Sunday, June 6, 2021

ఏడువారాల నగలు అంటే ఏవి?

 ఏడువారాల నగలు అంటే ఏవి?




సాహితీమిత్రులారా!


స్త్రీలు ధరించే భూషణాలలో ఒక్కొక్కటి 7 రకాలుగా ఉన్నాయి.
వాటిని ఏడువారాల నగలంటారు. వాటిని వారాన్ని బట్టి ధరిస్తారు.
వీటిని గురించి మాంగల్యశాస్త్రం(స్వర్ణ శిల్పం)లో
కపిలవాయి లింగమూర్తిగారు చాల వివరంగా ఇచ్చారు.

ఆదివారం ధరించే నగలు -
ఆదివారానికి సూర్యుడు అధిపతి. ఆరోజు ఉదయం సూర్యహోర ఉంటుంది. సూర్యునికి ప్రియమైన వర్ణం సింధూరం. మాణిక్యం సూర్యునికి ప్రియమైన రత్నం కాని అది దొరకటం కష్టం. కావున ఎర్రని కత్నాలను పొదిగిన నగలను ధరించవచ్చు. సాధారణంగా తాటంకాలలో, పతకాలలో, ఉంగరాలలో ఎర్రని రాళ్లు పొదిగిన వాటిని ధరించవచ్చు  అలాగే రవ్వలుతాపని శుద్ధమైన బంగారం ఆభరణాలను కూడ ధరించవచ్చు.

సోమవారం ధరించే నగలు -
సోమవారానికి చంద్రుడు అధిపతి. ఆరోజు ఉదయాన్నే చంద్రహోర ఉంటుంది. ముత్యాలు చంద్రునికి ప్రియమైనవి. కావున ముత్యాల దండలు, వెండితీగలతో అల్లిన తావళాలు, శంఖం మరియు ముత్యపు చిప్పలతో చేసిన ఆభరణాలు, వెండి దండికడియాలు, ముంజేతి కడియాలు, ఉంగరాలు ధరించవచ్చు.

మంగళవారం ధరించే నగలు -
మంగళవారానికి కుజుడు(అంగారకుడు) అధిపతి. ఆరోజు ఉదయం కుజహోర ఉంటుంది. అంగారకునికి ముదురు ఎరుపురంగు ప్రియమైనది. పగడాలు అంగారకునికి ప్రియమైనవి. కావున మంగళవారంరోజున పగడాల దండలు ధరించాలి. పగడాలను చేకట్లలో పొదుగుతారు. కావున వాటిని ధరించవచ్చు. రాగితీగలతో అల్లిన తాళాలు, రాగికడియాలు, ఉంగరాలు ధరించవచ్చు.

బుధవారం ధరించే నగలు-
బుధవారాని బుధుడు అధిపతి. ఆరోజు ఉదయం బుధహోర ఉంటుంది. పచ్చలు బుధునికి ప్రియమైన రత్నం. పచ్చలలో, ఆకుపచ్చ, చిలుకపచ్చ అని భేదాలున్నాయి. వీటిలో ఏరంగైనా బుధవారం ధరించవచ్చు. పూర్వం పచ్చల దండలు ప్రసిద్ధి. పచ్చలు చెవులపోగులలోను, ముంజేతి కడియాలలోను పొదుగుతారు. కావున అవి ఉంటే వాటిని బుధవారం ధరించవచ్చు. వీటితోపాటు కంచు కడియాలు, ఉంగరాలు కంచుపూసల దండలు ధరించవచ్చు.

గురువారం ధరించే నగలు -
గురువారానికి బృహస్పతి అధిపతి. గురువారం ఉదయం గురుహోర ఉంటుంది.పుష్యరాగం గురునికి ప్రియమైన రత్నం. వీనిని కంకణాలలో, చెవికమ్మలలో కూడ పొదుగుతారు. కాబట్టి గురువారంనాడు యిత్తడి నగలు, ఉంగరాలు, వన్నె తక్కువలోని బంగారు నగలు ధరించవచ్చు.

శుక్రవారం ధరించే నగలు -
శుక్రవారానికి శుక్రుడు అధిపతి. ఆరోజు ఉదయం శుక్రహోర ఉంటుంది.శుక్రునికి వజ్రం ప్రియమైన రత్నం. వజ్రాలు తాటంకాలలోను, ముక్కుపుడకలలోను పొదుగుతారు. వజ్రం ఇతర ఆభరణాలలో దేనియందు పొదిగినా పొదకకున్నా చేతి ఉంగరాలలో మాత్రం తప్పక పొదుగుతారు. శుక్రవారంనాడు వాటిని ధరించవచ్చు. వాటితోపాటు తగరపు పూసలు, గజ్జెలు, తగరముపూసిన నగలు ధరించవచ్చు.

శనివారం ధరించే నగలు -
శనివారం శనైశ్చరుు అధిపతి. ఆరోజు ఉదయాన్నే శనిహోర ఉంటుంది. శనైశ్చరునికి నీలం ప్రియమైన రత్నం. నీలాలలో రంగును బట్టి నీలం, ఇంద్రనీలం అని రెండురకాలు. ఇంద్రనీలం అంటే బ్లూ, నీలమంటే బ్లాక్. శనివారం రోజున వీటిలో ఏదైనా ధరించవచ్చు.
నీలాలను పోగులు, ముంగరములు మొదలైత వానిలో పొదుగుతారు
ఇవికాక ఆరోజు స్టీలు ఉంగరాలు, గొలుసులు ధరించవచ్చు.

No comments:

Post a Comment