Thursday, August 10, 2017

మహాత్ములకు సహజాలంకారాలు


మహాత్ములకు సహజాలంకారాలు




సాహితీమిత్రులారా!




మహాత్ములకు ఐశ్వర్యంలేప్పుడు కూడ
సహజాలంకారాలైనవి ఏమిటో
ఈ పద్యంలో వివరించారు చూడండి-
ఏనుగులక్ష్మణకవి అనువదించిన
భర్తృహరి సుభాషితాలలోనిది ఈ పద్యం-

కరమున నిత్యదానము, ముఖంబున సూనృతవాణి, యౌఁదలం
గురుచరణాభివాదన, మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్
వరహృదయంబునన్ విశదవర్తన, మంచితవిద్య వీనులన్
సురుచిరభూషణంబు లివి శూరులకున్ సిరి లేనియప్పు డున్

చేతులకు ఎల్లపుడూ దానంచేసేగుణం,
నోటికి సత్యవాక్కును పలికే లక్షణం,
శిరస్సుకు గురువులకు నమస్కరించే గుణం,
బాహువులకు ఎదురులేని పరాక్రమం
కలిగి ఉండే గుణం, మనస్సునకు
అకలంకమైన ప్రవర్తన అనే లక్షణం,
చెవులకు శాస్త్రశవణం అనే గుణం-
ఇవి మహాత్ములకు ఐశ్వర్యం లేనప్పుడు
కూడా సహజాలంకారాలుగా భావింపబడతాయి.

Wednesday, August 9, 2017

ముక్కోటి దేవతలు అంటే ఎవరు?


ముక్కోటి దేవతలు అంటే ఎవరు?




సాహితీమిత్రులారా!


విష్ణువు స్వరూపములైన ముప్పది ముగ్గురు
దేవతలనే ముక్కోటి దేవతలు అంటారు.

ఆ దేవతలు -
1. అష్టవసువులు - 8
   1. వరుణ, 2. వృషభ, 3. నహుష, 4. జయ
   5. అనిల, 6. విష్ణు 7. ప్రభాను, 8. ప్రత్యూష

2. రుద్రులు - 11
  1. ఉగ్ర, 2. సోమ, 3. శర్వ, 4. మృగవ్యాధ
  5. బిక్షక, 6. అహిర్ - బుధ్న్య, 7. పినాకీ,
  8. ఈశ్వర, 9. కాపాలిక, 10. భీమ, 11. భిషక్

3. ఆదిత్యులు - 12
   1. ఆర్యమ, 2. మిత్ర, 3. వరుణ, 4. అర్క, 5. భగ,
   6. ఇంద్ర,  7. వివస్వన్, 8. పూషా, 9. పర్జన్య, 10. త్వష్టా,
   11. విష్ణు, 12. అజ

4. ఇంద్రుడు,
5. బ్రహ్మ

మొత్తం = 8 + 11+ 12+ 1 + 1= 33

ఈ ముప్పది మువ్వురు విష్ణు స్వరూపులు.
వీరినే ముప్పదిమూడు కోట్ల దేవతలుగా చెబుతారు.

(శ్రీమాన్ దిట్టకవి నరసింహాచార్య కృత
 విజ్ఞాన కాంతి పుంజాలు నుండి.)

Tuesday, August 8, 2017

తిథి శబ్దం - వివరాలు


తిథి శబ్దం - వివరాలు




సాహితీమిత్రులారా!





తిథి అంటే శబ్దరత్నాకరంలో
1. పాడ్యమి లోనగునది
2. శ్రాద్ధదినము
అనే అర్థాలు ఇచ్చారు.

తన్యంతే కిలతా యస్మాత్తస్మాత్తాస్తిథ తిథయ స్స్మృతా
                                                                        -సిద్ధాంతశిరోమణౌ(కాలమాధవీయే)
తినోతి అనేపదం నుండి పుట్టింది ఈ తిథి అనే పదం.
తినోతి అనగా విస్తరించునది అని అర్థం
(చంద్రకళలను దినదినము పెంచుట)

తిథులు మూడు విధాలు-
1. ఖర్వ
2. దర్వ
3. హింస్ర

ఖర్వ - అనేది సమతిథి
            అంటే సూర్యోదయంనుండి మరునాడు సూర్యోదయము వరకు
            తిథి ఉండే తిథికి సమతిథి - ఖర్వ అని పేరు.

దర్వ - అంటే వృద్ధియైన తిథి అని అర్థం
       60 గడియలకన్నా ఎక్కువ ఉన్నతిథి.

హింస్ర - క్షీణత కలిగిన తిథి అని అర్థం.
                       60 గడియలకన్న తక్కువైన తిథి.


Monday, August 7, 2017

ఇలలో సాటిలేని భారతదేశం


ఇలలో సాటిలేని భారతదేశం




సాహితీమిత్రులారా!


1954నాటి సంఘం - అనే సినిమాలోని
దేశభక్తి గీతం వినండి-
వైజయంతిమాలగారి నటనతో
చిత్రీకరించినది-

Saturday, August 5, 2017

కేశవం ప్రతి గచ్ఛతి


కేశవం ప్రతి గచ్ఛతి




సాహితీమిత్రులారా!





మనదేశంలో బహుదేవతా ఆరాధన ఉందికదా
ఇంత మందిని పూజిస్తే ఆపూజలు ఎవరికి చేరుతుందో
ఈ శ్లోకం చెబుతుంది చూడండి-

ఆకాశాత్పతితం తోయం
యథా గచ్ఛతి సాగరం
సర్వదేవ నమస్కారః
కేశవం ప్రతి గచ్ఛతి


ఆకాశం(మేఘం)నుండి జారిపడిన నీటి బిందువులు
సన్నటి నీటి జాళ్లుగా, వాగులుగా, ఏఱులుగా మారి
సముద్రంలో ఏవిధంగా కలుస్తున్నాయో అదేవిధంగా
దేవతలందరికి చేసిన పూజలు, నమస్కారాలు అన్నీ
విష్ణువుకుచేరి ఉత్తమ ఫలితాలను ఇస్తున్నాయి - అని
అర్థం.

Wednesday, August 2, 2017

తాంబూలం


తాంబూలం




సాహితీమిత్రులారా!


తాంబూలం గురించిన
ఈ శ్లోకం చూడండి-

ప్రాతః కాలే ఫలాధిక్యం
చూర్ణాధిక్యంతు మధ్యమం
వర్ణాధిక్యం భవే ద్రా త్రౌ
తాంబూలమితి లక్షణం

తాంబూలంలో మూడు వస్తువులున్నాయి.
1. ఆకులు, 2. వక్కలు, 3. సున్నం
ఇవి ఎప్పుడు ఎలా వేసుకోవాలో చెప్పేదీ
శ్లోకం.
ప్రాతఃకాలంలో వక్కలు ఎక్కువగాను
మధ్యాహ్నం సున్నం ఎక్కువగాను
రాత్రి తమలపాకులను ఎక్కువగాను
ఉన్న తాంబూలం సేవించాలని అర్థం.

ఉదయం పైత్యాన్ని హరిస్తుంది వక్క,
మధ్యాహ్నం ఉష్ణాధిక్యాన్ని తగ్గిస్తుంది సున్నం,
రాత్రి తమలపాకు జీర్ణశక్తిని కలుగజేస్తుంది

సున్నం శరీరానికి కావలసిన కాల్షియం అందిస్తుంది.
పుట్టబోయే బిడ్డకు ఎముకలుకు బలాన్నిం ఇచ్చేందుకు
గర్భిణీ స్త్రీలు తాంబూలం వేసుకోవాలి.
ఇది ఆహారానికి రుచిని కలిగిస్తుంది.
వివాహితులే తాంబూలం వేసుకోవడం మంచిది.
అలాగే భోజనానంతరమే వేసుకోవాలి
ఎప్పుడూ నమలుతూ ఉండటం మంచిది కాదు.

Tuesday, August 1, 2017

శిరఃప్రధానమను వాక్యం బెమ్మెయిన్ దప్పునే


శిరఃప్రధానమను వాక్యం బెమ్మెయిన్ దప్పునే




సాహితీమిత్రులారా!



శ్రీకృష్ణదేవరాయలవారి ఆముక్తమాల్యదలోని
ఈ పద్యం చూడండి ఇది పంచమాశ్వాసంలో
నాయిక వర్ణనలోనిది-

హేమాభాంగ విభాధరారుణి వక్త్రేందు ప్రభాశీలద
ద్భామారత్నము వొందదయ్యె మును దత్తద్వర్ణ యుక్తాఖ్య లన్
శ్యామాత్వంబళి గర్వధూర్యాహ కచచ్ఛాయాచ్ఛటంగాంచె నౌ
గామున్నుర్వి శిరఃప్రధాన మనువాక్యం బెమ్మెయిందప్పునే


ఆకన్యక(గోదాదేవి) శరీరం బంగారు వన్నెకలిగి ఉన్నదానివల్ల గాని,
అధరోష్ఠం ఎఱ్ఱగా ఉన్నదానివల్లగాని, ముఖము చంద్రుని వన్నెకలిగి
ఉన్నదానివల్లగాని, తత్వర్ణాను సరణంగా- హేమాంగి, బిబోష్ఠి,
చంద్రముఖి అనే నామాలు వహింపక తేటులతో దీటగు నల్లని
తలవెంట్రుకల కాంతికి అనుగుణంగా శ్యామ అనే నామం వహించింది.
శ్యామ అనగా యౌవన మధ్యస్థురాలనీ, సర్వశరీరంలో శిరమే ప్రధానం
కావడం వల్ల ఆ శిరఃకాంతే ప్రధానంగా ఆపేరు వచ్చిందని భావం.