Monday, December 26, 2022

మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి ప్రవచనాల విశిష్టత ఏమిటి?

 మల్లాది చంద్రశేఖర శాస్త్రిగారి ప్రవచనాల విశిష్టత ఏమిటి?




సాహితీమిత్రులారా!

ప్రథమం ఆవలింతంచ - ద్వితీయం కళ్లు ముయ్యడం - తృతీయం త్రుళ్ళిపడటం - చతుర్థం చెంపదెబ్బచ - పంచమం పారిపోవడం - ఇదీ ఒకప్పటి పురాణ ప్రవచన లక్షణమట. అంటే.. ప్రవచనకారుడు రాగాలు తీసుకుంటూ తన మానాన తాను పురాణం చెప్పుకుపోతుంటే.. ఆ పురాణం వినడానికి వచ్చిన వారు ముందు ఆవలింతలు తీస్తుంటారట. అటుపై మెల్లిగా నిద్రలోకి జారుకుంటూ కళ్ళు మూసుకుంటారట. ఇంతలో చిన్న శబ్దం వినిపించినా త్రుళ్ళిపడి లేస్తారట. ఆపై చెంప మీద వాలిన దోమను ఠపీ మని కొట్టుకుంటారట. ఇక చివరిగా ఇక్కడ కూర్చోవడం మా వల్ల కాదు బాబోయ్ అనుకుంటూ పారిపోతారట. ఈ మాటలు ఒకప్పటి ప్రవచనాల తీరుపై ఎవరో సంధించిన వ్యంగ్యాస్త్రం. అందుకే పురాణంలాగే పురాణ ప్రవచనకారులకు కూడా పంచలక్షణాలుండాలేమో అనిపిస్తుంటుంది. అవి..

ఒకటి.. రామాయణ భారత పురాణాదుల మీద, వేదవేదాంగాల మీద, సంపూర్ణమైన సాధికారత కలిగినవారై ఉండాలి.

రెండు.. పురాణసాహిత్యంలో పైకి అసంబద్ధంగా కనిపించే కొన్ని విషయాల అసలు రహస్యాలను ప్రామాణికంగా విశదీకరించగలిగిన ప్రజ్ఞాశాలురై ఉండాలి.

మూడు.. లయబద్ధంగా సాగిపోయే శ్రావ్యమైన కంఠస్వరం ఉండుండాలి.

నాలుగు.. సందర్భోచితమైన హాస్యచతురత కలిగినవారై ఉండాలి.

అయిదు.. అన్నిటికన్నా ముఖ్యంగా ఉపాసనాబలం కలవారై ఉండాలి.

ఇవీ ఆ అయిదు లక్షణాలు. వాల్మీకిమహర్షి నారదమహర్షిని పదహారు మహోన్నత లక్షణాలు కలిగిన నరుడు ఎక్కడ ఉన్నాడో చెప్పమని అడిగినప్పుడు, ఆ దేవర్షి.. అటువంటి వాడు ఉండటం దుర్లభమే కానీ.. ఒకే ఒక్కడు మాత్రం ఉన్నాడన్నాడు. అతడే మర్యాదాపురుషోత్తముడైన శ్రీరాముడు. అలానే మనం పైన చెప్పుకున్న అయిదు లక్షణాలూ కలిగిన ప్రవచనకర్త ఉండటం దుర్లభమే కానీ.. అటువంటి వారూ ఒక్కరున్నారు. ఆయనే పౌరాణిక సార్వభౌమునిగా పేరెన్నికగన్న మల్లాది చన్ద్రశేఖర శాస్త్రి గారు. వారి ప్రవచనాల విశిష్టతను మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం.

Rajan PTSK గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment