Friday, October 14, 2016

విషవల్లి సముద్భవముల్ ప్రసూనముల్


విషవల్లి సముద్భవముల్ ప్రసూనముల్


సాహితీమిత్రులారా!



ఈ పద్యం చూడండి శ్రీనాథుని శృంగారనైషధంలో
నలుడు హంసతో తన విరహవేదన తెలిపెడి సందర్భములోనిది.

మోహము దాహమున్మదికి మూఁడ్సుచు నున్నవి, పాయ దెప్డు సం
దేహము, మీనకేతనుని దివ్యశరంబులు పువ్వుమొగ్గలో
యూహ యొనర్పఁగా బిడుగు లో కులిశంబులో యట్ల భారతీ
వాహకులావతంస, విషవల్లి సముద్భవముల్ ప్రసూనముల్
                                                         (శృంగారనైషధము - 2- 34)

ఓ సరస్వతి వాహనమైన హంస కులమునకు శేఖరమైనవాడా!

మన్మథుని అద్భుతమైన బాణాలు
నామసునకు మూర్ఛను తాపాన్ని కలిగిస్తున్నాయి.
నాకు ఒక అనుమానం వదలకుండా ఉంది
మన్మథుడు వేసేవి పవ్వులా అని ఆలోచించి చూస్తే
అవి పువ్వులు కావని అవి పిడుగులో, వజ్రాయుధములో
అనిపిస్తున్నాయి. అవి అయిన మోహదాహాలనుకలిగించేవేకాదు
వెంటనే మరణంకూడ కలిగేది అలా జరగడంలేదు కావున
అవికావు ఆ...ఆ ...తెలిసింది
వెంటనే మరణం కలిగించక మోహదాహములను
చేయడమనేది విష లతలనుండి
పుట్టిన పువ్వులపనై వుండాలి-

ఏది ఎవరికి యౌవనం?


ఏది ఎవరికి యౌవనం?


సాహితీమిత్రులారా!




ఇక్కడ యౌవనం అంటే యుక్తవయస్సు రాగానే
వచ్చేది అని అనుకోకూడదు.
యౌవనం అంటే శోభను కూర్చేది
బలాన్నిచ్చేది గౌరవంకలిగించేది
మరి ఎవరెవరికి అంటే
ఈ శ్లోకం చూడాల్సిందే-

వసంత యౌనా వృక్షా:
పురుషా ధనయౌవ్వనా:
సౌభాగ్య యౌవనానార్యో
యువానో విద్యయా బుధా:

ఋతువులు అన్నిటిలో వసంత
ఋతువు చెట్లకు యౌవనకాలం.
పురుషులకు యవ్వనాన్నిచ్చేది
వయసుకాదు మరేదంటే ధనం, సంపద.
మరి స్త్రీలకు యవ్వనాన్నిచ్చేది సౌభాగ్యం.
అది పోతే యవ్వనం పోయినట్లే.
మరి పండితులకు వారి పాండిత్యం-
విద్యాసముపార్జన - ఇవి యవ్వన కారకాలని
ఈ నీతిశాస్త్రశ్లోకం చెబుతున్నది.

Thursday, October 13, 2016

అమృతంతో సమానమైనవి ఏవి?


అమృతంతో సమానమైనవి ఏవి?


సాహితీమిత్రులారా!




దేవతలు అమృతం త్రాగుతారని అంటారుకాని
మనం ఎవరం చూడలేదుకదా,  కాదు చూడలేంకదా
కాని ఈ లోకంలో అమృతంతో సమానమైనవి కొన్న ఉన్నాయి.
అవేమిటో ఈ నీతిశాస్త్ర శ్లోకం చెబుతుంది చూడండి.

అమృతం సద్గుణా భార్యా
అమృతం బాలభాషితమ్
అమృతం రాజ సన్మానమ్
అమృతం మాన భోజనమ్

గుణవంతురాలైన భార్య,
పసిపిల్ల ముద్దుపలుకులు,
అధికారంలో ఉన్న లేదా ప్రభుసమానులైన
వారు చేసే సన్మానాలు,
ఆత్మీయంగా ఎవరుపెట్టినదైనా భోజనం -
అనే ఈ నాలుగు అమృతతుల్యములు
- అని భావం.

జామాతా దశయో గ్రహ:


జామాతా దశమో గ్రహ:

సాహితీమిత్రులారా!


మనకు గ్రహాలు తొమ్మదని తెలుసు.
పదోగ్రహంకూడా ఉందట దానిపేరే అల్లుడు.
దాని ప్రత్యేకతను చెప్పడి శ్లోకం చూడండి-


సదా వక్ర స్సదాక్రూర: సదా పూజా మపేక్షతే
కన్యారాశి స్థితో నిత్యం జామాతా దశమో గ్రహ:


నవగ్రహాలకు ఈ గ్రహానికి తేడాలున్నాయి.
ఆ గ్రహాలు ఎప్పడో ఒకసారి వక్రీకరిస్తాయి.
సూర్యచంద్రులకు అసలు వక్రగతిలేదు.
రాహుకేతువులు ఎప్పుడూ వక్రంగానే చరిస్తాయి.
మిగిలిన గ్రహాలు అప్పుడప్పుడు వక్రిస్తాయి.
కాని జామాత(అల్లుడు) ఎప్పుడూ వక్రంగా ఉంటాడు.
శని మొదలైన వారు కొన్ని సమయాల్లోనే క్రూరులు,
కొన్నిసార్లు శుభులుగా ఉంటారు. కాని అల్లుడు
ఎల్లపుడూ క్రూరుడే. నవగ్రహాలు నియమిత కాలంలోనే
పూజను జరుపుతారు.కాని  జామాత ఎప్పుడూ పూజ కోరతాడు.
ఇతరగ్రహాలు రాశులుమారుతుంటాయి. కాని జామాత ఎప్పుడూ
కన్యారాశిలోనే ఉంటాడు.
అందువల్ల ఈ దశమగ్రహం మిగిలినవాటికంటె
విలక్షణమైనది - అని భావం.


Wednesday, October 12, 2016

కుచేలు కరుణన్ ధాత్ముగా జూడడే!


కుచేలు కరుణన్ ధానాత్ముగా జూడడే!



సాహితీమిత్రులారా!




సంకుసాల నరసింహకవి
ఈ పద్యం చూడండి-

జ్ఞాన ప్రౌఢమహాకవీశ్వరవచ స్సంస్తూయమానుండు, ల
క్ష్మీనాథుండు మదల్పవాక్యరచనా స్వీకర్రగా కుండునే
నానా భూపతులెల్లగానుకలు రత్నశ్రేణులర్పింపగా
దానాముష్టిముచుం గుచేలు గరుణన్ ధనాత్ముగా జూడడే


లక్ష్మీపతి ఆ శ్రీమన్నారాయణుడు గొప్ప జ్ఞానవంతులైన
ప్రౌఢకవుల కవిత్వం చేత పొగడబడతాడు. అయినా
నా ఈ అల్పమాన కవితా రచనను స్వీకరించకుండా ఉంటాడా
శ్రీకృష్ణునికి ఎందరో రాజులు రత్నరాశులు కానుకలుగా అర్పించినా,
పిడికెడు అటుకులతో తన దగ్గరకి వచ్చిన కుచేలుని ఆదరించలేదా!
- అని భావం

ఎడమ చెవి నిదె యిచ్చెద ఎగ్గునెంచ


ఎడమ చెవి నిదె యిచ్చెద ఎగ్గునెంచ



సాహితీమిత్రులారా!


వేదాలి బాగా చదువుకున్న ఒక నైష్ఠిక బ్రాహ్మణుడు
వయసులో ఉన్న తన భార్య ప్రేమతో దగ్గరికి వచ్చి
పెదాలపై ముద్దు పెట్టబోగా అతడు
అప్పుడు అన్నాడట చూడండి
ఆ పద్యం-

అఖిల వేదాధ్యయన శుద్ధమైన నా య
ధరమునకు నంటు దోసంబు తగుల నీకు
కొరుకు నీ కిచ్చ గలదేని కులుకులాడి
ఎడమ చెవి నిదె యిచ్చెద ఎగ్గునెంచ

ఓ విలాసవతీ నా పెదవి వేదమంత్రాలను
వల్లించటంచేత పవిత్రమైనది. అటువంటి
దాన్ని నీ మద్జుతో ఎంగిలి చేసి అపవిత్రం చేయద్దు.
నీకు అంతగా ముద్దు పెట్టుకోవాలను కుంటే
నా ఎడమ చెవిని మద్దు పెట్టుకో నేను అభ్యంతరం చెప్పను -
అని అనుమతిచ్చాడు అదీ ఎడమచెవికే.

వేదం చదివిన వారంతా ఛాందసులని
వారి మనసులో రసికత్వం ఉండదని
లోకంలో ప్రచారం ఉంది దాన్ననుసరించి
ఈ పద్యం పుట్టింది. కాని వైదికులంతా అలా ఉండరు.

Tuesday, October 11, 2016

ఎటువంటి వాని ధీరుడంటారు?


ఎటువంటి వాని ధీరుడంటారు?


సాహితీమిత్రులారా!



ధీరుడు అంటే బాగా బలమున్నవాడా,
లేక దేన్నయినా ఎదుర్కొనగలిగేవాడా,
ఎవరిని ధీరుడు అంటారు అంటే
గీతలోని అంటే భగవద్గీతలోని
ఈ శ్లోకం చూడాల్సిందే.

సమదు:ఖసుఖ: స్వస్థ: సమలోష్టాశ్మకాంచన:
తుల్య ప్రియాప్రియో ధీర: తుల్య నిందాత్మసంస్తుతి:
                                                                  (భగవద్గీత - 14-24)

సుఖాన్ని దు:ఖాన్ని సమానంగా భావించి, ఆత్మస్థుగా ఉంటూ
మట్టి పెళ్ళనైనా రాతినైనా బంగారాన్నైనా ఒకటిగా చూస్తూ,
ఇష్టం అయిష్టాలను, నిందను ఆత్మస్తుతులను సమానంగా ఎవడు తీసుకుంటాడో వాడే ధీరుడు. మిగిలినవారు కాదు.