Wednesday, February 14, 2018

ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో పాండవుల చిత్తవృత్తి


ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో పాండవుల చిత్తవృత్తి




సాహితీమిత్రులారా!


ఒకానొక అవధానంలో వేలూరి శివరామశాస్త్రిగారిని
ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో పాండవుల చిత్తవృత్తి
ఎలా వున్నదో వర్ణించమన్నారట- దాని ఆయన
వర్ణించిన సీసపద్యం చూడండి-

తొడలుదాటించుచూదూకు దుశ్శాసనుఁ
         జంపగల్గియును సంశయమునొంది
తగునిదియను సుయోధనుఁ బట్టి చంపగఁ
         జేవగల్గియుఁ దర్మచింతజేసి
కర్ణకఠోరత కలిగించు కర్ణుని 
         మ్రదిపఁగలిగియు మానవలసి
సకలదుశ్శకుని శకునిఁని జంపఁగఁ
         జాలియుఁ గాలదొష్ట్యమునఁదేసి
ఊరకున్నారు భూపాలహీరమణులు
పాండవేయులు ద్రోవదిఁ బట్టినాఁడు
వలువలొలువంగఁబూనిన తులువపలువ
సేఁతలుంజూచి ధర్మవిశేషమెఱిఁగి

ఆసమయంలో పాండవుల మనోభావాలను
కళ్ళకు కట్టినట్లు వర్ణించాడుకదా

Tuesday, February 13, 2018

సంగీత సాహిత్యములు లేనివాడు


సంగీత సాహిత్యములు లేనివాడు 



సాహితీమిత్రులారా!



వేలూరి శివరామశాస్త్రిగారు
సంగీత సాహిత్యములు లేనివాడు పశువని
చెప్పెన కందపద్యం-

సంగీతముసాహిత్య మె
ఱుంగక యున్నట్టి యానరుడెందును దా
శృంగములు తోఁకలేక చె
లంగు బలీవర్దమన నిలాతలమందున్

(బలీవర్దము - వృషభము, ఎద్దు) 

శాకాహార శతకం


శాకాహార శతకం


సాహితీమిత్రులారా!


పురుషులందు పుణ్యపురుషులు వేరయా
అన్నట్లు ప్రక్రియలందు శతకప్రక్రియవేరయా
ఎన్ని రకాల శతకాలున్నా విషయ వైవిధ్యమైనవి
ఛందోవైవిధ్యమైనవి ఇలా అనేకరకాల వైవిధ్యాలతో
శతకం శాఖోపశాఖలుగా విస్తరించిన వటవృక్షం మాదిరి
విస్తరిస్తూనే వుంది. ఇక్కడ శాకాహార శతకం మరోవింతైన వైవిధ్య శతకం
దుబ్బాకుల కృష్ణస్వామి కృతమిది.
ఇందులోని కొన్ని పద్యాలను చూద్దాం-
దీని పేరులోనే శకము అంటే కూరగాయ
వీటిని మాత్రమే తినే దాన్ని గురించిన విషయం
ఇందులో ఉంటుందని కదా-
దీనిలోని మకుటం -
"తెలిసి నడుచుకొనుము తెలుగు బాల"
ఇవి ఆటవెలదులు అని చెప్పక్కరలేదుకదా
ఎందుకంటే మకుటంలో ఐదు సూర్యగణాలున్నాయికదా
సరే పద్యాలు కొన్ని చూద్దామా-

క్రూర జంతు నోట కోరలు మొనదేలు
కాలిగోళ్ళు చీల్చ గలుగనుండు
జంతువులలొ నుండు జీర్ణరసము వేరు
తెలిసి నడుచుకొనుమ తెలుగుబాల (58)

మనిషియైనవాడు మాంసము తినవద్దు
మందగించు బుద్ధిమాంసమునను
రక్త కలుషితమయి రాలిపోవుఁదనువు
తెలిసి నడుచుకొనుమ తెలుగుబాల (59)

మాంసము తినకండి మాయరోగము వచ్చు
కాటికీడ్చు నదియె క్యాన్సరయ్యి
పాపమబ్బు మరియు పాడౌను దేహంబు
తెలిసి నడుచుకొనుమ తెలుగుబాల (60)
ఇదోరకమైన నీతి శతకంగా చెప్పవచ్చును కదా

Monday, February 12, 2018

మేఘసందేశం


మేఘసందేశం



సాహితీమిత్రులారా!


డా.సి.నారాయణరెడ్డిగారు కాళిదాసు "మేఘసందేశం"
గొప్పదనాన్ని దృష్టిలో ఉంచుకొని వ్రాసిన కవిత
ఇది చూడండి-

గుత్తులుగా వ్రేలాడు 
గోస్తనుల చందాన
ఆషాఢమున వలా
హక పంక్తి కాలూన;

కాళిదాసు హఠాత్తు
గా నాకు కన్పించె
తిన్నగా "మేఘసం
దేశమ్ము" విన్పించె

అలకాపురమ్మేడ
యక్షదంపతులేడ
వర్షాంబుధరముచే
వార్తావహనమేడ?

చిత్రకూటమ్మేడ
శివుని పర్వతమేడ
గగన కల్లోలిని
కనక సికతములేడ?

సురత కేళి జనిత
పరిఖేదమును బాపు
ఐందవ శిలా పరి
ష్యంది బిందువు లెచట?


హ్రీమూఢ లెచట
కామార్తు లెచట
స్తనభర స్తోక న
మ్ర నవోఢ లెచట?

దనద శాపములేదు
దైవఘటనము కాదు
ఏడాది కాదొక్క
నాడు విరహము లేదు?

యక్షయువకుడు పుష్క
లావర్త మేఘమును 
నిల్పి సందేశమ్ము
తెల్ప బూనగలేదు

గాలి తాకిడిచేత
కదిలిసాగెడు మేఘ
శకల మాతని నివే
దికను వినగాలేదు

కాళిదాసుని హృదయ
కందరమ్ముల లోన
అణగారు విరహమే
అక్షరత్వము దాల్చె


కాళిదాసుని భావ
కల్పనావేశ ఫల
మేకదా యీ నాటి
"మేఘ సందేశమ్ము"

నింగిలో మేఘాలు 
నిల్చియుండే వరకు
కనిపించు కాళిదా
సుని యశశ్చంచలలు

కాళిదాసుని "మేఘ
కావ్య" సందేశమ్ము
స్ఫురించు నన్నాళ్ళు
కురియు నమృతపు జల్లు

Saturday, February 10, 2018

పుంటికై వెదుకఁగోరి వరింతువు


పుంటికై వెదుకఁగోరి వరింతువు




సాహితీమిత్రులారా!


"చమత్కార రత్నావళి" అనే లఘుకృతిలోని
పద్యం చూడండి. దీన్ని "సత్యవోలు సుందరకవి"
రచించారు. ఇది కేవలం 34 పుటల కృతి.
ఇందులో రసవంతాలైన వివిధ వస్తువుల వర్ణనలు ఉన్నాయి.
అయితే ఇందులో కవి చాతుర్యం ఏమిటంటే
ఉపమానాన్ని మాత్రమే వర్ణించి
ఉపమేయాన్ని, భంగ్యంతరంగా
సూచించడం.
ఇక్కడ మక్షికము -  తప్పులు వెదికేవాడు
తప్పులు వెదికేవాన్ని గురించి చెబుతూ
మక్షికాన్ని ఉపమానంగా వాడాడు కానీ
ఉపమేయాన్ని చెప్పలేదు - గమనించండి.

తలను సుగంధతైలమును దావుల నీనెడు బూల మాలికల్
గళమున బాహు మధ్యమున గమ్మని మంచి గంధమున్
గలయల సింహసంహనుని గాత్రము నందును పూతిగంధ సం
కులమగు పుంటికై వెదుకఁగోరి వరింతువు మక్షికాథమా!

(సింహసంహనుడు = సర్వాంగ సుందరుడు
పూతిగంధ = దుర్గంధము)

Friday, February 9, 2018

ఇదే నా అంతిమ నమస్కారం


ఇదే నా అంతిమ నమస్కారం




సాహితీమిత్రులారా!


అశ్వధాటీ వృత్తాలలో దేవిని స్తుతించినవారు
కాళిదాసని తెలుసు దానికే దేవీఅశ్వధాటి స్తోత్రం
అని కూడ అంటారు. అలాగే పండిత జగన్నాథుడు
కూడ అశ్వధాటి కావ్యాన్ని కూర్చారు. అందులో
జగన్నాథుడు తంజావూరు నుండి ఉత్తర భారతదేశం
వెళ్ళినట్లు తెలిసే శ్లోకం ఒకటుంది. తన విద్యాభ్యాసం
పూర్తవగానే దక్షిణాపథంలోని తంజావూరు రాజాస్థానంలో
ప్రవేశించాడు. అక్కడ వారి సత్కారాలు నచ్చక అక్కడ
నుండి ఉత్తరాపథం వెళ్ళినట్లు తెలుస్తుంది.
ఈ శ్లోకం చూడండి-

ఖంజాయితోధిమతి గంజావరోపి బత సంజాయ తేత్ర ధన దః
సంజాఘటీతి గుణపుంజాయితస్య నతు గుంజామితంచ కనకం
కింజాగ్రతీ జయసి కిం జానతీ స్వపిషి శింజాననూపురపదే 
తేజోపురేశి నవకంజాక్షి సాధు తదిదంజాతు వాకిము శివే


ఇక్కడున్న ధనవంతుడు గర్వాంధుడు. మధుపాయి.
ఇక్కడున్న గుణవంతునికి గురిగింజయెత్తు సరిగల
బంగారం కూడ లేదు. ధ్వనించే అందెలచే అంకితమైన
తల్లీ కమలదళాలంత విశాలమైన కళ్లున్నదానా
మేలుకొని ఉన్నావా నిద్రపోతున్నావా కామేశ్వరీ మేలు
మేలు నీకిదే నాకడసారి(అంతిమ)నమస్కారం.
స్వీకరించి ప్రయాణానికి అనుమతించు - అని భావం


Thursday, February 8, 2018

నరక కుండాలు


నరక కుండాలు




సాహితీమిత్రులారా!


భారతీయుల నమ్మకం ప్రకారం
చేసిన పాపాలను బట్టి ప్రాణి మరణానంతరం
నరకానికి వెళతారు. వారు ఎవరుచేసిన దానినిబట్టి
వారికి ఆ నరకం ప్రాప్తిస్తుంది. వీటిని బ్రహ్మవైవర్త
పురాణంలో కృష్ణపరమాత్మ నందునికి చెప్పిన
కర్మవిపాక వర్ణననుండి మరి కొన్ని గ్రంథాలనుండి
గమనిస్తే నరక కుండాలు 86. వీటిలో ప్రాణి
అనుభవించాల్సిన శిక్షలను విధిస్తారు.
86 కుండాల పేర్లు-
1. వహ్ని 2. తప్త 3. క్షర 4.విట(ఉప్పు) 5. మూత్ర
6. శ్లేష్మ 7. గర(విషం) 8. దూషికా 9. వసా 10. శుక్ర
11. అసృక్(నెత్తురు) 12. అశ్రు 13. గాత్ర మల, 14. కర్ణ మల
15. మద్య 16. మాంస 17. నఖ 18. రోమ 19. కేశ 20. అస్థి
21. తామ్ర 22. లోహ, 23. తీక్షణ కంటక 24. విష 25. ఘర్మ
26. తప్ర సురా 27. ప్రతప్త తైల  28. కుంత 29. కృమి 30. పూయ
31. సర్ప 32. మశక 33. దంశ 34. గరళ 35. వజ్ర దంష్ట్ర
36. వృశ్చిక 37.శర 38. శూల 39. ఖడ్గ 40. గోళ 41. నక్ర 
42. కాక 43. సంచాల 44. వాళ 45. వజ్ర 46. తప్తపాషాణ
47. తీక్షణ పాషాణ 48 లాలా 49. మసీ 50. చూర్ణణ 51. చక్ర
52. వక్ర 53. కూర్మ 54. జ్వాలా 55. భస్మ 56. దండ 
57. తప్తనూర్మీ 58. అసివత్ర 59. క్షురధారా 60. సూచీముఖ
61. గోధాముఖ 62. నక్రముఖ 63. గజదంశ గోముఖ 65. కుంభీపాక
66. కాలసూత్ర 67. అవలోభ 68. అరుంతుద 69. పాంశుభోజ
70. పాశవేష్ట 71. శూలప్రోత 72. శునీముఖ 73. ప్రకంపన
74. ఉల్కాముఖ 75. అకూప 76. వేదన 77. దండతాడన 
78. జాలబద్ధ 79. దేహచూర్ణ 80. దళన 81. శోషణ 82. కష
83. శూర్ప 84. జ్వాలాజిహ్వ 85. ధూమాంధ 86. నాగవేష్టన
కుండములు.

వీటిలో కొన్నయినా విన్నామా ?
విన్నాంకదా అపరిచితుడు సినిమాలో
ఇక్కడ చాలవిన్నాం గమనించండి
ఇవి వున్నాయో లేదో అన్నది అనవసరం
కానీ ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తూ
ఒకరిని ఇబ్బంది పెట్టకుండా వుంటే
వీటితో పనిలేదని కొందరి నమ్మకం
కాదంటామా? లేదుకదా!