Saturday, February 24, 2018

మతుకుపల్లి వారి సరస్వతీ స్తుతి


మతుకుపల్లి వారి సరస్వతీ స్తుతి
సాహితీమిత్రులారా!
Image may contain: 1 person
ముఖపుస్తకంలో Dr. ఏల్చూరి మురళీధరరావుగారు పోస్ట్ చేసిన
సరస్వతీదేవి ప్రార్థన  వారిమాటల్లో చూద్దాం-
ఈనాటి సుప్రభాత వేళ శ్రీ మతుకుమల్లి నృసింహశాస్త్రి గారి అజ చరిత్రమును చదువుతున్నప్పుడు అవతారికలో ఈ స్తుతి కనబడింది. దైవదత్తమైన ఆ మహాపాండితికి, అపూర్వమైన ఆ కల్పనాశిల్పశోభకు, అపారమైన ఆ భక్తిపారమ్యానికి ఆశ్చర్యాతిశయం కలిగింది. ఇంతటి గాఢబంధంతోనూ, గంభీరమైన భావసంపుటితోనూ రచితమైన సరస్వతీ సంప్రార్థన ఇంకొకటి ఇంతవరకు నాకు కానరాలేదు. సర్వవిధాల ఆయన కవితాధోరణి నిరుపమానం అనిపించింది. అర్థతాత్పర్యాలతో ప్రకటించినట్లయితే కావ్యం విద్యార్థిలోకంలో సుప్రతిష్ఠితమై ఉండేదని అనిపించింది.

అద్భుతావహమైన ఆ పద్యరాజం ఇది:

ఘన ఘనశ్రీ సముత్కటజటా వర పదక్రమయుక్త్రయీమయ రమ్యవేణి 
నానాస్వరవ్యంజనప్రతానానూనశబ్ద మహాశబ్దశాస్త్రవీణ
భూరిగుణవిశేషపుంజైకనిత్యసంబంధవత్తర్కవిభ్రాజిరశన
సరససాలంక్రియోజ్జ్వలసువర్ణపదోరుసంగీతసాహితీస్తనభరాఢ్య

క్షిప్రసద్గతిముఖరభాట్టప్రభాక
రీయమంజీరయుగరమణీయచరణ
జలజ నిత్యప్రగల్భవాచాల వాణి
నిలచుఁ గాఁత మదీయాస్య జలరుహమున.

♦️ ఘన ఘనశ్రీ ... రమ్యవేణి – ఘన = దట్టముగా క్రమ్ముకొన్న, ఘన = మేఘము యొక్క, శ్రీ = శోభవంటి శోభచే, సముత్కట = విరివియైన, జటా = కేశముల అల్లికచే, వర = శ్రేష్ఠమైన, పద = స్వరూపముతోడి, క్రమయుక్ = విధానమును కలిగిన, త్రయీమయ = మూడు పాయలతో సంలగ్నమైన, రమ్యవేణి = అందమైన వేనలిని కలిగినదియును –

(ఘన = సంపుటీకరింపబడిన, ఘన = ఘనము అను పేరు గలిగిన గానఫణితి తోడను, శ్రీసముత్కటజటా - శ్రీ = బ్రహ్మవిద్యాసిద్ధికై, సముత్కట = నేర్చికొనుటకు విషమమైన, జటా = జట అను పేరుగల ఫణితి తోడను, వరపదక్రమయుక్ – వర = కోరదగిన, పద = పదము అను పేరు గల పాఠవిశేషము తోడను, క్రమ = క్రమము అను పేరితోడి పాఠక్రమము తోడను, యుక్ = కూడినట్టి, త్రయీమయ = ఋగ్యజుస్సామములను మూడు వేదములు మూడు పాయలుగా ప్రవహించుచున్న, రమ్యవేణి – అందమైన వాక్స్రవంతిని గలదియును - అని ఇంకొక అర్థం);

♦️ నానా ... వీణ – నానా = సాహిత్యమునందు అనేక ప్రకారములైన, స్వర = అచ్చుల యొక్క (ఉదాత్త అనుదాత్త స్వరిత ప్లుతములను ఉచ్చారణవిశేషముల యొక్క), వ్యంజన = హల్లుల యొక్క, ప్రతాన = విరివిచే ఏర్పడునట్టి, అనూన = సార్థకములైన, శబ్ద = పదసంపదతోడి, మహాశబ్దశాస్త్ర = విస్తారమైన వ్యాకరణశాస్త్రమునకు ప్రాణశక్తిని కూర్చు, వీణ = వీణాదండమును కలిగినదియును –

(నానా = సంగీతమునందు బహుత్వసిద్ధి గల, స్వర = స్వతోరంజకములైన సప్తస్వరముల యొక్క, వ్యంజన = సువ్యక్తమగు, అనూన = శ్రుతిస్ఫుటవైఖరిని పరిపూర్ణముగా కలిగిన, శబ్ద = ధ్వన్యాత్మకమైన, మహాశబ్దశాస్త్ర = సంగీతశాస్త్రమునకు మూలకందమైన, వీణ = వీణాదండమును కలిగినదియును – అని ఇంకొక అర్థం);

♦️ భూరి ... రశన - భూరి = అధికతరమైన, గుణవిశేషపుంజ = సత్యదయాది గుణవిశేష పరంపరతో, ఏక = ఐక్యమును భజించి, నిత్యసంబంధవత్ = ఎల్లప్పుడు కూడియుండవలెనడి, తర్క = ఆకాంక్షచే, విభ్రాజి = ప్రకాశమానమైన, రశన = నాలుకను కలిగినదియును –

(భూరి = విస్తారమైన భూమికతోడి, గుణవిశేషపుంజ = చతుర్వింశతి తత్త్వములను నిరూపించు గుణముల సముదాయముతో, ఏక = కైవల్యరూపమైన, నిత్యసంబంధవత్ = నిత్యత్వసిద్ధిని (సంసర్గమును) కలిగిన, తర్క = తర్కశాస్త్రము యొక్క వికసనముచే, విభ్రాజి = మెరయుచున్న, రశన = మొలత్రాడు కలిగినదియును – అని ఇంకొక అర్థం);

♦️ సరస ... భరాఢ్య - సరస = రసవంతమైన, స+అలంక్రియా = సరిగమపదని అను సప్తస్వరముల అందమైన కూర్పుచే సిద్ధించు అలంకారముల ప్రయోగము చేత, ఉజ్జ్వల = ఔజ్జ్వల్యము అను శాస్త్రధర్మమును గల, సు+వర్ణ = షడ్జాది స్వరముల యొక్క గతివిశేషములను ప్రకటించు రచనముల చేతను, పద = పదములు అను రచనావిశేషముల చేతను, ఉరు = విస్తారమైన, సంగీత = సంగీతశాస్త్రము యొక్క మాధుర్యముతో నిండినట్టిదియును –

సరస ... భరాఢ్య - సరస = నవరసముల కూడిక చేత, స+అలంక్రియా = కావ్యశోభాకరములైన అలంకారముల ప్రయుక్తి చేత, ఉజ్జ్వల = విశదమైన, సువర్ణ = అక్షరరమ్యత గల, పద = అర్థవంతములైన సుశబ్దములచే నిండి, ఉరు = విశాలమైన, సాహితీ = సాహిత్యశాస్త్ర మధురిమను ప్రసాదించునట్టిదియును అగు,

స్తనభరాఢ్య – స్తనభర+ఆఢ్య = (ఒకటి ఆపాతమధురమగు సంగీత రసము చేతను, వేరొకటి ఆలోచనామృతమగు సాహిత్య రసము చేతను నిండిన) వక్షోజముల యొక్క బరువుచే, ఆఢ్య = కూడినట్టిదియును;

♦️ క్షిప్ర = శీఘ్రగతిని గల, సద్గతిముఖర – సద్+గతి = అందమైన నడకచే, ముఖర = గలగల చప్పుడుచేయుచున్న, భాట్ట ప్రభాకరీయ = మీమాంసా శాస్త్రములో కుమారిల భట్ట మతము, ప్రభాకర మతము అను రెండు మార్గములచే నిర్మింపబడిన, మంజీరయుగ = కాలి అందెల జంటచే, రమణీయ = అనుక్షణము సరిక్రొత్తదిగా భాసించు, చరణ జలజ = పాదపద్మములు గల,

♦️ నిత్యప్రగల్భవాచాల – నిత్య = ఎల్లప్పుడు, ప్రగల్భ = ప్రత్యుత్పన్నమైన ప్రతిభను ప్రకాశింపజేయు, వాచాల = వాక్యరీతిని కలిగిన,

♦️ వాణి = సరస్వతీదేవి,

♦️ మదీయ = నా యొక్క; ఆస్యజలరుహమున – ఆస్య = ముఖమనెడి, జలరుహమున = పద్మమునందు; నిలచున్+ కాఁత = నిలచియుండును గాక. అని!

No comments:

Post a Comment