Wednesday, August 23, 2017

కవి - కవిత


కవి - కవిత
సాహితీమిత్రులారా!


పుల్లాపంతుల రాధాకృష్ణమూర్తిగారి
కవి - కవిత పద్యంఖండిక
పద్యం ప్రకాశం లో నుండి-

వాల్మీకియను కవీశ్వరుడు లేకుండిన
         రామభూమీశుడనామకుండె
వ్యాసుడన్ కవితావిలాసుండు లేకున్న,
         శ్రీకృష్ణ లీల లెంచెడి దెవండు
నన్నయ యను కవినాథుండు లేకాంధ్ర
         భారత లబ్దికెవ్వండు నోచె
పెద్దన్నయన్న కవిలేకపోయిన
         బ్రవరాఖ్యు నియతి నెవ్వండు సూచె
కనుక సుయశోవిశాలురౌ ఘనుల చరిత్ర
లవని బ్రాచుర్యమంద గావ్యములు వ్రాసి
అక్షర విలక్షాఖ్యేయ భిక్షపెట్టు
కవులు జగతికి జ్ఞాన చక్షువులు గారె

ఒక కవి దివ్యమహోన్నత భక్తిచే
            విజ్ఞాన దీపికల్ వెలుగ జేయ
ఒక కవి శృంగార మొలికించి తలపుల
            నవనవోదయ వసంతంబు నింపు
ఒక కవి శౌర్యతరోగ్రోక్తిబరపుచు
            జాతీయ వీరవిస్తరణ నిలుపు
ఒక కవి సంస్కారనికరంబు సూచించి
            సంఘచైతన్యప్రశస్తి గొలుపు
కాలదేశావసరముల గని యెఱింగి
అలఘు కవితల లోక కల్యాణ కర్త
లగుట, నిత్యయశఃకాయులయిన ఘనులు
కవులు జగతికి జ్ఞాన చక్షువులు గారె

కవి చాతుర్యము జూప ముగ్ధలకు వేగౌ, నట్లు - భక్తాళి కే
శవసాయుజ్యము బొందు, బౌరుషమునన్ సైన్యాళి దోస్సార శా
త్రవ గర్వాపహవృత్తి నిల్చు, గరుణన్ దైవారు దైవంబు, దా
త వరాలన్ గురియించు దత్తదుచితస్థానోక్తి కాలంబులన్

ఏసారస్వతుడో, మఱే సుగుణియో, యేవాగ్మియో, యెప్పుడో
యే సందర్భమునందొ, యెచ్చటనొ "మేలింపైన దౌ" నంచు వి
ద్యాసద్యోగుల కొక్క పద్దియమొ, వాక్యార్థమ్మొ, శబ్దమ్మొ, హృ
ద్యాసక్తిన్ నుడువన్ యశోధనులుగారా! కర్తయున్, భర్తయున్

కలకలలాడు వెన్నెలలు గాసినయట్లు మృదంగరావముల్
వలికినయట్లు, మింట నవవారిదముల్ గని నీలకంఠముల్
కులుకునయట్లు, లేత చివుళుల్ దిని మత్తిలి కోకిలావళుల్
పిలిచినయట్లు, పూర్ణిమ గృపీటజు జూచిన కల్వకోరికల్
మొలచినయట్లు, భాస్కరుని ముంగిట జూచిన పద్యభావముల్
మొలచినయట్లు, విచ్చిన నవీనసుమాసవమాని భృంగముల్
గలగినయట్లు, వేణు మృదుగానముచే తలలూపి నాగముల్
నిలచినయట్లు, చీకటి వినీల నభఃస్థల నవ్యతారకల్
బొలిచినయట్లు, భావముల బోలిచి శిల్పి వినూత్నరూపముల్
మలచినయట్లు, మౌని పరమంబును జేరెడు వేళ బ్రహ్మమున్
దలచినయట్లు, పాంథునకు దప్పికబోమధుశీతలోదకం
బొలికినయట్లు, నవ్య వధువోరగ జూడ వరుండు దానలో
జెలగినయట్లు, మార్ధవము జిందెడి కోరిక లెన్ని యెన్నియో
చిలికినయట్లు, నాకడకు జేరి మదీయ మనంబు దీయపుం
దలపుల నింపు, సాగును సుధారసధార కథానిధానమై
కళయయి, శిల్పమై, మధురగానమునై బ్రతిసృష్టయై దిగం
చలముల దోచు నూత్నహరిచాపమునై కలలో విలాసమై
వెలుగగ జేయు జీవితము వేయి మనోహరకాంతులీనుచున్
నిలువగజేయు భావముల నిత్యశుభావహ దీప్తకీర్తులన్
జెలిమి యొకింత గూర్చ బుధశేఖరపాళికి "కైత" దూతియై

కావున బ్రజ్ఞావంతుడు
దీవలయములోన గీర్తి దీప్తింజెందం
గావలె నన్నన్ సత్కృతి
గావింపవలయు, లేదగైకొనవలయున్

No comments:

Post a Comment