Wednesday, March 8, 2017

మగనాలికి నింత విలాస మేటికిన్?


మగనాలికి నింత విలాస మేటికిన్?




సాహితీమిత్రులారా!


ఆడవాళ్ల సౌందర్యాన్ని నిశితంగా పరీక్షించడంలో
సహజంగా వర్ణించడంలో శ్రీనాథుడు అందెవేసిన చేయి.
ఇటువంటి పద్యాలు ఎక్కువగా చెప్పడం వల్ల ఆయన స్రీ
లోలుడనే అపఖ్యాతి అతణ్ణి అలుముకొంది.
శ్రీనాథుడు అవినీతి పరుడుకాదు. రసికుడుమాత్రమే.
ఆనాటి శాస్త్రాలు, సమాజం అంగీకరించిన విధంగా
భోగంవాళ్ళ దగ్గర తన రసికతను చూపి సుఖించే
వాడేగాని మగనాలి జోలికి పోలేదని చెప్పడానికి
సాక్ష్యం ఈ పద్యం చెబుతుంది చూడండి-

వాసనగల్గు మేను నిడువాలుకనుంగవ గబ్బిగుబ్బలున్
గేసరిమధ్యమున్ మదనకేళికి నింపుగ బాహుమూలవి
న్యాసముగల్గి నట్టి యెలనాగను బోగముదాని జేయ కా
దాసరిదాని జేసిన విధాతను నేమనవచ్చు నీశ్వరా!

బోగముదానిగా పుట్టించకుండా
దాసరి వనితా పుట్టించిన విధిని
ఏమనచ్చు ఓ ఈశ్వరా! అంటున్నాడు.


ఇలాగే ఇంకొక పద్యంలో వగలాడిని
మగనాలిగా సృష్టించినందుకు బ్రహ్మను
నిందిస్తున్నాడు చూడండి-

గుబ్బలగుమ్మ లేజిగురు గొమ్మ సువర్ణపు గీలుబొమ్మ బల్
గబ్బి మిటారి చూపులది కాపుది దానికి నేల యొక్కనిన్
బెబ్బులి నంటగట్టితీవి పెద్దవునిన్ననరాదుగాని దా
నబ్బ! పయోజగర్భ! మగనాలికి నింత విలాస మేటికిన్?




దీనితో ఏ పనైనాకలిసిరాకపోవడమన్నది ఉండదు


దీనితో ఏ పనైనాకలిసిరాకపోవడమన్నది ఉండదు




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి-
ఎలా ఉండాలో చెబుతుంది.

నాత్మాన మవమన్యేత
పూర్వాభి ర సమృద్ధిభిః
అమృత్యోః శియమన్విచ్చేః
న్నైనాం మన్యేత దుర్లభమ్


ధనమంతా పోగొట్టుకొని, దుర్భరమైన
దారిద్ర్యంలో మగ్గిపోతూ నానా కష్టాలు
పడుతున్నా సరే .........
ఎప్పుడూ తనను తాను నిందించుకోకూడదు.
జీవించినంతకాలం ఏదో విధంగా ధనాన్ని
సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి
కాని అది అధర్మ మార్గంలో మాత్రం కాకూడదు.
ధైర్యం - దీక్షకలవారికి చేసే ఇటువంటి ఏ పనైనా
కలిసిరాకపోవడమన్నది ఉండదు అని భావం.

Tuesday, March 7, 2017

కలి పరిపక్వతకు ఇవి నిదర్శనాలు


కలి పరిపక్వతకు ఇవి నిదర్శనాలు




సాహితీమిత్రులారా!


కలియుగంలోని వింతను
వివరించే శ్లోకం ఇది
చూడండి-

దానా దరిద్రః కృపణో ధనాఢ్యః
పాపీ చిరాయు స్సుకృతీ గతాయుః
రాజాऽ కులీన స్సుకులీన భృత్యుః
కలౌయుగే షడ్గుణ మాశ్రయంతి

కలియుగంలో ఈ ఆరు ప్రసిద్ధమైనవి-
అవి-
1. దానం చేస్తే దారిద్ర్యం కలగడం
2. మహాలోభి పరమధనవంతుడై వెలగడం
3. పాపి ఎక్కువకాలం జీవించటం,
4. పుణ్యాత్మునికి త్వరగా మరణం సంప్రాప్తించడం,
5. ఉత్తమకులంలో పుట్టినవాడు సేవక వృత్తిలో జీవించడం
6. హీనకులజుడు అధికారం చెలాయించడం

ఇవి కలియుగ పరిపక్వతకు నిదర్శనాలు - అని భావం

కవిసమయములు -1


కవిసమయములు -1




సాహితీమిత్రులారా!


సమయము అంటే సాంప్రదాయం,
ఆచారం లేదా మర్యాద.
ఈ సాంప్రదాయాలు దేశంలోని
ఆచారాలవెనే ఎప్పుడో ఏర్పడినవి.
సంఘముతో సంబంధము ఉన్నంతవరకు
దేశాచారములను ప్రజలు పాటించవలసిన విధంగా
కవులు సరైన సందర్భములో వాటిని పాటించవలసినదే.
వాటిని మార్చటానికి వీలులేదు.
మార్చితే భాషే తలక్రిందులౌతుంది.
ఔచిత్యం దృష్టిలో ఉంచుకొని కొత్తవాటిని సృష్టించుకోవచ్చు.

కవిసమయాలు మూడు విధాలు-
1. ఉన్న ధర్మాన్ని నిబంధించకూడదు
2. లేని ధర్మాన్ని నిబంధించవచ్చు
3. నియతముగా కొన్నిటికి కొన్ని చోటులనే ఉనికిని నిబంధిచాలి
వీటిని ఒక్కొకదానినిగురించి విరించుకుందాం

ఈ క్రంది వస్తువులలో ఉన్న ఆయా ధర్మాలను నిబంధించరాదు

1. మాలతీ(జాజి)లత వసంతంలో 
    పుష్పించునట్లు వర్ణించరాదు.

2. చందన వృక్షాలకు ఫలపుష్పాలు 
    ఉన్నట్లు వర్ణించరాదు.

3. అశోకవృక్షమునకు 
    ఫలములు ఉన్నట్లు వర్ణింపరాదు.

4. కృష్ణపక్షంలో వెన్నె ఉన్నట్లు వర్ణించరాదు.

5. శుక్లపక్షంలో చీకటి ఉన్నట్లు వర్ణించరాదు

6. మల్లెమొగ్గలకు, కాముకుల దంతాలకు
     (తాంబూలం నమలినా ఎర్రగా ఉన్నట్లు)
      ఎర్రగా ఉన్నట్లు వర్ణించరాదు

7. కమల ముకుళము(అరవిరిసిన 
     మొగ్గ)లను పచ్చదనము ఉన్నా
     వర్ణించరాదు.

8. ప్రియంగు(కుంకుమ) పుష్పములకు
     పచ్చదనము ఉన్నా వర్ణించరాదు

9. పగటిపూట నీలోత్పలము
     (నల్లకలువల వికాసము వర్ణింపరాదు

10. పగటిపూట వావిలిచెట్టు పూలు 
      రాలిపోయినట్లు వర్ణించరాదు.

11. స్త్రీలకు నల్లదనమును, 
      స్తనపాతమును వర్ణించరాదు

Monday, March 6, 2017

కాశీలో మరణిస్తే ఆ విభూతి కలుగుతుంది


కాశీలో మరణిస్తే ఆ విభూతి కలుగుతుంది




సాహితీమిత్రులారా!



ప్రౌఢకవి మల్లన కృత
రుక్మాంగదచరిత్రలోని
ఈ పద్యం చూడండి-
కాశీలో మరణిస్తే ఎలాంటి
విభూతికలుగుతుందో తెలుస్తుంది.

కరి కరితోలుఁ గప్పు నురగం బురగంబు ధరించు శాక్వరం
బిరవుగ శాక్వరంబుఁగని యెక్కు మృగంబు మృగంబుఁ బొల్చు భూ
సురవర కాశిలో నధికసుప్తి వహించిన తత్క్షణంబ యే
పురముల కివ్విభూతిపరిపూర్ణత నొందుఁ దలంచి చూచి నన్
                                                                                         (రుక్మాంగదచరిత్రము - 5-59)


ఓబ్రాహ్మణుడా!  కాశీపట్టణంలో
మరణాన్ని పొందినట్లయితే,
వెంటనే ఏనుగు వచ్చి ఏనుగు
తోలును కప్పుతుంది. ఆ జీవుడు
పామయితే పాము వచ్చి తనలో
కలుపుకుంటుంది. ఎద్దయితే
ఎద్దును ఎక్కుతుంది. లేడి అయితే
లేడిగా భాసిస్తుంది. ఎంత ఆలోచించినా
ఐశ్వర్యం తాలూకు (విభూతి) ఈ పరిపూర్ణ
వైభవం ఏ పురాలకు ఉంటుంది.
గజచర్మధారి, నాగభూషణుడు,
వృషభవాహనుడు, మృగహస్తుడు
కావున ెఅక్కడ మరణించిన జీవకోటికి
ఈ విభూతి కలుగుతుంది - అని భావం.

అన్నీ మంచి శకునములే


అన్నీ మంచి శకునములే




సాహితీమిత్రులారా!


మన దేశంలోనే కాదు అన్ని దేశాలలో
శకునాలను నమ్ముతారు
అయితే వారివి ఒకరకమైన నమ్మకాలైతే
మనవి మరోరకమైన నమ్మకాలు
కదిరీపతి శుకసప్తతి లోని ఈ పద్యం చూడండి-
పదియవ కథలో నాయిక సుమతి
తన భర్త పొరుగుదేశం నుండి వచ్చినాడన్న
వార్త విని సంతోషంతో ఆ వార్త తెచ్చిన భటునితో
చెప్పిన పద్యం -

కాకి కఱ్ఱనెఁ దోడనె గౌళి పలికెఁ
బొలిచె నట్టింటఁ గుమ్మరిపుర్వు మెలఁగి
యిన్నియును గల్లగాకుండ నేఁగుదెంచె
హృదయనాయకుఁడోయన్న యిదియె చాట
                                                                             (శుకసప్తతి - 2- 228)

ఓ అన్నా!  ఇంతకు ముందే కాకి
ఒకటి కర్రుమని అరిచింది.
వెంటనే బల్లి కూసింది కుమ్మరిపురుగు
నట్టింటిలో నడయాడి ఒప్పింది.
ఇన్ని శుభశకునాలూ అసత్యంకాకుండా
నా హృదయనాయకుడు పొరుగు దేశంనుచి
వచ్చేశాడు. శకునాలు అబద్ధంకావని
చెప్పడానికే వచ్చేశాడు - అని భావం

Sunday, March 5, 2017

ఆ యిద్దరే ఈజబ్బును పోగొట్టగలరు


ఆ యిద్దరే ఈజబ్బును పోగొట్టగలరు




సాహితీమిత్రులారా!



మనిషికి గర్వాన్ని గలిగించేవి మూడు
అవి ధనం, అధికారం, విద్య
వీటిలో ధనం వల్లవచ్చిన గర్వాన్ని గురించి
కొక్కొండ వేంకటరత్నంగారు
బిలేశ్వరీయంలో
ఈ విధంగా చెప్పారు చూడండి-

కన్నులఁ జూపు గల్గిననుఁ గాంచఁగ నీ దెదురైన, వీనులన్
బన్నుగ విన్కి గల్గిన ననన్ విన నీ, దిఁక నోరు పల్కఁగా
నున్ననుఁ బల్కనీదు, మఱి యున్నను జేతులు మ్రొక్క నీదు,  సం
పన్నుని గర్వ, మత్తెవులుఁ బాపెడి లేవడియేన్ విరక్తుఁడేన్
                                                                                                       (బిలేశ్వరీయము - 3- 15)

ఏ విధంగా ధనం సంపాదించినా వానికి
అది చెప్పగరాని గర్వం కలిగిస్తుంది.
అదే అతనికి పెద్దజబ్బు ఆ జబ్బు కొన్ని లక్షణాలను
కలిగి ఉంటుంది అని వాటిని పేర్కొంటూ ఈ పద్యం చెప్పాడు కవి.


సంపన్నుని గర్వం-
కంటికి చూపు బాగానే ఉన్నా,
ఎవరైనా పెద్దలు ఎదురిగా వచ్చినా
వారిని కన్నెత్తి చూడనివ్వదు.
అలాగే చెవులు ఏలోపం లేకపోయినా
వినికిడి శక్తి ఉన్నా మనం చెప్పింది విననివ్వదు.
ఇక నోరు స్పష్టంగా మాట్లాడటానికి శక్తి ఉన్నా
ఎదుటివారితో ప్రియంగా  మాట్లాడనివ్వదు.
అలాగే చేతులున్నా కూడ పెద్దలకు మ్రొక్కనివ్వదు
డబ్బు వలన వచ్చిన జబ్బును దారిద్ర్యంగాని
లేదా వైరాగ్య జ్ఞానసంపన్నుడైన యోగిపుంగవుడైనా గాని
ఆ యిద్దరే పోగొట్టగలరు ఆ జబ్బును - అని భావం.