Friday, September 2, 2022

మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ

 మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ





సాహితీమిత్రులారా!

మదురై నగరాన్ని మంటలలో ముంచెత్తిన కణ్ణగి కథ! మొదటి భాగం!

సిలప్పదికారమ్ అనే రచన తమిళ పంచకావ్యాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. దీనిని ఇళంగో అడిగళ్ అనే రాచకవి రచించాడు. ఇతడు జైనుడు. సిలంబు అంటే మంజీరం. అంటే కాలికి పెట్టుకునే అందె అన్నమాట. అదికారమ్ అంటే ప్రభావం. కనుక సిలప్పదికారమ్ అంటే మంజీర మహిమ అని అర్థం చెప్పుకోవచ్చు. 

పూర్వం దక్షిణ భారతదేశంలో తమిళప్రాంతాన మూడు మహా సామ్రాజ్యాలుండేవి. అవి చోళ, పాండ్య, చేర సామ్రాజ్యములు. అందులో ధనధాన్యాలతో తులతూగే చోళ సామ్రాజ్యాన్ని కావేరీ పట్టణం రాజధానిగా చేసుకొని కరికాలచోళుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. కావేరీ పట్టణానికి పుహార్ అనే మరో పేరు కూడా ఉంది. ఆ నగరం వాణిజ్యానికి కూడా ఎంతో ప్రసిద్ధి చెందిది. ఆ పట్టణంలో మహానాయకుడనే ఒక వైశ్యుడు ఉండేవాడు. అతను మహాధనికుడు, ధర్మాత్ముడు కూడా. అతనికి ఒక్కతే కూతురు, పేరు కణ్ణగి. మహాసౌందర్యవతి. అంతకుమించి సౌశీల్యవతి కూడా. కణ్ణగికి పదమూడవ సంవత్సరం రాగానే, ఆమెకు తగిన వరునికోసం వెదకటం మొదలుపెట్టాడు మహానాయకుడు. 

ఆ నగరంలోనే మహాసత్త్వుడనే మరో వైశ్యప్రముఖుడు ఉండేవాడు. అతడు గొప్ప ఐశ్యర్యవంతుడుగా, మహాదాతగా కీర్తి గడించాడు. అతగాడు చోళరాజైన కరికాలచోళునకు అత్యంత ఆప్తుడు కూడా. ఆ మహాసత్త్వునకు కోవలుడనే ఒక కొడుకున్నాడు. ఆ కోవలుడు విద్యాధికుడు, సంస్కారి. సంగీతసాహిత్యాలలో దిట్ట. అతను పదహారేళ్ళ ప్రాయంవాడు కాగానే అతని తండ్రి అతనికి మంచి సంబంధాల కోసం వెతకసాగాడు. ఆ విషయం తెలుసుకున్న మహానాయకుడు మహాసత్త్వుని కలసి, కోవలుడిని తన అల్లుడిగా చేసుకోవాలన్న కోరికను వెల్లడించాడు. అందుకు మహాసత్త్వుడు కూడా ఎంతో ఆనందంగా అంగీకరించాడు. అటుపై ఒక శుభముహూర్తంలో కణ్ణగీ, కోవలుల వివాహం మహావైభవంగా జరిగింది. 

ఆ తరువాత కొంతకాలానికి కణ్ణగి అత్తవారింటికి కాపురానికి వచ్చింది. మహాసత్త్వుడు తన కొడుకు కోడలు ఏకాంతంగా గడపడానికని ఒక దివ్యమైన భవనాన్ని కట్టించి, దాసదాసీజనాన్ని ఏర్పాటు చేశాడు. ఆ నూతన దంపతులు క్షణకాలం పాటూ కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా, ఎంతో అన్యోన్యంగా కాలం గడపసాగారు. కణ్ణగి తన భర్తను అన్ని విధాలా సంతోషపెడుతూనే, దానధర్మాది కార్యక్రమాలు కూడా నిరాఘాటంగా చేస్తుండేది. వ్యాపారదక్షత కలిగిన కోవలుడు తమ వ్యాపారాన్ని సమర్థతతో నిర్వహిస్తూ సంపదను ఇబ్బడిముబ్బడిగా పెంచసాగాడు. ఇలా చూడముచ్చటైన ఆ జంటను చూసి బంధుమిత్రులంతా ఎంతో మురిసిపోతుండేవారు. 

అలా కొంతకాలం గడిచింది. ఇదిలా ఉండగా ఒకనాడు కరికాలచోళుని ఆస్థానంలో మాధవి అనే నర్తకి నాట్యప్రదర్శన ఇచ్చింది. ఆమె నాట్యానికి అబ్బురపడిన ఆ చోళ చక్రవర్తి ఆమెకు పచ్చలహారాన్ని బహుమతిగా ఇచ్చాడు. సాధారణంగా రాజసభలో జరిగే నాట్యప్రదర్శనలకు నగరంలోని ప్రముఖులు వెళ్ళడం సర్వసాధారణం. అలా ఆనాటి ప్రదర్శనకు కోవలుడు కూడా వెళ్ళాడు. మాధవిని చూడగానే అతని హృదయం నిండా ఆమె ప్రతిబింబమే నిండిపోయింది. మాధవికి కూడా మొదటి చూపులోనే కోవలునిపై ప్రేమ కలిగింది.

 మిగిలిన కథ వీడియోలో వినండి...........


 Rajan PTSK గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment