కిన్నెర సానిపాటలు
సాహితీమిత్రులారా!
జ్ఞానపీఠ అవార్డు పొందిన విశ్వనాథ సత్యనారాయణ గారి
రచనలలో కిన్నెరసాని పాటలు ఒకటి. ఇది గేయకవిత్వంలో
వ్రాయబడింది. ఇదొక కల్పన.
ఇందులో కిన్నెర మహాపతివ్రత.
అందరు తెలుగు పిల్లల్లాగే ఉద్విగ్న హృదయ. ఎక్కువ తెలుగు కుటుంబాల్లాగే ఇక్కడా అత్తాకోడల్ల పోరాటం ఆయింట వెలసింది. కొడుకు సుఖమెరుగని అత్తకు కోడలిపై నిందలారోపించడం పని అయిపోయింది. ఒకప్పుడు ఆమె చేసిన నింద భరించటం కష్టమైపోయింది. కిన్నె హృదయం శోకంతో ప్రళయసముద్రం అయిపోయింది. కిన్నెర భర్త ఏంచేస్తాడు అటితల్లిని ఇటు భార్యను కాదనలేకపోయాడు. భార్యను ఓదార్చుకోలేకనూ పోయాడు. ఆవేశహృదయంతో కిన్నెర అడవులవెంట పరుగెత్తింది. భర్తపోయి ఆమెను వద్దని కౌగిలించుకున్నాడు. ఆమె భర్త కౌగిట్లోనే కరిగి వాగై పోయింది. అతడు శోకించి శోకించి శిల అయినాడు.
వనములను దాటి ''వెన్నెల బయలు'' దాటి
తోగులను దాటి దుర్గమాద్రులను దాటి
పులుల యడుగుల నడుగులు కలుపుకొనుచు
''రాళ్లవాగు'' దాటి పథాంతరములు దాటి
అచట కిన్నెరసాని ---
నాయాత్మ యందు
నిప్పటికిని దాని సంగీతమే నినదించు-
కిన్నెర పుట్టుక
ఓహో కిన్నెరసానీ
ఓహో కిన్నెరసానీ
ఊహామాత్రము లోపల
నేల నిలువవే జవరాలా!
కరగిపోతి నిలువెల్లను
తరలించితి నాజీవము
మరగిపోయి నాగుండియ
నురిగిపోయెనే జవరాలా - ఓహో!
తనయెడ తప్పేయున్నది
అనుకోవే నాథునిదెస
వనితలు నీవలె కఠినులు
కనిపించరు వే యెందును - ఓహో!
ఇంత కోప మేమిటికే
ఇంత పంత మేమిటికే
ఇంతులు జగమున పతులకు
నింతలు సేయుదురట వే - ఓహో!
ఇప్పుడేగదె నాకౌగిట
కప్పితి నీ శోకమూర్తి
అప్పుడే నిలువున నీరై
యెప్పుడు ప్రవహించితివే - ఓహో!
అంత పగే పూనితివో
అంత కోప మొందితివో
ఇంతీ నను శిక్షింపగ
నింకొక మార్గము లేదటె - ఓహో!
రాలపైత తొలినాళుల
కా లిడగా నోర్వలేవు
రాలను కొండల గుట్టల
నేలా ప్రవహించెదవో - ఓహో!
ఈ దురదృష్టుడ నేమని
రోదించెద నడవులందు
నీదే నీదే తప్పని
వాదించిన వడవులెల్ల - ఓహో!
ఇదిగొ చేతులను చాచితి
నేడ్చుచుంటి కంఠమెత్తి
ముదితా వినిపించుకొనక
పోతివటే ప్రియురాలా - ఓహో!
నీకై యేడిచి యేడిచి
నాకంఠము సన్నవడియె
నాకన్నులు మందగించె
నాకాయము కొయ్యబారె - ఓహో!
ఈ యేడుపు రొదలోపల
నా యొడలే నేనెరుగను
నాయీదేహ మిదేమో
ఱాయివోలె నగుచున్నది - ఓహో!
This comment has been removed by a blog administrator.
ReplyDelete