Sunday, November 10, 2019

ముఖం కడగని అందగత్తె


ముఖం కడగని అందగత్తెసాహితీమిత్రులారా!


ఒక చలికాలంలో, బాస్టన్ నగరంలోని హైవే ఇరవై మీద, ఉదయం సుమారు 11:30 గంటల ప్రాంతంలో పోలీసువాళ్ళతో నాకు మొట్టమొదటి ఎన్‌కౌంటర్ జరిగింది. నేను ఊహించని ఒకానొక సందర్భంలో, అజాగ్రత్తగా ఉన్న రోజున జరిగిన సంఘటన అది. ఇన్నేళ్ళుగా కారు నడుపుతున్నా ఒక్కసారి కూడా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి ఎరుగను నేను. స్పీడ్ లిమిట్ కంటే తక్కువగానే నడుపుతుంటాను. ఇప్పటిదాకా కనీసం పది దేశాల్లో కారు నడిపాను. అయితే ఆ రోజు ఆదుర్దాలో ఉన్నానేమో… నాలుగేళ్ళ అప్సర నాకోసం బడిలో ఎదురుచూస్తూ ఉంటుంది. రెండు నిముషాలు ఆలస్యమయినా సరే పైకి వినిపించకుండా కళ్ళల్లో నీళ్ళు నింపుకొని ఏడుస్తుంటుందన్నది గుర్తు రాగానే… కారు వేగం కాస్త పెంచాను. అదే క్షణంలో, దుప్పి కోసం మాటువేసి వున్న మృగంలా, నల్ల దుస్తుల్లో ఉన్న ఆ పోలీసు, రోడ్డు మీద ప్రత్యక్షమై కారు ఆపాడు. ఆరడుగుల ఆజానుబాహుడు. దగ్గరకొచ్చి నా డ్రైవింగ్ లైసెన్స్, ఇతర వివరాలు అడిగినప్పుడు ఆ క్షణాన నాకొచ్చిన భాషలన్నీ మరిచిపోయాను. ఒంటి మీద లెదర్ కోటు, కారులో హీటర్ ఉన్నా కూడా నా ఒళ్ళు ఆగకుండా వణికింది.

ఇదంతా నా కూతురు తెచ్చిపెట్టిన తంటా. రెండు నెలలపాటు మనవరాలితో గడుపుదామని వచ్చాను నేను. ఈ రెండు నెలలూ మనవరాలిని బడి నుండి తీసుకొచ్చే బాధ్యతని నాకంటగట్టింది నా కూతురు. నాకు గుబులు. నావల్ల కాదన్నా వినలేదు. రోడ్డు మీద రద్దీ తక్కువున్నప్పుడే ఇంటినుండి బడికి వెళ్ళడానికి ఇరవై నిముషాలు పడుతుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే ఇహ చెప్పనే అక్కర్లేదు. బాస్టన్ నగరంలో రోడ్లను అస్సలు నమ్మలేము. వంపులు తిరిగి, హెచ్చు తగ్గులుగా ఉంటాయి. ఉన్నట్టుండి ఫ్రీవేలనుండి కలుసుకునే రోడ్లు. ఎక్కడ చూసినా ఎడమ వైపుకి, కుడి వైపుకి వెళ్ళే ర్యాంపులు- గందరగోళంగా ఉంటుందంతా. అసలే నేను తరచుగా రోడ్లమీద తప్పిపోయే ఘన చరిత్రను సొంతం చేసుకున్నవాడ్ని. అందుకే జంకాను.

నా కూతురేమో ఏదైనా అనుకుంటే దాన్ని చేసితీరవలసిందేననే రకం. బాస్టన్ సిటీ మ్యాప్ తీసి టేబుల్ మీద పరచి మార్కర్ పెన్నుతో దారి గీసింది.

“చూడు నాన్నా! రెండు లెఫ్ట్‌లు, మూడు రైట్‌లు. చాలా సులువు. నువ్వేమీ రాకెట్ సైంటిస్ట్‌వి కానక్కరలేదు.” అంది.

ఆమె అలా ఒప్పించడమే ఇప్పుడు ఈ పోలీసువాడు నన్నిలా ఆపడం దాకా తెచ్చింది.

అప్సర బడి కాస్త కలిగినవాళ్ళుండే ఏరియాలో ఓ కాలువను అనుకుని ఉంటుంది. కిండర్‌గార్టెన్‌లో అప్సర చదువు. అప్సర తరగతిలో 18 మంది పిల్లలు; తరగతికి ఇద్దరు టీచర్లు. బడయ్యాక చాలామంది పిల్లలను వాళ్ళవాళ్ళ పెద్దవాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు. సరిగ్గా 12.30 గంటలకు బడి విడిచిపెడతారు. పిల్లలు ఒకరి వెనక ఒకరు వస్తారు. అప్పటికే కార్లు వరుసగా బారులుతీరి ఉంటాయి. కార్లలో ఉన్న పెద్దలు కార్లలోనే ఉండాలి. టీచరే ఒక్కొక్క బిడ్డనీ తీసుకొచ్చి కారు తలుపు తీసి కార్లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి పంపుతారు. ఎటువంటి హడావిడీ, గాభరాలూ లేకుండా క్రమ పద్ధతిలో ఒక్కో కారూ కదిలి వెళ్ళిపోతుంది.

నేనీ బాధ్యతను ఒప్పుకున్న మొదటి రోజునే ఆలస్యం కాకూడదని ముందు జాగ్రత్తగా సరిగ్గా 12 గంటలకే బడికి చేరుకున్నాను. వరుసలో ముందు నా కారే ఉంది. కొన్ని నిముషాల తర్వాత ఏడుగురు కూర్చునే ఒక మినీవ్యాను వచ్చి ఆగింది. ఆ కారు నడుపుకొచ్చింది ముప్పై, ముప్పై రెండేళ్ళ వయసున్న ఓ అమ్మాయి. ఆమె కార్లో నాలుగు చైల్డ్ సీట్లున్నాయి. మూడిట్లో ముగ్గురు పిల్లలకూ సీటు బెల్టులు వేసివున్నాయి. ఆమె నాకేసి చూడటమూ, నేను రియర్ వ్యూ మిర్రర్లో ఆమెను చూడటమూగా కాసేపు సాగింది.

మరి కాసేపటికి వ్యాను దిగి వచ్చి నా కారు తలుపు తట్టింది. నేను కిటికీ అద్దం దించాను. సోప్స్‌లో వచ్చేలాంటి అందగత్తె ఆమె. అయితే మేకప్ అలవాటు లేని ముఖం; ముఖాన్ని సరిగ్గా కడుక్కుందో లేదో అనిపించేలా ఉంది. జుత్తంతా చెదిరిపోయుంది. మాసిన దుస్తులేమీ కాదు గానీ సాదా సీదాగానే ఉంది. తనకున్న సహజమైన అందాన్ని ఏమేం చేస్తే దాచేయొచ్చో అవన్నీ చేసి కప్పిపుచ్చడానికి ప్రయత్నించినదానిలా ఉంది.

“ఓ సహాయం చెయ్యగలరా?” అడిగింది.

“తప్పకుండా!” అన్నాను నేను.

“మామూలుగా నేను పన్నెండుకే వచ్చేసి కారు ఇక్కడే ఆపుకుంటాను. నేను మూణ్ణెల్ల పాపడికి పాలివ్వాలి. ఈ చెట్టుకింద నాకు సౌకర్యంగా ఉంటుంది. మీరు కారు తీస్తే నేను ఇక్కడ పార్క్ చేసుకుంటాను,” అంది.

నేను సరేనని కారు స్టార్ట్ చేసి ఒక రౌండ్ వేసి వచ్చి ఆమె కారు వెనుక నిలిపాను. ఆమె పిల్లాడికి పాలిస్తోంది.

ఆ పరిచయం తర్వాత ఆ చెట్టు కింద చోటుని ఆమె కోసం అట్టిపెట్టి ఆమె రాగానే ఆమెకిస్తుండేవాడిని. ఓ చిరునవ్వు, చేయూపు, ఓ పలకరింపు… ఇలా సాగుతూ ఉండింది. ఆమె పేరు ఒలీవియా. కవలపిల్లలతో కలిపి ఆమెకు నలుగురు పిల్లలు. పెద్దకూతురి పేరు అనా. అప్సర, అనా ఒకే తరగతిలో చదువుతున్నారు. అనా తన బెస్ట్ ఫ్రెండ్ అని అప్సర చెప్తుంటుంది.

పిల్లలను తీసుకెళ్ళడానికి ఆ బడికి వచ్చే తల్లుల్లో అందరిలోకీ ఈ ఒలీవియా కొంచం తేడాగా అనిపించింది. అందరూ పసితల్లులే. బాగా చక్కగా అందంగా మస్తాబయ్యి వచ్చే తల్లులే. ఏదైనా పార్టీకి వెళ్తున్నారా అన్నట్టు అలంకరించుకుని వస్తారంతా. దుస్తులు కూడా ఖరీదైనవన్నది చూడగానే చెప్పేయొచ్చు. నేను వీళ్ళకు భిన్నంగా ఉంటాను. నా తర్వాత ఒలీవియా. జుత్తు చిందరవందరగా ఉంటుంది. ముఖం పొద్దునో సాయంత్రమో లేక రెంటికి మధ్య సమయంలోనో నీళ్ళన్న పదార్థం ఏదీ తాకనిదానిలా ఉంటుంది. ఆమె చిందించే ఆ క్షణకాలపు చిరునవ్వు మాత్రం ఎయిర్‌హోస్టెస్‌నో, రిసెప్షనిస్టునో లేక ఇంకో పైస్థాయి ఉద్యోగినో తలపించేలా ఉంటుంది.

ఒక రోజు ఒలీవియా మళ్ళీ నా కారు కిటికీ తట్టింది. నేను ఏంటని అడిగాను. మర్నాడు అప్సరని తీసుకెళ్ళడానికి వచ్చినపుడు అనాని కూడా మా ఇంటికి తీసుకెళ్ళడానికి వీలవుతుందా అని అడుగుతూ, తనకి డాక్టర్ అపాయింట్‌మెంట్ ఉందనీ, మూడింటికి మా ఇంటికి వచ్చి అనాని తీసుకెళ్తాననీ చెప్పింది.

నేను ‘మీరు నా కుతురితో మాట్లాడితే మంచిద’ని చెప్పాను. ఆమె నా కూతురితో మాట్లాడానని, స్కూల్ పికప్ సమయంలో ఇవ్వడానికి పింక్ స్లిప్ కూడా రాసుకొచ్చానని చెప్పింది. పిల్లల తల్లిదండ్రులు ఒక స్లిప్‌లో వివరాలవీ రాసి ఇస్తే తప్ప పిల్లలను వేరేవాళ్ళతో పంపరు.

మరుసటి రోజు నేను అప్సరని, అనాని కారులో ఇంటికి తీసుకువచ్చాను. ఆ రోజు మంచు ఆగకుండా కురుస్తూ ఉంది. అనా, అప్సర వెనక సీట్లో కూర్చుని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. బాస్టన్ నగరంలో ఎనిమిది లక్షల కార్లున్నట్టు ఈ మధ్యే ఒక వార్త చదివాను. ఆ రోజు ఆ కార్లన్నీ నిజంగా ఒక్క హైవే ఇరవై మీదనే ఉన్నాయనిపించింది. పిల్లలిద్దరూ ‘ఇల్లొచ్చిందా ఇల్లొచ్చిందా’ అని అడుగుతూనే ఉన్నారు. చాలాసేపటికి ఎలాగోలా ఇల్లు చేరుకున్నాము.

చెప్పిన సమయం దాటి గంటయినా ఒలీవియా రాలేదు. ఇద్దరు పిల్లలతో ఇల్లంతా గందరగోళంగా ఉంది. నా భార్య ఈ అనుకోని ప్రళయానికి విసుగొచ్చి తలపట్టుకుని కూర్చుంది. అప్సర ఎంతో సౌమ్యమైన పిల్లే. అనా కూడా అలానే కనిపించింది. అయితే ఇద్దరు సౌమ్యులు కలిస్తే ఇల్లు పీకి పందిరెయ్యగలరని తెలిసొచ్చిందిప్పుడు. నేను చదువుకునే రోజుల్లో కెమిస్ట్రీ లేబ్‌లో నీళ్ళలాగా ఉండే రెండు ద్రవాలను కొంచం కొంచంగా కలుపుతూవుంటే ఉన్నట్టుండి ఊదా రంగులోకి మారిపోవడం గుర్తుకు వచ్చింది. అప్సర ఒక బొమ్మ తీసుకుంటే అనాకీ అదే కావాలి. అనా మరొకటి తీసుకుంటే దానికోసం అప్సర పేచీ. నవ్వేప్పుడు ఇద్దరూ ఒకే శ్రుతిలో నవ్వారు, ఏడ్చేప్పుడూ అంతే. అయితే ఎప్పడు బాగుంటారు, ఎప్పుడు తగువుకు దిగుతారో తెలుసుకోలేక నేనూ నా భార్యా జుత్తు పీక్కున్నాము.

ఒలీవియా ఉరుకులు పరుగులుగా గస పోసుకుంటూ వచ్చింది. మామూలుగానే చెదిరిపోయినట్టు కనిపించే జుత్తు ఇంకాస్త చెదిరిపోయి వుంది. చేతిలో పసిపాపడు. ఆమె కాళ్ళకు ఇరువైపులా ఇద్దరు కవలలు అంటి పెట్టుకుని వచ్చారు. అనా ఆమెను చూడగానే, ‘మమ్మీ నేను నీ పిల్లిపిల్లను’ అంటూ ఆమెను హత్తుకుంది. ఒలీవియా అనాని పట్టించుకోకుండా మాకు క్షమాపణలు చెప్పింది. మంచు కప్పేసి ఉండటం మూలాన వేరే ఏవో దార్లు పట్టుకుని వచ్చానని వివరించింది. పాపడికి పాలిచ్చే సమయం దాటిందనీ, ఇక్కడ ఇవ్వచ్చా అనీ అడిగింది. మేము సరేనన్నాము. గది చూపించేందుకు మేము తడుముకునేలోపే ఆమె కంటికి కనిపించిన మొదటి ఆసనంలో కూలబడి రొమ్ము బైటకు తీసి పాపడికి పాలుపట్టడం మొదలుపెట్టింది.

ఇప్పటిదాక ఇద్దరు పిల్లల్నే మేనేజ్ చెయ్యడానికి అష్టకష్టాలు పడిన మేము ఇప్పుడు నలుగుర్ని అట్టిపెట్టుకోవలసి వచ్చింది. వాళ్ళు మొదలెట్టే ఏ ఆటైనా సరే పరుగుతో మొదలయ్యి పరుగుతోనే అంతమయ్యేది. పరుగెడితే నలుగురూ నాలుగు వైపుల్లో పరుగెట్టారు. ఆ పరుగుని కూడా వాళ్ళంతట వాళ్ళు ఆపలేదు. ఏ గోడో, సోఫానో, ఛెయిరో, టేబులో, వంట గదో అడ్డుండటం వల్లే ఆగుతుందది.

ఒలీవియా ఒక రొమ్ము పాలు పట్టడం అవ్వగానే దాన్ని లోపలైనా పెట్టుకోకుండా మరో రొమ్ము బైటకు తీసి పాపడికి పాలు పట్టడం కొనసాగిస్తూ, ఇక్కణ్ణుండి వెళ్ళడానికి దగ్గర మార్గం ఏదైనా ఉందా, అని వివరాలడిగింది. మామూలుగానే నాకు మ్యాపులంటే మహా చిరాకు. అయితే అప్పటికే ఆ ప్రాంతపు మ్యాపును వల్లె వేసేశాను కనుక నాకు తెలిసిన దారి చెప్పగానే ఆమె అది వ్యతిరేక దిశ అని చెప్పింది. నేను మ్యాపు తీసుకుని గీసి చూపించినా ఆమెకు నమ్మకం కలగలేదు. చివరికి నేను “నన్ను మీరు నమ్మవచ్చు. రెండు లెఫ్ట్ టర్న్‌లు. మూడు రైట్ టర్న్‌లు. మీరు హైవే ఎక్కేయగలరు,” అని మ్యాపులో చూపిస్తూ “చాలా సులువు. దీన్ని తెలుసుకోడానికి మీరు రాకెట్ సైంటిస్ట్ అయుండక్కర్లేదు,” అన్నాను. ఆమె ముఖం ఒక్క క్షణం రంగు మారిపోయి మళ్ళీ యథాస్థితికి వచ్చింది.

గొర్రెల కాపరి తన గొర్రెలను చేతుల్లో పొదువుకున్నట్టుగా ఆమె తన పిల్లలను పొదువుకొని తన మినీవ్యాను దగ్గరకు నడిచింది. ఒక్కొక్కర్నిగా కూర్చోబెట్టి సీట్ బెల్ట్ బిగించింది. చిన్నపాపడ్ని మాత్రం వెనక్కి తిరిగున్న సీట్లో పెట్టి బెల్ట్ వేసింది. నా వైపుకు చూసి “రెండు లెఫ్ట్ టర్న్‌లు, మూడు రైట్ టర్న్‌లు. కరెక్టే కదా?” అని అనుమానంగా అడుగుతూ నిస్సత్తువగా నవ్వింది. ఆమె చెంపల మీద రాలిన మంచు చుక్క ఒకటి ఆమె ఒంటి వెచ్చదనానికి కరిగిపోతూ ఉంది. చేసిన సాయానికి చాలా కృతజ్ఞతలూ, కలిగించిన శ్రమకు క్షమాపణలూ చెప్పి కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోయింది. జెట్ విమానం టేకాఫ్ అయ్యి వెళ్ళిపోయినంత నిశబ్దం ఇప్పుడు.

నేను అప్సర చేయి పట్టుకుని లోపలికి వెళ్ళాను. లోపల ఇల్లంతా చెల్లాచెదరుగా బొమ్మలు, వస్తువులు పడున్నాయి. వీటన్నిటినీ సర్దిపెట్టాలంటే కనీసం రెండు రోజులైనా పడుతుంది. హాలు నడిమధ్యన తల మీద చేతులు పెట్టుకుని నా భార్య కూర్చుని ఉంది. ఆమె కళ్ళల్లో అయోమయం. నిజానికి కథ ఇక్కడితో శుభం అయ్యుండాలి. కానీ కథ ఇంకా ముగియలేదు.

రెండు వారాల తర్వాత ఇంటికి చేరిన నా కూతురితో ఒలీవియా ఓ గంట ఆలస్యంగా వచ్చిన సంగతి చెప్తూ, ఈలోపు పిల్లలు ఇల్లు పీకి పందిరేసిన వైనం, మేము సర్దటానికి పడిన పాట్లను వివరించాను. ఆ రోజు కాస్త వేగంగా కారు నడిపిన విషయమూ, నేను ఫైన్ చెల్లించిన సంగతీ చెప్పలేదు.

“ఎందుకు ఆలస్యంగా వచ్చింది?” అని ఏదో మామూలుగా అడిగింది నా కూతురు.

ఆమె దారి తెలీక తిప్పలుపడి వచ్చిందనీ, మాకు జరిగిన సంభాషణంతా పూసగుచ్చినట్టు వివరించాను. ఓ మాటకు మాత్రం నా కూతురు “ఏంటి?!” అని కళ్ళు పెద్దవి చేసి చేతులు తన నోటికడ్డం పెట్టుకుని లేచి నిల్చుంది.

“నాన్నా! ఏమన్నారు?” అని మళ్ళీ అడిగింది.

నేను మళ్ళీ చెప్పితే నడుమ్మీద చేతులు పెట్టుకుని పడీపడీ నవ్వింది. నాకేమీ అర్థం కాలేదు.

“అమ్మాయ్! నవ్వు ఆపి చెప్పు లేదా చెప్పేసి నవ్వు,” అన్నాను.

ఆమె నవ్వాపుకోలేక “నాన్నా, మీరు… మీరు… ‘రాకెట్ సైంటిస్ట్ అయుండక్కర్లేదు’ అన్నదాన్ని తలచుకుంటే నవ్వాగడం లేదు,” అంది.

“ఎందుకూ?”

“నాన్నా, ఒలీవియా నాసాలో ఉద్యోగం చేసే రాకెట్ సైంటిస్ట్. ఇప్పుడామె ఆరు నెలలు మెటర్నిటీ లీవులో ఉంది.”

ఒలీవియా ముఖం ఓ క్షణంపాటు నల్లబడింది గుర్తొచ్చింది. ఇప్పుడు నేనే చేతులు నోటికడ్డుపెట్టుకుని నవ్వుకున్నాను.
-------------------------------------------------------
రచన: అవినేని భాస్కర్
మూలం: ఎ. ముత్తులింగం
[మూలం: ముగం కళువా అళగి (ముఖం కడగని అందగత్తె) అన్న కథ. 
భూమియిన్ పాది వయదు (2007) అన్న సంపుటం నుండి.]
ఈమాట సౌజన్యంతో
-------------------------------------------------------

No comments:

Post a Comment