వేదంలా గోదావరి...........
సాహితీమిత్రులారా!
ఆరుద్రగారి ''గేయాలూ - గాయాలూ''
నుండి ఈ కవిత
ఆస్వాదించండి-
వేదంలా గోదావరి ప్రవహిస్తోందే చెల్లీ
వెన్నెల వలె కృష్ణఁవేణి విహరిస్తోందే తల్లీ
విశాలాంధ్ర నలుమూలల
వైవాహిక వైభోగం
జనుల కనుల వెలుగులలో
జాజులు వారెడి రాగం
గెలవేసిన అరటిచెట్లు తీసుకురానా తల్లీ
ఎలమామిడి తోరణాలు కట్టనా చెల్లీ
గడపమీద చిగురు జల్ల
గరిపొడిచెను శోభ
ముంగిటముత్యాల నవ్య
రంగవల్లి సుప్రభ
ఏరువాక పడవలాగ ఎద ఊగిసలాడునులే
జోడెద్దుల బండివలె గుండెలురికి సాగునులే
కల్యాణ తిలక రేఖగ
కస్తూరి బొట్టు దిద్దవే
తెలుగు వెలది బుగ్గమీద
దిష్టిచుక్క పెట్టవే
తలంబ్రాల తనిసినటుల ధరణి తోచునే చెల్లీ
వసంతాల తడిసినటుల సంజెమెరయునే తల్లీ
జనావళికి సంతతం
సంతోషప్రాప్తి
విశాంధ్ర నిండా
వైవాహిక దీప్తి
తుత్తురా మాదిరిగా తుంగభద్ర నాదమే
సన్నాయికి మల్లే పెన్నానది గానమే
No comments:
Post a Comment