Sunday, December 1, 2019

“తండ్రి” తనం


“తండ్రి” తనం




సాహితీమిత్రులారా!


శివరామారావు గట్టి సాంప్రదాయపు మనిషి. అతనికి తొమ్మిదేళ్ళ కొడుకు సూర్యనారాయణ.

“ఏరా సూర్యం, పొద్దున్న పూజ చేశావా?”

“చేశాను నాన్నగారూ!”

“నిన్న పొద్దున్న పూజ చెయ్యకుండానే స్కూలికెళ్ళావుట? ఏం, ఒళ్ళు పొగరెక్కి కొట్టుకుంటున్నావా? తాట వొలిచేస్తాను.”

“నిన్న పొద్దున్న కాస్త ఆలస్యంగా లేచాను, నాన్నగారూ! స్కూలు టైం అయిపోయిందని, పూజ చెయ్యకుండానే స్కూలికెళ్ళిపోయాను. ఇంకెప్పుడూ ఆలస్యంగా లేవను నాన్నగారూ!”

“పొద్దున్న ఆలస్యంగా లేస్తే, చద్దన్నం తినడం మానెయ్యి, టైం లేకపోతే. అంతేగానీ, పూజ చెయ్యడం మానకూడదు. తెలిసిందా?”

“తెలిసింది నాన్నగారూ!”

“ప్రతీరోజూ స్కూల్నించీ వచ్చాక హనుమాన్‌ చాలీసా పారాయణం చెయ్యమన్నాను. చేస్తున్నావా?”

“రోజూ చేస్తునాను గానీ, …..”

“కానీ.. ఏమిటీ? ఏమిటో సరిగా, నాన్చకుండా, చెప్పిచావు.”

“మొన్నో రోజు పాఠాలు ఎక్కువగా చదవాల్సి వుండి, హనుమాన్‌ చాలీసా పారాయణం చెయ్యలేదు నాన్నగారూ! మరి….”

“ఓరి దౌర్భాగ్యుడా! కళ్ళు పోతాయి వెధవా, చాలీసా పారాయణం ఆపేస్తే. వచ్చే చదువు కూడా రాకుండా పోతుంది.”

“……..”

“ఇంకెప్పుడన్నా ఇలా జరిగిందని తెలిసిందో, స్కూలు మానిపించేస్తాను, జాగ్రత్త!”

“అలాగే నాన్నగారూ! కానీ……”

“అలా మాటలు నాన్చొద్దని ఎన్నిసార్లు చెప్పాలీ? మళ్ళీ ఏమొచ్చిందీ?”

“వచ్చే శనివారం పొద్దున్న మా స్కూలు వాళ్ళు విహార యాత్రకి తీసుకెళుతున్నారు. ఆ రోజు పొద్దున్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం కుదరదు నాన్నగారూ. అందుకని ఆదివారం వెళతాను నాన్నగారూ!”

“వీల్లేదు!”

“కానీ……”

“వీల్లేదన్నానా? ఆ దేముడి దయ లేకపోతే ఈ మాత్రం బతుక్కూడా వుండదు నీకు. గుడికెళ్ళడం ముఖ్యమా, విహార యాత్ర ముఖ్యమా? పిచ్చి వేషాలు వేస్తే, కాళ్ళు విరగ్గొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. తెలిసిందా?”

సూర్యనారాయణ దుఃఖాన్ని అణచుకుంటూ తల వంచుకున్నాడు.

కొడుకు బాధ నర్థం చేసుకున్న తల్లి అంది బెరుకుగా, “పోనీ, ఈ ఒక్కసారికి వెళ్ళనీయకూడదుటండీ? పాపం వాడు బాధ పడుతున్నాడు.”

“ఆడదానివి, ఎక్కడుండాలో అక్కడుండు. అనవసర విషయాల్లో తల దూర్చకు. అసలు నీ వత్తాసు తోనే భయం, భక్తీ లేకుండా తయారవుతున్నాడు వాడు. నా మాటకి ఎదురుచెప్తే వూరుకునేది లేదు” అంటూ శివరామారావు హుంకరించాడు.

బిక్కు బిక్కుమంటూ వుండిపోయారు తల్లీకొడుకులు.

* * * * *

ఇంకో కొన్నేళ్ళు కాల ప్రవాహంలో కలిసిపోయాయి.”సూర్యం! ఆ భగవంతుడి దయ వలన ఇంజినీరింగులో సీటు వచ్చింది కదా! అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామికి తలనీలాలు అర్పించుకుని రా!” అంటూ శివరామారావు ఆదేశం జారీ చేశాడు.”గుండు చేయించుకుని ఇంజినీరింగు కాలేజీకెళితే అందరూ ఏడిపిస్తారు. నాకిష్టం లేదు గుండు చేయించుకోవడం. నేవెళ్ళను అన్నవరం.”

“చాల్లేరా చెప్తున్నావు! కాలేజీ కొచ్చేసరికి నీకు షోకులెక్కువయ్యాయి. ఆ దేముడి దయ లేకపోతే ఎందుకూ పనికి రాకుండా తయారయ్యేవాడివి, తెలిసిందా?”

“నేను కష్టపడి చదివి తెచ్చుకున్న మార్కులతో వచ్చింది సీటు. అంతేగానీ, దేముడి దయ వల్ల కాదు.”

“ఆపు నీ నాస్తిక ప్రవచనాలు! దేముడి దయ లేకపోతే ఆ కష్టం మాత్రం పడగలిగేవాడివా? అదీగాక ఈ మధ్య పూజ చెయ్యడం మానేసినట్టున్నావు?

“……”

“అంతేగాదు, ఈ మధ్య నాస్తిక పుస్తకాలు చదువుతున్న్నావుట? ఆ ఎర్రట్ట పుస్తకాలెందుకు ఈ కొంపకి తెస్తున్నావూ? రోజు రోజుకీ చెడిపోతున్నావు. దేముడి దయ లేకపోతే అడుక్కు తినాల్సి వస్తుంది, తెలుసా?”

“…….”

“నీ వేషాలు భరించడం నా వల్ల కాదు. మొన్నటికి మొన్న నువ్వు ఆ తక్కువ కులం వాళ్ళతో తిరుగుతున్నావని ఎదురింటి సుబ్బారావుగారు చెప్పారు. తల తీసేసినట్టయింది. ఇవన్నీ ఆపుతావా, లేదా?”

“నాన్నగారూ! మీకెప్పటి నించో చెబుదామనుకుంటున్నాను. చాలా కాలం నించీ నాకు దేముడి విషయాల మీద నమ్మకం పోయింది. ఆ కార్యక్రమాలు నేను ఇక చెయ్యలేను. మీరు నా చేత ఇక బలవంతంగా చేయించలేరు. చిన్నప్పటి నించీ నా చేత ఎన్నో చేయించి, నన్నెన్నో బాధలకి గురి చేశారు. నేను ఇప్పుడు నాస్తికుణ్ణయ్యాను. ఇంకెంత కాలం భయపడుతూ బతుకుతాను?”

తేల్చేసి చెప్పిన కొడుకు సూర్యనారాయణ్ణి నివ్వెరపోయి చూస్తూ వుండిపోయాడు తండ్రి శివరామారావు.

* * * * *

కాలచక్రం ఇంకా కొన్నేళ్ళు తనలో ఇముడ్చుకుంది.నాస్తిక సూర్యనారాయణ ఒక కొడుక్కి తండ్రయ్యాడు. కొడుకు శరత్‌ తొమ్మిదేళ్ళవాడు.”శరత్‌! నిన్న నువ్వు వాళ్ళ మురళితో గుడికెళ్ళావుట?”

“మరే….మరే…..డాడీ….అసలేమయిందంటే….”

“మాటలు నాన్చకుండా చెప్పమన్నానా? నత్తొస్తుంది కొన్నాళ్ళకి ఇలాగే మాట్టాడుతూ వుంటే.”

“అదికాదు డాడీ! గుడి దగ్గర సందులో మేం క్రికెట్‌ ఆడుతూ వుంటే బాల్‌ వెళ్ళి గోడ దాటి గుడి కాంపౌండులో పడింది. తెచ్చుకోవడానికి మురళీ, నేనూ లోపలకి వెళ్ళాం. అక్కడున్న పూజారిగారు మమ్మల్ని దగ్గరకి పిలిచి, నెత్తి మీద శఠగోపం పెట్టి, చేతిలో కొబ్బరి ముక్కలు పెట్టారు. నేను అడగలేదు డాడీ! అడక్కుండానే పెట్టారని తిన్నాను డాడీ!”

“గుళ్ళో ప్రసాదం తినడానికి బుద్ధి లేదూ? గుడి దగ్గరున్న సందులోకెళ్ళొద్దని నీకెన్ని సార్లు చెప్పానూ? మనం నాస్తికులమని చెప్పానా, లేదా?”

“……”

“మాట్టాడవేం? పొద్దున్నే పక్కింటి వాళ్ళు మతాబులు కాలుస్తూ వుంటే, అలా మొహం వాచినట్టు చూస్తూ వున్నావేం? నువ్వూ కాలుస్తానని వాళ్ళని బతిమాలడం చూశాను. సిగ్గు లేదూ అలా బతిమాలడానికి?”

“కాదు డాడీ! దీపావళి అన్చెప్పి వాళ్ళంతా కొత్త బట్టలు కొనుక్కున్నారు. ఇల్లంతా అలంకరించుకున్నారు. వాళ్ళమ్మ ఏవేవో పిండివంటలు చేసింది. వాళ్ళంతా చక్కగా మతాబులూ, కాకర పువ్వొత్తులూ కాలుస్తుంటే, రంగు రంగుల పువ్వులొచ్చి, చాలా బాగుంది డాడీ!”

“అవును, వాళ్ళు నాస్తికులు కారు మనలాగా! నరకాసురుడిని కృష్ణుడు చంపాడని వాళ్ళలా పండగ చేసుకుంటారు. మనం పండగలు చేసుకోము. నువ్వు ముష్ఠాడిలా వాళ్ళని మతాబుల కోసం దేవిరించడం బాగోలేదు. నాస్తిక కధల పుస్తకం చదవమని చెప్పాను వారం రోజుల కిందట. ఇప్పటి వరకూ ఆ పుస్తకం ముట్టుకోలేదు. అలా అయితే, వచ్చే నెల్లో కొనిస్తానన్న సైకిలూ, క్రికెట్‌ బేటూ కొనేది లేదంతే!”

“అలా ఇంకెప్పుడూ చెయ్యను డాడీ! వాళ్ళు కాలుస్తుంటే, దూరం నించీ చూస్తానంతే!”

“చీ! చీ! అది కూడా కుదరదు. ముష్ఠాడనుకుంటారెవరన్నా! పండగ రోజుల్లో అస్సలు బయటికెళ్ళకు. అంతే!”

“………”

తల్లికి కొడుకుని చూస్తే జాలేసింది.

“పోనీలెండీ! వాడి కోరిక తీరేలా ఒకసారి బాణసంచా కాల్చనివ్వకూడదూ? ఒక్కసారితో ఏం పోతుందీ?” అంది అనునయంగా.

“నువ్వలా మాట్టాడి వాడికి అలుసివ్వకు. ఎన్నిసార్లు చెప్పాను నీకు, వాడి ముందర అలా మాట్టాదొద్దనీ, మనిద్దరం ఒకే మాట మీద వుండాలనీ? ఎంత వుద్యోగం చేస్తున్నా నువ్వూ మామూలు ఆడదానివే! పిల్లల పెంపకం విషయం నాకొదిలేసి, నీ లిమిట్సులో నువ్వుండు” నిష్కర్షగా చెప్పేశాడు సూర్యనారాయణ.

మౌనంగా వుండిపోయారు తల్లీకొడుకులు.

* * * * *

తనకేమీ పట్టనట్టు కాలప్రవాహం మరి కొన్నేళ్ళు దాటిపోయింది.”శరత్‌! మెడిసిన్‌లో సీటొచ్చిందని పెద్దవాడి నయిపోయాననుకుంటున్నావా? నిన్న హేతువాద సభకి రమ్మంటే రాకుండా, ఎక్కడకెళ్ళావూ?””నిన్నా….? నేనా….? అవును, గుర్తొచ్చింది. ‘మనిద్దరికీ మెడిసిన్‌లో సీటొచ్చింది కదరా, గుడికెళ్ళొద్దామని’ నా ఫ్రెండు మురళి అంటే, వాడితో గుడికెళ్ళొచ్చాను, డాడీ! అంతే!””ఏమిటీ…? నువ్వు గుడికెళ్ళావా? నాస్తికుడి కొడుకయి వుండీ గుడికెళ్ళడానికి సిగ్గెయ్యలేదూ నీకు? మెడిసిన్‌లో సీటు నువ్వు కష్టపడి చదవడం వల్ల వచ్చింది గానీ, దేముడి మహిమ వల్ల రాలేదు. ఆ మధ్య మీ ఫ్రెండు జార్జి ఇంట్లో క్రిస్‌మస్‌ చెట్టు అలంకరించావుట?”

“అవును డాడీ! నాలాగే కష్టపడి చదివిన మూర్తిగారబ్బాయికి రాలేదు మెడిసిన్‌లో సీటు. కొన్నాళ్ళ నించీ ఆలోచిస్తున్నాను. నాకు దేముడి మీద నమ్మకం కలుగుతోంది. ఇంతమంది చదువుకున్న వాళ్ళు నమ్ముతున్నారు కదా! నీ నమ్మకాలతో ఏకీభవించలేను డాడీ! అనంతమైన ఈ విశ్వంలో దేముడనే వాడున్నాడనే నా విశ్వాసం!”

ఖిన్న వదనంతో చూస్తూ వుండిపోయాడు తండ్రి.

ఆస్తికుడైన తండ్రికి గానీ, నాస్తికుడైన తండ్రికి గానీ తమ పుత్రులు తమ భావాలకు తగ్గట్టుగా ఎందుకు పెరగలేదో ఎప్పటికీ అర్థం కాదా?
------------------------------------------------------
రచన: జె. యు. బి. వి. ప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment