Monday, November 18, 2019

‘మంచి’ కథ


‘మంచి’ కథ



సాహితీమిత్రులారా!


ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లనూ ఊళ్లనూ దేశాన్నీ వదిలిపెట్టి కాందిశీకులుగానో శరణార్థులుగానో మరో ప్రదేశానికి, మరో దేశానికి వెళ్లిన మనుషులు ఆ వెళ్లిన దేశానికి వరమా, శాపమా?


జీవితాలు అతలాకుతలం అయినపుడు మనుషులు చెల్లాచెదురై శరణుకోరుతూ పరాయి ప్రాంతాలకు వెళ్లడమన్నది అప్పటికీ ఇప్పటికీ ప్రపంచానికి కొత్తేమీ కాదు. ఈ వలసలూ శరణుకోరడాలూ ఎంతలేదన్నా ఐచ్ఛికం. యుద్ధాల్లో ఓడిపోయినవారినీ, అడవుల్లో వేటాడి పట్టుకొన్నవారినీ, వలస రాజ్యాలలో బతికేవాళ్లనూ బానిసలుగానూ, అర్ధబానిసలుగానూ చేసి పిరమిడ్లకు పునాదిరాళ్లుగానూ, పంటపొలాలకు ఎరువుగానూ, రైలు మార్గాలకు స్లీపరు బద్దెలుగానూ వాడుకోవడమన్నది నాగరికత నేర్చిన సమాజాలకు బాగా అలవాటయిన పనే. నిన్న మొన్నటిదాకా, ఆ మాటకొస్తే ఈ రోజున కూడా ఆధిపత్య సమాజాలు ఆమోదించి ఆచరిస్తోన్న పనే. కానీ ఆ బానిసల, నిస్సహాయుల శ్రమా శక్తీ తమ తమ సమాజాల అభివృద్ధికి పునాదులు వేశాయంటే నాగరికత ఒప్పుకోదు. అది దాచలేని సత్యమే అయినా ఆ సత్యానికి మసిపూసి మారేడుకాయ చెయ్యటం వక్రభాష్యాలు చెప్పడం సభ్యసమాజపు సహజ ప్రకృతి.

2011లో మొదలయిన సిరియా అంతర్యుద్ధానికి ఎనిమిదేళ్లు నిండాయి. లక్షన్నరమంది ప్రాణాలు పోయాయి. లక్షన్నర కాదు, నాలుగు లక్షలు అన్నది మరొక అంచనా. ఏభై లక్షలమంది దిక్కులు వెతుక్కుంటూ ప్రపంచమంతా చెల్లాచెదురైపోయారు. మరో యాభై లక్షలమంది తమ దేశంలోనే ఇల్లూ వాకిలీ లేనివాళ్లయ్యారు. అంతర్యుద్ధం కాస్తా సహజంగానే ప్రపంచ సమస్య అయింది. అసలా పరిణామాలకు బయట శక్తులే కారణం అన్న అభిప్రాయం ఒకటి ఉంది. ఆ వివాదంలోకి వెళ్లడం ఇక్కడి ఉద్దేశ్యం కాదు. ఈ ‘మంచి’ కథకు అది వస్తువు కానే కాదు.

సిరియా వదిలిన ఏభై లక్షలమందీ టర్కీ, లెబనాన్, జోర్డాన్, ఈజిప్ట్ లాంటి పరిసర దేశాల్లోకీ, జర్మనీ లాంటి యూరోపియన్ దేశాల్లోకీ, కెనడాలాంటి సుదూర తీరాలకూ వెళ్లారు. ఈ పరిణామం ఒక అనవసరపు ఉపద్రవం అని భావించిన దేశాలు వాళ్లను కాంపుల్లో ఉంచి చావకుండా చూశాయి. విషయాన్ని మూలాలలోంచి చూసిన దేశాలు మరికాస్త సానుకూలంగా స్పందించాయి. జర్మనీ పదిహేను లక్షలమంది శరణార్థులను ఆదరించింది. సుదూరపు కెనడా కూడా పాతికవేలమందికి ఆశ్రయం ఇచ్చింది.

పరిణత దేశాల సానుకూల స్పందనలతోపాటు ఆయా దేశాల్లోని అతిమితవాదులు అగ్నిహోత్రావధాన్లవడమూ జరిగింది. ఎంతో సహజంగా జరిగింది. మన సంస్కృతి, మన భాష, మన మతం, మన ఆర్థిక వ్యవస్థ అంతా కలుషితమవుతాయి, ధ్వంసమవుతాయి అని దేశభక్తులు నినాదాలు చేశారు. అడ్డుకోడానికి నడుముకట్టారు. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీలాంటి దేశాల్లో వారికి రాజకీయంగా గొప్ప ఊపు దొరికింది. తమదేశపు ఉదారవైఖరికి కారణభూతమై ప్రపంచపు ప్రశంసలు అందుకొన్న జర్మనీ ఛాన్సెలర్ ఆంగెలా మెర్కెల్ రాజకీయంగా పెద్ద మూల్యమే చెల్లించుకోవలసివచ్చింది.

ఈ నేపథ్యంలో… నాలుగేళ్ల క్రితం. 2015 వేసవి కాలం.

జర్మనీలోని తూర్పు సరిహద్దు ప్రాంతపు గోల్ట్సావ్ అన్న గ్రామంలో కలకలం, కలవరం.

పాతికేళ్లనాడు బెర్లిన్ గోడ కూలి రెండు జర్మనీలూ ఒకటే అయ్యాక ఊళ్లోని పడుచువాళ్లంతా కొత్త అవకాశాలను వెదుక్కుంటూ దూరదూరాలు వెళ్లిపోగా, అప్పటిదాకా పన్నెండువందలమంది ఉన్న ఆ గ్రామపు జనాభా ఒక్కసారిగా ఎనిమిది వందలయింది. కమ్యూనిస్టు పాలన ఉచ్చదశలో ఉన్నపుడు ‘గోల్ట్సావ్ బాలలు‘ అన్న ప్రఖ్యాత డాక్యుమెంటరీ చిత్రానికి నేపథ్యంగా నిలచిన ఆ గ్రామంలో ఇప్పుడు చదువుకోడానికి పిల్లలే లేరు. ఊళ్లోని స్కూలు మూతపడే పరిస్థితి. అదే సమయంలో ఊళ్లోకి పరాయివాళ్లను రానీయకూడదు అన్న మితవాద భావన ప్రబలమైన పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో పాతిక శాతం అక్కడి అతిమితవాద పార్టీకి ఓటేసిన సందర్భం.


ఆ సమయంలో గ్రామపెద్ద, ఫ్రాంక్ షూట్జ్‌కు పైనుంచి వర్తమానం వచ్చింది. మన దేశానికి సిరియా నుంచి వలసవచ్చిన లక్షలాదిమందిలో పదహారుమందిని మీ గ్రామానికి తరలిస్తున్నాం, అని. ఏంచెయ్యాలో పాలుపోని పరిస్థితి ఆ గ్రామపెద్దది. ఆ పదహారు మందిని గ్రామంలోకి తీసుకువస్తే స్థానికులకు అది సహజంగానే పుండుమీద కారం అవుతుందని తెలుసు. ‘వెర్రితనం’ అని అననే అన్నాడు ఆ ఊరి క్షురకుడు. ‘అసాధ్యం’ అని తీర్పు ఇవ్వనే ఇచ్చాడు, పెద్దవయసు రైతు ఒకాయన.

ఫ్రాంక్ షూట్జ్ నిర్ణయం తీసుకొన్నాడు. సిరియన్లను ఆహ్వానించాడు. అప్పటికే ‘ఐక్యమైన జర్మనీ దేశంలో మన తూర్పు జర్మన్లమందరం రెండో తరగతి పౌరుల్లా జీవిస్తున్నాం’ అని మథనపడే ఉదారహృదయపు గ్రామస్తులకు కూడా ఈ పని నచ్చలేదు. సహాయనిరాకరణకు నడుంకట్టబోయారు. అందర్నీ ఒకచోట చేర్చి పరిస్థితిని వివరించాడు షూట్జ్. పైనుంచి వచ్చిన తాఖీదు కదా తప్పదు అన్నాడు. ఆ దిక్కులేనివాళ్లకు ఆశ్రయమిచ్చి చూద్దాం అన్నాడు.

పదహారుమంది ఊళ్లోకి రానేవచ్చారు. అందులో పెద్ద మహమ్మద్, చిన్న మహమ్మద్, తస్నీన్, రితజ్ అంటూ పదిమంది పిల్లలు. వాళ్లకుతోడు ఆరుమంది పెద్దలు, ఆ పిల్లల తల్లిదండ్రులు. ‘మన వూరి నవబాలలు’ అంటూ ముచ్చటపడ్డాడు ఫ్రాంక్ షూట్జ్. వచ్చినవాళ్లకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికాడు.

నిజానికి ఆ పదహారుమంది సిరియన్లకు కూడా ఆ మారుమూల గ్రామం రావడమన్నది కాస్తంత ఇబ్బంది కలిగించిన విషయమే. ‘ఆ మారుమూల తూర్పు జర్మనీ గ్రామమా! మీకేమన్నా మతిపోయిందా? అదంతా కరుడుగట్టిన ప్రదేశం. మన పొడ వాళ్లకు గిట్టదు. చాలా ప్రమాదం. జర్మన్ అధికార్లను బ్రతిమాలుకొని మరో ఊరు వేయించుకోండి.’ అని సాటి శరణార్థి స్నేహితులు బలమైన సలహాలు ఇచ్చారు. అయినా ఆ పదహారుమందీ గోల్ట్సావ్ వచ్చారు. మరోదారి ఎలానూ లేదాయె!

అప్పటిదాకా ఖాళీగా పడివున్న గ్రామపు ఇళ్లు కొత్త అతిథుల రాకతో కళకళలాడాయి. ఊళ్లోని కొంతమంది సహృదయులు వచ్చినవాళ్లు సులభంగా స్థిరపడటానికిగాను చిన్నచిన్న వంటపాత్రలూ, ఇతర పనిముట్లూ ఇచ్చి సాయపడ్డారు. స్కూలు తెరచిన మొదటిరోజున జర్మను పిల్లల తలిదండ్రులు సిరియన్ అతిథుల గౌరవార్థం అతి చక్కని కేక్ తయారుచేసి తెచ్చారు; తెచ్చాక తెలిసింది అది రంజాన్ మాసమనీ, సిరియన్లకు ఉపవాసమనీ! ముందుగా బిత్తరపోయినా క్షణాల్లో అంతా తమాయించుకొని కడుపారా నవ్వుకున్నారు. ముగ్గురు సిరియన్ పిల్లల తల్లి తాహ కేక్ కట్ చేసింది.

మన భాష, మన సంస్కృతి, మన మతం, మన జీవనసరళి, చిల్లర దొంగతనాలు–అంటూ మొదట్లో మథనపడిన ఊరివాళ్లలో వాళ్లకు తెలియకుండానే క్రమక్రమంగా మార్పులు చోటుచేసుకొన్నాయి. సిరియన్ అతిథులు కూడా ఊరితో మమేకం అవసాగారు. స్కూలు ఆవరణలో పోగుపడిన ఆకూ అలముల్ని శుభ్రం చెయ్యడంలో సిరియన్ పిల్లలూ వాళ్ల తల్లిదండ్రులూ ముందుండసాగారు. ఏడాదికోసారి గ్రామంలో జరిగే ఫలపుష్ప ప్రదర్శనలో జర్మన్ తినుబండారాలతోపాటు సిరియన్ వంటకాలూ కనిపించసాగాయి. తన పిల్లలూ, మనవలూ ఎంతో దూరాన ఉన్న ఓ పెద్దాయన ముగ్గురు సిరియన్ పిల్లల్ని చేరదీశాడు. వాళ్లకు ఈత కొట్టడం, చేపలు పట్టడం నేర్పించసాగాడు. ఆ పిల్లలు ఆ పెద్దాయన్ని తాతా అని పిలవసాగారు.

నాలుగేళ్లు గడిచేసరికి ఊళ్లోకి వచ్చిన ఆరుగురు పెద్దాళ్లూ తమకు తగ్గ పనులు వెదుక్కుని ఆ పనుల్లో నిలదొక్కుకోగలిగారు. పదిమంది పిల్లలూ ఊరికి చిరుదివ్వెలయ్యారు, ఆశాదీపాలయ్యారు…

ఈ పరిణామం ఒక్క గోల్ట్సావ్ గ్రామానికే పరిమితం కాదట.


శరణార్థులు రావడం వల్ల సగటు జర్మన్లలో దేశవ్యాప్తంగా భయాందోళనలు కలిగాయి. మితవాద పక్షాలు విద్వేషకీలలు ఎగద్రోశాయి. అయినా లక్షలాదిమంది శరణార్థులు స్థానిక జీవనస్రవంతిలో కలసిపోయి అందులో విడదీయలేని భాగమయిపోవడమన్న ప్రక్రియ నిశ్శబ్దంగా కొనసాగుతోందట. ప్రభుత్వంవారి లెక్కల ప్రకారం ఈ నాలుగేళ్లలో ఇప్పటిదాకా జర్మనీ వచ్చిన శరణార్థుల్లో మూడోవంతుమంది ఏదో ఒక కొలువులో చేరుకొని ఆర్థికవ్యవస్థలో భాగమయ్యారట.

లోతుకు వెళ్లి చూస్తే ఇదేమీ వింతా విడ్డూరం అనిపించదు.

రంగు, భాష, సంస్కృతి, మతం, జాతి అన్న పొరలు దాటివెళితే మనిషికీ మనిషికీ మధ్య మరీ మనం అనుకునేంత దూరం లేదన్న వాస్తవం కనిపిస్తుంది.

జర్మనీ అయినా అమెరికా అయినా; భారతదేశంలోని అనేకానేక రాష్ట్రాలు అయినా; కారణాలు వేరువేరు అయినా; భిన్న జాతులవాళ్లూ భాషలవాళ్లూ కలసిపోయి బతకడం అన్నది ఈ కాలపు అవసరం.

నిజానికి అదో గొప్ప అవకాశం.
(ది న్యూయార్క్ టైమ్స్ లోని వార్తాకథనం ఆధారంగా.)
---------------------------------------------------------
రచన: దాసరి అమరేంద్ర, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment