ఇస్తే దానకర్ణుడు మరి ఇవ్వకపోతే...........
సాహితీమిత్రులారా !
ప్రతిరోజూ బిక్షం పెట్టించుకొంటూ
ఒకరోజు పెట్టకపోతే నానాబూతులు తిడతారుకదా!
అలానే కవులూ దానమివ్వని వారిని ఎలా పద్యాలలో
ఈ సడించుకున్నారో కొన్ని పద్యాలను చూద్దాం-
ఎంత వేడినా, ఏమన్నా ఇవ్వని వారిని
చూసి ఒక కవి ఇలా అంటున్నాడు-
ఇల లోభి నెంత వేడిన
వలవని వెతలంతె కాని వా డిచ్చెడినే
జలమును వెస గిల కొట్టిన
కలుగునె నవనీతమాశగాక ----
పెద్దగా లేక పోయినా ఇచ్చేవాళ్ళున్నారు
ఉండీ ఇవ్వని వాళ్ళున్నారు
అటువంటి వారిని గురించి చెప్పిన పద్యం -
కలుగక యిచ్చెడు మనుజులు
తలవెండ్రుకలంతమంది తర్కింపంగా
కలిగియు నీయని యధములు
మొలవెండ్రుకలంతమంది మోహనరంగా!
చాలా మంది ఇస్తున్నపుడు
ఒక లోభి ఇవ్వకపోతేనేమి
గోష్ఠంలో పెక్కావులు పాలిస్తుండగా
ఒక బక్కావు ఇవ్వకపోతే ఏమిలే అంటున్నాడో కవి-
పెక్కావు లిచ్చుచో నొక
బక్కా వీకుండెనేని పాడికి కరవా
పెక్కు దొర లిచ్చుచో నొక
కుక్కల కొడు కీయకున్న కూటికి కొరవా!
దీనిలో ఇవ్వని వాని శునకపుత్రునితో పోల్చాడు
మరి అతని బాధ అలాంటిది.
ఒక కవి అంటాడు - దానమనేది పుట్టుకతోచేతిలో పుట్టే గుణం.
దాన్ని బలవంతాన చేతికి - అటూ - ఇటూ నులిమి
ఎక్కించటానికేమన్నా గాజువంటిదా?
పుట్టుక తో డుత కరమున
పుట్టవలెన్ - దానగుణము - పుట్టకపోతే
యిట్టట్టు నులిమి బలిమిని
బట్టింపను గాజ తాళ్ళపలి కొండ్రాజా!
ఇక్కడ మరో కవి అంటున్నాడు పదిమందికిచ్చి
పదకొండవవానికివ్వకపోతే వాడూరుకోడు
తిట్టి పోస్తాడు అంటున్నాడు చూడండి-
పదివేలమంది కిచ్చియు
తుది నొక్కని కీయకున్న దొరకువు కీర్తుల్
పదివేల నోము నోచిన
వదలదె యొక రంకు వంక వన్నియసుంకా!
పదివేల నోములు నోస్తే వచ్చిన పేరు,
ఒక రంకుతనపు అపకీర్తి వస్తే నిలువదు.
అలాగే దాత అన్నవాడు పేరుండాలంటే ఇస్తూనే ఉండాలి.
No comments:
Post a Comment