Saturday, November 30, 2019

హత్య కేసి వేగంగా


హత్య కేసి వేగంగా





సాహితీమిత్రులారా!


కారులు, విమానాలు, మెషీను గన్నులు … మధ్య లో కూర్చుని నవ్వుతూ ఆడుకుంటున్న ఒక రెండు మూడేళ్ళ పిల్లవాడు. వాడు ఆడుకునే ఆ కాస్త జాగా తప్పిస్తే హాలంతా తీర్చి దిద్దినట్లుంది చాలా యేళ్ళుగా శ్రమించి సమకూర్చుకుని, పొందికగా ఎంతో అందంగా సర్దుకుని అలంకరించుకున్న సామానులతో.

ఒక వైపు గోడ మీద వ్రేళ్ళాడుతున్న గీతోపదేశం పెయింటింగు, దాని ప్రక్కనే పారుతున్న సెలయేరులో నీళ్ళు త్రాగుతున్న జింకపిల్లతో ఒక ప్రకృతి దృశ్యం. మరో గోడ మీద నలుపు తెలుపు రంగుల్లో ఒక పాత ఫోటో.

గోడ గడియారంలో టైము సరిగా కనిపించడం లేదు.

అద్దం పగిలినట్లుంది…అయినా టైమ్‌ ఆగినట్లు లేదు!

ఎవరో తలుపు కొడుతున్నారు…గట్టిగా…పిల్లవాడు జడుసుకునేట్లుగా! గబగబా వెళ్ళి తెరిచి చూసాను. ఎవరూ లేరు. గుమ్మంలోంచి అడుగు బయటకు జారింది.

ఎక్కడున్నానో తెలియడం లేదు.
అది ఏ దేశం? ఏ ఊరు? ఏ వీధి? అస్సలు ఊరేనా?! వూళ్ళో అది వీధేనా!?!?
గజిబిజిగా ఉంది. రయ్యి రయ్యిన రొద చేస్తూ విమానాలు ఎగురుతున్నాయి. మారుతున్న ట్రాఫిక్‌ సిగ్నల్‌ రంగులను ఖాతరు చేయకుండా, ప్రళయం తరుముకొస్తున్నట్లు డ్రైవర్లు లేని కారులు మహా వేగంతో దూసుకుపోతున్నాయి. ఆనకట్ట తెగిపోయినట్లు, నేలంతా పల్లానికి ఒరిగిపోయినట్లు … ప్రవాహం! ఆ జనంలో పడి కొట్టుకుపోకుండా ప్రక్కనే ఉన్న స్తంభాన్ని గట్టిగా వాటేసుకున్నా …

పదడుగుల దూరంలో ఎవరో ముసలాయన మట్టితో ఏదో చేస్తున్నాడు. చేసిన దాన్ని మళ్ళీ ముద్దగా చేస్తున్నాడు. మళ్ళీ జాగ్రత్తగా ఏకాగ్రతతో అదే మట్టి ముద్దతో మరేదో చేస్తున్నాడు…మరలా అదే మట్టిని పిసికేసి పెద్ద ముద్దగా చేస్తున్నాడు. మొహంలో అలసట లేదు, విసుగూ లేదు. దగ్గరగా వెళ్ళినా, నా వునికిని గుర్తించకుండా తన పని తను చేసుకుపోతున్నాడు.

ఎక్కడి నుంచో పెద్ద శబ్దం…వెనక్కి తిరిగి చూశాను

రోడ్డు మీద చాలా మంది చాలా చాలా హడావిడిగా తిరుగుతున్నారు. తెలిసిన మొహం ఒక్కటీ లేదు. నన్నెవరో పిలిచినట్లనిపించి, తల తిప్పి చూసాను. ఎవడో అచ్చు నా రూపంలో!
వాడు నాలాగే మాట్లాడుతున్నాడు. నేనే అక్కడ నవ్వుతున్నాను. ఇక్కడి నేనే అక్కడి నన్ను చూస్తున్నాను! అక్కడి నేను, ప్రక్కనే వున్న మరో ఇద్దరితో కలిసి నడుస్తున్నాను.

చుట్టూ గోడలు మొలుస్తున్నాయి. ఇనుప గొలుసుల్లా మెరుస్తున్నాయి. జాగిలాల్లా నన్ను తరుముతూ నా వెంట పడ్డాయి. కనుచూపు మేరలో అన్నీ గోడలే! ఎదురుగా సన్నటి దారి అంచెలంచెలుగా గోడగా మారి, ఎత్తుగా నిటారుగా మేఘాలను తాకుతూ నిల్చుంది.
నా వెనుక వస్తున్న వాళ్ళు, నా ముందు వెళ్ళిన వాళ్ళూ ఏమయ్యారు? గోడలయ్యారా…గోడలను మోస్తున్న పునాదుల క్రింద సమాధులయ్యారా? కాలి కింద నేల కృంగిపోతోంది. పడి పోతూ…గాలిలో తేలిపోతూ…మళ్ళీ లోపల్లోపలికి చీకట్లోకి మాయమౌతూ జారిపోతున్నాను.

డైనోసార్లూ, రాకాసి బల్లులూ, భల్లూకాలు … వాటితోబాటు గర్జించే సింహాలు, గాండ్రించే పులులూ, ఘీంకరించే ఏనుగులూ, బుసలు కొట్టే పాములూ… చిన్నా పెద్దా జంతువులు. ఎడారి లోకి అడవి దారితప్పి వచ్చినట్లుంది. ఓ ప్రక్క సింహం ఏనుగుతో కలబడుతోంది, ఏనుగు కాళ్ళకు చుట్టుకుని పాములు పైపైకి ప్రాకుతున్నై. పులి జింకపిల్లను నోట కరుచుకుని పరుగెడుతోంది. కుందేలు వెనుక నుంచీ ఓ నక్క నక్కినక్కి చూస్తోంది. కోతిపిల్లలు కొన్ని గంతులు వేస్తున్నాయి. ఖడ్గమృగం ఒకటి నన్నే చూస్తూ మెల్లిగా వెనక్కి కదిలింది. నన్ను చూసి పారిపోడానికో లేక రెండడుగులు వెనక్కివేసి, ఒక్క ఉదుటన పైన పడ్డానికో! ఎందుకైనా మంచిదని పరుగందుకున్నాను.

మట్టి ముద్దలు చేసే ముసలివాడు ఇంకా అక్కడే రోడ్డు ప్రక్కన మట్టి పిసుకుతూనే వున్నాడు.

ఆత్మ ప్రదక్షణాలతో అలసి వొళ్ళు విరుచుకున్నట్లుంది నేల. జుట్టు విరబోసుకున్న మంత్రగత్తెలా ఊగుతోంది వేపచెట్టు. దూరంగా ధ్వంసమైన వంతెనకటు వైపు ఏముందో కనిపించడంలేదు. చుట్టూ శిధిల చిహ్నాలు. అంతటా కప్పేసిన ధూళి మేఘం. చంద్రుడి జాడ లేదు. సూర్యుడు ఏ పరాయి ఊరు పారిపోయాడో ఆచూకీ లేదు. తారలు ఏ తెరల చాటున దాగున్నాయో తెలియదు.

పిల్లవాడు దాహమని ఇంటి ముందు కూర్చుని ఏడుస్తున్నాడు. వాడికి మాటలెప్పుడొచ్చాయా అని ఆశ్చర్యమేసింది. “నీళ్ళు నేనిస్తా రా” అంటూ వాడిని భుజాన వేసుకుని, ఎదురుగా కనిపిస్తున్న ఇంట్లోకి వెళ్ళాను. ఆశ్చర్యం అది మా ఇల్లే!

సామానులన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి. మసిబారిన మొండి గోడల మధ్య, సగం కాలిన శవంలా ఉంది వంట గది. నా శరీరంలో సగ భాగం తగలబడుతున్నట్లనిపించింది. గుండెలోని దుఖం కళ్ళ లోంచి తోసుకొస్తోంది. పిల్లవాడి ఏడుపు హెచ్చింది. పగిలి పోయిన నీళ్ళ కుండ పెంకుల్ని తొక్కుకుంటూ సింకు దగ్గరకు వెళ్ళాను. పంపులోంచి నీళ్ళొస్తున్నాయేమోనని టాప్‌ తిప్పాను. బురద నీళ్ళు…వాటి వెంట ఎర్ర నీళ్ళు …నీళ్ళ ధారా లేక నెత్తుటి వరదా? దాంతో పాటు చిన్న చేప! గభాల్న దోసిటను చేతులుగా విడగొట్టుకుని వెనక్కి తీసుకున్నా. చిన్న చేప వెనుకే తరుముకొస్తున్నట్లు పెద్ద చేప…దాని వెనుకే మరో పెద్ద చేప! ఎలా పట్టిందో అది ఆ సన్నని గొట్టంలో. అస్సలు అది ఎలా వచ్చిందో టాప్‌ లోంచీ బయటకి! ఇంకొకటి తొంగి చూస్తోంది… తిమింగలమా… భయమేసింది! వెనక్కిపడిన పాదానికి మెత్తగా శరీర స్పర్శ…తిరిగి చూస్తే… అక్కడ ఒక పండు ముసలి “దాహం దాహం ” అని మూలుగుతున్నాడు. ఈ ముసలివాడి మొహంలో పిల్లవాడి పోలికలు…మరి నేనేమిటిలా?!

గోడ మీది గడియారం స్పష్టంగా కనిపించడం లేదు.

ఎన్నేళ్ళ నుంచో పరిచయమున్న వాళ్ళ లాగ, ఇంట్లోకి అపరిచితులు వస్తున్నారు.
“సిగరెట్టు లైటరు వుందా?” అడిగాడొకడు ఆ గుంపులోంచి.
నేను సిగరెట్టులు తాగనని చెబితే, ఒకడు కోపంగా చూసాడు. మరొకడు పళ్ళు కొరుకుతూ, కత్తి బయటకు తీసాడు. ఇంకొకడు నేల మీది గీతోపదేశం చిత్రానికి దణ్ణం పెడుతున్నాడు. నెత్తుటి మడుగులో పడున్న జింకపిల్ల దృశ్యం జాలిగొలుపుతోంది. పాత ఫోటో మీద దుమ్ము పేరుకుంది.
ఆ గుంపంతా టీవీని చూపించి ఇదేమిటని అడిగారు. అదేమిటో తెలిసినా, చెప్పడానికి నోరు పెగల్లేదు.
“పోనీ అగ్గి పెట్టైనా వుందా?” అడిగాడు మరొకడు.
“వెదకాలి” అంటూ వంట గది షెల్ఫుల దగ్గరకు వెళుతూంటే, నన్ను వెనక్కి వెనక్కి గుంజేసి, బలంగా విసిరేసి, వంట గదిలోకి చొచ్చుకు పోయారు.

చుట్టూ జనం. లాప్‌ టాప్‌ కంప్యూటర్‌కు తాడు కట్టి లాగుతూ, బుర్రు బుర్రని నోటితో శబ్దంచేస్తూ పరుగెడుతున్నారు కొందరు మధ్య వయస్కులు. దారి ప్రక్కనే కొంత మంది ఓ పెద్ద గొయ్యి తవ్వుతున్నారు. కొందరు గోతిలోకి, మరి కొందరు ఆకాశంలోకి నాలుకలు సాచి చూస్తున్నారు. అక్కడకు కాస్త ఎడంగా ఒకావిడ అగ్గిపుల్లలు తయారు చేసే విధానం గురించి ఉపన్యాసమిస్తోంది. ఎదురుగా ఒకడు ఆకలి నోటితో ప్రక్కనున్న అమ్మాయి వైపు చూస్తున్నాడు. ఒకదానికొకటి గుద్దుకొని, వాళ్ళ చుట్టూ అడ్డదిడ్డంగా గుట్టలు పడున్నాయి కారులూ, ట్రక్కులూ.

నేల నుంచి, ఆకాశంలోకి కనిపించినమేరకు పెద్ద సాలెగూడు. నేనా గూటి లోపల బందీనయ్యానో లేక బందీలైన వాళ్ళను చూస్తూ బయట వున్నానో తెలియడం లేదు.

ఒక పెద్దాయన “ఇంకో అడవి ఎక్కడుంది?” అని అడుగుతున్నాడు బిగ్గరగా. ఒక ప్రక్కన కూలిపోయిన విమానం చుట్టూ కాకులూ గద్దలూ రాబందులూ చేరి అరుస్తూ, విమానాన్ని ముక్కులతో పొడుస్తున్నాయి. మధ్య మధ్యలో వాటిల్లో అవే పొడుచుకుంటూ అరుస్తున్నాయి. సగం కాలిన ఆలివ్‌చెట్టు కొమ్మకు కట్టిన చిరిగిన పేలికల ఉయ్యాల చుట్టూ కోతులు విన్యాసాలు చేస్తున్నాయి. దూరం నుంచీ ఓ గుంపు తప్పెట దరువులు వేస్తూ, ఎగురుతూ పాడుతూ వస్తోంది … ఆడా మగా అందరూ ఒకే మొహంతో, నగ్నంగా! మెడల్లో ఎముకల దండలు, పుర్రెల హారాలు!! చాలా మంది చేతుల్లో రాళ్ళు, కర్రలు, బరిసెలూ! తప్పెట దరువుకు నా కాళ్ళు కూడా ఊగుతున్నాయి.
చేతుల్లోని వేప మండలతో ఒకావిడ గుండెల మీద బాదుకుంటూ, బలంగా తలను వూపుతూ కోరికల పట్టీ చదువుతోంది. చుట్టూ నిల్చున్న వాళ్ళ తలలు, ప్రక్క నుంచీ ప్రశ్నార్ధకాల్లా కనిపిస్తున్నాయి.
చుట్టూ చేరిన గుంపును అదిలిస్తున్న బుర్ర మీసాల ఆసామి చేతిలోని కొరడా, అప్పుడే కోరలొచ్చిన పాములా బుసలు కొడుతోంది.

నా ఇంటి స్థానంలో ఓ మట్టి దిబ్బ… దిబ్బ మీద ఎగురుతున్న చిరుగుల మాసిన గుడ్డ పీలికలు! ఒకడు వాటికెదురుగా నుంచుని సెల్యూట్‌ చేస్తున్నాడు. ప్రక్కనే సగానికి విరిగిన చెట్టు మీద, ఓ గుడ్లగూబ కూర్చొని కునికిపాట్లు పడుతోంది.

రెండు చేతులూ సాచి ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డ పొడవాటి గడ్డం మనిషి, ఆ వెనుక కూలిన చెట్టు మొదలు మీద కూర్చుని ప్రేమతో గొర్రెపిల్ల తలనిమురుతున్న నడి వయస్కుడు, అతడికి మరి కాస్త వెనుక ఒక రధం, దీర్ఘ సంభాషణలో లీనమైనట్లు కనిపించే ఇద్దరు మనుషులు.
నా చిన్నప్పుడు చూసిన ఒక రామాయాణం సినిమాలోని పుష్పక విమానం లాంటిదే ఒకటి పైన ఎగురుతోంది. సూర్యోదయమో సూర్యాస్తమయమో తెలియడం లేదు. ఆ వైపు ఆకాశం, సన్నటి గాలి అలకు చెదిరిన నివురుగప్పిన నిప్పుల కుప్పలా వుంది. పంది పిల్లొకటి ఉత్తరం వైపు బెదురుగా పరుగెడుతోంది. చెవులు కత్తిరించబడ్డ గొర్రె దిక్కులదిరిపోయేలా అరుస్తోంది. గుంజకు కట్టేయబడ్డ తెల్ల ఆవు దూడ కోసం చుట్టూ చూస్తోంది. ఆ దృశ్యం ఫ్రేములో బందించబడ్డ తైల వర్ణ చిత్రంలా వుంది.

బస్టాండో, రైల్వే స్టేషనో … ఏర్‌ పోర్టో… ఒక ప్రయాణ స్థలి!
నా చిటికెన వ్రేలు పట్టుకుని నిల్చున్న పిల్లవాడు, ఎదురుగా నెత్తుటి మరకలంటిన రాయిని చూస్తూ, నా కాళ్ళను గిల్లుతున్నాడు.
ప్రక్కనున్న జులపాల మనిషి చెంపలేసుకుని దణ్ణం పెడుతూ, మా వైపు కర్కశంగా చూస్తూ ఏవేవో సైగలు ఎవరెవరికో చేస్తున్నాడు. చుట్టూ కదలిక…రక్తమంటిన బాకుల్లాంటి రాళ్ళతో, ఎర్రని మండే కళ్ళతో మా వైపే వస్తున్నారు.

భయం…భయం…భయం!
నా వణకే కాళ్ళను గట్టిగా వాటేసుకుని పిల్లడు …
వేగంగా ఒక్కో అడుగూ మాకేసి వేస్తూ జులపాల మనిషి!

పారిపోయే మార్గం లేదు. చుట్టూ రాళ్ళతో తెలిసిన మొహాలే – శతృ సైనికుల్లా! క్రిందకు వంగి, నా కాళ్ళను బలంగా గుంజుతున్న పిల్లవాడి వైపు చూసాను. చేతిలో మెరుస్తున్న రాయితో, నేను వారించేలోపే, నా కాళ్ళను విదుల్చుకుని జులపాల వాడి పైకి దూకాడు.
ఏం జరుగుతుందో తెలిసి వారించే లోపే నా ఎదుట ఒక హత్య జరిగింది.

మట్టి ముద్దలు చేసుకునే ముసలాయన, నన్ను చూసి నవ్వి, చిన్న చిన్న మట్టి ముద్దలన్నింటినీ కలిపేసి ఓ పెద్ద ముద్దగా చేసేడు.

చాలా మంది గుంపులు గుంపులుగా చేరి ఎవరికోసమో వెదుకుతున్నారు. వాళ్ళలో పిల్లవాడు నాకు కనబడలేదు.
ఆ గుంపుకు కనిపించకుండా మాయమౌదామనుకున్నాను. వాళ్ళు నన్ను చూసి కూడా పట్టించుకోకుండా రోడ్డు మధ్యలో గుమికూడారు.
వాళ్ళ మధ్యలో కుప్పగా పోసిన తలలు, మొండేలు, శరీరాంగాలు
ఎటు వెళ్ళాలో తెలీక నెత్తుటి సరస్సులో గిలగిల కొట్టుకుంటూ
ఏ తల ఏ మొండేనిదో? ఏ అంగం ఏ శరీరానికి చెందిందో??
నా తల ఎక్కడ?!
అంతటా అంధకారం అలముకుంది.
-----------------------------------------------------------
రచన: కె. వి. గిరిధరరావు, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment