Monday, December 16, 2019

మొట్టమొదటి సారాకాపు


మొట్టమొదటి సారాకాపు





సాహితీమిత్రులారా!

మొహం వేళ్ళాడేసుకుని చిన్నభూతం నరకం లోకి వచ్చి పడింది. ఉట్టి చేతుల్తో లోపలకొచ్చిన చిన్నభూతాన్ని చూసి అందరూ నొసలు చిట్లించేరు. ఎన్ని సార్లు అవకాశం ఇచ్చినా ఈ భూతం పాఠం నేర్చుకున్నట్టులేదు. ఎంత చెప్పినా నరకానికి తీసుకొచ్చే వాళ్ళలో వర్తకులో, మామూలు జనమో, మిగతా దొంగలో, దొరలే కానీ ఒక్కడు కూడా ఒళ్ళు వంచి కష్టపడే వ్యవసాయం చేసుకునే వాడు లేడు. ఇదెలా కుదురుతుంది? ఇలా అయితే నరకంలో సమతూకం ఉండొద్దూ? అందుకే ఆ పని చిన్నభూతానికి అప్పగించేరు. ఈ చిన్న భూతానికి పని నేర్చుకుందామనే పట్టుదలా, శక్తీ లేవా? పనికిరాని భూతాలు నరకంలో దేనికీ? రెండు దెబ్బలు తగిల్తే ఒళ్ళు దగ్గిర పెట్టుకుని పని చేయొచ్చు.

“ఈ సారి కూడా అంతేనా?” చిన్నభూతాన్ని అడిగింది పై అధికారైన ముసలి పిశాచం.

“ఎంత కష్టపడినా…” నీళ్ళు నానుస్తున్న చిన్న భూతం కేసి ఉరిమి చూసింది ముసలి పిశాచం.

“నోట్లోంచి మాట రాదేం? ఎంతమందిని తీసుకొచ్చేవు ఈ రోజున?”

“ఎవరినీ తీసుకురాలేదు.”

“ఓరి చేతకాని వెధవా? ఇక్కడున్న వాళ్ళని చూడు. వీళ్లందరూ నీతో పాటు మొదలు పెట్టిన వాళ్ళే ఈయన రెండువేలమంది వకీళ్ళనీ, అటుపక్కనున్నాయన ఆరువేలమంది వర్తకులనీ, ఆ చివర్లో ఉన్నాయన పదివేలకి పైబడి జనాల్ని తీసుకొచ్చేరు. నువ్వేమో చేతులుపుకుంటూ వచ్చావా? నీకు పని చెప్పిన ఈ రెండేళ్ళలో నువ్వు నేర్చుకున్నదేం లేదన్నమాట. సిగ్గూ, శరం లేదూ?” ముసలి పిశాచం అరిచింది.

“రెండువేలమంది వకీళ్ళే? వకీళ్ళని తీసుకురావడం సులువా?” చిన్న భూతం నోరెళ్ళబెట్టింది.

“సులువా అంటే సులువే. మొదట్లో ఈ వకీళ్ళు న్యాయమూర్తులతో కలిసి జనాల్ని మోసం చేసేవారు. ఇప్పుడేమో ఈ వకీళ్ళు జనాలతో కలిసి వాళ్ళనే మోసం చేస్తున్నారు. ఇదెంతవరకూ వచ్చిందంటే కారణం ఏమీ లేకుండానే వ్యాజ్యాలు బయటకొస్తున్నాయ్. అంటే వాళ్ళకు వాళ్ళే నరకంలోకి రావడానికి తహతహ లాడిపోతున్నారు. నేనక్కడ నుంచుని చేసేది, రండి రండి అని స్వాగతం పలకడమే,” కన్ను కొడుతూ చెప్పింది వకీళ్ళ భూతం చిరునవ్వుతో.

చిన్న భూతం నాయకుడి కేసి తిరిగి అంది క్షమాపణలతో, “నా తప్పేం లేదండి ప్రభో. ఎంత కష్టపడి ఎన్ని ముప్పు తిప్పలు పెట్టినా ఈ రైతులెవరికీ కోపం రాదు. ఎంత ఏడిపించినా కోపం తెచ్చుకోకపోతే నేనేం చేయనూ?”

“నువ్వు ఇప్పటిదాకా ఏం చేశావో చెప్పి అఘోరించు ముందు!”

“ఓ రైతు పొలం దున్నుతుంటే వాళ్ళావిడ మధ్యాహ్నం భోజనం పంపించింది. అది వాడికి కనపడకుండా ఎత్తుకొచ్చాను. ఏదో దొరికినది తిని కడుపు నింపుకుందాం అనుకుంటూంటే ఏమీ దొరక్కుండా చేశాను. ఆఖరికి వాడు తాగే నీళ్ళలో మట్టి కలిపేశాను. అయినా వాడు అవే తాగుతూంటే మధ్యలో గిన్నె కింద ఒలికిపోయేలా చేశాను. దేనికీ కోపం తెచ్చుకోలేదు.”

“మరి ఏమంటాడు?”

“నా భోజనం పోతే పోనీయ్. దొంగతనం చేసినాయినకి నాకంటే ఎక్కువ ఆకలేస్తోందేమో. భగవంతుడు నాకు మరేదో పంపించడా, అని ఖాళీ కడుపుతో కళ్ళు మూసుకు పడుకున్నాడు.”

“మళ్ళీ భగవంతుడి పేరెత్తావూ? నువ్వు చేసేదేమీ లేదు కానీ ఆయన పేరెత్తి నా దుంప తెంపేలా ఉన్నావు.”

“రైతు అన్నదే నేను చెప్పాను, నన్నేం చేయమంటారు? పోనీ నన్ను వేరే చోటకి మార్చి చూడొచ్చు కద?” బతిమాలుతున్నట్టూ అంది చిన్న భూతం.

“కుదరదు,” కరుగ్గా వచ్చింది సమాధానం, “నువ్వు ఈ రైతుల పని పట్టేదాకా అక్కడ ఉండవల్సిందే. నీ చేతకానితనం ఇంకోచోట ఎందుకూ? ఇంకా ఏమైనా కొత్త ఆలోచనలు ఉన్నాయా నీ దగ్గిర?”

“లేవు.” ఏడుపు మొహంతో తల అడ్డంగా ఊపింది చిన్న భూతం.

“చూడబోతే నీ పని కూడా నన్నే చేయమనేలా ఉన్నావే?”

“…”

“పోనీ కదా అని ఇప్పటిదాకా ఊరుకుంటూంటే ఇదన్న మాట నువ్వు చేసే నిర్వాకం. ఎవరక్కడ? ఇలా కొరడాలు పట్టుకుని రండి. ఈ చిన్నభూతానికో రుచి చూపిద్దాం”

“ప్రభో ఇంక కొట్టకండి. ఏదో ఒకటి చేసి ఈ సారి రైతుల్ని తీసుకొస్తా.” చిన్నభూతానికి వంటిమీద నాలుగు తట్లు తేలేసరికి ఏడుస్తూ అరవడం మొదలెట్టింది.

“ఏం? ఏమన్నా కొత్త విషయాలు తెలిశాయా?”

“లేదు. కానీ ఏదో ఒకటి కనిపెట్టి ఈ సారి తీసుకొస్తాను.”

“సరే ఫో అయితే. ఆఖరుసారిగా నీకు మూడేళ్ళు గడువు ఇస్తున్నాను. ఈ మూడేళ్లలో కావాల్సినంత మంది రైతుల్ని తీసుకొచ్చావా సరే సరి లేకపోతే పాతరేయిస్తాను ఇక్కడే.”

“ఈ సారి రైతు దగ్గిర పనిచేసే పాలేరులా మారి వాళ్ల లోపలి రహస్యాలు కనిపెడతానులెండి. ఓ సారి అవి తెలిస్తే ఏదో ఒకదారి కనిపించకపోదు.”

రైతు ఇవానోవిచ్ ఇంట్లోంచి బయటకొచ్చేడు ఖాళీ కుంచం తోటి. బయట పాలేరు నికోలాస్‌ గింజలు కొలుస్తున్నాడు.

“ఇంకా ఎన్నున్నాయ్? అవతల మన గిడ్డంగి పూర్తిగా నిండిపోయినట్టే. ఇంకేమీ పట్టేలా లేదు లోపల.”

“ఎందుకు పట్టదూ? లోపలకెళ్ళి పైనుంచి అంతా మళ్ళీ సర్దుదాం చదునుగా. నేను చేస్తాను కదా? ఇక్కడ ఇంకో రెండు మూడు బస్తాల గింజలున్నాయి. ఇప్పుడు దాచుకుంటే చలికాలం కష్టపడ్డక్కర్లేదు కదా?”

“సరే, కొలవడం అయ్యాక మళ్ళీ వస్తాను నేను. ఇప్పుడు చిన్న పనిమీద అలా ఊళ్ళోకెళ్ళాలి.”

“సరే వెళ్ళి రండి. ఇక్కడ పని నేను చూస్తాను.”

ఇవానోవిచ్ అటు వెళ్ళగానే పని తొందరగా కానిచ్చి పక్కనే ఉన్న గడ్డిమీద కాళ్ళు చాపి వెన్ను వాల్చేడు నికోలాస్. “హమ్మయ్య, ఈ పనితో వళ్ళు హూనం అవుతోందే కానీ ఇవానోవిచ్‌కి కోపం వచ్చే మార్గం కనిపించడం లేదే? నా పక్కనే నుంచుని నే చేసేదంతా చూస్తూంటాడు కనక నా టోపీ, బూట్లూ తీయడం కుదరదు ఆయన ముందు. టోపీ బూట్లూ తీయకపోతే తలా, కాళ్ళూ ఒకటే దురద. తీస్తే నా తలమీద కొమ్ములూ కాలివేళ్ళూ నేను చిన్న భూతాన్నని చెప్పేయవూ? ఆ రహస్యం కానీ తెల్సిందా మళ్ళీ నరకం దాకా వెళ్ళడం కాదు గానీ ఈ రైతే నన్ను ఇక్కడ పాతిపెడితే నా గతేమిటి? పంట నేను చెప్పినట్టు సాగు చేశాక ఇప్పుడు గిడ్డంగులన్నీ నిండి ఉన్నాయి. నా మీద గురి కుదిరింది కనక ఈ సారి కూడా నేను చెప్పినది చేయడానికి వెనుకంజ వేయడు. ఇదే అదను చూసి ఏదో మంత్రం వేశానా ఇంక వీణ్ణి బుట్టలో వేయడం సులభం. ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయాయి. నాకున్న సమయాన్ని జాగ్రత్తగా వాడుకుంటే…”

నికోలాస్ ఆలోచనల్ని తెగ్గొడుతూ ఎవరిదో కంఠం వినిపించింది, “ఇవానోవిచ్ ఉన్నాడా ఇంట్లో లోపల?” వచ్చినాయన పక్కింటి రైతు, ఏదో చేబదులు కావాల్సి వచ్చినట్టున్నాడు.

“మా రైతు ఇంట్లో లేడు కానీ, చెప్పండి ఏం ఇలా వచ్చేరు?” నికోలాస్ అడిగేడు కంగారుగా టోపీ బూట్లూ సవరించుకుంటూ.

“చిన్న పని మీద వచ్చాను గానీ ఈ ఏడు పంట బాగుందా?”

“బాగానా? భలేవారే ఈ గింజలన్నీ దాచుకోవడానికి ఉన్న గోదాం సరిపోవట్లేదు. కళ్ళు అదిరిపోయేటట్టూ ఉంది మా దిగుబడి. ఇదిగో చూడండి,” గింజల్ని చేత్తో చూపిస్తూ అన్నాడు నికోలాస్.

“అదృష్ఠం అంటే మీదేనయ్యా, రెండేళ్ళ బట్టీ చూస్తున్నాను. ఊళ్ళో ఎవరికీ రాని దిగుబడి మీకెలా వస్తోందో కాని. ముందు ఎలా తెలుస్తోందో కానీ సరిగ్గా ఎక్కడ వెయ్యాలో అక్కడే వేస్తున్నాడు పంట ఇవానోవిచ్. పోయినేడు వర్షాలు అంతగా లేవు. చిత్తడి నేల చూసి పంట వేసుకున్నాడు ఈ ఏడు వర్షాలు అదే పనిగా కురుస్తూంటే ఏదో ముందే తెల్సినట్టూ మెరక మీద వేశాడు పంట. మొత్తం మీద రెండుసార్లూ బాగా దిగుబడి సంపాదించేడు సుమా. దిగుబడి మాట అటుంచి ఇంక ఈ గింజలకేసి చూడు, ఒక్కో గింజా దున్నపోతులా లేదూ?”

మాటల్లో ఇవానోవిచ్ వచ్చి నవ్వుతూ పలకరించేడు పక్కింటాయన్ని, “ఏం ఇలా వచ్చేరు?”

“ఆ, అదే ఈ పంట దిగుబడి గురించి మాట్లాడుతున్నాను మీ పాలేరుతో. ఏం దిగుబడీ, ఏం గింజలూ! ఎక్కడ సంపాదించారో గానీ ఈ విత్తనాలు. గిడ్డంగులన్నీ నిండిపోయాయని నికోలాస్ చెప్తున్నాడు. ఊళ్ళో రైతులం మాకు పంటలు అరకొరగా పండుతున్నాయి కానీ మీ అదృష్ఠం మాకు లేదు.”

“నిజమే, అసలు ఇదంతా నికోలాస్ మూలంగానే అనుకో. ఏ ఏడు పంట ఎక్కడ వెయ్యాలో నన్ను బలవంతంగా ఒప్పించి మరీ వేయించాడు. మొదట్లో నేను నమ్మలేదు కానీ తర్వాత్తర్వాత ఒప్పుకోక తప్పలేదు. ఈ నికోలాస్ మంచి పనిమంతుడే కాదు సరిగ్గా ఏది ఎప్పుడు చేయాలో తెల్సినవాడు కూడానూ.”

“అది మాత్రం ఒప్పుకోక తప్పదులే. ఇంతకీ ఈ గింజలన్నీ అమ్మేస్తున్నారా?”

“చూద్దాం లెండి ఇంకా ఆలోచించుకోలేదు. ఇంతకీ ఇలా వచ్చేరేం?”

“మా ధాన్యం ఈ ఏటికి అయిపోయినట్టే. తినడానికేమీ లేదు. మీకు బాగా పండుతోంది కనక ఓ బస్తా ధాన్యం ఇప్పిస్తారేమో అని అడగడానికొచ్చాను. మళ్ళీ వచ్చే ఏడు పంటకి తీర్చేస్తాను.”

రైతు ఇవానోవిచ్ ఏదో అనబోతూంటే పక్కింటాయన వెనకనున్న నికోలాస్, ‘వద్దు ఇవ్వకు’ అని సైగ చేసేడు. అది పట్టించుకోకుండా ఇవానోవిచ్ చెప్పేడు, “తప్పకుండా తీసుకెళ్లండి. ఇదంతా మేము తినగలిగేదా? అమ్మినా ఇంకా బోలెడు మిగుల్తాయి.”

నికోలాస్ నొసలు చిట్లించేడు. పక్కింటాయన బస్తా మోసుకెళ్ళేక ఇవానోవిచ్ నికోలాస్‌ని అడిగేడు, “ఎందుకివ్వద్దన్నావు? ఆయనెంత మంచివాడో నీకు తెలియదు కాబోలు. నాకెన్నోసార్లు సాయంచేసేడు.”

“ఇవ్వడం ఒకెత్తూ ఆ తర్వాత రాబట్టుకోవడం మరో ఎత్తూ. అవన్నీ మళ్ళీ వెనక్కి ఇస్తాడని ఏమిటి? వాటి కోసం ఎన్నిసార్లు వాడింటి చుట్టూ తిరగాలో?” నికోలాస్ గునిసేడు.

“పోనీయవయ్యా, ఇదంతా మనం తినగలిగేనా? రెండేళ్ళు కూర్చుని తిన్నా కరగనంత లేదూ? ఏం చేసుకుంటాం ఇదంతా? వాళ్ళ ఖాళీ కడుపులకి ఇస్తే కాస్త పుణ్యం రాదూ?”

“ఏం చేసుకుంటామా? ఇదంతా నేను కష్టపడింది మీకో పానకం తయారుచేసి ఇద్దామనే.”

“పానకమా? గింజలు తిండికి కదా? దానికీ ఈ తిండి గింజలకీ ఏమిటి సంబంధం? ఆ పానకంతో ఏం చేస్తావేం?”

“ఓ సారి రుచి చూడండి మళ్ళీ వదలరు మరి. నీరసంగా ఉన్నవాళ్లకి బలం ఇచ్చేదీ, ముసలి వాళ్లని యువకులుగా మార్చేదీ ఇదే పానకం. మీకు తెలియదు లెండి.”

“అటువంటిదెక్కడా ఉన్నట్టు వినలేదే? ఏం పరాచికాలు మాట్లాడుతున్నావ్?”

“అవున్లెండి నేను మాట్లాడేది అంతా పరాచికాలే. నేను పంట మెరకమీద వేయమన్నప్పుడు కానీ చిత్తడిలో వేయమన్నప్పుడు కానీ పరాచికాలాడేనా? మొదట్లో నమ్మేరా నేను చెప్పింది? పంట దిగుబడి చూశాక తెలిసొచ్చింది కదా నేను మాట్లాడేది పరాచికమో కాదో?”

“సరే ఒప్పుకుంటున్నా. అయితే ఈ పానకం ఎలా ఉంటుందంటావ్?”

“మీరే చూస్తారు కదా?”

“దేనితో తయారు చేస్తారు దాన్ని?”

“దేనితోనా? ఈ గింజల్తోటే. అందుకే పక్కింటాయనకి ఊరికే ఇచ్చేయవద్దని చెప్పేను ఇందాక.”

“అన్యాయం నికోలాస్. ఈ తిండి గింజల్ని అలా పాడు చేయడం పాపం కదూ?”

“పాపమా? ఎవడండీ చెప్పేడు? మనిషి జీవితాన్ని సుఖమయం చేసుకోమనే బుర్ర నిచ్చేడు మనకి సృష్టికర్త. ఆ బుర్ర ఉపయోగించి గింజలు ఉడకబెట్టుకు తినొచ్చు, పిండిచేసుకుని రొట్టె చేసుకోవచ్చు, లేకపోతే పానీయాలు చేసుకోవచ్చు. పక్కింటాయనకి ఓ బస్తా ఇవ్వగా లేంది మీ ఆనందం కోసం ఓ బస్తా గింజలు విదల్చలేరూ? అదీ మీరు తాగబోయే పానకం కోసమే కదా?” పగలబడి నవ్వేడు నికోలాస్.

ఇవానోవిచ్ మెచ్చుకుంటున్నట్టూ చూసేడు నికోలాస్ కేసి, “ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావ్ నికోలాస్? నా దగ్గిరున్న రెండేళ్ళ పై చిల్లరలోనూ నువ్వెప్పుడూ బూట్లు విప్పినట్టు నాకు గుర్తే లేదు. తీరిగ్గా కూర్చున్నట్టు కానీ, ఓ పుస్తకం చదివినట్టు గానీ చూడలేదు. ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావ్?”

“అదో పెద్ద కధలెండి. మరో మారు మాట్లాడుకుందాం.”

“ఈ పానకం తాగితే బలం వస్తుందన్న మాట నిజమేనా?”

“మీరే చూస్తారుగా?”

“మరి దీన్ని ఎలాగా తయారు చేయడం?”

“దానంత సులభం మరోటి లేదు ఓ సారి చేసి మీకు చూపిస్తాను; మీరే చూద్దురు గాని.”

“తాగడానికి బాగుంటుందా?”

“బాగానా? తేనె కన్నా మధురం.”

“సరే మరి దీన్ని చేయడానికేం కావాలో చెప్పు”

“రెండు రాగి హండాలూ, రెండు ఇనుప గిన్నెలూ చాలు.”

“నిజమా? మన పక్కింటాయన దగ్గిర రాగి హండాలు చూశాను. ఇస్తాడేమో ఓ సారి అడుగుదాం.”

ఓ వారం గడిచేక నికోలాస్ ఇవానోవిచ్‌ని పొలం బయట పాకలోకి తీసుకెళ్ళేడు. లోపల మంట మీదనున్న ఓ హండాలో ఏదో మరుగుతోంది. కిందనో కుళాయిలా ఏదో ఉంది. ఇది చూసి ఆశ్చర్యంగా అడిగేడు ఇవానోవిచ్.

“ఏమిటిది నికోలాస్? కిందన కుళాయిలోంచి నీరు కారుతున్నట్టుందేం?”

“నీళ్ళు కాదు. మీకు చెప్పిన పానీయం ఇదే.”

“అవునా మరి ఇది గింజల రంగులో ఉంటుందనుకున్నాను కానీ నీళ్ళలాగా ఉందేం?”

“వాసన చూడండి ముందో సారి.”

వాసన చూసిన ఇవానోవిచ్ ముక్కు మూసుకుని అన్నాడు, “అదో రకం వెగటు వాసనేస్తోందేం?”

“వాసన అలాగే ఉంటుంది లెండి. ఓ గ్లాసు పుచ్చుకోండి. జాగ్రత్త! ఒలకబోసేరు సుమా.”

“ఏదీ మరో గ్లాసు తీయ్, ఓ గ్లాసుతో నాలుక మీద ఏమీ తెలిసినట్టులేదు.” తాగిన ఇవానోవిచ్ అన్నాడు.

తన పాచిక పూర్తిగా పారిన నికోలాస్ నవ్వేడు, “చూశారా నే చెప్పలేదూ? దీని తఢాఖా మీకే తెలుస్తుంది.”

రెండో గ్లాసు పూర్తి చేసిన ఇవానోవిచ్ అరిచేడు, “నికోలాస్ ఏం పానీయం చేసేవయ్యా? మా ఆవిడ మార్తాని పిలుద్దాం. ఏమంటుందో?”

నికోలాస్ ఇంట్లోకెళ్ళి మార్తాని ఉన్నచోటు నుంచి పిలుచుకొచ్చేడు పాకలోకి. పదేళ్ల పిల్లతో లొపలికొచ్చిన మార్తా చుట్టూ చూసి అంది, “ఎందుకంత తొందరగా రమ్మని పిల్చుకొచ్చేడు?”

“ఈ పానీయం నికోలాస్ చేసేడు ఇప్పుడే. తాగి చూడు ఎలా ఉందో?”

“ఈ వాసన బాగున్నట్టు లేదు. తాగితే లోపల జబ్బు చేస్తుందేమో?”

“తాగి చూడవే వెర్రిమొహమా!”

“తాగితే బాగానే ఉన్నట్టుందేం? దేంతో చేశారు దీన్ని?” తాగి రెండు గుటకలేశాక అడిగింది మార్తా.

“నేనూ నికోలాస్ కలిసి గింజలన్నీ పాడు చేస్తున్నాం అని ఏడిచావు కదా? ఇప్పుడర్ధం అయిందా ఈ గింజల్తో ఏం చేశామో? ఇది తాగితే ఎలా ఉంది మజా?” ఇవానోవిచ్ తూల్తూ అడిగేడు మార్తా బుగ్గమీద చిటికె వేస్తూ.

“ఒక్కొక్కరూ ఎన్ని గ్లాసులు తాగొచ్చు?”

“నికోలాస్ చెప్పడం ప్రకారం ఇది తాగితే ఒళ్ళూ, మనసూ తేలికౌతాయ్. కుర్రాళ్ళందరూ ముసలాళ్ళౌతారు. కాదు కాదు, ముసలాళ్ళందరూ కుర్రాళ్లౌతారు. నేను రెండు గ్లాసులు తాగానంతే. అప్పుడే ఒళ్ళు గాలిలో తేల్తున్నట్టుంది. ఇరవై ఏళ్ల కుర్రాడిలాగా లేనూ? దా, ఇద్దరం కల్సి మరో గ్లాస్ తాగుదాం,” మార్తాని దగ్గిరగా లాక్కుంటూ అడిగేడు ఇవానోవిచ్.

“అవును నేను కూడా మళ్ళీ చిన్నదాన్నయినట్టనిపిస్తోందే?”

“కాదు మరీ? నేన్చెప్పలే?”

“అత్తగార్ని పిలుద్దామా ఇది తాగడానికి? ఆవిడ నాగురించి ఎప్పుడూ దెప్పుతూనే ఉంటుంది కదా?”

“అవునవును పిలు,” అంటూ ఇవానోవిచ్ పాపతో చెప్పేడు, “పాపా, పోయి మామ్మనీ తాతనీ ఇక్కడున్నట్టు రమ్మన్నానని తీసుకురా. క్షణంలో రావాలి సుమా?”

పాప తుపాకీ గుండులా పాకలోంచి బయటకి పరుగెట్టింది. నికోలాస్ నవ్వుకున్నాడు, “పని పూర్తయింది. ఇంక అందర్నీ ఓ సారి కట్ట కట్టుకుని తీసుకుపోవడమే.”

పాకలోకి వచ్చిన మామ్మా తాతా చేతిలో గ్లాసుల్తో చెట్టాపట్టాలేసుకుని గెంతులేసే ఇవానోవిచ్‌నీ మార్తానీ చూసి నిర్ఘాంతపోయేరు. తాతే తేరుకుని అరిచేడు, “మేకేమన్నా మతి పోయిందేమిట్రా? పనిచేసుకునే సమయంలో అలా గెంతులేస్తున్నారు? ఇంతకీ ఏమిటి తాగుతున్నారు ఆ గ్లాసుల్తో?”

మామ్మ కూడా అరిచినట్టే అంది, “మార్తా ఇంట్లో పనంతా వదిలేసి ఇక్కడ గంతులేమిటే? బుద్ధి లేదూ? కోడళ్లందరూ ఇంతేలే.”

“మా మీద ఎగరకపోతే మాతో బాటూ ఓ గ్లాసు తాగి చూడరాదూ?” ఇవానోవిచ్ అన్నాడు మామ్మతో.

వాసన చూసిన మామ్మ అంది, “ఏం దరిద్రపుగొట్టు వాసనరా, ఇది తాగితే చావరూ?”

“చావా? ఓ గ్లాసు తాగితే జీవితం అంటే తెలిసొస్తుంది.”

రెండు గుక్కలేసిన మామ్మ తాతతో అంది, “వాసన అదోలా ఉంది గానీ తాగితే బాగున్నట్టే ఉంది. మీరో గ్లాసు పుచ్చుకుని చూడరాదూ?”

తాత అడ్డంగా తలాడిస్తూ అక్కడే కూలబడటం చూసి నికోలాస్ అన్నాడు, “ఆ ముసలాయన్ని పట్టించుకోకే అమ్మా. ఓ గ్లాసుతోటి దీని రుచి తెలియదు కానీ ఇదిగో మరోటి పుచ్చుకోండి. మజా అంతా మూడో గ్లాసు నుంచే మొదలౌతుంది.”

రెండో గ్లాసు తాగుతూన్న మామ్మ అడిగింది, “మార్తా, లోపలకి దిగుతూంటే గొంతులో మండుతున్నట్టుందే? నీకు అలా అనిపించిందా?”

“అవును. ఈ రెండో గ్లాసు లోపలకెళ్ళాక ఏమౌతుందో చూసుకోండి మజా.”

“సరే ఇలా తే!”

రెండో గ్లాసు ఖాళీ చేసిన మామ్మ అంది ఇవానోవిచ్‌తో, “కాళ్ళు తేలుతున్నాయిరా, మీ నాన్న గానీ చూస్తే నేను మళ్ళీ ఇరవైల్లోకి వెళ్ళినట్టు ఉందనేవాడు కాదూ?”

“చూశావా నేను ముందే చెప్పాను కదా?”

వీళ్లందర్నీ అలా వదిలేసి తాత మెల్లిగా లేచి వెళ్ళి కుళాయి పూర్తిగా తిప్పేడు. మొత్తం పానీయం అంతా నేలమీద ఒలికిపోతూంటే ఇవానోవిచ్ ముసలాయన మీద విరుచుకు పడ్డాడు, “బుద్ధి లేని ముసలోడా తప్పుకో పక్కకి. మొత్తం అంతా నేల మీద ఒలికిపోయినట్టుందే? ఇప్పుడేం దారి?”

“ఓరి దరిద్రుడా ఇదెక్కడ నేర్చుకున్నావురా? తిండి గింజలు దేవుడిచ్చినవి. వాటిని ఇలా తగలేస్తే నరకానికి పోతావ్. ఆ గింజలు తగలేసి దీన్ని పానీయం అనుకుంటున్నావా? ఇది నిప్పు, నిన్ను నిలువునా నాశనం చేసే నిప్పు. చూడు కావలిస్తే,” తాత అరుస్తూ అక్కడే ఉన్న మంటల్లోంచి ఓ కట్టె తీసి ఒలికిన పానీయం మీద పడేసేడు. భగ భగమంటూ నేలంతా అంటుకుంది. అందరూ చూస్తూండగా తాత కోపంగా బయటకి నడిచేడు.

నికోలాస్ తీరిగ్గా పొలంలో కూర్చునున్నాడు. ముసలి పిశాచం ఇచ్చిన మూడేళ్ల గడువు పూర్తయ్యేది ఈరోజు రాత్రే. ఇక్కడ జరిగే తంతు చూస్తే తనకి పదోన్నతి ఖాయం. మొదటిరోజు కాచిన పానీయం ముసలాయన ఒలకబోసేయడం వల్ల చుట్టాలకీ ఇంటి చుట్టుపక్కల వారికీ రుచి చూపించడం కుదర్లేదు. దాంతో ముసలాయనకీ ఇవానోవిచ్‌కీ మధ్య తగాదా మొదలయింది. అప్పట్నుంచీ కొట్టుకు ఛస్తున్నారు రోజూ. ఆస్తి వేరే పంచమని గొడవపెట్టడం మొదలెట్టాడు ఇవానోవిచ్. ఈ వయసులో వ్యవసాయం చేయలేడు కనక ముసలాయనకేమీ ఆస్తి రాదు ఇందులో. ముసలాయనకి తెలీకుండా ఇంకో పీపాడు పానీయం చేసి కనిపించకుండా దాచేరు తర్వాత. అది ఇవాళొచ్చే అతిథులకీ, తండ్రీ కొడుకుల మధ్య వచ్చిన ఆస్తి తగువులు తీర్చడానికొచ్చే పెద్దమనుషులకీ రుచి చూపిస్తే తన పని పూర్తయినట్టే. ఆ తర్వాత నరకానికి వద్దన్నా ఈ రైతులందరూ వస్తూనే ఉంటారు. తన పని వకీలు భూతం పని కంటే కంటే సుళువైపోతుంది. ఈ రాత్రి ముసలి పిశాచం చూడ్డానికొచ్చేసరికి అంతా సరిగ్గా ఉండేలా చూసుకుంటే చాలు.

సాయంకాలం అతిథులందరూ రావడం మొదలౌతూనే ముసలి పిశాచం నికోలాస్ కేసి చూసి అడిగింది, “నీకిచ్చిన మూడేళ్ళు పూర్తయ్యాయ్, ఏదైనా అఘోరించావా? లేకపోతే కొరడా మళ్ళీ రుచి చూపించాలా?”

“కొరడాలూ అఖ్ఖర్లేదు, కత్తులూ అఖ్ఖర్లేదు. ఈ రోజు మీరే చూద్దురుగాని. నేను లోపలకెళ్ళి వాళ్లందరికీ ఒక్కో గ్లాసూ అందిస్తూ ఉంటాను. మీరు ఓ మూల కూర్చుని జరిగే తతంగం అంతా గమనించండి.”

“సరే పద పోదాం.”

నికోలాస్ లోపలకి నడిచేడు. ముసలి పిశాచం అందరూ కనబడేటట్టుగా చూడ్డానికి కుదురుగా కూర్చుంది. వచ్చిన పెద్దల్లో ఒకాయన నికోలాస్‌ని అడిగేడు, “సారా కాచి పెట్టారా?”

“అదెప్పుడో సిద్ధంగా ఉంది.”

“ఇది రెండో సారి కాదూ కాచడం? మొదటి విడతలో కాచిన దానికీ, దీనికీ ఏమైనా తేడా ఉందా?”

“ఇప్పుడు చేసింది మొదటిదానికన్నా బాగా వచ్చింది.”

“ఓ పట్టు పడదాం రండి, మరెందుకాలస్యం?”

ఇవానోవిచ్, మార్తా గ్లాసులూ సరంజామా అన్నీ తెచ్చాక ఓ గుక్క వేసిన పెద్దాయన అడిగేడు నికోలాస్‌ని “భలే రుచి. ఎక్కడ నేర్చుకున్నావ్ ఇలా సారా కలపడం?”

“ప్రపంచంలో కళ్ళు తెరిచి చూస్తే నేర్చుకోవడానికెన్ని కొత్త విషయాలు లేవు?” నికోలాస్ నవ్వేడు.

“నిజం, నిజం!” పెద్దలందరూ గాడిదల్లా బుర్రలూపేరు.

వీళ్ళిలా తాగుతూ ఉంటే నికోలాస్ ముసలి పిశాచం దగ్గిరకెళ్ళి చెప్పేడు, “ఇంతకు ముందు వీడి తిండీ నీరు పాడు చేసినా కోపం తెచ్చుకునేవాడు కాదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో.” ఇలా అంటూ ఎదురుగా వచ్చే మార్తాకి కాలు అడ్డం పెట్టేడు. ఆవిడ తూలి నేల మీద పడింది. చేతిలో గ్లాసూ, సారా ఒలికిపోయేయి నేల మీద.

ఇవానోవిచ్ ఉగ్రుడైపోయేడు ఇది చూసి. “ఏమే దరిద్రపు మొహమా కళ్ళు కనిపించవా? ఈ సారా కాచడానికి ఎంత సమయం పడుతోందో నీకు తెలుసా? నీ వేళ్ళు అన్నీ బండబారిపోయినట్టున్నాయే?”

“నేను కావాలని చేయలేదే?”

“కావాలని చేసే అంత ధైర్యం ఏడిసిందా నీకు? వీళ్లందర్నీ వెళ్ళనీయ్, నిన్నేం చేస్తానో చూద్దువు గాని,” ఇలా అరిచిన ఇవానోవిచ్ నికోలాస్ కేసి తిరిగి అన్నాడు, “ఒరే నువ్వు ఇక్కడ అన్నీ అమర్చాక బయటకి పోకుండా ఇక్కడే మా చుట్టూ తిరుగుతున్నావ్ దేనికీ? నిన్నో దెయ్యమో భూతమో ఎత్తుకుపోనూ.”

ఇవానోవిచ్ అందరి కేసీ తిరిగి అడిగేడు, “పోనీయండి ఆ గ్లాసు పోతే మరోటి వస్తుంది కానీ మీరిక్కడకి ఎందుకొచ్చారో తెల్సు కదా? చెప్పండి ఇప్పుడు ఆస్తి అంతా నాకేనా లేకపోతే ముసలాయనకి కట్టబెడదామనుకుంటున్నారా? నేనిచ్చేవన్నీ పందుల్లా తిని తాగేసి నాకెసరు పెట్టే ధైర్యం ఉందా మీకు?”

“ఆస్తి అంతా నీదేనయ్యా. నువ్వూ నీ పాలేరు నికోలాస్ కష్టపడి పండించినది ముసలాయనకి ఎలా వదుల్తాం?” అందరూ తలో నవ్వూ పారేసి ముక్త కంఠంతో అనడం అదృశ్యంగా అక్కడే ఉన్న ముసలి దెయ్యానికి స్పష్టంగా వినిపించింది. పక్కనే ఉన్న నికోలాస్‌ని మోచేత్తో పొడిచింది సంతోషంగా.

“తాతను లోపలకి పిలవరా నికోలాస్,” చెప్పేడు ఇవానోవిచ్.

తాత లోపలకి రాగానే అన్నాడు ఇవానోవిచ్, “ముసలోడా ఇప్పుడు చెప్పు ఇక్కడున్న ఈ పెద్దల సమక్షంలో. నీకేదో ఆస్తి రావాలంటున్నావ్ కదా? చెప్పు, మాట్లాడగలవా? నేనూ ఈ నికోలాస్ గడించిందంతా నీక్కావాలా? ఎవడబ్బ సొమ్మనుకుంటున్నావ్?”

“నిన్ను తాగుడు మానమన్నాను కానీ ఆస్తి కావాలనలేదే? తాగుడు మానితే నీ అంత మంచివాడు మరోడు లేడు.”

“నా పంట నా ఇష్టం. ఇందులో ఉన్న మజా నాకు తెల్సు, ఇక్కడ పెద్దలకీ తెల్సు.”

“అవునవును!” పందులన్నీ తలూపేయి.

“అదీగాక ఇవానోవిచ్ మా స్నేహితుడు కూడా,” ఇంకో పెద్దాయన చెప్పేడు.

“తాగనప్పుడు మీరందరూ ఎలా తన్నుకునేవారో నేనెరగనా?” తాత అసహనంగా అన్నాడు.

కోపం వచ్చిన పెద్దలందరూ తాత మీద తలో దెబ్బ వేసి తలుపు తీసి బయటకి తోశారు. మత్తులో నవ్వుకుంటూ అదే తలుపులోంచి బయటకి వెళ్ళబోయిన ఇవానోవిచ్ బొక్కబోర్లా పడ్డాడు రోడ్డు మీద. అదేమీ పట్టించుకోకుండా పెద్దమనుషులు చేతులు కలిపి గ్లాసులెత్తారు మరో గుటక తాగడానికి.

ఇదంతా చూస్తోన్న ముసలి పిశాచానికి నికోలాస్ చెప్పేడు, “చూడండి ఈ పానీయం నోట్లో పడగానే ఒకరితో ఒకరు పందుల్లా ఎలా కొట్టుకుంటున్నారో ఆస్తి కోసం, అమ్మాయిల కోసం, డబ్బుల కోసం. అవేవీ దొరక్కపోతే సరదా కోసం?”

“మిగిలిన కధ చివరిదాకా చూడక్కర్లేదు కానీ నువ్వు చేసిన గారడీ అద్భుతంగా ఉంది. ఏ మాత్రం కోపం తెచ్చుకోని మనుషులు, ఒకర్నొకరు గౌరవంగా చూసుకుంటూ బతికే మనుషులు ఇలా తయారవ్వడానికి కారణం ఏమిటి? ఇదంతా ఎలా సాధ్యమైంది? మనిషి రక్తంలో పందుల, నక్కల, కుక్కల, తోడేళ్ల రక్తం ఎలా సాధ్యపడింది? ఆ సారాలో ఈ జంతువుల రక్తం కానీ కలిపేవా నువ్వు?”

“అబ్బే అంత లేదు కధ. జంతువులు వీళ్ళకన్నా వంద రెట్లు నయం. నేను చేసిందేమిటంటే వీడికి కావాల్సిన దానికన్నా ఎక్కువ గింజలివ్వటం. ఎప్పుడైతే రెక్కాడితే కానీ డొక్కాడని స్థితి లోంచి బయటకొచ్చాడో అప్పుడే వీడి వంట్లోని కుక్క, నక్క, తోడేలూ అన్నీ బయటకొచ్చాయి. తినడానికి సరిపోయినంత మాత్రమే ఉన్నప్పుడు ఆ జంతు స్వభావం వీడి వంట్లో అంతర్గతంగా బయటకి రాకుండా పడి ఉంది. ఒక్కసారి గింజలెక్కువయ్యేసరికి అప్పటివరకూ నోరెత్తకుండా పడి ఉన్న జంతువులన్నీ ఒక్కసారి విజృంభించాయి అంతే!” చిన్న భూతమైన నికోలాస్ నవ్వేడు.

ముసలి దెయ్యం నికోలాస్‌ని శెభాష్ అన్నట్టూ చేత్తో భుజం మీద తడుతూ చెప్పింది, “మొత్తం మీద మాట నిలబెట్టుకున్నావ్ మూడేళ్ళూ కష్టపడి పని చేసి. ఇంక ఇప్పట్నుంచీ మనకి నరకంలో రైతులకి కూడా కొదువ ఉండబోదు. మనం చేయవల్సిందల్లా వీళ్లకి సరిపడా సారా పోయిస్తూ ఉండడమే.”

“మరి నా పని పూర్తైంది కదా అయినా ఇక్కడే ఉండాలా?” చిన్న భూతం అడిగింది నాయకుడైన ముసలి పిశాచాన్ని.

“ఇంకా ఇక్కడేముంది చేయడానికి? నీలాంటి ప్రతిభావంతులకి వేరే పని చూసి పెట్టాను. రా పోదాం.”

భూతాలు రెండూ కీచుగా అరుచుకుంటూ నరకం వైపు ఎగిరి పోయేయి.
------------------------------------------------------
రచన: ఆర్. శర్మ దంతుర్తి,
మూలం: లియో టాల్‌స్టాయ్ 
(మూలం: The First Distiller.)
ఈమాట సౌజన్యంతో

1 comment:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete