Wednesday, November 6, 2019

జీవన తీరాలు


జీవన తీరాలు




సాహితీమిత్రులారా!


పావు తక్కువ పదకొండు.  క్వాలిటీ ఐస్‌ క్రీం, శ్రీ వెంకటేశ్వర, హోటల్‌ న్యూ వెంకటేశ్వర, క్రంచీస్‌ ఎన్‌ మంచీస్‌  అన్నీ మూసీసేరు.  పేవ్‌ మెంట్‌ మీద పిట్టగోడని ఆనుకుని ఒక నడివయస్సు మనిషి ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుని తదేకంగా కుంపటి విసురుకుంటూ మొక్కజొన్న పొత్తులు కొనే బేరం కోసం ఇంకా కనిపెట్టుకుని వుంది.  మురీ మిక్చర్‌ అమ్ముకునే  వాళ్ళ దీపాలు నది ఒడ్డున కొరివి దెయ్యాల్లాగ ఎర్రగా మండుతూ  డిగ్రీ కాలేజీ దగ్గర ఒకటి, జగన్నాధ స్వామి గుడి దగ్గర వొకటి.  ఉమా గారు ఇసకలో ప్లాష్టిక్‌ కుర్చీలో ఒక్కడే కూర్చుని తాగుతున్నాడు.  ఎప్పుడూ వేసుకునే తెల్ల బట్టలు లెదర్‌  బెల్ట్‌తో టక్‌ చేసుకుని. కౌంటర్లో స్టీరియోలో ఇళయరాజా పాటలు ఆగిపోయి ఇప్పుడు
“నిత్య బ్రహ్మచారులే అయ్యప్పా స్వాములే
స్వామి చిక్కడ కోం కోం
అయ్యప్ప చిక్కడ కోం కోం…”
అని అదే భజన మళ్ళీ మళ్ళీ మళ్ళీ వస్తోంది.

నరహరి ఖాఖీ చొక్కా మీద గళ్ళ తువ్వాలు కండువా లాగ వేసుకుని కౌంటర్‌ ఎదురుగా టేబిల్లో ఒక్కడే కూర్చుని సమోసా ముక్క మీద కెచప్‌  ఎక్కువగా పోసుకుని అసహనంగా తింటున్నాడు.  కౌంటర్లో అయ్యప్ప స్వామి డ్రస్‌ లో ఉన్నతను   కేషియర్‌    నరహరి కేసి ఫ్రెండ్లీగా చూసి “ఏటి జూట్‌ కంపెనీ వోలా స్వామీ?” అని అడిగేడు.  నల్లటి చొక్కాని నల్ల లుంగీలో మడిచి కట్టుకుని మెడ చుట్టూ తెల్లటి సన్నంచున్న నల్ల తువ్వాలు వేసుకున్నాడు.  గడ్డాలు చక్కు దవడలు వేసుకుని ఆసక్తిగా చూస్తున్నాడు.   నరహరి ప్రీమియర్‌  పద్మినీ కీని చెవిలో తిప్పుకుంటూ ముభావంగా నీకెందుకు అన్నట్టు “లేద్‌ ..” అని తెగ్గొట్టేడు.  ఉమా గారు ఆపకుండా తాగుతున్నాడని అతనికి ఆదుర్దాగా ఉంది.  కేషియర్‌ స్వామి మర్యాదగానే “వూ?  గవరమెంట్‌  ఎంప్లాయీషా స్వామీ??” అని రెట్టించేడు మళ్ళీ.  నరహరి ఇంక తప్పదన్నట్టుగా పొడిగా “ఆయను మా అయ్యగారు వై…ఇక్కడ పీజీ సెంటర్‌ మీటింగు లోన వారూ గూడా మెంబరు …?” అన్నాడు ఇంక చాలా అన్నట్టు.
“పీజీసెంట్రా?  ప్రిన్సపాల్‌ గారు వూళ్ళో లేరు సార్‌!…..ఏటి స్వాం మీటింగు?”
“రస సాహితీ….”
“ఏంటి వారు రైటర్సా స్వామీ?” అన్నాడు ఉమా గారికేసి చూపించి.
“అవును వై….” అని చిరాగ్గా ఇంకా అనబోయేడు.
అతను మధ్యలో మాటకి అడ్డం పడి “స్వామి మీరు ఏటనుకోమంటే సింపుల్‌  రిక్వష్టు..దీక్షలో వున్నాను స్వామి..వయ్యా అండీ వొండీ అనకుండ స్వామీ అని పిలవాల…ఇరుముడి దీక్షలో వున్న వారిని స్వామీ అని పిలాల, వారూ గూడా ఇవతలోలకి స్వామీ అనే పిలాల….” అన్నాడు.  నరహరి  ముభావంగా నిరసనగా నవ్వుకున్నాడు, ఏమీ మాట్లాడకుండా.  అంత దీక్ష గల వోడివయితే బ్రాందీ షాపులో ఎందుకున్నావు అనుకున్నాడు.  బార్లో తను, అయ్యప్ప స్వామి, వెనక ద్వారం దగ్గర  గోలేల్లో కప్పులు ప్లేట్లూ కడుగుతూ ఒక పది పన్నెండేళ్ళ కుర్రాడు. బయట ప్లాష్టిక్‌ కుర్చీలో మఫ్లర్‌ చుట్టుకుని చలికి కాళ్ళు ముడుచుకుని విచారంగా మందు కొడుతూ ఉమా గారు.  చంద్రుడు లేడు.  చుక్కలు లేవు.  కుక్కలు రోడ్డవతల కోలనీ నుండి వచ్చి నదిలో కలిసే పెద్ద కుళ్ళు కాలవ పైపులో పడుక్కుని నిద్రపోతున్నాయి.  పొయ్యి మీద టీ, పక్కన గ్రిల్‌ మీద కవ్వా పుల్లలు నెమ్మదిగా మగ్గుతున్నాయి.
“ఏంటి వారు రైటర్సా స్వామీ?”
“అవును స్వామీ….ఉమా గారనీసి విన్నారా?”
“లేదు స్వామీ… పీజీసెంట్ర వారంటే ఎవ్విరి మంత్‌  ఫష్ట్‌  వీక్‌ లో వస్తారు స్వామీ.  వీరిని ఇదే చూట్టము….శానా తాగుతారు…స్వామి…పెద్దవారు కదా..ఏంటో బిజినస్‌  పీపుల్సో ఏంటో  అనుకున్నాము…..సర్వా సాదారనంగ టీచింగ్‌ స్టాఫ్సంటె  ఇంతలెక్కన  తాగరండి……” అని తమాయించుకున్న నవ్వు కళ్ళల్లో పెట్టుకున్నాడు. ఈ దునియాలో అన్నీ ఆ స్వామి ఆధీనమే కదా అన్నట్టు ముందరి ద్వారం మీద ఫొటోలో గొంతుకిళ్ళా కూర్చుని దీవిస్తున్న అయ్యప్పకేసి చూపించి “స్వామి శరణం..” అని భక్తిగా కళ్ళు మూసుకున్నాడు.

నరహరి “నీకేం తెలుసు లేవై?” అన్నట్టు నిర్లక్ష్యంగా పెదవి విరిచి “రైటర్సన్నాను గాని బిజినస్‌  లేదన లేదు కదా!  వారు రైటర్సే గాని చాలా యేపకాల్లెండి.  లా కాలేజిలోన లెక్చిలేరు!..చిట్టి వలస ఉమా టాకీస్‌ వీరిదే…?!” అని ఇది చాలా ఇంకా చెప్పమంటావా అన్నట్టు చూసి ఆపేడు.  అయ్యప్ప చిప్పలు కడుగుతున్న కుర్రాడ్ని “మస్తాన్‌ స్వామీ…  ఏ మస్తాన్‌  స్వామి!” అని కేకేసి, “వారు స్వామికి కవ్వా పుల్లలో ఏంటో వారి ఐటమ్స్‌  ఏంటో కనుక్కో స్వామీ…. క్లీనింగొక్క దానికయితె నువ్వెందుకూ…కష్టమర్లకీ చూసుకోవాల….” అని గద్దించేడు.  మస్తాన్‌  ఉత్సాహంగా చేతులు తుడుచుకుని రెండు కవ్వా  పుల్లలు ఎర్రగా కాలినవి తీసి ఇసకలోకెళ్ళి “సార్‌..కవ్వా పుల్లలు స్వామీ…” అని నిలబడ్డాడు.  ఉమా గారు ఆ పుల్లలు రెండూ అందుకుని వంద నోట్లు వాడి చేతికిచ్చి నరహరి కేసీ కౌంటర్లో స్వామి కేసి అరిచినట్టు ముద్దగా “జానీ వాకరు…జానీ…జానీ…” అని మోచేత్తో సంజ్ఞలు చేసేడు.   కేషియర్‌ స్వామి మస్తాన్‌  చేత బాటిల్‌ పంపించి అనుమానంగా “ఇది మూడోది స్వామీ.  మాకూ గూడా క్లోజింగ్‌ టైము……” అన్నాడు వాచీ చూసుకుని.

నరహరి లేచి ఇసకలోకెళ్ళి “అయ్యగారు!  అయ్యగారు… ఇంక చాలు ఇంక ఆపీయండి….చిలకమ్మగారు చూస్తే బేజారయిపోతారు.  ఇంకెల్దాం రండి బాబూ…” అని నచ్చ చెప్పడానికి ట్రై చేసేడు.  ఉమా గారు “నువ్వెల్రా నువ్వు….దానూసు ఇప్పుడెందుకు…” అని కసురుకున్నాడు.  నరహరి చేసేది ఏం లేక వచ్చి కూర్చున్నాడు.  కేషియర్‌ స్వామి మళ్ళీ క్యూరియస్‌గా “మరి అంత కలిగున్న వోరయితే ..ఏటి ప్రోబ్లమ్సా స్వామీ?  ఈ ఏజ్‌ లోన….ఏడున్నర కాడ్నించి తాగుతూనే వున్నారు…” అని అడిగేడు.

“ప్రోబ్లమ్స్‌ కాదు స్వామీ..ఇక్కడ ఆఫీసర్స్‌ కోలనీ లోన జ్ఞాన ప్రెకాష్‌  గారనీసి ఎరుగుదువా?  … వారింటి కాడ ఆడటోరియంలోన ఇవాళ ఆదివారం మధ్యానం కవుల మీటింగు పెట్టేరు. దన్లో పెద్దలందర సమక్షాన  మా ఉమా గారు మాట్లాడుతుంటె…..మీటింగులోన వేరే రైటర్స్‌ తోటి వారికి మాటా మాటా వొచ్చింది ..మా అయ్యగారసలే సున్నితము.  అవతలోడెవడొ “నువ్వూ ఒక్కవ్వేనా నీదీ ఒక్కవిత్వమేన” అనీసి తగులుకున్నాడు.”  ఎవలో డీయెస్సార్‌  గారంట….రేచు కుక్కలాగ పడిపోయేడు…..కవులు పెద్దలు ఆడోలు అందరు కల్సి ఎంత ఆపినా విన్నాడు కాదు.  నీ కదలు పుస్తకం అయితే ఏస్సేవు కాని నీ కదల్లోన ఇలాగ బాగోలేదు..అలాగ  బాగున్నాది  కాదు..బీదోల మీద రాయడానికి నువ్వేటి బీదోడివా?  నీ బతుకూ వొక బతుకేనా అన్నట్టుగ రూపించేడు.  మా ఉమా గారు ఉడికిపోయి ఆయనికి ఏదో అనరాని మాట అనీసి తిట్టడం తిట్టేడు.. నీనూ అక్కడే గుమ్మంల కూసోనున్నాను.  ఆల్లు పెద్దలే లంజకొడక లంబ్డి కొడకనీసి మీటింగులోన కొట్టీసు కుంతంటే డ్రైవర్ని మనమేటి చేస్తాము?…..మా అయ్యగారికి వార్ని ఏమన్న పర్వా లేదు గాని వారి పుస్తకాన్ని ఏటేన్నా అంటే ఇల విల్లాడిపోతాడు…” అన్నాడు.
“ఐతే అవతలాయను  వూరుకున్నాడా…?”
“ఆడెందుకూరుకుంటాడు?  ఇది సభా హాలయిపోనాది..బైటికి రారా నీ అంతూ చూస్తానన్నాడు…నీనే కలగ చేసుకుని ఈయన్ని బండ్లేసుకుని వొచ్చీసేను…”
కేషియర్‌ ఆశ్చర్యంగా “ఏటి స్వామీ పుస్తకము?  …మీటింగు పెట్టుకోని పుస్తకాల కెవులేనా తిడతారా…” అన్నాడు.  మస్తాన్‌  పని ఏం లేక వాళ్ళ ఎదురుగా చెక్క బెంచీ మీద కూచుని ఆసక్తిగా వింటున్నాడు.

నరహరి “అమ్మా అలాగనీకు.  నీకూ నాకూ డబ్బు దస్కమంటె ఎంత పట్టో ఆలకి పుస్తకాలంటె పేపర్లోన ఎయ్యడాలంటె అంత పట్టు….ఉండు తెస్తాను…” అని బార్‌ ముందు రోడ్డు  మీద  పార్క్‌  చేసిన  ఫియట్‌  డిక్కీ తీసి లోపల్నుండి ఒక పుస్తకాల కట్ట పైకి తీసి దుమ్ము దులిపి, ఒక పుస్తకం తీసుకుని తెచ్చి కేషియర్‌ కిచ్చి గుంభనంగా నవ్వుతూ “ఇదా… జీవన తీరాలు..ఈ పుస్తకాన్ని గాని పొగిడేవంటే…మా ఉమా గారు నీకు ప్రానాలన్నా ఇచ్చెత్తాడు…” అని అతని ఎదురుగా బెంచీ మీద ఇటో కాలూ అటో కాలూ వేసుకుని కూచున్నాడు.  కేషియర్‌  స్వామి ఆ పుస్తకాన్ని ఆసక్తిగా ఇటూ అటూ తిప్పేడు.  దానిమీద నీలి రంగు నది ఆకాశం మనిషి తొడలు  ఒక పెద్ద కన్ను వాటి చుట్టూ సాలిగూడు పడవల బొమ్మలూ ఉన్నాయి.  దాన్ని విచిత్రంగా చూసి  కూడబలుక్కుని “జీవన తీరాలు…. ఉమా కధలు…పితాన ఉమా మహెస్వర రావు, M.L. ” అని చదివేడు. అట్ట వెనకాల ఉమా గారు సూట్‌  టై  వేసుకుని  బింకంగా  నవ్వుతున్న  ఫొటో వుంది.  మస్తాన్‌  కేషియర్‌ స్వామి వెనకాలే చేరి ఆ పుస్తకంలోకి ఆసక్తిగా చూస్తున్నాడు.

“ఈ ఫొటోలో అయ్యగారికీ ఆ కుర్చీలోనయ్యగారికీ ఎంత డిఫరన్సు స్వామీ?” అని ఆశ్చర్యంగా అని  ఫొటో కింద వాక్యాలు చదువుతున్నాడు.  “ఇవి కధలు కావు.  జీవన తీరాల్లో పావన శకలాలు…..అటు న్యాయ శాశ్త్రంలో దురీ…దురీనత, అటు వానిజ్య రంగంలో పారి…పారీనత….ఇటు రచనా రంగములో అభిజ్ఞత, మూడూ ముప్పిరిగొన్న మనీషి ఈ ఉమా మహేస్వర రావు.  ముచ్చటగా మా ఉమా.  ఇతని కధలు మట్టిలోంచి వస్తాయి… చెమట లోంచీ కన్నీళ్ళ లోంచీ కలిసి వస్తాయి…అందుకే వీటి నిండా మట్టి వాసన, మట్టి జీవితాల కన్నీటి చెమట వాసన…”   కేషియర్‌ స్వామి చదవటం ఆపీసి పుస్తకం వాసన చూసేడు.   కొత్త కాగితం వాసన వేస్తోంది.  ఏమీ అనకుండ పేక దస్తా కలిపినట్టు కాగితాలు పర్రుమని తిప్పి మళ్ళీ  నరహరి చేతికి ఇచ్చీసి “స్వామి శరణమ్‌…ఇరుముడి మాలయే శరణం….” అన్నాడు, ఒక అర్ధం కాని అనుభవాన్ని పైకి చెప్పలేకుండా తనలో తానే సర్ది చెప్పుకున్నట్టు.

మస్తాన్‌  నరహరి చేతిలో పుస్తకం అట్టని మళ్ళీ చూసి “అబ్బహ్‌….అట్ట మీద బొమ్మ బలేగున్నాది సార్‌” అన్నాడు మెచ్చికోలుగా.  కేషియర్‌  వాడిలా అనవసరంగా జోక్యం చేసుకోటం ఇష్టం లేక అసహనంగా “నీకెందుకురా పెద్దవారి విషయాలు?” అని కసిరేడు.  వాడు నవ్వుతూ దాన్ని దులిపేసుకుని “స్వామి గురూ…క్లీనింగయిపోయింది గురూ…పన్నెండూ…” అని నసిగేడు.  వాడికి ఇంటికెళ్ళి అన్నం తిని  పడుక్కోవాలని ఉంది.  కేషియర్‌ స్వామి గోడ వాచీకేసి చూసి “పన్నెండయిపోయింది…..షాపు కట్టెయ్యాల స్వామీ… వారికి చెప్తార నన్ను చెప్మంటారా?” అన్నాడు.  నరహరి లేచి అతన్ని తన వెనకాలే రమ్మని చెప్పి సంజ్ఞ చేసేడు.  ఉమా గారు కుర్చీలోంచి జారిపోతూ ఇసకలోకి జోగుతున్నాడు.  కవ్వాపుల్ల ఒకటి తెల్లటి చొక్కా మీంచి పడి ఎర్రటి మరకలయ్యేయి.  నరహరి  ఆయన్ని నమ్రతగా తట్టి “రండి సార్‌ అయ్య గారు..మళ్ళీ ఇంటికెల్లే సరికి వొంటిగంటయిపోద్ది…చిలకమ్మ గారు గాబరా పడిపోతారు బాబూ..” అని బతిమాలేడు.  ఉమా గారు లేవకుండానే కళ్ళెత్తి కష్టం మీద చూసి “యితణెవళ్రా నర్రా?” అన్నాడు.
“ఇతను  ఈ బారు స్వామి…కొట్టు కట్టీయాలంట రండి సార్‌..అయ్యగారూ? ఆయ్‌గారు! రండి బాబూ..”

అలా పరిచయం అయ్యేక కేషియర్‌ స్వామి చనువుగా ముందుకొచ్చి ఒక రకంగా ఎడ్యుకేటెడ్‌గా గొంతు పెట్టుకుని “ఇదుగో జీవన తీరాలు బుక్కు సానా ట్రాఫిగ్గా వున్నాది సార్‌..శానా బాగా రాసేరు స్వామీ…” అన్నాడు.   ఉమా గారు చర్రుమని అతని చేతిలోంచి ఆ పుస్తకం లాక్కుని ” ఎవల్రా ఇమ్మెచ్యూరు?  నీ ఎదవ కేష్టు ఫీలింగు ఎదవ….నువ్వే ఇమ్మెచ్యూర్‌…నీ కధలేటి వల్ల కాడు…వరష్ట ఫెలో” అని గాల్లోకి చేతులు విసిరి కొట్టబోయి నిలదొక్కుకోలేక కుప్పకూలి ఇసకలో పడిపోయేడు.     కేషియర్‌ స్వామి అతన్ని లేవనెత్తడానికి చంకలో చెయ్యి వేసి “ఒకళ్ళంటే మనం వరష్టయిపోతామేంటి  స్వామీ.  మన వేల్యూ మంది…మన ఎడ్యుకేషన్‌  మంది….ఇంకెవల్తోటి మనకేంటి సార్‌ నూసెన్సు.. పెద్దవారు తమరికి మేము చెప్పాలా?” అన్నాడు.  నరహరి అతనూ ఇద్దరూ రెండు చంకల్లో చేతులు వేసి కష్టం మీద ఆయన్ని లేవనెత్తి బార్లోకి తీసుకొచ్చేరు.  ఈ మాటలకి ఆయన మొహంలో చిన్న సంతోషం లాగ విచ్చుకుంది.   “అదే నేనన్నాను…మధ్యాన్నం మీటింగ్‌కి నువ్వు రాలేదేమి?  పూజలో వున్నావా..?” అని కేషియర్‌  మీద చెయ్యి వెయ్యబోయి నిభాయించుకోలేక అతని చెయ్యి లాక్కుని కుర్చీలో కూలబడ్డాడు.

కేషియర్‌  వినోదంగా ముద్దులాడుతున్నట్టు “రమ్మంటే వచ్చే వాడ్నే స్వామీ.. షాపు చూసుకోవాల కదా! ఈ సుట్టు తప్పకుంట వస్తాను… స్వామీ? స్వామి! ఇంటికెల్లి రెష్టు తీసుకోండి బాబూ.. నా మాటినండి సార్‌…” అన్నాడు.  బార్లో బాగా తాగి పడిపోయే వాళ్ళని బుజ్జగించటం అతనికి సరదాగా వుంటుంది.  ఉమా గారు ఇంకా ముద్దుగా అతని గడ్డం పట్టుకుని “ఎల్లకపోతే నీ కాడే వుండిపోతాననుకున్నావా?…ఏదీ…ఒక్క కోర్టర్‌  నీనేం ఎక్కువ తాగలేదుర నర్రా!  ఓర్నర్ర… చెప్పితనికి….ఈలిద్దరికి చెప్పు మన్సంగతి…ఒక్కటి…” అని ఒకటి అంకె వేలితో చూపించి బతిమాలటం మొదలెట్టేడు.  మస్తాన్‌ గాడు అల్లరిగా అతని ఎదురుగా వచ్చి “షాపు కట్టెస్తనాం సార్‌..ఇంకెల్లకపోతే మూసెస్తారు స్వామీ…” అన్నాడు.  నరహరి కలగజేసుకుని వాడ్ని రెక్క పట్టుకుని పక్కకి లాగి “పదండి సార్‌ అయ్యగారు.  ఆళ్ళు షాపు కట్టీయాల పాపం..నా మాటినీసి కార్లోకి రాండి సార్‌..” అన్నాడు.

“నీ మాటినీ యినగానే కారెక్కిపోడానికి నువ్వేటి పద్మావతీవా?  పద్మావోతీ….మీటింగులోన నా దుక్కు చూసి నవ్వుతావే…పద్మావోతీ…ఏంటే..ఏటి మీ డిపార్టమెంటు దుక్కు నీనొచ్చేనా?  నా వూసు నీకెందుకే?…” అని బల్ల గుద్దేడు.  నరహరి ఏం చెయ్యలేక టేబిల్‌ మీద చెయ్యి ఆన్చుకుని నిలబడిపోయేడు.  కేషియర్‌  కౌంటర్‌ మీదున్న జీవన తీరాలు తెచ్చి పట్టుకుని “సార్‌ స్వామీ గారు…పన్నెండూ ఇరవయ్యి….మా వోనరు గారో యెస్సయ్‌ గారో చూసేరంటే మా వుద్యోగాలుండవు బాబూ…ఇదిగో పుస్తకము…మంచి వెరయటీగా వున్నాది..మీయంతటి వారు మీరు మిమ్మల్నెవులన్నారు స్వామీ…. సార్‌.”
“వూఁ ..?”
“పదండి కార్లోకి పదండి…”
“వూఁ ..?”
“పదండి బాబూ..మల్లొద్దురు గాని పదండి సార్‌.”
“ఎలిపోమంటావా గుడి కట్టీసేవా..?”
“గుడేటి బాబూ.. గుడి కాదు నీను దీక్షలో వున్నాను….లెగండి స్వామీ…”
“పదా…..”
ఇద్దరూ చెరో రెక్కా పట్టుకుని కారు దాకా ఈడుస్తున్నట్టు నడిపించుకెళ్ళేరు.  మస్తాన్‌ ముందెళ్ళి బేక్‌ డోర్‌ తీసి పట్టుకుని, ఉమా గారు లోపల కూర్చున్నాక డోర్‌ బలంగా వేసేడు.  నరహరి డ్రైవర్‌ సీట్లో కూర్చుని దేవుడి ఫొటోకి దండం పెట్టుకుని బండి స్టార్ట్‌ చేసి, రివర్స్‌ చేసుకుని వాళ్ళకి టాటా చెప్పినట్టు చెయ్యూపి ఫాస్ట్‌ గా వెళ్ళిపోయేడు.  మస్తాన్‌ ఉషారుగా లోపలికొచ్చి కౌంటర్‌ ఎదురుగా నిలబడి “ఏటి గురూ అంత లాగ పట్టీసేడు…” అని బొటకన వేలు నోటిమీద పెట్టుకుని గటా గటా తాగుతున్నట్టు ఏక్షన్‌ చేసి “పద్మావోతీ…పద్మావోతీ..” అని పగలబడి నవ్వేడు.  కేషియర్‌ స్వామి ఆ సీన్‌ ఎంజాయ్‌ చేస్తూనే వాడ్ని చివాట్లు పెడుతున్నట్టు “తప్పురా..నీ కెందుకురా ఒకల గొడవ?  ఆయను తాగేడు కాబట్టె నీకూ నాకూ జీతాలు… నోరు మూసుకోని తిన్నగ ఇంటికెల్లు..” అని డబ్బులు వాడి చేతిలో పెట్టేడు.  వాడు ఆ నోట్లు నిక్కర్‌ జేబులో పెట్టుకుని తాగీసి పేల్తున్నట్టు “పడ్మావోషీ…రాయే వొలే పడ్మావోషీ….” అని కేకేసుకుంటూ ఉత్తుత్తి స్కూటర్‌ “బుర్ర్‌ బుర్ర్‌ ..” అని స్టార్ట్‌ చేసి వేగం పరుగెట్టుకుంటూ సాయిబుల పేట రోడ్డు వైపు చీకట్ల్లోకి కలసి పోయేడు.  కేషియర్‌  కౌంటర్లోని విభూతి తీసి అడ్డంగా బొట్టు పెట్టుకుని దాని మధ్యలో కుంకుమ పెట్టుకుని అయ్యప్ప పటానికి నమస్కరించి బయటికొచ్చి తాళం  పెట్టి సైకిల్‌  మీద పెడల్‌ వేసి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు ఆగి తాళం తీసి లోపలికెళ్ళేడు.  జీవన తీరాలు కౌంటర్‌ మీదనే వుంది.  దాన్ని తీసి ఇటూ అటూ తిప్పి  ఘాటుగా వాసన చూసి భుజానికున్న నల్లటి ఖాళీ సంచీలో పెట్టుకున్నాడు.  బయట చలిగా వుంది.  అప్పు మీద సత్తువ కొద్దీ తొక్కుతుంటే ఖాళీ సంచీలోంచి పుస్తకం మక్కమీద టప్‌ టప్‌ మని తగుల్తోంది.
-------------------------------------------------------
రచన: కనకప్రసాద్, 
ఈమాట సౌజన్యంతో

No comments:

Post a Comment