ఉండేలు
సాహితీమిత్రులారా!
“కుర్ హోయ్… కుర్ హోయ్…” బక్కడు పిలుస్తుంటే వారగా తెరిచిన దొడ్డి తలుపులోంచి ఊరిమీదకి ఉరుకుతున్న పందులు, మళ్ళీ వెనక్కి ‘డ్రోంక్ డ్రోంక్’ అంటూ పరిగెత్తుకొచ్చేశాయి. తెల్లారగట్టే చెరకు గానుగుల నుంచి కుండలతో మోసుకొచ్చిన తేపను వాడు తాటి డొల్లలో పోస్తుంటే ఒకదాన్ని ఒకటి ముట్టిపెట్టి కొట్టుకుంటూ ఆబగా తాగుతున్నాయి.
రకరకాల సైజుల్లో బలంగా ఎదిగిన పందులని చూసుకున్న బక్కడు, ఓసారి కళ్ళకి చెయ్యడ్డుపెట్టి ఆకాశం వైపు చూశాడు. చల్ది వేళ అయింది. కాస్సేపట్లో వాడి బామ్మర్ది నతానేలు వస్తాడు. వాడికిచ్చి ఓ పందిని సంతకి తోలాలి.
బక్కడు ఏడాది పొడవునా ప్రతిబుధవారం ఓ పందిని సంతలో అమ్ముతుంటాడు. పొరుగూరులో వుండే నతానేలు అందుకు సాయం చేస్తాడు. ఓ విధంగా పెంపకం వీడిది, వ్యాపారం వాడిది.
తేప త్రాగిన పందులు ఒకదాన్నొకటి తరుముకుంటూ కుమ్ముకుంటూ ఊరిమీద పడ్డాయి. తేప కావిడ్ని గుడిసె చూరు కింద పెట్టిన బక్కడు అప్పమ్మ సర్దివుంచిన చల్ది గెంజి ముందు కూర్చున్నాడు.
“ఏంవాయ్, ఏంటివ్వాళ వేట?” మీసం తిప్పుకుంటూ అడిగారు కలిదిండి జనార్ధనరాజు.
“పావురాయండే దివానం.”
“భేష్.”
జనార్ధనరాజుకి రోజూ పిట్ట మాంసం వుండాలి. లేకపోతే ముద్ద దిగదు.
నల్లగా నేరేడుపండులా నిగనిగలాడే జనార్ధనరాజు వయస్సు యాభైకి అటూ ఇటూ వుంటాయి. అంతటి నలుపు మొహంలోనూ ఎర్రటి పెదాలు ఎప్పుడూ తాంబూలం వేసుకున్నట్టు కనిపిస్తాయి. కాంతులీనే ఆయన కళ్ళు ఎలాటివారినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి. ఆడవాళ్ళనైతే మరీను. ఆయన్ని బాగా తెలిసినవాళ్లకి మాత్రమే ఆయన కళ్ళ వెనక కదిలే భావాల గురించి తెలుస్తుంది. కోరింది క్షణాల్లో అమర్చిపెట్టే దాసదాసీజనం, వందిమాగధులు, లంకంత కొంప, వందల ఎకరాల తోటలకీ పొలాలకీ ఆసామీ అయిన రాజుగారికి పిల్లా జెల్లా ఎవరూ లేరు. దీనంతటికీ పిట్ట శాపమే కారణమంటూ ఊళ్లో జనం గుసగుసలాడుతుంటారు. ఈ పిట్టలని కొట్టడం, పొయ్యిమీద పెట్టడం మానుకోవాలని ఆయన భార్య ఎంత పోరుపెట్టినా వినకపోవడంతో ఆవిడ పుట్టింటికి వేంచేశారు.
పందుల పెంపకం కంటే, రాజుగారికి రోజుకో పిట్టని కొట్టిపెట్టడమే బక్కడికి ప్రధాన వ్యాపకం. ఇందుకుగానూ వాడికి అయిదు ఎకరాల మామిడితోటని రాజుగారు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దానిమీద వచ్చిన ఫలసాయం వాడిదే. అంతేకాకుండా రాజుగారి తోటలలో రాలిన మామిడి టెంకలన్నీ వాడివే. టెంకల్లో వుండే జీడి అంటే పందులకి మహాప్రీతి.
ఒక్క బక్కడనే కాదు రాజుగారి ప్రతి అవసరాన్నీ… తమ అవసరం కంటే ఎక్కువగా భావించి ప్రభుసేవలో తరించే చాలామందికి, ఆయన ఇలాటి సదుపాయాలనే ఏర్పాటు చేస్తారు.
రామకోవెల దగ్గర పులీమేకా ఆడుతున్న బుల్లియ్య అండ్ కో కళ్ళల్లో పడకుండా తప్పించుకుపోవడానికి సన్నాసులు, ఆ గోడ ప్రక్కా ఈ గోడ ప్రక్కా నక్కుతూ నడుస్తున్నాడు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది.
సన్నాసిని ఓరకంట చూసిన బుల్లియ్య “ఒరేయ్ మీరు కాస్సేపు ఆగండ్రా… సన్నాసిగాడు వస్తున్నాడు, ఓ ఆట పట్టిద్దాం,” అన్నాడు మిత్రబృందాన్ని. బుల్లియ్య బ్యాచ్ గప్ చుప్ అయిపోయారు.
“ఏట్రా సన్నాసులూ, బుట్ట బుజాన్నేసుకు దిగడ్డావ్. ఇల్రా…” పిలిచాడు బుల్లియ్య.
“ఆగాహె… అవతలీధికి అర్జంటుగా పోవాలి, అయినా నీలాటి పోస్కోలెధవలతో మాటాడొద్దంది మా మామ్మ,”
“నంగనాచి తుంగబుర్ర… ఏటి? అంత మాటనీసిందా! ఎల్దీ గానిలేరా? రా ఇలారా కూర్చో,”
ఇక తప్పదన్నట్టు చేతిలో జంగిడిని పక్కన పెట్టి కూలబడ్డాడు సన్నాసులు.
“బాగా బరువున్నట్టుంది? యేంట్రా బుట్టలో?”
“కోడిగుడ్లాయ్. కొత్తేపారం మొదలెట్టేను. మనూళ్ళో గుడ్దు పావలాక్కొని, రాంపురం అట్టుకెళితే అద్రూపాయి!”
“ఏ ఎధవ చెప్పేడ్రా నీకు గుడ్లేపారం ఎట్టమని? బుట్ట కిందడితే మొత్తం బంక బంకైపోయి లాభం గూబల్లోకి వచ్చేత్తాది,”
“అవున్రా సన్నాసీ, పొద్దున మా కోడి గుడ్డెట్టింది కదాని ఇలా తీశానో లేదో అలా చేతిలోంచి జారి చిదిగిపోయింది. ప్రాణం ఉస్సూరుమందనుకో…” చింతించాడు రాంబాబు.
“మరేం చెయ్యమంటార్రా? కాళీగా తిరుగుతున్నావని, మా మామ్మ కాల్చుకు తినేత్తంది.”
“సుబ్బరంగా మిలట్రీలో జాయినయిపో.”
“నేనా? మిలట్రీలోనా? చెయ్యగలనంటావా?”
“ఏం నీకేం తక్కువ? కోడిగుడ్ల యాపారంకన్నా అదే ఈజీ.”
“ఏటి నిజవే…”
“ఆఁ. కావాలంటే రాంబాబుగాడిమీదొట్టు. నీ బుట్టలో ఒక్కో గుడ్దూ తీసి కిందెట్టు,”
సన్నాసులు జంగిడిలో వున్న ఒక్కో గ్రుడ్డునీ జాగ్రత్తగా క్రింద పెట్టాడు.
“ఈటన్నాటినీ… ఎలా తీసేవో అలా జంగిట్లో పెట్టెయ్,” చెప్పాడు బుల్లియ్య.
సన్నాసులు మళ్ళీ గ్రుడ్లన్నిటినీ జంగిట్లో పెట్టేసుకున్నాడు.
“ఇంతేరా. ఇలా చేత్తేచాలు. మిలట్రీలో బాంబుకాయలు కోడిగుడ్లలాగే వుంటాయి. నువ్వొకోటీ తీసి జార్తగా ఆళ్ళకిస్తే… నోటితో ఆళ్ళు ముచ్చుకు లాగి చైనావోళ్లమీదేసేస్తారు. అంతే…”
“బాగుంద్రా, నన్ను మిలట్రీలో జాయిన్ చేసెయ్యండ్రా…” అన్నాడు సన్నాసులు ఉత్సాహంగా.
“అలాగే. ఇంక నీకీ గుడ్లెందుకు? మనోళ్ళు నలుగురుకీ తలా పుంజీడు ఇచ్చెయ్. నీ పేరుమీద ఆట్టేసుకు తింటారు పాపం.”
అందరికీ నాలుగేసి గుడ్లు పంచేసిన సన్నాసులు. “నడండి మరి,” అన్నాడు.
“ఆగరా బాబూ… అంత కంగారేటి? బాంబుకాయలందించగానే సరేటి? అప్పుడప్పుడూ ఆళ్ళకి చేతులు పీకితే… నువ్వు టుపాకట్టుకొని నలుగురైదుగురు చైనావోళ్ళని పేల్చిపారెయ్యాలా వద్దా? కాంత అదికూడా నేర్చుకో…”
“భలే ఫిటింగ్ ఎట్టావురా? అదెక్కడ నేర్చుకోవాలి.”
“మన బక్కడున్నాడు కదా! ఎవడు? పందుల బక్కడు. నెల్రోజులు ఆడికూడా తిరుగు. ఆడి దగ్గర ఈటెలు, బరిసెలు, బాణాలు, ఉచ్చులూ, వడిసెలలూ, ఉండేళ్ళూ బోలెడన్నుంటాయి. అయ్యన్నీ నేర్చేసుకున్నావనుకో, ఇంక నువ్వు బాంబుకాయలందిచక్కర్లేదు. డాం డాం డామ్మని టుపాకెట్టి కాల్చి పారేయడమే!”
“మరే… మరే…” అంటూ బుల్లియ్య మాటలు పూర్తికాకుండానే సన్నాసులు పరుగు లంకించుకున్నాడు.
రాత్రి పెట్టిన ఎలకల బుట్టల్ని తియ్యడానికి, పొలంబాట బట్టిన బక్కడికి కాలవ దగ్గర ముసానం చేటలందుకుంటున్న ఆడవాళ్లు కనబడ్డారు. ఊళ్ళో ఏ పుణ్యస్త్రీ పోయినా బంధువుల్లో పుణ్యస్త్రీలకి ఇలా చేటలివ్వడం సంప్రదాయం. బక్కడి పెళ్ళాం అప్పమ్మ, ఈ చేటలు అల్లడంలో సిద్ధహస్తురాలు. మామూలుగా వెదురుతో చేటలు అల్లడం బక్కడి కులవృత్తికాదు. ఈత మట్టలతో రైతులకి కావాల్సిన తట్టలు, బుట్టలు అల్లడానికే వాళ్ళకి సమయం చాలదు. కానీ ఊళ్ళో చేటలు అల్లేవాళ్లెవరూ లేకపోవడంతో అప్పమ్మకి, ఈ చేటలు అల్లే బాధ్యత తప్పడం లేదు. దాన్ని అప్పమ్మ పుణ్యకార్యంగా భావిస్తుంటుంది.
“ఏరా బక్కా, ఏం జూత్నావిక్కడ?”
అక్కడి తంతుని దూరాన్నుంచి చూస్తున్న బక్కడు, సన్నాసులు పిలుపుతో ఆలోచనల్లోంచి బయటపడ్డాడు.
“పాపవండే… పసుపుకొమ్ములా వుండీది. కాలుజారి నూతిలో అడిపోయిందంట.”
“ఇలాటోళ్లందరికీ రాజుగారి పెద్దనుయ్యే దిక్కులా వుంది. ఆ నుయ్యి కప్పెట్టెద్దారేట్రా?” అన్నాడు సన్నాసులు ఏదో ఆలోచిస్తున్నట్టు.
“మనకెందుకులెద్దురూ, నడండి.” అన్న బక్కడు చేలగట్లవెంట పెట్టిన బుట్టల్ని ఒక్కోటీ ఏరి పోగెడుతుంటే… సన్నాసులు సాయం చేస్తున్నాడు.
“చూడండెలా బలిసిపోయాయో! పుట్టి మూన్నెల్లయ్యుండదు ఒక్కోటీ బత్తాడొడ్లు బుక్కేసుంటాయి.” బుట్టల్లోంచి చచ్చిన ఎలకలని తీస్తున్న బక్కడు చెప్పాడు.
వాటివంక నిర్వికారంగా చూసిన సన్నాసులు జేబులోంచి బీడీ తీసి వెలిగించాడు.
పంటకాల్వ గట్టున మాటువేశాడు బక్కడు. వాడి నిక్కరు జేబులో మట్టి గోళీలు బరువుగా వున్నాయి. గుబురుపొదలు, నీటివసతి వున్నచోట చెవుడు కాకులు వుంటాయన్న సంగతి వాడికి గోచీ పెట్టుకునే వయస్సు నుంచే తెలుసు.
ఓ మట్టి గోళీని, కేటల్ బార్‌లో వుంచి పొదవైపే చూస్తున్నాడు. ఎక్కడా అలికిడి లేదు. ఒకటి. రెండు.. మూడు… క్షణాలు గడుస్తున్నాయి. చెవుడుకాకి అలికిడి లేదు. ఓ పెద్ద రాయి తీసి పొదమీదకి విసిరాడు. వెంటనే కేటల్ బార్‌ని పొజిషన్ లోకి తీసుకున్నాడు. ప్చ్! లాభం లేకపోయింది. చెవుడు కాకి ఆనవాలు లేదు. వుంటే రాయి దెబ్బకి భయంతో బయటపడేదే. మాటు మార్చాలి. రాజుల చెరువు వైపు నడిచాడు.
బక్కడి ప్రతి కదలికనీ నిశ్శబ్దంగా పరిశీలిస్తున్న సన్నాసులు వాడిని అనుసరించాడు.
రాజుగారి వంటకి ఆలస్యమైపోతోంది. సూర్యాస్తమయం కల్లా భోజనం ముగించటం రాజుగారికి ఆనవాయితీ. పిట్ట మాంసం రుచి మరిగినప్పటినుంచీ రాజుగారు ఎన్ని పిట్టలని తినేశారో, ఆయన కోసం ఇప్పటివరకూ తాను ఎన్ని పిట్టల ఉసురు తీసి వుంటాడో… నడుస్తున్న బక్కన్ని ఆలోచనలు చుట్టుముడుతున్నాయి.
వడిసెల విసరడం, ఉండేలు ఉపయోగించడం, ఉచ్చులు పన్నడం, మత్తు గింజలు చల్లి పిట్టలని పట్టడం బక్కడికి ఇష్టం వుండదు. గుండు గురిచూసి కొట్టడమే వాడి నైజం. గువ్వలు, గునపంకోళ్లూ, పావురాలు, కారుకోళ్ళు, చిలకబాతులు, జమ్ముకోళ్లు, చెవుడుకాకులు, గూడకొంగలు, నీటికోళ్లు. ఒకటా? రెండా? తనవల్ల జంటలని కోల్పోయి ఎన్ని పక్షులు ఒంటరయిపోయాయో? అవి మళ్లీ జంటకట్టడం అనేది జరగని మాట. గుండు దెబ్బతిని నేలకూలిన పిట్టల నిర్జీవమైన కళ్ళల్లో ఆ బాధ, బక్కడికి ఎప్పుడూ కనబడే అవకాశంలేదు. కానీ ఆ వియోగం గురించి వాడికి తెల్సినంతగా మరెవరికీ తెలియదు.
కానీ ఏం చేస్తాడు? ఇది తన వృత్తి. వృత్తి ధర్మం ప్రకారం, రాజుగారి పంటికిందకి ఇంత పిట్ట మాంసాన్ని సంపాదించి పెట్టడమే. అది తప్పా? ఒప్పా? పాపం-పుణ్యం అవేమీ వాడికి తెలీదు. కళ్లెదురుగా చెరువు గట్టున వాలిన చిలకబాతుల గుంపు బక్కడి ఆలోచనలని చెల్లాచెదురు చేసింది. ఈ మధ్య కాలంలో అన్ని బాతులు కనబడడం ఇదే.
కేటల్ బార్ చేతిలోకి తీసుకున్నాడు. మట్టిగోళీని పెట్టి, ఓ కన్నుమూసి రబ్బరుని చెవిదాకా లాగి వదులుతుండగా… సన్నాసులు వాడిని ప్రక్కకి ఒక్క తోపు తోశాడు. గుండు గురితప్పి, ఓ పొదని అదిలించడంతో ప్రమాదాన్ని పసిగట్టిన బాతుల గుంపు అక్కడ నుంచి పలాయనం చిత్తగించింది.
“యాటి బాబు మీరు చేసిన పనేటి?” పైకి లేస్తూ సన్నాసులు మీద ఆగ్రహం ప్రదర్శించాడు బక్కడు.
“పాపం రా!”
“పాపం లేదు గీపం లేదు. అటికీభూమ్మీద నూకలు చెల్లిపోతే చత్తాయి అంతే. చచ్చీ పెతి పిట్ట మీద రాజుగారి పేరు రాసుంటది.”
“రాజుగారికెప్పుడు చెల్లిపోతాయిరా నూకలు? అప్పుడుగానీ ఈ పిట్టలు బతికి బట్టకట్టవా?”
సన్నాసులు ప్రశ్నకి బుర్రగోక్కున్న బక్కడు “మీరు తింగరోళ్ళో… గడుసోల్లో… నాకద్దమవట్లేదు. మీకోదన్నం. నా కూడా రాకండి.” అని పొదల్లోకి పోయి మాయమైపోయాడు.
పొద్దున్నే తేప పెట్టి, పందులని ఊరిమీదకొదిలేసిన బక్కడు రాజుగారి పిట్టల కోసం వేటకి పోయాడు. వాడు తిరిగొచ్చేసరికి సన్నాసులుతోపాటూ నతానేలూ వాడి స్నేహితుడూ గుడిసెముందు కూర్చుని వున్నారు. నతానేలు, వాడితోపాటూ వచ్చినవాడి చేతుల్లో బలమైన వెదురు గడలున్నాయి. వాటికి చివర తాడుతో ఉచ్చులు బిగించి వున్నాయి. వాటిని ఆసక్తిగా చూస్తున్నాడు సన్నాసులు.
“యారా బావా ఎంసేపయ్యింది వచ్చి?” బామ్మర్దిని చూసి కుశల ప్రశ్నలేశాడు బక్కడు.
“ఉప్పుడే అరగంటయ్యింది. బేగా నడు, ఇప్పటికే ఆలీసవైపోయింది.” అన్నాడు నతానేలు.
“నాకాడకి రావొద్దన్నాను కదా! మల్లెందుకొచ్చేరు?” సన్నాసులు మీద చిరాకుపడ్డ బక్కడు గుడిసె చూరులోంచి పెద్ద బాణాకర్ర తీశాడు. ఎవరి కర్రలు వాళ్ళు పట్టుకొని, ముగ్గురూ ఊరి మీదకి బయలుదేరారు. సన్నాసులు కూడా వాళ్లవెనకేపడ్డాడు. కొంతదూరం వెళ్ళేసరికి బురదలో దొర్లుతూ పందుల గుంపు కనిపించింది.
“అగో… ఆ తెల్లపందినేసేద్దాంరా” చెప్పాడు బక్కడు.
నతానేలూ, వాడి స్నేహితుడూ ఇద్దరూ చెరో రాయీ తీసి బురద గుంటలోకి విసిరారు. పందులు బీకబీకలాడుతూ గుంటలోంచి లేచి, తలో దిక్కూ పరిగెత్తాయి. మిత్రులిద్దరూ తెల్ల పంది వెనక ఉచ్చుకర్రలతో పడ్డారు. అది ఆ సందులోంచీ ఈ సందులోంచీ దూరుతూ, పారిపోతూ వాళ్లిద్దర్నీ పరుగులు పెట్టిస్తోంది.
“ఒరే తింగరెదవా! పొద్దున్నే దొడ్లోనే దాన్ని వుంచెయ్యొచ్చు కదరా, ఇప్పుడు ఉరుకులూ పరుగులూ పెట్టేబదులు?” ప్రశ్నించాడు సన్నాసులు.
ఒకసారి సన్నాసులు కళ్ళలోకి సూటిగా చూసిన బక్కడు “అది ఏట నియమం బాబూ. ఏటాడి చంపడం మా నీతి.” అన్నాడు.
డ్రోంక్… డ్రోంక్… తెల్లపంది హృదయ విదారకంగా అరుస్తోంది. దాని మెడకి నతానేలు ఉచ్చు బిగుసుకుంది. అయినా అది జంకూ గొంకూ లేకుండా ఉచ్చుతోపాటూ వాడ్నీ ఈడ్చుకుంటూ పరిగెడుతోంది.
పంది సరిగ్గా తన ముందుకు రాగానే… బాణా కర్రెత్తి బక్కడు దాని తలమీద బలంగా ఒక్క దెబ్బ వేశాడు. అంతే అది కీచుమంటూ విరగబడిపోయింది. నతానేలూ వాడి స్నేహితుడూ కిందపడ్డ పంది కాళ్లని కదలకుండా కట్టేసి, బాణాకర్రకి దాన్ని తగిలించుకొని మోసుకుపోతుంటే… బక్కడి కళ్ళముందు రాజుగారు, చేటలు మార్చుకుంటున్న ఆడంగులు ఏకకాలంలో మెదిలి మాయమయ్యారు.
సంజ చీకట్లు ముసురుకుంటున్నాయి.
చక్కటి పిట్టమాంసంతో విందారగించిన జనార్ధనరాజు మామిడితోటలోని విశ్రాంతి భవనం ముందు తాంబూలం నములుతూ పచార్లు చేస్తున్నారు.
నూతి వెనకనుంచి లేచిన బక్కడు ఒకే ఒక్కసారి దానిలోకి చూశాడు. తర్వాత కేటల్ బార్‌లో మట్టిగోళీని వుంచి ఓ కన్ను మూసి చూస్తుండగా… రాజుగారు ఒక్కసారిగా విరుచుకుపడిపోయారు.
చెట్టు చాటునుంచి చీకట్లోకి కలిసిపోయిన సన్నాసులు బక్కడికి కనబడలేదు.
----------------------------------------------------
రచన: చిరంజీవి వర్మ అనే వత్సవాయి చిట్టివెంకటపతి రాజు,
ఈమాట సౌజన్యంతో
No comments:
Post a Comment