Wednesday, April 1, 2020

గిరిజా కల్యాణం ఛలోక్తులు


గిరిజా కల్యాణం ఛలోక్తులు





సాహితీమిత్రులారా!
Girija Kalyanam Tanjore Painting, Size: 18 X 24 Inches, Rs 17500 ...
సామాన్యమానవులు పరిహాసాలాడడం, ఛలోక్తులు విసరడం
మనం గమనించేవే కాని దేవతలు సైతం పరిహాసాలాడడం
మనం ఇక్కడ గమనించ వచ్చు.
గంటి కృష్ణవేణమ్మగారు "గిరిజా కల్యాణము" -  అనే కావ్యంలో
 "బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు" వివాహభోజన సమయంలోని
సరససంభాషణలు ఛలోక్తులు ఇలా చిత్రించారు చూడండి.

విష్ణువు శివునితో-

విసము తిన్ననోట కసవయ్యె కాబోలు
భక్షణంబులెల్ల పార్వతీశ!
అట్టి దివ్యమైన ఆహారంబులు లే
వటంచు బల్కె విష్ణు డభవుతోడ-

అప్పుడు శివుడు-

నిక్కము నీవు పల్కినది నీరజనాభ! ఇటెందు మ్రుచ్చిలన్
చిక్కదు వెన్న తెత్తుమన చిక్కవు ఎంగిలి కాయలెందు నీ
కెక్కడఁ దెత్తుమయ్య అవి యిప్పుడటంచు శివుండు నవ్వి నన్
అక్కడ పంక్తిభోజనమునందు పకాలున నవ్విరందఱున్


విష్ణువు బ్రహ్మతో-

వండి వడ్డింప దొకనాడు వనిత నీకు
అంటు తలవాకిటనెగాన - ఓ విధాత!
భుక్తి సలుపుమ యిపుడైన బొజ్జనిండ
అనుచు పరిహాసమాడె నా హరియు నపుడు

Tuesday, March 31, 2020

ద్రౌపదికి పాండుపుత్రులు?


ద్రౌపదికి పాండుపుత్రులు?




సాహితీమిత్రులారా!

ద్రౌపదికి పాండుపుత్రులు ఏమౌతారు?  అంటే ఏమౌతారు?
భర్తలౌతారు కదా!  ఇంకేముంది. అంటే సరిపోదు.
బావ - మరుదులు అంటే ఎవరు బావ? ఎవరు మరిది?
అందరూ బావలౌతారా?
అందరూ మరదులౌతారా?
ఇందులో ఏముందో
ఈ శ్లోకంలో చూడండి....

ద్రౌపద్యా పాండు తనయా:
పతి దేవర భావుకా:
న దేవరో ధర్మరాజ:
సహదేవో న భావుక:

అంటే ద్రౌపదికి పాండుపుత్రులు
భర్త, మఱది, బావ లౌతారు.
అందరూ భర్తలౌతారు
కానీ ధర్మరాజు మఱిది కాలేడు.
సహదేవుడు బావకాలేడు.
ఇదీ విషయం.

Saturday, March 28, 2020

కవి చమత్కారం - 2


కవి చమత్కారం - 2




సాహితీమిత్రులారా!

కాళిదాసుకు వివాహమైన తరువాత గదిలో  పడుకొని ఉండగా
ఆయన భార్య ఆయన అరసికత చూసి
అస్తి కశ్చి ద్వాగ్విశేషః -  అని అడిగిందట.
 అది ఆయనకు అర్థంకాక
భార్యను అనాదరణ చేశాడని చెబుతారు.
వాగ్విశేషమేమైనా కలదా అని దాని అర్థం.
అంటే ఏమైనా పాండిత్యం కలదా - అని.
తరువాత కాళికాదేవి వరప్రసాదం వలన
పండితుడైన తరువాత భార్యను వీడుకొని
దేశాంతరములకు బోయి భార్యవలననే
తనకు అట్టి విద్యావిశేషములు కలిగెనని
ఆమె మీది విశ్వాసం కలిగి మొట్టమొదట
తనను ఆమె ప్రశ్నించిన ప్రశ్నలో ఉన్న
అస్తి, క్వచిత్,  వాక్, విశేషః - అను
నాలుగు పదాలను  నాలుగు కావ్యాలలో
మొదట చేర్చి గ్రంథరచన చేసెనని
ఆర్యులంటారు.
కుమారసంభవము మొదటి శ్లోకంలోని
మొదటి పాదం-
అస్త్యుత్తరస్యాందిశి దేవతాత్మా- దీనిలో
అస్తి అనే మొదటి మాటను.
మేఘసందేశంలోని మొదటి శ్లోకం
మొదటిపాదం
కశ్చిత్కాంతావిరహగురుణా స్వాధికారా త్ప్మ్రమత్తః
అనే మాయలో కశ్చి అనే మొదటిమాటను

రఘువంశములోని మొదటిశ్లోకంలోని
మొదటిపాదము
వాగర్థావివసంపృక్తౌ-
లో వాగ్ - అనే మొదటిమాటను,
ప్రయోగించాడు. కాని
విశేషః - అనేమాటను ఏ కావ్యంలో
ప్రయోగించాడో తెలియరాలేదు
ఇది కాళిదాసు రచనా చమత్కారం
అంటారు.

Thursday, March 26, 2020

అందరూ ఒకలాటివారుకాదు కదా!


అందరూ ఒకలాటివారుకాదు కదా!



సాహితీమిత్రులారా!

ఒక కవి అన్యాపదేశంగా చెప్పిన పద్యం ఇది
చూడండి-

రేరే చాతక! సావధాన మనసా మిత్ర! క్షణం శ్రూయతామ్
అంభోదా బహవో వసన్తి గగనే సర్వేపి నైతాదృశా:
కేచిత్ వృష్టిభి రార్ద్రయన్తి వసుధాం గర్జన్తి కేచిద్వృథా
యం-యం-పశ్యసి తస్య-తస్య పురతో మాబ్రూహి దీనం వచ:

మిత్రా!
చాతకమా!
 ఒక్కమాట సావధానంగా విను.
ఆకాశంలో మేఘాలు అనేకములు.
అన్నీ ఒక లాటివేకాదు.
కొన్ని భూమిని ఫలింపచేస్తాయి.
మరి కొన్ని కేవలం ఉఱిమిపోతాయి.
కనిపించిన ప్రతి మేఘం దగ్గర
దీనంగా యాచించవద్దు.
అంటున్నాడు కవి.
నిజమేకదా!

Monday, March 23, 2020

గుట్టెక్కడ?


గుట్టెక్కడ?




సాహితీమిత్రులారా!

ఉత్పల సత్యనారాయణాచార్యులు గారు
"శివుడు పార్వతితో ఏకాంతంగా మాట్లాడే వీలులేదని" చెప్పే
ఈ పద్యం చూడండి.
ఎంత
చమత్కారంగా ఉందో!

జుట్టున గంగయున్ మరియు సోముడు మేల్కొని యుందు రక్కునన్
కట్టడి పాపరేడు, అలికంబున నగ్ని శివుండు పార్వతీ
పట్టపుదేవితో సరస భాషణ కేనియు నోచుకోడటే!
గుట్టుగ జెప్పికొన్న పలుకుల్ బహిరంగములౌను వెంటనే

(శివుడు, పార్వతి ఏకాంతంగా రహస్యంగా
మాట్లాడుకోవటానికి నోచుకోలేదట
ఎందుకంటే .........
తలమీద గంగ, చంద్రుడు, మెడలో పాము, నొసట అగ్ని
- ఇన్ని విడవనివి ఉంటే
ఇక గుట్టెక్కడ)

Wednesday, March 18, 2020

కవి చమత్కారం


కవి చమత్కారం






సాహితీమిత్రులారా!

అడిదము(కత్తి)సూరకవికి విజయనగర ప్రభువు
పెద విజయరామరాజుకు అంతగా పడేదికాదని ప్రతీతి.
రాజేమో అహంకారి అది వారికి సహజం సూరనేమో కుర్రవాడు
ఒకసారి తురక సరదారు దండయాత్రకు
వస్తే సూరకవి ఏమన్నాడో చూడండి.

మెత్తనైనట్టి అరటాకు మీదగాక
మంటమీదను చెల్లునే ముంటివాడి
బీదలైనట్టి సరదార్ల మీద గాక
కలదె క్రొవ్వాడి బాదుల్లాఖాను మీద 

(ముల్లుకు అరిటాకు మీద చెల్లినట్లుగా
మంటమీద చెల్లుతుందా? కాలిపోదూ.
అలాగే రాజుగారి జులుం కింది సరదార్లమీదనేకాని,
నవాబుగారి సేనాపతి బాదుల్లాఖాను మీద చెల్లుతుందా - అని భావం.)

అయితే ఆ దండయాత్రలో రాజుగారు గెలిచారు.
అప్పుడు మళ్ళీ రాజుగారిని ప్రశంసిస్తూ ఈ పద్యం చెప్పాడట.


ఢిల్లీ లోపల గోలకొండపురి నిండెన్ నీ ప్రశంసల్ గులాల్
బల్లాలం బొడిపించి హుమ్మని అరబ్బా నెక్కి పైకొంచు బా
దుల్లాఖానుని బారద్రోలితివి నీ దోశ్శక్తి సూ బాలకున్
మళ్ళింపం దరమౌనె శ్రీ విజయరామా! మండలాధీశ్వరా!

చూడండి అటైనా ఇటైనా ఎటైనా చెప్పగలవాడు,
మెప్పించగలవాడు అడిదము సూరకవి.
సూరకవేకాదు ప్రతిభావంతుడైన కవి ఎవరైనా
ఇలాగే చేయగలరు.
అందుకే కవి ఎటైనా అంటే
రెండు వైపులా పదునే.

Monday, March 16, 2020

కవి ఊహకు అందనిదేది?


కవి ఊహకు అందనిదేది?



సాహితీమిత్రులారా!

ఈనాడు మన వీఐపీలు ప్రధానంగా ముఖ్యమంత్రులు,
మంత్రులు, ప్రధానమంత్రులు, దేశాధినేతలు
ఒకచోట అల్పాహారం మరోచోట భోజనం, ఇంకోచోట
పానీయం ఇలా స్వీకరిస్తూ వారి దినచర్య జరుగుతూ
ఉంటుంది. కానీ మన కవి పానకాలరాయకవి
తన మనసుకు ప్రబోధిస్తూ
విష్ణువును తలవమని చెబుతూ చెప్పిన పద్యం
తన మానస శతకంలో ఎలా మనరాజకీయ వీఐపీల
దినచర్యను శ్రీమహావిష్ణువుకు ఆపాదించారో గమనించండి -

తిరుమలలో ప్రభాత విధి తీరిచి, నీలగిరిన్ భుజించి, కే
సరగిరి చందనం బలది చల్లని దాహము మంగళాద్రిలో
గురు రుచి ద్రావి రంగపురి కోమలితో పవళించునట్టి నా
సరసుని జేర నీవు మనసా! హరిపాదము లాశ్రయింపుమా!


తిరుమలలో భక్తులు "శ్రీ వేంకటాచలపతే! తవ సుప్రభాతం" అని
నిద్ర లేపితే లేచి ప్రభాత విధులు తీర్చి,
నీలాచలంలో నైవేద్యం స్వీకరించి,
సింహాచలంలో గంధం పూసుకొని,
మంగళగిరిలో పానకం తాగి దాహం తీర్చుకొని,
శ్రీరంగంలో దేవేరితో రంగశాయి అయి పవళించే సరసుడైన
ఆ శ్రీమహావిష్ణువు పాదాలను ఆశ్రయించే మనసా!