Tuesday, August 29, 2017

మన భారతి కిండిక పద్యహారతుల్


మన భారతి కిండిక పద్యహారతుల్



సాహితీమిత్రులారా!

మన భాషఎంత గొప్పదో తెలిసి కూడ
ఆంగ్లభాషవైపు వెళ్ళడం చూచి
అలంకారం కోటంరాజుగారు
అలా వెళ్ళకండని తెలుగు భారతికి
హారతులివ్వండని చెబుతున్నాడు చూడండి-

తెనుగు పద్యంబు హృద్యంబు, తెన్గుపల్కు
తేనియల యూట, యమృతంపు తేటగాదె
ఎల్లవారల హృదయాల కొల్లగొనెడి
పరసువేదియ కద తెన్గుభాషయనగ

తెనుగు, తెలుంగు, యాంధ్రమని, తేరగ పల్కుట గాదు, నిత్యమున్
మనము స్వభాషకై హృదయమందున నెవ్విధి చింతజేసి నా
మనియెడు చర్చబూనిన, క్రంబున తోచు హుళక్కియంచు, జీ
వనమున తెన్గుసేవయె జవంబును, సత్త్వము, తేజ మీయదే

మన జాతియు, మన భాషయు
ఘనమైన చరిత్రగలవి గతకాలమునన్,
తెనుగును బ్రతికింపగ చిం
తన జేయుడు, మీరు తెనుగుదనమును నిల్పన్

ఇంతనరాని భాషయిది, యెంతగ జెప్పిన తీరబోదు, ఇం
తింత త్రివిక్రమత్వమున, ఏపు వహించి, మహోన్నతంబునై
ప్రాంతము లాక్రమించినది, ప్రాపు నొసంగిన నింతకింకయై
వింతలొనర్చు, సుంతయు వివేకము జూపుడు, భాషపెంపగున్

తెనుగు చదువుడు, చదివింప జనుల నడుమ
నడుముగట్టుడు, ఇంకముందు నడుపుడంచు
వేయబోకుడు పొలికేక, శ్రేయమొసగు
పద్ధతిని యాచరింపంగ భాష పెరుగు

అట్టితెనుంగువీడి, జనులందరు నాంగ్లపు మాయజిక్కగా
నెట్టుమనస్సు పుట్టినది, యియ్యది మాన్యతమంబు గాదు, ఎ
ప్పట్టుననైన, మీరలు అపార ముదంబున తెన్గుభాషకున్
పట్టముగట్టరండు, మన భారతి కిండిక పద్యహారతుల్

(పద్యప్రకాశం నుండి-)

తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు


తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు,
శ్రేయోభిలాషులకు
తెలుగుభాషా దినోత్సవ శుభాకాంక్షలు

Monday, August 28, 2017

విశ్వనాథవారి చమత్కారం


విశ్వనాథవారి చమత్కారం




సాహితీమిత్రులారా!

విశ్వనాథ సత్యనారాయణగారు
తన విశ్వనాథ పంచశతిలో
కూర్చిన పద్యం చూడండి -
ఇందులోని చమత్కారమేమో
గమనించండి-

ఊరిభార్య లెల్ల రూహించి యామె మం
చంబుతో నిడిరి శ్మశానమందు
నట పిశాచకాంత లాలోచనము చేసి
పడతి మరల నూరి నడుమ నిడిరి
                                                      (విశ్వనాథ పంచశతి)

ఇందులో ఒక మహాతల్లి ఎంత గయ్యాళో
కవి చెప్పదలుచుకొన్నాడు కానీ ఆమె గయ్యాళి
అని ఒక్కమాటైనా అనకుండానే ఎలా చెప్పాడో
చూడండి-
ఊళ్ళో ఉన్న భార్యలంతా సమావేశం జరిపి
ఈ గయ్యాళిని విదిలించేందుకు ఇదే సరైన మార్గమని
రాత్రివేళ ఆమెను మంచంతో కూడ మోసుకొని పోయి
శ్మశానంలో ఉంచి వచ్చారు. ఆ శ్మశానంలోని పిశాచకాంతలు
తెల్లవారే సరికి ఆమెను పీక్కుతింటాని ఊరివారంతా సంతోషించారు.
పాపం వాళ్ళకోరిక నెరవేరలేదు. శ్మశానంలోని పిశాచకాంతలంతా
ఆలోచించి తెల్లవారేలోగా ఆమెను మంచంతో సహా మోసుకొని వచ్చి
ఊళ్ళో దించి వెళ్ళారట.

దీన్ని బట్టి ఆమె ఎంత గయ్యాళో
చెప్పక్కరలేదుకదా!
ఎంత చమత్కరించారో కదా!

Sunday, August 27, 2017

పాప ఫలితాలు ఎప్పుడు వస్తాయి?


పాప ఫలితాలు ఎప్పుడు వస్తాయి?




సాహితీమిత్రులారా!


ఈ శ్లోకం చూడండి
పాపపుణ్య ఫలితాలు ఎప్పుడు వస్తాయో?
చెబుతుంది-

నా ధర్మశ్చరితే లోకే
సద్యః ఫలతి గౌరవ,
శనై రావ ర్తమానస్తు
కర్తు ర్మూలాని కృంతాయా

మనం చేసే పుణ్యపాపాలకు ఫలితం
అనుభవించడానికి కొంత సమయం పట్టవచ్చు
వెంటనే ఫలితానికి రాకపోవచ్చు ఆవు గడ్డిమేయగానే
పాలివ్యలేదు కదా పాప పుణ్యాల ఫలితమూ
అంతే అయితే - పాపం వల్ల కలిగే ఫలితం
వినాశకరంగానే ఉంటుంది - అని భావం.

Saturday, August 26, 2017

రూపరాణి(నూతన ఛందస్సు)-2


రూపరాణి(నూతన ఛందస్సు)-2




సాహితీమిత్రులారా!



కొలకలూరి స్వరూపరాణి కూర్చిన
రూపరాణి ఛందంలోని మరొక ఖండిక-

మగడు

నెల విచ్చి నెలబుచ్చు నెల బిచ్చ
గాడి
జీవన వనమెల్ల సిరిపచ్చ

కొరకొరమని ఆలి కొడుతుంది
కనుక
అన్యుల యాజమాన్యపు రంధి

ఉద్వాహమున కట్నమొకసారి
అద్దె
ఊపి గుంజును నెలకొకసారి

మనుజుండు కావచ్చు మగవాడు
మగడు
క్షతి నింటి నద్దె కిచ్చినవాడు

దీనిలోని లక్షణం-
మొదటిపాదం మూడు ఇంద్రగణాల దీర్ఘపాదం
మూడవపాదం మూడు ఇంద్రగణాల దీర్ఘపాదం
రెండవపాదం ఒక సూర్యణంగల లఘుపాదం.
1,3 పాదాలకు అంత్యప్రాస ఉన్నది.
ఈ మూడు పాదలు ఒక శబ్దార్థ శకలం (యూనిట్)
ఇలాంటి శకలాలు నాలుగుింటిని కలుపుకొని
ఒక శీర్షిక రూపొందుతుంది.
అంటే మూడేసి పాదాలు నాలుగైతే ఒక ఖండిక.

Friday, August 25, 2017

కుక్కపోతు నిపుడె కూల్చి చంపె


కుక్కపోతు నిపుడె కూల్చి చంపె




సాహితీమిత్రులారా!



చమత్కారాలలో భావ చమత్కారమొకటి
చెప్పదలచుకొన్న భావాన్ని సూటిగా
చెప్పకుండా చిత్రమైన మలుపు త్రిప్పి
చమత్కారంగా చెప్పటాన్ని
భావచమత్కారం
అంటారు.

ఇద్దరు ప్రేమికులు గోదావరీతీరంలో
ప్రతిదినం ఒక పూలతోటలో ప్రొద్దున్నే
కలుసుకొంటున్నారు. అదే సమయానికి
ఒక బైరాగి పూలకోసం అక్కడికి వచ్చేవాడు.
ఆ సన్యాసివేషం చూచి కుక్క ఒకటి
మొరుగుతూ అతని మీదికి వచ్చేది.
కుక్క మీదికి రావటం అతనికి ఇబ్బంది.
అతడు అక్కడికి రావడం ఈ ప్రేమికులకు
ఇబ్బంది. ప్రేమికులైన యువతీయువకు
లిద్దరు ఆ సన్యాసిని అక్కడకు రాకుండా
చెయ్యాలనుకున్నారు. అట్లని,
బైరాగీ నీవు రావద్దని
అతనితో ఎలా చెప్పగలరు
యువతి ఆలోచించించింది-
అతణ్ణి రాకుండా చెయ్యటానికి --

ఇచ్చకొలఁదిఁ దిరుగు మింక బైరాగి గో
దావరీతటమున దట్డమైన
పొదలఁ జేరి యొక్క పొగరైన సింగ మా
కుక్కపోతు నిపుడె కూల్చి చంపె
                                                 (గాథా సప్తశతి)
అని చెప్పింది.

ఆ బైరాగి ఇక స్వేచ్ఛగా రావచ్చట
అతణ్ణి ఇబ్బంది పెడుతున్న కుక్కను
అక్కడే దట్టమైన పొదల్లో ఉన్న పొగరైన
సింహం ఇప్పుడే కూల్చి చంపిందట
కుక్కతోనే ఇబ్బంది పడుతున్న సన్యాసి
ఇక వస్తాడా రానే రాడు. కాని, ఆమె
ఆ సన్యాసిని రావద్దని చెప్పిందా
చెప్పలేదే. అట్లని రావద్దని చెప్పలేదా
చెప్పింది. చెప్పకుండా చెప్పింది.
ఆ సన్యాసి మనస్సు నొచ్చుకోకుండా
చెప్పింది. దీన్నే భావ చమత్కారం అంటారు.

వినాయక చవితి శుభాకాంక్షలు


వినాయక చవితి శుభాకాంక్షలు




సాహితీమిత్రులకు,
శ్రేయోభిలాషులకు
వినాయక చవితి శుభాకాంక్షలు