట్లోంచి బైటకు వచ్చింది. ఎక్కడికి పోవాలి? ఎటువైపు నడవాలి? ఏం చేస్తే తన ఆలోచనలనుంచి తను తప్పించుకోగలదు?

బయట చలిగా వుంది. చల్లటి ఈదురుగాలి కత్తులతో కోస్తున్నట్లుగా ఉంది. అందరూ చకచకా నడిచిపోతున్నారు తమ శరీరాలన్నీ కప్పుకుని. పక్క మనిషిని పలకరించడానిక్కూడా ఓపిక, తీరిక లేని మనుషులు, ఎవరికీ ఆమె బాధ పట్టలేదు. ఎక్కడైనా కూర్చుని తీరుబడిగా ఏడవాలని వుందామెకు. కానీ ఇన్నేళ్ళ తరువాత ఏడుద్దామన్నా అవుతుందా? ఇన్నేళ్ళూ గుండెల్లో ఉగ్గబట్టుకువున్న ఏడుపు ఇప్పుడు మాత్రం బయటకు వస్తుందా?

ఆ ఆలోచన రాగానే లెన్నీ గుండెల మీదకెగబాకినట్టుగా అనిపించింది. అవున్నాన్నా, గ్రానీ కిప్పుడు ఏడవాలనుంది. ఏడుపంటూ మొదలుపెడితే అన్నిటికీ ఏడవాలి. రాక్షసిలాంటి వంటమనిషి, భర్త అనారోగ్యం, పుట్టిపోయిన తన పిల్లలు, ఇన్నేళ్ళ ఈ దుర్భరమైన జీవితం చివరికి లెన్నీ దగ్గరికి వచ్చి ఆగేదాకా జరిగిన ప్రతీదానికి ఏడవాలి. తీరిగ్గా పూర్తిగా గుండె బరువు తగ్గిపోయేలా ఏడవాలి. ఇన్నిటికి ఏడవాలంటే చాలా సమయం కావాలి. అయినా సరే. సమయం వచ్చింది. ఇక ఆగదు. తను ఏడవక తప్పదు. ఇక ఏడవాలి. కానీ ఎక్కడ?

“మా పార్కర్ బతుకంతా కష్టాలే కష్టాలు!” అవును. కష్టాలే. బిగబట్టుకున్న పెదవులు వణికాయి.

ఇంటికెళ్ళి ఏడవలేదు, అసలే బిడ్డ పోయిన బాధలో వున్న ఎమిలీ తట్టుకోలేదు, బెదిరిపోతుంది. బయటెక్కడైనా పార్కులో బెంచీ మీద కూర్చోని యేడుద్దామంటే, అందరూ చుట్టుముట్టి ప్రశ్నలడుగుతారు. పుస్తకాలాయనది పరాయి ఇల్లు. అక్కడ ఎలా ఏడవగలదు? ఏ దుకాణం మెట్ల మీదో కూర్చుని ఏడిస్తే పోలీసువాళ్ళు వచ్చి పొమ్మంటారు.

తనకు ఇష్టమైనంతసేపు ఎవరికీ తను కనిపించని చోటు, ఎవరూ తనని ప్రశ్నలడగని చోటు ఒకటి లేదా? ఇన్నాళ్ళకి ఈ ప్రపంచంలో తను పొగిలి పొగిలి ఏడవడానికి ఒక చోటంటూ కనీసం లేదా?

ఇంతలో వాన మొదలయింది. చల్లటి ఈదురుగాలి ఆమెను సూదులతో పొడిచింది. మా పార్కర్ అటూ ఇటూ చూసింది. లేదు, చోటెక్కడా లేదు.
--------------------------------------------------------
రచన: శారద 
మూలం: కేథరిన్ మాన్స్‌ఫీల్డ్
(మూలం: Katherine Mansfield – “The life of Ma Parker.”)
ఈమాట సౌజన్యంతో

Monday, April 1, 2019

పద్యం కోసం


పద్యం కోసం






సాహితీమిత్రులారా!

ఈ కవితను ఆస్వాదించండి................

ముందుగా మౌనం కావాలి
నిరంతరం ఫౌంటెన్లా ఎగజిమ్మే ఆలోచనలు
ఒక్కసారిగా లోపలికి ముడుచుకుపోవాలి.

గత వర్తమానాల మధ్య
లయాత్మకంగా ఊగేందుకు
మనసొక తూగుటుయ్యాల కావాలి.

ఒక కన్నీటికణం బరువుకి
చిగురుటాకులా ఒరిగిపోవాలి.
ప్రపంచభారం మొత్తాన్ని
అట్లాస్‌ లా బుజాలకెత్తుకోవాలి.

అప్పటివరకు వాడిన
సకలాలంకారాల్నీ
స్వచ్చందంగా పరిత్యజించాలి.
ఒక కొత్త అందం కోసం
కొత్త చూపుతో అన్వేషణ సాగించాలి.

వర్షాగమనానికి సిద్ధమై
ప్రకృతి మొత్తం స్తంభించినట్టు
కవిత్వ సేచన కోసం
నవనాడులూ సమాయత్తం కావాలి.

వేచి ఉన్న కారుమబ్బుల దొంతర్ని
ఒక మెరుపు విప్పుతుంది.
కాంతి కనుగొన్న దారిలోకి
వెనువెంటనే శబ్దం ప్రవేశిస్తుంది.
------------------------------------------------------
రచన: విన్నకోట రవిశంకర్, 
ఈమాట సౌజన్యంతో