పాడు ప్రాణము పోదేమి వదలి బొంది
సాహితీమిత్రులారా!
అనేక మంది కవులు గౌతమ బుద్ధుని చరిత్రను తమ కావ్యాలుగా వ్రాయడం జరిగింది. వారిలో పేరెన్నిక గన్నవాడు అశ్వఘోషుడు ఈయన బుద్ధచరిత్ర వ్రాశాడు. మన తెలుగులోమన తిరుపతి వేంకట కవులు వ్రాశారు. ఆధునిక కాలంలో అద్దంకి కేశవరావుగారు ''తథాగతీయం'' పేరుతో వ్రాశారు. అందులోని ఈ సన్నివేశ చిత్రీకరణ చూద్దాం.
సిద్ధార్థుడు మహాభినిష్క్రమణం రోజునాటి రాత్రి అర్థరాత్రి పడకగది దాటి బయటికి రాగానే కునికిపాట్లు పడుతున్న తన రథసారథి ఛన్నుడిని లేపి తన గుర్రాన్ని సిద్ధం చేయమన్నాడు. తన గుర్రాన్ని ఛన్నుడు సిద్ధం చేయగానే గుర్రాన్నెక్కి బయలుదేరాడు ఛన్నడు తన గుర్రాన్నిక్కి సిద్ధార్థుని అనుసరించాడు. ఆ సమయంలో ఎక్కడి వెళుతున్నాడో ఏమోనని ఏమీ మాట్లాడకుండా వెళ్ళగా వెళ్ళగా ఒక అడవిలోని ప్రవేశించాడు సిద్ధార్థుడు. ప్రయాణం చేయగా తెల్లవారేసరికి అరోమా నదీతీరానికి చేరుకున్నారు. అక్కడి చేరాక చెప్పాడు సిద్ధార్థుడు అసలు విషయం. తాను ఈ ప్రాపంచిక బంధాల్లో ఇమడలేనని తను ఇల్లు విడిచి పోతున్నానని రాజోచిత వస్త్రాలను, ఆభరణాలను తీసి ఛన్నుని చేతిలో పెడుతూ తన తల్లిదండ్రులకు భార్యకు చెప్పి ఓదార్చమని పురమాయించాడు. దానితో ఛన్నునికి నోట మాటరాలేదు. సరికదా
ఒళ్లంతా చెమటలు పట్టాయి.
ఈ సందర్భంలో అద్దంకి కేశవరావుగారు కరుణరసప్లావితంగా చిత్రించారు.
చితికిపోయెడు చిత్తమున్ చేతబట్టి
గాద్గదిక గళరవళితో, కనుల తీరు
వెల్లువైపార, ఛన్నుండు బేల పడచు
ననియె నీరీతి గౌతవగ నరసి యరసి (1272వ పద్యం)
ఛన్న! నా సుతు డెందు చనెనొ జెప్పు మటన్న
మారాజు కేమని మనవి సేతు
అయ్య! నాకొడుకేడి యని నన్ను బ్రశ్నించి
మారాణి కేమని మారుసెపుదు
అన్న! నా పతి యేడ నని దీనతను వేడు
యువరాణి నేమని యూరడింతు
ఓరి! మా యువరాజు యున్కి జెప్పు మటన్న
పౌరుల కేమని పలుకువాడ
సచివు లాదిగ సేవక చయము వరకు
నిలువ దీసిన నేమిగతి పలుక గలను!
ఇన్నిటికి మించి నిను వీడి యెట్టు లేను
బొందిలో ప్రాణాల నిల్పి యుందు నయ్య! (1276వ పద్యం)
ఛన్నున్ని విన్నపాలు సిద్ధర్థుని బుద్ధినేమీ మార్చలేక పోయాయి.
పైగా మారు మాట్లాడకుండా ఇంటికి వెళ్లమని కఠినంగా ఆదేశించాడు.
అపుడు ఛన్నుడు అన్నమాటలు -
కంటికి రెప్పవోలె నినుగాంచిన భృత్యుడ, న్ను నీ గతిన్
గెంటి యనంత విశ్వమున యొంటరి వాడవౌచు పో
నుంటివి, నీదు నీడవలె నుండెడు నన్నిటు లేచ పాడియా
తొంటి కృపారసం బిపుడు దోపని రీతి చరింతు వేలనో!
(129వ పద్యం)
ఇట్టి ఘోరంబు జూచుచు నెట్టు సైతు!
పిడుగు నా నెత్తి పడదేమి! వ్రీల దేమి
గుండె! కను లాబలై పోవ కున్నవేమి!
పాడు ప్రాణమగ పోదేమి వదలి బొంది!(1296వ పద్యం)
అంటూ వలవల ఏడ్చాడు. బ్రతిమిలాడుకున్నాడు- ప్రాధేయపడ్డాడు. గౌతముని మనసు కరగలేదు. ప్రయత్నమంతా విఫలమైంది. యజమాని ఆజ్ఞను పాటించాకదా భృత్యుడు తాను ఈవిషయాన్ని అంతఃపుంలో చెప్పాలి ఇక చేసేదిలేక - భారహృదయంతో వెనక్కి మళ్ళాడు.
చూశారుకదా! ఈ పద్యాలు ఎంత కరుణరసప్లావితంగా ఉన్నాయో
-----------------------------------------------
వాఙ్మయి పత్రికలోని
దేవవరపు నీలకంఠరావుగారి వ్యాసం నుండి
కొంత భాగం ఆధారం
No comments:
Post a Comment