Thursday, April 7, 2016

అందఱు నందఱే మఱియు ........


అందఱు నందఱే మఱియు ........

నిన్నటి తరువాయి...
సాహితీమిత్రులారా!
నిన్నటి సమస్య మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్ - అనే దానికి ముందుకాలంలో శ్రీనాథకవిసార్వభౌమునికి ఇచ్చిన సమస్య ఇది చూడండి.  కేవలం సర్వనామాలనే ఇచ్చి పూరించమనడం చాల క్లిష్టమైనది. ఒకానొక సమయంలో ఒక సభలో శ్రీనాథమహాకవిని పరీక్షించడానికి  కుత్సితంగ "అందఱు నందఱే మఱియు నందఱు నందఱె యందఱందఱె" - అనే సమస్యను ఇచ్చారు. దానికి శ్రీనాథుని పూరణ-

కొందఱు భైరవాశ్వములు కొందఱు పార్థని తేరి టెక్కెముల్
కొందఱు ప్రాక్కిటీశ్వరులు కొందఱు కాలుని యెక్కిరింతలున్
కొందఱు కృష్ణ జన్మమునఁ గూసిన వారలు నీ సదస్సులో
నందఱు నందఱే మఱియు నందఱు నందఱె యంద ఱందరే

భైరవాశ్వములు - కుక్కలు, పార్థుని తేరి టెక్కెముల్ - కోతులు, ప్రాక్కిటీశ్వరులు - వరాహాలు, కాలుని యెక్కిరింతలు - దున్నపోతులు, కృష్ణ జన్మమునఁగూసిన వారలు - గాడిదలు, అంటే సభలోని వారు కుక్కలు, కోతులు, పందులు, దున్నలు, గాడిదలు అని నిందాహేళనం.


Wednesday, April 6, 2016

మీరును మీరు మీరు....


మీరును మీరు మీరు....


సాహితీమిత్రులారా!
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి ఒకమారు వేశ్య(కవయిత్రి) వచ్చి అష్టదిగ్గజకవులకు సవాలుగా ఒక సమస్యను ఇచ్చింది. "మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్" - అనేది సమస్య. ఆ సమస్యను మరుసటి రోజుకు చెప్పేవిధంగా సమయమిచ్చింది. దీనికి సమాధానం ఎలాగా అని ఆలోచించి తెనాలి రామకృష్ణుని ఆశ్రయించినారు. దానికి అతడు పెద్దనతో  "రేపు బోగంది వచ్చి సమస్య అడిగినంతలో మా శిష్యుడు అని మీరు చెప్పగా నేను మీ శిష్యుడనై చెబుతాను" -  అని అన్నాడు. కచేరి ప్రారంభమైంది పెద్దన తన శిష్యుడు చెబుతాడని చెప్పాడు. తెనాలిరామకృష్ణుడు లేచి పద్యాన్ని ఈ విధంగా పూరించాడు.

"కోరిక లుప్పతిల్ల మదిఁగోరిన యట్టి కళా విశేషముల్
 చారు తరంబులన్ రతుల సల్పఁగ నేర్చిన యట్టి జాణ యీ
 వార వధూ శిరోమణి వంతుల వేసుక దెబ్బ తీయుఁడీ
 మీరును మీరు మీరు మఱి మీరును మీరును మీరలందఱున్"

దీనితో అష్టదిగ్గజ కవులు ఆనందించగా సభ అంతా కరతాళధ్వనులతో వెల్లివిరిసింది. 

Tuesday, April 5, 2016

కవితా కన్యకు.....


కవితా కన్యకు..... 

సాహితీమిత్రులారా!
కన్యనే కాదు కవితాకన్యను కూడా తగిన వానికే దానం చేయాలి అని నాచనసోమనాథుని చమత్కార పద్యం.
ఇది పొత్తపి వేంకటకమణ కవి తన లక్షణశిరోమణి(2-163)లో ఉదహరించబడినది.

కవితా కన్యక కెందును

గవి జనకుఁడు, బట్టుదాది గణుతింపంగా

నవరస రసికుడె పెనిమిటి 

యవివేకియె, తోడఁబుట్టువనవేమ నృపా!


ఓ అనవేమనృపాలా!  కవితా బాలకు కవి తండ్రి, ఎత్తుకొని పదిచోట్ల తిప్పి ప్రకాశితం చేసే భట్టు దాది వంటివాడు.అనుభవించే సహృదయడు, శృంగారాది నవరసానుభవ యోగ్యుడు భర్త. అవివేకి తోడబుట్టువు వంటివాడు. కావున కవితాకన్యను నవరసరసికునికే ఇవ్వాలని కవి భావన.

Monday, April 4, 2016

చమత్కార పద్యం - గణేశప్రార్థన


చమత్కార పద్యం  -  గణేశప్రార్థన


సాహితీమిత్రులారా!
                            అల్లసాని పెద్దన మనుచరిత్రలో చేసిన గణేశ ప్రార్థన పద్యం ఇది.

అంకముఁజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బా

ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్గబళింపఁబోయి యా 

వంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి వే మృణా

ళాంకుర శంకనంటెడి గజాస్యునిఁగొల్తు నభీష్టసిద్ధికిన్

ఇది ఆంధ్రకవితా పితామహుని సృష్టి. ఇందులో ఆంధ్రకవితకు పితామహుడు అంటే తాత కాదు పితామహుడు అంటే బ్రహ్మ అనిఅర్థం. అంటే ఆంధ్రకవితకు బ్రహ్మ అయిన వాని సృష్టి ఈ చమత్కార పద్యం. ఇంతకూ దీని భావం కవిసామ్రాట్ విశ్వనాథసత్యనారాయణగారి మాటల్లో విందాం.

అంకము, జేరి - తొడనెక్కి, తల్లితీసి తొడనెక్కించుకోలేదు. ఇతడే ఎక్కినాడు.
శైలతనయాస్తన దుగ్ధములు - తల్లి అయిన పార్వతి చనుబాలు. ఆమె కొండకూతురు. 
                                            ఆమె యందు స్తన్యసమృద్ధి ఎంత ఉండునో తెలియదు.
బాల్యాంక విచేష్టన్ - బాల్యమునకు చిహ్నమైన విశేషమైన చేష్టతో, శైశవము కాదు బాల్యం 
                             అంటే మకురుపాలు తాగుచున్నాడేమో.
తొండమున నవ్వలి చన్గబళింపఁబోయి - పిల్లలు పాలు త్రాగుతూ విడిగా ఉన్న చేతితో తల్లి రెండవ ఱొమ్మును                                                                    స్పృశించుదురు, పుణుకుదురు. ఈ చేష్టసరియే ఈ విఘ్నేశ్వరుడు తల్లి                                                                యొక్క రెండవ చన్ను తొండంతో గ్రహించబోతున్నాడు. తనకు చేయి                                                                  ఉన్నది కదా!  ఇది బాల్యాంక విచేష్టము కాదు. ఏనుగు మొగము కలిగి                                                                ఉన్నవాని లక్షణము.
అవ్వలి చన్ కబళింపఁబోయి -  కబళించుట అనగా తినుట, కబళము - ముద్ద,  
                                            చన్నును కబళింప బోవుటయేమి సరే!
ఆవంక కుచంబుఁగాన కహివల్లభహారముగాంచి - వెదకినాడు కుచము కనిపించలేదు. హారముగా ఉన్న పాము                                                                              కనిపించింది. అహివల్లభుడే హారము. దానిని చూచినాడు.                                                                                   చూచినాడనగా తెలిసికొన్నాడని అర్థం. కాంచి అనకూడదు.                                                                                 అతడు అహివల్లభ హారముగా తెలిసికొనలేదు.
                                                                        అచట అహివల్లభ  హారము ఉండటంచేత అది
                                                                        మృణాళాంకురం అనుకున్నాడు.    
మృణాళాంకురం- తామర యొక్కతూటి మొక్క.
అహివల్లభుడు అనగా వాసుకి. సర్పములకు రాజు. అతడు శివునికి ఆభరణం. అతన్ని మృణాళాంకురంగా అనుకోవడం ఎలా ఆవాసుకి శరీరం మహాదీర్ఘము, మహాస్థూలము అయి ఉండాలి. 
ఇది అర్థనారీశ్వర మూర్తి యొక్క వర్ణన. ఇతడు గజాస్యుడు ఏనుగు మొగంవాడు.
అభీష్టసిద్ధికై ఇతనిని కొలుచుటలో అతనియందభీష్టములు సమకూర్చు లక్షణములు లేవు.
అలాంటి లక్షణాలు వర్ణింపబడలేదు. వ్యుత్పత్తి చేత గజ శబ్దం అర్థం మదంకలది - అని. యదార్థం గ్రహించలేనిది. ఇది లోకం స్వభావం. ఈ లోకమే విఘ్నేశ్వరుని ముఖం. ఈ లోకం వట్టి భ్రాంతిమయం.  తెలిసికూడా వట్టి భ్రాంతి. అర్థనారీశ్వరుడు అనగా లోకము యొక్క మహాతత్వం. పుంజీభూతమై అట్టి దేవతా రూపం కట్టినాడు. పార్వతి, దుర్గ,ప్రకృతి - పంచభూతముల సమాహారం. పరమేశ్వరుడు ఈ పంచభూతముల యందు అభివ్యాప్తమైన చైతన్యం. ముఖ్యప్రాణం. విజ్ఞానమయ బ్రహ్మ మొదలైనవి కావచ్చు.  వారికి ముఖము మదముతో నిండిన కొడుకు పుట్టాడు. మదాన్ని మినహాయిస్తే వీడు పరమ చైతన్య స్వరూపం. అతనిని కూడా దేవతగా కన్పించి - మన మదం మనకు తగ్గరాదు - మన పనులు మనకు కావాలని అలాంటి విఘ్నేశ్వరుని ప్రార్థిస్తున్నాము.
ఈ విధంగా సాగింది వివరణ విశ్వనాథవారి కావ్యపరీమళం (వ్యాససంపుటి) లో. 




Sunday, April 3, 2016

చమత్కార పద్యం -6

చమత్కార పద్యం -6


సాహితీమిత్రులారా!


మాట అంటే పదము, వాక్యం, వార్త, సూక్తి, లోకోక్తి, ప్రతిజ్ఞ, కథ, ప్రార్థన ఇలా అనేక అర్థాలున్నాయి. 

ఈ పద్యం చూడండి మాటను ఎంత గొప్పగా చూపించాడో.

మాటలచేత దేవతలు మన్ననచేసి వరంబులిచ్చెదర్
మాటలచేత భూపతులు మన్ననచేసి ధనంబు లిచ్చెదర్
మాటలచేత కామినులు మగ్నతచెంది సుఖంబు లిచ్చెదర్
మాటలు నేర్వకున్న అవమానము, న్యూనము, మానభంగమున్


కాబట్టి మంచి మాటలు నేర్చి, అర్థం చేసికొని, చక్కగా వివరించడం కూడా అభ్యాసం చేయాలి. లేకుంటే అగౌరవం, హీనత్వం, గర్వభంగం మొదలైనవి ఎన్నో గలుగుతాయి. కావున ప్రతి మనిషి సమయానికి తగిన విధంగా మాట్లాడవలెనని కవి హెచ్చరికగా దీన్ని భావించవచ్చు. మాటమీద ఎంత చమత్కార పద్యం.

Saturday, April 2, 2016

చమత్కార పద్యం -5

చమత్కార పద్యం -5

నిన్నటి తరువాయి...
సాహితీమిత్రులారా!
కవయిత్రిమొల్ల పద్యానికి అనుసరిస్తూ సాహిణిమారనపై చెప్పిన చమత్కారపద్యం ఇది.

జడలలో మిన్నేఱుఁజంద్ర రేఖయుఁగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
వరవజ్ర కవచంబు వజ్రాయుధముగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
కోల్పోవు తనయుండు క్రోఁతి టెక్కెముగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
చెఱకు సింగిణి విల్లు సెలగోలయును గల్గు నాతఁడీతండు నేమౌదురొక్కొ
శంభుఁడాతండు శాశ్వతారంభుఁ డితఁడు
ఇంద్రుఁడాతండు భోగ దేవేంద్రుఁడితఁడు
పార్థుఁడాతండు సమర సమర్థుఁడితఁడు
మారుఁడాతండు సాహిణి మారుఁడితఁడు

మొదటి పాదంలో శివునితోను, రెండవ పాదంలో ఇంద్రునితోను, మూడవ పాదంలో పార్థునితోను, నాలుగవ పాదంలో మన్మథునితోను సాహిణిమారుని పోల్చాడు కవి.

జడలలో మిన్నేఱుఁజంద్ర రేఖయుఁగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
శంభుఁడాతండు శాశ్వతారంభుఁ డితఁడు
వరవజ్ర కవచంబు వజ్రాయుధముగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
ఇంద్రుఁడాతండు భోగ దేవేంద్రుఁడితఁడు
కోల్పోవు తనయుండు క్రోఁతి టెక్కెముగల యాతఁడీతండు నేమౌదురొక్కొ
పార్థుఁడాతండు సమర సమర్థుఁడితఁడు
చెఱకు సింగిణి విల్లు సెలగోలయును గల్గు నాతఁడీతండు నేమౌదురొక్కొ
మారుఁడాతండు సాహిణి మారుఁడితఁడు

Friday, April 1, 2016

చమత్కార పద్యం - 5


చమత్కార పద్యం - 5

సాహితీమిత్రులారా!

                            కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజకవుల పేర్లు అనేక విధాలుగా చెప్పడం జరుగుతోంది. ఈ పేర్లలో కవయిత్రి మొల్ల పేరుకూడా వినబడుతూవుంది. కవయిత్రిమొల్ల మొదటిసారి రాయలవారిని దర్శించుకున్న సమయంలో ఆమె ప్రభువులను ప్రస్తుతిస్తూ ఇలా చెప్పారు.

అతఁడు గోపాలకుండితఁడు భూపాలకుం 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు పాండవపక్షుఁడితఁడు పండిత రక్షుఁ 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు యాదవ పోషి యితఁడు యాచకపోషి 

యెలమి నాతనికన్ననితఁడు ఘనుఁడు
అతఁడు కంసధ్వంసి యితఁడు కష్టధ్వంసి 

యెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
పల్లె కాతండు పట్టణ ప్రభువితండు
స్త్రీల కాతండు పద్మినీ స్త్రీలకితఁడు
సురల కాతండు తలప భూసురులకితఁడు
కృష్ణుఁడాతండు శ్రీ మహాకృష్ణుఁడితఁడు

అని కృష్ణుని, శ్రీకృష్ణదేవరాయలను పోల్చి, కృష్ణునికన్న రాయలే గొప్ప అని చమత్కరించి చెప్పినది. ఈ పద్యాన్ని విన్న తెనాలిరామకృష్ణుడు తన సహజ వికట స్వభావాన్ని ప్రదర్శిస్తూ ఇలా చమత్కరించాడు.

అతఁడంబకు మగఁడు ఈతఁడమ్మకుమగఁ 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడు శూలముద్రిప్పు నితఁడు వాలముద్రిప్పు 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతఁడమ్ముననేయు నితఁడు కొమ్మునఁడాయు 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు
అతని కంటనుజిచ్చు నితని కంటను బొచ్చు 

డెలమి నాతనికన్న నితఁడు ఘనుఁడు

దాతయాతండు గోనెల మోతయితఁడు
దక్షుఁడాతండు ప్రజల సంరక్షుడితఁడు
దేవుఁడాతండు కుడితికి దేవుఁడితఁడు
పశుపతి యతండు శ్రీమహాపశువితండు.

అని ఈశ్వరుని, నందీశ్వరుని పోల్చి, ఈశునికన్న నందీశుడే గొప్పని వికటంగా చమత్కరించాడు.