Tuesday, December 3, 2019

రంగుల రాజ్యం


రంగుల రాజ్యం
సాహితీమిత్రులారా!


ఒక నల్లవాడు ఒక తెల్లవాళ్ళ కాలనీలో ఒక ఇల్లు కొనుక్కొని అందులోకి చేరిపోయాడు. ఆ నల్లరంగు ఇంటికి ఒక నల్లరంగు వరండా ఉండేది. ఆ నల్లని వరండాలో ఒక నల్లటి కుర్చీలో కూర్చొని ఆ నల్లవాడు ప్రతీరోజూ ఒక నల్లరంగు కప్పులో నల్లటి కాఫీ తాగుతుండేవాడు–ఒక నల్లటి రాత్రి ఇరుగుపొరుగు తెల్లవాళ్ళు ఇతని ఇంట్లోకి జొరబడి నల్లవాణ్ణి దారుణంగా కొట్టేదాకా. నల్లవాడు నేల మీద ఉండ చుట్టుకుపోయి తన నల్లని రక్తపు మడుగులోనే పడిపోయినాక కూడా–ఉన్నట్టుండి ఒక తెల్లవాడు ఈ నల్లవాడు మన చేతుల్లో చస్తే మనం జైలుకెళతాం, చంపేదాకా కొట్టద్దు ఆపండి ఆపండి అని అరిచేదాకా- తెల్లవాళ్ళు నల్లవాణ్ణి ఇంకా ఇంకా కొడుతూనే ఉన్నారు.

ఆ నల్లవాడు ఆ తెల్లవాళ్ళ చేతుల్లో చావలేదు. కాసేపటికి ఒక అంబులెన్స్ వచ్చి అతన్ని దూరంగా, చాలా దూరంగా ఎక్కడో ఒక నివురుగప్పిన అగ్నిపర్వతం మీద ఉన్న ఒక మాంత్రికలోకం లాంటి హాస్పిటల్‌కు తీసుకొనిపోయింది. ఆ హాస్పిటల్ రంగు తెలుపు. దాని గుమ్మాలు తెలుపు. దాని గోడలు తెలుపు. నేల తెలుపు, కప్పు తెలుపు. దుప్పట్లు తెలుపు, పరుపులు తెలుపు. ఆ నల్లవాడు మెల్లిమెల్లిగా కోలుకోసాగేడు. మెల్లిమెల్లిగా కోలుకుంటూనే ప్రేమలో పడిపోయేడు. ఇతన్ని కంటికిరెప్పలా కాపాడుకొని, దయతో ప్రేమతో ప్రతిరోజూ సపర్యలు చేసిన ఒక తెల్లని యూనిఫామ్ వేసుకునే ఒక తెల్లని నర్సుతో ప్రేమలో పడిపోయేడు. ఆమె కూడా ఇతన్ని ప్రేమించింది. ఆ నల్లవాడి లాగా, వాళ్ళ ప్రేమ కూడా రోజురోజుకీ బలం పుంజుకొని, పక్క మీదనుంచి లేవగలిగేదాకా, లేచి నేల మీద పాకగలిగేదాకా వచ్చింది–ఒక చిన్న పిల్లవాడిలాగా, ఒక పాపాయిలాగా, తెల్లవాళ్ళు చచ్చేలా కొట్టిన ఒక నల్లవాడి లాగా.

వాళ్ళిద్దరూ ఒక పసుపుపచ్చ చర్చ్‌లో పెళ్ళిచేసుకున్నారు. ఒక పసుపుపచ్చ ఫాదర్ వారికి పెళ్ళి చేశాడు. ఆ ఫాదర్ తల్లిదండ్రులు ఒక పసుపుపచ్చ దేశం నుంచి పసుపుపచ్చ ఓడలో వచ్చారు. వాళ్ళు కూడానూ వాళ్ళ ఇరుగుపొరుగు తెల్లవాళ్ళ చేతిలో బాగా దెబ్బలు తిన్నారు. కానీ ఆ పసుపుపచ్చ ఫాదర్ నల్లవాడికి ఈ సంగతులేమీ చెప్పలేదు. ఇతనెవరో పరిచయం లేదు. పైగా పెళ్ళి చేసుకుంటున్నాడు. ఇప్పుడా సంగతులన్నీ చెప్పుకొనే సందర్భం కాదు. అతను చెప్పదలచుకున్నదల్లా, దేవుడు దయామయుడని, వారిద్దరినీ ప్రేమిస్తాడని, వారిద్దరి జీవితం సుఖంగా కొనసాగాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తానని. కానీ అతనికి అలానే జరుగుతుందని కచ్చితంగా తెలీదు. ఎన్నోసార్లు, అంతా మంచే జరుగుతుంది అని తనను తాను నమ్మించుకోవడానికి ఫాదర్ చాలా ప్రయత్నించాడు. అతని నమ్మకమల్లా దేవుడు మంచివాడని, అందరినీ దయతో ప్రేమిస్తాడని, అందరి మంచి మాత్రమే కోరుకుంటాడని. కాని, ఆరోజు, ముప్ఫై యేళ్ళు కూడా సరిగ్గా నిండకుండా, ఒళ్ళంతా గాయాల గాట్లు మరకలతో, విరిగిపోయిన ఎముకలతో, చక్రాల కుర్చీలో కూర్చొనున్న నల్లవాడిని చూసినప్పుడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఆ ఫాదర్‌కి చాలా కష్టమయింది. ఎలానోలా నోరు పెగల్చుకొని, దేవుడు మీ ఇద్దరినీ ప్రేమిస్తాడు. మీ జీవితం సుఖంగా కొనసాగేలా ఆ దేవుడు మిమ్మలని చూస్తాడు అని శుభాకాంక్షలు మాత్రం చెప్పగలిగేడు. చెప్పగానే సిగ్గుతో తల దించుకున్నాడు.

ఆ నల్లవాడు, ఆ తెల్లనామె కలిసి చిలకా గోరింకల్లా హాయిగా కాపురం సాగించేరు. అయితే, ఒక సాయంత్రం ఆమె పచారీ దుకాణం నుంచి నడుచుకుంటూ ఇంటిలోకి రాబోతుండగా మెట్ల వెనుక, ఒక గోధుమరంగువాడు ఒక గోధుమరంగు కత్తితో ఆమె కోసం ఎదురుచూస్తూ ఉండి, ఆమె దగ్గరున్న డబ్బు, ఒంటి మీది బంగారం అన్నీ ఇచ్చేయమని బెదిరించేడు. నల్లవాడు ఆ రాత్రి ఇంటికి వచ్చేసరికి తన తెల్లని భార్య చచ్చిపోయి కనిపించింది. ఆ గోధుమరంగువాడు ఎందుకు తన భార్యని పొడిచి చంపేశాడో నల్లవాడికి అర్థంకాలేదు. ఆమె దగ్గరున్న డబ్బు బంగారం తీసుకొన్నాక ఆమెనేమీ చేయకుండా వెళ్ళిపోయి ఉండచ్చు కదా!

ఆ తెల్లనామె అంత్యక్రియలు ఆ పసుపుపచ్చ ఫాదర్ ప్రార్థించే  అదే పసుపుపచ్చ చర్చ్‌లోనే జరిగేయి. పసుపుపచ్చ ఫాదర్‌ను చూడగానే నల్లవాడు అతని చేయి పట్టుకొని ఆపేడు. నువ్వారోజు చెప్పేవు. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడని చెప్పేవు, చెప్పలేదూ? మరి దేవుడు మమ్మల్ని ప్రేమిస్తే మమ్మల్ని ఎందుకిలా శిక్షిస్తాడు, మాకిలాంటి అన్యాయం ఎలా చేస్తాడు? అని అడిగేడు. పసుపుపచ్చ ఫాదర్ దగ్గర ఈ ప్రశ్నకు ఒక సమాధానం తయారుగా ఉంది. అది చర్చ్ స్కూల్‌లో అందరు ఫాదర్‌లకూ క్లాసురూములో నేర్పించిందే: దేవుడు మనకు అర్థం కాని పద్ధతుల్లో ప్రవర్తిస్తాడని, ఆయన నిర్ణయాలను, ఆయన మనసులో ఆలోచనలను అర్థం చేసుకోవడం మనవల్ల కాదని. ఏదైనా కూడా, చనిపోయిన ఇతని భార్య ఇప్పుడు దేవుడికి మరింత దగ్గరగా ఉంది అని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలని. కానీ ఫాదర్ నల్లవాడికి ఆ సమాధానం ఇవ్వలేదు. అప్పటికప్పుడు ఆపకుండా దేవుడిని తిట్టడం మొదలుపెట్టాడు. అవి మామూలు తిట్లు కావు. శాపాలు, శాపనార్థాలు. అసలు అలాంటి తిట్లు, అంత దారుణమైన తిట్లు, అంతకుముందు ప్రపంచంలో ఎవరూ విని ఎరగనటువంటి తిట్లు తిట్టేడు. అంత పరుషమైన తిట్లను విన్న దేవుడు కించపడి మనసు గాయపర్చుకున్నాడు.

మనసు గాయపర్చుకున్న దేవుడు పసుపుపచ్చ చర్చ్ లోకి వచ్చాడు. కుంటివాళ్ళు చక్రాలకుర్చీ సహాయంతో వేదిక పైకి రావడం కోసం మెట్లకు ఒక పక్కగా కట్టిన వాలుగట్టు మీదుగా వేదిక పైకి వచ్చాడు. దేవుడు కూడా చక్రాలకుర్చీలోనే ఉన్నాడు. దేవుడు కూడా ఒకప్పుడు తన ప్రేమికను పోగొట్టుకొన్నాడు. దేవుడు వెండిరంగులో మెరుస్తున్నాడు. వెండిరంగు జుట్టు, వెండిరంగు దుస్తులు, వెండిరంగు చక్రాల కుర్చీ. ఆ వెండిరంగు బ్యాంకు డైరక్టర్లు, స్టాక్ బ్రోకర్లు, వాళ్ళ కింద పనిచేసే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లూ కొనుక్కునే బిఎండబ్ల్యూ, బెంజ్ లాంటి కార్లకుండే నాసిరకం తళతళలాడే వెండిరంగు కాదు. లేకి చమక్కులు లేకుండా వెన్నెలలా హుందాగా, మాసినట్టున్న వెండిరంగు. ఒకరోజు ఈ వెండిరంగు దేవుడు తను ఎంతగానో ప్రేమించే తన వెండిరంగు ప్రేయసితో వెండిరంగు నక్షత్రాలలో తేలుతూ విహారం చేస్తున్నప్పుడు, ఒక బంగారురంగు దేవుళ్ళ గుంపు వచ్చి వీళ్ల మీద దాడి చేసింది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆటల్లో ఎప్పుడో ఈ వెండిరంగు దేవుడు సన్నగా బక్కపలచగా ఉన్న ఒక బంగారురంగు దేవుడిని కొట్టేడు. ఇప్పుడు ఆ దేవుడు పెరిగి పెద్దవాడై స్నేహితులతో కలిసి ఇలా వచ్చేడు. బంగారురంగు దేవుళ్ళ గుంపు బంగారురంగు సూర్యకిరణాల కర్రలతో వెండిరంగు దేవుడిని, అతని ప్రేయసిని, ఆపకుండా కొట్టేరు–అతని దివ్యశరీరంలో ఉన్న ప్రతీ ఎముక విరిగిపోయేదాకా. దేవుడికి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. కాని, అతని వెండిరంగు ప్రేయసి ఎప్పటికీ కోలుకోలేదు. శరీరమంతా చచ్చుపడిపోయి ఒక జీవచ్ఛవమై అలా ఉండిపోయింది. మాట్లాడలేదు, కదలలేదు, నవ్వలేదు, నడవలేదు, అసలింకేమీ చేయలేదు. ఆమె కేవలం చూడగలదు, వినగలదు, అంతే. అది చూసి వెండిరంగు దేవుడు కనీసం ఆమె వారిని చూస్తూ సమయం గడుపుతుంది కదా అని చూడటానికి తనలాగే ఉన్న మానవ జాతిని సృష్టించాడు. ఆ వెండిరంగు దేవుడు సృష్టించిన మానవజాతి చూడటానికి అచ్చు ఆయనలానే ఉంది. ఆయనలానే బాగా హింసించబడి, అఘాయిత్యాలకు బలికాబడినట్టుగా ఉంది. ఆ వెండిరంగు దేవుడి ప్రియమైన వెండిరంగు ప్రేయసి విప్పారిన కళ్ళతో అలా గంటలు గంటలు రోజులు రోజులు ఆ జాతిని చూస్తూ ఉండేది, కనీసం ఒక్క చుక్క కూడా కన్నీరు కార్చకుండా.

ఏమనుకుంటున్నావు నాగురించి? వెండిరంగు దేవుడు పసుపుపచ్చ ఫాదర్‌ను అడిగేడు ఆక్రోశంతో, అలిసిపోయి, జీవితంతో రాజీ పడిపోయిన గొంతుతో. నేను మిమ్మల్ని ఇలా కావాలనే, నాకు ఇష్టమయే పుట్టించాననుకుంటున్నావా? నేను మీ అందరూ బాధపడుతుంటే చూసి ఆనందిస్తున్నానని అనుకుంటున్నావా? మీరు ఏడుస్తుంటే చూసి నవ్వుకొనే శాడిస్టులాగా కనిపిస్తున్నానా నీకు? నేను మిమ్మల్ని ఇలా పుట్టించింది ఎందుకూ అంటే నాకు తెలిసిందీ ఇదే కాబట్టి. ఇలా పుట్టించడమే నేను చేయగలిగింది. నాకు చేతనయింది. అంతే. దేవుడు ఇంకేమీ మాట్లాడకుండా తల తిప్పుకున్నాడు సన్నగా వణుకుతూ.

పసుపుపచ్చ ఫాదర్ దేవుడి ముందు మోకాళ్ళ మీద కూలబడిపోయేడు. చేతులు జోడించి క్షమించమని అడిగేడు. నిజానికి ఇంకా బలమైన దేవుడెవరైనా ఆ చర్చ్‌లో అప్పుడు ప్రత్యక్షమై ఉండుంటే ఫాదర్ తిట్లు ఆపకపోను. ఇంకా తిడుతూనే ఉండును. కాని, ఇలా మాసిన వెండిరంగులో వికలాంగుడైన దేవుడిని చూస్తుంటే ఫాదర్ మనసులో జాలి, పశ్చాత్తాపం కలిగేయి. అతను నిజంగానే దేవుడు తనను క్షమించాలని అనుకున్నాడు. నల్లవాడు తన మోకాళ్ళ మీద కూలబడలేదు. నడుము కిందనుంచి అంతా చచ్చుబడిపోయిన శరీరం ఆ నల్లవాడిని అలా చేయనీయదు. అందుకని అలా చక్రాలకుర్చీలోనే కూర్చొని ఉండిపోయేడు. అలా కూర్చొని ఉండిపోయి, ఆకాశంలో ఎక్కడో ఏ దైవలోకం నుంచో ఒక వెండిరంగు దేవత విప్పారిన కళ్ళతో తనను చూస్తూ ఉన్నట్టుగా ఊహించుకున్నాడు. ఆ ఊహ అతనికి ఒక ఓదార్పునిచ్చింది. బహుశా ఇంకా బతికి వుండడం కోసం కొంత స్థైర్యాన్నీ ఇచ్చింది. ఆ నల్లవాడికీ అర్థంకాలేదు అది ఎలా అర్థం చేసుకోవాలో కాని, తనూ ఒక దేవుడిలా బాధలు పడుతున్నాడన్న ఆలోచన తనలోనూ దైవత్వం ఉందనుకొనేలా మాత్రం చేసింది.
---------------------------------------------------
రచన: మాధవ్ మాౘవరం
మూలం: Etgar Keret
(మూలం: Pick a color.)
ఈమాట సౌజన్యంతో

2 comments:

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete