Monday, February 12, 2018

మేఘసందేశం


మేఘసందేశం



సాహితీమిత్రులారా!


డా.సి.నారాయణరెడ్డిగారు కాళిదాసు "మేఘసందేశం"
గొప్పదనాన్ని దృష్టిలో ఉంచుకొని వ్రాసిన కవిత
ఇది చూడండి-

గుత్తులుగా వ్రేలాడు 
గోస్తనుల చందాన
ఆషాఢమున వలా
హక పంక్తి కాలూన;

కాళిదాసు హఠాత్తు
గా నాకు కన్పించె
తిన్నగా "మేఘసం
దేశమ్ము" విన్పించె

అలకాపురమ్మేడ
యక్షదంపతులేడ
వర్షాంబుధరముచే
వార్తావహనమేడ?

చిత్రకూటమ్మేడ
శివుని పర్వతమేడ
గగన కల్లోలిని
కనక సికతములేడ?

సురత కేళి జనిత
పరిఖేదమును బాపు
ఐందవ శిలా పరి
ష్యంది బిందువు లెచట?


హ్రీమూఢ లెచట
కామార్తు లెచట
స్తనభర స్తోక న
మ్ర నవోఢ లెచట?

దనద శాపములేదు
దైవఘటనము కాదు
ఏడాది కాదొక్క
నాడు విరహము లేదు?

యక్షయువకుడు పుష్క
లావర్త మేఘమును 
నిల్పి సందేశమ్ము
తెల్ప బూనగలేదు

గాలి తాకిడిచేత
కదిలిసాగెడు మేఘ
శకల మాతని నివే
దికను వినగాలేదు

కాళిదాసుని హృదయ
కందరమ్ముల లోన
అణగారు విరహమే
అక్షరత్వము దాల్చె


కాళిదాసుని భావ
కల్పనావేశ ఫల
మేకదా యీ నాటి
"మేఘ సందేశమ్ము"

నింగిలో మేఘాలు 
నిల్చియుండే వరకు
కనిపించు కాళిదా
సుని యశశ్చంచలలు

కాళిదాసుని "మేఘ
కావ్య" సందేశమ్ము
స్ఫురించు నన్నాళ్ళు
కురియు నమృతపు జల్లు

No comments:

Post a Comment