అయ్యలరాజుగారి సీతాలావణ్యం
సాహితీమిత్రులారా!
"అయ్యలరాజు రామభద్రు"ని "రామాభ్యుదయం"లో
ఆయన "సీత"ను వర్ణించిన తీరు ఇక్కడ చూద్దాం-
కళ వెచ్చఁబోని నిర్మలచంద్రబింబంబు
పరభృతం ూంటని సరసకిసల
మినకరవ్యాప్తి వాడని కమ్మపూఁదీవ
మరుఁడేర్చి దాఁచిన మార్గణంబు
లఁటిచూడని మించుటద్దంపుఁ బలకలు
కొదమ రాయంచ మార్కొనని తూండ్లు
వలరాచయాఁకఁ బాటిలు మ్రానిక్రొంబండ్లు
కానంగరాని శృంగారసరసి
యనఁ బుడమి ముద్దరాలి నెయ్యంపుఁజూలి
ముద్దు నెమ్మోము మించు కెమ్మోవి మేను
కలికిచూపులు తళుకుఁ జెక్కులు భుజంబు
లుదుటుఁ జనుగవయును నాభియును దనర్చు
ఆ సీత ముఖం కళలు తరని చంద్రబింబం.
కెమ్మోవి కోకిలముట్టని మావిడిచిగురు.
శరీరం సూర్యకిరణాలచే వాడని పూతీగ.
చూపులు మన్మథుడు మంచివిగా ఏర్పరచి
దాచిపెట్టిన బాణాలు. చెక్కిళ్ళు మించుటద్దములు.
భుజాలు తామరతూండ్లు, నాభికనిపించని శృంగార సరసి.
ఎలఁదీవఁబోడి జానకి
కలభాషిణి యలరురూపు కలిమిం గడు రం
జిలు శరథి వెడలి వెలిఁగెడు
నల చక్కెవింటివాని యమ్మో యనఁగాన్
లేతతీగవలె మనోహరమైన శరీరంకలది.
అవ్యక్తమధురమైన పల్కులు కలది.
పుష్పమువలె కోమలమైన రూపంతో
ఒప్పే సీత సముద్రం నుండి బయటికి
వచ్చిన లక్ష్మిదేవియా లేక మన్మథబాణమా
అన్నట్లు ఒప్పుచున్నది - అని భావం.
తుమ్మెదకంటు పూమొగడతోఁ దులఁదూగు లతాంగి ముక్కునె
త్తమ్మికి జాతిదాయ వనితాజనతామణిమోము కంతు క్రొ
త్తమ్ములతమ్ము లిందుకళికాలిక వాలిక పూపుఁ గోపు ల
క్కొమ్మకు సావిమావిసెలగొమ్మకు సాటియె బోటు లెయ్యె డన్
ఆ సీత ముక్కు సంపెంగపూవును పోలివున్నది.
ముఖం కమలాలన్నిటిని శత్రువులాంటిది.
చూపులు మన్మథ బాణాలు. ఆ తరుణికి
సాటిరాగల స్త్రీల లోకంలో ఎక్కడా లేదు
- అని భావం
కమలంబు మోము కన్నులు
కమలంబులు కేలుఁగవయుఁ గమలము లడుగుల్
కమలంబులు నిలువెల్లను
గమలాకృతి మించె బుడమి కన్నియ బళిరే
ఆ కన్నె మొగం కమలాలవలె ఉన్నాయి.
కనులు కమలాలను పోలి ఉన్నాయి.
చేతులు కమలాలవలనే ఉన్నాయి.
పాదాలు కమలాలట్లే ఉన్నాయి.
ఇన్నిమాటలెందుకు ఆపాదమస్తకం
ఆ ఇంతి ఆకారం కమలాకారమే అంటే
లక్ష్మీరూపం అని భావం.
ఆకరియానవేలి యనంతవిలాసము మాధవోదయం
బాకమలాయతాక్షిమధురాధరసీమ హరిప్రకార మా
కోకిలవాణి మధ్యమునఁ గూడిన దింతయు కాదు తాను రా
మాకృతి దాల్చె నీచెలువమంతయు నాయమయందుఁ జొప్పడున్
రామచంద్రా ఆమె ఏనుగు వంటి నడక కలది.
సీత జడ అనంతుని(సర్పరాజైన ఆదిశేషుని) వలె ఉన్నది.
ఆమె పెదవి మాధవుని(వసంత)కాలంలోని చిగురువలె ఎఱ్ఱగా
ఉన్నది. ఆమె నడుము హరి(సింహం)వలె ఉన్నది.
ఈ ఉపమానాలన్నీ (అనంతుడు, మాధవుడు, హరి) విష్ణువుకు
పర్యాయపదాలే. ఆ విష్ణువు నీవే. కావున నీ లక్షణాలన్నీ
ఆమెలో చేరి ఉన్నాయి. అంతేకాదు ఆమె రామ(స్త్రీ) రూపము
దాల్చి నీ సౌందర్యమునంతా కలిగి ఉన్నది - అని భావం.
జొక్కపుఁ బసిండి నక్కులఁ జెక్కుఁ జెక్కు
లక్కలికికొప్పు నాలాంబుముక్కు ముక్కు
కనకగంధఫలీసారకంబు కంబు
కలిత రేఖావిలాసమంగళము గళము
ఆ కలికి చెక్కిళ్ళు బంగారాన్ని మించిన మెఱుస్తున్నాయి
కొప్పు మేఘాన్ని పోలి ఉంది ముక్కు బంగారపు సంపెగపూవు
వలె ఉంది. మెడ శంఖం మాదిరి ఉంది - అని భావం.
No comments:
Post a Comment